ఏడో రోజూ.. ముందుకే …11,500 ఎగువకు నిఫ్టీ

సూచీల లాభాల పరుగు వరుసగా ఏడో రోజూ కొనసాగింది. ఐటీసీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ వంటి షేర్లు దన్నుగా నిలవడంతో సెన్సెక్స్‌ ఆరు నెలల గరిష్ఠానికి చేరగా.. నిఫ్టీ 11,500 పాయింట్ల ఎగువకు చేరింది. విదేశీ పెట్టుబడులు స్థిరంగా కొనసాగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి జోరుకు అడ్డుకట్ట పడింది. 43 పైసలు నష్టపోయి 68.96 వద్ద ముగిసింది. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు పెంచకపోవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా మారాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగియగా, ఐరోపా షేర్లు మెరుగ్గా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 38,218.59 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అనంతరం కొంతసేపు తడబడినప్పటికీ.. లాభాల జోరు కొనసాగింది. ఇంట్రాడేలో 38,396.06 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరకు 268.40 పాయింట్ల లాభంతో 38,363.47 వద్ద ముగిసింది. గత ఆరు సెషన్లలో సూచీ ఏకంగా 1420 పాయింట్లకు పైగా పెరగడం గమనార్హం. ఇక నిఫ్టీ సైతం 70.20 పాయింట్లు రాణించి 11,509.80 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,451.55- 11,543.85 పాయింట్ల మధ్య కదలాడింది. గత ఏడాది సెప్టెంబరు 7 తర్వాత రెండు సూచీలకు ఇదే గరిష్ఠ ముగింపు కావడం విశేషం.