Latest News
banner News

మోక్షం !!!

1st Image

 ( సుశ్రీ )  ........................................ స్వామి నాకు మోక్షం ఎలా లభిస్తుంది?” ఆ యువకుడు అడిగాడు.
“గంగా నది లో స్నానం చెయ్యి” అన్నాడు గురువు.
“గంగానది ఎక్కడ?”
“ఇలా ఉత్తర దిక్కుగా వెళ్ళు.”
ఆ యువకుడు బయలుదేరాడు. రాత్రింబవళ్ళు ప్రయాణం చేశాడు. ఎండనకా వాననకా నడిచాడు.
 కొంత కాలానికి ఉత్తర దిక్కుగా ఒక నది కనిపించింది. 
అతను ఆ నదిలో స్నానం చేశాడు. పులకరించి పోయాడు. 
పక్కనే ఒక పాకా వేసుకున్నాడు. చుట్టూ పొలాలలో పనికి వెళ్ళాడు. రోజు నిష్టగా స్నానం చేసేవాడు. గంగలో మునుగుతూ పరవశించి పొయ్యేవాడు. 
కొన్నాళ్ళకి ఒక సాధువు అతనిని గమనించాడు.
“ఏమిటి నాయనా? ఇంత నిష్టగా నదీ స్నానం చేస్తున్నావు?” అని అడిగాడు. 
“గంగా నది లో స్నానం చేస్తే మోక్షం వస్తుందని మా గురువు గారు చెప్పారు”
ఆ సాదువు అతన్ని చూసి జాలి పడ్డాడు. “ఇది గంగ కాదు నాయనా. ఇంకా దూరం ఉంది. ఉత్తరంగా చాలా దూరం పోవాలి”
అతను హతాశుడయ్యాడు. అక్కడి నుండి మళ్ళీ ఉత్తర దిక్కుగా ప్రయాణం ప్రారంభించాడు. 
కొన్ని ఆమడలు నడిచాక మరొక నది కనిపించింది. పెద్దది. నిండుగా ఉంది. గొప్పగా ఉంది.
అతను తిరిగి అందులో స్నానం చేశాడు. అక్కడే ఉండి పోయాడు. 
కొందరు పాదచారులని అడిగాడు. “ఇది గంగా నదేనా?”
“అయ్యో కాదు మిత్రమా .. ఇంకా చాలా దూరం ఉంది. మాతో రా. మేము అక్కడికే వెలుతున్నాం”
అతను వాళ్ళను అనుకరించాడు. ఎంతో కఠిన మయిన ప్రయాణం. ఆరోగ్యం సహకరించలేదు. కుంభమేళా వద్దకి చేరారు. కనుచూపు మేర లో “పవిత్ర గంగ” అతను రద్దీలో చిక్కుకు పోయాడు. తొక్కిసలాటలో నలిగి పోయాడు. అనారోగ్యం అతన్ని మింగేసింది. తనువు చాలించాడు.
***
చిత్ర గుప్తుడు భటులని మందలించాడు. ”ఇతని కోసం స్వర్గ ద్వారాలు తెరిచి ఉన్నాయి. నిత్య గంగా స్నానం చేసిన పుణ్యఫలం తో ఇతనికి మోక్షం సిద్దించింది. వెంటనే దైవ మర్యాదలతో స్వర్గం లో దిగబెట్టి రండి.” . అన్నాడు. 
***
ఒక్కసారి కూడా గంగ లో మునక వేయకుండా అతనికి ఆ పుణ్యఫలం ఎలా వచ్చింది??
తను స్నానం చేసిన ప్రతి నదిని గంగ గానే భావించాడు. అతనికి ఆ నదులు గంగ గానే తోచాయి. వాటిలో స్నానం చేస్తూ పులకరించాడు. పరవశించాడు. అతనికి గంగ స్నానపు మోక్షం సిద్దించింది.
 గమ్యమే కాదు. ప్రయాణం ఎలా చేస్తున్నాం అన్నది కూడా ముఖ్యమే!!

  • సాంకేతికపరంగా ఎంతో అభివృద్ధిని సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న  మనకు ఈనాటికి జవాబులు దొరకని చిక్కు ప్రశ్నలు, మిస్టరీలు  ఎన్నో ఉన్నాయి .  ఎన్నో వేల ఏళ్ళ క్రితం  నిర్మించిన ఆలయాలు  ఈ నాటికి  సైంటిఫిక్ గా తేల్చలేని ఎన్నో రహస్యాలను కలిగి ఉన్నాయి.   వాటిలో ఒకటి...  బుద్ధ నీలకంఠ ఆలయం....  ఈ పేరు విని ఇదేదో బుద్ధుని ఆలయం అనుకుంటే పొరపాటే. అది సాక్షాత్తూ శ్రీ మహా విష్ణు ఆలయం. మరి బుద్ధ నీలకంఠ అనగా పురాతన నీలపు రంగు కలిగిన విగ్రహమూర్తి అని అర్ధం. ఇది నేపాల్ లో వుంది.ఈ ఆలయంలోని శ్రీ మహా విష్ణువు ఆదిశేషునిపైన శయనించివున్న మూర్తిగా మనకు దర్శనం ఇస్తాడు.ఇక ఈ విగ్రహ మూర్తి 5మీటర్ల పొడవు వుంటుంది.  సహజంగా విష్ణుమూర్తి మనకు శయన మూర్తిగా దర్శనం ఇస్తాడు. కానీ ఇక్కడ మాత్రం వెల్లకిలాపడుకుని యోగ నిద్రలో ఉన్నట్టు దర్శనమిస్తాడు.  స్వామి. మరో ప్రత్యేకత ఏమిటంటే  ఈ  భారీవిగ్రహం నీటిలో తే లుతూ వుంటుంది.  భక్తులతోపాటు వైజ్ఞానిక వేత్తలు, పరిశోధకులకు  విశేషంగా ఆకట్టుకున్న ఈ విగ్రహం దాదాపు 1300 సం ల ముందునుండే  నీటిలో తేలియాడుతూ  ఉందట.   ఈ విశేషాలు గురించి మరింత తెలుసుకోవాలంటే  ఈ వీడియో  చూడండి. 
  • ఉత్తరకొరియా, అమెరికాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకి ముదురుతోంది. అందుకు తగ్గట్టుగానే రెండు దేశాల అధ్యక్షులు ఒకరిపై మరోకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా అమెరికా యుద్ధనౌకలు ఉత్తరకొరియా, దక్షిణకొరియా సరిహద్దుల్లో విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా యుద్ధ నౌకల్లో అణ్వాస్త్రాలను మోసుకెళ్లగలిగే అమెరికా రోనాల్డ్ రీగన్ యుద్ధనౌక ఉత్తరకొరియా, దక్షిణకొరియా సరిహద్దు సముద్ర జలాల్లో స్వైరవిహరం చేస్తోంది. రోనాల్డ్ యుద్ధ నౌక 30 నాటికల్ మైళ్ల వేగంతో కదులుతోంది. ఈ యుద్ధనౌకలో మొత్తం 32వేల మంది సెయిలర్స్ పనిచేస్తున్నారని అమెరికా రక్షణశాఖ చెబుతోంది.    నౌకపై 90 యుద్ధ విమానాలను ఒకేసారి నిలపగలమని అమెరికా రక్షణశాఖ అంటోంది. అలాగే కొద్దిరోజుల క్రితమే  అణుజలాంతర్గామి ‘యుఎస్‌ఎస్‌ మిచిగన్‌’  క్రితమే దక్షిణ కొరియాలోని బుసాన్‌ పోర్టుకు చేరుకుంది. సుదూర లక్ష్యాలను తాకే క్షిపణులు ఈ సబ్‌మెరైన్‌లో ఉన్నాయి.. ఈ విషయాన్ని దక్షిణ కొరియా నావికా దళం అధికారిక ఫేస్‌బుక్‌ పేజ్‌లో పేర్కొంది. రష్యా అధికారిక పత్రిక స్పుత్నిక్‌ కూడా దీనిని ధ్రువీకరించింది. ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా ఈ చర్యను చేపట్టింది.ఒక రకంగా చెప్పాలంటే ఇది ఉత్తర కొరియా ను కంగారు పెట్టెఅంశమే.  ఇపుడు ఈ విన్యాసాలు కిమ్ ను భయపెట్టేందుకే అని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్ తొందరపాటు ధోరణితో ఏదైనా సాహసానికి పాల్పడితే  తక్షణమే దాడులు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. 
  •  యుద్ధ రంగంలో ఇద్దరు కలిస్తే ఆ ప్రాంతమంతా భీతావహమే. కాని.. పండుగ పూట మాత్రం ఇరు దేశాల సైనికులు కాసేపు ఇరుదేశాల గొడవలను పక్కన బెట్టారు. దీపావళి పండుగ సందర్భంగా భారత్ - పాక్ జవాన్లు ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. భారత్ - పాక్ బోర్డర్‌లో భారత్ సైనికులు, పాక్ సైనికులు స్వీట్లు పంచుకొని దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముందుగా భారత్ సైనికులు.. పాక్ సైనికులకు స్వీట్లను అందివ్వగా.. తర్వాత పాక్ సైనికులు.. మన జవాన్లకు స్వీట్లు అందజేశారు. అలా.. రెండు పెద్ద స్వీట్ల బాక్సులను వాళ్లు పరస్పరం ఇచ్చి పుచ్చుకున్నారు.
  • మహిళల  కోసం మహిళలే నిర్మించుకున్న  గ్రామం అది . అక్కడ మగవాళ్లకు  ఏ మాత్రం  ప్రవేశం లేదు. మగవాళ్లు వూళ్లోకి రావడానికి కూడా వారు ఒప్పుకోరు. గృహహింస, మగాళ్ల వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలకు గురైన  మహిళలు , భర్త వదిలేసిన వారు, వితంతువులకు ఈ గ్రామం రక్షణ కల్పిస్తుంది. అలాంటి బాధితులతోనే ఈ వూరు ఏర్పడిందంటే మహిళలపై అక్కడ జరిగే దారుణాలను అర్థంచేసుకోవచ్చు. మహిళలు, బాలికలకు ఆ గ్రామం స్వర్గం లాంటిది. ఈ గ్రామం కెన్యాలో ఉంది. దాని పేరు  ఉమోజా!! కెన్యా ఉత్తర ప్రాంతంలో రెబెకా అనే మహిళ 25ఏళ్ల క్రితం కేవలం మహిళల కోసమే ఉమోజా అనే  గ్రామాన్ని  ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి మహిళల రక్షణ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమోజా గ్రామ ప్రస్తుత చీఫ్ ఆమె. రెబెకా అక్కడి సంబూరు తెగకు చెందిన మహిళ. గతంలో అక్కడ  బ్రిటిష్ సైనికులు శిక్షణ పొందేవారట , ఆ సమయంలో వారి అకృత్యాలకు హద్దు ఉండేది కాదట . తదనంతరం  అక్కడి పురుషులు కూడా  మహిళలను విపరీతంగా కొట్టేవారు. ఓ రోజు గ్రామంలో వ్యక్తులు ఆమెను విపరీతంగా కొడుతుంటే భర్త అడ్డుకోలేదట. ఇక పురుషులకు దూరంగా కొత్త గ్రామాన్ని నిర్మించుకోవాలని అనుకొని 1990లో ఉమోజా గ్రామం ఏర్పాటు కు మొదలుపెట్టారు.క్రమంగా  ఎందరో బాధితులు ఆమెతో చేరిపోయారు. గ్రామం ఏర్పాటైంది. భర్త వేధింపులు తాళలేక వచ్చేసిన వారు, భర్త చనిపోయిన వారు, అత్యాచారాలకు గురైన వారు, అనాధలు, బలవంతపు పెళ్లిళ్లు వద్దనుకొని పారిపోయి వచ్చినవారు.. ఇలా ఒకరా ఇద్దరా ఎంతో మంది ఎన్నో రకాల మగవాళ్ల వేధింపులు తట్టుకోలేక బయటపడ్డ మహిళలకు ఈ గ్రామం  అండగా నిలిచింది. పురుషులకు ప్రవేశం లేదని  చెప్పి ఇప్పుడు బాధిత మహిళలు ఉమోజా గ్రామంలో సంతోషంగా బతుకుతున్నారు. గ్రామంలో మహిళలు బతుకుతెరువు కోసం రకరకాల ఆభరణాల తయారీ, ఇతర ఎన్నో పనులు చేస్తుంటారు. ఇలా వారు ఇళ్లు కట్టుకున్నారు. పిల్లలు చదువుకోవడానికి పాఠశాల కూడా నిర్మించుకున్నారు. కమ్యునిటీ సెంటర్, ఇంకా ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు ఉమోజా గ్రామం పర్యాటక ప్రాంతంగానూ అభివృద్ధి చెందుతోంది. మగవాళ్లకు ఈ గ్రామంలోకి రావడానికి అనుమతి లేదు. కానీ పర్యటకులకు మాత్రం వారు పెట్టిన కొన్ని నిబంధనలకు ఒప్పుకుంటే సందర్శనకు అనుమతి ఇస్తారు.    వీడియో చూడండి.  
  • ( Aravind Arya Pakide )  చుట్టూ పచ్చని చెట్లు.. ఎత్తైన కొండలు.. ప్రకృతి ఒడిలో కొండల మీద సహజసిద్ధంగా పుట్టిన జలపాతాలు. అవే రాయికల్ గ్రామ సరిహద్దులోని జలపాతాలు .  మన పక్కనే ఉన్నా , మనం గుర్తించని అద్భుత అందాలు. కన్ను ఆర్పకుండా చూసే ఆ నీటిసిరుల అందం ఈ జలపాతాల సొంతం.  కరీంనగర్ జిల్లా సైదాపురం మండలంలోని రాయికల్ అనే గ్రామానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలపాతాలు ఇవి.  వరంగల్ జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలో వరంగల్ అర్బన్ కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో సైదాపురం అటవీ ప్రాంతంలో ఈ జలపాతం ఉంది . ఇంతకాలం బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉంది ఈ అత్యద్భుత జలపాతం. జలపాతాన్ని చేరుకోగానే చుట్టుప్రక్కల ఆవరించి ఉన్న దట్టమైన అడవులను , చెరువు ను , ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరవశించవచ్చు, ఆస్వాదించొచ్చు. ఆనందాన్ని సొంతం చేసుకోవచ్చు. దట్టమైన పచ్చని అడవుల మధ్య కొండకోనల నుంచి హోరెత్తే నీటి హొయల నిండైన జలపాతం ఇది. ప్రకృతి సృష్టించిన అద్భుతమైన అందాల్లో ఇది ఒకటి. ప్రచారానికి దూరంగా, కేవలం స్థానికులే సేదతీరే ప్రాంతంగా ఈ జలపాతం ఇన్ని రోజులు మిగిలిపోయింది.  చుట్టూ పచ్చని చెట్లు, ప్రకృతి రమణీయత మధ్య ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాలు ముఖ్యంగా వర్షాకాలంలో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ కొండలు.. జలపాత సవ్వళ్లు. ఇవి తప్ప మరో శబ్దం వినిపించే అవకాశం లేదక్కడ. 170 అడుగుల ఎత్తు నుండి స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. పరవళ్లు తొక్కుతూ జలపాతం కిందికి దూకుతుంటుంది  5 అంచెలలో సహజ సిద్ధమైన జలపాతాలను కలిగిన ఈ సుందర ప్రదేశం,  పర్యాటకులకు , ప్రకృతి ప్రేమికులకు మధురానుభూతిని పంచుతూ.. ఎనలేని ప్రకృతి సౌందర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని మళ్లీ మళ్లీ రారమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉదృతంగా జలపాతం ప్రవహిస్తూ ఉంది . సాగిపోతున్న కొండకోనల మధ్య పచ్చని ప్రకృతి ప్రాంతమే ఇది. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే ఈ అందమైన దీనికి ఎగువన, దిగువన జలపాతాల హోరు నిరంతరాయంగా వినిపిస్తుంటుంది. ఈ జలపాతాల నీరు తూర్పు దిక్కుగా ప్రవహిస్తుంటుంది. ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే కాలినడకన కొంత దూరం గుట్టలమీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇంతకు మించిన చక్కటి ప్రదేశం వరంగల్ కి సమీపంలో లేనే లేదని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే ముందుగా ఓ చిన్న చెరువు దర్శనమిస్తుంది. దీని నుంచే దట్టమైన అటవీ ప్రాంతం మొదలవుతుంది.  ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి ఎలాంటి సౌకర్యాలు ఉండవు.  పర్యాటకులకు ఏమి కావాలన్నా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. Telangana Tourism శాఖ ఇక్కడ కొన్ని  సౌకర్యాలు సమకూరిస్తే  పర్యాటకం అభివృద్ధి చెందుతుంది.  రాయికల్ గ్రామంలో నిజాం కాలం నాటి పోలీస్ స్టేషన్ భవనం ఉంది . ఆసక్తి గలవారు చూడవచ్చు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఈ జలపాతాల వద్ద సరైన రక్షణ ఏర్పాట్లు లేవు ...  సందర్శకులు  జాగ్రత్తగా వ్యవహరించాలి.  