Latest News
 • హిందూ సముద్ర జలాలకు సమీపంలోరెండు నెలలుగా చైనా యుద్ధనౌకలు, జలాంతర్గామిలు సంచరిస్తున్నట్టు భారత నావికాదళం పసిగట్టిన నేపధ్యం లోఈనెల 10 నుంచి  భారత్-అమెరికా-జపాన్ దేశాల ఉమ్మడి సైనిక విన్యాసాలు జరుగనున్నాయి. ఈ త్రిముఖ విన్యాసాల్లో సుమారు 15 యుద్ధనౌకలు, రెండు సబ్‌మెరైన్లు, లెక్కకు మిక్కిలిగా ఫైటర్ జెట్‌లు, నిఘా విమానాలు, హెలికాప్టర్లు పాలుపంచుకోనున్నాయి. 44,570 టన్నుల బరువైన అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్య తన సత్తా చాటుకోనుంది. మిగ్-29కేలూ విన్యాసాల్లో పాల్గొంటాయి. అమెరికా నుంచి లక్ష టన్నుల బరువైన, ప్రపంచంలోని అగ్రశేణి యుద్ధనౌకల్లో ఒకటైన యూఎస్ఎస్ నిమిట్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. జపాన్ 27,000 టన్నుల హెలికాప్టర్ కేరియర్ ఐజుమో, ఇతర యుద్ధనౌకలను విన్యాసాల్లో దింపుతోంది. ప్రపంచంలోనే కీలకమైన ఈ మూడు దేశాల సైనిక విన్యాసాలతో  'కయ్యానికి కాలుదువ్వుతున్న' ఇరుగుపొరుగు దేశాలకు గుండె జల్లు మనడం ఖాయం అంటున్నారు.   ఇదిలా ఉంటే ఇండో-చైనా సరిహద్దు వెంట చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. ఆ దేశ ఆర్మీకి చెందిన యుద్ధ హెలికాప్టర్లు అనుమతి లేకుండా తరుచూ భారత గగనతలంలోకి చొచ్చుకొస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని సరిహద్దు వెంట చైనా ఆర్మీ ఇటీవల  రెండుసార్లు నిబంధనలు ఉల్లంఘించడం ఆందోళన కలిగిస్తున్నది. చమోలీ జిల్లాలోని బారాహోతి ప్రాంతంలో నాలుగురోజుల క్రితం ఓ చైనా యుద్ధ హెలికాప్టర్ చక్కర్లు కొట్టిందని భారత వైమానిక దళ(ఐఏఎఫ్) అధికారులు అధికారులు గుర్తించారు .  ఇవి చైనా ఆర్మీకి చెందిన జిబా సిరీస్ హెలికాప్టర్లు అని అంటున్నారు.  వీటిలో నిఘా కెమెరాలు ఉంటాయని, సరిహద్దులో భారత రక్షణ ఏర్పాట్లను చిత్రీకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఇటీవల చైనా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో చైనాతోపాటు, టిబెట్ వెంట ఉన్న 350 కిలోమీటర్ల సరిహద్దు భద్రతను భారత్ సమీక్షిస్తున్నది. ఈ నేపథ్యంలో చైనా హెలికాప్టర్లు తరుచూ భారత గగనతలంలోకి చొచ్చుకు రావడం ఆందోళన కలిగిస్తున్నది. చైనా ఆర్మీ ఇలా నిబంధనలు ఉల్లంఘించడం గత మూడు నెలల్లో ఇది నాలుగోసారని ఐఏఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. ...
 • రాష్ట్ర పతి ఎన్నిక రసకందాయంలో పడింది . ఏకాభిప్రాయ సాధన మృగ్యమై ఎవరికి వారే యమునాతీరే అన్న రీతిలో ఎన్డీయే, విపక్ష కూటమి తమ తమ రాష్ట్రపతి అభ్యర్థులను బరిలోకి దించడంతో ఈసారి కూడా దేశ అత్యున్నత పదవికి పోటీ అనివార్యమైంది. ఎవరూ ఊహించని విధంగా దళిత అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను బరిలోకి దించడం ద్వారా ఎన్డీయే.. విపక్షాలకు గట్టి సవాలే విసిరింది. దీంతో ఎన్డీయేపై దళిత కార్డునే ఉపయోగించి మీరాకుమార్‌ను కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విపక్ష కూటమి బరిలోకి దింపింది.  ఈ ఇద్దరూ దళిత నేతలే కాకుండా వృత్తిరీత్యా కూడా లాయర్లు. ఇద్దరూ 1945లోనే పుట్టారు. ఈ సారూప్యాల మాటెలా ఉన్నా ప్రస్తుతానికి మాత్రం ఓట్ల శాతం, గెలుపు విషయంలో మీరాకుమార్ కంటే రామ్‌నాథ్ కోవింద్‌కే మెరుగైన ఆవకాశాలు ఉన్నాయి. జూలై 17న ఎన్నిక జరగనుంది. 2017 జులై 24న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం ముగుస్తుంది గనక ఆలోగా మరొకరిని ఎన్నుకోవలసి వుంది. ప్రణబ్‌ స్థానంలో ఎవరు ఎన్నికవుతారు? అనే అంశం పై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.  ఇక గతంలోకి వెళ్లి చూస్తే రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఏకాభి ప్రాయం ఎపుడూ కుదరలేదు.  కాంగ్రెస్‌ హయాంలో ఆ పార్టీ అధినేతలు కోరుకున్న వారే రాష్ట్రపతులు అయ్యేవారు. 1969లో రాష్ట్రపతి జాకీర్‌ హుస్సేన్‌ మరణంతో ఉపరాష్ట్రపతి వివిగిరి తాత్కాలికంగా ఆ పదవి చేపట్టారు. అప్పుడే కొత్త...  పాత కాంగ్రెస్‌ల రాజకీయ ఘర్షణ మొదలైంది. నాటి ప్రధాని ఇందిరాగాంధీని వ్యతిరేకించే పాతకాపులంతా కలసి నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతిగా నిర్ణయించారు.ఆయనకు వ్యతిరేకంగా వామపక్షాలు మరికొన్ని పార్టీల మద్దతుతో వివిగిరి పోటీ చేశారు.  ఇందిరాగాంధీ అండదండలు వుండటంతో నీలంను ఓడించి గిరి విజయం సాధించారు. కాంగ్రెస్‌ రెండు ముక్కలు కావడానికి ఆ ఎన్నిక దారి తీసింది. అప్పట్లో ప్రగతిశీల నినాదాలతో మురిపించిన ఇందిర 1974 రాష్ట్రపతి ఎన్నిక నాటికి  ఫకృద్దీన్‌ అలీ అహ్మద్‌ను ఎంపిక చేస్తే వామపక్షాలు ఆయనపై ఆర్‌ఎస్‌పి నేత త్రిదిబ్‌ చౌదరిని నిలబెట్టాయి.  ఫకృద్దీన్‌ విజయం సాధించి కుర్చీ ఎక్కాక  ఏడాదిలోనే వచ్చిన ఎమర్జన్సీకి ఆమోద ముద్ర వేశారనే విమర్శలు వచ్చాయి. 1977లో  ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ హఠాన్మరణంతో ఎన్నిక అనివార్యమైంది. 37 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అనూహ్యంగా, వాటిలో 36 తిరస్కరణకు గురయ్యాయి. దాంతో, ఊహించని విధంగా నీలం సంజీవ రెడ్డి రాష్ట్రపతి అయ్యారు. ఇందిరాగాంధీ 1980లో తిరిగి గెలిచాక రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు సంజీవరెడ్డి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇందిర 1982లో మరోసారి తనకు వీర విధేయుడైన జ్ఞానీ జైల్‌సింగ్‌ను ఎంపిక చేస్తే 'ఆమె ఆజ్ఞాపిస్తే పార్లమెంటును చీపురుతో వూడ్చడానికి కూడా సిద్ధమే'నని ప్రకటించారు.. ఆయనపై ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ ఆర్‌ ఖన్నాను నిలబెట్టాయి. పంజాబ్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన జైల్‌ సింగ్‌ అక్కడ ముఠా తగాదాలతో సిక్కు ఉగ్రవాదానికి పరోక్ష తోడ్పాటు నిచ్చారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.  జైల్‌సింగ్‌ అనంతరం ఆర్‌ వెంకట్రామన్‌ను రాజీవ్‌గాంధీ ఎంపిక చేశారు.1989 ఎన్నికల తర్వాత ముగ్గురు ప్రధానమంత్రులు విపిసింగ్‌, చంద్రశేఖర్‌, పివి నరసింహారావుతో ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తి వెంకట్రామన్ . 1992లో పివి హయాంలో రాష్ట్రపతి ఎన్నిక వచ్చినపుడు శంకర్‌ దయాళ్‌ శర్మ అయితే బావుంటుందని అత్యధికులు భావించారు. బిజెపి టిడిపిలు గిల్బర్ట్‌ స్వెల్‌ ను పోటీ పెట్టినా వామపక్షాలు శర్మకు మద్దతునిచ్చి గెలిపించాయి. అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం విషయంలో పివి ఉదాసీనంగా వుంటే తానే ముందు ఖండించి ప్రధానిని పిలిపించి శర్మ కొత్త చరిత్ర సృష్టించారు. శర్మ హయాంలోనూ వాజ్‌పేయి, దేవగౌడ, ఐకె గుజ్రాల్‌ మళ్లీ వాజ్‌పేయి ఇలా నాలుగు సార్లు ప్రధాని ప్రమాణ స్వీకారాలు జరిగాయి. ఆయన 1996లో మెజార్టీ లేకున్నా వాజ్‌పేయికి అవకాశం ఇవ్వడం విమర్శకు గురైనా 13 రోజుల్లోనే దిగిపోయారు. అనుకున్న ప్రకారమే తర్వాత నారాయణన్‌ను ఒక్క శివసేన తప్ప అన్ని పార్టీలు ఏకగ్రీవంగా బలపర్చాయి. 95 శాతం ఓట్లతో నారాయణన్‌ ఎన్నికయ్యారు.   వాజ్‌పేయి హయం లో అయన వ్యూహాత్మకంగా క్షిపణి శాస్త్రజ్ఞుడైన అబ్దుల్‌ కలాం పేరును తీసుకొచ్చినప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా బలపర్చింది. కాని వామపక్షాలు, కొన్ని ఇతర పార్టీలు నేతాజీ సైన్యంలో పని చేసిన కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌ను పోటీకి నిలిపాయి.  కలాం తర్వాత మహిళను ఏకగ్రీవంగా ఎంపిక చేయాలని అది వరకు కుదిరి న అవగాహనను కొనసాగించి ప్రతిభా పాటిల్‌ పేరు ప్రతిపాదించారు. అయితే బిజెపి కూటమి తమ పార్టీ మాజీ ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి బైరాన్‌ సింగ్‌ షెకావత్‌ను పోటీకి పెట్టింది. వ్యక్తిగతంగా ప్రతిభా పాటిల్‌ పని తీరు ఆశించిన రీతిలో లేదని విమర్శకు గురైనారు.  ఆమె తర్వాత యుపిఎ హయాంలో 2007లో ప్రణబ్‌ ముఖర్జీ ఎన్నికైనారు. బిజెపి కూటమి ఆయనపై పిఎ సంగ్మాను పోటీ పెట్టినా 70 శాతం ఓట్లతో గెలుపొందారు. ఆయన హయాంలోనే మోడీ అధికారంలోకి వచ్చినా సంబంధాలు కొనసాగించారు. భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి, విశ్వ విద్యాలయాల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి విషయాలు ఆయన మాట్లాడితే పాలక పార్టీకి నచ్చలేదు.  ఇక ఇప్పటి ఎన్నికలో  మీరాకుమార్ కంటే రామ్‌నాథ్ కోవింద్‌కే మెరుగైన ఆవకాశాలు ఉన్నాయి. ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని మీరాకుమార్  విజ్ఞప్తి చేసినప్పటికీ క్రాస్ వోటింగ్ జరిగే అవకాశాలు తక్కువే.  బీజేపీ బలపరిచిన కోవింద్‌కు, ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలతో పాటు, జేడీయూ, బీజేపీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ వంటి చిన్న పార్టీల బలం ఉంది. ఈ పార్టీల బలం అంతా కలిస్తే ఓటింగ్ పరంగా 60 శాతానికి పైనే. అంటే కోవింద్ గెలుపునకు అవసరమైన కనీస ఓట్ల శాతం కంటే ఎక్కువే. ఇక మీరాకుమర్‌ వెంట కాంగ్రెస్, బీఎస్‌పీ, ఎస్పీ వంటి 17 పెద్దా చిన్నా పార్టీలున్నాయి. ఇవన్నీ కలిస్తే ఓటింగ్ బలం 40 శాతం వరకూ ఉంటుంది. ఈ శాతాల లెక్కల ప్రకారం చూస్తే మీరాకుమార్ ఓటమి తప్పదు. అయితే పరిస్థితి తిరగబడితే?రెండు వారాల గడువు ఎలాగూ ఉంది. రాజకీయాల పార్టీలు చెప్పేదొకటి, చేసేదొకటిగా వ్యవహరించడం షరామామూలే. కోవింద్‌కు సపోర్ట్ చేస్తామని ప్రకటించిన ఎన్డీయేతర పార్టీలు తమ ఆలోచన మార్చుకుంటే జూలై 17 ఎన్నికల్లో మీరాకుమార్ జాతకం మారిపోవచ్చు. ఇలాగే జరగాలని లేకున్నా...రాజకీయాల్లో ఏదైనా సంభవం అనే విషయాన్ని కొట్టిపారేయలేం. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ 13 మంది రాష్ట్రపతులుగా పని చేశారు.   14 వ రాష్ట్రపతి ఎవరో  వేచి చూద్దాం . ...
 • అధికారంలో ఉన్నప్పుడు ఒక రీతిలో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో రీతిలో వ్యవహరించడంలో బీజేపీ కానీ, మోడీ  కానీ మిగిలిన పార్టీలకు ఏ మాత్రం తీసిపోరనేందుకు జీఎస్టీ ప్రత్యక్ష నిదర్శనం! వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు 2000లో జీఎస్టీకి నాంది జరిగింది. మళ్లీ బీజేపీ ప్రభుత్వంలో మోదీ హయాంలో ఇది అమల్లోకి వచ్చింది. అయితే జీఎస్టీకి నాంది పలికిన బీజేపీనే ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడం, ఇప్పుడు ఎంతో శ్రమించి, రాష్ట్రాలను ఒప్పించిన మోడీ  గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీ బిల్లుకు ససేమిరా అనడం విచిత్రం. 2011లో ప్రణబ్‌ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీ కోసం రాజ్యాంగ సవరణ చేపట్టారు. జీఎస్టీ రాష్ట్రాల హక్కుల్ని హరించేదిగా ఉన్నదంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ దానిని వ్యతిరేకించింది. ఇక దేశంలో పరోక్ష పన్నుల విధానంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనున్న వస్తు, సేవల పన్ను అమలులోకి రావడానికి 17 ఏళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. రాజీవ్‌ గాంధీ నుంచి నరేంద్ర మోదీ వరకు పలువురు ప్రధానులు జీఎస్టీ రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. దేశం గర్వించదగిన ఆర్థికవేత్త అసిమ్‌దాస్‌ గుప్తా మొదలు కె.ఎం.మణి, అమిత్‌ మిత్రాల చేతిలో జీఎస్టీ పదునుదేలింది. దేశమంతా ఒకే పన్ను ఉండాలనే ఆలోచనకు 1986-87లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ హయాంలో ఆర్థిక మంత్రి వి.పి.సింగ్‌ కార్యరూపం ఇచ్చారు. ...
 • సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ కి ముహూర్తం ఖరారైనట్టే . జూలై లోరజనీ తన కొత్తపార్టీని అధికారికంగా ప్రకటిస్తారని  ఆయన సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ వెల్లడించారు.  ‘‘రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తాను రాజకీయాల్లోకి రావడంపై అభిప్రాయం తెలుసుకునేందుకే అభిమానులు, శ్రేయోభిలాషులతో రజనీ సమావేశమయ్యారు. ఇప్పటికే తొలిరౌండ్ పూర్తయింది. జూన్ లో మరోవిడత సమావేశాలు జరిగే అవకాశం ఉందని  గైక్వాడ్ చెప్పారు.  రజనీ తన రాజకీయ ప్రవేశంపై అధికారికంగా ప్రకటన చేయక పోయినప్పటికీ.. ఇప్పటికే తమిళరాజకీయాల్లో రజనీ పొలిటికల్ ఎంట్రీ విషయం ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడులో మంచి రాజకీయ నేతలు ఉన్నప్పటికీ వ్యవస్థ మాత్రం కుళ్లిపోయిందని  రజనీ  ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వ్యవస్థను బాగుచేయాల్సిన సమయం ఆసన్నమైందనీ.. అందుకు ప్రజలంతా ‘‘యుద్ధానికి’’ సిద్ధంగా ఉండాలని ఆయన ప్రకటించి తెర వెనక్కి వెళ్లారు.  కొత్త సినిమా ‘కాలా కరికాలన్’  షూటింగ్ శరవేగం తో ముగించుకుని అయన మళ్ళీ తెర ముందుకు వస్తారు. అయితే పార్టీ పనులు మాత్రం సన్నిహితులు అత్యంత గోప్యంగా చేస్తున్నారట . ...
 •  (Siva Racharla) ........       మనిషిలో లోతుగా కూరుకు పోయిన ధర్మం ఒక్కటే "అహం".ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి.తపించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే "ఆశ".ఆశ ముసిరినప్పుడు "ఆలోచన" మసక బారుతుంది.నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తుల్లా కాలిపోతాయి -- ప్రస్తానం సినిమాలో సాయికుమార్ శర్వానందుతో చెప్పే confession statement. శవాల పుట్టుమచ్చలు చూసి హతుడిని గుర్తుపెట్టొచ్చు కాని కత్తిగాటును చూసి హంతకుడిని గుర్తించలేము! 45 సంవత్సరాల క్రిందట 1972లో మొదలై 1991 వరకు జరిగిన విజయవాడ హత్యా రాజకీయల్లొ హీరోలు విలన్ల గురించి కాదు ఈపోస్టు. దేవినేని నెహ్రు మరణం తరువాత విజయవాడ రాజకీయల మీద పెద్దగా ప్రచారంలేని ముఖ్యమైన రాజకీయ శక్తుల గురించి రాయటానికే ఈ పోస్టు. ఈమధ్య రాంగోపాల్ వర్మా "వంగవీటి" సినిమా తరువాత "చలసాని వెంకటరత్నం" అనే CPI నాయకుడి గురించి ఎక్కువ మందికి తెలిసింది. విజయవాడ రాజకీయాలు 1964 వరకు ప్రశాంతంగా జరిగాయి. కమ్యునిష్ట్ పెద్దనాయకులు పుచ్చల పల్లి సుందరయ్యగారు (నెల్లూరు జిల్లా వారైనా గన్నవరం MLAగా పనిచేశారు,చనిపోయిన తరువాత అంత్యక్రియలు కూడ విజయవాడలోనే జరిగాయి) , చండ్ర రాజేశ్వర రావుగారు ఇద్దరు విజయవాడ కేంద్రంగా పనిచేసేవారు.1964లో CPI నుంచి CPM విడిపోయిన తరువాత సుందరయ్యగారు CPM జాతీయ కార్యదర్శిగా,చండ్రా రాజేశ్వర రావుగారు CPI జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకులు "కొండపల్లి సీతారమయ్య"గారు కూడ కృష్ణా జిల్లా పామర్రు ప్రాంతం వారు. కమ్యునిష్ట్ పార్టీ చీలిక తరువాత విజయవాడ సిటీలో CPI,జిల్లాలో మిగిలిన ప్రాంతాలలో CPM బలపడ్డాయి. 1966లో విజయవాడ "industrial estate/ఆటోనగర్" ఏర్పడిన తరువాత కార్మిక సంఘాల నిర్మాణం,బలం పెరిగాయి. విజయవాడలొ CPI నాయకుడు చలసాని వెంకటరత్నం పట్టు ఎక్కువ వుండేది. ఆటోనగర్ అభివృద్ది చెందుతుండటంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి విజయవాడకు వలసలు జరిగాయి.ఈక్రమంలో వంగవీటి రాధ కృష్ణా రావు(పెద్ద రాధ) కుటుంబం విజయవాడకు వలస వచ్చారు. వంగవీటి సోదరులు కోటేశ్వర రావ్,నారాయణ రావ్,రాధ,శోభనా చలపతిరావు, మోహన రంగా రావు(రంగా) సోదరులు వివిధ పనులు చేసుకుంటు జీవించే క్రమంలో రాధ బస్టాండ్ సెంటర్లో నాయకుడిగా ఎదిగారు.చలసాని వెంకటరత్నంకు వంగవీటి రాధ దగ్గర కావటంతో రాధ సిటి లెవల్ నాయకుడయ్యాడు. సినిమాల్లొ చూపించినవి వాస్తవంలో జరిగిన సంఘటనల మధ్య చాలా తేడా వుంది.రాధా స్వయంగా నాయకుడిగా ఎదిగే క్రమంలో చలసాని వర్గంతొ గొడవలు మొదలయ్యాయి. 1971లొ ఈగోడవల్లొ రాధ వర్గం చలసాని వర్గానికి చెందిన "దత్తి కనకారావ్" అనే అతన్ని చంపేశారు.విజయవాడ హత్యా రాజకీయాల్లొ ఇది మొదటి హత్య,వర్మా వంగవీటి సినిమాలో ఈ సీన్ లేదు. దత్తి కనకారావ్ హత్యకు ప్రతీకారంగా చలసాని వర్గం రాధా వర్గానికి చెందిన దుర్గా రావ్,హనుమంతారావు అనే ఇద్దరిని చంపారు. చలసాని వర్గం ప్రతీకార హత్యలతో రాధా వర్గం భయపడింది. వీరి అస్తిత్వతం చిక్కుల్లో పడింది.చలసాని చంపకుంటే మేము బతకలేము అని 1972లో చలసాని వెంకటరత్నాన్ని రాధా వర్గం చంపింది.చలసాని వంటి మీద 72 కత్తి పోట్లు వున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వుంది. చలసాని హత్యతో విజయవాడలోని కార్మిక సంఘాల మీద రాధ ఆదిపత్యం పెరిగిపోయింది. 1969లో మొదలైన "తెలంగాణ" ఉద్యమం,తరువాత మొదలైన "జై ఆంధ్రా" ఉద్యమం 1972 వరకు సాగింది.CPI & CPM జై ఆంధ్రా ఉద్యమాన్ని వ్యతిరేకించి "విశాలంద్ర" ఉద్యమాన్ని మద్దతు ఇచ్చాయి. విధ్యార్ధిగా వున్న దేవినేని నెహ్రు జై ఆంధ్రా ఉద్యమంలొ పాల్గొనేవారు. ఈక్రమంలో కమ్యునిష్ట్ విధ్యార్ధి సంఘాలకు ఇతర సంఘాలకు గొడవలు జరిగాయి,దేవినేని నెహ్రు కూడ చాలాసార్లు దాడికి గురయ్యాడు. ఈక్రమంలో నెహ్రు రాధా మద్దతు కోసం ఆయన వర్గంలో చేరి రాధాకు అనుకూలంగా విధ్యార్ధి సంఘం United Organization of Independents (UI)ని ప్రారంభించారు. చలసాని హత్యకు ప్రతీకారంగా 1974లో రాధా హత్య జరిగింది.ఈ హత్య వెనుక CPI హస్తం వుందని ఆరోపణ.హత్య చేసింది కిరాయి హంతకులు.హత్య జరిగింది రాధా వర్గంలోని "నాగెళ్ళ శివరామప్రసాద్" షాపులో.ఆషాపు ప్రారంభోత్సవానికి వచ్చిన వంగవీటి రాధాను షట్టర్లు వేసి కత్తులతో పొడిచి చంపారు. ఊహించని పరిణామం,అందరు రాధా వర్గీయులే కావటంతో గందరగోళం మధ్య ఎవరిని ఎవరు పొడుస్తున్నారో తెలియని స్థితిలో మొత్తం ఆరుగురు మరణించారు. ఆ హత్యకు దేవినేని నెహ్రు ప్రత్యక్ష సాక్షి.నెహ్రు సాక్ష్యంతో రాధా హంతకులకు యావజ్జీవ శిక్ష పడింది.తరువాత High Courtలో కేసు కొట్టేశారు. రాధా హత్య కేసులో నిందితులు అడుసుమల్లి జయప్రకాష్ 1983లో TDP తరుపున విజయవాడ నుంచి MLAగా గెలిచారు. మొన్న సమైఖ్యాంద్ర ఉద్యమం సమయంలో సుప్రిం కోర్టులో కేసులు వేశారు.ఇదే 1983లో దేవినేని నెహ్రు కూడ MLAగా (TDP) తరుపున కంకిపాడు నుంచి గెలిచా రు. రాధా హత్య కేసులొ మరో నిందితుడు,హత్య జరిగిన షాప్ యజమాని "నాగెళ్ళ శివరామప్రసాద్" 1989లో వంగవీటి రత్నకుమారి మీద TDP తరుపున పోటిచేసి ఓడిపోయారు. రాధా హత్య కేసును నిందితుల తరుపున "నాదెండ్ల భాస్కర రావు"గారు వాదించారు.1978లో తెనాలి ప్రాంతం వారైన నాదెండ్లగారు విజయవాడ నుంచే ఇందిరా కాంగ్రేసు తరుపున గెలవటం యాదృచ్చికం కాదు.1983లో TDP తరుపున వేమూరు నుంచి పోటిచేశారు. రాధా హత్య కేసులో నిందితుడైన "వజ్జా సుబ్బారవు" TDP పుట్టక ముందు NTRతో ఒక సినిమా నిర్మించారని దేవినేని నెహ్రు ఒక ఇంటర్యూలో చెప్పారు. రాధా హత్య తరువాత రంగాగారు కొంత కాలం తరువాత విజయవాడకు దూరంగా మచిలీపట్నం,వైజాగ్లలో వున్నారు. కొన్ని నెలల తరువాత రాధా వర్గంలోని కొందరు రంగాను కలిసి చర్చించి విజయవాడకు వెనక్కి తీసుకొచ్చారు.రంగా రాకతో విజయవాడలో మళ్ళి ఘర్షణలు మొదలయ్యాయి.మరో వైపు దేవినేని నెహ్రు విధ్యార్ధి సంఘాల మద్దతుతో బలపడ్డారు. నెహ్రు బలం పెరగటం కొత్త అనుచరులు తయారు కావటం రంగా వర్గంలోని కొందరిని కొట్టటంతో రంగా నెహ్రూల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. 1978లో ప్రవేట్ బస్సుల జాతీయకరణ ఉద్యమం నెహ్రు,CPI సుబ్బరాజు (1994లో MLAగా గెలిచారు),CPM ఉమామహేశ్వర రావ్(విజయవాడ డిప్యూటి మేయర్గా పనిచేశారు) జాయింట్ కమిటీగా ఉద్యమం చేశారు. ఈ ఉద్యమం చివరి దశలో అప్పటి మంత్రి భవనం వెంకటరాం గారు రంగాను కలిసి ఉద్యమం ఆపవల్సిందిగా కోరారు.రంగా నెహ్రూను ఉద్యమం ఆపమని చెప్పటం,ఇంత కాలం పోరాడి చివరి దశలో ఉద్యమం ఆపలేమని చెప్పటంతో రంగా నెహ్రూల మధ్య స్పష్టమైన చీలిక వచ్చింది. ఈ గొడవలు చిలికి చిలికి నెహ్రు సొంతంగా కొత్త విధ్యార్ధి సంఘం United Students Organizationను 1979లో మొదలు పెట్టటంతో రంగా నెహ్రూల మధ్య ప్రత్యక్ష గొడవలు మొదలయ్యాయి. రంగా,నెహ్రూల మధ్య గొడవలు పెరిగి చివరికి 1979లొ జరిగిన ITI కాలేజి ఎన్నికల్లో దేవినేని నెహ్రు అన్న "గాంధి"ని రంగా వర్గం చంపింధి. గాంధి హత్యతో రంగా నెహ్రుల మధ్య హత్యా రాజకీయాలు మొదలయ్యాయి. గాంధి హత్యకు ప్రతీకారం కోసం నెహ్రు తమ్ముడు మురళి రగిలిపోయాడు.గాంధి హత్య కేసులో నిందితులను చాలా మంధిని మురళి చంపేశాడు. 1981లో జరిగిన విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లొ రంగా కాంగ్రేస్ టికెట్టు కోసం ప్రయత్నించినా కాంగ్రేసు "శ్రీనివాస్ రావు" అనే నాయకుడికి టికెట్టు ఇచ్చింది.రంగా ఇండిపెండెంటుగా పొటికి దిగారు.పోలింగుకు ముందు కాంగ్రేస్ తమ అభ్యర్ధిని పక్కనపెట్టి రంగాకు మద్దతు ప్రకటించింది.రంగా గెలిచారు, ఆఎన్నికల్లో రంగా గుర్తు "సైకిల్"! కౌన్సిలరుగా గెలిచిన తరువాత రంగా కాంగ్రేసులొ చేరారు. ఇంతలో తెలుగుదేశం ఏర్పడటం,విజయవాడ MLAగా వున్న నాదెండ్ల భాస్కర రావ్ దేవినేని నెహ్రూను NTRకు పరిచయం చెయ్యటం ,నెహ్రు 1983లో MLAగా గెలవటం చక చకా జరిగిపోయాయి. నెహ్రు MLAగా గెలవటంతో రంగా వర్గం మీద దాడులు పెరిగాయి. మురళి దూకుడు ఎక్కువైంది.చివరికి రంగా ఇంటికి ఫోన్ చేసి రంగా భార్యను దూషించే స్థాయికి మురళి వెళ్ళాడు. 1985లొ జరిగిన ఎన్నికల్లో రంగాకు విజయవాడ తూర్పు స్థానం నుంచి కాంగ్రేసు తరుపున తొలిసారి MLA అయ్యారు.ఈ ఎన్నికల్లో TDP తరుపున లయోలా కాలేజి లెక్చరర్ యార్లగడ్డ రాజగోపాల్ గారికి సీట్ ఇచ్చారు. రంగా MLAగా గెలవటంతో విజయవాడ సిటీలో ఉదృతంగా పనిచేయటం మొదలుపెట్టారు.రంగా నాయకత్వ లక్షణాలతో ప్రజల్లొ విపరీతమైన following వచ్చింది.అధికార పార్టీలో వుండటంతో నెహ్రు ప్రజాల సమయల మీద స్పందించే పరిస్థితిలేకుండా పోయింది.ఏనాయకుడైనా ప్రతిపక్షంలోనే ఉన్నప్పుడే ప్రజా నాయకుడిగా ఎదుగుతారన్నది రంగా ,YSR విషయంలో నిజమైంది. 1987లో రంగా తన అన్న రాధా కథతో దవళ సత్యంగారి దర్శకత్వంలో "చైతన్య రధం" అనే సినిమాను తీశారు.ఈ సినిమాలో రాధా హత్య సీన్ చూసి చాలా మంది ఎమోషనలుగా స్పందించారు. దళపతి సినిమాలో మమ్మూటి మర్డర్ సీన్ వాస్తవంలో రాధ హత్య సీన్. ఈ చైతన్యరధం కథ నుంచి శివ,గాయం,దళపతి వచ్చాయి. చైతన్యరధం తమిళంలో కూడ dub చేశారు. ఈ చైతన్య రధం సినిమా నెగటీవ్ కాని ప్రింట్లు కాని ఇప్పుడు లేవంట.అప్పటి ప్రభుత్వమే ప్రింటలన్ని కొని కాల్చివేసిందని దవళ సత్యం గారు ఒక ఇంటర్యూలో చెప్పారు. దాదాపు ఇదే సమయంలో మిరియాల వెంకటరావుగారి నాయకత్వంలో "కాపునాడు" మొదలైంది. చైతన్యరధం సినిమా విజయోత్సవం యాత్ర విజయవాడ నుంచు రాజమండ్రి వరకు గోదావరి జిల్లాలో విస్త్రుతంగా జరిగింది.రంగా ప్రతి ఊర్లో ర్యాలీలు,సభలు పెట్టారు. విజయవాడలో జరిగిన సభలూ సుమారు 5 లక్షల మంది హాజరయ్యారు.అంతకు ముందు విజయవాడలో జరిగిన మహనాడు కన్నా రంగా సభా భారి విజయవంతం అయ్యింది. రంగా హవా కోస్తా దాటి తెలంగాణాకు కూడ పాకింది.ఖమ్మంలో జరిగిన సభ అంతకు ముందు అక్కడ జరిగిన పార్టీల సభల కన్నా ఎక్కువ విజయవంతం అయ్యింది. రంగా ఊపు చూస్తే 1989 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి ఖాయం అనే అభిప్రాయం వచ్చింది.రంగా మీద ప్రభుత్వం పోలీసుల ద్వార అనేక కేసులు పెట్టింది.పదుల కొద్ది కేసులు బేయిల్లతో రంగా పరిస్థితి వుండేది.అప్పటి విజయవాడ సిటి కమీషనర్ "వ్యాస్" కక్షగట్టి రంగాను వేధించారని ఆరోపణలు వున్నాయి. దళపతిలో అరవింద్ స్వామి క్యారెక్టర్ సూర్తి వ్యాసుదే! మరో వైపు దేవినేని మురళి రంగ వర్గం మీద దాడులు ఎక్కువయ్యాయి. రంగాను చంపుతారని పుకార్లు వచ్చాయి.రంగా వర్గం ముందు స్టెప్ తీసుకోని 1988 మార్చిలో నెల్లూరులొ LAW పరిక్షలు రాసి వ్యానులో విజయవాడకు వస్తున్న మురళిని NH5 మీద చిలకలూరిపేట-గుంటూరు మధ్య "యడ్లపాడు" వద్ద చంపారు.శివా సినిమాలోని శుభలేఖ సుధాకర్ హత్య వాస్త జీవితంలో దేవినేని మురళి హత్యే! మురళి హత్య జరిగినప్పుడు రంగా డిల్లీలోని రాం మనోహర్ లోహియా హాస్పటల్లొ tretment తీసుకుంటున్నారు.పోలీసులు మురళి హత్య కేసులొ రంగా మీద కేసు పెట్టారు.రంగా మరో సోదరుడు శోభాన చలపతిరావు,రంగా బావ మరిది చెన్నుపాటి శ్రీను మీద కూడ కేసు నమోదు అయ్యింది. మురళి హత్య జరిగిన తరువాత రంగా హత్య ఖాయం అని అందరిలో అభిప్రాయం వుంది.కాని ఎప్పుడు ఎలా అన్నది ప్రశ్నార్ధకం. 1988 చివరిలో గిరిపురం కాలనీలో ప్రజలకు పట్టాలు ఇవ్వాలని రంగా ఆమరణ నిరహార దీక్ష మొదలుపెట్టారు,ఈ దీక్షలోనే 26-Dec-1988 అంటే క్రిస్ మస్ తరువాత రోజు తెల్లవారు జామున బస్సుల్లొ అయ్యప్పమాలలో వచ్చిన 100 అందికి పైగా రంగాను చంపేశారు. రంగా హత్యను ఎవరు చేపించారో రాంగోపాల్ వర్మకు తెలియదని సినిమాలో చెప్పారు.కనీసం కేసులో నిందితుల పేర్లు కూడ చెప్పలేదు. రంగాకు ప్రధాన ప్రత్యర్ధి అయిన దేవినేని నెహ్రు రంగాను హత్యచేపించారని పత్రికల్లొ రాశారు.ప్రత్యర్ధి హత్యలో పోలీసులు మొదట చేసే పని హతుడి ప్రత్యర్ధి మీద FIR నమోదు చేస్తారు. రంగా హత్య కేసులో విచిత్రంగా నెహ్రు 21వ నిందితుడు,అది కూడ హత్య చేసినట్లు కాదు "కుట్రదారుడి"గా. రంగా హత్య తరువాత భారి హింస జరిగి 45 మంది చనిపోయారు ,వందల కోట్ల ఆస్తులు ద్వంసం అయ్యాయి.ఆస్తులన్ని నెహ్రు కులస్తులైన కమ్మవారివి. రంగా-నెహ్రుల గొడవ రంగా హత్య తరువాత కమ్మ-కాపు కులగొడవలుగా మారాయి.కాని రంగా హత్య నిందితుల్లో కాపులు వున్నారు.రంగా చనిపోయే వారకు ఆయనకు సలహాదారుడు "కాట్రగడ్డ రాజాగోపాల్"(CPI మాజి కార్యదర్శి).రంగా భార్య రత్నకుమారిగారు కమ్మ. విజయవాడ గొడవలు కచ్చితంగా కుల గొడవలు కాదు,ఆధిపత్య రాజకీయాలు మాత్రమే! రంగాను చివరి దశలో అంటే కాపునాడు మొదలైన తరువాతనే కాపునాయకుడు అన్న పేరు వచ్చింది.వాస్తంలో రంగాకు కాపుల కంటే దళితుల్లొ అనుచరులు ఎక్కువ.BCలైన "నగరా"ల్లొ రంగాకు ఎక్కువ ఆదరణ. రంగా హత్య జరిగిన్ డిసెంబర్ 26 కూడ streatgicalగా జరిగిందే!క్రిస్మస్ జరుపు కోవటంలో ఎక్కువ మంది అనుచరులు వుండరనే డిసెంబర్ 26ను రంగా హత్య చెయ్యటానికి ఎంచుకున్నారు. రంగా హత్య తరువాత హోం మంత్రి కోడెల శివప్రసాద్ రాజినామ చేయగా కాపు నాయకుడు కళావెంకటరావు హోం మంత్రి అయ్యారు.అప్పటి DGP P.S.రామ్మోహన్ రావు గారు రాజినామ చేసినా ప్రభుత్వం అంగీకరించలేదు.ఈ రామ్మోహన్ రావుగారు 2002-2004 మధ్య తమిలనాడు గవర్నర్గుగా పనిచేశారు. రాధా హత్యా నిందితుల్లో కొందరు MLAలు అయింట్లే,రంగా హత్య కేసుకోని నిందితులు కూడ MLAలు అయ్యారు. విశాఖపట్టణం నుంచి 2009,2014లో TDP తరుపున గెలిచిన వెలగపూడి రామకృష్ణ రంగా హత్య కేసులో నిందితుడు. మరో నిందితుడు "చలసాని పండు" 1999 లో ఉయ్యూరు నుంచి ఇండిపెండెంటుగా 1020 ఓట్లతొ ఓడిపోయాడు,2004లో కూడ TDP తరుపున ఓడిపోయరు.2009లో 150 ఓట్లతో TDP తరుపున పెనమలూరు నుంచి ఓడిపోయారు.2010లొ ఆయనకు మసాజ్ చేసే అతని చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ చలసాని పండు స్వయంగా రంగాను పొడిచారని అంటారు, "నువ్వు నన్ను చంపుతున్నావా" అని రంగా అన్నారని కూడ ప్రచారంలో వుంది."సై" సినిమాలో సీన్ గుర్తురావటం సాధారణం. రాజకీయం ముందు కులం వర్గం ఏమి వుండవని కూడ విజయవాడ చరిత్ర నిరూపించింది. NTR మరణించిన తరువాత దేవినేను నెహ్రు 1996లో కాంగ్రేసులొ చేరారు.నెహ్రు రాకను వ్యతిరేకించి రత్నకుమారిగారు TDPలో చేరారు.రంగా హత్య కేసులో నిందితుడు అయిన చలసాని పండుకు కాంగ్రేస్ రంగా సోదరుడు అయిన శొభనా చలపతిరావును కాదని ఉయ్యూరు నుంచి టికెట్ట్ ప్రకటించింది.చివరిలొ దాసరి నారాయణరావు గారు కలగచేసుకోని శొభనా చలపతిరావు గారికి టికెట్టు ఇప్పించారు. దేవినేని నెహ్రు 2016 ఆగష్టులో కాంగ్రేసును & బాబుగారితో విభేదాలు వీడి తెలుగుదేశంలో చేరారు.2000 సంవత్సరంలో kidney transplantation చేయించుకున్న నెహ్రు మొన్న 17-Apr-2017న చనిపోయారు. గత ఆగస్టులో నెహ్రు తమ్ముడు "బాజిప్రసాద్" మరణించారు. దేవినేని నలుగురు సోదరులు గాంధి,నెహ్రు,మురళి,బాజి ప్రసాద్ అకాల మరణం చెందారు. ఏపార్టీలో వున్న కమిట్మెంటుతో పనిచేసే నాయకుడిగా పేరున్న నెహ్రు కేవలం కొడుకు అవినాష్ భవిషత్తు కోసమే TDPలోకి వెళ్ళారనిపిస్తుంది.నెహ్రు బాబుగారి మీద చేసిన విమర్శలు చాలా తీవ్ర మైనవి.నెహ్రు కూతురిని రాయపాటి శ్రీనివాస్ కొడుకు పెళ్ళి చేసుకున్నాడు కాని వారి మధ విభేదాలు వచ్చి విడాకుల వరకు వెళ్ళారు,విడిపోయారో లేదో తెలియదు. రాధా,రంగా హంతకులు MLAలు అయినట్టే రంగా అనుచరులు, ఇతర కాపు యువ నాయకులు రంగ అమరనం తరువాత 1989లో కాంగ్రేస్ తరుపున MLAలు అయ్యారు,వీరిలో కన్నా లక్ష్మినారయణ, జక్కంపూడి రామ్మోహనరావ్,అంబటి రాంబాబు ముఖ్యులు.మాజి కేంద్ర మంత్రి శివశంకర్ వీరికి టికెట్లు రావటానికి ప్రధాన కారణం. శివ శంకర్ గారు కూడ మొన్న మార్చిలో చనిపోయారు. రంగా అనుచరుడు(రంగా తుపాకిని carry చేసే) మల్లది విష్ణు 2009లో కాంగ్రేసు తరుపున పోటిచేసి PRP తరుపున పోటిచేసిన రంగా కొడుకు రాధా మీద గెలిచారు. అటు మురళి హత్యకేసు ఇటు రంగా హత్య కేసులో ఎవరికి శిక్షలు పడలేదు. ఇరు కేసుల్లో సాక్షులు నిందితులను గుర్తుపట్ట లేదు.కారణం బర్మా సీతారమయ్య అనే పెద్దమనిషి నెహ్రు-రంగా వర్గాల రాజి కుదిర్చారు ఎవరికి శిక్షలు పడకుండ చేశారు. కర్నాటి రామ్మోహన్ రావు అనే లాయర్ గారు(ఇప్పుడు కూడ వున్నారు) రంగా-నెహ్రుల మధ్య గొడవలు పెరగకుండ అనేక సార్లు రాజి కుదిర్చారు కాని ఆ రాజీలు ఎక్కువ కాలం నిలబడలేదు. ఇది విజయవాడ రాజకీయాల్లొ ఒక కోణం-ముఖ్య కోణం,ఈకథను సినిమా తీస్తే ఎవరు చూస్తారు?మసాల కావాలి,జనాల్లొ పాత గాయలు రేపే ఏ చర్య అయినా సమర్ధనీయం కాదు! అవును విజయవాడ కథలో హీరోలు విలన్లు లేరు అందరు పాత్రధారులే!     అందరు బాధితులు,పీడితులే...నలిగి పోయింది విజయవాడ నగరం,ప్రజలు. ...
 • (Sheik Sadiq Ali ) .......................  మీడియాను మేనేజ్ చెయ్యడంలో,తిమ్మిని బమ్మిని చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని అందరికీ తెలిసిన విషయమే. అయితే ,ఆయనకు ఆ కళ కొత్తగా అబ్బింది ఏమీ కాదు. 30 ఏళ్ళ క్రితమే ఆయన తన కళను తెలుగు ప్రజల ముందు ప్రదర్శించారు. ఆయనకు అంతకు ముందు నుంచే ఆ కళలో ప్రవేశం ఉందనీ ఆయనను సన్నిహితంగా ఎరిగిన మిత్రులు చెప్పేవారు. అసలింతకీ ఆయన ప్రదర్శించిన కళ ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదవండి. అది స్వర్గీయ ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా సూపర్ ఫాం లో ఉన్న కాలం. చంద్రబాబు చిన్నల్లుడిగా అప్పుడప్పుడే చక్రం తిప్పుతున్న కాలం. చిత్తూరు జిల్లా మదనపల్లె లో భారీ బహిరంగ సభ జరిగింది. జనం తండోప తండాలుగా తరలి వచ్చారు. ఎన్టీయార్ ప్రసంగాన్ని మైమరచి వింటున్నారు. అప్పుడే ఎన్టీయార్ బాంబు పేల్చారు."నా రాజకీయ వారసుడు బాలయ్య బాబే " అని నిండు సభలో ప్రకటించారు. ఒక్కసారిగా సభలో జయజయ ధ్వానాలు మిన్నంటాయి.వింటున్న మీడియా ప్రతినిధులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.బ్యానర్ ఐటెం దొరికిందని సంబర పడిపోయారు. మదన పల్లె నుంచి తిరుపతికి రావటం ఆలస్యమవుతుందని ఫోన్ లోనే తమ కార్యాలయాలకు వార్త చెప్పేశారు. ఇక్కడ ఎడిటోరియల్ డెస్క్ కూడా ఐటెం రాయించి కంపోజ్ చేయించి పేజ్ మేకప్ కూడా పూర్తి చేశారు. ఈ లోగా రిపోర్టర్లు తమ ఆఫీసులకు చేరారు. నేను నైట్ షిఫ్ట్ లో ఉన్నాను.ఒకపక్క సిటీ స్పెషల్, మెయిన్ ఎడిషన్ రెండూ చూస్తున్నాను. లే అవుట్ చేసిన పేజ్ కెమెరా సెక్షన్ కు వేల్తుందీ అనుకుంటూ ఉండగా ,ఒక్కసారి అలజడి మొదలైంది. మా బ్యూరో చీఫ్ సి.ఆర్ .నాయుడు పరుగెత్తుకు వచ్చారు.' చంద్రబాబు ఫోన్ చేశారు. బ్యానర్ లీడ్ మార్చాలి అన్నారు. ఎన్టీయార్ ఉద్దేశ్యం బాలయ్య బాబు రాజకీయ వారసుడు కాదనీ,కేవలం నట వారసుడు మాత్రమే అని అర్ధం చేసుకోవాలని చెప్పారు. కాబట్టి బాలయ్య బాబే నా నట వారసుడు అని లీడ్ మార్చి రాసి ,తగిన విధంగా హెడ్డింగ్ కూడా మార్చాలి ' అన్నారు. ఆ మేరకు ఆయనే లీడ్ మార్చి రాసిచ్చారు. తగిన విధంగా హెడ్డింగ్ కూడా మారింది.తద్వారా ఒక రాజకీయ తుఫాను ఆగిపోయింది. దటీజ్ చంద్రబాబు. ఆరోజుల్లో ఎలెక్ట్రానిక్ మీడియా లేకపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమి జరిగి ఉండేదో ఊహించలేం.ఇది బాబు కళకు సంబంధించిన ఒక నమూనా మాత్రమె. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి....
 • మహిళలు ఇష్ట పడే  నేత, జరీ చీరలకూ జిఎస్‌టి దెబ్బ తగిలింది . జిఎస్‌టికి తోడు చైనా పట్టు, పవర్‌లూమ్‌లు కలిసి చేనేత రంగంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ముడిసరకుపై జిఎస్‌టిని విధించడంతో చేనేత రంగం సంక్షోభంలో పడింది. పన్ను పోటు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈ రంగంపై ఆధారపడిన కుటుంబాలు కోరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో   5 లక్షల మగ్గాలు గతంలో ఉండగా, ప్రభుత్వ విధానాల కారణంగా ప్రస్తుతం వాటి సంఖ్య 3 లక్షలకు పడిపోయింది. డిమాండ్ ఉన్నప్పటికీ, చేనేత రంగం లాభసాటిగా లేకపోవడంతో మగ్గాలు చాలా వరకూ మూతపడుతున్నాయి. మంగళగిరిలో ఒకప్పుడు 11వేల మగ్గాలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 1000కు తగ్గడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది.ఈ నెల 1 నుంచి  అమల్లోకి వచ్చిన జిఎస్‌టి ప్రభావం చేనేత రంగంపై తీవ్రంగా పడింది. చిలపలు పై 5 శాతం మేర పన్ను విధించారు. జరీ చీరల్లో వాడే జరీపై 12 శాతం పన్నును కొత్తగా విధించారు. చీర ఖరీదు 1000 రూపాయలకు మించితే 18 శాతం మేర పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో 1000 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు ఉన్న నేత చీర ధర 23 శాతం మేర పెరిగింది. జరీ చీరకు 35 శాతం మేర ధర పెరగింది. దీంతో 1000 రూపాయలు ఉన్న నేత చీర 1230 రూపాయలకు, జరీ చీర 1350 రూపాయలకు పెరిగింది. దీంతో పెరిగిన ధరలతో చీరల కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందని చేనేత వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  ఇప్పటికే చేనేత రంగం లాభసాటిగా లేని నేపథ్యంలో ఈ రంగానికీ చైనా పోటీ తప్పడం లేదు. పట్టు చీరల తయారీని ప్రభుత్వం ప్రోత్సహించడంతో ధర్మవరంలో కోట్ల రూపాయల పెట్టుబడులతో కొన్ని యూనిట్లను నెలకొల్పారు. అక్కడ భారీ పెట్టుబడులతో చైనా కంపెనీలు పట్టు చీరల తయారీ పరిశ్రమలను పెట్టేందుకు వీలుగా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీంతో యంత్రాలపై పట్టుచీరలు తయారు చేస్తున్నారు. ఇవి మగ్గాలపై నేసిన చీరల కన్నా తక్కువ ధరకే లభిస్తాయి. 11 రకాల వస్త్రాలను కేవలం మగ్గాలపై తయారు చేసి విక్రయించాలని...  పవర్‌లూమ్‌లపై తయారు చేయటంపై నిషేధం విధించినప్పటికీ, చిన్న మార్పులతో పవర్‌లూమ్‌లపై ఆయా వస్త్రాలను తయారు చేస్తున్నారు. దీంతో మగ్గాలపై నేసిన చీరలు, ఇతర వస్త్రాల కంటే పవర్‌లూమ్‌పై చేసిన వాటి ధర తక్కువగా ఉంటోంది. ముడి నూలుతో పవర్‌లూమ్‌లపై చేసిన వస్త్రాల నాణ్యత కంటే మగ్గాలపై చేసి వస్త్రాలు మన్నిక ఎక్కువగా ఉంటుంది. అయితే మగ్గాలపై నేసిన చీరల ధర ఎక్కువగా ఉంటుంది. దీంతో మగ్గాలపై నేసిన చీరల కొనుగోళ్లు తగ్గుతున్నాయి.  కొనుగోళ్లు తగ్గుతున్న క్రమంలో  ఈ రంగంపై ఆధారపడిన వారి పరిస్థితి మరింత దిగజార నుంది. ఇప్పటికే శానిటరీ నాప్కిన్స్‌పై భారీగా పన్ను విధించి మహిళల ఆగ్రహాన్ని చవి చూస్తున్న కేంద్ర ప్రభుత్వం, చీరల ధరలను ప్రభావితం చేసేలా పన్ను విధించడం కూడా విమర్శలకు గురి అవుతున్నది. కేంద్రం దీనిపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది.  పవర్‌లూమ్‌ల ద్వారా వచ్చే వస్త్రాల ధర తక్కువగా ఉండటంతో మగ్గాలపై నేసిన చీరలకు డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంది . 
 • అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ  ఎయిర్ ఇండియా పునరుజ్జీవానికి ప్రైవేటీకరణతో పాటు పలు అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకోనున్న క్రమంలో ఎయిరిండియాను దాని మాతృసంస్థ  టాటా గ్రూప్‌ సింగపూర్  ఎయిర్‌లైన్స్‌తో కలిసి కొనుగోలు చేసేందుకు ఆసక్తి  చూపుతోంది .  ఎయిరిండియా జాతీయం కాకముందు టాటాగ్రూప్‌లోనే  ఉండేది. దేశంలో పౌర విమానయాన పరిశ్రమకు నాంది పలికింది టాటాలే. వారు నిర్వహించిన సంస్థనే ప్రభుత్వం సొంతం చేసుకుని కొన్ని దశాబ్దాలపాటు నడిపి, తప్పుడు నిర్ణయాలతో నష్టాలపాలు చేసింది. ఇప్పుడు అమ్మకానికి పెట్టింది. కాగా  ఇప్పటికే టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ దీనిపై అనధికారికంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 2007 నుంచి ఎయిరిండియా నష్టాల బాటలోనే నడుస్తోంది. ఇక గతంలోకి వెళితే  టాటా ఎయిర్‌లైన్స్‌ 1932లో ప్రారంభమైంది. లెజండరీ పారిశ్రామికవేత్త జెఆర్‌డి టాటా తొలి విమానాన్ని తానే స్వయంగా కరాచి, ముంబై మధ్య నడిపారు. 1946లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్‌ ఇండియా పేరుతో పబ్లిక్‌ కంపెనీగా మార్చారు. జెఆర్‌డి కలల పుత్రికగా చెప్పే ఎయిర్‌ ఇండియా.. టాటాల నిర్వహణలో ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. నిర్వహణలో ప్రతి చిన్న అంశంలోనూ, ప్రయాణికులకు అందించే ఆహార పదార్ధాల నుంచి కర్టెన్ల ఎంపిక వరకు జెఆర్‌డి కలుగజేసుకునేవారని చెబుతారు.   1953లో ప్రభుత్వం దీనిని జాతీయం చేయడంతో జెఆర్‌డి కలలు కుప్పకూలాయి. కనీసం తమతో మాట కూడా చెప్పకుండా ప్రభుత్వం ఎయిర్‌ ఇండియాను జాతీయం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జెఆర్‌డి లేఖ కూడా రాశారు. నిర్ణయం కంటే కూడా నిర్ణయం తీసుకున్న పద్ధతి తనను బాధించిందని ఆయన నిరసన వ్యక్తం చేశారు.  సంస్థను జాతీయం చేసినా చైర్మన్‌గా మాత్రం జెఆర్‌డినే కొనసాగాలని నెహ్రూ నిర్ణయించడంతో 1977 వరకు ఆయనే చైర్మన్‌గా ఉన్నారు. 1977లో మొరార్జీ ప్రభుత్వం ఆయన్ను చైర్మన్‌ పదవి నుంచి తప్పించింది. అప్పటి  నుంచి టాటాలు ఆ సంస్థ గురించి పట్టించుకోవడం మానేశారు. ఇన్నేళ్లకి  అవకాశం రావడం తో సొంతం చేసుకునే యత్నాలకు శ్రీకారం చుట్టారు. 
 • నగదు ఉపసంహరణ, చెల్లింపులపై స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జూన్  1 నుంచి  అదనపు చార్జీలు వసూలు  చేయడం మొదలెట్టింది. బ్యాంకులో నెలకు నాలుగు లావాదేవీలు మాత్రమే ఖాతాదారులకు ఉచితం. ఆపై జరిపే ప్రతి లావాదేవీపై 50 రూపాయల సేవా పన్నును ఎస్బీఐ వసూలు చేస్తుంది . ఇక ఎస్బీఐ ఏటీఎంల్లో కార్డు ద్వారా నగదు విత్ డ్రా చేస్తే రూ.10, ఇతర బ్యాంకు ఎటీఎం నుంచి విత్ డ్రా చేస్తే రూ.20 వడ్డించనుంది. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లపై కూడా అదనపు చార్జీలను వసూలు చేస్తుంది. ఎస్బీఐ అదనపు చార్జీల వసూలు పై ముందే ప్రకటించింది.  ఖాతాల్లో ఎక్కువ డబ్బులుండేవారికి మినహాయింపు ఉంటుంది. కనీస బ్యాలెన్స్‌ రూ. 25వేలు దాటితే ఎన్ని లావాదేవీలైనా ఫ్రీగా చేసుకోవచ్చు. అంతకన్నా తక్కువుంటే మాత్రం పరిమితులు.. భారీగా చార్జీల వడ్డన తప్పదు. ఆన్‌లైన్‌ లావాదేవీలు కూడా నెలకు 40 మాత్రమే ఉచితం. చిరిగిన నోట్లు మార్చాలన్నా డబ్బు కట్టాల్సిందే.  ఖాతాదారులనుంచి పెద్ద ఎత్తున నిరసన  వ్యక్తం  అయినప్పటికీ  బ్యాంకు దిగిరాలేదు. ఖాతాదారులు అన్నివిషయాలు తెలుసుకుని లావాదేవీలు నిర్వహించడం మంచిది.  
 • వన్నా క్రై'    దెబ్బతో బ్యాంకింగ్ రంగం అతలాకుతలం కానుంది. ముందు జాగ్రత్తగా దేశంలోని ఏటీఎం లను మూసివేయాలని రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.  "వన్నా క్రై"   ప్రభావం బ్యాంకింగ్  నెట్‌వర్క్‌పై పడకుండా  ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాన్నా క్రై  రాన్సమ్‌వేర్ ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సహా వివిధ రంగాల కంప్యూటర్ నెట్‌వర్క్‌లను  దెబ్బ తీసిన విషయం తెల్సిందే.  కీలకమైన డాటా మూసుకుపోయేలా చేసి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు వార్తల వస్తోన్న  నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. మనదేశంలోని దాదాపు అన్ని ఏటీఎంలు విండోస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తోనే పనిచేస్తున్నాయి. అదీగాక దేశంలోని 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం ఏటీఎంలు ఔట్‌డేటెడ్ విండోస్ ఎక్స్‌పీపైనే ఆధారపడుతున్నాయి. దీంతో ఈ నెట్‌వర్క్‌పై మాల్‌వేర్ సులభంగా దాడి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు .మాల్‌వేర్ దాడుల క్రమంలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్‌పీ కి  కూడా ప్రత్యేక అప్‌డేట్ ఇస్తామని ప్రకటించింది. దీంతో విండోస్ ప్యాచ్‌లను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా ఆర్బీఐ తాజాగా బ్యాంకులకు సూచించింది. అంతవరకూ ఎటీఎం మెషీన్లను ఆపరేట్ చేయవద్దని సూచించింది.   అయితే, తమ డబ్బు విషయంలో కస్టమర్లు భయపడాల్సిన పని లేదని ఏటీఎం ఆపరేటర్లు అంటున్నారు. ఏటీఎం యంత్రాల్లో డాటా స్టోరేజి ఉండదని, ఏటీఎంలు 'వాన్నా క్రై' బారిన పడే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఒకవేళ ఏటీఎంలు మాల్‌వేర్ బారిన పడినా వెంటనే రీఫార్మెట్ చేసే అవకాశం ఉంటుదని ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అండ్ సర్వీసెస్ నిపుణులు అంటున్నారు. మొత్తం మీద కొద్దీ రోజులు ఈ సంక్షోభం తప్పేలా లేదు. 
 • (Vasireddy Venugopal) ............   బ్యాంకులు కొత్త బ్రాంచీ తెరవాలన్నా, కొత్త ఏటీఎం పెట్టాలన్నా రిజర్వ్ బ్యాంక్ అనుమతి అవసరం. వాటిని ఏ ప్రాంతంలో నెలకొల్పదలుచుకున్నదీ తెలియజేసి అనుమతి పొందవలసి వుంటుంది. అయితే Onsite ATM పెట్టుకోవడానికి ఆర్.బి.ఐ అనుమతి అవసరం లేదు. అంటే.. బ్యాంక్ బ్రాంచ్ ఆవరణలో పెట్టుకునే ఏటీఎంకి ఆర్.బి.ఐ అనుమతి అవసరం లేదు. ఆ ఏటీఎంను బ్రాంచిలో అంతర్భాగంగా పరిగణిస్తారు. ఆ ఏటీఎంను ఆ బ్రాంచి స్వయంగా నిర్వహించుకునే అవకాశం వుంది. ఏటీఎంలో ఎప్పుడు డబ్బులు ఖాళీ అయినా.. బ్రాంచి సిబ్బందే తమ స్ట్రాంగ్ రూమ్ నుంచి నగదు తీసుకువచ్చి ఏటీఎంలో నింపి, ఖాతాదారులకు అసౌకర్యం కలగకుండా చూసే అవకాశం వుంది. అయితే మార్చి 1 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో Offsite ATMలలోనే కాకుండా.. Onsite ATMలలో కూడా నో క్యాష్. ఇరవై రోజులనుంచి ఈ తంతు నడుస్తోంది. కారణాలు తెలియదు. బ్యాంకులకు, నగదు సప్లయిచేసే ప్రెవేటు ఏజెన్సీలకు కమిషన్ విషయంలో పేచీ వచ్చిందని, అందుకనే ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడిందని తెలుస్తున్నట్టు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ముక్కుచీదే వార్త ఒకటి వచ్చింది. ఇక అంతే. ఇరవై రోజులుగా ఈ సమస్య ఎందుకు కొనసాగుతోంది.. దీనికి ఏమిటి పరిష్కారం అనే తదుపరి అజాపజా వార్తలు లేవు. నాకు అర్ధమైన దాని ప్రకారం.. బ్యాంకులు.. తాము స్వయంగా నిర్వహించుకోవడానికి అవకాశం వున్న Onsite ATMలలో నగదు నింపే బాధ్యతను కూడా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి, చేతులు దులుపుకున్నట్టున్నాయి.  ఫలానా పరిమితిలోపు నగదు లావాదేవీలను ఏటీఎం ద్వారా నిర్వహించుకోవాలని బ్రాంచిలో బోర్డులు పెట్టిన బ్యాంకులు.. ఏటీఎంలో స్వయంగా నగదు వుంచగలిగిన బాధ్యతను దులిపేసుకుని కస్టమర్లతో చెలగాటమాడడం Financial Terrorism కిందే లెక్క.
 • ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండే 10 రూపాయల ప్లాస్టిక్ నోట్ల ను  రిజర్వ్ బ్యాంక్ ముద్రించబోతోంది .   వాటిని క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకం గా  పరీక్షించేందుకు రిజర్వు బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.  దేశంలోని  ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్ నోట్లతో క్షేత్రస్థాయిలో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన ఆ సమాధానంలో చెప్పారు. ప్లాస్టిక్ మిశ్రమాల సేకరణ, వాటిపై రూ. 10 నోట్ల ముద్రణ లాంటి విషయంలో అన్ని అనుమతులను రిజర్వు బ్యాంకుకు ఇచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం వాడుతున్న కాగితపు నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు రిజర్వు బ్యాంకులు కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్, ఇతర పదార్థాలతో చేసిన నోట్ల గురించి చలామణి లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. 2014 నుంచి ప్లాస్టిక్ నోట్లు తెచ్చే ప్రతిపాదన పరిశీలన లో ఉంది. గత డిసెంబర్ లోనే ముద్రణకు వెళ్లాల్సి ఉండగా ఆలస్యమైంది. కొచ్చి , మైసూర్ , సిమ్లా ,భువనేశ్వర్ వంటి నగరాల్లో తొలుత ప్రయోగాత్మకంగా  ప్రవేశ పెడతారు . 
 • డ్రగ్స్ కేసు విచారణ తీరును మొదటి నుంచి తప్పుబడుతున్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ సోషల్ మీడియా వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు. ఫేస్‌బుక్‌లో ఆయన  వరుస పోస్టులు చేశారు. డ్రగ్స్ కేసు వల్ల హైదరాబాద్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే అవకాశం ఉన్నదన్నారు. సిట్ చేస్తున్న విచారణ వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. తెలంగాణ సిఎం కేసీఆర్ పై ముంబై ప్రజలకు అపార నమ్మకం ఉన్నదని, టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని చాలా మెచ్చుకుంటారని, ఇలాంటి ఘటనలు నగరంలో వెలుగులోకి రావటం పట్ల షాక్ అవుతున్నారని తెలిపారు.  సిట్ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని వర్మ సూచించారు. కాగా  ఎక్సైజ్‌శాఖపై రామ్‌గోపాల్‌వర్మ చేసిన వ్యాఖ్యలపై రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. వర్మపై చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో కోరారు. ...
 • 'సిట్ అధికారులు పూరి జగన్నాథ్, సుబ్బరాజు మిగిలిన సినీ ప్రముఖులు విచారించినట్టుగానే స్కూల్ విద్యార్థులను కూడా విచారిస్తారా..? ప్రస్తుతం మీడియా అకున్ సబర్వాల్ ను అమరేంద్ర బాహుబలి లా చూపిస్తుంది. రాజమౌళి ఆయనతో బాహుబలి 3 తీయాలేమో. అకున్ సబర్వాల్ గారి సమగ్రతను ఎవరు అనుమానించటం లేదు. కానీ ఎలాంటి ఆరోపణలు, ఆధారాలు లేకుండా మీడియాకు లీకులివ్వటం, ప్రముఖులకు కీర్తికి భంగం కలిగించే విధంగా, వారి కుటుంబాలకు బాధ కలిగించే విధంగా ప్రవర్తించటం దురదృష్టకరం.' అంటూ తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు.   అయితే ఈ వ్యాఖ్యలు  అభ్యంతరకరం అని  రిటైర్డ్ ఎక్సయిజ్ శాఖ అధికారులు అంటున్నారు . ఇది విచారణ ను అడ్డుకోవడమే ... ఆయనపై కేసు వేస్తాం అని కూడా చెప్పారు.  ఈ నేపథ్యంలోనే వర్మ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా మండిపడ్డారు. ఇండస్ట్రీకి వర్మ చేసిందేం లేదని, వర్మ చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.  అలాగే  వర్మ కూడా మళ్ళీ స్పందించారు ... వీడియో లో  వర్మ స్పందన చూడండి. ...
 • మరో మూడేళ్ళలో  అతి  పె.......  .......  ద్ద సినిమా విడుదల  కాబోతుంది ....ఏకంగా 30 రోజులపాటు ఏకధాటిగా చూడాల్సిన సినిమా వెండితెరపైకి  రానుంది. నిజమా ? అని ఆశ్చర్య పోకండి.  అక్షరాలా నిజమే.  థియేటర్ లోనే భోజనాలు టిఫిన్లు  గట్రా కూడా  చేస్తూ  ఈ  సినిమా చూస్తారేమో ?  ఇంత భారీగా తీస్తోన్న ఆ సినిమా  ఆ దర్శకుడి  పేరు  అండర్స్ వెబర్గ్ ... స్వీడిష్ డైరెక్టర్...   20 ఏళ్ల పాటు విజువల్ ఆర్ట్స్ రంగంలో అనుభవం ఉన్న అండర్స్, 2020లో రీటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్ లో అందరూ మాట్లాడుకునేలా ఏది చేయలేకపోయానని భావిస్తున్న అండర్స్ కి  ఈ వెరైటీ ఆలోచన వచ్చింది .   వెంటనే సుదీర్ఘ మైన సినిమాను  తీయడం మొదలెట్టాడు.  'ఆంబియన్స్', పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మూకీ సినిమాగా తీస్తున్నాడు . డైలాగులు లేకుండా తెరకెక్కుతున్న ఈసినిమాను తన చివరి చిత్రంగా 2020లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా నిడివి  720 గంటలు, అంటే సరిగ్గా 30 రోజులు. ఇప్పటికే 400 గంటల షూటింగ్‌ను పూర్తి చేశారు. 2015 లో  ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.  దాని  నిడివి 7 గంటల 20 నిమిషాలు.   2018లో 72 నిమిషాల  నిడివి కలిగిన మరో  ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. 100 మంది నటులతో తీసే ఈ సినిమాను 2020లో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేసి, కేవలం ఒక షో మాత్రమే వేస్తారట. ఆ తరువాత మరెవరు  ప్రదర్శించడానికి వీలు లేకుండా సినిమా కాపీలను తగులబెట్టాలని భావిస్తున్నాడు అండర్స్ వెబర్గ్. ఆయనే నిర్మాత కూడా కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ కాపీలను తగులపెట్టాలన్న ఆలోచనపై పెద్ద ఎత్తు విమర్శలు వినిపిస్తున్నాయి.  ఇన్ని విశేషాలు ఉన్న ఈ సినిమా సబ్జెక్టు ఏమిటో కానీ  ట్రైలర్ వినూత్నంగా ఉంది. మీరూ ట్రైలర్ చూడండి. ...
 • జీవిత చరిత్రల్ని సినిమాలుగా తీసే  ట్రెండ్   క్రమంగా  ఊపందుకుంటోంది. తెలుగులోనూ అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు జీవితగాథలతో సినిమాలు వచ్చాయి . ఆ తర్వాత  పరిటాల రవి లైఫ్ రక్తచరిత్ర, వంగవీటి సినిమాల దాకా వచ్చాయి. ఇప్పుడు సావిత్రి, సీనియర్ ఎన్టీఆర్ జీవిత చరిత్రలను తెరపైన ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బయోపిక్‌ను తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  బాలీవుడ్ లో  ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంది. హిందీలో ఇటీవలి ఎంఎస్ ధోనీ అన్‌టోల్డ్ స్టోరీతో బయోపిక్ మేకింగ్ స్పీడ్ అందుకుంది. అంతకుముందు సిల్క్ స్మిత లైఫ్‌ను డర్టీ పిక్చర్ ద్వారా తెరపై మలచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ధోని జీవిత గాథకు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. అలాగే సచిన్ ప్రధాన పాత్ర‌లో రియలిస్టిక్‌గా సచిన్ బయోపిక్‌ను ప్రెజెంట్ చేశారు. అంతకు ముందు మిల్కాసింగ్   జీవిత కథ ను కూడా తీశారు. ఇందిరా గాంధీ బయో పిక్ కూడా రాబోతుంది.  ఇక చిరు బయోపిక్  తీయాలనుకుంటున్నట్టు నటుడు బెనర్జీ  చెప్పారు.. నటులు కావాలనుకునే ఎంతో మందికి చిరంజీవి జీవితం ఆదర్శం. సినిమా ఇండస్ట్రీలో చిన్న అలగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం మహాసముద్రంలా ఉప్పొంగింది. ఆయన జీవితంలో జరిగిన అనేక సంఘటనలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకొంటే ఆ సినిమాను నేనే డైరెక్ట్ చేస్తా అని కూడా బెనర్జీ అన్నారు. . తను నటుడిగా తెరమీద కనిపించక ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాన‌ని, కాబట్టి ఆ సినిమాను బాగానే తీయగలనన్న నమ్మకం ఉందని చెబుతున్నారు. అయితే బయో పిక్ కి చిరు అంగీకరిస్తారో ? లేదో ? చూడాలి. ...
 •  ‘శ్రీరామరాజ్యం’లో సీతగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన నయనతార   ద్రౌపది పాత్రలో నటించబోతున్నారు.  కన్నడలో ‘కురుక్షేత్ర’ పేరిట భారీ చారిత్రాత్మక చిత్రాన్ని కొంతమంది నిర్మాతలు తెరకెక్కించనున్నారు. నాగన్న దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో దుర్యోదనుడిగా దర్శన్‌, కర్ణుడిగా రవిచంద్రన్‌, భీష్ముడిగా సీనియర్‌ నటుడు అంబరీష్‌  నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన ద్రౌపది పాత్ర కోసం పలువురు కథానాయికలను పరిశీలించిన నిర్మాతలు  చివరకు నయనతార అయితే బాగుంటుందని అభిప్రాయపడి ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది .అయితే నయన తార  ఇంతవరకు  నిర్మాతలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ప్రస్తుతం నయన తార  దక్షిణాదిలోని అన్ని భాషా చిత్రాల్లో నటిస్తున్నారు . ప్రస్తుతం ఆమె పదికి పైగా చిత్రాల్లో నటిస్తున్నారు.సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ అవకాశాలు తగ్గుతాయి. కానీ నయనతారకు వయస్సు పెరిగేకొద్దీ సినిమాల అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటికే సూపర్‌ అనే చిత్రం ద్వారా కన్నడ సినీప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మరి కురుక్షేత్రకు  నయన ఎస్‌ అంటారా లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది....
 • హార్రర్‌, మాఫియా కాదంటే  బయోపిక్‌లను తీస్తున్న  వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ  తాజా గా ఎన్టీఆర్ బయోపిక్  తీస్తున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన కలకలం రేపుతోంది.  వర్మ పరిటాల రవి లైఫ్ స్టోరీ పై రెండు భాగాల ‘రక్తచరిత్ర’, స్మగ్లర్‌ వీరప్పన్‌పై ‘కిల్లింగ్‌ వీరప్పన్‌’, వంగవీటి రంగాపై ‘వంగవీటి’ లాంటి చిత్రాలు తీసి, వివాదాలు, వాటికి తగ్గట్లే వసూళ్ళు తెచ్చుకున్నారు.  ఇప్పుడు ఎన్టీయార్‌పై దృష్టి పెట్టారు.   గతంలో ‘రక్తచరిత్ర’లో కానీ ‘వంగవీటి’లో కానీ ఎన్టీయార్‌ పాత్రను సవ్యమైన రీతిలో చూపిన చరిత్ర వర్మకు లేదు. ‘రక్తచరిత్ర’లో శత్రుఘ్నసిన్హాతో ఎన్టీయార్‌ పాత్రను పోషింపజేసిన వర్మ, రాజకీయ హత్యలను ఎన్టీయార్‌ ప్రోత్సహించారన్న రీతిలో చిత్రీకరించడంపై వివాదాలు రేగాయి. అభిమానుల ఆగ్రహానికి గురైన వర్మ చివరకు ఆ సీన్లు తొలగిస్తానంటూ ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ, ఆ సీన్లతోనే థియేటర్లలో సినిమా విడుదల అయింది.  మరి ఇప్పుడు ఈ ఎన్టీయార్‌ బయోపిక్‌లో ఇంకెన్ని వివాదాలు రేపుతారన్నది చర్చనీయాంశమైంది. ఎన్టీయార్‌ అభిమానులు ఇప్పటికే వర్మ ప్రకటనపై భగ్గు మంటున్నారు. ప్రజల మనిషి  ఎన్టీయార్‌ జీవితంతో కాంట్రవర్సీలు ఏమిటని అంటున్నారు. కాగా, ఎన్టీయార్‌ జీవిత చరమాంకంలో ఆయన బాగోగులు చూసిన సతీమణి లక్ష్మీపార్వతి అయితే... వర్మ ప్రకటనపై బాహాటంగానే విమర్శ చేశారు. ‘ఎన్టీయార్‌ జీవిత చరిత్రను వర్మ సమర్థంగా సినిమాగా తీస్తాడనే నమ్మకం నాకు లేదు’ అన్నారు. ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కంటే కమల్ బాగుంటారు అన్నారు. ఇక ఎన్టీఆర్ జీవితం లో జరిగింది జరిగినట్టు తీయడం అంత సులభం కాదు. అది చాలా వివాదాలకు దారి తీస్తుంది. నిజాలు చెబితే పలువురుకి ఆగ్రహమొస్తుంది.  నిజానికి, ఎన్టీయార్‌పై సినిమా తీసేందుకు  ఆయన  తనయుడు హీరో బాలకృష్ణ గత ఏడాది నుంచే సన్నాహాలు చేస్తున్నారు. దానికి దర్శక, నిర్మాతలు ఎవరన్నది ఆయనా ఇప్పటి దాకా ప్రకటించలేదు. దర్శకుడెవరన్నది ఖరారు చేయాల్సి ఉందని చెబుతూ వచ్చారు. కాకపోతే, ‘నాన్న గారి పాత్రను నేనే పోషిస్తాను’ అని ప్రకటించారు. వివరాలతో బాలకృష్ణ పెదవి విప్పక ముందే ఎన్టీయార్‌ బయోపిక్‌ చేస్తున్నానంటూ వర్మ ప్రకటించేశారు. ఇంతకీ వర్మ తీస్తున్న సినిమా .... బాలకృష్ణ చేస్తానన్న సినిమా ఒకటేనా వేరా అన్న అంశంపై కూడా సందేహాలు వ్యక్తమౌతున్నాయి. బాలకృష్ణ స్వయంగా ప్రకటించే వరకు ఈ అంశంపై క్లారిటీ రాదు.  అపుడపుడు సంచలనం కోసం వర్మ కొన్ని ప్రకటనలు చేస్తుంటాడు..  ఆ మధ్య జగన్ తో ఒక సినిమా అన్నాడు ...తర్వాత  నయీమ్ తో అన్నాడు ... మరల  శశికళ తో ఒక సినిమా అన్నాడు ..   ఇవేవి తెర కెక్కలేదు.  కొద్దీ రోజులు ఆగితే కానీ  ఎన్టీఆర్ బయోపిక్ పై వాస్తవమేమిటో తేలదు. ...
 •  “హలో.. మేడమ్”  “హలో .. ఎవరు?”  “సుగుణ మేడమ్ గారేనా?? ‘అమెజాన్’ నుండి మీకో పార్సిల్ వచ్చింది. పెద్ద అట్టపెట్టె".   “తీసుకు వస్తున్నారా?”  “ క్యాష్ ఆన్ డెలివరీ మేడమ్... రెండువేల చిల్లర ఉంది.”  “పర్లేదు తీసుకురండి. పే చేస్తాను”  “ఇక్కడ కస్తూరి బా గర్ల్స్ స్కూల్ అని ఉంది. వెలుగొండ రూట్ లో ఉన్న స్కూల్ .. ఆదేగా?”  “అవును. అక్కడే ఉన్నాను. తీసుకురండి”  “సారి మాం కనీసం 18 కి మీ పైగా రావాల్సి ఉంటుంది. సర్వీస్ గిట్టదు. మీరు సాయంత్రం. టౌన్ లోకి వచ్చినప్పుడు తీసుకుంటారా?”  “నేనయినా ఆ పార్సిల్ ఇక్కడికి తీసుకు రావాల్సిందే. మీరే పంపండి. అడిషనల్ గా పెట్రోల్ ఖర్చు నేను ఇస్తాను” .  డెలివరీ బాయ్ స్కూల్ కి వెళ్ళేసరికి గంట పైన పట్టింది.  పార్సిల్ పెట్టె పెద్దది కానీ బరువు పెద్దగా లేదు.  స్కూల్ కి వెళ్ళే సరికి సుగుణ మేడమ్ గారు క్లాస్ లో ఉన్నారు.  ఆఫీసు లో  డెలివరీ ఇచ్చేసి వస్తుంటే . దూరపు బంధువు కూతురు అక్కడే చదువు తున్న విషయం అతనికి గుర్తొచ్చింది. గ్రౌండ్ లో తోటి పిల్లలతో కలిసి చెట్ల కింద కూర్చుని చదువుకుంటున్న ఆ అమ్మాయిని కలుసుకుని పలకరించాడతను. “అన్నా .. సుగుణ టీచర్ కోసమా? పార్సిల్ తెచ్చావా?” 9 వ క్లాసు చదువుతున్న ఆ అమ్మాయి అడిగింది.  “పార్సిల్ . విషయం నీ కెలా తెలుసు?”  “స్కూల్ లో పిల్లలందరికోసం తెప్పిస్తారు టీచర్ గారు. ఆమె స్వంత డబ్బు తో.. మాకు ఇక్కడ ‘అమ్మ’ ఆమే"   ఆ అమ్మాయి చెప్పింది. ..  “హలో.. బాబూ “  “మేడమ్ చెప్పండి”  “ఇందాక కార్టన్ పెట్టె డెలివరీ ఇచ్చావు.  చిల్లర ఇచ్చేటప్పుడు. పొరపాటున రెండొందలు ఎక్కువ ఇచ్చావు”  “లేదు మేడమ్ కరెక్ట్ గానే ఇచ్చాను. మా చెల్లెలు ఆ స్కూల్ లోనే ఉంది. అంత మంది ఆడపిల్లలకి మీరు నాప్కిన్స్ కొనిస్తున్నప్పుడు. ఒకరిద్దరికి నేను ఇవ్వలేనా? పార్సిల్ డెలివరికి నాకు వచ్చే డబ్బు మేడమ్ అది. మిమ్మల్ని మర్చిపోను మేడమ్. మీరు నాకు గుర్తుంటారు . నమస్తే”...
 • ఆరో అంతస్తులో ఉన్న ఆఫీసుకి రాగానే అతను కిటికీ ఉన్న వెనిషింగ్ బ్లిండ్స్ పక్కకి తొలగించి చూశాడు.  కింద లాన్ లో ఆమె అదే బెంచీ మీద కూర్చుని ఉంది.  అరగంట తర్వాత, మెల్లిగా తన ఆఫీసుకు, తర్వాత తన ఛాంబర్ కి వస్తుంది.  తిరిగి అదే ప్రశ్న వేస్తుంది. “వినయ్ ఎక్కడ?” తను సమాదానానికి పదాలు వెతుక్కుంటాడు. గొంతు సవరించుకుంటాడు.  ఏదో చెబుతాడు. అందులో నిజం లేదని అతనికి, ఆమెకి కూడా తెలుసు.  పది రోజుల నుండి ఇదే జరుగుతుంది.  పది రోజుల క్రితం ఆమె మొదటి సారి తనని కలిసి ఇదే అడిగింది “వినయ్ ఎక్కడ?” “కూర్చుని వివరంగా అడుగుతారా ?” ఆమె మొహం లోని గ్లో ని గమనిస్తూ చెప్పాడు.  “నేను ఆమని. ఎంబీయే చేస్తున్నాను. వినయ్ నాకు గత కొన్నేళ్లుగా తెలుసు. రెండు నెలల క్రితం వివాహం చేసుకోవాలని అనుకున్నాం. తనకి ఎవరు లేరు. మా ఇంట్లో ఒప్పుకోలేదు. ఇంట్లో అన్నీ తెంచుకుని వచ్చేశాను. వినయ్ ఇక్కడే ఐ‌బి‌ఎం లో పని చేస్తాడు. మూడు రోజుల నుండి అతని జాడ లేదు. కంప్లైంట్ ఇచ్చాను. మిమ్మల్ని కలవమన్నారు.” ఆమె కళ్ళు దాచుకుంటూ చెప్పింది. ఆమె మెడలో నల్ల పూసల గొలుసు ఉండటం గమనించాడు అతను.  అతను ఆమెను బయట కూర్చోమని చెప్పి ఇంటర్ కం లో మాట్లాడాడు. తర్వాత ఆమెని పిలిచి “వి విల్ ఫైండ్ ఔట్. వై డోంట్ యు గో హోం ఐ మీన్ టు యువర్ పేరెంట్స్” ఆమె బేలగా చూసింది. “వినయ్ తోనే నా జీవితం. అతను ఎక్కడున్నాడో అర్ధం కావటం లేదు. ఫ్రెండ్స్ కాంటాక్ట్ లో లేడు. అతని వద్ద నుండి’ సీ యు సూన్’ అనే వాట్స్ అప్ మెసేజ్ తప్ప. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఆఫీస్ కి లీవ్ అప్లై చేసి ఉన్నాడు. అతనికి ఏమయినా అయితే నా జీవితం ముగిసినట్టే ”  “డూ నాట్ వర్రీ. వి విల్ ఫైండ్ హిమ్. గివ్ అస్ సం టైమ్. మీన్ వైల్ యు బెటర్ గో హోం ”  **  తలుపు చప్పుడయింది.  ఆ మే .. అదే ప్రశ్న. “వినయ్ ఎక్కడ?”  అతనికి ఏం చెప్పాలో అర్ధమవలేదు.  మొదటి భార్యని చంపిన కేసులో అరెస్టయి రిమాండు లో ఉన్నాడని ఎలా చెప్పాలో అసలు అర్ధం కాలేదు....
 • అతనికి మెలుకువ వచ్చింది. నిజానికి మెలుకువ అనే పదమే కరెక్ట్ కాదు.  అసలు నిద్రపట్టలేదు అనటం సబబు.  గత కొన్నాళ్లుగా తల పోటుగా ఆలోచనలు కానీ  ఇప్పుడు లేదు.  ఎందుకంటే తను నిర్ణయించుకున్నాడు.  తన నిర్ణయం లో ఎలాటి మార్పు ఉండదు.  ** తలగడ కింద చేత్తో తడిమాడు. తను తెచ్చుకున్నది అక్కడే ఉంది.  లోహం తో చేసిన చిన్న డబ్బా.. అది.  మెడలో వేసుకునే తాయత్తు సైజు లో ఉంది.  ఎక్కడ ఉండే వాడు ? ఎంత సౌకర్యంగా ?  అసలు ‘రేపు’ అనే పదానికి భయపడకుండా ?  ** ఎందుకు? అసలు ఎందుకు తన కి పరిస్థితి వచ్చింది. ఆశ .. ఆశేనా ?  అవును ఆశే, ఆశ కూడా కాదు అత్యాశ ,  జూదం మిగులు డబ్బుతో ఆడితే పర్లేదు కానీ ఎక్కడ ఆపాలో తెలీలేదు ??  నిలువుగా మునిగిపోయాడు. ఉన్న డబ్బు అంతా కుమ్మరించేశాడు. ఎంత డబ్బు? లక్షలు, కాదు కాదు రెండున్నర కోటి ?  ఆరేళ్లుగా భార్యా పిల్లలని పట్టించు కోకుండా?  పగలు రాత్రి తేడా లేకుండా, సరయిన తిండి తినకుండా, విశ్రాంతి లేకుండా సంపాదించిన డబ్బు? ఒక్క సారి గా రాష్ట్రం కా ని రాష్ట్రం లో మహాబలిపురం లో ఆరు ఎకరాలు ఎగబడి కొనేశాడు. రెండేళ్లలో రెండు రె ట్లు పెరుగుతాయని ఆశ పడ్డాడు. తన జీవితం మారి పోతుందని కలలు కన్నాడు.  ** ఇప్పుడు ఏమయింది.? లాండ్ మీద సివిల్ వాజ్యం నడుస్తుంది. కోర్టు నోటీసు వచ్చింది. స్టేటస్ కొ ఇచ్చారు.  అమ్మటానికి లేదు. కొనేవాడు లేడు. ** ఎంత డబ్బు ?? ఎంత డబ్బు? మూడు నాలుగు రూపాయల వడ్డీకి కూడా తెసుకెళ్లి ఇన్వెస్ట్ చేశాడు. ఎండా వాన తో సంబంధం లేకుండా వడ్డీలు పెరుగుతున్నాయి. మొత్తం వ్యవస్థ అంతా స్థం భించింది.  ఉన్నవన్నీ అమ్మి కట్టు బట్టల్తో మిగిల్తే  చాలు అనే పరిస్తితి.  తాను ఒట్టి కుండ. గాలిలో దీపం.  ** ఇప్పుడు తనను కాపాడేది. తలగడ కింద ఉన్న తాయెత్తే ..  ఆందులో ఉన్న ‘పొటాషియం సైనేడ్’ ఒక్కటే  నాలుక మీద రుచి తెలిసే లోపు ప్రాణం పోతుంది  అంతా ప్రశాంతం ఏ సమస్యలు ఉండవు.  హాయిగా ఉంటుంది .. హా యి గా .. ** అతను తలతిప్పి మంచం పక్కనే చాప మీద బొంత వేసుకుని పడుకున్నభార్య  రాజ్యాన్ని , పాలు తాగుతూ నిద్రపోతున్న తమ గారాల పట్టి ని గాజు కళ్ళతో చూశాడు.  ఖరీదయినా జీవనం గడిపేటప్పుడు ఎలా ఉందో,  రెండు గదుల ఈ ఇంట్లో కి మారాక కూడా అలానే ఉంది రాజ్యం .  అదే అమాయకత్వం అదే చిరునవ్వు.  తనంటే అదే ప్రేమ అదే నమ్మకం. ** అతడు చెదిరిన రాజ్యం పమిటని తల్లిని హత్తుకు పడుకున్న ‘నైమీ' ని చూస్తుండి పోయాడు. తన కుమార్తె చిన్ని కాలికి ఉన్న వెండి పట్టాల వద్ద అతని చూపులు ఆగి పోయాయి.  బహుశా రాజ్యానికి ఆమాత్రం ‘నగ’ కూడా మిగల్చలేదు. వెచ్చటి కన్నీళ్లు అతని చెంపల నుండి తలగడ మీదకి జారాయి.  అతను తలగడ కింద తడిమి తాను తెచ్చుకున్న డబ్బా అందుకుని లేచి కూర్చున్నాడు. .. హఠాత్తుగా  అతనికి ఒక ఆలోచన వచ్చింది . రేపు ఎలా ఉంటుంది ? రాజ్యం లేసే సరికి తను మంచం మీద నిస్తేజంగా పడి ఉంటాడు.  రాజ్యం ఏం చేస్తుంది? గుండెలు పగిలేలా ఏడుస్తుందా? నైమీ ?? మా నైమీ ?? రాజ్యం ఏడవటం అనే ఆలోచన అతని గాయాన్ని మరింత నలిపింది.  'ఇంటి యజమాని' తన శవాన్ని ఇంట్లో ఉండనిస్తాడా? .. శవం తో పాటు రాజ్యాన్ని .. నైమి ని బయటకి గెంటి ?? అతనికి దుఃఖం  ఆగలేదు  చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవ సాగాడు. *** ఎప్పుడు లేచి వచ్చిందో రాజ్యం అతని పక్కన కూర్చుని ఉంది.  “ఏమయింది బావా ? “ అంది. అతను దుఃఖం  ఆపుకోలేక పోయాడు . . “రాజీ నీకు అన్యాయం చేశాను అంతా కాజేశాను . నేను వెళ్ళి పోతాను”  భార్యని  కరుచుకుని ఏడ్చేశాడు. ** ఆమె అతన్ని పొదివి పట్టుకుంది.  ఎద లోపలి భారం తగ్గేదాకా ఏడవనిచ్చింది. ..  “బావా .. నువ్వు .. చాలు నాకు. .. మనం మళ్ళీ జీవితం మొదలెడదాం. ఎక్కడి కయినా వెళ్ళి పోదాం.  ఇక్కడ అన్నీ అప్పగించేసెద్దాం.  ‘పోలిక’ ఎవర్ని అయినా చంపేస్తుంది.  మనలాటి వారిని ఇంకా త్వరగా చంపేస్తుంది.  మనకి వయసు ఉంది. ఆరోగ్యం ఉంది. దేవుడిచ్చిన కాళ్ళు చేతులు ఉన్నాయి.  ఎంతో కొంత చదువుంది. మనం మళ్ళీ మొదలెడదాం. మనకిప్పుడు మన తప్పులు తెలుసు.కాబట్టి నిలదొక్కుకోవటానికి ఎక్కువ కాలం పట్టదు. మన దగ్గర విలువయిన అనుభవం ఉంది. నిలకడ లేని ఆరాటం పెద్ద జూదం. జూదం ఆడేవాళ్లు ఓటమికి భయపడ కూడదు. ఏ డబ్బయితే ఆరేళ్ళ నుండి నిన్ను మానుండి పరిగెత్తిచ్చిందో అదే డబ్బు మనని ఒకటిగా కలిపింది. బావా .. నన్ను .. మన నైమి ని వదిలి, నువ్వు ఎలా ? “ రాజ్యం అతన్ని చుట్టుకు పోయింది. ఆ సాంగత్యం వాళ్ళిద్దరికి బలాన్ని, భరోసా ని ఇచ్చింది.  ** పక్క మీద 'నైమి' కదిలింది. తండ్రి లేచి పిల్లని ఎత్తుకున్నాడు.  ఆ గదికి ఉన్న చిన్న కిటికీ వద్దకి వెళ్ళి చేతి లో ఇమిడి ఉన్న డబ్బాని బయట కాలవలో పడెట్టు విసిరేశాడు.  .. దూరంగా కొత్త సూర్యుడు చీకటిని ఊచ కోత కోస్తున్నాడు. ......SUSRI ...
 • హ్యారీపోటర్  ఒక సంచలనం.  పు స్తక ప్రేమికులను మంత్రముగ్దులను చేసి  ఓ మాయా లోకంలోకి నడిపించారు రచయిత్రి  జేకే రౌలింగ్. ఓ బాల మాంత్రికుడు అతని ఇద్దరు స్నేహితులు వింత వింత జంతువులతో పోరాడుతూ, మాయలు మంత్రాలతో ప్రదర్శించిన సాహసాల వర్ణనతో బాల సాహిత్యం రూపురేఖలే మారిపోయేలా చేశారు. కథల్లో హీరో హ్యారీపోటర్‌తో పిల్లలు తమను తాము పోల్చుకోవడం ప్రారంభించారు. ఏడు భాగాలుగా వచ్చిన హ్యారీపోటర్ పుస్తకాలు దేశదేశాల్లో సాహిత్య ప్రపంచంలో సంచలనం సృష్టించాయి.  ఆ పుస్తకాలు మార్కెట్‌లోకి వస్తున్నాయని తెలిసిన వెంటనే   పిల్లలు దుకాణాలు ముందు క్యూ కట్టేవారు . ఆ పుస్తకాలకు లభించిన ఆదరణ హాలీవుడ్ నిర్మాతలను  కూడా  ఆకర్షించింది. వార్నర్ బ్రదర్స్ ఆ పుస్తకం హక్కులను చేజిక్కించుకున్నారు. దరిమిలా  వార్నర్ బ్రదర్స్ ఎనిమిది భాగాలుగా విడుదల చేసిన సినిమాలు కనక వర్షం కురిపించాయి.   దాదాపు అన్ని సినిమాల్లో డానియేల్ రాడ్‌క్లిఫ్, ఎమ్మా వాట్సన్, రూపర్ట్ గ్రింట్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాత్రికి రాత్రే జేకే రౌలింగ్‌ను స్టార్ రైటర్‌గా మార్చేసిన కథలు ఆ సినిమాల్లో నటించిన వారికి కూడా అంతే ఆదరణను తెచ్చిపెట్టాయి. రాడ్‌క్లిఫ్ హారీ పోటర్‌గా, ఎమ్మా వాట్సన్ హెర్మియోన్ గ్రాంజర్), గ్రింట్ రాన్ వీస్లేగానటించారు. హ్యారీపోటర్ సిరీస్‌లో చివరి సినిమా హ్యారీపోటర్ అండ్ ది డెత్లీ హాలోస్ రెండోభాగం 2011లో విడుదలైంది. హ్యారీపోటర్ సిరీస్‌తోనే రౌలింగ్ తన రచనను ఆపివేయలేదు. ఆ తరువాత కూడా ఆమె కలం నుంచి ఫంటాస్టిక్ బీస్ట్ అండ్ వేర్ టు ఫైండ్ దెమ్, ది టేల్స్ ఆఫ్ బీడిల్ ది బార్డ్, క్విడ్డిచ్ త్రూ ది ఏజెస్ వంటి అద్భుతమైన కాల్పనిక కథలు వచ్చాయి. వీటిలో కూడా ఫంటాస్టిక్ బీస్ట్స్ ఐదు భాగాల సినిమాగా రూపొందుతుండగా, మొదటి భాగం గతేడాది విడుదలైంది. రెండో భాగంలో జానీ డెప్, జ్యూడ్ లా నటించనున్నారు. "అపుడే   20 ఏళ్ళు అయిందా  ఆ పుస్తకాలు రాసి అంటూ గతాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు రౌలింగ్ . అప్పట్లో ఎడిన్‌బర్గ్‌లోని ఓ కాఫీషాప్‌లో కూర్చొని  హ్యారీపోటర్ జీవనపోరాటం గురించి రాసినప్పుడు నేను ఒంటిరిదానిని. ఇపుడు అందరికి  ఆత్మీయురాలిని. నా పుస్తకాలకు లభించిన ఆదరణ అపూర్వం.  సినిమాలుగా కూడా అవి విజయం సాధించడం  నా అదృష్టం" అన్నారు రౌలింగ్....
 • (సుశ్రీ)     .......     నజీరుద్దీన్ ముల్లా గురించి చదవని పిల్లలు పెద్దలు ఉండరు.  మనిషి లో మానసిక వైకల్యాలకి తనదైన బాణీలో సమాదానం చెప్పటం లో నజీరుద్దీన్ సిద్దహస్తుడు. ఒకసారి ఏమయ్యిందంటే... (కల్పితం) చొరస్తా రచ్చబండ వద్ద కూర్చుని ఉన్నప్పుడు. తమ ఇరుగున ఉండే ‘బడేమియా’__ ‘ఎక్కడయినా డబ్బు లు కాసే చెట్టు ఉంటే బాగుండు’ అన్నాడు. దానికి నజీరుద్దీన్ ‘అలాటి కోరిక మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది’ అన్నాడు. “అందుకే మా పెరేడు లో ఉన్న వింత మారేడు చెట్టు గురించి ఎవరికి చెప్పలేదు . దాని మొదట్లో డబ్బు మూట పెడితే మర్నాటికి రెట్టింపు అవుతుంది.” అన్నాడు. “నిజమా?” బడేమియా అడిగాడు.  "మరి?" “నా దగ్గర ఉన్న వెండి నాణేలు మీ చెట్టు మొదట్లో పాతేస్తాను. రెట్టింపు కాగానే రేపు సాయంత్రం తీసుకెళ్తాను. నజీరుద్దీన్ మనం చాలా కాలం నుండి స్నేహితులం మర్చిపోకు.” అని బ్రతిమాలాడు. కొద్ది సేపు ఆలోచించిన నజీరుద్దీన్ దానికి వప్పుకున్నాడు. “మొత్తం ఎన్ని నాణేలు ఉన్నాయి?” “__________” బడేమియా చెప్పాడు. నజీరుద్దీన్ రెండు నిమిషాలు ఆలోచించి. “నేనా చెట్టుని చైనా నుండి తెప్పించు కున్నాను. బోలెడు ఖర్చు అయింది. అయినా నువ్వు స్నేహితుడివి. కాదనలేను. ఒక ఒప్పందం చేసుకుందాం. ఒక్క సారి చెట్టు మహిమ వాడుకున్నందుకు నాకు 120 నాణేలు కిరాయి చెల్లించాలి” అన్నాడు. బడేమియా సంతోషం గా ఒప్పుకున్నాడు. వెంటనే పరుగున వెళ్ళి తన వద్ద ఉన్న వెండి నాణేలు ఒక మట్టి ముంతలో తెచ్చి చెట్టు మొదట్లో పాతి పెట్టాడు. “రేపు సాయంత్రం నమాజు చేసుకున్నాక వచ్చేయి. నీ డబ్బు తీసికెళ్లి  పోదువు ”. అన్నాడు మర్నాడు సాయంత్రం అనుకున్నట్టుగా అక్కడ దాచిన ముంతలో నాణేలు లెక్కపెట్టి రెట్టింపు అవటం బడేమియా గమనించాడు. సంతోషం పట్టలేక పోయాడు. అనుకున్న ప్రకారం నజీరుద్దీన్ కి 120 నాణేలు ఇచ్చేశాడు. “ఇక సంతోషమేగా?”నజీరుద్దీన్ అడిగాడు. “ఎక్కడి సంతోషం మరో సారి నీ పెరడు వాడు కొనివ్వు అన్నాడు” ‘సరే నీ ఇష్టం.’ నజీరుద్దీన్ అంగీకరించాడు. మర్నాడు రెట్టింపయిన నాణేలు సరిగా లెక్కించుకోకుండానే నజరుద్దీన్ కి 120 నాణేలు చెల్లించాడు. “మరొక్క సారి .. “ మళ్ళీ బడేమియా బ్రతిమాలాడు. “ఇదే చివరి సారి” నజీరుద్దీన్ చెప్పాడు. మూడో రోజు ముంత లో నాణేలు రెట్టింపు అయ్యాయి. బడేమియా నజీరుద్దీన్ కి కిరాయి చెల్లించేసరికి ముంతలో ఏమి మిగలలేదు. నజరుద్దినన్  కి ఇచ్చిన 120 నాణేలు మాత్రమే మిగిలాయి. బడేమియా లబో దిబో మన్నాడు. ఎక్కడో మోసం జరిగింది అని ఏడుపు లంకించుకున్నాడు. మర్నాడు ..పక్క ఊరిలో ఉన్న ‘ముల్లా” (న్యాయం చెప్పే పెద్ద మనిషి) వద్దకి వెళ్ళి మొత్తం గోడు చెప్పుకున్నాడు. ముల్లా నజరుద్దీన్ గురించి విని ఉన్నాడు.  “నీ ఆశే అతని పెట్టుబడి. బుద్ది తెచ్చుకో .. అందరికీ తెలియపరిచి పరువు పోగొట్టుకోకు” ముల్లా సలహా ఇచ్చాడు. బడేమియా పట్టు వదల్లేదు.  అతన్ని విచారించాల్సిందే అని పట్టు బట్టాడు. సరే అతన్ని నా వద్దకి పిలుచుకు రండి అని నౌకర్ని  తోడుగా ఇచ్చి పంపాడు. నజీరుద్దీన్ ఎంత పిలిచినా ఇంట్లో ఉండి బయటకు రాలేదు. బడేమియా తో “నాకు చలి జ్వరం గా ఉంది. చలికి వళ్ళు వణుకుతుంది. నీరసంగా ఉంది. నేను నడవలేను" అన్నాడు.  “నేను దుప్పటి ఇస్తాను. కప్పుకుని నా గాడిద మీద ఎక్కి వచ్చేయి.” బడేమియా అడిగాడు. నజీరుద్దీన్ బయలు దేరాడు.  ** “బడేమియాని మోసం చేశావు. అతని డబ్బు అతనికి తిరిగి ఇచ్చేయ్” అన్నాడు ముల్లా "ఇందులో మోసం ఏముంది నా మారేడు చెట్టు పెరడుని రోజువారీ కిరాయికి ఇచ్చాను. మొదటి సారి సంతోషమేగా? అని అడిగాను కూడా.. ఇతనే అత్యాశ కి పోయి మళ్ళీ మళ్ళీ నాణేలు రెట్టింపు చేసుకున్నాడు. ఇతనే అత్యాశ పరుడు. ఇంకాసేపు ఉంటే నేను ఎక్కివచ్చిన గాడిద, కప్పుకున్న దుప్పటి కూడా తనదే అనేటట్టు ఉన్నాడు.” బడే మియా కి స్పృహ తప్పింది.  ...
 • మనకు తెలిసీ తెలియకుండానే ఎన్నో పురాణ విశేషాలు మన జీవితాల్లో అంతర్భాగాలై నిమిడి ఉన్నాయి. మనకు ఎంతగానో పరిచయమున్న రామాయణ, మహాభారత, భగవద్గీతల వంటివి పురాణాలు కావు. “రామాయణ,” “మహాభారతాలు” ఇతిహాసాలు. కొన్ని పురాణాలలో ఇతిహాస విశేషాల గురించి ప్రస్తావనలున్నా, ఇతిహాసాలు ఒకానొక సమయంలో జరిగిన సంఘటనల తాలూకు విశేషాలతో కూర్చబడినవి.  పురాణాలు మొత్తం పద్దెనిమిది. ఈ పురాణాలన్నీ శ్రీ మహావిష్ణువు స్వరూపంతో సరిపోతాయి. అందుకే  పురాణ పురుషుడని అంటూ ఉంటారు ఆ నారాయణుడిని. అన్ని పురాణాలను రచించినది వ్యాసుడే! పురాణాలలో సర్వశాస్త్రాలు ఇమిడి ఉన్నాయని పెద్దలంతా చెబుతూ ఉంటారు. 18 పురాణాల పేర్లు ... 1. మత్స్యపురాణం 2. కూర్మపురాణం 3. వామన పురాణం 4. వరాహ పురాణం 5. గరుడ పురాణం 6. వాయు పురాణం 7. నారద పురాణం 8. స్కాంద పురాణం . 9. విష్ణుపురాణం 10. భాగవత పురాణం 11.అగ్నిపురాణం 12. బ్రహ్మపురాణం 13. పద్మపురాణం 14. మార్కండేయ పురాణం15. బ్రహ్మవైవర్త పురాణం 16.లింగపురాణం17.బ్రహ్మాండ పురాణం 18. భవిష్యపురాణం.  వీటిలో ఏముందో తెలుసుకుందాం.  మత్స్యపురాణం: మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు. కూర్మపురాణం: కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలోఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది. వామన పురాణం: పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, రుతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.వరాహపురాణం: వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి. గరుడ పురాణం: గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటి, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలుంటాయి. వాయుపురాణం: వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి. అగ్నిపురాణం: అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను తెలుసుకోవచ్చు.స్కాందపురాణం: కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి. లింగపురాణం: లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది. నారద పురాణం: బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. పద్మపురాణం: ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది. విష్ణుపురాణం: పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.మార్కండేయ పురాణం: శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం వుంటాయి. బ్రహ్మపురాణం: బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.భాగవత పురాణం: విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు. బ్రహ్మాండ పురాణం: బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది. భవిష్యపురాణం: సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది. పురాణానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలున్నదే పురాణం అవుతుంది. ప్రధానంగా పురాణానికి అయిదు లక్షణాలను పేర్కొన్నారు. కాలక్రమంలో కొంతమంది పది లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయిదు లక్షణాలలో1) సర్గం 2) ప్రతిసర్గం 3) వంశం 4) మన్వంతరం 5) వంశాను చరితం పురాణానికి ఈ అయిదు లక్షణాలు ఉంటాయని పురాణాలతోపాటు, నిఘంటువులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ అయిదు లక్షణాలు మనకున్న పద్దెనిమిది పురాణాలలో ఒక్కోదానిలో ఒక్కొక్క లక్షణం ఎక్కువగా, మరో లక్షణం తక్కువగా వర్ణితమై కనిపిస్తుంది. ఇక పురాణాల్లో కొన్ని లక్షల శ్లోకాలు ఉన్నాయి.  -----  BHARADWAJA...
 • ఈ ఫొటోలో కనిపించే అరుణ్ కృష్ణన్ వయసు 67 సంవత్సరాలు . ఈ వయసులోనూ సాహాసాలు చేస్తుంటారు.  మలి వయసులోనూ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని విజయాన్ని సొంతం చేసుకుని యువ అథ్లెట్స్‌కు సవాల్ విసిరిన ఖ్యాతి  ఆయనది.  ఇండియన్ ఓల్డెస్ట్ ఐరన్‌మ్యాన్‌గా తన పేరు నమోదు చేసుకున్న అరుణ్ కృష్ణన్ ఆ మధ్య  ఆస్ట్రేలియాలో జరిగిన ట్రియథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్‌లో విజేతగా నిలిచారు.ఈ తరం ఆటగాళ్లు అరుణ్ కృష్ణన్ ను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బలమైన సంకల్పం ... పరిశ్రమ అరుణ్ ను ముందుకు నడిపిస్తున్నాయి. తనకు వయసు వచ్చేసిందని ఆలోచన ఆయనకేమాత్రం లేదు. దూసుకుపోవడమే కృష్ణన్ కి తెలిసింది.   చెన్నైకి చెందిన అరుణ్ కృష్ణన్‌ ఇంజనీర్. బిజినెస్ కూడా చేశారు.  కాలేజీలో చదువుకునే రోజుల్లో స్విమ్మింగ్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. పరుగు ఆయనకు ప్రాణం. 1987 నుంచి ఎన్నో మారథాన్‌లో పాల్గొన్నారు. దేశ, విదేశాలలో జరిగే మారథాన్ పోటీల్లో పాల్గొంటారు. సింగపూర్, పారిస్, చికాగో, బెర్లిన్, టోక్యో మారథాన్‌లలో పాల్గొన్నారు. ఆసియా ఫిసిఫిక్ చాంపియన్ షిప్ సాధించి  హీరోగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. వ్యాపార బాధ్యతలు వేరొకరికి అప్పగించి  ఇపుడు తన కలలను సాకారం చేసుకోవటానికి  బీచ్‌లో పరుగుపెడుతూ ప్రాక్టీస్ చేస్తూంటారు దీక్షగా.  ఆస్ట్రేలియాలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న అరుణ్  అలలు అంతెత్తున ఎగిసిపడుతున్నా ఏమాత్రం భయం లేకుండా 3.8 కిలోమీటర్లు ఈదారు. 180 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. 42 కిలోమీటర్లు పరుగు పెట్టి యువ అథ్లెటిక్స్ సవాల్ విసిరారు. ఇవన్నీ కూడా నిర్ణీత సమయాని కంటే రెండు నిమిషాల 25 సెకెండ్ల ముందే పూర్తిచేయటం విశేషం. ఈయన  ప్రతిభ చూసి వచ్చినవారంతా చప్పట్లతో  ఆయనను హుషారెత్తించారు. కృష్ణన్ గురించి  ఆ దేశ ఛానళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి. అరుణ్ కృష్ణన్ ఎన్నో మారథాన్‌లలో పాల్గొనగా.. ఈ పోటీని ఆయన సవాల్‌గా తీసుకున్నారు. ‘ఈ 67 ఏళ్ల వయసులో ఈ విజయం సాధిస్తానని నమ్మలేదు. కాని మనసు శరీరం మీద ప్రభావం చూపిస్తుందనుకుంటా. మానసిక బలంతో పాటు 24 వారాల శిక్షణ ఈ విజయానికి దోహదం చేసింది’ అని  చెప్పుకొచ్చారు.  ‘ఇండియన్ ఒల్డెస్ట్ ఐరన్ మ్యాన్‌గా జీవితాంతం ఉండాలని భావిస్తున్నాను. ప్రపంచ మారథానర్‌గా పేరొందిన ఫౌజాసింగ్, 70 ఏళ్ల వయసులో మారథాన్‌లలో పాల్గొన్న వైట్లాక్ నాకు స్ఫూర్తినిస్తారు" అంటారు అరుణ్ కృష్ణన్. ...
 • (SIVA RACHARLA)  .............  ఆయన ఒక "నిర్వచనం",ఆయనొక "నిర్మాత",ఆయనొక "ఉదాహరణ",ఆయన భారత రాజకీయ వ్యవస్థకు నిలువుటద్దం... ఆయన "Marxist in practice"... అందరు ప్రధానుల ...  మన రాష్ట్ర ముఖ్యమంత్రుల పేర్లు తడుముకోకుండ ఎంత మంది చెప్పగలరు? జీవితాంతం ప్రతిపక్షంలో వున్నా "ఆ"నాయకుడి" పేరు అధికారంలో ఏపార్టి వున్నా స్మరించటానికి కారణం ఏమిటి? అసెంబ్లీల్లో అధికార...  ప్రతిపక్షాలు గొడవపడ్డ ప్రతిసారి "ఆ"నాయకుడు" ప్రాతినిధ్యం వహించిన సభలో ఇలా గొడవ జరగటం బాధాకరం అనటం వింటుంటాము. ఆమనిషి,ఆనాయకుడు "పుచ్చలపల్లి సుందరయ్య" aka కామ్రేడ్ "P.S" నిన్న మొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిగారికి మంత్రి పదవి రాని సందర్భంలో కూడ నాకు సుందరయ్య స్పూర్తి, రాజకీయల్లో ఎప్పుడు అక్రమపద్దతులు పాటించలేదు అని చెప్పుకున్నారు. కమ్యునిస్ట్ పార్టీలతొ పరిచయం వున్న వారికి పార్టి "నిర్మాణం" అన్నమాట పరిచయం వుంటుంది. రాజకీయ పార్టీల బాషలో "నిర్మాణం" అంటే సిద్దాంతము, రాజకీయ కార్యక్రమము ఒకేలాగ వుండటం.ఇప్పటిలా అధికారం కోసం కప్పలతక్కెడలు,గోడదూకటాలు నిర్మాణాత్మక రాజకీయాలు కాదు. సుందరయ్య స్వతంత్ర భారత పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నేత. ప్రధాని నెహ్రు.. మంత్రులకు అనేక అంశాలలో సుందరయ్య ప్రసంగాలు దారిచూపాయి.సుందరయ్య మాట్లాడుతున్నప్పుడు నెహ్రు స్వయంగా నోట్సు రాసుకునేవారు. ప్రతిపక్ష నేతకు "మంత్రి" హోదా వుంటుంది(ఇప్పటికి కూడ). పార్లమెంటు ప్రతిపక్షనేతగా వుండి కూడ అన్ని సదుపాయాలను వదులుకోని బస్సులొ లేదా స్వయంగా సైకిల్ తొక్కుకుంటునో పార్లమెంటుకు వెళ్లేవారు. సైకిల్ మీద వెళ్ళటం గొప్పతనానికి సంబంధించిన లక్షణం కాదు, వ్యక్తిత్వం. సుందరయ్యగారి ఈవ్యక్తిత్వమే ప్రజలకు దగ్గర చేసింది. ఈవ్యక్తిత్వమే ఎదుటివారు చెప్పే విషయన్ని ఓపిగ్గా వినే లక్షణం తద్వారా వాటి పరిష్కారం కోసం పనిచేసే పద్దతి సుందరయ్య గారి సొంతం అయ్యింది. సుందరయ్య ఓకసారి MPగా, మూడుసార్లు MLAగా పనిచేశారు. అయితే సుందరయ్య చేపట్టిన ఈపదవుల కన్నా ఆయన చేసిన  ప్రతిపాదనలు,చేపట్టిన పనులవలనే చనిపోయిన 32 సంవత్సరాల తరువాత కూడ ప్రజలు స్మరించుకుంటున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత చేపట్టవలసిన పనుల గురించి అనేక రచనలు చేశారు. ఇప్పుడు చెప్పుకుంటున్న నదుల అనుసంధానం గురించి 50వ దశకంలోనే సుందరయ్యగారు ప్రతిపాదించారు. "ఆంధ్రప్రదేశులొ సమగ్ర నీటిపారుదల" అన్న పుస్తకంతో అనేక ప్రాజెక్టులు, నదుల అనుసంధానం గురించి రాశారు. సాయుద తెలంగాణా రైతాంగ పోరాట నిర్మాత సుందరయ్య.4,5 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి  దళాలకు మార్గదర్శకత్వం చేశాడు. తెలంగాణా సాయుధపోరాటం తరువాత ఆఉద్యమ అనుభవాలను "వీర తెలంగాణ విప్లవ పోరా టం గుణపాఠాల" పేరుతో పుస్తకం  రాశారు. సుందరయ్యగారి ఎంత వాస్తవికమో ఇలాంటి పుస్తకాలు తెలియచేస్తాయి. తెలంగాణ సాయుధపోరాటంలో కాని,ఎమర్జెన్సి రోజుల్లో కాని కామ్రేడ్స్, వారి కుటుంబల పట్ల సుందరయ్య చాల జాగర్తలు తీసుకునేవారు. కొండపల్లి కోటేశ్వరమ్మగారు(సీతారామయ్యగారి భార్య) రాసిన "నిర్జన వారధి" పుస్తకంలొ సుందరయ్యది ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వమో తెలియచేసే సంఘటనలు వివరించారు. అజ్ఞాతంలో వున్న దళాలను,వారి కుటుంబ సభ్యులను సుందరయ్య గారు కలిసినప్పుడు...తను ముందుగా భోజనం చెయ్యకుండ గర్భిణిలు,పిల్లలకు భోజనం పెట్టి చివరలొ తను తినేవారు.కారణం నేను వచ్చానని ఈరోజు మంచి భోజనం వండివుంటారు,మీకు రోజు ఇలాంటి భోజనం దొరకదు కదా?ముందు మీరు తినండి అని వారికి భోజనం పెట్టేవారంట సుందరయ్యగారు.దళాలన్ని  ఒకచోట వుండటం వలన ఎదో ఒక భోజనం దొరికేది,నిత్య సంచారి అయిన సుందరయ్యలాంటి నాయకులకు గ్యారెంటి భోజనాలు తక్కువ.అది కామ్రేడ్స్ పట్ల సుందరయ్యగారి ప్రేమ,నాయకుడే త్యాగం చెయ్యాలనే  లక్షణం. 60,70 దశకాలలో  కమ్యునిస్ట్ పార్టీలలోకి డాక్టర్లు,లాయర్లు ప్రవాహంలాగ చేరారు.సుందరయ్యగారు డాక్టర్లను పార్టి full timersగా కాకుండ గ్రామాల్లో వైద్య సేవలు చెయ్యాలని ప్రోత్సహించారు. 1964లొ CPI నుంచి CPM విడిపొయినప్పుడు సుందరయ్యగారు CPM జాతీయ ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు. సుందరయ్యగారి నాయకత్వంలొ CPM "Party Program" documentలొ పార్టి కార్యక్రమాన్ని వివరించారు,ఆ డాక్యుమెంట్ CPM రాజ్యాంగం. భారత దేశంలొ party programను రాసుకున్న ఏకైక పార్టి CPM.. దాన్ని ప్రారంభించి  సుందరయ్యగారు  నేతృత్వం  వహించారు.. సుందరయ్యగారి పోరాటం  ఆయన సొంత ఊరు నెల్లూరు జిల్లా "అలగానిపాడు" నుంచే మొదలయ్యాయి. సుందరయ్య గారి వ్యక్తిగత జీవితం త్యాగాల నిలయం.చిన్న వయసులోనే కులాన్ని వదులుకున్నారు.తన చెల్లెళ్లను  ,ఇతర పిల్లలను హరిజనవాడలో వున్న స్కూల్లొ చదివించారు. అలగానిపాడులొని అంటరానితనాన్ని నిర్మూలించటానికి హరిజనవాడ బావిలోని నీటిని ఊర్లోని అన్ని బావులలో కలిపాడు. ఆయన హాబిల్లొ చదవటం రాయటం ముఖ్యమైనవి. అలగానిపాడులో మొదటి గ్రంధాలయన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వారి ఇల్లు కూడ స్మారక చిహ్నం అయ్యింది. ఆస్తి పంపకాల్లొ వచ్చిన తన వాటా మొత్తాన్ని పార్టికి ఇచ్చేసి,పార్టి ఇచ్చిన అలవెన్సుతో బతికారు.   మాజీ ఎంపీ ,ఎమ్మెల్యేలకు  ఇచ్చే పెన్షన్ కూడ పార్టికి ఇచ్చారు. తన జీవితం మొత్తం ప్రజలకోసం,పార్టీ కోసం పనిచేయా లన్న లక్ష్యంతొ పెళ్ళి చేసుకోకూడదనుకున్నారు.అయితే కామ్రేడ్. లీలాగారు పట్టుదలతో ఆమెను వివాహం చేసుకోవటానికి అంగీకరించారు. సుందరయ్యగారు & లీలాగారు మాట్లాడుకోని పిల్లలు పుట్టకుండ సుందరయ్యగారు ఆపరేషన్ చేయించు కున్నారు. సుందరయ్య & లీలమ్మ ఇద్దరు త్యాగజీవులు. సుందరయ్య ,లీల గార్లకు పిల్లలు లేకుంటే ఏమి?నాలాంటి అనేక మంది వారసులు ... సుందరయ్య త్యాగం,సుందరయ్య దార్శనికత మనకు తెలియకుండనే ఎదో ఒకరూపంలొ మన జీవితం మీద ప్రభావం చూపుతుంది. సుందరయ్యగారి తమ్ముడు డాక్టర్.రామచంద్రారెడ్డి గారు కూడ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారు. డాక్టర్.రాం గారు నేతాజితో పనిచేశారు.నేతాజి డాక్టర్.రాముకు రాసిన ఉత్తరాలు నెల్లూరు జిల్లా ఆఫీసులొ 2001లో చదివాను. CPM డాక్టర్.రాం పేరుతో "రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల"ను నెల్లూరులో నడుపుతున్నారు. సుందరయ్యగారు 19-May-1985న విజయవాడలొ చనిపోయారు. సుందరయ్యగారు మేడే రోజున అంటే 01-May-1913న పుట్టారు. సుందరయ్య "Marxist in practice"...Marxism is not a dogma but a theory to be applied in practice,a guide to action సుందరయ్యను "కమ్యునిస్ట్ గాంధి" అనటం సమంజసం కాదు,అది కొందరు అత్యుత్సాహంతో రాసిన వాడుక.సుందరయ్య,గాంధి రెండు విభిన్న మార్గాలు.ఎవరి మార్గాల్లో వారు గొప్పవారు. సుందరయ్య కమ్యునిష్ట్ కాకుంటే ఏమి అయ్యుండేవారని అడిగిన ప్రశ్నకు "ఈరోజు కాకుంటే రేపో,మరో రోజో సుందరయ్య కమ్యునిష్ట్ అయ్యి వుండేవాడు" అంతేకాని కొందరు  రాసినట్లు కాంగ్రేస్ పార్టి ప్రధానకార్యదర్శో ,మంత్రో అయ్యేవాడు కాదు అని సుందరయ్యగారు సమాధానం ఇచ్చారు. అనేక సినిమల్లో ఉదా త్త రాజకీయనాయకుడి పాత్రకు "సుందరయ్య" అని వుండటం గమనించివుంటారు.నాకు ముఠామేస్త్రిలోని సోమయాజుల పాత్ర గుర్తుంది ,ఈమధ్య కూడ ఎదో సినిమాలో కూడ సుందరయ్య పేరు వాడారు. మాఇంట్లో వుండే ఏకైక రాజకీయ నాయకుడి ఫోటో "సుందరయ్య" గారిది.నాకు తొలి పాఠాలు చెప్పిన పుల్లయ్యగారు,Dr.శాస్త్రిగారు నాకు గురువులు.అందుకే నేను మిత్రులకు చెప్తుంటాను I am from Dr.Sastry school....
 •  (Sheik Sadiq Ali )......................   అదే స్వరం ముప్ఫై ఎనిమిది ఏళ్ళుగా వెంటాడుతోంది. విరహమైనా ,విషాదమైనా, ముంచెత్తే మొహమైనా అది వెంటే ఉంటూ వస్తోంది. ఆరుబయట వెన్నెల్లో నులకమంచం మీద పడుకున్నా, ఏసీ కార్ లో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినా అదే స్వరం .ఇంతకూ ఆ స్వరం ఎవరిది? ఎవర్ గ్రీన్ ..ఆల్ టైం గ్రేట్ లెజెండ్రీ వాయిస్ కిషోర్ కుమార్ ది. దశాబ్దాలుగా దేశ ప్రజల్ని ఉర్రూత లూగిస్తున్న స్వరం. మనిషి మరణించినా అజరామరమైన స్వరం. అతని గొంతులో అంతటి శక్తి ఎలా వచ్చింది? ఎంత ప్రేమను,ఎంత విషాదాన్ని, విరహాన్ని అనుభవిస్తే ఆ శక్తి వస్తుంది? నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న కిషోర్ ప్రేమికుడా?ప్లేబాయా ?పురుష అహంకారా?మదోన్మత్తుడా?విలాస పురుషుడా? అతన్ని ఎలా చూడాలి? యావత్ దేశం మోహించి పలవరించిన అద్భుత అందగత్తె మధుబాల , కళ్ళముందు తటాలున మెరిసే విద్యుల్లత లీనా చందావర్కర్ , మత్తు కళ్ళ యోగితాబాలి, అలనాటి బెంగాలీ సుందరి రూమా ఘోష్ ఆ నలుగురూ అతని భార్యలే.వివిధ దశల్లో అతని జీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళే. అతని స్వరంలోని విషాదానికీ,విరహానికీ,మోహానికీ కారకులు వాళ్ళే. నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న వాడి గురించి ఇంత గొప్పగా రాయాలా సాదిక్? అని అడిగితె నా దగ్గర సమాధానం లేదు. కానీ, సౌందర్యాన్ని ఆరాధించి,అందిన అందాన్ని అర్ధం చేసుకోలేక వ్యర్ధం చేసుకున్న ఒక అద్భుత గాయకుడి జీవితపు చీకటి కోణాలను స్పృశించాలనే ప్రయత్నమే ఈ వ్యాసం. గాయకుడు,నటుడు,దర్శకుడు,నిర్మాత,రచయిత,సంగీత దర్శకుడు,హీరో,కమెడియన్ ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కిషోర్ కు అసంఖ్యాకమైన అభిమానులు ఉన్నారు.మహమ్మద్ రఫీ,ముఖేష్ ల కన్నా కిషోర్ ని అభిమానించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ.హిందీ మాత్రమె కాకుండా మరాఠి,గుజరాతి,కన్నడ ,బెంగాలి భాషల్లో అతను అసంఖ్యాక పాటలు పాడాడు.బాలీవుడ్ లో తన సమకాలీకులందరూ ఈర్ష్య పడేంత రొమాంటిక్ జీవితాన్ని అతను అనుభవించాడు. చూడ్డానికి ప్లే బాయ్ లా కన్పించినా,నిత్యం చిరునవ్వుతో ,సినిమాల్లో నవ్వుతూ ,నవ్విస్తూ ఉన్నా లోలోపల దహించి వేసే బాదే అతనితో విషాద గీతాలు పాడించింది.సౌందర్యం పట్ల ఆరాధన గొప్ప రొమాంటిక్ పాటలని పాడించింది.విషాదాన్ని దాచుకునే ప్రయత్నంలో కామెడీ పాటలు పాడాడు. కిషోర్ కుమార్ మొదటి భార్య రూమా ఘోష్. అందం,చలాకీతనం,అభినయం కలగలిసిన అమ్మాయి.విఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే మేనకోడలు. నటి,గాయకురాలు. 1951 లో వాళ్లకు పెళ్ళయ్యింది. ఏడాదికే కొడుకు అమిత్ కుమార్ (సింగర్) పుట్టాడు. అతనికి ఆరేళ్ళ వయసులో దంపతులిద్దరికీ గొడవలయ్యాయి.గృహిణిగా ఉండి ఇంటినీ, కొడుకునీ చూసుకోమంటాడు అతను. నా ప్రతిభను,సామర్ధ్యాన్ని నాలుగు గోడలకు పరిమితం చేయలేను అంటుంది ఆమె. ఫలితంగా ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమె ఆరూప్ గుహా ను పెళ్ళాడి రూమా గుహ అయ్యింది. ఓపిక ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంది. 2006 లో విడుదలైన బాలీవుడ్ చిత్రం నేమ్ సేక్ ఆవిడ నటించిన ఆఖరి చిత్రం. రెండో భార్య మధుబాల. ఇండియన్ మార్లిన్ మన్రో గా ప్రసిద్ధి చెందిన నటి.అపురూప సౌందర్య రాశి. ఇప్పటికీ అందానికి ప్రతిరూపంగా కవులు,రచయితలూ ఆమె నే ఉదహరిస్తారు. దిలీప్ కుమార్ తో గాఢమైన ప్రేమలో మునిగి,తేలి విఫలమైన మధుబాల కిషోర్ రెండో భార్య అయ్యింది. ఒక పేద ముస్లిం కుటుంబంలో 11 మంది సంతానంలో ఒకరిగా జన్మించిన ముంతాజ్ తన అందం,అభినయంతో సూపర్ స్టార్ మధుబాల అయ్యింది. ఆమె కంటి చూపు కోసం మహామహులు వెంపర్లాడే వారు. అలాంటి అమ్మాయి దిలీప్ తో ప్రేమ విఫలమై కిషోర్ కి రెండో భార్యగా మారింది. ఆమెను పెళ్ళాడటానికి కిషోర్ అష్ట కష్టాలు పడ్డాడు. ఆఖరికి మతం మార్చుకొని కరీం అబ్దుల్ కూడా అయ్యాడు. వారి వైవాహిక జీవితం తొమ్మిది ఏళ్ళపాటు సాగింది. వారికి సంతానం కూడా కలుగ లేదు. హృదయంలో చిల్లుపడి అనారోగ్యంతో మంచం పాలై విషాదకర పరిస్థితుల్లో మధుబాల మరణించింది. ఆ తొమ్మిదేళ్ళ కాలంలో ఆమె నటించలేదు. వైద్యం కోసం లండన్ వెళ్లాలని అనుకున్న ఆమెను కిషోర్ అందుకు అనుమతించ లేదనీ ,వైద్యం అందకే ఆమె మరణించింది అనీ అతనిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. మూడో భార్య పేరు యోగితాబాలి. షమ్మి కపూర్ మొదటి భార్య,అలనాటి హీరోయిన్ గీతాబాలి మేనకోడలు ఈ అమ్మాయి. అప్పట్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. వీళ్ళ బంధం రెండేళ్ళ కన్నా ఎక్కువ కాలం కొనసాగలేదు. వివాహం తర్వాత కూడా నటన కొనసాగించిన యోగితా అప్పుడప్పుడే స్టార్ డం సంపాదించుకుంటున్న మిథున్ చక్రవర్తితో ప్రేమలో పడింది. కిషోర్ కి విడాకులు ఇచ్చి మిథున్ ను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత మిథున్ మన శ్రీదేవి తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు కానీ ,అది కుదరలేదు. అది వేరే కథ. నాలుగో ,ఆఖరి భార్య లీనా చందావర్కర్ . మెరుపు తీగలాంటి సౌందర్యం. ఒక ఆర్మీ అధికారి కూతురు. ప్రముఖ హీరోయిన్ .అపురూపమైన అందం ఆమె సొంతం. ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన సిద్ధార్ధ అనే యువకుడు ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన కొద్దికాలానికే ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి మరణించాడు. 25 ఏళ్ళ వయసుకే ఆమెకు వైధవ్యం వచ్చింది. ఆమె సౌందర్యానికి ముగ్దుడై ఆమెతో ప్రేమలో పడ్డాడు కిషోర్. ఇద్దరి మధ్య వయసు తేడా 21 సంవత్సరాలు.ఇద్దరూ ప్రేమలో పడ్డారు.పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దానికి లీనా తండ్రి ఒప్పుకోలేదు. ఇప్పటికె మూడు పెళ్ళిళ్ళు పెటాకులయ్యాయి. దాదాపు నీ అంత వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. చచ్చినా కోశోర్ కి ఇచి పెళ్లి చేసే ప్రసక్తి లేదు అన్నాడాయన. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న కిషోర్ నానా ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి ఆమె ఇంటి ముందు ధర్నా కు దిగాడు. అప్పట్లో కిషోర్ తను పాడగా పాపులర్ అయిన 'నఫ్రత్ కరనే వాలో కె దిల్ మే ప్యార్ భర్ దూ' పాటను ఆ ఇంటి ముందు పాడుతూ కూర్చున్నాడు. చివరికి లీనా తండ్రి పెళ్ళికి అంగీకరించాడు. అదే కిషోర్ ఆఖరి పెళ్లి. 1980 లో వాళ్లకు పెళ్లి అయ్యింది. 1987 లో మరణించే వరకు కిషోర్ ఆమెతోనే కలిసి జీవించాడు.37 ఏళ్ళ వయసులో ఆమెకు మరోసారి వైధవ్యం ప్రాప్తించింది. ఆ తర్వాత ఆమె వేరేవ్వరినీ పెళ్లాడ లేదు. స్వతహాగా గాయని కూడా అయిన లీనా భర్త మరణం తర్వాత అతని సంగీతాన్ని,పాటల్ని,జ్ఞాపకాలను సజీవంగా ఉంచటానికే కృషి చేస్తోంది. ఆమెతో కిషోర్ కు సుమిత్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు,లీనా,సుమిత్,అమిత్,అతని భార్య, కిషోర్ మొదటి భార్య,అమిత్ తల్లి రూమ గుహ అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అందరికీ కిషోర్ అంటే అమితమైన ప్రేమ,భక్తీ. ఇదీ కిషోర్ వైవాహిక,ప్రేమ జీవితం. అతను తప్పో,ఒప్పో నిర్ణయించే శక్తి నాకు లేదు. కానీ, ప్రేమలో,జేవితంలో అతను ఎదుర్కొన్న అనేకానేక సంఘటనలే అతని స్వరానికి అంతటి మహత్తర శక్తిని ఇచ్చాయని విశ్వసిస్తాను....
 • రెండు తరాలకు ముందు కొంచెం పొలం పుట్రా ఉండి, ఆర్ధిక స్థోమత మెరుగ్గా  ఉన్న వారి ఇళ్లల్లో భోషాణం పెట్టెలు ఉండేవి. విలువైన సామాన్లు,  బంగారం, వెండి వస్తువులు , నగదు అందులోనే దాచే వారు. ఇందులో అరలుంటాయి. వీటిలో రకరకాల సైజులు ఉండేవి. పెద్ద వాటిని భోషాణం అంటారు .  చాలా చిన్న వాటిని  కావిడి పెట్టి, రంగం పెట్టి, రంగూన్ పెట్టి అనేవాళ్ళు. పాత కాలంలో ఆడపిల్ల అత్తవారి ఇంటికి వెడుతూంటే ఆమె వస్తువులు బట్టలు అన్నీ ఇందులో పెట్టుకుని  పట్టుకెళ్ళేది. దీనిని కావడిలో వేసి పట్టుకెళ్ళేవారు సారితో సహా.  ఈ పెట్టెలను స్థోమతను బట్టి మామూలు టేకుతోను, రంగూన్ టేకుతోను చేయించుకునే వారు. కాలక్రమం లో భోషాణాలు పోయి బీరువాలు వచ్చాయి. ఈ తరం లో చాలామందికి భోషాణం పెట్టె గురించి అసలు తెలియదు.  ఇక అసలు కథలోకి వెళ్తే ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీ రామారావు దగ్గర కూడా ఒక పెద్ద సైజు భోషాణం పెట్టె ఉండేది.  అది వారసత్వంగా వచ్చిందట. దాన్ని ఎన్టీఆర్ అపురూపంగా చూసుకునే వారు. ఆ భోషాణం కోసం ప్రత్యేకంగా ఒక గది కేటాయించారు. దానికెపుడూ తాళం వేసి ఉండేదట. లోపల భోషాణానికి ఒక తాళం వేసేవారట. తాళంచెవులను  పొరపాటున కూడా ఎవరికి ఇచ్చేవారు కాదట.  వాటిని  మొలతాడుకి చుట్టుకునే వారట. ఇంతకూ ఆ భోషాణంలో ఏమి ఉండేవంటే డబ్బు ,దస్కం ,నగలు ,నట్రా ఉంచేవారు. ఎన్టీ ఆర్ కి ఒక్కరికే పరిమితమైన వస్తువులన్నీ అందులో ఉంచేవారట. సినిమా తాలూకు పారితోషకం కానీ ఇతరత్రా  ఆయనకు వచ్చే నగదు కానీ అన్ని భోషాణం లోనే దాచేవారట.  వంద నోట్ల కట్టలు ఎక్కువుగా దాచేవారట.ఎన్టీఆర్ కి కొత్త నోట్లు అంటే చాలా ఇష్టమట. అందులో దాస్తే మళ్ళీ బాటకు తీసే వారు కాదట. పాత నోట్లు ఎప్పటికపుడు వాడేసే వారట. అయితే ఎన్టీఆర్ మంచాన పడి కొంచెం కోలుకున్నాక  అబిడ్స్ ఇంటి నుంచి బంజారా హిల్స్ ఇంటికి మారారు . అది చిన్న ఇల్లు కావడం తో  దగ్గరలోనే మరో  స్థలంలో బిల్డింగ్ కట్టించి అందులోకి  ఈ పెద్ద భోషాణం పెట్టెను తరలించారు. అందులోని నగ నట్రా , నగదు  ఇంట్లో ఉన్న బీరువాల్లోకి మార్చేశారు. ఎన్టీఆర్ మరణించిన రాత్రి  ఆ బీరువాల్లోని  నోట్లకట్టలే  సూటు కేసులు ద్వారా బయటకు తరలి వెళ్లాయి . అలా బయటికెళ్లిన సొమ్ములో కొంత మొత్తమే వెనక్కి వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ మ్యూజియం పేరిట ఉన్న భవనంలో ఆ పాత భోషాణం పెట్టె, ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వాడిన చైతన్య రధం, ఇంకా సినిమాల్లో వాడిన కిరీటాలు, గదలు, ఇతర వస్తువులు  భద్రంగా ఉన్నాయి. అది ఎన్టీఆర్ భోషాణం పెట్టె కథ.  inputs by  Tipparaaju Ramesh Babu  ...
 • ఈరోజుల్లో చిన్న కార్పొరేటర్ అయితే చాలు ఎపుడు ఏ ప్రాజెక్ట్ కోసం పైరవీ చేద్దామా అని ఆలోచన చేస్తాడు . అదే ఎమ్మెల్యే అయితే  ఇక చెప్పనక్కర్లేదు. కానీ ప్రజలకోసం ఆలోచించే వాళ్ళు బహు తక్కువ. అలాంటి వారిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  ఒకరు. అయన చాలా సాధారణ వ్యక్తిగా నియోజకవర్గంలో పర్యటిస్తుంటారు. రోడ్డు పక్కనే చిన్నచిన్న టిఫిన్ సెంటర్‌లోఏదో ఒకటి తినేస్తుంటారు.అక్కడే నిలబడి ప్రజలతో మాట్లాడుతుంటారు.ప్రజలకోసం ఏ అధికారి నైనా కలుస్తారు. భేషజాలకు పోరు.  ఏదైనా అన్యాయం జరుగుతుంటే  మాత్రం  ధైర్యంగా పోరాటం చేసేందుకు ముందుకొస్తారు. ఓటుకు నోటు కేసు లో చంద్రబాబు తో పోరాటం సామాన్యమైన విషయం కాదు.  బాబు ఆడియో టేపులను ఫోరెన్సికల్ ల్యాబ్‌కు పంపి అవి నిజమైనవేనని తేల్చుకుని వాటి  ఆధారంగా ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆ విషయం అందరికి తెల్సిందే.  ఇప్పుడు ఎమ్మెల్యే ఆర్కే మరో కొత్త యోచన  చేస్తున్నారు.  పేదలకు  తక్కువ ధరలోనే భోజనం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే హైదరాబాద్  జీహెచ్‌ఎంసీలో అమలవుతున్న ఐదు రూపాయల భోజన పథకాన్ని పరిశీలించారు. హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న భోజన కేంద్రానికి వెళ్లి క్యూలో నిలబడి అందరిలాగే భోజనం చేశారు ఆర్కే. ఈ సందర్భంగా రూ. 5 భోజనం కోసం రావడం వెనుక కారణమేమిటని ఆరా తీయగా.. ఎమ్మెల్యే ఆర్కే తన మనసులో మాట బయటపెట్టారు.  హరే కృష్ణ పౌండేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న రూ. 5భోజన పథకం పనితీరు బాగుందన్నారు. తాను కూడా తన నియోజకవర్గంలోని పేదల కోసం ఇలాంటి పథకాన్నే సొంత డబ్బుతో ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. అందులో భాగంగా ఈ పథకం పనితీరును పరిశీలించేందుకు హైదరాబాద్ వచ్చినట్టు చెప్పారు. రూ. 5 కే మంగళగిరిలోని పేదలకు భోజనం అందించే కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్టు చెప్పారు. తమాషా ఏమిటంటే ఏపీ సీఎం చంద్రబాబు గతంలో అన్నాక్యాంటీన్లు పెడుతామని  హామీ ఇచ్చారు కానీ మర్చి పోయారు. ఇపుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇలాంటి పధకాన్ని ప్రారంభించాలనుకోవడం నిజంగా గొప్పే కదా !...
 • ( Vasireddy Venugopal )..........  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తీసుకున్న నిర్ణయాలు.. భారతదేశానికి నిశ్చయంగా ప్రయోజనం చేకూర్చుతాయి. ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను విధిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు విధిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జాయిన్ కావాలి.. అనేది.. దేశ ప్రజల చిరకాల ఆకాంక్ష. ఆ విధంగా నడుచుకోకపోతే.. ఇంక్రిమెంట్లలో కోత విధించడం, ఇతర ఆర్ధిక ప్రయోజనాల్లో కోత విధించడం.. యోగి తీసుకున్న సాహసోపేత నిర్ణయం. నా మటుకు నేను చాలా కాలంగా... ఇలాంటి విధానం వుండాలని ప్రతిపాదించిన వాడిని. change.org ద్వారా ఆన్ లైన్ పిటిషన్ కూడా వేసి వున్నాను. ఇలాంటి విధానం వుండాలని కోరుతూ సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ విచారణలో వున్నట్టు గుర్తు. యోగి ఆదిత్యనాధ్ తీసుకున్న నిర్ణయం సమర్ధవంతంగా అమలుకావాలని, దేశవ్యాప్తంగా ఆచరించవలసిన విధానంగా, పాలసీగా రూపొందాలని నేను ఆకాంక్షిస్తున్నాను. దీనివల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. 1. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయాలు వున్నాయి. కానీ వాటిని ఉపయోగించుకోవడం లేదు. అనేక సంవత్సరాలుగా వాళ్లు యూనియన్ల శక్తితో పోరాటం చేసి, నేరుగా కార్పొరేట్ వైద్య సదుపాయాలకు అర్హత పొందారు. 2. ప్రభుత్వ ఉద్యోగులు విధిగా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేరాలనే నిబంధన వల్ల, సామాన్య ప్రజానీకానికి ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది. ఉదాహరణకు.. హైదరాబాద్ లో ఒక గాంధీ, ఒక ఉస్మానియా ఆస్పత్రిలో విధిగా చేరడం అనివార్యమైనప్పుడు.. అక్కడ మెరుగైన సౌకర్యాలకోసం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెడతాయి. ఇలాంటి ఆస్పత్రులను అత్యాధునికంగా రూపొందించడం ప్రభుత్వానికి అనివార్యం అవుతుంది. దానివల్ల 100మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనంతో పాటు, 10000 మంది సామాన్య జనం కార్పొరేట్ ఖరీదు వైద్యం బారినుంచి బయటపడతారు. 3. విద్యారంగంలోనూ ఇలాంటి ప్రయోజనాలే సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. జిల్లాకో కేంద్రీయ విద్యాలయ, మండలానికో నవోదయ.. ఇలా అనేక మెరుగైన విద్యా సదుపాయాలు ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా సామాన్యులకూ అందుబాటులోకి వస్తాయి. 4. ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యం పొందడానికి ప్రైవేటు వాళ్లకు వుండే అవకాశం, ప్రభుత్వం వాళ్లకు ఎందుకు వుండరాదు? అని ప్రభుత్వ ఉద్యోగులు అమాయకంగా ప్రశ్నించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రజలు చెల్లించే పన్నులనుంచి చెల్లిస్తున్న వేతనాలు. ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా వుండి, మెరుగైన సేవలు అందించడంకోసం మెడికల్ అలవెన్సులను కూడా సమాజం చెల్లిస్తున్నది. వారి పిల్లాపాపల విద్య, వైద్యారోగ్యాలకోసం కూడా సమాజం చెల్లిస్తున్నది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు విధిగా గుర్తుంచుకొని తీరాలి. కేవలం తమ వేతనాల పెంపుదలకోసమే కాకుండా, తమ మెరుగైన భవిష్యత్తుకోసమే కాకుండా, సమాజం ఉప్పు తింటున్నందుకు గాను ఉద్యోగ సంఘాలు సమాజంకోసం కూడా ఆలోచించాల్సి వుంటుంది. ఆ బాధ్యతనుంచి తప్పించుకోవడం ఎల్లకాలం సాధ్యం కాదు....
 • నీటి వినియోగం శరీరానికి చాలామంచిది . అయితే  నీరు అసలు ఏసమయం లో ఎక్కువ తాగాలి ? ఎప్పుడు తాగకూడడో తెలుసుకోవాలి.  కొన్ని అధ్యయనాల ప్రకారం  మంచినీళ్లను ఖాళీ క‌డుపుతో ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా తాగాల‌ట‌. అయితే.. ఖాళీ క‌డుపు ఎప్పుడుంటుంది? అంటే ఉదయాన్నే నిద్ర లేచినపుడు  క‌డుపు ఖాళీ గా ఉంటుంది. అప్పుడు ఎక్కువ‌గా నీళ్లు తాగ‌డం వ‌ల్ల అనేక ఫ‌లితాలు ఉంటాయట‌. క‌డుపు ఖాళీగా ఉన్న‌ప్పుడు జీర్ణాశ‌యానికి రెస్ట్ దొరుకుతుంది. ఆ స‌మ‌యంలో జీర్ణాశ‌యంలో ఎటువంటి ర‌సాలు విడుద‌ల కావు. ఆ స‌మ‌యంలో నీళ్లు ఎక్కువ మోతాదులో తాగ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం మొత్తం శుభ్ర‌మ‌వ‌డ‌మే కాకుండా... ఆ నీళ్లు పేగుల‌ను కూడా క్లీన్ చేస్తాయ‌ట‌.  శరీర మెటబాలిక్ రేటు 24 శాతం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చయ్యే రేటు పెరుగుతుంది. తద్వారా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.  శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.   జీర్ణ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం బాధించవు. ప్రధానంగా మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. విరేచనం సులభంగా అవుతుంది. ఆకలి పెరుగుతుంది. తలనొప్పి సమస్య నుంచి బయట పడవచ్చు.  ఇంకా  శరీరానికి అందే శక్తి పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు పెరిగి ఎక్కువ ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. కనుక శరీరానికి ఎక్కువగా శక్తి అందుతుంది.  చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి.  జీర్ణాశయం, పేగుల్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. మంచి బాక్టీరియా పెరుగుతుంది. అందుకే  పెద్దలు నిద్ర లేవగానే మంచి నీళ్లు తాగమంటారు.  ఇక‌... చాలా మంది అన్నం తినేట‌ప్పుడు, తినే ముందు కూడా నీళ్లు తాగుతారు. అయితే... ఏదైనా ఆహారం తీసుకోవ‌డానికి ఒక అర్ధ‌గంట‌ ముందు నీళ్లు అస్స‌లు తాగ‌కూడ‌ద‌ట‌. ఎందుకంటే ఆక‌లేసే స‌మ‌యంలో జీర్ణాశ‌యంలో జ‌ఠ‌ర‌ర‌సాలు విడుదల  అవుతాయి. అప్పుడు నీళ్లు తాగితే ఆ ర‌సాలు నీళ్ల‌తో క‌లిసి పోతాయి. దాంతో  అల్స‌ర్, గ్యాస్ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అందుకే.. అన్నం తిన‌డానికి అర్ధ‌గంట ముందు, అర్ధ‌గంట త‌ర్వాత, తినేట‌ప్పుడు కూడా నీళ్లు తాగ‌కూడ‌దంటారు పెద్ద‌లు.
 • ఇంతవరకు మనం సోలార్‌ లైట్లు, సోలార్‌ పంపుసెట్లు, సోలార్‌ వాహనాల గురించే విన్నాం. ఇపుడు    కొత్తగా  సోలార్‌ చికెన్‌ వెలుగులోకి వచ్చింది. థాయిలాండ్‌ లో సోలార్ పాపులర్ ఫుడ్ ఐటెం గా మారుతోంది .   ఎవరైనా చికెన్‌ను అగ్గి మీద కాలుస్తారు లేదా స్టవ్‌ మీద రెడీ చేస్తారు కానీ థాయిలాండ్‌లోని సిలా సుతారట్‌ అనే దుకాణాదారుడు మాత్రం  ఓవెన్‌ లేదా చార్‌కోల్‌ బార్బెక్యూ వాడేందుకు బదులుగా 1000 మొబైల్‌ మిర్రర్లను ఉపయోగించి  సూర్యుని నుంచి వచ్చే బలమైన కాంతిని ఆ అద్దాలపై పడేలా చేసి తద్వారా వచ్చే వేడితో చికెన్‌ను తయారు చేస్తున్నాడు. ఒకటిన్నర కేజీ  చికెన్‌ను 10–15 నిమిషాల్లో వండేస్తున్నాడు.  ఆ వేడిని తట్టుకునేందుకు ముఖానికి వెల్డింగ్‌ మాస్క్‌ను ధరిస్తాడు. మెల్లగా మెల్లగా ఇతగాడి బిజినెస్ పుంజుకుంటోంది. 
 • రాగులు తినండి …...వయసు తగ్గించుకోండి..రాగాలు తీయండి రుచులు మార్చుకున్నారు..డాలర్ల రేటు విపరీతంగా పెరిగింది అభిరుచులు మార్చుకున్నారు.అనారోగ్యానికి దగ్గరయ్యారు ఆఫీసులో కావచ్చు…వ్యాపార సంస్థల్లో కావచ్చు….లేదా టీవీ ముందు కావచ్చు. రోజుకు 14 గంటలపాటు కూర్చుని లేదా పడుకుని ఉంటున్నారు చాలామంది. అలాంటివారు గుండె జబ్బులు, ఇతర వ్యాధుల బారిన కూడా పడతారు. రాగులను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు. మిల్లెట్ అనే  యాంటీ ఆక్సిడెంట్లు  రాగుల్లోపుష్కలంగా ఉంటాయి. అందువల్ల యాంటీ  ఏజింగ్ కు చెక్ పెడుతుంది. వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు. రాగుల్లో అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇంకా రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలకర్ధకమైన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది.  రాగిపిండితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.  జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల బాగుంటుంది.నడి వయసు మహిళ్లో ఎముకల పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్ ను తాగడం మంచిది. సాధారణంగా రాగులతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని నేచురల్ గానే సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఆందోళన,వ్యాకులత,నిద్రలేమి పరిస్థితులను దూరంచేస్తుంది. రాగి మైగ్రేన్  సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. మధుమేహవ్యాధికి రాగులతో చేసిన ఆహారపదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది.  రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగి మాల్టును తాగడం మంచిది.  పాశం జగన్నాధం 
 • టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి విన్నాం..కానీ టెస్ట్ ట్యూబ్ చికెన్ ఏంటీ అనుకుంటున్నారా ?  మీరు చదివింది నిజమే.త్వరలో టెస్ట్ ట్యూబ్ చికెన్ .. ఫుడ్ మెనూలోకి చేరబోతోంది. పరిశోధకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. చికెన్ రెసిపీ నుంచి కణాలు తయారుచేసి టెస్ట్ ట్యూబ్ చికెన్ తయారుచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టెల్ అవివ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అమిత్ గెఫెన్ ఇప్పటికే లాబొరేటరీలో చికెన్ కణాలతో ఈ ప్రయోగం చేస్తున్నాడు. మోడ్రన్ అగ్రికల్చర్ ద్వారా ఈ చికెన్ సెల్స్‌తో దీన్ని తయారుచేసేందు కూడా ప్లాన్ చేస్తున్నారట. రాబోయే నాలుగు సంవత్సరాలలో ఈ తరహా చికెన్ సూపర్ మార్కెట్లలోకి వస్తుంది. మొత్తం మీద లెక్కకు మించి జనాభా  పెరిగిపోతున్ననేపథ్యంలో  నాన్ వెజ్  రుచుల అవసరాలు తీర్చాలంటే ఇక  టెస్ట్ ట్యూబ్  ఫుడ్డే దిక్కు. టెస్ట్  ట్యూబ్ హాంబర్గర్స్  వరల్డ్ మార్కెట్లో ఆదరణ పొందిన క్రమంలో చికెన్ కు కూడా ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.  ఒకసారి  టెస్ట్ ట్యూబ్ చికెన్ మార్కెట్లోకి  వచ్చిందంటే పౌల్ర్టీల దగ్గర,  చికెన్ షాపుల దగ్గర వెయిట్ చేసే  అవసరం ఉండబోదు. 
 • అసలు కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా?  మీ శరీరానికి ఎలాంటి హాని తలబెడుతుందో తెలుసా?  *కూల్ డ్రింక్ తా గిన 10 ని మిషాలకు: * కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చెక్కర తింటే వాంతులు అవుతాయి. కాని కూల్ డ్రింక్ లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది.  *కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాలకు: * కూల్ డ్రింక్ లో ఉన్న షుగర్ ను మన లివర్ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వు గా మారి బరువు పెరుగుతారు.  *కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాలకు: * రక్తంలోకి షుగర్ ను పంపియడం కొనసాగుతుంది. కూల్డ్రింక్ లో ఉండే కెఫిన్ మెల్లమెల్లగా మీ శరీరంలో నిండుతుంది. దీనితో మీ రక్త పోటు పెరిగి, మీ కంటి పాపలు చిన్నగవుతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువ హాని చేయదు, అలా అని ఎక్కువ మోతాదులో దీనిని సేవించినా ప్రమాదమే. అందుకే చిన్న పిల్లలను కూల్ డ్రింకులకు ఎంత దూరం పెడితే అంత మంచిది.  *కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు: * ఇప్పుడు మీ శరీరం డోపమైన్ అనే ఓ కెమికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టే. *కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలకు: * గంట తరువాత, మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ మీ చిన్న పేగులలో చేరడంతో, అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డు కట్ట వేస్తుంది. దీనితో తరచుగా మూత్రవిసర్జన జరడంతోపాటు, డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి. మన శరీరానికి ఇంతలా హాని తలబెట్టే కూల్ డ్రింక్ తాగడం మనకు మన పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండడమే మంచిది.  whats app message 
 • అధిక రక్తపోటుతో బాధపడే రోగుల సంఖ్య ప్రపంచంలో నానాటికీ పెరుగుతోంది. గడచిన 40 ఏళ్లలో హైబీపీ రోగుల సంఖ్య దాదాపు రెట్టింపైందని తేలింది.  ‘ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్’ శాస్తవేత్తల  నేతృత్వంలో ఓ అధ్యయనం  ఈ విషయం వెల్లడైంది. 1975-2015 మధ్య వివిధ దేశాలలో రక్తపోటు అంశంలో మార్పులపై ఈ అధ్యయనం  జరిగింది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడి అయ్యాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ, వివిధ దేశాలకు చెందిన వందలాదిమంది శాస్తవేత్తలు  కలసి దాదాపు 2 కోట్లమంది నుంచి రక్తపోటుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఈ పరిశోధనలో కనుగొన్న విషయాలను ప్రఖ్యాత జర్నల్ ‘ద లాన్ సెట్’లో పబ్లిష్ చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హై బీపీ తో బాధపడుతున్న వారి  సంఖ్య 113 కోట్లు. ఇక ఇండియా లో వీరి సంఖ్య 20 కోట్లు అని తేల్చారు.  ఈ స్టడీ  ప్రకారం అత్యధిక ఆదాయం ఉన్న దేశాల్లో రక్తపోటు కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అతితక్కువ, మధ్యతరహా ఆదాయం ఉన్న దేశాల్లో అధిక రక్తపోటు కేసులు  పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో వీటి నమోదు ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తేల్చింది. 2015 సంవత్సరానికి సంబంధించినంతవరకూ యునైటెడ్ కింగ్‌డమ్‌లో అతి తక్కువ హై బీపీ  రోగులున్నట్లు తేలింది.  ప్రపంచంలో అతి తక్కువ స్థాయిలో అధిక రక్తపోటు బాధితులు నమోదైన దేశాల్లో దక్షిణ కొరియా, యుఎస్‌ఎ, కెనడా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 1975లో సంపన్నులనే అధిక రక్తపోటు ఎక్కువగా వేధించేది.  ఇప్పుడు పూర్తిగా విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సీనియర్ ప్రొఫెసర్ మజిద్‌ఎజ్జతి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ సమస్య పేదవారిలోనే ఎక్కువగా కనిపిస్తోందట.  ఈ పరిణామానికి అసలు కారణం తెలియకపోయినా పండ్లు, కూరగాయల వినియోగం పెరగడం వల్ల, అవి కొనే శక్తి సంపన్నులకు ఉండటం మూలానా అధిక రక్తపోటు ముప్పు వారికి తప్పుతోంది.  పేదలకు పౌష్టికాహారం లోపించడం వల్ల  బీపీ సమస్యగా మారింది.  అధిక రక్తపోటు రావడానికి కారణమైన ఊబకాయం సమస్యను ఎదుర్కొనే విషయంలో సంపన్న దేశాలు ముందున్నాయి.   మహిళల్లో కన్నా పురుషుల్లోనే అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా అత్యధిక దేశాల్లో ఉన్నట్లు ఈ పరిశోధనల్లో తేలింది. 2015లో ప్రపంచవ్యాప్తంగా 52.9 కోట్లమంది మంది మహిళలు అధిక రక్తపోటుతో బాధపడితే , హైబీపీ బారిన పడ్డ  పురుషుల సంఖ్య 59.7 కోట్లు. హైబీపీ రోగుల్లోని పెద్దవారిలో సగానికి సగం మంది ఒక్క ఆసియాలోనే ఉన్నారని తేలింది. వీరిలో 22.6 కోట్ల మంది చైనాలోను, 20 కోట్లమంది భారత్‌లోనూ ఉన్నారు. అధిక రక్తపోటువల్ల గుండె, మెదడు, మూత్రపిండాల్లోని రక్తకణాలు, నాళాలపై ఒత్తిడి పెరుగుతుందని, గుండెపోటు, పక్షవాతం రావడానికి ప్రధాన కారణం ఇదేనని పరిశోధన తేల్చింది. ఏటా రక్తపోటు కారణంగా ఇలా చనిపోతున్న వారి సంఖ్య 75 లక్షలు. మగవారిలో అధిక రక్తపోటుతో బాధపడేవారు క్రొయేషియాలో అధికంగా (దేశ జనాభాలో 38 శాతం), మహిళల్లో నైజిరియా (36శాతం) తొలిస్థానాల్లో ఉన్నాయి. 1975 నాటి రక్తపోటు గణనకు సంబంధించిన పరికరాల్లో లోపాలు, సబ్‌సహారా, కరేబియన్ దేశాల్లో సమాచార సేకరణలో ఉన్న అవాంతరాల దృష్ట్యా ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులున్నాయని శాస్తవ్రేత్తల బృందం పేర్కొంది. వెల్‌కమ్ ట్రస్ట్ నిధులతో ఈ అధ్యయనం నిర్వహించారు. కాబట్టి హై బీపీ ఉన్న వారు  వెంటనే నివారణ చర్యలు  చేపట్టడం మంచిది.
 • ఈ ఫొటోలో కనిపించే అమ్మాయి పేరు టిఫెనీ బ్రార్.  పుట్టు అంధురాలు. అందుకు ఏరోజు ఆమె చింతించలేదు. మౌనంగా శోకిస్తూ కూర్చోలేదు . తన తోటి వారి కోసం పాటుపడాలని నిర్ణయించుకుంది. చీకటి ప్రపంచంలో కూడా  దీపమై వెలుగులు పంచొచ్చని నిరూపించింది.  చిన్నతనం నుంచి అంధుల కోసం వారి హక్కుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నది. జ్యోతిర్గమయ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి తనలాంటి అంధులకు ఉపాధి కల్పిస్తున్నది. సమాజంలో జరుగుతున్న వాటికి స్పందిస్తూ దివ్యాంగులను చైతన్య వంతుల్ని చేస్తోంది. టిఫెనీ పుట్టింది తమిళనాడులోని చెన్నూర్‌లో.. తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పెరిగింది. మంచి మేధాశక్తి ఉన్న టిఫెనీ ఐదు భాషల్లో గలగలా మాట్లాడుతుంది.  ఇంగ్లీష్ లిటరేచర్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత ఓ స్వచ్ఛంద సంస్థలో వలంటీర్‌గా చేరి దేశవ్యాప్తంగా చాలా ప్రదేశాలు తిరిగింది. కొన్నాళ్ల తర్వాత  సొంతంగా స్వచ్ఛంద సంస్థను మొదలుపెట్టింది. ఓ వైపు పనిచేస్తూనే కోయంబత్తూర్‌లోని మిషన్ వివేకానంద యూనివర్సిటీ నుంచి ప్రత్యేక విద్యలో బీఈడీ కూడా పూర్తి చేసింది. అంధుల కోసం మొబైల్ స్కూల్ నడుపుతున్నది. ఈ ప్రపంచాన్ని చూడలేని ఎంతోమంది అభాగ్యులకు ఫోన్‌లో పాఠాలు చెప్తున్నది. 2016లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఎర్త్ అవర్ కార్యక్రమానికి అంబాసిడర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది.  అంధత్వం ఉన్నవాళ్లు ఏదైనా సాధించగలరు.. సాధించాలనే తపనకు వైకల్యం అడ్డు కాదని టిఫెని కలిస్తే అర్థమవుతుంది. వేలమందిలో వక్తగా అందరితో చప్పట్లు కొట్టించుకోగల శక్తి ఉన్న మంచి వక్త. అంధులు ఆడలేని ఆటల్లో ప్రావీణ్యం సంపాదించి ఆశ్చర్యపరిచింది. పారాగ్లిడింగ్, స్కై డైవింగ్, రోప్ క్లెయింబ్లింగ్  వంటి క్రీడలు ఆడి ముక్కున వేలేసుకునేలా చేసింది. టిఫెని అంధులు కరెన్సీని గుర్తుపట్టేలా ఒక టెంప్లెట్ తయారు చేసింది. ఇది అంధులకు ఎంతో మేలు చేస్తుంది. అంధుల కోసం ఎంతో చేస్తున్న టిఫెని కేవలం అంధులకే కాదు.. అందరికీ ఆదర్శం. వైకల్యం ఉన్న వాళ్లు కూడా ఏదైనా సాధిస్తారనడానికి టిఫెని నిదర్శనం. వైకల్యం పట్ల చింతించకుండా ధైర్యం తో దూసుకుపోతే తిరుగుండదని చెబుతుంది టిఫెనీ.  టిఫెనీ సేవలు  గుర్తించి ఎందరో ప్రోత్సాహం అందించారు.  ఎన్నో అవార్డులు, రివార్డులతో సత్కరించారు. కేరళ స్టేట్ యూనివర్సిటీ డిసెబులిటీ అవార్డు అందించి ప్రశంసించింది....
 • గంజాయి కి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్‌ నేపథ్యంలో ఏపీలో గంజాయి సాగు విస్తృతంగా సాగుతోంది. ప్రధానంగా తూర్పు-విశాఖ ఏజెన్సీలో గంజాయి మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. సాధారణ మానవుడు వెళ్లలేని నట్టడవిలో వీటి సాగు వేల ఎకరాల్లో నిరాటంకంగా కొనసాగుతోంది. పంట చేతికొచ్చాక ఎంచక్కా తుని-అనకాపల్లి రైల్వే స్టేషన్ల నుండి రైళ్లలోనే తరలిపోతోంది. డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తున్నారు.  ఆ ఏజెన్సీ మొత్తం గంజాయి కొండగా మారిపోయిందని అంటున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో  అత్యధికంగా గంజాయి సాగు చేసే ప్రాంతం ఇదేనని అధికారులు కూడా  చెబుతున్నారు.  ఈ ప్రాంతంలో దాదాపు 10 వేల ఎకరాలలో గంజాయి సాగు చేస్తున్నట్టు అధికారుల అంచనా. విశాఖలో 85శాతం, తూర్పులో 15శాతం, కడప, రాయలసీమల్లో 5శాతం సాగవుతున్నట్టు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. విశాఖలో చింతపల్లి, పాడేరు, జి.మాడుగులతోపాటు మొత్తం 8 మండలాల్లో, తూర్పుగోదావరి జిల్లాలోని వై.రామవరం మండలం పరిధిలో గుర్తేడు తదితర ప్రాంతాల్లో గంజాయి సాగవుతోంది. కేరళ, తమిళనాడుకు చెందిన వ్యక్తులు గిరిజనులను అడ్డుపెట్టుకుని గంజాయి సాగు చేయిస్తున్నారు.చింతపల్లి, లంబసింగి, పాడేరు, జి.మాడుగుల ప్రాంతాల్లో ఇది అధికం. సీడ్‌, పెట్టుబడి కూడా వ్యాపారులే సమకూరుస్తున్నారు.  ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన పెట్టుబడి దారులు నర్సీపట్నం, పాడేరు లాడ్జిల్లో దిగి బ్రోకర్ల సహకారంతో స్టాక్‌పాయింట్లు ఎంపిక చేస్తారు. ఏజెన్సీలో సాగుచేసే గంజాయి పేరు శీలావతి. దీని నిషా నషాళాన్ని అంటుతుంది. పైగా దిగుబడి కూడా అధికం. రైతుల వద్ద కిలో రూ.3వేల నుంచి 5వేల వరకూ కొంటారు. సాగు చేసిన ప్రాంతం నుంచి గిరిజనుల తలపై పెట్టి మోయిస్తున్నారు. స్టాకు పాయింట్లకు వచ్చాక దళారులు తీసుకుని స్మగ్లర్లకు ఇస్తుంటారు. గంజాయి రవాణాకు తుని, అనకాపల్లి రైల్వేస్టేషన్లు ప్రధాన కేంద్రాలుగా గుర్తించారు. ఇవి కాకుండా గంజాయి రవాణాకు అనేక దారులున్నాయి. గతంలో లారీల ద్వారా రవాణా చేసేవారు. ఇవాళ పైన ఒక సరుకు పెట్టి కింది భాగాల్లో గంజాయికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సరీ మొక్కల కింద, ధాన్యం బస్తాల కింద, ఖరీదైన కార్లలోనూ రవాణా చేస్తుంటారు.  సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇటీవల దేశంలో సీజ్‌ చేసిన సరుకును లెక్కకట్టారు. కానీ అందులో 14శాతం మాత్రమే ధ్వంసం చేశారు. మిగతా 86 శాతం ఏమైందనేది ప్రశ్న. అది తిరిగి బయటకు మార్కెట్‌కు పోతుందేమోననే అనుమానాలూ ఉన్నాయి.  ఎక్కువ మందిని పట్టుకున్నప్పటికీ శిక్షల నుంచి తప్పించుకుంటున్నారు. వీరికి కొందరు అధికారులు కూడా సహకరిస్తున్నారనే ప్రచారం ఉంది....
 • గుంటూరు జిల్లా కేంద్రం లో వ్యభిచారం  మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.  ఎందరో మహిళల జీవితాలు వ్యభిచార కూపాల్లో  కొట్టుమిట్టాడుతున్నాయి. రాజకీయ పలుకుబడులు, బడాబాబుల అండదండలు ఉన్న కొందరు వ్యక్తులు మహిళల అవసరం, ఆర్థిక ఇబ్బందులు, నిస్సహాయతను అదునుగా తీసుకుని ‘సెక్స్‌ రాకెట్‌’లోకి దింపుతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు పరిసర పట్టణాల్లో ఇంకా వెలుగు చూడని వాస్తవాలు ఎన్నో ఉన్నాయి. బయటకు చెప్పుకోలేక కొందరు.. బయటకు చెప్పిన తర్వాత వేధింపులకు తాళలేక మరికొందరు. ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు.  పలువురి మహిళల జీవితాలు చీకటి గృహాల్లోనే మగ్గిపోతున్నాయి. వీరిలో తెలిసి తప్పులు చేస్తున్న వారు ఉండొచ్చుగాక.. కానీ పరిస్థితుల ప్రభావంతో ఈ రొంపిలోకి దిగన వారూ లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ పోలీస్‌ యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకోకపోవడంతో  వ్యభిచారం ఆధారంగా బడాబాబులు ఈ వ్యాపారాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఇక  మహిళలు పట్టుబడిన తర్వాత వారి పునరావాసం కూడా ప్రశ్నార్ధకంగా మారుతోంది.  గుంటూరు నగరంలో ఒకప్పుడు కొత్తపేటకు పరిమితమైన వ్యభిచారం అరండల్‌పేట, పట్టాభిపురంలోని నివాస  ప్రాంతాలు, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అపార్టుమెంట్లు, నగర శివారులు, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో వ్యభిచార వ్యాపారం  జోరందుకుందని సమాచారం. వ్యభిచార గృహాలకు చుట్టుపక్కన ఉన్నవారు 100కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా అప్పటికప్పుడు రైడింగ్‌లు చేసి పట్టుబడిన వారిని అరెస్టు చేస్తున్నారే తప్ప వెనక ఉన్న పెద్ద తలకాయలను పట్టుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కొద్దీ రోజుల క్రితం గుంటూరు కొత్తపేటలోని శనక్కాయల ఫ్యాక్టరీ సమీపంలోని ఓ భవనంలో వ్యభిచారం నడుస్తోందని పోలీసులకు సమాచారం ఇస్తే.. వారు అక్కడికి వచ్చి ఫిర్యాదు ఇచ్చిన వారికి, నిర్వాహకులకు మధ్య రాజీ కుదిర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. కఠినంగా వ్యవహరించాల్సిన సమయంలో కూడా రాజీ మార్గాలు వెదుకుతుండటం, డబ్బుకు ఆశపడి చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు ఇప్పటికే పోలీస్‌ వ్యవస్థ పై ఆరోపణలు ఉన్నాయి.  ఎస్పీగా సీతారామాంజనేయులు, సజ్జ నార్ , ఏఏస్పీగా భావనా సక్సేనా... డీఎస్పీగా రవీంద్రబాబు  ఉన్నప్పుడు వారు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరీ దాడులు చేయించారు. సమస్యల మూలాల దాకా వెళ్లి విచారణ చేపట్టారు. పట్టుబడిన వారిపై, నిర్వాహకులపై కఠిన చర్యలూ తీసుకున్నారు.కొన్ని లాడ్జీలను సీజ్ చేశారు .  ఆ తర్వాత వచ్చిన వారు పట్టించుకోకపోవడంతో ‘సెక్స్‌ రాకెట్‌’ తన పరిధుల్ని విస్తరించుకుంటోంది. ఎవరూ పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో రౌడీ షీటర్లు, రాజకీయ నాయకుల పలుకుడి బడి ఉన్న వారు కూడా వ్యభిచారాన్ని వ్యాపారంగా ఎంచుకుంటున్నారు . ఇప్పటికైనా పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు, ఎస్పీలు స్పందించి సెక్స్‌ రాకెట్ల ఆగడాలను ఆరికట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు....
 • భూమి చరిత్రలో ఆరో వినాశనం దగ్గర్లోనే  ఉందని  శాస్త్రవేత్తలు  చెబుతున్నారు . ఇప్పటి వరకూ ఊహించిన దాని కంటే ఇది తీవ్రంగా ఉండవచ్చని అంటున్నారు.  అందుకు పలు ఆధారాలను చూపుతున్నారు. జనాభాతో పాటు, పర్యావరణానికి హాని కలిగించే వస్తు వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయని  చెబుతున్నారు.   ఇప్పటికే వందలాది కోట్ల ప్రాంతీయ, స్థానిక జీవజాతులు అంతమయ్యాయి.  నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. భూమిపై వందలాది కోట్ల క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయ చరాలు కనుమరుగు అయ్యాయని, ఈ కారణంగానే ఇప్పటికే ఊహించిన దానికంటే వేగంగా ఆరో సమూహ వినాశనం సమీపంలోకి వచ్చేస్తోందనే నిర్ధారణకు వచ్చామని శాస్త్రవేత్తలు అంటున్నారు . జీవ వైవిధ్యం దెబ్బతిన్న కారణంగా  భూమి సమతుల్యత లోపించి ప్రాణి జీవనాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని వివరించారు. గత శతాబ్దంలో భూమిపై ఉన్న సగం క్షీరదాలు కనుమరుగయ్యాయని, జీవ విధ్వంసం కారణంగా పర్యావరణ, ఆర్థిక, సామాజిక పర్యవసానాలు కచ్చితంగా ఎదుర్కొనవలసి వస్తుందని హెచ్చరించారు. సమీప భవిష్యత్తులో మానవ జాతి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని  అంటున్నారు.  కాగా, తొలి సమూహ వినాశనం ఆరు కోట్ల 60 లక్షల ఏళ్ల కిందట సంభవించింది. దానివల్ల రాక్షస బల్లులు అంతరించిపోయాయి. ఆ తర్వాత వివిధ దశల్లో నాలుగుసార్లు వేగంగా జీవజాలం అంతరించింది. ఆరో సమూహ వినాశనంలో గతంలో కంటే వంద రెట్లు వేగంగా వణ్యప్రాణులు కనుమరుగవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మొత్తం మీద నాగరిక సమాజం జీవసమతౌల్యాన్ని దెబ్బతీసిందని, దీని కారణంగానే జీవవిధ్వంసానికి పాల్పడి వినాశనాన్ని కొని తెచ్చుకుంటోందనే నిర్ధారణకు వచ్చారు.  ఈ పరిణామాలు ఎలా ఉంటాయో ? ...
 • అతడో  కంపెనీ డైరెక్టర్‌. సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో భార్య గుడికెళ్లి ఉంటుందని వెతికాడు. ఎక్కడా కనిపించక పోవటంతో తిరిగి ఇంటికి వచ్చాడు. వెంటిలేటర్‌ నుంచి బెడ్‌రూమ్‌లోకి తొంగిచూశాడు. మంచంపై నిర్జీవంగా పడివున్న భార్యను చూసి ఉలిక్కిపడ్డాడు. స్థానికుల సహాయంతో తలుపులు తీసి గదిలోకి వెళ్లాడు. భార్య మరణించినట్టు తెలియగానే అతడు కళ్లు తిరిగి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహం పడివున్న తీరును బట్టి దొంగలు  ఒంటిపై నగల కోసమే ఆమె కళ్లల్లో కారం చల్లి, హత్య చేసినట్టు   భావించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సృహలోకి వచ్చిన అతడి నుంచి వివరాలు రాబట్టారు. ఎక్కడా అనుమానం రాక పోవటంతో పోలీసులు అతడు చెప్పింది రాసు కుని వెళ్లిపోయారు. కానీ.. అతడు చెప్పిన అంశాల్లో వెంటిలేషన్‌ నుంచి పడకగదిలోకి చూడటం, మృతురాలి కళ్లల్లో కారంపొడి పడినట్టు ఆనవాళ్లు లేకపోవటంతో అనుమానం వచ్చి తమదైన శైలిలో ప్రశ్నించగా... నిజం చెప్పాడు. భార్యను వదిలించుకుని మరో పెళ్లి చేసుకునేందుకు తానే స్నేహితుడితో కలిసి హత్య చేసినట్టు అంగీ కరించాడు. భర్త దూరమయ్యాడు.. ఒంటరి తనంతో ఉన్న ఆమెకు ఓ వ్యక్తి మాటకలిపి తోడుగా ఉంటా నన్నాడు. ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం వివాహేతర బంధానికి దారితీసింది. అప్పటికే ఆమెకు పదేళ్ల కూతురు ఉంది. అమ్మకోసం వచ్చే వ్యక్తితో తరచూ గొడవపడేది. ఇంటికి రావద్దంటూ తిట్టేది. చిన్నారిని ఎలాగైనా అడ్డుతొలగించు కునేందుకు అతడు పథకం వేశాడు. బ్లేడుతో చిన్నారి గొంతుకోసి చంపేశాడు. బాలికపై అఘాయిత్యానికి ప్రయత్నించిన ఆగంతుకుడు ఆమె కేకలు వేయటంతో హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావించారు.  తమ అనుబంధానికి అడ్డొస్తుందనే ఉద్దేశంతో తల్లి, ప్రియుడు కలిసి దారుణానికి పాల్పడి ఉండవచ్చనే కోణంలో ప్రశ్నించారు. ఎక్కడా సరైన ఆధారం లభించకపోవటంతో ఖాకీలు తలలు పట్టుకున్నారు. పదునైన వస్తువుతో గొంతు కోసిన నిందితుడు ఉపయోగించిన ఆయుధం బ్లేడు కావచ్చని అనుమానించి ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. చివరకు ప్రియుడే హంతకుడుగా తేల్చారు. బ్లేడు ఉపయోగించిన సమయంలో అతడి బొటన వేలుపై పడిన గాట్ల ఆధారంగా నిందితుడిగా నిర్ధారించారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టాడు.  ఐటీ కంపెనీలో పనిచేసే ఉద్యోగిని  జయ  కుటుంబానికి ఆధారమైన యువతి. ఆఫీసుకు బయల్దేరి మార్గమధ్యంలోనే రక్తపు మడుగులో నిర్జీవంగా పడివుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడం వల్లనే మరణించినట్టు పోలీసులు తేల్చారు. రోజూ వెళ్లే మార్గం నుంచి కాకుండా అటువైపు ఎందుకు వెళ్లింది అనే ప్రశ్నకు సమాధానం లేదు. టెలీకాలర్‌  రాధ  నిర్మానుష్య ప్రాంతంలో మంటలకు ఆహుతైంది. హత్య.. ఆత్మహత్య అనే అనుమానం మధ్య చివరకు ఆత్మహత్యగా నిర్ధారించారు.  షాపు తెరిచేందుకు వెళ్లిన మధు  అనే యువకుడు శివారు ప్రాంతంలో శవమై కనిపించాడు. నెలరోజులు దాటుతున్నా అసలుగుట్టు బయటకు రాలేదు.  అత్తాపూర్‌లో సెలైన్‌లో మత్తుమందు ఎక్కించుకుని ఆత్మహత్యకు పాల్పడిన డాక్టర్‌  బలవన్మరణం వెనుక వాస్తవాలు వెల్లడికాలేదు.  గతంలో ఒక విఐపీ  బందోబస్తు విధులకు నగరం వచ్చిన ఎస్‌ఐ ఒకరు  సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మనసిచ్చిన యువతితో పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించక పోవటం కారణమని తేల్చారు. అది కారణం కాదని మృతుడి తల్లిదండ్రులు ఖండించారు.  పోలీసు రికార్డుల్లో నమోదవుతున్న అనుమానాస్పద మృతి కేసుల్లో దాగిన చీకటికోణాలు కేవలం 10 శాతం మాత్రమే వెలుగుచూస్తున్నాయి. మిగిలిన వాటిలో అసలైన వాస్తవాలు రహస్యంగానే మిగిలి పోతున్నాయి. అనుమానాస్పద మరణాలకు రోడ్డు ప్రమాదం, ఆత్మహత్య, డబ్బుకోసం జరిగే హత్యలు కారణాలుగా పోలీసులు దర్యాప్తులో నిర్ధారిస్తున్నారు. వీటిలో గుర్తుతెలియని వాహనాలు ఢీకొట్టడం వల్ల జరిగే ప్రమాదాలు గుర్తించటం సమస్యగానే ఉంటోంది. సీసీ కెమెరాలతో కొద్దిమేర మాత్రమే సమస్యను అధిగమించగలిగారు. దర్యాప్తు అధికారి సమర్థతే ఇటువంటి కేసుల్లో వాస్తవాలు వెలికితీయటంలో కీలకమైన అంశం. వాకింగ్‌కు వెళ్లిన ఓ వృద్ధుడిని ఖరీదైన కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. గాయపడిన అతడు అక్కడికక్కడే మరణించాడు. అక్కడ సీసీ కెమెరాల్లేవు. కానీ.. ఘటనాస్థలంలో కారు చక్రం నుంచి ఊడిపడిన ‘మడ్‌గార్డ్‌’ మాత్రమే దొరికింది. దాన్ని ఆధారంగా సర్వీసింగ్‌ సెంటర్లు, కార్ల షోరూమ్స్‌లో ఆరాతీస్తూ.. మూడు నెలలపాటు నిఘా ఉంచితేగాని ఆ వాహనాన్ని గుర్తించలేకపోయారు. రాత్రంతా తప్పతాగి మత్తులో వాహనం నడిపిన ఆ యువకుడు. తల్లిదండ్రులు నిద్రలేవక ముందే ఇల్లు చేరాలనే ఆత్రుతతో కారు వేగం పెంచాడు. ప్రమాదానికి కారకుడయ్యాడు. పాతబస్తీ, అల్వాల్‌ ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు లారీ కిందపడి ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంగా భావించి కేసులు నమోదు చేశారు. ఆ తరువాత సీసీ కెమెరాల్లో ఆ ఇద్దరూ ఉద్దేశపూర్వకంగానే వాహనాలకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌ మహా నగరంలో ఏటా సుమారు 1000 వరకూ అనుమానాస్పద మరణాలు నమోదవుతుంటాయి. ఏటేటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. మరణాల మిస్టరీ వెనుక చేదు నిజం ఒక్కటే. నగరవాసుల్లో క్రమేణా నేరప్రవృత్తి పెరుగుతోంది. అనుకున్నది సాధించ లేకపోతే ప్రత్యర్థులపై పగ తీర్చుకోవటమో.. బలవన్మరణం వైపు అడుగులు వేయటమో పరిష్కారంగా భావిస్తున్నారు .  తోడికోడలు కూతురు తన బిడ్డను మించి అందంగా ఉండటాన్ని పిన్ని వరుసైన మహిళ భరించలేకపోయింది. అక్కసుతో పసికూన అని చూడకుండా బావిలో పడేసింది. హత్యలు, హత్యాప్రయత్నాల్లో ఆస్తి తగాదాలు.. ప్రతీకారం తీర్చుకునేంత పగలు ఉండవు. పట్టరాని ఆవేశంలో సున్నితమైన ప్రాంతంలో తగిలే దెబ్బలతో జరుగుతున్న హత్యలే అధికమంటూ ఓ సీనియర్‌ పోలీసు అధికారి విశ్లేషించారు. ‘‘మూడు పోలీసు కమిషరేట్స్‌ పరిధిలో ఏటా నమోదయ్యే కేసులను పరిశీలిస్తే నగరవాసుల్లో క్రమేణా పెరుగుతున్న ఒత్తిడి, పోటీ వాతావరణం అసహనానికి కారణ మవుతున్నా’’యంటూ ఓ ఇన్‌స్పెక్టర్‌ తన అనుభవాన్ని వివరించారు. నేరాల సంఖ్య తగ్గినా.. ప్రజల్లో అధికమవుతున్న క్రిమినల్‌ సైకాలజీ మరింత ప్రమాదకరమంటూ ఓ అడిషనల్‌ డీసీపీ ఆందోళన వెలిబుచ్చారు. పెరుగుతున్న కేసులను డీల్ చేయడం  పోలీసులకు తలకు మించిన భారం అవుతోంది.  ఇక పోలీసులు చెబుతున్నట్టు  క్రిమినల్ సైకాలజీ   ప్రమాదకరం ... నిజమే పగ ..ప్రతీకారం తో కూడినదే క్రిమినల్ సైకాలజీ... దీనివల్ల  ... కన్నుకి కన్ను పన్నుకి పన్ను ... అనే ధోరణి ప్రబలుతోంది. చిన్నప్పటి నుంచే  ఇలాంటి ధోరణి ప్రబలకుండా పిల్లలను ఎడ్యుకేట్ చేయాలి.  అవసరమైతే పాఠ్యంశాల్లో కూడా దీన్ని చేర్చాలి.  అపుడే కొంత మార్పు కి అవకాశం ఉంటుంది.  ...
 • సముద్రనీటిని మంచినీటిగా మార్చేందుకు రైస్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన, చౌకైన మార్గాన్ని ఆవిష్కరించారు. ఈ విధానంలో కరెంటు అవసరం లేకపోవడం, సూర్యరశ్మిని మాత్రమే వాడుకుని నిర్లవణీకరణ (ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్రక్రియ)ను పూర్తి చేయడం  విశేషం. సముద్ర నీటిని మంచినీటిగా మార్చే ప్రస్తుత పద్ధతులు ఎంతో వ్యయప్రయాసలతో కూడు కున్నవి కావడంతో చౌకైన నిర్లవణీకరణ పద్ధతి కోసం రైస్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికి ఒక విధానాన్ని కనుగొన్నారు.  నానో టెక్నాలజీ సాయంతో ఒకవైపు నీటిని వేడి చేస్తూనే ఇంకోవైపు వాటిలోని లవణాలను ఫిల్టర్‌ చేసేందుకు ప్రత్యేకమైన పద్ధతిని అభివృద్ధి చేశారు. ఉప్పు నీటిని వేడి చేసేందుకు సోలార్‌ ప్యానెల్స్‌ను మాత్రమే వాడటం.. పీడనానికి గురిచేయాల్సిన అవసరం కూడా లేకపోవడంతో ఈ సరికొత్త పద్ధతి ద్వారా అతిచౌకగా మంచినీటిని పొందవచ్చునని శాస్త్రవేత్త నియోమీ హాలస్‌ చెబుతున్నారు . ఈ పద్దతిలో  గంటకు ఆరు లీటర్ల మంచినీరు ఉత్పత్తి చేయవచ్చు.  కాగా  సముద్రపు నీటి ప్రభావంతో మంచినీరు సైతం ఉప్పునీరుగా మారడంతో తాగలేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు  ఆ నీటిని శుద్ధి చేసి మరింత పరిశుభ్రంగా అందించేందుకు జినర్జీ సోలార్ ప్రాజెక్ట్, దాని అనుంబంధ సంస్థ అలెక్టోనా ఎనర్జీ కంపెనీ కూడా కృషి చేస్తున్నాయి . ఉప్పునీటిని మంచినీటిగా మార్చి ఒయాసిస్సులుగా ఏర్పాటు చేయడానికి తమ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని, కోస్తా ప్రాంతంలో ఎక్కడైనా ప్రయోగాత్మంగా ఈ ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తామని కంపెనీల ప్రతినిధులు ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలసి  వివరించారు. ఒక ప్రాజెక్ట్ స్థాపనకు నాలుగు నుంచి ఏడు లక్షల రూపాయలు ఖర్చవుతుందని, తాము 3.69 లక్షల రూపాయలకే ఆర్‌ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. సౌర విద్యుత్‌తో నడిచే ఓఆర్ ప్లాంట్ల ద్వారా ఏపిలో గ్రామీణ మంచినీటి సరఫరాలో తాము భాగస్వాములమవుతామని  ఆ సంస్థ ప్రకటించింది . ఈ పథకానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని సీఎం కూడా చెప్పారు.  ఈ ప్రయత్నాలన్నీ విజయవంతమైతే  ఇక మంచి నీటికి ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ...
 • అరుణాచల్ ప్రదేశ్ లోని వాయవ్య ప్రాంతంలో వున్న తవాంగ్ . బౌద్ధమత ప్రాంతం. ఇక్కడ పడే మంచు హిమపాతం పర్యాటకులకు అద్భుత ఆనందాలు కలిగిస్తుంది. ఈ ప్రదేశానికి టూరిస్ట్ లు సంవత్సరం పొడవునా వస్తూనే వుంటారు.అరుణాచల్‌ ప్రదేశ్‌లో బౌద్ధులు అధికం. దీంతో ఈ ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ ఆశ్రమాలకు ఆలవాలంగా వెలుగొందుతోంది. "త" అంటే గుర్రం అని, "వాంగ్" అంటే ఎంపిక అని అర్ధం. తవాంగ్‌ హిమాలయ పర్వతాలపై దాదాపు 12వేల ఆడుగుల ఎత్తున ఉంది. తవాంగ్‌లో టిబెటన్ల సంఖ్య ఎక్కువ. టిబెటన్లు ఎప్పుడూ ఇక్కడ ప్రార్ధనలు చేస్తూ బౌద్ధమత ఆరాధనలో నిమగ్నులవుతారు. ప్రశాంతమైన నీటి సరస్సులు, నదులు, ఆకాశంలో నీలంరంగును ప్రతిబింబింప చేసే అనేక ఎత్తైన జలపాతాలు, కొన్నిసార్లు మేఘాలు భార౦గా తేలుతున్నట్లు సందర్శకులకు మంత్రముగ్ధుల్ని చేసే అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతిని ఆనందించాలి అనుకునే నిజమైన ప్రేమికులను ఈ రహస్య స్వర్గం స్వాగతిస్తుంది. ఇక్కడ 27 అడుగుల ఎత్తు కల బంగారు బుద్ధ విగ్రహం అందరిని ఆకట్టు కుంటుంది. తవాంగ్‌ బౌద్ధారామం భారతదేశంలోనే అతిపెద్ద ఆరామంగా కొనసాగుతున్నది. లాసా(టిబెట్‌)లోని పోతల ప్యాలెస్‌ ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధారామంగా ఖ్యాతిగడించింది. ఆ తర్వాతి స్థానం తవాంగ్‌దే కావడడం విశేషం. ఏటా ఇక్కడికి లక్షలమంది బౌద్ధారాధకులు వచ్చివెళుతుంటారు. సూర్యుడు మొదటసారిగా ఉదయించే ప్రాంతం ఇదే .ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి . తవాంగ్ యుద్ధ స్మారకం......... భారత-చైనాల మధ్య 1962లో జరిగిన యుద్ధంలో చైనా సైనికులను ఒంటరిగా పోరాడిన భారతీయ సైనికుడి వీరమరణం పొందిన చోట స్మారకంను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ స్మారకం సీలా పాస్‌లోని జశ్వంత్‌ఘర్‌లో ఉంది. తవాంగ్ ఆశ్రమం ........   బౌద్ధమతంలో మహాయాన వర్గం వారు ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకున్నారు. లాసా తర్వాత అతి ప్రాచీన ఆశ్రమం తవాంగ్‌లో మాత్రమే ఉంది. తవాంగ్ ఆశ్రమాన్ని మెరాగ్ లామా లోడ్రీ గిమాస్ట్సో నిర్మించారు. ఈ ఆశ్రమం 1681లో నిర్మించారని అంటుంటారు. ఆశ్రమం పక్కనే బౌద్ధ సన్యాసులు నివసించేందుకు వీలుగా వసతి గృహాలు ఏర్పాటుచేశారు. తవాంగ్ ఆశ్రమంలో ప్రాచీన గ్రంధాలయంతో పాటుగా వస్తు ప్రదర్శనశాల కూడా ఉంది. దాదాపు 500 మంది బౌద్ధ సన్యాసులకు వసతి కల్పించేది తవాంగ్ ఆశ్రమం. రాత్రిపూట తవాంగ్ ఆశ్రమాన్ని విద్యుదీప కాంతులతో చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఆశ్రమంలో లోపల 8మీటర్లు ఎత్తైన బౌద్ధ విగ్రహం ఉంది. లాసాలోని పోతలా ఆశ్రమం తర్వాత అతిపెద్దది తవాంగ్ ఆశ్రమం. ఉర్గెలింగ్ ఆశ్రమం....... ఆరవ దలైలామా ఉర్గెలింగ్ ఆశ్రమంలో పుట్టాడని బౌద్ధులు భావిస్తారు. ఈ ఆశ్రమం 14వ శతాబ్దం నుంచి ఉందని బౌద్ధులు అంటుంటారు. తవాంగ్ పట్టణం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉర్గెలింగ్ ఆశ్రమం ఉంది. తవాంగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు వసతి సదుపాయాలు ఉన్నాయి.
 • కృష్ణాజిల్లాలోని కొండపల్లి ఖిల్లాను పర్యాటకుల స్వర్గధామంలా మార్చేందుకు ఏపీ పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. 4కోట్ల రూపాయల వ్యయం తో  ఎనిమిది ఎకరాల్లో ఖిల్లాకు కొత్త హంగులను అద్దేందుకు పనులు చేపట్టాలని నిర్ణయించింది. కోటను ప్రతిబింబించేలా విద్యుత్‌ వెలుగులతోపాటు ఆ ప్రాంతంలో ఆసియాలోనే తొలిసారిగా ఓపెన్‌ ఎయిర్‌ మ్యూజియం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడపగలిగేలా కోటను అభివృద్ధి చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాచరిక వైభవాలకు నిదర్శనంగా నిలిచే ఈ కోట సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులోఉంది. ఈ కోటను రెడ్డి రాజుల వంశానికి చెందిన అన వేమారెడ్డి 1324-1402 మధ్య కాలంలో నిర్మించారు. ఈ చారిత్రక సంపదను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించడానికిగానూ పురావస్తుశాఖ.. ఇప్పటికే కెమికల్‌ కన్జర్వేషన్‌ ట్రీట్‌మెంట్‌ వర్క్స్‌ ప్రారంభించింది. మంచినీటి వసతితో పాటు, మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నారు. మైసూరు చాముండి హిల్స్‌, విశాఖపట్నంలో గాలికొండల మాదిరిగా కొండపల్లిలోనూ.. వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు.  చాలా ఎత్తుగా ఉన్న ఈ కొండను ఎక్కటానికి దేశ, విదేశీ పర్యాటకులు ఇబ్బంది పడుతుంటారు. దీంతో పర్యాటకులందరూ కోటను సందర్శించేలా... అత్యాధునికమైన రోప్‌వేను కూడా ఏర్పాటు చేయనున్నారు. కోట చరిత్రకు సంబంధించిన ఆడియో, వీడియో లైబ్రరీలతో పాటు.. అత్యాధునికమైన సౌండ్‌, లైట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. .ఇక్కడి కళాఖండాల పరిరక్షణ కోసం అత్యాధునిక మ్యూజియం రాబోతుంది . కొండపల్లిలో రాయల కాలం నాటి గజశాల, నర్తన శాల, భోజనశాల, ఆర్చ్‌లు, సమావేశ మందిరానికి సంబంధించిన గోడలకు మరమ్మతులు చేస్తున్నారు.  విజయవాడకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపల్లి ఖిల్లాకు  ఆధునికమైన బస్సులను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం కొండపల్లిలో సౌకర్యాలు మెరుగు పర్చితే.. రోజుకు 8 వేలకు పైగా పర్యాటకులు వస్తారని అంచనావేస్తున్నారు.
 • గుజరాత్‌లో 600 ఏళ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. దీంతో అహ్మదాబాద్‌ పారిస్, వియన్నా, కైరా, బ్రసెల్స్, రోమ్‌ వంటి ప్రఖ్యాత నగరాల సరసన చేరింది. పోలండ్‌లోని క్రాకౌలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ఢిల్లీ, ముంబై నగరాలను వెనక్కినెట్టి అహ్మదాబాద్‌ ఈ గౌరవాన్ని అందుకుంది. భారత దేశంలో ఈ ఘనత దక్కించుకున్న తొలి నగరంగా అహ్మదాబాద్‌ నిలిచింది. భారత్‌లోని చరిత్రాత్మక అహ్మదాబాద్‌ను ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటిస్తున్నామని ‘యునెస్కో’  ప్రకటించింది . అహ్మదాబాద్‌లోని హిందూ, ఇస్లామిక్, జైన్ మతాలకు చెందిన అద్భుతమైన కట్టడాలు, అద్భుత నిర్మాణ సౌందర్యం, అచ్చెరువొందించే చెక్క కట్టడాలు యునెస్కో కమిటీ మనసు దోచాయి.  అహ్మదాబాద్ నగరంలో పురావస్తు శాఖ సంరక్షిస్తున్న 26 కట్టడాలు, వందలాది స్థంభాలు ఉన్నాయి. మహాత్మాగాంధీ ఇక్కడ 1915 నుంచి 1930వరకూ జీవించారు.  ప్రపంచవ్యాప్తంగా మొత్తం 287 వారసత్వ నగరాలున్నాయి. శ్రీలంకలోని గాలె, నేపాల్‌లోని భక్త్ పూర్ నగరాలు వారసత్వ నగరాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి . యునెస్కో గుర్తింపుతో అహ్మదాబాద్‌‌లో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు అహ్మదాబాద్‌ను వారసత్వ నగరంగా గుర్తించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్హం వ్యక్తం చేశారు. భారత్ సంబరాల్లో మునిగి తేలాల్సిన సమయమంటూ మోదీ ట్వీట్ చేశారు. అటు గుజరాత్ సిఎం కూడా యునెస్కో గుర్తింపుపై హర్షం వ్యక్తం చేశారు.
 • ప్రకృతి సహజ సిద్ధమైన వాతావరణం, ఎత్తయిన కొండలు, చుట్టూ దట్టమైన అడవి, 50 అడుగుల ఎత్తు నుండి హొయలు పోతూ జాలువారే నీటి ప్రవాహం .  ఎటు చూసినా పచ్చని గుట్టలు , వాటి మధ్య నుంచి పారే నీళ్ళు, పై నుండి దుమికే జలపాతాన్ని చూస్తే పర్యాటకులు ఇట్టే మైమరిచిపోతారు.  బొగత జలపాతం  ఇప్పటిది కాదు ...  తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ గుట్టల మధ్యనున్న దండకారణ్యంలో సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లందేవి గుట్ట వద్ద బొగత పుట్టింది. అక్కడి నుంచి గుట్టల మీదుగా ప్రవహిస్తూ  పెనుగోలు వద్దకు రాగానే ఈ వాగు పాలవాగుగా మారింది. పెనుగోలు ఊరు దాటిన తర్వాత ఆల్బర్ట్ వాగు అయింది. వాజేడు మండల ఇన్‌చార్జి ఎంపీడీఓ ఆల్బర్ట్ పెనుగోలు వెళ్లినప్పుడు జారి పడటంతో చెయ్యి విరిగింది. అక్కడకు వచ్చిన తొలి అధికారి కూడా ఆల్బర్టే కావడంతో ఈ వాగుకు ‘ఆల్బర్ట్ వాగు’గా నామకరణం చేశారు. అక్కడి నుంచి  6 కిలోమీటర్ల దూరంలోని గుట్టలు దిగి వచ్చిన వాగు చీకుపల్లికి సుమారు అర కిలో మీటరు దూరంలో బండలపై నుంచి జాలు వారి బొగతగా మారింది. గతంలో దీనిని బంధల వాగు అనే వారు. ఏడు మంచాలకు సరిపడా నులక వేస్తే అందనంత లోతుగా ఈ జలపాతం ఉంటుందని ఇప్పటికీ చెప్పుకుంటారు. జలపాతం ఈ ప్రాంతంలోని వారికి చాలాకాలంగా తెలుసు కానీ ఎవ్వరూ అక్కడికి వెళ్లే వారు కాదు. జలపాతం లోపల దేవతామూర్తులు ఉంటారనే నమ్మకంతో దీనిని పవిత్రంగా చూసేవారు. దీనిని బండల వాగు అని కూడా పిలిచేవారు. గుట్టలపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు ‘బొబ్బో..బొబ్బో..’ అని శబ్దం చేస్తుంది.. అందుకే ఇది బొగతగా మారిందని స్థానికుల కథనం.  ఈ  ప్రకృతి అందాలను వీక్షించేందుకు కుటుంబ సమేతంగా జలపాతంలో స్నానాలు చేసేందుకు పర్యాటకులు వందల సంఖ్యలో బొగత వస్తుంటారు. అయితే పర్యాటకులకు ఇక్కడ తగు వసతులు  లేవు.  వాహనాలు నిలుపుకునేందుకు పార్కింగ్‌ లేదు. పర్యాటక శాఖా అధికారులు ఇప్పటికైనా ఈ బొగతజలపాతంపై దృష్టి సారించి పార్కింగ్‌, వంట షెడ్లు, వస్త్రాలు మార్చుకునేందుకు గదులు నిర్మిస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. ఖమ్మం నుంచైతే 240 కిలోమీటర్లు. భద్రాచలం నుంచి 120 కిలోమీటర్లు .. ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని బొగత హైదరాబాద్ నుంచి 440 కిలోమీటర్ల దూరం. వరంగల్ పట్టణానికి 140 కిలోమీటర్ల దూరంలో.. ఏటూరు నాగారం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బొగత ఉంటుంది. 
 • యముడి పేరు తలుచుకోవటానికే భయపడతాం మనం . అలాంటి యముడికి  ఎంతో భక్తితో పూజలు చేసే  ఆలయం ఉందంటే నమ్మ బుద్ధి కాదు.  కానీ  నిజంగా యముడికో  గుడి ఉంది ... అది కూడా మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది.ఇదింకా చిత్రంగా ఉంది అనుకుంటున్నారా ?  చాలామందికి ఈ విషయం ఉంది. ఈ ఆలయం  పురాతనమైనది.  ఈ  పురాతన దేవాలయం కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ఉంది ఈ గుడి. ఎన్నో విశేష పూజలు అందుకుంటాడు యముడు అంటే ఆశ్చర్యం గా అనిపించినా ...ఆ ఆలయం విశేషాలు మాత్రం ఆసక్తి కరంగా వుంటాయి. తమ జాతకాలు బాలేవని, ఏం చేసిన కలిసి రావట్లేదని, లేదా జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని, మానసిక ప్రశాంతత కరువయిందని ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారు ఈ ఆలయంలోని యముని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం. అలాగే శని గ్రహ దోషాలు, జాతక దోషాలు వున్న వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే ఆబాధల నుంచి ఉపశమనం లభిస్తుందిట.  ఇక్కడ మండపంలో గల గండ దీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటే గండాలన్ని తొలగిపోతాయి అని కూడా భక్తుల నమ్మకం.ప్రతి నెల భరణి నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ .  దీపావళికి రెండు రోజుల తరువాత వచ్చే 'యమ ద్వితీయ' రోజున యముడు తన చెల్లి అయిన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లి,తిరిగి యమలోకం వెళ్ళే ముందు ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని ప్రతీతి. ఆ రోజున ఇక్కడ యమునికి విశేష పూజలు నిర్వహిస్తారు . యముని దర్శించే వారు ముందుగా గోదావరీ నదిలో స్నానం చేసి, యమునికి పూజలు నిర్వహిస్తారు.  యముని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించటం విశేషం గా చెప్పుకోవచ్చు. పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడికి కార్తికంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.  మార్కండేయుడికి,మహా పతివ్రత సావిత్రికే కాదు భక్తులకీ  వరాలు ఇవ్వటానికి కొలువుతీరి ఉన్నాడు ధర్మపురిలో ఉన్న యముడు.
 • ఐదు నదులు ఒకే చోట కలిసే క్షేత్రం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఉంది.   శివుడు , విష్ణువు పూజలు అందుకునే ఆ పురాతన ప్రాంతానికి  విశిష్టత ఎంతో ఉంది. ఈ  ప్రాంతానికి తగినంత ప్రాచుర్యం లభించలేదు. టూరిస్ట్ స్పాట్ గా   తీర్చిదిద్దితే పర్యాటకులు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అంటారు. శైవులు దీనిని 'మధ్య కైలాసం' అని పిలుస్తారు.  ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.  పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు. హరిహరాదుల క్షేత్రం.  శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతుంది.  పుష్పగిరి లో ఉన్న సరోవరాన్ని అమృత సరోవరం అని కూడా పిలుస్తుంటారు. ఇందులో భక్తులు మునిగి స్నానాలు చేసి, స్వామి వారిని దర్శించుకుంటారు. కొండకు వెళ్లే దారిలో శిధిలమైన చిన్న గుళ్ళు ఎన్నో కనిపిస్తాయి.