బాబుకు అదిరే షాక్: పార్టీకి రామారావు రాజీనామా!

ఒకటి తర్వాత ఒకటిగా తగులుతున్న ఎదురుదెబ్బలతో ఏపీ ముఖ్యమంత్రి కమ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు తల బొప్పి కడుతోంది. పార్టీ టికెట్ల ఎంపికతో పాటు.. గతంలో వెనుకా ముందు చూసుకోకుండా పార్టీలో చేరికల్ని ప్రోత్సహించిన బాబుకు ఇప్పుడు తత్త్వం బోధ పడేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పిన వైనం తెలిసిందే.

తాజాగా కొవ్వూరు టీడీపీ అభ్యర్థిగా వంగలపూడి అనితకు టికెట్ కేటాయించిన నేపథ్యంలో.. మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు పార్టీకి గుడ్ బై చెప్పేశారు.టికెట్ ప్రకటించిన వేళ.. తొలిరోజు ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసిన అనితకు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. కొవ్వూరు టికెట్ ను తన కుమార్తెకు కేటాయించాల్సింది రామారావు కోరారు. అయితే.. అందుకు బాబు నో చెప్పటంతో రామారావు పార్టీకి రాజీనామా చేశారు.

భవిష్యత్ కార్యాచరణ కోసం అనుచరులతో భేటీ అయ్యారు.  ఈ సందర్భంగా చంద్రబాబు తనకు చేసిన అన్యాయానికి నిరసనగానే తాను తన పార్టీ పదవికి రాజీనామా చేసినట్లుగా ఆయన చెప్పారు. ఈ తరహా పరిస్థితి ఏపీలోని పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. టికెట్ల పంపిణీపై పలువురు నేతలు గుస్సా వ్యక్తం చేస్తూ.. నిరసనలకు దిగుతున్నారు. తమను నిర్లక్ష్యం చేసిన  బాబుకు తగిన గుణపాఠాన్ని ఎన్నికల్లో చూపిస్తామంటూ వారు మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రజల్లో ఉన్న వ్యతిరేకతతో కిందామీదా పడుతున్న టీడీపీకి తాజాగా సొంత నేతల గుస్సా చేసే నష్టం ఎంతన్న లెక్కల్లో పార్టీ నేతలు మునిగిపోతున్నారు.