అర్థరాత్రి దాటాక సీఎం ప్రమాణస్వీకారం..ఎందుకంటే?

ఆ మధ్యన సీబీఐ డైరెక్టర్ ను హడావుడిగా అర్థరాత్రి ఎంపిక చేయటం.. ఆయనకు డైరెక్టర్ పదవీ బాధ్యతలు అప్పగిస్తూ అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయో లేదో.. అర్థరాత్రి ఒంటి గంట వేళ ఆఫీసుకు వెళ్లి బాధ్యతలు స్వీకరించటం.. ఆ వెంటనే..మోడీ సర్కారుకు ఇబ్బంది కలిగిస్తున్నారన్న సీబీఐ ఉన్నత ఉద్యోగుల చాంబర్లలో తనిఖీలు నిర్వహించటం.. ఈ ప్రక్రియ పక్కరోజు ఉదయం 9 గంటల వరకూ సాగటం అప్పట్లో సంచలనంగా మారింది.

ఆ తర్వాతి కాలంలో సదరు డైరెక్టర్ గారి నియామకాన్ని సుప్రీం తప్పుపట్టటాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదులెండి. ఈ నిర్ణయంపై మోడీ పరివారం చప్పుడు చేయని పరిస్థితి. ఎవరిమీదనైనా అభిమానం ఉండటంతో తప్పు లేదు. కానీ.. వ్యవస్థల్ని భ్రష్టు పట్టేలా నిర్ణయం తీసుకున్నప్పుడు అభిమానపు పరదాల్ని పక్కన పెట్టేసిన తప్పు ఎత్తి చూపించకపోతే.. రానున్న తరాల వారికి ఇలాంటి ఛండాల్ని స్ఫూర్తిగా తీసుకుంటే పరిస్థితి ఏమిటి? మనమెంతో గొప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్యం మాటేంది?

ఆ విషయాన్ని అక్కడ పెట్టి తాజా వ్యవహారంలోకి వద్దాం. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అనారోగ్యంతో మరణించటం.. ఆయన  స్థానంలో ఎవరు సీఎం అన్న విషయంపై తర్జనభర్జనలు చోటుచేసుకున్నాయి. అధికార బీజేపీతో పోలిస్తే.. విపక్ష కాంగ్రెస్ కు సీట్ల సంఖ్య అధికంగా ఉన్న వేళ.. సీఎం అయ్యే ఛాన్స్ తమకే ఇవ్వాలని ఆ పార్టీ పట్టు పడుతూ.. పావులు కదపటం షురూ చేసింది.