Latest News
banner News

"ఇదీ లెక్క! "

1st Image

ఆర్టిస్టుగా కానీ, టెక్నీషియన్‌గా కానీ సినీ ఫీల్డులోకి ఎంటర్ కావాలనుకొనేవారు ముందుగా తెల్సుకోవాల్సిన లెక్క ఒకటుంది.

అదేంటంటే -

ఫీల్డులోకి ప్రవేశించాలనుకొని ఫిలిమ్‌నగర్‌కు వచ్చే ప్రతి 1000 మందిలో కేవలం ఒక 10 మందికి మాత్రమే అవకాశం దొరుకుతుంది. అదీ ఎంతో కష్టంగా!
ఆ పదిమందిలో కూడా - ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే క్లిక్ అయ్యే అవకాశం లభిస్తుంది. వాళ్లే ఫీల్డులో కొద్దిరోజులు నిలబడగలుగుతారు.
ఎందుకలా అంటే .. దాని లాజిక్కులు దానికున్నాయి.
సంవత్సరానికి ఎన్ని సినిమాలు తీస్తారు?
వాటిలో కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చే సినిమాలు ఎన్నుంటాయి?
ఆ సినిమాల్లో ఎంతమందికని అవకాశం ఇవ్వడం వీలవుతుంది?
ఒక్క టాలీవుడ్‌లోనే కాదు. ఏ వుడ్డులోనయినా ఇదే లెక్క!
ఎవరిలో ఎంత టాలెంట్ ఉందని అనుకున్నా, నిజంగా ఉన్నా .. వాస్తవం మాత్రం ఇదే. ఈ వాస్తవాన్ని ఎదుర్కొనే దమ్మున్నవాళ్లకే సినీఫీల్డు స్వాగతం పలుకుతుంది.
మరి మీలో ఆ దమ్ముందా?!
కట్ టూ సోక్రటీస్ -
ఈ మహా తత్వవేత్త చెప్పిన ఒక మాట ఈ సందర్భంగా కోట్ చెయ్యాలనిపిస్తోంది:
"నిన్ను నువ్వు తెల్సుకో!"
Chimmani Manohar 
FILM DIRECTOR, 'Nandi Award' Winning Writer and Blogger
  • పదే పదే ఎదురు దెబ్బలతో సతమతమవుతున్నకాంగ్రెస్  పార్టీకి జవసత్వాలు చేకూర్చడంపై  ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. జనాకర్షణగల నేత కోసం అన్వేషిస్తున్నారు. గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ ఊహాగానాలుగానే  మిగిలిపోయాయి . అయితే ఇపుడున్న పరిస్థితిలో  కాపు కాసే  నేత అవసరమని సోనియా భావిస్తున్నారట . ఈ నేపథ్యంలోనే  పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రియాంకా గాంధీని నియమించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రియాంక పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయితే రాబోయే ఎన్నికల్లో పార్టీకి జవసత్వాలు వస్తాయని, తప్పకుండా అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశముందని  పార్టీ నేతలు కూడా అంటున్నారు . ఆగస్టు  8వ తేదీన వర్కింగ్‌ కమిటీ సమావేశం లో ఇదే అంశం పై చర్చ కూడా జరిగిందని అంటున్నారు.  గత ఏడాదే పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌కి అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని సోనియా భావించారు. కానీ, రాహుల్‌ నాయకత్వంపై సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయనకు జోడీగా ప్రియాంకను కూడా తీసుకు రావాలని సోనియా భావిస్తున్నారట.  రాహుల్‌ని అధ్యక్షుడిని చేసి, ప్రియాంకను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేస్తే ఆమె కూడా దేశవ్యాప్తంగా ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రియాంక కేవలం సోనియా, రాహుల్‌ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీల్లోనే ప్రచారం చేశారు. తెలంగాణలో పార్టీకి పునర్వైభవం కోసం అవసరమైతే వచ్చే ఎన్నికల్లో మెదక్‌ నుంచి ప్రియాంకను రంగంలోకి దింపాలని కూడా సోనియా యోచిస్తున్నట్లు  చెబుతున్నారు . 1980లో మెదక్‌ స్థానం నుంచి ఇందిరా గాంధీ పోటీ చేసి ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు సెంటిమెంట్‌గా అక్కడి నుంచే ప్రియాంకను పోటీకి నిలబెడితే బావుంటుందని సీనియర్లు సోనియాకు సలహా  ఇచ్చారని అంటున్నారు.  అయితే ఇవన్నీ కూడా ఊహా గానాలే అని కాంగ్రెస్ పార్టీ ఖండించింది.  ఇదిలా ఉంటే  మొన్నటి యూపీ ఎన్నికల్లో ప్రియాంక ప్రచారం చేసిన చోట కూడా పార్టీ ఓడిపోయింది.  అయితే ఆ ఫలితాలకు కారణాలు వేరే ఉన్నాయి కాబట్టి పూర్తిగా ప్రియాంక వైఫల్యం అనలేము. ఏదైనా పార్టీలోకి కొత్త నేత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియాంక అయితే  పార్టీని గట్టెక్కించ గలరు  అనే  నమ్మకం పార్టీ నేతల్లో ఉంది.  ఆమె పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారా ?   లేదా అనేది  కాలమే  నిర్ణయిస్తుంది. 
  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ముస్లిం తీవ్రవాద సంస్థ తాలిబాన్‌ బహిరంగ లేఖ రాసింది. అఫ్ఘానిస్తాన్‌లో తిష్టవేసిన అమెరికా బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. గత పదహారేళ్లుగా అమెరికా బలగాలు అఫ్ఘానిస్తాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇంగ్లీషులో 1600 పదాలతో సుదీర్ఘంగా రాసిన ఆ లేఖను తాలిబాన్‌ నాయకత్వం  విడుదల చేసింది. గత అమెరికా అధ్యక్షులు అఫ్ఘానిస్తాన్‌ విషయంలో చేసిన పొరపాట్లను, తీసుకున్న నిర్ణయాలను  పున:సమీక్షిస్తామనడం  ద్వారా తప్పిదాలను అంగీకరించినట్లయిందని తాలిబాన్‌ అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. అఫ్ఘానిస్తాన్‌లోని బలగాల ఉపసంహరణ  విషయంలో ట్రంప్‌ ఏకపక్షంగా వ్యవహరించక పోయినప్పటికీ  బలగాల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటమో లేక ఉపసంహరించడమో చేయాలని లేఖలో కోరారు. బలగాలను వెనక్కి రప్పించుకోవటం ద్వారా అమెరికా దళాలకు జరిగే హాని నుంచి రక్షించుకోవాలని సూచించారు. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.
  • (Priyadarshini Krishna) వినడానికి అనడానికి కాదు, వెళతా అని చెప్పడానికి కూడా సంకోచించే విషయం... చాలామంది జీవితాల్లో ఇది చాల చిన్నవిషయం. ఈ ఆధునిక కాలం లో టాయిలెట్ అనేది మామూలు విషయం. దిగువ మధ్య ఎగువ సంపన్న అన్ని కుటుంబాల్లో టాయిలెట్/ అటాచెడ్ టాయిలెట్ అనేవి చాలా మామూలు విషయాలు. ఇంట్లో, స్కూళ్లలో, ఆఫీసుల్లో, రైల్వేస్టేషన్ బస్స్టేషన్ , సినిమాహాళ్లలో మాల్స్ లో ఈ టాయిలెట్ అనేది తప్పనిసరిగా ఉండటం ఇప్పుడు మామూలు విషయమే కాదు గవర్నమెంట్  రూల్ కూడా. గ్రౌండ్ రియాలిటీ అలా ఉందా ?  ముమ్మాటికీ లేదు... నాకు బాగా గుర్తుంది... కొన్నేళ్ల క్రితం ( నేను రిపోర్టర్ గ వున్నపుడు ) ఎలెక్షన్ కాంపైన్స్ లో రేణుక చౌదరిని ఒక ఆంగ్ల రిపోర్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమె సమాధానం నా మెదడులో నాటుకుపోయింది.  రిపోర్టర్ అడిగిన ప్రశ్న ' మగవారికి మీకు ఏంటి తేడా.. వారికంటే మీరు ఎలా మంచి నాయకురాలు అనిపించుకోగలరు ...' దానికి ఆవిడ సమాధానం ( మొత్తం పాఠం వదిలేసి ఇక్కడ అవసరమైన అంశం చూద్దాం )  '... రురల్ ఏరియాస్ లో, హైవే లో లాంగ్ డిస్టెన్స్ వెళ్లేప్పుడు చాలా ఇబ్బంది పడతాము. చుట్టు  మగవారు ... టాయిలెట్ కోసం నిరీక్షించాలి. మనకి వచ్చినపుడు కాకుండా అది కనపడినప్పుడే వెళ్ళాలి. పైగా మనచుట్టూ వున్నా మగవారు వెళ్లిపోయేవరకు ఆగాలి ... ' ఇలా చెప్పుకొచ్చారు.  ఫైర్బ్రాండ్ , ఉక్కు మహిళా వంటి పేర్లున్న రేణుక చౌదరి కే  ఇలాంటి సంఘటన తప్పలేదంటే ఇక మామూలు మహిళల పరిస్థితి అర్థం చేసుకోడానికి గొప్ప మేధావులవనవసరం లేదు. గ్రామాల్లోని దిగువ, మధ్య తరగతి ఇళ్లల్లో దొడ్డి ఉండటం ఒక లక్సురీ.. ఇప్పటికీ చాలా ఇళ్లలో టాయిలెట్స్ వుండవు. నాలుగైదు కుటుంబాలకు కలిసి ఒక టాయిలెట్, బాత్రూం ఉంటాయి. కొన్నిచోట్ల నీళ్లు వుండవు. ఎవరికీ వారు ఒక చెంబుడు నీళ్లు తీసుకెళ్లాలి.  ఇదిలా ఉంటే, ఇక ఆఫీసులు పబ్లిక్ ప్లేసులలో ఆడవారికి విడిగా టాయిలెట్లు ఉండటం వాటిలో నీళ్లుండటం , టాయిలెట్లు శుభ్రంగా ఉండటం అంటే అత్యాశ. చాలా గవమెంట్ ఆఫీసుల్లో అసలు టాయిలెట్లు అంటే పరమ రోత జాగాలు. బస్సుస్టేషన్ లో ఇప్పుడున్నట్లు పే& యూస్ టాయిలెట్లు ఒక ఐదారేళ్ళ క్రితం లేనే లేవు...! గవమెంట్ ఆఫీసు సంగతి పక్కనపెట్టండి, నేను పనిచేసిన ఒకానొక చోట పాహేనుమంది వున్న మొత్తం ఆఫీసుకు ఒకే ఒక టాయిలెట్, అదికూడా ఎడిటర్ అనబడే ఎండీ రూమ్ ముందునుంచివెళ్లాలి. మనోవిశ్లేషకుడు రాజకీయవిశ్లేషకుడు అని పేరుసంపాదించిన ఒకానొక వ్యక్తి ఆఫీసు అది. నేను సీటులోంచి లేచి (మొహమాటంగానే ) అటువైపు వెళుతుండగా , ఆ సదరు బాసు ఆపి ఎక్కడికి అని అడిగాడు, పనెగ్గొట్టి పోతున్నానేమో అనుకుని. చేసేదిలేక చిటికెన వేలు చూపించాను. నా నోటికి మెదడుకి కొన్నిసార్లు కనెక్షన్ పోతుంది. అది సరిగ్గా అదే టైం. నోట్లోంచి టాయిలెట్ కి కూడా మిమ్మల్ని అడిగేవెళ్ళాలా అని అలవోకగా వచ్చేసింది. తలదించుకుని ఏమి వినునట్లు పని నటించేసాడు. టాయిలెట్ నుంచి వచ్చాక నాకు ఎంతో ఇష్టమైన 'రాజీనామా' సమర్పించి థాంక్స్ చెప్పి వచ్చేసా.  ఇది ఇలా ఉంటే... ఇక పీరియడ్స్ సమయంలో ఆడవారి బాధలు ఎవరికీ చెప్పుకోలేనివి. స్కూల్స్ సంగతి సరేసరి. అసలా ఆడపిల్లలు తమ బాధల్ని ఎలా నెట్టుకొస్తున్నారో తలచుకుంటేనే కన్ను తడిబారిపోతుంది. ఆడవారి అగచాట్లను అర్థంచేసుకులే నాధుడు పుట్టలేదని చెప్పొచ్చు.  అంతెందుకు, మన ఇళ్లలో పనిచేసే ఇంటిపనివారిని మన టాయిలెట్లు వాడుకోనిస్తామా.. అపార్ట్మెంట్ కింద వాచ్మాన్ ఇంటికి ఆనుకుని వున్న టాయిలెట్ ఎంత సౌకర్యంగా ఉందొ మనలో ఎంతమందికి తెలుసు. చాలా చోట్ల టాయిలెట్స్ అనబడే నాలుగోడలు ఉంటాయి. అందులోకి వెళ్ళామా మనవెంట కిలోల కొద్దీ క్రిములు రావడం ఖాయం. కొన్ని చోట్ల అసలు టాయిలెట్ ఉందన్న విషయం మర్చి పోవడమే  మంచిది.  పైన పటారం టైపులో ఎందరో బిజినెస్మెన్లు నడిపే ఆఫీసుల్లో ఆడవారి టాయిలెట్లు ఎంత భయానకంగా వుంటాయో ఫోటోలు తీసి సోషల్ మీడియా లో సర్క్యులేట్ చెయ్యాలి. మొహం తేట మొలగజ్జి అనే సామెత ఈ బాసులకు  సరిగ్గా సరిపోతుంది. బిజినెస్ చేసేవారినుంచి రాజకీయనాయకులవరకు ఎవరు కూడా అసలు టాయిలెట్ అనేది మనజీవితానికి అవసరమైనది అనుకోకపోడం నిజంగా బాధాకరం. నన్నడిగితే సెక్స్ కంటే ఎంతో ముఖ్యమైనది మల,మూత్రవిసర్జన. చాలారాయాలని వుంది. నిజాలు రాస్తే చదివే ధైర్యం ఎందరికుందో నాకు అంచనా లేదు.  అందుకే ఇక్కడే ఆపేస్తున్నాను ...!
  • పులస పేరు వినగానే ఎవరికైనా నోరూరుతుంది. ఆ పులస చేపలు  ప్రపంచంల్లో ఎక్కడా లేని విధంగా గోదావరి ఆనకట్ట దిగున ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. గోదావరిలో ఎర్ర నీరు ఉన్నడు మాత్రమే లభించే ఈ పలసల్ని వేటాడేందుకు మత్స్యకారులు పడే శ్రమ అంతాఇంతా కాదు. దూర ప్రాంతాలలోను, దేశవిదేశాల్లో ఉంటున్న బంధుమిత్రులకు, ఈ పులసకూరలోని  రుచి చూపించి అనంద పడుతుంటారు.  పులస శాస్త్రీయ నామం హిల్సా.  సముద్రంలో ఉన్నప్పుడు దీనిని ఇలస (విలస) అంటారు. గోదావరి ఎర్రనీరుకు ఎదురీదుతూ వచ్చినప్పుడు పులసగా మారుతుంది. దీని జన్మస్థానం గోదావరే. ఇక్కడ పుట్టిన పులస పిల్లలు ఆహారం కోసం బంగాళాఖాతంలోకి చేరి సముద్రంలోనే జీవిస్తాయి. బంగాళాఖాతం నుంచి హిందూ మహా సముద్రంలోకి చేరిన విలస ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ టాంజినాయా వంటి ప్రాంతాల్లో నివసిస్తుంది. వర్షాల సీజన్‌లో సంతానోత్పత్తి కోసం తిరిగి బంగాళాఖాతంలోకి వస్తుంది. నదీ, సముద్ర సంగమ ప్రాంతాల్లో సంతానోత్పత్తి కోసం ఎక్కువగా సంచరిస్తాయి. గోదావరికి వరద తాకగానే ఎర్రనీరుకు పులస ఎదురీదుతుంది. అలా ఎదురీదుతూ వచ్చే విలస... పులసగా మారుతోంది.   పశ్చిమగోదావరిజిల్లా నరసాపురం నుండి విశ్లేశ్వరం వరకు సంప్రదాయ వేట బొట్లు  తెల్లవారుజాము నుండి సందడి చేస్తుంటాయి. ఆ సందడుల్లో గాలిలో విచ్చుకుంటున్న వల కళ్ళు మూసి తెరిచేలోపే నీటిలోకి సర్రున దూసుకెళ్లి.. జలపుష్పాలల్లో రాజైన పులసల్ని బంధిస్తూ..మనకు చక్కటి పులసల్ని అందిస్తాయి.…అంతేకాక పులస పై సామెతలు కూడా బాగా వాడుకలో ఉన్నాయి.. పుస్తెలైనా అమ్మి పులసకూర తినాలన్న సామెత ఒకటి బాగా  ప్రాచుర్యంలో  ఉండటాన్ని గమనిస్తే..పులస కూర పై మనకున్న ఎనలేని అభిమానమనే చెప్పాలి.  ఇతర చేపల మాదిరిగా పులసకూర వండడం అంత సులువు కాదు..దీన్ని ప్రత్యేకమైన పొయ్యిలపై… వెన్న రాసిన మట్టి  కుండలో వండటం ఓ ప్రత్యేకత..ఇలా వండటం  వల్ల పులస ముక్కలో ఉన్న ముళ్లు కరిగి పోతాయి. తద్వారా పులస ముక్కను ఇట్టే తినేయచ్చు.. అయితే ఈ పులస కూరను ఈ రోజు వండి తిన్నదాని కంటే మరుసటి రోజు తింటే..చాలా రుచిగా ఉంటుంది.  అయితే..  దీనికి ఇంత రుచి ఉండటానికి కారణం…ఇలసగా పిలవబడే ఓ రకమైన చేప సముద్రంలో పెరుగుతుంది. ఈ చేప జూన్ మాసంలో కురిసే వర్షాల వల్ల.. గోదావరిలోకి ఎర్రనీరు చేరగానే..ఈ ఇలస.. గుడ్లు పెట్టడానికి ఉప్పనీటిలోంచి గోదావరి చప్పనీటికి ఎదురు ఈదుకుంటూ వచ్చే సందర్భంలో ఇలస శరీరంలో మార్పులు చోటుచేసుకొని..పులసగా మారుతుంది.. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, చించినాడ, సిద్ధాంతం, విశ్లేశ్వరం , తూర్పుగోదావరిజిల్లాలోని అంతర్వేది, రావులపాలెం ధవళేశ్వరం ప్రాంతాలలో మాత్రమే పులసల అమ్మకాలు ఎక్కువగా సాగుతాయి. ఈ  పులసలు సైజును బట్టి ఒక్కో చేప ధర రెండు వేల నుండి ఆరు వేలరూపాయల వరకు పలుకుతుంటాయి.  అయితే సముద్ర జలాల్లో కాలుష్యం పెరుగుతున్న కారణంగా  పులస చేపలు గతం లో మాదిరిగా దొరకడం లేదు. భవిష్యత్తులో పులస మరీ అరుదుగా దొరికే చేప గా మారే ప్రమాదం ఉంది. 
  • ఇప్ప‌టికే ఉత్త‌ర కొరియా హెచ్చ‌రిక‌ల‌తో  గువామ్ ప్ర‌జ‌లు వణికి పోతున్నారు. ఈ లోగానే   పిడుగు లాంటి   రెడ్ అలర్ట్ వార్తలతో  వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అక్క‌డి రెండు రేడియో స్టేష‌న్లు. పొర‌పాటున ప్ర‌జ‌ల‌కు ఎమ‌ర్జెన్సీ వార్నింగ్ జారీ చేశాయి.  ఆ హెచ్చరికలు వినగానే ఇంకేముంది  నిజంగానే ఏదో ప్ర‌మాదం ముంచుకొచ్చింద‌ని వాళ్లు నానా హైరానా పడ్డారు.నిన్న అర్ధ‌రాత్రి 12.25 గంట‌ల‌కు రెండు రేడియో స్టేష‌న్లు ఈ అలెర్ట్ జారీచేశాయి. సహజంగా ఉగ్ర‌దాడులు, మిలిట‌రీ దాడులు జ‌రిగిన స‌మ‌యంలోనే ఈ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తారు. ఇవన్నీ  చాలా అరుదుగా జ‌రిగే సంఘ‌ట‌న‌లు. 15 నిమిషాల పాటు రేడియో స్టేష‌న్లు ఈ అలెర్ట్ జారీ చేశాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తి పోయారు. అయితే  ఆ హెచ్చరికలు అన‌ధికారికంగా చేస్తున్న ఓ ప‌రీక్ష‌లో భాగంగా అవి జారీ అయ్యాయ‌ని, ఎలాంటి ముప్పు లేద‌ని గువామ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ అధికారులు  మళ్ళీ ప్రకటన జారీ చేశారు .అయితే  ప్రజలు  మొదటి హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని ఏ నిమిషంలో ఏ మిస్సైల్ వచ్చి పడుతుందో అని  ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లల్లో  కూర్చుని వణికిపోతున్నారు. అమెరికా ప్రభుత్వానికి ఈ సంగతి తెలిసి  ఇలాంటి త‌ప్పిదం మ‌ళ్లీ జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఆ రేడియో స్టేష‌న్ల‌ను హెచ్చ‌రించింది . ఆందోళ‌న‌కు గురైన ప్ర‌జ‌ల‌కు స‌ర్దిచెప్ప‌డానికి అధికారులు ఇంకా ప్రయత్నిస్తున్నారు . గువామ్‌పై నాలుగు మిస్సైల్స్‌తో దాడి చేస్తామ‌ని గ‌త వారం ఉత్త‌ర కొరియా హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. అప్ప‌టి నుంచి ఇక్క‌డ ఉండే ల‌క్షా 63 వేల మంది ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటున్నారు.ట్రంప్ కూడా యుద్ధానికి సిద్ధమే అని హెచ్చరించడం తో  వారి ఆందోళన పెరిగింది. ఇక్కడున్నవారంతా దాదాపుగా అమెరికన్లే. ఆండర్సన్ ఎయిర్ ఫోర్స్ కి గువామ్ కేంద్రం . అలాగే అమెరికా నావికా కేంద్రం కూడా. ఈ ద్వీపం  30 మైళ్ళ పొడవు .. 8 మైళ్ళ వెడల్పు విస్తీర్ణంలో ఉంది.  
  • కొలనుపాక చండికాంబ సహిత సోమేశ్వరాలయానికి ఘనమైన చరిత్ర ఉంది.  వీరశైవ మతాచార్యులు శ్రీశ్రీ రేణుకాచార్యుల జన్మస్థలంగా ఉన్న కొలనుపాక సోమేశ్వరాలయానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. సోమేశ్వర మహాలింగం నుంచి ఉద్భవించిన ఈ ఆచార్యులు వీరశైవమతాన్ని ప్రపంచానికి బోధించి లింగంలోనే ఐక్యం చెందాడని అంటారు.  కొలనుపాక శివారుప్రాంతాల్లో  జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ శిలాశాసనాలు, దేవతా ప్రతిమల ఆధారంగా ఇక్కడి చరిత్ర మనకు తెలుస్తోంది. దక్షిణ కాశిగా పిలువబడే ఈ గ్రామంలో కాశీలో ఉన్నట్లుగా 18 సామాజిక వర్గాలకు మఠాలు ఉన్నాయి. అలాగే చండీశ్వరీ ఆలయం, కోటిలింగేశ్వరాలయం, భైరవస్వామి  ఆలయం, రుద్రమహేశ్వరాలయం, ఏకాదశరుద్రాలయం, మల్లికార్జున స్వామి ఆలయం, క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి ఆలయాలు ఉన్నాయి.   వీరశైవ మతగురువైన రేణుకాచార్యులు చండికాంబ సహిత సోమేశ్వరాలయంలోని స్వయంభూ లింగం నుంచి ఉద్భవించి చివరకు అదే లింగంలో ఐక్యం అయినట్లు వీరశైవ కవి షడక్షరుడు రాసిన రాజశేఖర విలాసంలో ఉంది. వీరశైవ మతోద్ధరణ కోసం రేణుకాచార్యులు ఎంతోకృషి చేశారు . ఈ శైవపీఠానికి సంబంధించిన వివరాల ప్రకారం తానుకేశుడనే శైవాచార్యునికి రుద్రమునీశ్వరుడనే కుమారుడున్నాడు. తానుకేశుని అనంతరం రుద్రమునీశ్వరుని లింగాయతు మతానికి అధిపతిని చేశాడు.  ఆయన కొలనుపాక కేంద్రంగా వీరశైవ మతాన్ని స్థాపించి ప్రచారం చేశాడని చెబుతారు.  10, 11వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్యుల కాలం నాటినుంచి నేటివరకు సోమేశ్వరుడు, చండికాంబ దేవతలు నిత్యపూజలు అందుకుంటున్నారు. చాళుక్యుల కాలంలో కొలనుపాక గ్రామం రాజప్రతినిధి స్థానంగా ఉండేదని సమాచారం. సైనికపరంగా దక్షిణాపథంలో కొలనుపాక ముఖ్యకేంద్రంగా ఉండేదట. రాజులు, రాజప్రతినిధులు  ఆలయ నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేసినట్లు దొరికిన శాసనాల్లోరాసి ఉంది అంటారు.  యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఉన్న ఈ దేవాలయానికి దేశ, విదేశాల నుంచి భక్తులు రోజు వచ్చి పోతుంటారు. మధ్యయుగానికి ముందు నుంచే ఇక్కడ ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టమెనదిగా చెబుతారు.  ఇక్కడ స్వామి వారు లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తారు.  ఈ ఆలయంలో ఉన్న సహస్ర లింగేశ్వరుని కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సోదరి మైలాంబ ప్రతిష్టించినట్లు ప్రతీతి. ప్రధానాలయంలోనే చండికాంబ అమ్మవారు ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చమని అమ్మవారికి భక్తులు ముడుపులు కడతారు. కోర్కెలు తీరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోయడం ఇక్కడ ప్రత్యేకత. పక్కనే కోటొక్కలింగం అత్యంత రమణీయంగా భక్తులకు కనువిందు చేస్తుంది. దేవదేవుని ప్రతిరూపమైన లింగాకారానికి ఖర్జురపు పండ్ల ఆకారంలో చెక్కబడిన చిన్నచిన్న లింగాలన్నిటినీ కలుపుకుంటే కోటొక్కటి ఉంటాయని చెబుతారు. ఈ కోటొక్కలింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఆలయం ప్రాంగణంలోనే  పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ఈ కొలనుపాక ఆలయం, గ్రామ చరిత్రకు సంబంధించిన పలు విషయాలను తెలియ జేస్తుంది. కళ్యాణ చాళుక్యులు, కాకతీయ రాజుల ఏలుబడిలో గొప్ప శైవక్షేత్రంగా కొలనుపాక వెలుగొందిన విషయాలను విపులంగా వివరిస్తోంది. కొలనుపాక సోమేశ్వరాలయానికి తెలంగాణతో పాటు ప్రతి నిత్యం కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి లింగాయత్‌లు వస్తారు. తమ ఆరాధ్యదైవం సోమేశ్వరునితోపాటు జగద్గురువు రేణుకాచార్యులను దర్శనం చేసుకుని వెళ్తారు. శివరాత్రి పర్వదినం రోజు వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దేశ విదేశాల పర్యాటకులు వచ్చిపోతుంటారు. హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది కొలనుపాక. యాదాద్రి దివ్యక్షేత్రం నుంచి 20 కిలోమీటర్ల దూరం! ఇక్కడికి  ఆర్టీసీ బస్‌లు, రైళ్లు ఉంటాయి. భక్తులు ఆలేరులో దిగిన తర్వాత ఆటోలు, ఆర్టీసీ బస్‌లలో ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాకకు వెళ్లవచ్చు. ఆలేరు– చేర్యాల మార్గంలో కొలనుపాక ఉంది.
  • చూస్తే చిన్న దేశం...ఆర్ధికంగా అంత పటిష్టం గా లేని దేశం ... కానీ అగ్రదేశం అమెరికా తో  యుద్ధానికి సై అంటోంది. దేశం...  అసలు ఉత్తర కొరియాకున్న ధైర్యమేంటి? పలు దేశాలకు అర్ధం కాని విషయం  ఇదే . నిజంగా ఉత్తర కొరియాకు అంత సీన్ ఉందా? సత్తా ఉందా ?  రాత్రికి రాత్రే ఉత్తర కొరియాపై యుద్ధానికి దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన  కూడా తొణకడం లేదు బెణకడం లేదు. అసలు ఏమాత్రం అమెరికా  హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాదు తమ జోలికి వస్తే అమెరికా మటాష్ అంటూ  రివర్స్ గేర్ లో మళ్ళీ హెచ్చరిస్తోంది. సైలెంట్ గా  తనపని తాను చేసుకుపోతోంది. ప‌సిఫిక్ స‌ముద్రంలోని అమెరికా దీవి గ్వామ్ పై దాడి చేసేందుకు రెడీ అవుతోంది . కిమ్ ఓకే అంటే చాలు క్షిపణుల వర్షం కురిపిస్తామంటున్నారు ఉత్తరకొరియా సైనికాధికారులు. ఉత్తర కొరియా నుంచి గ్వామ్ దీవి 3వేల 4 వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. తమ క్షిపణులను ప్రయోగిస్తే ఈ దీవిపై 14 నుంచి 18నిమిషాల్లోనే పడతాయంటోంది ఉత్తర కొరియా. ఇందుకోసం హసంగ్ 12 మిసైళ్లను సిద్ధం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన ఉత్తరకొరియా మిలిట‌రీ ప‌రేడ్‌లో వీటిని ప్రదర్శించారు. హాసంగ్ క్షిప‌ణి సుమారు 3700 కిలోమీట‌ర్ల దూరం ప్రయాణించగల సామర్ధ్యాన్ని కలిగి ఉందట.   కాగా, గ్వామ్ ఫసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీపం. అందులో లక్షా 60వేల జనాభా నివసిస్తోంది. ఈ దీవిలో అమెరికాకు చెందిన సబ్‌ మెరైన్ల స్క్వాడ్రన్‌, ఒక ఎయిర్‌బేస్‌, కోస్ట్‌ గార్డు గ్రూప్‌లు ఉన్నాయి. ఈ కారణంగానే దీవీపై దాడి చేస్తే అమెరికాకు గట్టి దెబ్బ తగిలినట్లవుతుందని భావించి.. అమెరికా గనుక రెచ్చిపోతే ఈ దీవిని ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ హెచ్చరించారు. అమెరికా దూకుడుగా వెళ్తే, దాడి చేయాలని చూస్తే, ఉత్తర కొరియాకు బాసటగా నిలిచేందుకు చైనా సిద్ధంగా ఉంది. గత యుద్ధాల్లోనూ చైనా అదే పనిచేసింది. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఫోన్ చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెంచే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వివాదంపై చర్చలకు రావాలని ఉత్తర కొరియాకు కూడా సలహానిచ్చారు. అయితే నిజంగా యుద్ధం వస్తే మాత్రం చైనా, ఉత్తర కొరియా తరపునే నిలబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు .  అదే జరిగితే.. నష్టతీవ్రత ఊహించనంత జరుగుతుంది.  అటు అమెరికాకు చెందిన గ్వామ్ దీవిపై క్షిపణులు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా ప్రకటించడంతో జపాన్ కూడా క్షిపణులను సిద్ధం చేసింది. ఎందుకంటే గ్వామ్ పైకి కొరియా దాడి చేయాలంటే జపాన్‌ను అవి దాటి వెళ్లాలి. అందుకే షిమానే, కోచి, హిరోషిమాలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది. క్షిపణి విధ్వంసక వ్యవస్థను ఏర్పాటు చేసింది.  మరోవైపు అవసరమైతే దక్షిణ కొరియాపై కూడా దాడి చేస్తామంటున్న ఉత్తర కొరియా అణుసామర్థ్యంపై అనేక సందేహాలున్నాయి. నిజానికి ఉత్తర కొరియా పూర్తిగా చైనా, రష్యాల అణు, క్షిపణి సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి తన ఆయుధ సంపత్తికి పదును పెడుతోంది. బాలిస్టిక్‌ క్షిపణికి అణువార్‌హెడ్లను అమర్చి వాషింగ్టన్‌ను కొట్టగలిగేంతటి సాంకేతిక పరిజ్ఞానం ఆ దేశానికి ఉందా..? పలు దేశాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.  మొత్తం మీద ఇరు దేశాల ప్రకటనలతో ఉద్రిక్త వాతా వరణం నెలకొంది.  అమెరికాలాంటి పాశ్చాత్యదేశాల అండదండలతో దక్షిణ కొరియా ఆర్థికంగా కొంత మేరకు  బలపడింది. సాంకేతికరంగంలో దూసుకెళ్తోంది. కమ్యూనిస్టు దేశమైన ఉత్తర కొరియాలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. నియంతలపాలనలో మగ్గుతున్న ఈ దేశంలో పేదరికం తాండవిస్తోంది. ఆంక్షలతో ఆర్థిక పురోగమనానికి సంకెళ్లు పడ్డాయి. ఇలాంటి  ఉత్తర కొరియా  తమ దగ్గర పదివేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణులున్నాయని చెప్పుకుంటోంది. అమెరికా అంతా తమ టార్గెట్‌లోనే ఉందని చెబుతోంది . అయితే అణువార్‌హెడ్‌ను మోసుకెళ్లగలిగే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించే సత్తా ఉత్తర కొరియా దగ్గర లేదని  అంటున్నారు.  ఇదిలా  ఉంటే  చైనా జోక్యం తర్వాత  అమెరికా ఆలోచనలో పడినట్టుంది.  కొరియా ద్వీపంలో అణు పరీక్షలు జరగకుండా అణ్వాయుధాల తయారీలేకుండా తటస్థీకరించడమే అమెరికా, చైనాల అజెండా అని, ఆ ప్రాంతంలో శాంతి పరిస్థితులు, స్థిరత్వం కొనసాగింపు తమ ఉమ్మడి బాధ్యత అని జిన్‌పింగ్‌ చెప్పినట్లు సమాచారం.  మొత్తం మీద  ట్రంప్ టెంపర్మెంట్ ను కిమ్ బాగా గ్రహించినట్టుంది. అందుకే రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా అమెరికా తో పెట్టుకుంటే నష్టపోయేది ఉత్తర కొరియానే. 
  • పోలవరం బాహుబలి సినిమా లాగే ఉందన్నారు మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పే వాటికి ...   జరిగే పనులకు అసలు పొంతనే లేదన్నారు ఆయన . పట్టిసీమ , పోలవరం , పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మీడియా తో కలిసి పరిశీలించిన డాక్టర్ దగ్గుబాటి ఇదెక్కడి పనితీరు అంటూ విరుచుకు పడ్డారు. ఇతర వివరాలకోసం  వీడియో చూడండి. 
  • ఈ నెల 18న పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పోలవరం పరిశీలనకు వస్తోన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి అన్ని పరిశీలించిన పిదప ఉండవల్లి పోలవరాన్ని పూర్తి చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. వైఎస్‌ వల్లే పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలిందని ఆయన అన్నారు. పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతలకు అయ్యే ఖర్చుతో పోలవరం పూర్తయ్యేదని చెప్పారు. మరికొన్ని విశేషాలకోసం వీడియో చూడండి. 
  • జనరల్ గా ఇలాంటి కథనాలు ....  ముఖ్యంగా  వైఎస్ కి అనుకూల కథనాలు  ఆంధ్రజ్యోతిలో ప్రచురితం కావు .  మరి ఈ కథనం ఎలా వచ్చిందో ఏమో?  ఆంధ్ర జ్యోతి కథనాన్ని యధాతధంగా ఇస్తున్నాం. చదవండి.  ..............................................  " టీడీపీ కి చెందిన ఏ ఇద్దరు నేతలు లేదా ఇద్దరు కార్యకర్తలు కలిసినా పరిస్ధితి బాగా లేదని మాట్లాడతారు. ఇద్దరు కీలక నేతలు కలిసినా అధినేతను ఆఫ్ ద రికార్డ్‌గా దూషిస్తూ ఉంటారు. అలా మాట్లాడే వారేమీ పదవులు అనుభవించని వారు కాదు. గతంలో ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ ఛైర్మన్లుగా వ్యవహరించి ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అధినేతను బయటవాళ్లు ఎవరూ విమర్శించటం లేదు. తెలుగుదేశం వాళ్లే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారని ఓ పరిశీలకుడు విశ్లేషించారు కూడా. ఇలా ఎందుకు జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకోండి.  కోస్తాలో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తెలుగుదేశం కార్యకర్తల్లో ఎందుకో తెలియని అసంతృప్తి. అధికారానికి ఎప్పుడూ దగ్గరగా ఉండకూడదు అంటారు. దగ్గరగా ఉంటే అధికారం మీదకు వస్తుంది. లోటుపాట్లు తెలుసుకుంటే అసంతృప్తి బయలుదేరుతుంది. అధికారాన్ని అనుభవించే వారిని చూసి, మనమూ అనుభవిస్తే బాగుండుననే ఆశ కలుగుతుంది. ఆ ఆశ నెరవేరకపోతే అసంతృప్తి బయలుదేరుతుంది. ప్రభుత్వం మన దగ్గరే ఉండి, మనకి ఉపయోగపడకుండా ఉందనేదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోని కొంతమంది నేతల వాదనగా ఉంది.  హైదరాబాద్‌లో సచివాలయం, ముఖ్యమంత్రి, హెచ్ఓడీ కార్యాలయాలు ఉన్న సమయంలో ప్రభుత్వం గురించి ఆంధ్రాలో మాట్లాడేవాళ్లు తక్కువ. ఎన్నికల సమయంలో మినహా మిగతా సమయాల్లో ఎవరి పనిలో వాళ్లు ఉండేవారు. ఇప్పుడు అధికారం ఇళ్లల్లోకి వచ్చేసింది. ప్రభుత్వం ముంగిట్లో వాలిపోయింది. దగ్గరగా చూసే అవకాశం కలిగింది. చిన్నవాటికే స్పందించే గుంటూరు, కృష్ణా జిల్లాల జనం ముఖ్యంగా తెలుగుదేశం నేతలు ఇప్పుడు బోలెడన్ని విషయాలపై చర్చలు చేస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లోని తెలుగు తమ్ముళ్లు ప్రస్తుతం తెగ ఆందోళన పడిపోతున్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించేది కూడా చంద్రబాబు తమ్ముళ్లే. వీరు చేసే గోల అంతాఇంతా కాదు. ఏదో జరిగిపోయినంత ఫీలింగ్, ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు. రెండు పచ్చచొక్కాలు కలిశాయంటే చాలు... గోరంతలు కొండంతలుగా చెప్పుకుంటారు. చర్చ ముదిరే సమయానికి చంద్రబాబును కూడా దూషిస్తూ ఉంటా.  ఇటీవల సచివాలయంలో ఇదే అంశంపై ఓ అయిదుగురు మంత్రుల మధ్య చర్చ జరిగింది. తెలుగుదేశం నేతలు కలిస్తే ఎందుకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, చంద్రబాబును ఎందుకు దూషించాల్సి వస్తుందని ఆ మంత్రులు విశ్లేషించారు. పదవి ఇవ్వకపోయినా పరవాలేదు.. ఎవరైనా వెళ్ళినప్పుడు భుజం మీద చేయివేసి, ఆప్యాయంగా పలకరిస్తే చాలని, ఎలా ఉన్నారంటూ యోగక్షేమాలు అడిగితే వారు ఆనందపడతారని ఓ మంత్రి తన అభిప్రాయం చెప్పారు. ఈ తరహా హ్యూమన్ టచ్ చంద్రబాబులో కనిపించడం లేదనీ, వైఎస్ లో ఉన్నదీ- చంద్రబాబులో లేనిదీ ఇదేననీ సదరు అమాత్యవర్యులు వ్యాఖ్యానించారు.  వారం రోజుల క్రితం ఓ మంత్రి ముఖ్యమంత్రిని కలిసేందుకు ఆయన కార్యాలయానికి వెళ్ళారు. అప్పటికే ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చంద్రబాబు కోసం ఎదురుచూస్తున్నారు. చంద్రబాబు ఛాంబర్‌లో మీటింగ్ జరుగుతుందని సీఎంఓ సిబ్బంది చెప్పారు. అప్పటికే రెండు గంటలు ఎదురుచూసిన ఆ ఎమ్మెల్యేల్లో, మంత్రిలో అసహనం బయలుదేరింది. తీరా చూస్తే, ఓ అధికారి తాపీగా బయటకు వచ్చారు. ఆ తర్వాత మంత్రికి, ఎమ్మెల్యేలకు దర్శనం దొరికింది. ఎమ్మెల్యేలకు కేవలం ఒక్క నిమిషం మాత్రమే టైమ్‌ దొరికింది. వారు చెప్పింది విని సీఎం పంపించారు. ఇలా చేయటం వలనే తాము చెప్పదలుచుకున్నది కూడా పూర్తిగా చెప్పకుండా వెనక్కు వచ్చామని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ఇలాంటి అసంతృప్తే అందరిలో ఉందనీ, వెళ్లిన వారిని ఓ అయిదు నిమిషాలు కూర్చోబెట్టి మాట్లాడితే వారు సంతృప్తి చెందుతారనీ మరో మంత్రి విశ్లేషించారు.  వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వెళ్ళినా నవ్వుతూ పలుకరించి, భుజం మీద చేయివేసి మాట్లాడేవారనీ, బాబులో ఆ లోపం స్పష్టంగా కనిపిస్తోందనీ మరో మంత్రి అన్నారు. ఈ అయిదుగురు మంత్రుల మధ్య చర్చ జరుగుతుండగా, ఓ జిల్లా పార్టీ అధ్యక్షుడు అక్కడకు ఎంట్రీ ఇచ్చారు. ఈ చర్చలో పాల్గొన్న ఆయన "నేను మూడు నెలల నుంచి సీఎంతో అయిదు నిముషాలు మాట్లాడదామని ఎదురుచూస్తున్నా. జిల్లా పార్టీ వ్యవహారాలతోపాటు, ఓ ఇన్‌చార్జ్‌ గురించి మాట్లాడదామని ప్రయత్నించగా సమయం ఇవ్వలేదు. ఈలోపు అతను రాజీనామా చేశాడు. అతనిని కూర్చొపెట్టి మాట్లాడితే రాజీనామా వరకు వ్యవహారం వచ్చి ఉండేది కాదు. రేపు జనంలోకి వెళ్ళాల్సిన ఎమ్మెల్యేలతోనే ఇలా ఉంటే ఎలా..?'' అని ఆయన తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.     టీడీపీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలకు సీఎం దర్శనభాగ్యమే కరువైంది. అందుకే అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోందని మంత్రులు విశ్లేషించారు. తెలుగుదేశాన్ని ఆ పార్టీ నేతలే విమర్శించటానికి కారణం ఇదేనని కొంతమంది మంత్రులు చెప్పగా, గుంటూరు, కృష్ణా జిల్లాల వాళ్లకు 99 పనులు చేసి, ఒక పని చేయకపోయినా తాటాకులు కడతారని మరో మంత్రి వ్యాఖ్యానించారు. అధినేతలో మార్పు రావాలనీ, ఆప్యాయంగా పలుకరించి, చెప్పింది వింటే అందరూ సంతృప్తి చెందుతారనీ మంత్రులందరూ ముక్తాయింపు ఇచ్చారు. ఇదండీ బాబుగారి వ్యవహారశైలిపై తమ్ముళ్లలో నెలకొన్న అభిప్రాయం! " link..... http://www.andhrajyothy.com/artical?SID=450142