ఆదుకున్న అన్న ముకేశ్‌ అంబానీ.. అనిల్‌కు తప్పిన జైలు

తమ్ముడు అనిల్‌ అంబానీ జైలు పాలుకాకుండా ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఆదుకున్నారు. అనిల్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) కంపెనీ ఎరిక్సన్‌కు చెల్లించాల్సిన నిధులు సమకూర్చి ముకేశ్‌ ఆదుకున్నారు. దీంతో ఎరిక్సన్‌కు చెల్లించాల్సిన రూ.458.77 కోట్ల బకాయిలను ఆర్‌కామ్‌ సోమవారం చెల్లించింది. సమయానికి నిధులు సమకూర్చి ఆదుకున్న అన్న ముకేశ్‌ అంబానీ, వదిన నీతా అంబానీకి అనిల్‌ అంబానీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 19లోపు (మంగళవారం) ఈ బకాయిలు చెల్లించకపోతే అనిల్‌ అంబానీ మూడు నెలలపాటు జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి ఉంటుందని గత నెల 20న సుప్రీం కోర్టు హెచ్చరించింది. దీంతో ఒక రోజు ముందే బకాయిలు చెల్లించి అనిల్‌ అంబానీ జైలు శిక్ష నుంచి తప్పించుకున్నారు. నిజానికి ఆర్‌కామ్‌ గత ఏడాది డిసెంబరు 15నాటికే ఎరిక్సన్‌ కంపెనీకి ఈ బకాయిలు చెల్లించాలి. ఆ విషయంలో విఫలమవడంతో ఉద్దేశపూర్వకంగానే ఆర్‌కామ్‌ చెల్లింపుల్లో జాప్యం చేస్తోందని ఫిబ్రవరి 20న సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం కోర్టు ధిక్కారమని తప్పు పట్టింది. ఈ నెల 19లోపు కూడా బకాయిలు చెల్లించకపోతే అనిల్‌ అంబానీతోపాటు అడాగ్‌ గ్రూపు కంపెనీలకు చెందిన మరో ఇద్దరు డైరెక్టర్లకు జైలు ఊచలు తప్పవని హెచ్చరించింది.