లేకుంటే ఆహ్లాదంగా, ఆనందంగా సాగాల్సిన పర్యటన చివరికి విషాదాంతమవుతుంది. *కొండల పై భాగంలో ఎలుగుబంట్లు ఉన్నాయి. కాబట్టి పైకి వెళ్లే ప్రయత్నం చేయకుండా ఉంటే మేలు .  * మద్యం తాగివెళ్లొద్దు. * ఫొటోల కోసం లోతు ప్రాంతాల దగ్గరకు వెళ్లొద్దు. * జలపాతాలు ఎక్కే ప్రయత్నం చేయకూడదు.  *శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు వేసుకోవడం మంచిది . కాళ్లకు పాదరక్షలు వీలైతే shoes మరీ మంచిది . ఆహార పానీయాలను పర్యాటకులు  తీసుకెళ్లడం బెటర్ .. అక్కడ ఏమీ  లభించవు . చేపట్టాల్సిన భద్రత చర్యలు: * నీళ్లలో ప్రమాదవశాత్తు పడితే బయటపడేందుకు ఇరువైపులా తాళ్లతో ఏర్పాటు చేయాలి. * జలపాతాల వద్ద తగిన సంఖ్యలో భద్రత సిబ్బంది నియామకం. * నిఘా కోసం సీసీ కెమెరాల ఏర్పాటు. * నీళ్లలోకి వెళ్లకుండా ఇరువైపులా జాలీ ఏర్పాట్లు. Route details : హుస్నాబాద్ - సిద్దిపేట రోడ్ లో ములుకనూరు వద్ద కుడి వైపు వెళ్లాలి. మాజీ ప్రధానమంత్రి పీవీ . నరసింహారావు స్వగ్రామం అయిన వంగర మీదుగా రాయికల్ గ్రామానికి వెళ్ళాలి.  గ్రామం నుండి దక్షిణ దిశలో 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే గ్రామ చెరువు వస్తుంది. అక్కడ వాహనాలను నిలిపి , జలపాతాల వైపు సుమారు 1 1/2 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేస్తూ జలపాతాలను చేరుకోవాలి. pictures courtesy : Anudeep Ceremilla . Aravind Arya Pakide .
  • ఉత్తర కొరియాపై యుధ్దానికి అమెరికా సిద్ధమవుతోంది. ఒకవైపు అమెరికా బాంబర్ విమానాలు, మరోవైపు దక్షిణ కొరియా ఫైటర్ జెట్లు. వీటికి తోడుగా జపాన్ యుద్ధ విమానాలు రంగంలోకి దిగాయి. ఉత్తర కొరియా సరిహద్దుల్లో అవి చక్కర్లు కొట్టాయి. ఇదంతా సంయుక్త విన్యాసాల్లో భాగమేనంటూ ప్రకటించాయి. కానీ ఇవి సాధారణ విన్యాసాలు మాత్రం కావు.  యుద్ధానికి సిద్దమనే  సంకేతాలు  అంటున్నారు. అణుదాడి  చేస్తామంటూ  వరుస హెచ్చరికలతో  ఎగిరిపడుతున్న  కిమ్ పని పట్టేందుకు ట్రంప్ వ్యూహాత్మకంగా  ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఏ క్షణమైనా ఉత్తరకొరియాపై అమెరికా బాంబుల వర్షం కురిపించవచ్చు.  ఉత్తర కొరియా  అధ్యక్షుడు కిమ్ లక్ష్యంగా క్షిపణులు విరుచుకుపడొచ్చు. ఆ క్షణం ఎప్పుడెప్పుడా అన్నట్లు ట్రంప్ ఎదురుచూస్తున్నారు. మొత్తం మీద అమెరికా, ఉత్తరకొరియా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.   ఇదిలా ఉంటే ....   చరిత్రలోనే మొదటిసారిగా ఏ అమెరికా అద్యక్షుడు చేయలేని పనిని ట్రంప్ చేయబోతున్నారు. ఆయన వచ్చే నెలలో ఉత్తరకొరియా, దక్షిణకొరియా సరిహద్దుల్లో కాలుపెట్టనున్నారు. ఈ విషయాన్ని దక్షిణకొరియా అధికారిక మీడియా ప్రకటించింది.  సెప్టెంబర్ చివరి వారంలోనే  ట్రంప్  భద్రతా సిబ్బంది  ఈ  పర్యటన కోసం ఏర్పాట్లు  మొదలు పెట్టాయి.  ట్రంప్ తన తొలి కొరియా దేశాల పర్యటన సందర్భం గా  అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పర్యటనతో ట్రంప్ ఉత్తరకొరియాకు స్ట్రాంగ్ మేసేజ్ ఇచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దక్షిణకొరియాలోని ట్రూస్ విలేజ్‌లో ట్రంప్ బస చేస్తారని ఆ ప్రాంతం డి మిలిటైరేషన్ జోన్ అని అధికారులు తెలిపారు. అయితే ఉత్తరకొరియా ట్రంప్ పర్యటనపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని దక్షిణకొరియా అధికారులు చెబుతున్నారు.  ఈ లోపే యుద్ధం జరిగే అనివార్య పరిస్థితులు తలెత్తితే  ట్రంప్ పర్యటన వాయిదా పడవచ్చు. 
  • సరిగ్గా 70  ఏళ్ళ క్రితం మెక్సికోలోని రోస్‌వెల్‌ ప్రాంతంలో ఓ భారీ పేలుడు సంభవించింది. భారీ బెలూన్‌ వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందని అప్పట్లో అమెరికా బలగాలు చెప్పాయి. అయితే  అది ఒక ప్లైయింగ్‌ సాసర్‌ అని ... అది పేలిపోయి నేలపై పడిందని  కొందరు అన్నారు . మరో వైపు  అది ఏలియన్‌ల అంతరిక్ష నౌక  అని    అప్పట్లోనే ప్రచారం జరిగింది. అలాగే  రష్యా అణుబాంబు పరీక్ష వివరాలు తెలుసుకునేందుకు సీక్రెట్‌గా ఏర్పాటుచేసిన ప్రయోగంలో ఆ బెలూన్‌ పేలిపోయిందంటూ మరికొన్ని  కథనాలు వినిపించాయి. కాల క్రమంలో అవి తెర మరుగున పడ్డాయి. వాటి గురించి అందరూ మర్చిపోయారు.   అయితే   అదే అంశం గురించి  ఓ సంచలనాత్మక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ పేలుడు సంభవించిన సమయంలో అక్కడికి చేరుకున్న యూఎస్‌ బలగాలు ఓ స్ట్రెచర్‌పై ఏలియన్‌ బాడీని తీసుకెళుతున్నట్లుగా  అందులో ఉంది. యూఎఫ్‌ఓ స్పేస్‌ షిప్‌ అక్కడే కూలిపోయిందని దాంతో అందులోని ఏలియన్‌ గాయపడిందని, దానిని స్ట్రెచర్‌పై స్వయంగా తరలించారని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. తాజాగా యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. రోస్ వెల్ ఘటనపై పలు కథనాలు పుట్టుకొచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మంది  ఆరోజు ప్లైయింగ్‌ సాసర్‌ పేలిపోయిందని నమ్ముతున్నారు. ఈ వీడియో  మరెన్ని కథనాలను వెలుగులోకి తెస్తుందో చూడాలి.  మీరు కూడా వీడియో చూడండి. 
  • ( Aravind Arya Pakide) .... తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఏకవీర  ఎల్లమ్మ దేవాలయం ఒకటి. కాకతీయుల కులదైవంగా భావించే  ఏకవీర ఎల్లమ్మకు  అప్పట్లో  నిత్యం పూజలు జరిగేవి.  చరిత్రకారుల లెక్కల ప్రకారం ఈ ఆలయాన్ని దాదాపు 1,100 ఏళ్ల కిందట నిర్మించారు. రాణీ రుద్రమ దేవి తన నివాసం నుంచి ఖిల్లా వరంగల్ సొరంగ మార్గం ద్వారా  ఈ ఆలయానికి  చేరుకునేదట. ఇక్కడ  ఎల్లమ్మకు మొగిలి పూలతో పూజలు చేసేదట. కాకతీయుల పతనం తర్వాత ఈ ఆలయం నిర్లక్ష్యానికి గురైంది. అందులోని మూలవిరాట్టును ఎవరో ఎత్తుకుపోయారు. మూల విరాట్టు లేక, పూజలు నిలిచిపోవటంతో భక్తుల రాక ఆగిపోయింది. చివరికి ఆలయం శిథిలావస్థకు చేరింది.  అద్భుత శిల్పసంపదతో కూడిన స్థంభాలు పక్కకు ఒరిగిపోయాయి.  ఇందులో మూలవిరాట్టు లేకపోవటంతో  ఈ ఆలయాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు.   ఇక ఈ ఆలయ సమీపంలోని రాళ్లలో తొలిచిన జైన గుహలు చూపరులను ఆకట్టుకుంటాయి. పెద్ద రాతి గుండ్లను తొలిచి గుహలుగా మలిచారు. అప్పట్లో ఈ ప్రాంతంలో జైనమత ప్రాబల్యం ఉండటంతో వరంగల్‌ పద్మాక్షి గుట్ట, అగ్గలయ్య గుట్ట, చుట్టుపక్కల ప్రాంతాల్లో జైనుల ఆవాసాలు ఏర్పడ్డాయి. వారి విద్యాలయాలు కొనసాగాయి. ఆ క్రమంలోనే జైన మునులు ధ్యానం చేసుకునేందుకు ఇలాంటి గుహలు ఏర్పాటు చేశారని  అంటారు.  ఏకవీర ఆలయం సమీపంలో ఇలాంటి మూడు గుహలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ ప్రాంతమంతా ప్రస్తుతం  చెట్లు, పొదల మధ్య చిక్కుకుపోయింది.  ప్రస్తుతం ఈ ఆలయానికి వెళ్లేందుకు దారి కూడా లేదు. కాగా  కాకతీయులు  ఏకవీర ఎల్లమ్మను కొలిచినట్లు పూర్వీకుల ద్వారా  తెలుస్తున్నప్పటికీ  దానికి సంబంధించి శాసనాలు, ఆధారాలేమీ లభించలేదు. ఇక మొగిలిచెర్ల ఊరు అసలు పేరు మొగిలి చెరువుల అని.. అక్కడి చెరువుల్లో విస్తృతంగా మొగిలిపూల వనం ఉండటంతో ఆ పేరొచ్చిందని చెప్పే శాసనాలు మాత్రం లభించినట్టు పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. వాటిల్లో ఈ దేవాలయం ప్రస్తావన కొద్దిగానే ఉందని, ఏకవీర ఎల్లమ్మ ప్రస్తావనేదీ లేదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే .. మరో కథనం ప్రకారం  ఎల్లమ్మ దేవత రేణుక దేవి ప్రతిరూపం. అందుకే ఆమెను జానపదులు రేణుక ఎల్లమ్మ అని వ్యవహరిస్తారు. కాకతీయ సామ్రాజ్య కాలం నాటి ఓరుగల్లు పట్టణంలో ఎల్లమ్మకు మౌఖిక సంప్రదాయంలో ఎక్కువ ప్రాచుర్యం ఉంది. వరంగల్‌ జిల్లాలో కొందరు  ఏకవీర దేవతను తమ కులదైవంగా కొలుస్తారు. ఎల్లమ్మ దేవాలయం ఆదిలాబాద్‌ జిల్లాలోని మాహురంలో ఉంది. అక్కడ ఈమెను మాహురమ్మ అని పిలుస్తారు. రాయలసీమలో నంగమ్మ దేవత అని, తమిళనాడులో మేమలమ్మ అని అంటారు. తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఈ ఏకవీర  ఎల్లమ్మ ఆలయం  ఒకటి కావడంతో దీనిని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్‌ శివార్లలోని మొగిలిచెర్ల గ్రామంలో ఉన్న ఈ ఏకవీర ఆలయాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పేర్వారం రాములు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ప్రతిపాదించగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. పర్యాటకాభివృద్ధి సంస్థ, పురావస్తు శాఖల ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఈ ఆలయానికి మహర్దశ పట్టనుంది.
  • కరిఘట్ట వేంకటేశ్వరుడు. ఈ పేరు చాలామంది విని  ఉండరు.   కర్ణాటకలోని శ్రీరంగపట్నం శివారు ప్రాంతంలో మైసూరు హైవే పక్కన ఓ కొండ ను కరిఘట్ట అంటారు.  రెండువేల అడుగులకు పైగా ఎత్తులో ఉండే  ఈ కొండ మీద కరిఘట్ట వేంకటేశ్వరుడు కి ఒక ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైనది. ఈ కొండని ‘కరిఘట్ట’ అని పిలుస్తారు. కరి అంటే నలుపు అన్న అర్థం ఉంది కాబట్టి నల్లటి కొండ అని ఆ పేరు పెట్టి ఉండవచ్చు. కరి అంటే ఏనుగు అన్న అర్థం కూడా ఉంది.  ఈ కొండ మీద ఏనుగులు తినే గడ్డి బాగా పెరిగి ఉంటుంది . అందుకనే ఏనుగుకొండ అని  ఆ పేరు పెట్టి ఉండవచ్చు.ఈ కరిఘట్ట మీద ఉన్న ఆలయం గురించి  వరాహపురాణంలో ప్రస్తావించారు . ఇక్కడి కొండ మీద కనిపించే దర్భలు సాక్షాత్తు ఆ వరాహస్వామి శరీరం నుంచి ఉద్భవించాయని పురాణ కథనం. అప్పట్లో ఈ కొండను నీలాచలం అని పిలిచేవారట.  తిరుపతిలో కనిపించే ఏడుకొండలలో ఒకటైన నీలాద్రిలోని కొంతభాగమే ఈ నీలాచలం అని చెబుతారు. ఇక్కడి మూలవిరాట్టుని వైకుంఠ శ్రీనివాసుడు లేదా కరిగిరివాసుడు అని పిలుస్తారు. ఆరడుగుల నల్లని రాతిలో కనిపించే ఈ మూలవిరాట్టుని సాక్షాత్తు ఆ భృగు మహర్షి ప్రతిష్టించాడని చెబుతారు. ఈ స్వామికి అలంకారం చేసినప్పుడు, బైరాగిలా కనిపిస్తాడట.  ‘బైరాగి వెంకటరమణుడు’ అని కూడా పిలుచుకుంటారు. పేరుకి బైరాగే కానీ ఈ స్వామిని కొలిస్తే ఎలాంటి కష్టమైనా తీరిపోతుందని భక్తుల విశ్వాసం. కరిఘట్ట ఆలయానికి చేరుకునేందుకు నాలుగు వందలకు పైగా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.  వాహనాల్లోకూడా పైకి వెళ్లేందుకు  రహదారి ఉంది. కొండ పక్కనే కావేరి ఉపనది  లోకపావని ప్రవహిస్తూ ఉంటుంది. ఈ కొండ మీదకు ఎక్కినవారికి కరిగిరివాసుని దర్శనం ఎలాగూ దక్కుతుంది. దానికి తోడుగా లోకపావనికి ఆవలి ఒడ్డున ఉండే నిమిషాంబ ఆలయం, శ్రీరంగపట్నంలోని రంగనాథస్వామి ఆలయాలు కూడా కనిపిస్తాయి. వీటితో పాటు మైసూరు, శ్రీరంగపట్నం, చాముండి హిల్స్ కూడా కనిపిస్తాయి.  శ్రీరంగపట్నానికి వెళ్లే యాత్రికులు ఈ కరిఘట్ట ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు. ఏటా ఫిబ్రవరి ..మార్చి నెలల్లో వైభవంగా స్వామి ఉత్సవాలు జరుగుతాయి. రధోత్సవం కూడా నిర్వహిస్తారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారు. 
  • ( సుశ్రీ ) .................................. నా పేరు అమృత. ఆ రోజు నాకింకా గుర్తుంది. 1919 ఏప్రిల్ 13 వ తేదీ మర్నాడు. రోజు లాగే అన్న స్కూల్ కి ఉదయాన్నే వెళ్ళాడు. అతను స్కూల్ కి వెళ్లలేదని మర్నాడు తెల్సింది.  అతడు ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. ఇంట్లో అందరూ దిగాలు పడి ఉన్నారు. అన్న ముఖం వేలాడేసుని వచ్చాడు. బోలెడు దుఖం తో అతను నిలువునా మునిగి ఉన్నాడు.  అన్న కి చిన్న చెల్లెలు ని నేను. నేనంటే అన్న ఎంతో ప్రేమగా ఉండేవాడు.  “అన్నా ఎందుకింత ఆలస్యం అయింది.? ఎక్కడికెల్లావు ?” అని నేను ఆందోళనగా అడిగాను.  “ఏమి తెచ్చానో చూడు” చేతి లో జేబులోంచి తీసిన ఎర్ర సీసాని చూపించాడు.  అందులో మట్టి ఉంది. మట్టి రంగు ఎరుపుగా ఉంది. తడిగా ఉంది. “ఏమిటిది?” నేను భయంగా అడిగాను.  “ఇందులో ఉన్నది 360 మంది భారతీయుల రక్తం తో తడిచిన మట్టి ఉంది. రోలర్ చట్టానికి శాంతియుత నిరసన తెలపటం కోసం సమావేశమయిన వేలాది ప్రజలమీద కి, నిన్న జనరల్ డయ్యర్ మరఫిరంగులతో కాల్పులు జరిపాడు. ఎందరో చనిపోయారు. ఆ వీరుల రక్తం తో తడిచిన జలియన్ వాలా బాగ్ మట్టి ఈ సీసా లో ఉంది.” అన్న దుఖం తో ఒక్కో మాట చెప్పాడు.  అక్కడ ఏమి చూశాడో, ఏమి విన్నాడో తడబడుతు చెప్పాడు.  ఈ రోజు అన్న ఆహారం ముట్టలేదు. తోటలో నుండి చాలా పూలు తెచ్చి ఆ సీసాని అలంకరించాడు. దానికి మోకరిల్లాడు. తనలో తానే ఏవేవే మాట్లాడుకున్నాడు. బహుశా మనసులోనే ఏవో స్థిరంగా నిశ్చయించుకుని ఉంటాడు.  ఆ మహావీరుల రక్తం తో ఆయనకి సన్నిహిత సంభందం ఏర్పడింది. అందుకే తను గూడా విప్లవ కారులకు నాయకుడై ఆత్మ బలిదానం చేశాడు.  మీ కింతకి మా అన్న పేరు చెప్పలేదు కదూ... ఆయన్ని మీరు ఎరుగుదురు . ఆయన పేరు భగత్ సింగ్.