‘జెట్‌’ కష్టాలపై అత్యవసర సమావేశం

ప్రయివేటు రంగ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ను నష్టకష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా లీజు చెల్లించలేకపోవడంతో మరో 4 విమానాల కార్యకలాపాలు విమానయాన సంస్థ నిలిపివేసింది. దీంతో రాకపోకలు సాగించకుండా ఆగిపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానాల సంఖ్య 41కి చేరింది. ఈ నేపథ్యంలో ‘జెట్‌’ పరిస్థితులపై కేంద్రం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.
జెట్‌ ఎయిర్‌వేస్‌ పరిస్థితులపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేయాలంటూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు తన మంత్రిత్వశాఖ కార్యదర్శిని ఆదేశించారు. అంతేగాక.. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఎదుర్కొంటున్ సమస్యలపై డైరెక్టరేట్‌ జనరల్ ఆఫ్‌ సివిల్ ఏవియేషన్‌(డీజీసీఏ) నుంచి తక్షణమే నివేదిక తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ కనీసం తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిని దిగజారింది. మూడు నెలలుగా తమకు జీతాలు అందలేని పైలట్లు, ఇంజినీర్లు వాపోతున్నారు. ఇదిలాగే కొనసాగితే విమానాల భద్రత ప్రమాదంలో పడుతుందని వారు అంటున్నారు.
జెట్‌ ఎయిర్‌వేస్‌ వద్ద 119 విమానాలుండగా.. అద్దె చెల్లించలేక ఇప్పటివరకు 41 విమానాల కార్యకలాపాలను నిలిపివేశారు. ఇక నిర్వహణ వ్యయాల కారణంగా మరికొన్ని విమానాల రాకపోకలను రద్దు చేశారు. అయితే విమానాల ఆకస్మిక రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చివరినిమిషంలో విమానాలు రద్దవుతుండటంతో అధిక ధర పెట్టి మరో విమానానికి టికెట్‌ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.