ఉత్తమ్ ను ఓడగొట్టేందుకు కాంగ్రెస్ సీనియర్ ఎంట్రీ !

ఉత్తమ్ కుమార్ రెడ్డి – భట్టి విక్రమార్క కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలవుతున్నదని ఆరోపించారు. వారిద్దరిని మార్చేంతవరకు గాంధీభవన్ కు వెళ్లనని తెలిపారు. ఉత్తమ్ నాయకత్వంలోనే పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయిందన్నారు. పార్టీకి ఉత్తమ్ చేస్తున్న నష్టం – ద్రోహంపై ప్రచారం చేస్తానన్నారు. ఉత్తమ్ – భట్టి ఇద్దరూ అసెంబ్లీ టికెట్లు అమ్ముకొన్నారని ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సన్నాసి – పైలెట్ గా దేశానికి సేవచేయలేక పారిపోయి వచ్చాడని ఎద్దేవాచేశారు.  రాష్ట్ర నాయకత్వం పట్ల విశ్వాసం లేకనే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని – ఎమ్మెల్సీ సీటు గెలుచుకునే అవకాశమున్నా ఉత్తమ్ చేతకానితనం వల్లనే చేజారిపోయిందని ఆరోపించారు. పార్టీని కాపాడుకోలేని వాడు నల్లగొండ లోక్ సభ సీటును ఆశించడం విడ్డురంగా ఉందన్నారు. పార్లమెంట్ కు పోటీచేస్తున్న ఉత్తమ్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఆయన ఓటమిలో తన పాత్ర కూడా  ఉండబోతున్నదని చెప్పారు. తాను స్వయంగా ప్రచారం చేస్తానని వెల్లడించారు.

తన సస్పెన్షన్పై సర్వే సత్యనారయాణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డీజీపీ స్థాయి అయిన తనను కానిస్టేబుల్స్థాయి వ్యక్తి అయిన ఉత్తమ్ సస్పెండ్ చేస్తాడా? అని సర్వే మండిపడ్డారు. ఏఐసీసీ సభ్యుడినైన తనను రాష్ట్ర శాఖ సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉన్నదన్నారు. తనను సస్పెండ్ చేసినట్టు పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి నోటీస్ అందలేదని చెప్పారు. తాను నికార్సైన కాంగ్రెస్ వాదినని – పార్టీ మారే ఆలోచన తనకు ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేశారు.