పారిశ్రామికాభివృద్ధితోనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం

తయారీ రంగం వృద్ధి పథంలో సాగితేనే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్యూరి సుబ్బారావు అన్నారు. పొరుగు దేశం చైనా.. పారిశ్రామిక రంగంలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేయటంతో ఆర్థిక సమానత్వాన్ని సాధించిందని ఆయన గుర్తు చేశారు. మంగళవారం నాడిక్కడ నాబార్డ్‌ వ్యవస్థాపకుడు రామకృష్ణయ్య నాలుగో స్మారకోపన్యాస కార్యక్రమం సందర్భంగా ‘నిత్య జీవితంలో ఆర్‌బీఐ పాత్ర’ అనే అశంపై ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో ఆర్‌బీఐ అనుసరించనున్న ద్రవ్య విధానంతో దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. నేడు ఆర్‌బీఐ అనుసరిస్తున్న క్రమబద్ధీకరణ పర్యవేక్షణ, విధులు, ఆర్థిక నేరాలను అరికట్టడానికి, ఉపయుక్తమైన నిర్ణయాలు తీసుకోవటానికి దోహదపడతాయని ఆయ న అన్నారు. పెద్ద నోట్ల రద్దు సరైనదేనని, నల్లదనాన్ని వెలికి తీయడానికి అక్రమార్కులను అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు.