Latest News
బిజినెస్
 • పై ఫొటోలో కనబడే పెద్దాయన  5 వ  తరగతి  చదువుతూ మధ్యలో ఆపేశారు .  అయితేనేమి ఇపుడు  దేశంలో అత్యంత ఎక్కువ వేతనం పొందుతున్న సి.ఇ.ఓ. ఆయనే !!  నెలకు ఆయన వేతనం 21 కోట్ల రూపాయలు. అవును నిజమే .  ఆయన తీసుకునే  21 కోట్ల రూపాయలలో   90 శాతాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. ఆయన వయస్సు సుమారు ‘  తొంభై ఐదేళ్లు ’. అయినప్పటికీ ఎందులో తగ్గరు.   ఆయన నవ యువకుడి మాదిరిగా హుషారుగా పనిచేస్తారు. ఆయన పేరే  ధరమ్‌పాల్ .  తమ కంపెనీ ఉత్పత్తులలో నాణ్యతా ప్రమాణాలు ఏ మాత్రం తగ్గకుండా చూడటంతోపాటు, నిరంతరం మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేస్తూ ధరమ్‌ పాల్  డీలర్లను  కలుసుకొంటారు.  ఆయనకు ఆదివారం, సోమవారం అనే భేదం లేదు. సెలవులతో సంబంధం లేదు.  తొమ్మిది పదులు వయస్సు దాటినప్పటికీ, పనిచేయడంలో ఆయన ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తారు.. ప్రముఖ మసాల పొడుల తయారీ కంపెనీ మహాషియాన్ డి హట్టి (ఎం.డి.హెచ్) వారిదే .   అందరూ ఆయనను గౌరవంగా ‘దాదాజీ’, ‘మహాశయజీ’ అని పిలుస్తారు.  దేశంలో అత్యంత ఎక్కువ వేతనం పొందుతున్న సి.ఇ.ఓ.కూడా ఆయనే కావడం విశేషం.  ఐటీసీ , హిందుస్థాన్ యూనీలీవర్   మేనేజింగ్ డైరెక్టర్ల కంటే  ఎక్కువే.  నెలకు ఆయన వేతనం 21 కోట్ల రూపాయలు. ఆయన తన వేతనంలో 90 శాతాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. చేస్తున్న పని పట్ల నిబద్ధత, అకుంఠిత దీక్ష ఉంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చనడానికి దాదాజీని ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంతో కష్ట పడి  ధరమ్‌పాల్  ఈ స్థాయికి  ఎదిగారు.   ‘మహాషియాన్ డి హట్టి’ని ధరమ్‌పాల్ తండ్రి చునిలాల్ 1919లో పాకిస్థాన్‌లోని సియోల్ కోఠ్‌లో ప్రారంభించారు.  దేశ విభజన అనంతరం ధరమ్‌పాల్ కుటుంబం భారతదేశానికి తరలి వచ్చింది. ధరమ్‌పాల్ దిల్లీలోని కరోల్‌బాగ్‌లో వ్యాపారం ప్రారంభించారు. పట్టుదలతో కృషిచేసి ఎం.డి.హెచ్. మసాలాలకు ప్రజాదరణ లభించింది . అప్పటినుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు .  ప్రస్తుతం ఎం.డి.హెచ్. కంపెనీ 60 రకాల మసాలా పౌడర్లను తయారుచేసి విస్తృతంగా మార్కెటింగ్ చేస్తున్నది. ఈ కంపెనీకి చెందిన 15 ఫ్యాక్టరీలలో ఇవి తయారవుతున్నాయి.  ఈ కంపెనీకి  దేశ వ్యాప్తంగా వెయ్యి మంది డీలర్లు ఉన్నారు. ఇప్పటికీ ప్రతిరోజూ ధరమ్‌పాల్ ఫ్యాక్టరీలను  స్వయంగా వెళ్లి  పరిశీలిస్తుంటారు . ప్రతి రోజు డీలర్లను కలుస్తుంటారు.  ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ 15వేల కోట్ల రూపాయలు. దుబాయ్, లండన్‌లలో కంపెనీ కార్యాలయాలు ఉన్నాయి. ఎం.డి.హెచ్. ఉత్పత్తులు వంద దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. నాణ్యమైన సరుకును అందరికి అందుబాటులో ఉండే ధరకు అందించడమే తమ కంపెనీ విజయ రహస్యం అని చెబుతారు ధరమ్‌పాల్. కార్మికుల కోసం ఒక వైద్యశాల, 20 పాఠశాలలను తన కంపెనీ తరఫున ధరమ్‌పాల్  నిర్వహిస్తున్నారు.  ఈ తరం యువకులు , వ్యాపార వేత్తలు ఆయనను చూసి నేర్చుకోవాల్సింది  ఎంతో ఉంది. ...
 • విదేశాల్లో కౌగిలింతలు  ఇపుడు వ్యాపారం గా మారాయి . "కడ్డలిస్ట్ .కామ్ " అనే వెబ్సైట్ ఇందుకోసం ఆన్ లైన్ శిక్షణ కూడా ఇస్తోంది. చాలా మంది మహిళలు , పురుషులు  ఈ కౌగిలింతల ప్రక్రియలో శిక్షణ పొంది  అవసరమైన వారికి కౌగిలింతల సేవలు ఇస్తూ తద్వారా ఆర్ధికంగా లాభం పొందుతున్నారు.  అమెరికా  చెందిన జనెత్‌ ట్రెవీనో (37) కౌగిలింతల  వ్యాపారం  చేస్తోంది .   40 నుంచి 70 ఏళ్ల పురుషులను గంటకు 80 డాలర్లు (దాదాపు రూ.5,500) ఫీజు తీసుకొని కౌగిలించుకుంటుంది. ఇలా కౌగిలించుకుంటూ వారానికి 1600 డాలర్లు (దాదాపు 10,9000) సంపాదిస్తోంది. జెనెత్‌ భర్త కార్లోస్‌ కూడా ఇందుకు పూర్తిగా సహకరిస్తున్నాడట  ‘‘ప్రజలకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించడం అవసరం. వారిని హృదయానికి దగ్గరగా తీసుకొని వారిలో నమ్మకాన్ని పెంచేలా చేస్తే వారిలో మంచి మార్పులు వస్తాయి. అందుకే నేను కౌగిలింత సేవలను అందిస్తున్నాను. మొదట్లో పార్ట్‌ టైంగా ప్రారంభించిన ఈ కౌగిలింతల వ్యాపారానికి డిమాండ్‌ పెరగడంతో దానిని ఫుల్‌ టైంగా మార్చుకున్నాను.'  అంటోంది  జనెత్‌ ట్రెవీనో . ఇదే తరహాలో కొంతమంది మగాళ్లు కూడా ఈ వ్యాపారం చేస్తున్నారు. ఒంటరి మహిళలు వీరి సేవలను  ఉపయోగించుకుంటున్నారు .  కాగా కొందరు  ఉచితంగా కూడా ఈ సేవలు అందిస్తున్నారు.   ఇక "కడ్డలిస్ట్ .కామ్ "  ఓనర్  ఆడమ్ లిపిన్  మాట్లాడుతూ   ఈ కౌగిలింతల ప్రక్రియ లో సెక్స్ కి  తావు  లేదంటున్నారు . వారానికి రెండువందల  రిక్వెస్ట్లు  అందుతున్నాయని చెప్పుకొచ్చారు.  రెండు గంటల పాటు సాగే ఈ సెషన్  160 డాలర్లు మాత్రమే నట.  ఇప్పటి వరకు  విదేశాలకు మాత్రమే పరిమితమైన  ఈ  వ్యాపారం  ఇండియాకు  కూడా వస్తుందేమో !! చూడాలి మరి. ...
 • *కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతం రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు  చెప్పారు . అంతేకాదు, మూలధన పన్ను లాభాల నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు. కాగా, ల్యాండ్‌ పూలింగ్‌లో ఉన్నవారికి మాత్రమే పన్ను రద్దు వర్తిస్తుందని పేర్కొన్నారు.  ఈ మినహాయింపులు రాష్ట్రం ఏర్పడిన తేదీ అంటే 2014, జూన్‌ 2 తర్వాతి నుంచి చోటుచేసుకున్న క్రయవిక్రయాలన్నింటికీ వర్తిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. *నిజాయతీపరులపై భారం తగ్గించేందుకు పన్ను భారాన్ని తగ్గిస్తున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం గల వ్యక్తులకు ప్రస్తుతం ఉన్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇది సామాన్యుడికి గొప్ప ఊరట అని విశ్లేషకులు చెప్తున్నారు. అత్యధిక సంపన్నులకు 15 శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇతర కేటగిరీల అసెసీలకు పన్నులో రూ.12,500 రిబేటు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో రూ.3 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్నవారిపై పన్ను భారం పడదు. * రాజకీయ పార్టీలు స్వీకరించే విరాళాలపై పరిమితులు విధించారు. పార్టీలు కేవలం 2000 రూపాయల వరకు మాత్రమే నగదు రూపేణా విరాళాలు స్వీకరించడానికి వీలుంటుందని జైట్లీ చెప్పారు. అంతకు మించి మొత్తాలను  ఖచ్చితంగా చెక్కులు లేదా ఆన్‌లైన్ లేదా డిజిటల్ రూపంలో మాత్రమే తీసుకోవాలని, దాతల పేర్లు కూడా వెల్లడించి తీరాలన్నారు. ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఖచ్చితంగా దాఖలు చేయాలని స్పష్టం చేశారు. దీంతో రాజకీయ పార్టీలకు వచ్చే అజ్ఞాత విరాళాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎన్నికల వ్యయం కూడా తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఇది రూ. 20వేల వరకు ఉండేది. ... చారిటబుల్ ట్రస్టులకు ధన రూపేణా అందించే విరాళం కూడా రూ. 2వేలకు మించరాదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు....
 • ఏటా వార్షిక  బడ్జెట్ ను ప్రవేశపెట్టడం  157 ఏళ్ళ నుంచి ఒక  సాంప్రదాయంగా  వస్తోంది .  జేమ్స్ విల్సన్ తొలిసారి భారత్ బడ్జెట్ను 1860 ఏప్రిల్లో ప్రవేశపెట్టారు. అప్పుడు విల్సన్ ఇండియన్ కౌన్సిల్కు ఆర్థికమంత్రిగా పనిచేసేవారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన కొన్నిరోజులకే ఆయన కన్నుమూశారు.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దరిమిలా  ఆర్కే షణ్ముఖం శెట్టి మొట్టమొదటి బడ్జెట్ను సభలో ప్రవేశ పెట్టారు.  1947 నవంబర్లో ఆయన  దేశ  తొలి ఆర్థికమంత్రి. 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 వరకు సరిపడేలా బడ్జెట్ పెట్టారు . ఆ తర్వాత మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక అత్యధికంగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఖ్యాతి మురార్జీ దేశాయి దే . ఆర్థికమంత్రి నుంచి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మోరార్జీ దేశాయ్ ఎక్కువ సార్లు బడ్జెట్ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. గరిష్టంగా 10 సార్లు ఆయన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1964, 1968 సంవత్సరాల్లో రెండుసార్లు ఆయన బర్త్డే రోజే బడ్జెట్ను తీసుకురావడం విశేషం. ఫిబ్రవరి 29న మోరార్జీ దేశాయ్ బర్త్డే అన్న సంగతి తెలిసిందే. కాగా  అసలు బడ్జెట్ ప్రసంగం చేయని ఆర్ధిక మంత్రిగా చరిత్రకెక్కిన వారు జాన్ మతాయి.. షణ్ముఖం శెట్టి  తర్వాత  1949-50లో జాన్ మతాయి ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత సాదాసీదా బడ్జెట్గా పేరుగాంచింది. బడ్జెట్ను చదవకూడదని నిర్ణయించిన ఆయన, అన్ని వివరాలను వైట్ పేపర్లలో పంపిణీ  చేయించారు. ఇక  8 రెగ్యులర్ బడ్జెట్ల ను ప్రవేశ పెట్టిన  క్రెడిట్  చిదంబరం దే అవుతుంది.  ...
 • హమ్మయ్య.. పెద్ద నోట్ల రద్దు తర్వాత  ఇంత కాలానికి  భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ప్రజల నగదు కష్టాలకు పుల్‌స్టాప్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కరెంట్, క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాదారులకు ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. సేవింగ్స్ ఖాతాలపై ఉన్న ఆంక్షలు మాత్రం మరికొన్ని రోజులు కొనసాగుతాయని ఆర్బీఐ ప్రకటించింది. తాజా నిర్ణయం బుధవారం ( ఫిబ్రవరి 1 )నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఏటీ ఏంలు , బ్యాంకుల నుండి నగదు విత్‌డ్రాయల్ పరిమితిపై ఆంక్షలను పాక్షికంగా సడలించారు.... సేవింగ్స్ ఖాతాలపై ఉన్న వారానికి 24 వేల రూపాయల పరిమితిపై ఎలాంటి మార్పు చేయకుండా ఒక రోజుకి ఇంత మాత్రమే అని ఉన్నపరిమితిని పూర్తిగా ఎత్తి వేశారు. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను ఇటీవల ఎత్తివేసిన ఆర్బీఐ ఏటీఎం నుంచి రోజుకు రూ.10 వేలు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే వారానికి మాత్రం రూ.24 వేలకు పరిమితం చేసింది. కరెంట్ అకౌంట్ వినియోగదారులు మాత్రం రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. సేవింగ్స్ ఖాతాలపై పరిమితులు కూడా పూర్తిగా ఎత్తి వేస్తె బాగుండేదని అభిప్రాయం వ్యక్తమౌతోంది.   ...
 • మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల‌లో డ‌బ్బులు వేసుకోమ‌ని ఎవ‌రైనా అడుగుతున్నారా? అయితే జాగ్ర‌త్త‌గా ఉండండి. క‌నీసం రెండుల‌క్ష‌లు లేని ఖాతాల‌పై ప్ర‌స్తుతం ఆదాయ ప‌న్ను శాఖ క‌న్నేసింది. ఇలాంటి ఖాతాల‌లో అధిక‌మొత్తంలో న‌గ‌దు జ‌మ‌యితే ఇబ్బందులే. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఖాతాల‌ను చాలా సునిశితంగా ప‌రిశీలిస్తోంది. ఏ ఖాతాలోనైనా ఒకేసారి ఎక్కువ మొత్తం జ‌మ‌యితే వెంట‌నే ఆ విష‌యాన్ని ఆదాయ‌ప‌న్ను శాఖ దృష్టికి తీసుకెడుతుంది. అనుమానిత లావాదేవీల కింద ప‌రిగ‌ణించి వీటిపై ద‌ర్యాప్తు చేప‌డ‌తారు. న‌ల్ల ధ‌న వ్య‌తిరేక కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నున్న త‌దుప‌రి చ‌ర్య ఇదే. అనుమానిత ఖాతాల‌పై స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు అందించి, బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ దుర్వినియోగం కాకుండా చూడాల‌ని ఆర్బీఐ బ్యాంకుల‌కు సూచించింది. పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం నేప‌థ్యంలో న‌ల్ల ధ‌నానికి బ్యాంకుల‌కు స్థావ‌రం కాకూడ‌ద‌ని అభిప్రాయ‌ప‌డింది. తాజా అడుగు విచార‌ణ మార్గాల‌ను త‌గ్గించింది. రెండున్న‌ర ల‌క్ష‌లు అంత‌కు మించి జ‌మ‌చేసే ఖాతాల స‌మాచారం మాత్ర‌మే ఆర్థిక నిఘా విభాగానికి అందించాల‌నేది ఇంత‌వ‌ర‌కూ ఉన్న ఆదేశాలు. ఉన్న‌ట్టుండి పెద్ద మొత్తంలో ధ‌నం జ‌మ‌యిన ఖాతాల వివ‌రాలు ఇవ్వాల‌ని ప్ర‌త్యేకంగా కొన్ని బ్యాంకు శాఖ‌ల‌కు ఇంటెలిజెన్స్ రెగ్యులేట‌ర్ లేఖ‌లు రాశారు. వినియోగంలో లేని, బినామీ ఖాతాల‌లో పెద్ద మొత్తంలో న‌గ‌దు జ‌మ‌వుతుంద‌నేది కేంద్రం అనుమానం. 15 కోట్ల 40 ల‌క్ష‌ల కోట్ల మేర ఉన్న 500, వెయ్యి రూపాయ‌ల నోట్ల‌కు ఇంత‌వ‌ర‌కూ 80శాతం అంటే 12కోట్ల 44ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే బ్యాంకుల‌లో జ‌మ‌య్యాయి.  vedeo courtesy.... nyusu digital media ...
 • స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా 63 మంది డిఫాల్టర్లకు చెందిన మొండి బకాయిలను రైటాఫ్ చేసినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దాదాపు రూ.7,016 విలువ చేసే నిరర్థక ఆస్తులను ఇలా చేసినట్లు ఎస్‌బీఐ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది . ఈ మేరకు డైలీ న్యూస్ & అనాలిసిస్, మరికొన్ని వెబ్సైట్లు కథనాలు ప్రచురించాయి.  ఇదే నిజమైతే ప్రధాని మోడీ కొంత ఇరుకున పడతారు. కార్పొరేట్ల పట్ల మోడీ మెతకవైఖరి అవలంబిస్తున్నారని విపక్షాలు విమర్శించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మోడీ పై ఆ విమర్శలు లేకపోలేదు. ఇక వాటి జోరు పెరుగుతుంది. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు వ్యవహారం తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ రైటాఫ్ వ్యవహారం పెద్ద సంచలనమే అవుతుంది. పూర్తిగా మొండి బకాయిలను రద్దు చేశారా ? లేక ప్రత్యేకమైన అకౌంట్ కి తరలించారా ? బాకీలు వసూలు చేస్తారా ? చేయరా ? అనేది స్టేట్ బ్యాంక్ అధికారులు చెప్పాలి. ఇలా రైటాఫ్ చేసిన రుణాలలో... విజయ్ మాల్యాకు చెందిన కింగ్ ఫియర్ ఎయిర్ లైన్స్ బకాయిలు రూ 1,201 కోట్లు కూడా ఉన్నాయి. మొండి బకాయిల జాబితాలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అగ్రస్థానంలో ఉంది.తర్వాత కేఎస్ ఆయిల్స్ 596 కోట్లు ,సూర్య ఫార్మా 526 కోట్లు , జీ ఈ టీ ఇంజనీరింగ్ 400 కోట్లు ,సాయి ఇన్ఫో 376 కోట్లు , వీఎంసీ సిస్టం 370 కోట్లు ,అగ్నీటే ఎడ్యుకేషన్ 315 కోట్లు శ్రీ గణేష్ జ్యూవెలరీ 313 కోట్లు అపెక్స్ యెంకాన్ 266 కోట్లు యురొ సిరమిక్స్ 266 కోట్లు మేరకు బ్యాంకుకు చెల్లించాల్సిఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి విక్టరీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ రూ.93.91 కోట్లు, విక్టరీ ట్రాన్స్ అండ్ స్విచ్ గేర్స్ లిమిటెడ్ రూ. 66.57 కోట్లు, కె ఆర్ ఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు రూ. 86.73 కోట్లు ఘన్ శ్యాం దాస్ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ రూ.61.72 కోట్లు మేరకు బకాయిలు చెల్లించాలి. కాగా తెలంగాణా నుంచి తోటమ్ ఇన్ఫ్రా లిమిటెడ్ రూ. 93.68కోట్లు, ఎస్ఎస్‌బీజీ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ రూ.65.24 కోట్లు చెల్లించాల్సిఉంది. వీటితో ఇతర రాష్ట్రాలకు చెందిన మరికొన్ని కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.  ఈ మొండి బకాయిలు భారీగా ఉండటంతో వీటిని వేరే ఖాతాలోకి మళ్లించి... తన బ్యాలెన్సు షీటులో మొండి బకాయిల భారం లేకుండా స్టేట్ బ్యాంక్ చూసుకుంది అంటున్నారు. ఇందుకోసం రిజర్వు బ్యాంకు అనుమతించిన 'అడ్వాన్స్‌ అండర్ కలెక్షన్ అకౌంట్స్ (ఆకా)' అనే పద్ధతిని అవలంబించినట్టు చెబుతున్నారు. ఈ పద్ధతి ప్రకారం మొండి బకాయిలు లేదా నిరర్ధక ఆస్తులను ఒక ప్రత్యేకమైన అకౌంటులోకి బదిలీ చేస్తారు. తద్వారా ముందుగా అవి బ్యాంకు బ్యాలెన్సు షీటులో కనిపించవు. దీనివల్ల బ్యాంకు పనితీరు మెరుగుపడినట్లు కనపడుతుంది. కానీ, అంతమాత్రాన వాటిని పూర్తిగా మాఫీ చేసినట్లు కాదు. వన్‌టైమ్ సెటిల్మెంట్లు తప్ప మిగిలిన బకాయిలన్నింటినీ సాంకేతికంగా రైటాఫ్ చేసినట్లు చూపించినా, వాటిని 'ఆకా'లో యథాతథంగా ఉంచుతారు. అంటే, చిట్టచివరి రూపాయి వసూలయ్యే వరకు వాటి రికవరీ విధానం కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఎస్ బీ ఐ వివరణ ఇస్తే గానీ ఏమి జరిగిందో తెలియదు....
 • India Shining… ఓ పుష్కర కాలం వెనక్కి వెళ్లి చూస్తే.. ఈ నినాదం మారుమోగిపోయిన రోజులు గుర్తుకొస్తాయి. అవి.. వాజపేయి ప్రధానమంత్రిగా వున్న రోజులు. శ్రీనగర్ లాల్ చౌక్ లో వాజపేయి చరిత్రాత్మక, ఆవేశపూరిత ప్రసంగాన్ని ఇంకా మర్చిపోకుండా ఆయనను దేశప్రజలు అభిమానిస్తున్న రోజులు. ఏ రామమందిర నిర్మాణానికైతే ఎల్.కె.అద్వానీ భారతదేశాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టారో.. ఆ మందిర నిర్మాణ ఫైలును మడతపెట్టి చెత్తబుట్టలో పారేసిన రోజులు. ఇండియా ఒక మార్పుకోసం ఎదురుచూస్తున్న రోజులు. ఇండియన్లు నూతన అవకాశాలకోసం ఆబగా ఎదురుచూస్తున్న రోజులు. మధ్యతరగతి ఆదాయాలు అమాంతం పెరగడంతో.. ఇండియన్లు కసిగా వున్న రోజులు. ప్రభుత్వ రంగ సంస్థలను కసాయి వాళ్లలాగా కారుచౌకగా విక్రయిస్తున్న రోజులు. ఆ కసాయి పనికోసం బుద్ధిజీవిగా పేరుపడ్డ అరుణ్ శౌరీని కేబినెట్ మంత్రిగా చేసిన రోజులవి. హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థలను కూడా అయినకాడికి అమ్మడానికి బరితెగించిన రోజులవి. ఆ రోజు.. భారతదేశాన్ని దేశభక్తులు కాపాడుకున్నారు. పార్లమెంటు కాపాడింది. సుప్రీంకోర్టు కాపాడింది. ఎవరికన్నా బాగా గుర్తుందా? ఆ ఇండియా షైనింగ్ రోజుల్లో బ్యాంకుల గడపతొక్కిన ప్రతి మధ్యతరగతి జీవికి తప్పనిసరిగా గుర్తుండే వుంటుంది. హౌసింగ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఫుట్ పాత్ ల మీద క్రెడిట్ కార్డు వితరణలు జోరుగా సాగుతున్న రోజులు. బ్యాంకుల దగ్గర కుప్పలు తెప్పలుగా నిధులు వున్న రోజులు. ఫ్లోటింగ్ రుణాల కాన్సెప్ట్ వచ్చిన రోజులు. అప్పట్లో హౌసింగ్ లోన్ కోసం బ్యాంకుల గడప తొక్కిన వాళ్ల చెవిలో సిబ్బంది జోరీగలాగా ఒకటే చెప్పేవారు. ఫ్లోటింగ్ రేట్ ఎంచుకోండి అని. వద్దులెండి ఫిక్స్డ్ రేట్ వడ్డీ రుణానికే వెళతాను అని కస్టమర్లు అన్నా మేనేజర్లు ఊరుకునేవారు కాదు. పైగా అప్పట్లో ఫ్లోటింగ్ రేట్ వడ్డీకన్నా ఫిక్స్డ్ రేట్ వడ్డీ ఎక్కువ వుండేది. ఉదాహరణకు ఫ్లోటింగ్ రేట్ వడ్డీ 7శాతం వుంటే, ఫిక్స్డ్ రేట్ వడ్డీ 9శాతం వుండేది. బ్యాంకింగ్ సిబ్బందిది ఒకటే రొదగా వుండేది.. ఇండియా షైనింగ్ అండీ.. వడ్డీ రేట్లు ఇంకా దారుణంగా, మరీ దారుణంగా పడిపోబోతున్నాయి. జపాన్ లో లాగా, అమెరికాలో లాగా మూడున్నర, నాలుగు శాతానికి తగ్గిపోయే సుదినం మరెంతో దూరంలో లేదు అని ఊదరగొట్టేవారు. నిజమే కామోసు అని కస్టమర్లు అందరూ ఫ్లోటింగ్ వడ్డీ రేట్లనే ఎంచుకున్నారు. అంతగా పడిపోయే ఆస్కారం వున్న వడ్డీ స్కీమును ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు? ఇచ్చిన అప్పుపై వడ్డీ రేటు పడిపోతే బ్యాంకులకే నష్టం కదా! నాలుగు శాతానికి పడిపోయే ఫ్లోటింగ్ వడ్డీకంటే.. 9శాతం వుండే ఫిక్స్డ్ వడ్డీ రేటువల్లనే బ్యాంకులకు, సిబ్బందికి లాభం కదా? అని పెద్దగా ఎవరూ ఆలోచించలేదు. అదొక మాయా ప్రచారం. అందరూ ఆ ఊబిలోకి బాగానే చిక్కుకుపోయారు. నిజానికి ఆ తర్వాత వడ్డీ రేట్లు తగ్గలేదు సరికదా.. తీసుకున్నప్పటికంటే చాలా ఎక్కువ పెరిగిపోయాయి. దాంతో మిడిల్ క్లాస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఘోరంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా 2009 ఆర్థిక సంక్షోభం తర్వాత దీనాతిదీనమైంది. బ్యాంకులకంటే కాబూలీవాలాలు నయం. వీళ్లను ఎప్పటికీ విడిచిపెట్టవు. అనేక చట్టాలు తెచ్చుకున్నాయి.. వీళ్లను జీవిత పర్యంతం వేధించడానికి. అందులో సిబిల్  (credit information bureau of india ltd) ఒకటి  అన్నట్టు.... ప్రస్తుతం నడుస్తున్న తమాషా గురించి ఒక మాట. పెద్ద నోట్ల రద్దు వల్ల కొంత నల్లధనం కూడా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా చెలామణిలోకి వస్తుంది. నల్లధనం అని పేరు పెట్టలేకపోయినా.. లెక్కల్లో చూపని మరికొంత నగదు కూడా చెలామణిలోకి వస్తుంది. మొత్తం 20లక్షల కోట్లు వుందని, అందులో 15లక్షల కోట్లు చెలామణిలోకి వస్తుందని కొన్ని కాకి లెక్కలు వున్నాయి. కానీ నా అంచనా ప్రకారం 3నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి కొత్తగా చెలామణిలోకి వస్తుంది. ఇది నిజంగా బ్యాంకులకు పండగే. అకౌంట్లను క్లీన్ చేసుకుంటాయి. లెక్కలు సరిచూసుకోవడానికి వేల సంఖ్యలో సిబ్బందిని నియామకం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తే. ఐటీ... ఆ ఐటీ కాదండీ.. ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ కీ చాలా సిబ్బంది అవసరం అవుతుంది. ఏమైనా.. కాయ్ రాజా కాయ్... బ్యాంక్ స్టాఫ్ మళ్లీ ఫుట్ పాత్ ల మీద మనను పలకరించి... రావుగారూ.. ఓ లక్ష అప్పు ఇస్తాం తీసుకోకూడదూ అని... మనను దేబిరించి, ఫుట్ పాత్ మీదనే మన సంతకాలు తీసుకుని..... మరీ అంత కాకపోయినా అలాంటి India Shining రోజులకు అవకాశం వుందని నా ఎడమకన్ను అదురుతూ చెబుతోంది.   ----- VASIREDDY  VENUGOPAL ...
 • "Sabse sasta din"-Yes,Elephant Can Dance-It Happened In India లోకేష్ చెప్పినట్లు పాలు,కూరగాయలు అమ్మి కొట్లు సంపాదించారో లేదో కాని,పాలు కూరగాయలు అమ్మే Heritage groupను అమ్మి 295 కొట్లు సంపాదించబోతున్నారు. ఇప్పుడు అనేక shopping malls,branded& designer wears దొరుకుతున్నాయి కాని 90ల మొదటి వరకు branded dressల కోసం మొహమెత్తే పరిస్థితి, డబ్బువున్న మార్కెట్లో availability తక్కువ. కుమార్ షర్ట్స్ అని 100 రూపాయలకు 3 ఇచ్చేవారు...వాళ్ళకు outlets వుండేవి కావు,ఊర్లలో groundsలో టెంట్లు వేసి డిసెంబర్ చివరి వారంలో అమ్మేవాళ్ళు. గంటా,రెండు గంటలకే మొత్తం సరుకు అమ్ముడుపోయి లాఠిచార్జి కూడ జరిగిన సంధర్భాలు ఎన్నో! చిరంజీవి గ్యాంగ్ లీడర్ షర్ట్స్ 35 రూపాయల ధరకు వివరీతంగా అమ్ముడుపోయాయి ,ఆ షర్ట్స్ brand ఏమిటో తెలియదు. 1991 ఆర్ధిక సంస్కరణల కన్నా ముందు నుంచే చాలా కుటుంబాలు Wholesale వ్యపారాలు చేశాయి.చెన్నైతో పరిచయం లేనివారికి కూడ "శరవణా స్టోర్స్" గురించి తెలుస్తుంది.శరవణా భవన్ హోటల్ వీరిది కాదు. చెన్నైతో పరిచయం వున్నవారికి ఇసుకవేస్తే రాలనంత జనం ప్రతిరోజు తిరిగే "రంగనాథన్ స్ట్రీట్" గురించి తెలుస్తుంది.  రంగనాథన్ స్ట్రీట్లో IT Jobs కోసం చెన్నైలో దిగే నిరుద్యోగులకు కల్పతరువులాంటి PVT Mansion,కొన్ని వేల కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తున్న "శరవణా స్టోర్స్" వున్నాయి.ఈ Streetలో 24/7 activity వుంటుంది. 1961లో బొంబాయిలో ఒక మధ్యస్థాయి వ్యాపార కుటుంబంలో పుట్టి,ఒక మోస్తరుగా చదువుకున్న "కిషోర్ బియాని" అనే యువకుడు సాంప్రదాయ వ్యాపార పద్దతిలోకాకుండ కొత్తగా వ్యాపారం చెయ్యాలని అనేక ప్రయత్నాలు చేశాడు.30 years నిండక ముందే సొంతంగా సొంతంగా supply, WBB-(White Brown and Blue) పేరుతో Stonewashed fabric brandను ప్రారంభించారు.1987లో అంటే 26 సంవత్సరాల వయస్సులొ "Manz Wear Private Limited" పేరుతో garment manufacturing companyని ప్రారంభించాడు,ఆ "Manz Wear" తరువాత Pantaloons అయ్యింది. ఇదంత కిషోర్ బియాని తొలిదశ వ్యాపారం ,ఇదేమి బియానికి పెద్ద గుర్తింపును కాని ఆదాయాన్ని కాని అందించలేదు.బియాని అసలు వ్యాపార జీవితం 2001లొ Big Bazaarతో మొదలైంది.Big Bazaar hyper marketకూడ తొలి 3,4 సంవత్సరాలలొ పెద్దగా successకాలేదు. కిషోర్ బియానికి తనదైన సొంత business Philosophy వుంది. బియాని మాటల్లొ "Retailing is not just about selling products, it’s about selling an idea"---ఇలాంటి ఆలోచనా విధానమే 2006 జనవరి 26న కిశొర్ బియాని & భారతదేశ retail రంగం దశ & దిశను మార్చింది. "సబ్సే సస్త దిన్" అన్న ప్రచారంతో 25-Jan-2006 రాత్రి నుంచి పుట్టలు పగిలిన చీమలలాగ customers Big Bazaar outlets ముందు బారులు తీరారు.దించినవి దించినట్లుగానే లారీల కొద్ది సమానులు అమ్ముడుపోయాయి. బెంగుళూరులోని కోరమంగళలో customersను అదుపుచెయ్యటానికి లాఠిచార్జి చేశారు.మొత్తంగా ఒక్క రోజులో 43 Big Bazaar outletsలో 125 కోట్ల అమ్మకాలు జరిగాయి.ఇన్ని అమ్మకాలు అంతకు ముందు చరిత్ర ఎరగదు. అప్పటి నుంచి వరుసగా 6,7 సంవత్సరాలపాటు "Sambse sata 3 din" పేరుతో జనవరి 24,25,26 మూడురోజుల పాటు జరిపిన అమ్మకాలు Big Bazaarను తిరుగులేని సంస్థగా నిలబెట్టాయి. ఎందుకో కాని Indian Media Big Bazaar "Sabse sata din" అమ్మకాలను అమెరికాలో నవంబర్ చివరి శుక్రవారం అమ్మకాలు Black Fridayతో పోల్చలేదు. కిశోర్ బియాని Walmart conceptను copyకొట్టి Big Bazaar పెట్టారని ఆరోపణలున్నాయి.కాని బియాని స్వయంగా శరవణా Stores inspirationతోనే Big Bazaarను ఏర్పాటు చేశానని చెప్పారు. Big Bazaar మాతృ సంస్థ Future Groupలొ ఇప్పుడు పదుల కొద్ది సంస్థలు వున్నాయి.రీటైల్ రంగంలోనే కాకుండ Financial Servicesలొ Capital Holdings,Life & General Insurance, Venturesకూడ big players.మొత్తంగా Future Groupsలొ దాదాపు 40,000 మంది employees వున్నారు. TATA Group తరువాత ఎక్కువ Companies వున్నది బహుశా Future Groupలోనే కావొచ్చు. కిశోర్ బియాని మీదనో మరో corporate group మీదనే నాకు admirationలేదు.  కిశోర్ బియాని అన్నట్లు "Most businessmen make the mistake of creating an environment only where they win,they see life and business as a competitive arena not a cooperative one." ---may be a good cooperative system between rural,small scale industries and corporate companies could have been built a better system. 2006-2008 మధ్య Bangalore WIPROలొ పనిచేసే రోజుల్లో Team Leadగా Team Members birthdayలకు ఒక T-Shirts+ఒక book present చేసేవాళ్ళం.అలా giftగా ఇచ్చిన పుస్తకాలలో కిశోర్ బియాని రాసిన It happened in India,Go Kiss the World,The Go-Giver ముఖ్యమైనవి. నిన్న Future Group Heritageని take over చేస్తుందన్న వార్త చూసి బియాని success story గుర్తొచ్ఛి  ఇది  రాశాను.ఇప్పటికి వున్న వార్తల ప్రకారం Future Retail Groupలో Heritage groupకు 295 కోట్ల విలువైన 3.5% వాట ఇస్తుందంట.గత ఏడు దాదాపు ఇదే సమయంలొ Future Group రాందేవ్ "పతాంజలి" సంస్థతో ఒక ఒప్పందం చేసుకున్నారు.మొత్తంగా Future Groupబాగా విస్తరిస్తుంది... కిశోర్ బియాని రాసిన It Happened In India కన్నా నేను Subroto Bagchi రాసిన "Go Kiss The World" bookను recommend చేస్తాను.Subroto Bagchi WIPROకు పునాది వేసినవారిలో ముఖ్యులు.WIPRO తరుపున USAలొ Office open చేసిన వ్యక్తి.తరువాత WIPROను వదిలి Mind Treeని ఇతరులతో కలిసి ఏర్పాటు చేశారు. The best of Kishore Biyani "An organisation needs a Creator, preserver and destroyer to keep pace with the changing reality."    ----------  SIVA RACHARLA...
 • అచ్చం తండ్రి పోలికలో కనిపించే ఈ అమ్మాయే అంబానీ వ్యాపార సామ్రాజ్య వారసురాలు. దేశంలో అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ. ముకేశ్ అంబానీ తన కూతురుకి,,కుమారుడికి వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇస్తున్నారు. ఇషా కూడా తండ్రి మాదిరిగానే సూక్ష్మగ్రాహి. అల్లుకు పోయే తత్వం గల పిల్ల.  రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంపై తనదైన ముద్ర వేసేందుకు మెల్ల మెల్లగా ఆమె సిద్ధమవుతున్నారు.  ఇషా వయసు 24  ఏళ్లు. ఇషా అమెరికాలోని యాలె యూనివర్సిటీలో సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్ ప్రధాన సబ్జెక్టులుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అలాగే  అమెరికాలోని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సేలో వ్యాపారంలో మెళకువలు నేర్చుకునే కోర్స్ చేశారు . వినియోగదారులతో ప్రత్య క్ష సంబంధాలుండే వ్యాపారాలన్నింటినీ ఆమెకు అప్పగించాలని ముఖేష్  ఆకాంక్ష. ఇప్పటికే  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ , రిలయన్స్ వెంచర్స్ లో ఇషా డైరెక్టర్ గా చేస్తున్నారు. ఆసియా లో పవర్ ఫుల్ బిజినెస్ అప్ కమింగ్ వుమన్ గా  ఇషా గుర్తించబడ్డారు.  ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుల కుటుంబ వారసురాలిగా ఫోర్బ్స్ అమెను గుర్తించింది. అన్నట్టు ఇషా, ఆకాశ్‌లు కవల పిల్లలు.ఆకాశ్ కూడా  జియో లో  డైరెక్టర్ గా చేస్తున్నారు . వీరి తమ్ముడు అనంత్ అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు. పియానో వాయించడంలో ఇషా నిష్ణాతురాలు. 16 ఏళ్ల వయసులోనే ఇషా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు.  ఇక  మరో విషయం ఏమిటంటే .....  ఇన్ని ప్రత్యేకతలున్న ఇషా అంబానీ వివాహ ముహూర్తం ఖరారైనట్లు  మీడియా లో కొన్ని రోజుల క్రితం వార్తలు వెల్లువెత్తాయి . నవంబర్‌లో ఇషా అంబానీ పెండ్లీ అంగరంగవైభవంగా జరగ బోతున్నట్టు  మీడియా ఊదర గొట్టింది.  ఈ వేడుకలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నట్లు కూడా  రాసేసాయి. అయితే అవన్నీ పుకార్లే అని ముఖేష్ దగ్గరి బంధువు ఒకరు ప్రకటించారు.  అయితే ముకేశ్ ఇంట పెళ్లి మాత్రం జరగబోతోంది  అది ఎవరిది అంటే ఆయన మేనకోడలది  అట.  ...
 • స్టాక్ మార్కెట్ లో మదుపు చేసే వారు ఎప్పటి కపుడు తమ వద్ద వున్న షేర్ల స్థితి గతులు గురించి తెలుసుకుంటుండాలి. విశ్లేషకులు చెప్పారు కదా అని దీర్ఘ కాలిక వ్యూహం తో షేర్లను కొని వాటి సంగతి మర్చిపోకూడదు. ఇప్పుడు లావాదేవీలు అన్నీ ఎలక్ట్రానిక్  రూపంలో జరుగుతున్నాయి కాబట్టి షేర్లను కొనుగోలు చేయగానే డీ మ్యాట్ ఖాతా కు మార్పించు కోవడం మంచిది. కొంత మంది ఇన్వెస్టర్లు డీమ్యాట్ ఖాతా ఉన్నప్పటికీ బ్రోకర్ దగ్గరే ఎక్కువకాలం షేర్లను ఉంచుతారు. ఇది మంచి పద్ధతి కాదు.ఫీజు భారం ఉన్నప్పటికీ షేర్లు మన డీమ్యాట్ ఖాతాలో వుంటే షేర్లకు భద్రత వుంటుంది.షేర్ తాలుకు కంపెనీ డివిడెండ్ , బోనస్ ప్రకటిస్తే అవి మనకే అందుతాయి.కాబట్టి ఎక్కువ కాలం షేర్లను హోల్డ్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు షేర్లను కొనగానే  డీమ్యాట్ ఖాతాలోకి మారిపించుకోవడం మంచిది. షేర్లు డీ మ్యాట్ లో ఉన్నంత మాత్రాన  ఇక నిర్భయం గా ఉండొచ్చుఅనుకోవడం కూడా పొరపాటే. షేర్లను డీమ్యాట్ లో వుంచి మరచి పోవడం కూడా ప్రమాదమే. కొనుగోలు చేసిన షేర్లు ట్రేడ్ అవుతున్నాయా ?లేదా ఇన్వెస్టర్లు తరచుగా చెక్ చేసుకోవాలి.  చాలా కంపెనీలు  మఖలో పుట్టి  పుబ్బలో మాయమవుతుంటాయి. స్టాక్ ఎక్స్చంజ్ నిబంధనలు  పాటించక డీ లిస్టు అయిపోతుంటాయి.ఒక కంపెనీ  డీ లిస్టు అయితే  దాని తాలుకు షేర్లు ట్రేడ్ అవవు.అంటే షేర్ తాలుకు కొటేషన్ కన్పించదు.  కొటేషన్  కన్పించక పోతే  ఆ షేర్లను అమ్ముకోవడం కష్టమే. అలాంటి పరిస్తితిలో షేర్లు మన వద్ద ఉండి కూడా ప్రయోజనం లేదు.  కష్టార్జితం అంతా బూడిదలో పోసినట్టే అవుతుంది. ఇది ఇన్వెస్టర్లు ఊహించని రిస్క్ కాబట్టి జాగ్రత్త గా వుండాలి,ఎప్పటికపుడు కొను గోలు చేసిన షేర్ల తాలుకూ కొటేషన్లు కన్పిస్తున్నాయా ? లేదా ? చెక్ చేసు కోవాలి.  ఈ సందర్భం గా డీ లిస్టు గురించి తెలుసుకుందాం. డీ లిస్టు చేయడం అంటే  ఏ స్టాక్ ఎక్స్చేంజి  లో షేర్లు లిస్టు అయ్యాయో అక్కడ  షేర్ల అమ్మకాలు  కొనుగోళ్లను  అనుమతించిన  షేర్ల జాబితా నుంచి  తొలగించడం.  డీలిస్ట్ కీ కారణాలు ఎన్నో వుంటాయి. ముఖ్యం గా లిస్టింగ్ ఒప్పందం లోని నిబంధనలను షేర్ తాలుకు కంపెనీ అమలు చేయక పోవడం.నిర్ధారిత కాల వ్యవధి లో ఆర్ధిక ఫలితాలు ప్రకటించక పోవడం ,ప్రతి ఏటా రుసుములు చెల్లించ లేక పోవడం, ఇన్వెస్టర్ల సమస్యలు పట్టించుకోక పోవడం వంటి నిబంధనలు పాటించక పోతే  ఏ కంపెనీ అయినా డీ లిస్టు అయి పోతుంది. అయితే ముందుగా హెచ్చరిక చేస్తూ   నిబంధనలు అమలు  చేయమని  కంపెనీ లకు  నోటీసులు ఇస్తారు. ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తే మటుకు డీ లిస్టు అవడం ఖాయం .  సాధారణం గా పెద్ద  కంపెనీలకు ,మంచి పేరున్న కంపెనీలకు ఇలాంటి సమస్యలు వుండవు.  ఇన్వెస్టర్ల సొమ్ము దోచుకొని  బోర్డు తిప్పేసే కంపెనీలకు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.దాదాపు ఇప్పటికి 5 వేల కంపెనీలు పైగా డీ లిస్టు అయ్యాయి. వేలమంది ఇన్వెస్టర్లు మునిగి పోయారు.  కాబట్టి షేర్లను కొనుగోలు చేసే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు పడితే వారు చెప్పిన టిప్స్  ను  బట్టి షేర్లను కొనుగోలు చేయడం ప్రమాదం అని ఇన్వెస్టర్లు గుర్తెరగాలి. కొనుగోలు చేసిన షేర్లు ట్రేడ్ అవుతున్నాయో లేదో  ఎప్పటి కప్పుడు చేసు కోవాలి. డీ లిస్టు అయిన కంపెనీల షేర్లను  ప్రమోటర్లు కొనాలన్నా నిబంధన లేక పోలేదు అయితే అలా ముందు కొచ్చి ఇన్వెస్టర్ల నుంచి షేర్లను కొనుగోలు చేసిన  కంపెనీ ఒక్కటి కూడా వున్నట్టు దాఖలా లేదు. -----   KNMURTHY  ...
 • రోల్డ్‌గోల్డ్‌ నగలను ఒకప్పుడు పేద మగువలు మాత్రమే వాడే వారు.అయితే కాల క్రమేణా అన్ని తరగతులవారు వాటిని కొనుగోలు చేస్తున్నారు.అయితే అనూహ్యంగా పసిడి ధర పెరగడంతో రోల్డ్ గోల్డ్ నగలకు డిమాండ్ పెరిగింది. రోల్డ్‌ గోల్డ్‌ నగలు పసిడి మాదిరే మెరుస్తూ అసలు సిసలు నగల్లా చూపరులను ఆకట్టుకుంటాయి. జ్యూయలరీ షాపుల్లోని డిజైన్ల కంటే ఇంకా అందమైన డిజైన్లలో రోల్డ్‌ గోల్డ్‌ నగలు లభ్యమవుతున్నాయి. రూ. 50వేలతో జ్యూయలరీ షాపుల్లో కొనుగోలు చేసిన నగలు రోల్డ్‌ గోల్డ్‌లో రూ.500లకే అందుబాటులో ఉన్నాయి. సంపన్నులు కూడా రోల్డ్‌గోల్డ్‌ నగలుపైన మోజు చూపుతున్నారు. ఇపుడు అందరూ  దొంగల భయం కారణంగా ప్రయాణాలు, శుభకార్యాల్లో, రోల్డ్‌గోల్డ్‌ నగలే ధరిస్తున్నారు.ఒక గ్రాము బంగారంతో నెక్లెస్‌లు, గొలుసులు, గాజులు తయారు చేస్తారు. ఒక గ్రాము బంగారంతో తయారుచేసిన నగలు 4సంవత్సరాలు పాటు చెక్కు చెదరకుండా వుంటాయి.ఒక గ్రాము బంగారంతో తయారైన నగలు కూడా రూ . 3000 నుంచి  4000 లోపు లభ్యమవుతాయి . రెండో రకం రోల్డ్‌గోల్డ్‌ నగలు షుమారు 6నెలలు పాటు మెరుపు తగ్గవు. ఇవి రూ.1000 లోపు లభిస్తాయి.  ఇక మూడవ రకం రోల్డ్‌గోల్డ్‌ నగలు రూ.300 నుండి రూ.500 లోపే వుంటాయి. వీటి మెరుపు రెండు, మూడు నెలల కంటే ఎక్కువ వుండదు. మెరుపు తగ్గితే వాటిని పారేయకుండా మళ్లి మెరుగు పెట్టించుకోవచ్చు. దీనికయ్యే ఖర్చుకూడా చాలా తక్కువే. కూచిపూడి, భరత నాట్యంలో ఉపయోగించే ముక్కు పుడక నుండి వడ్డాణం వరకూ, రోజు వారీ వాడుకోవడానికి ఉపయోగించే చైన్‌లు, దిద్దులు, గాజులు, ముక్కు పుడకలు, పట్టీలు తదితరాలు దొరుకుతాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఎక్కువగా వధువుకు అలంకరణలు రోల్డ్‌గోల్డ్‌ నగలతోనే చేస్తున్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాల వివాహ, శుభ కార్యాలకు రోల్డ్‌గోల్డ్‌ నగలు కొనుగోలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఇపుడు ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి .  కాగా రోల్డ్‌గోల్డ్‌ నగలకు పెట్టింది పేరు కృష్ణా జిల్లాలోని చిలకల పూడి, మచిలీపట్నం. చిలకలపూడి బంగారంగా పిలవబడే ఈ రోల్డ్‌గోల్డ్‌ నగలకు దేశ, విదేశాల్లో కూడా  ఎంతో పేరు వుంది. కృష్ణా జిల్లాలో ఈ పరిశ్రమపై వేలాదిమంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. చిలకలపూడి, మచిలీ పట్నం నుండి తమిళనాడు, కేరళ, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకే కాకుండా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుండే ఎగుమతి అవుతున్నాయి.ఇవి కాకుండా చిన్న సంస్థలు కూడా ఈ రోల్డ్ గోల్డ్ నగలను ఉత్పత్తి చేస్తున్నాయి....
 • మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ పారిశ్రామికవేత్త  రతన్ టాటా పై స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్(సిట్)తో విచారణ జరిపించాలని కోరుతూ బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని మోడీ కి లేఖ రాశారు. ఈ లేఖలో రతన్ టాటా నాలుగు క్రిమినల్ నేరాలకు పాల్పడినట్టు స్వామి ఆరోపించారు.  రతన్ టాటా  భారత పార్టనర్ గా ఎయిర్ ఏషియా, విస్తారా ఎయిర్ లైన్స్ లో నిబంధనలు ఉల్లంఘించి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకు  టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి  అర్థంతరంగా తొలగించిన  సైరస్ మిస్త్రీ బయట పెట్టిన విషయాలే సాక్ష్యమని పేర్కొన్నారు. నాలుగు క్రిమినల్ కేసులను రతన్ టాటాఎదుర్కోవాల్సి ఉంటుందని స్వామి పేర్కొన్నారు.  నమ్మకానికి భంగం, దుర్వినియోగ నేరం, మనీలాండరింగ్, కంపెనీ చట్టాల ఉల్లంఘనల కింద ఆయనపై కేసులు నమోదుచేయాలని ఆ  లేఖలోప్రధానిని స్వామి కోరారు.  సిట్ విచారణలో సీబీఐ, సెబీ, ఎన్ ఫోర్స్ మెంట్ సభ్యులుండాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వ జోక్యాన్ని నివారించవచ్చన్నారు. అసలు రతన్ టాటా, టాటాలకు చెందినవారు కాదని, అతన్ని అనాథశ్రయం నుంచి రతన్ టాటా తండ్రి నావల్ తెచ్చిపెంచుకున్నారని  తెలిపారు.  కాగా ఓ వైపు  మిస్త్రీ చేస్తున్న విమర్శలతో సతమతమౌతున్న టాటా  స్వామి  ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్వామి వివాదాస్పదవ్యాఖ్యలు చేయడం తో  ఇపుడు అందరి దృష్టి టాటా పై పడింది. ఇదిలా ఉంటే  మిస్త్రీ  వారసుల ఎంపికలో టాటా గ్రూపు బిజీబిజీగా ఉంది. టాటా అండ్‌ సన్స్‌ నూతన ఛైర్మన్‌ ఎంపికకు కసరత్తు జరుగుతోంది.   తాత్కాలికంగా రతన్ టాటా మధ్యంతర పదవీ బాధ్యతలు స్వీకరించినా కొత్త చైర్మన్ ఎంపికపై అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.   టీసీఎస్‌ సీఈవో ఎన్‌.చంద్రశేఖరన్‌, జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ అధినేత రాల్ఫ్‌స్పెత్‌ ,  ట్రెంట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌, మిస్త్రీ బావ నోయెల్‌ టాటా పేర్లు వినిపిస్తున్నాయి....
 • సిబ్బంది యోగ క్షేమాలు పట్టించుకునే యజమానులు మనదేశం లో చాలా కొద్దిమందే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సిబ్బందికి బోనస్ ఇవ్వడం, అంతకుమించి ఫ్లాట్లు ఇచ్చే గొప్పమనసు కొద్దీ మందికే ఉంటుంది. అలాంటి వారిలో ఈ ఫొటోలో కనిపించే సావ్‌జీభాయ్ ఒకరు. ఇలాంటి బాస్ దొరికితే సిబ్బంది కూడా కష్టమైన పనిని ఇష్టపడి మరీ చేస్తారు. ఎలాంటి టార్గెట్లు అయినా ఇట్టే సాధించేస్తారు.  ఇంతకూ అసలు విషయానికొస్తే దేశంలో పేరున్న వజ్రాల వ్యాపారి సావ్‌జీభాయ్ ధోలాకియా. హరే కృష్ణా ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు ఈయన యజమాని. చాలా కష్టపడి ఆయన వ్యాపారంలో పైస్థాయి కి ఎదిగాడు. ధోలాకియాకు వజ్రాల వ్యాపారం, టెక్స్‌టైల్ పరిశ్రమలు ఉన్నాయి. ఏటా సంస్థ లాభాల్లో ఉద్యోగులకు బోనస్ రూపేణా గిఫ్టులు అందజేసే ధోలాకియా ఈ దీపావళి సందర్భంగా భారీ నజరానా ప్రకటించారు. దీంతో సిబ్బంది యెగిరి గంతేశారు. సావ్‌జీభాయ్ 400 మంది ఉద్యోగులకు ఫ్లాట్లు, 1260 మందికి కార్లు ఇవ్వబోతున్నారు . అంతే కాకుండా 56 మంది ఉద్యోగులు జువెల్లరీ బాక్సులు అందజేస్తున్నారు. సూరత్‌కు చెందిన సావ్‌జీభాయ్ ధోలాకియా కంపెనీలో నెలకు పది వేల నుంచి అరవై వేల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగులున్నారు. 2011 నుంచి ఆయన తన వద్ద పనిచేసే ఉద్యోగులకు విలువైన గిఫ్టులు ఇవ్వడం మొదలెట్టారు. అమ్రేలీ జిల్లా డుధాల గ్రామానికి చెందిన ఆయన 1977లో సూరత్‌కి ఆర్‌టిసి బస్సులో వచ్చేవారు. పన్నెండు రూపాయల బస్ టికెట్‌పై ప్రయాణించిన ధోలాకియా ప్రస్తుతం వజ్రాల వ్యాపారం, వస్త్ర వ్యాపారంలో దూసుకుపోతున్నారు. ఒకనాడు ఆయన జీతం 179 రూపాయలు మాత్రమే . ప్రస్తుతం ఆయన కంపెనీ టర్నోవర్ 2800 కోట్లు పైమాటే. సిబ్బంది సంతోషంగా ఉంటే ఫలితాలు బాగుంటాయని సావ్‌జీభాయ్ అంటారు...
 • మార్కెట్లో ఒక్కోసారి  చాలా షేర్లు తక్కువ రేట్ల వద్ద ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి . ఈ సమయంలో ఆయా షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చా? అని చాలా మంది ఇన్వెస్టర్లకు సందేహం కలగవచ్చు. ఇలాంటి సందర్భాలలో అసలు ఆయా షేర్లు ఎంత కాలం నుంచి డౌన్ ట్రెండ్ లో నడుస్తున్నాయి. కారణాలేమిటో తెలుసుకోవాలి. అలాగే షేర్ తాలూకు కంపెనీ పని తీరు ఎలా ఉంది ? ఆ కంపెనీకి చెందిన పరిశ్రమ తీరు తెన్నులు ఎలా ఉన్నాయి ? కంపెనీ ఆర్ధిక ఫలితాలు ప్రకటించిందా ? ప్రకటిస్తే  ఫలితాలు ఎలా ఉన్నాయో ఒక అంచనాకు రావాలి. సొంతంగా అంచనాకు రాలేకపోతే నిపుణుల సలహాలు స్వీకరించాలి. అలా కాకుండా తక్కువ ధరల్లో దొరుకుతున్నాయని  కష్టార్జితాన్ని ఆలాంటి షేర్లలో మదుపు చేస్తే అంతే సంగతులు.   ఒక్కో సారి ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి చేరిన షేర్లు మరింత క్షీణించే అవకాశముంది. కాబట్టి షేరు ధరను చూసి కొనడమనేది చాలా ప్రమాదకరం. అలా చేస్తే చేతులు కాలడం ఖాయం.  అలాంటి షేర్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే  మాత్రం తగు సలహాలు తీసుకోవడం శ్రేయస్కరం. అలాగే రుణభారం అధికంగా ఉన్న కంపెనీల షేర్లకు దూరంగా ఉండటం మంచిది అని విశ్లేషకులు చెబుతున్నారు.  ఒక్కోసారి  మార్కెట్ పరిస్థితులను బట్టి  షేర్ల ధరలు తగ్గుతాయి . అలాంటపుడు మంచి షేర్లలో ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక వ్యూహంతో మదుపు చేయవచ్చు.  రిస్క్ ఎందుకులే అనుకుంటే మార్కెట్ కి దూరం గా ఉండటమే మంచిది.  కొంత ధైర్యం చేసి దీర్ఘ కాలిక వ్యూహం తో మంచి షేర్లలో మదుపు చేస్తే  భవిష్యత్ లో లాభాలు అందుకునే అవకాశాలు పుష్కలం గా వున్నాయి. అయితే ఇక్కడ కూడా కొంత రిస్క్ తప్పదు.కాగా మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నపుడు  పోర్ట్ ఫోలియో లో మార్పులు  చేపట్ట వచ్చు. బ్లూ చిప్ షేర్లు  అందుబాటులో ఉన్నాయో లేవో చూసుకోవాలి . అలాంటి షేర్లలో మదుపు చేస్తే లాభాలు ఖాయమని చెప్పుకోవచ్చు.  పోర్ట్ ఫోలియో లో 5నించి 10షేర్లు వుండాలి .10 కన్నా ఎక్కువ షేర్లు  ఉండటం మంచిది కాదు .భిన్న రంగాలకు చెందిన షేర్లు పోర్ట్ ఫోలియో లో ఉండేలా చూసుకోవాలి . మనం కొనుగోలు చేసిన  షేర్ల ధరలను క్రమం తప్పక సమీక్షించుకోవాలి .    ....KNMURTHY...
 • స్టాక్ మార్కెట్లో లాభాలకు అమ్మకాలే కీలకం.  మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నపుడే అదను చూసి షేర్లను అమ్ముకోవాలి. అంతే గానీ షేర్ ధర మరింత పెరుగుతుందని కూర్చోకూడదు . ఇన్వెస్టర్లు పెరుగుదల ప్రలోభానికి లోను కాకూడదు.  డబ్బును ప్రేమించాలి కానీ షేర్లను ప్రేమించకూడదు .  స్టాక్ మార్కెట్లు ఎందుకు పెరుగుతాయో ? ఎందుకు పతనమౌతాయో ఒక్కోసారి విశ్లేషకులకే అర్ధం కాదు. స్వల్ప విషయాలకే మార్కెట్లు పతనమైన ఉదాహరణలు కోకొల్లలు. అందుకే ఇన్వెస్టర్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. కొనుగోలు చేసిన షేర్ల ధరల్లో కదలిక వున్నపుడు మార్కెట్ ట్రెండ్ ను  అనుసరించి వెంటనే షేర్లను అమ్మేసి సొమ్ము చేసుకోవాలి.   అదనులో తొందరపడక పోతే అవకాశం పోగొట్టు కున్నందుకు తర్వాత బాధ పడాల్సి వుంటుంది.  చాలామంది ఇన్వెస్టర్లు ధర మరింత పెరుగుతుందని  వేచి చూసే ధోరణి కి అలవాటు పడి వుంటారు. ఈ అలవాటు కి స్వస్తి చెబితే మంచిది. దీర్ఘకాలం లో ఘనమైన రాబడులు అందుకోవచ్చని ఇన్వెస్టర్లు అంచనా వేస్తుంటారు. షేర్లను ఏడాది పాటైనా ఉంచుకోక పోతే ఎలా ? అని ప్రశ్నిస్తుంటారు.   అయితే స్టాక్ మార్కెట్ ధోరణుల్లో కాలానుగుణం గా మార్పులొచ్చాయి. గతం లో మాదిరిగా ఇపుడెవరూ పెట్టుబడిని ఒకే షేర్ లో ఉంచడం లేదు . స్వల్ప కాలిక కొనుగోళ్ళు అమ్మకాల పైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీర్ఘ కాలమంటే ప్రస్తుతం అయిదు లేక ఆరు మాసాలే .  ఆ పీరియడ్ లో షేర్ల ధరలు పెరగక పోతే నష్టానికైనా వదిలించుకోవడమే మంచిది.  పెరుగుదల లేని షేర్లను పోర్ట్ ఫోలియో లో ఉంచుకోవడం నష్టం తప్ప లాభం వుండదు . అందుకే కొనుగోలు చేసిన షేర్ల ధరలు ఎలా వున్నాయో ఎప్పటి కపుడు పరిశీలించు కోవాలి. నిత్యం షేర్ కొటేషన్లను స్టడీ చేయడం మరీ మంచిది. అంతే కానీ ప్రతి విషయానికి బ్రోకర్ల పై ఆధార పడకూడదు. అలాగే షేర్ల తాలూకు కంపనీల వార్తలను కూడా గమనించాలి . ముఖ్యం గా విస్తరణ, వివిదీకరణ, ఫలితాల ప్రకటన సమయాల్లో షేర్ల ధరలు పెరిగే అవకాశాలుంటాయి.  ఆ సమయంలో మార్కెట్ సెంటిమెంట్ మెరుగ్గా వుంటే అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. ఆలాంటి అదనులో అమ్మకాలు చేపడితే లాభాలు వళ్ళో వచ్చి వాలుతాయి .  కాబట్టి ఇన్వెస్టర్లు సరైన సమయం లో షేర్లను విక్రయిస్తే లాభాలను అర్జించవచ్చని గుర్తుంచుకోవాలి. ......K N MURTHY      photo courtesy.....zerohedge.com...
 • కింగ్ ఫిషర్ అనగానే విజయమాల్యా గుర్తుకొస్తారు. కింగ్ ఫిషర్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ అది. మాల్యా గురించి వినని వారు బహు తక్కువ.ఇండియా నుంచి పారిపోయి ప్రస్తుతం లండన్ లో ఉంటున్నమాల్యా భారత్ కి ఇక ఎప్పుడు చిక్కడు.. దొరకడు. ఇండియాలో ఉంటే జైల్లో పెడతారనే భయంతోనే ఆయన ముందు జాగ్రత్తగా పారిపోయాడని అంటారు. ఇందులో కొంతమంది ఉన్నత వ్యక్తుల ప్రమేయం ఉందనే ఆరోపణలు లేకపోలేదు. బ్యాంకులకు 10 వేల కోట్ల రూపాయలమేరకు టోపీ పెట్టిన విజయ మాల్యా లిక్కర్, రియల్ ఎస్టేట్, ఇంజినీరింగ్, ఫెర్టిలైజర్స్, బయోటెక్నాలజీ, ఐటీ వ్యాపారాలు నడిపారు. కానీ విమానయాన పరిశ్రమలో మాత్రం విఫలమయ్యారు.కింగ్ ఫిషర్ బ్రాండ్ కలసి రాలేదు.అనుభవమూ సరిపోలేదు. ఎదురు దెబ్బలు తగిలాయి. తండ్రి విటల్ మాల్యా మరణంతో 28 ఏళ్ల ప్రాయంలోనే కుటుంబ వ్యాపార పగ్గాలు చేపట్టిన విజయ్ మాల్యాది విలక్షణ వ్యక్తిత్వం.విమర్శలకు బెదరరు. .. జడవరు. మాల్యా జీవితాన్ని విలాసవంతంగా గడపడంలో ఏమాత్రం రాజీపడరు. కింగ్‌ఫిషర్ సంస్థను నష్టాలతో మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా బికినీ భామల ఫోజులతో ఏటా రూపొందించే క్యాలెండర్‌ ప్రచురణను ఆపలేదు . ఎవరెన్ని విమర్శలు చేసినా తాననుకున్నది చేయడం మాల్యా స్టయిల్. గ్లామర్ తారలతో రాసుకు పూసుకు తిరగడాన్ని ఆక్షేపించినా అస్సలు పట్టించుకోరు. అయితే రోజులెప్పుడూ ఒకతీరుగా ఉండవు. ఓడలు బళ్లవుతాయి. బళ్ళు ఓడలు అవుతాయి. ఏ వ్యాపారం పైనా శ్రద్ధ పెట్టక మాల్యా కష్టాల్లో కూరుకుపోయారు. కింగ్‌ఫిషర్‌ను ఒడ్డున పడేస్తానని బీరాలు పలికిన మాల్యా చివరకు చేతులెత్తేశారు. వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయిన మాల్యా ఒక దశలో పది కోట్ల రూపాయలు చెల్లించలేని స్థితికి చేరాడంటే  ఎవరూ నమ్మరు. ఒక  చెక్ బౌన్స్ కేసులో హడావుడిగా స్పందించి బయట పడ్డారు. లేకపోతే అపుడే దొరికిపోయే వాడు. బికినీ భామల కేలండర్ కింగ్‌ఫిషర్‌ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బికినీ భామల కేలండర్. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌, కింగ్ ఫిషర్ బీరు కంపెనీలు రెండూ యునైటెడ్ బెవరేజెస్ (యుబి)గ్రూప్ కు చెందినవి. మాల్యా ప్రతి ఏటా బికినీ భామల కేలండర్ రూపొందించే వాడు. ఆభామలతో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం మాల్యాకు మహా సరదా. కింగ్ ఫిషర్ విమానం ఎక్కనివారికి, కింగ్ ఫిషర్ బీర్ తాగని వారికి కూడా కేలండర్ గురించి తెలిసిఉంటుంది. ఆ కేలండర్ అంతటి ప్రాచుర్యం పొందింది.ఈ కేలండర్ కోసం మాల్యాఏటా లక్షలరూపాయలు ఖర్చుపెట్టేవారు. ఇక కింగ్‌ఫిషర్‌కు వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు సమకూర్చాయి. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కింగ్‌ఫిషర్ 7000 కోట్ల రూపాయల రుణాలను సమకూర్చాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ఒక్కటే 1500 కోట్లకు పైగా రుణాలను ఇచ్చింది. ఇవిగాక మరో మూడు వేల కోట్ల రుణాలు ఉన్నాయి. ఈ క్రమం లోనే మాల్యా  ఆస్తులను స్వాధీనం చేసుకొని వేలం వేస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ కోసం కూడా కొంత సొమ్ము పోగొట్టుకున్నారు . మొత్తం మీద విజయ్ మాల్యా భోగ లాలసత్వమే వ్యాపార సామ్రాజ్యాలకు చేటు తెచ్చిపెట్టింది. అయితే ముందు చూపుతో లండన్ లో మాల్యా కొన్ని స్థిర ఆస్తులు, వ్యాపారాలు ప్రారంభించారని కూడా అంటారు. అందుకే అక్కడ కెళ్ళి ఉంటున్నారు.  విల్లాల వేలం  గోవా సముద్ర తీరాన ఉన్న కింగ్‌ఫిషర్‌ విల్లాను అక్టోబరు 19న వేలం వేయబోతున్నారు . విజయ్ మాల్యా కి చెందిన ఈ విల్లా 12,350 చదరపు మీటర్ల పరిధిలో  ఉంది.  ఈ విల్లాలో 3 పెద్ద బెడ్‌రూంలు, పెద్ద లివింగ్‌ రూం ఉంది. ఈ విల్లా నిర్మాణానికి కలప, గ్రానైట్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అద్భుతమై నగిషీలతో రాజప్రాసాదాన్ని తలపించేలా  ఈ విల్లాను విజయ్‌ మాల్యా ఎంతో ఇష్టపడి నిర్మించుకున్నారు. ఏడాదిలో రెండుసార్లు కుటుంబ సమేతంగా ఆయన గోవా వచ్చి సరదాగా ఈ విల్లాలోనే గడిపేవారు. తన 60వ పుట్టిన రోజు వేడుకలను మాల్యా ఈ విల్లాలోనే జరుపుకోవడం విశేషం.  మే నెలలోనే ఈ విల్లాను స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జప్తు చేసుకుంది. విల్లాను చూడాలనుకునేవారికి అక్టోబరు 6 వరకు అవకాశం కల్పించారు . బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర టోపీ పెట్టిన కింగ్‌ఫిషర్‌ అధినేత విజయ్‌మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగం గానే ఈ విల్లా ను అమ్మకానికి పెట్టారు . అత్యంత ఖరీదైన ఈ విల్లా ధర రూ.85 కోట్లుగా నిర్ణయించినప్పటికీ ఇంకా అధికంగానే ధర  పలకవచ్చునని బ్యాంకు వర్గాలు భావిస్తున్నాయి. కాగా జులై లో ముంబయి లో ఉన్న విల్లా ను వేలం వేసిన విషయం తెలిసిందే. ...............KNMURTHY...
 • స్టాక్ మార్కెట్ లో లాభ సాటి షేర్లను గుర్తించి మదుపు చేస్తే  నష్ట పోయే అవకాశాలు తక్కువగా వుంటాయి.   అయితే లాభ సాటి షేర్లను గుర్తించడం అంతా సులభమైన విషయం కాదు.  ఇక్కడే మన శక్తి సామర్ధ్యాలు బయట పడతాయి.  మంచి షేర్లను గుర్తించడానికి నిరంతర పరిశీలన అవసరం.  మార్కెట్ లో ప్రతి పరిణామాన్నిగమనిస్తుండాలి. ఆర్ధిక ఫలితాలను పరిశీలిస్తుండాలి.అందుకు కొంత సమయం కేటాయించాలి . ఓర్పుగా మార్కెట్ కి సంబంధించిన ప్రతి అంశాన్ని అధ్యయనం  చేయాలి. చిన్న ఇన్వెస్టర్లు సహజం గా అంతా ఓపిక చూపరు. కొందరైతే ఏమాత్రం కష్ట పడకుండా అలా మదుపు చేస్తే ఇలా లాభాలు రావాలని కోరు కుంటారు.  ఆలాంటి వాళ్ళలో కొద్దిమంది లబ్ది పొందినా అధిక  భాగం చేతులు కాల్చుకున్నవారే వుంటారు.ఆలాంటి వారు స్టాక్ మార్కెట్ కి దూరం గా ఉండటమే మంచిది . రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోవాలన్న కోరిక ఉండొచ్చు కానీ స్టాక్ మార్కెట్లో అది సాధ్య పడదు.క్రమం గా ఒక పద్ధతి ప్రకారం  మంచి షేర్లను కొనుగోలు చేస్తూ  నిర్ణీత కాలం లో లాభాలను అర్జించాలని అనుకుంటే మటుకు కొంత కృషి చేయాల్సిన అవసరం వుంటుంది. అందుకోసం ఒక ప్లాన్ రూపొందించుకొని  షేర్లను ఎంచుకొని వాటి గురించి అధ్యయనం చేస్తూ మంచి పోర్ట్ ఫోలియోను ఏర్పాటు చేసుకుంటే  ఖచ్చితం గా లాభాలు  వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా మంది ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు .మార్కెట్లో పెద్ద మొత్తాల్లో మదుపు చేసే ఇన్వెస్టర్లు ఎక్కువగా షేర్ మార్కెట్ పై శ్రద్ధ చూపుతారు.ఆన్ లైన్ ఫోరమ్స్ లో చేరుతుంటారు ,అన్ని వేళల మార్కెట్ పరిణామాలపై ఓ కన్నేసి ఉంచుతారు. అన్ని సిఫారసులను పరిశీలిస్తుంటారు.అందు బాటు లో కొచ్చిన యే అవకాశాన్ని చేజార్చు కోకుండా సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు.తద్వారా లాభాలు గడిస్తుంటారు. లాభాలు ఆర్జిస్తూనే  అసలు అంటే పెట్టుబడి మొత్తాన్ని పక్కన పెట్టేస్తారు. మిగిలిన  మొత్తం తోనే రొటేషన్ కూడా చేస్తుంటారు. అవసరమైన సందర్భం లో మళ్ళీ పెట్టుబడి పెడుతుంటారు. ఇలాంటి వారంతా కూడా ప్రారంభం లో చేతులు కాల్చుకున్న వారే . అయితే అనుభవాలు నేర్పిన పాఠాలతో ఆరి తేరి జాగ్రత్త పడ్డ వారు. మొత్తం మీద స్టాక్ మార్కెట్ లో మదుపు చేసి  లాభాలు గడించాలనుకుంటే మటుకు కొంత మేరకైనా పరిశ్రమించాలి . అపుడే లాభాల ఆర్జనకు అవకాశాలు వుంటాయి .అంతే గానీ ఆషా మాషీ గా మదుపు చేస్తే మటుకు చేతులు కాల్తాయి.................KNMURTHY...
 • *బీమా పాలసీలు ఎంచుకునే సమయం లో చాలామంది  పాలసీ వల్ల కలిగే ప్రయోజనాలను పరిగణన లోకి తీసుకోరు. *బీమా ఏజెంట్ తెల్సిన వాడని మొహమాట పడుతుంటారు.ఏదో పాలసీ తీసుకుని ప్రీమియం చెల్లిస్తుంటారు. *ఇంకొందరు పాలసీ విలువ తెలుసుకోకుండానే మధ్యలోనే ప్రీమియం చెల్లింపులు నిలిపి వేస్తుంటారు. *అందుకే బీమా పాలసీ తీసుకునే ముందు  అసలు బీమా అంటే ఏమిటో దాని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే  మంచిది.  లేకపోతే బీమా తాలూకు ప్రయోజనాన్ని అనుభవించలేము.అవసరమైన సందర్భం లో బీమా ను ఉపయోగించుకోలేము.  *బీమా అంటే కేవలం పన్ను ఆదా కోసం ఉపయోగ పడే పధకమే కాదు  ఆపదలో మనపై ఆధార పడిన కుటుంబానికి  ఆర్ధికం గా అండగా నిలిచేది. *అలాగే పిల్ల్లల పెళ్ళిళ్ళు,చదువులు, రిటైర్మెంట్ తర్వాత  ఆర్ధిక అవసరాలు తీర్చే పొదుపు సాధనం అని చెప్పుకోవచ్చు. *అలాగే తీవ్రమైన అనారోగ్యం, ప్రమాద సంఘటనలలో కూడా బీమా అండగా వుంటుంది.  *ఇతర పెట్టుబడి సాధనాలు అలాంటి సందర్భాలలో ఉపయోగపడవు.ఇవన్నీ తెలుసుకుని బీమా పధకాలు తీసుకుంటే అన్నివిధాలా ఉపయోగ పడతాయి . బీమా పాలసీల విషయం లో ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలి.  *ప్రీమియం సకాలం లో చెల్లించాలి. * బీమా కవరేజ్‌ కనీసం పదవీ విరమణ సమయం వరకూ ఉండేలా జాగ్రత్తపడాలి. ఒకవేళ రిటైర్‌ కావడానికి ముందే పాలసీ కాల వ్యవధి పూర్తయితే, అది పెద్దగా ఉపయోగపడనట్టే. ఆ వచ్చే డబ్బు అప్పటి అవసరాలకే వినియోగమైపోతుంది.కాబట్టి దీర్ఘ కాలం ఉపయోగ పడేలా పాలసీని ఎంపిక  చేసుకోవాలి  *పాత పాలసీలు రద్దు చేసుకొని కొత్త పాలసీలు కడుతుంటారు.ఇది మంచి పద్ధతి కాదు. *పాత పాలసీని పునరుద్దరించుకోవడమే మేలు. *జీవిత బీమా పాలసీ అమల్లో ఉంటేనే క్లెయిమును ఆమోదిస్తారు. సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే పాలసీకి కాలం చెల్లుతుంది.  పాలసీని పునరుద్ధరించక ముందే మరణం సంభవించినా, పాలసీదారుడు అదృశ్యమైనా, ప్రమాదానికి లోనైనా క్లెయిమును ఆమోదించరు. అయితే, కాలం చెల్లిన పాలసీని పాలసీదారుడు జీవించి ఉండగా ఐదేళ్లలోపు ఎప్పుడైనా పునరుద్ధరించుకోవచ్చు. దీనికి కొంత అపరాధ రుసుము వసూలు చేస్తారు.కాబట్టి పునరుద్ధరణ పట్ల జాగ్రత్త తీసుకోవాలి  *కొత్త పాలసీ తీసుకోదలిస్తే ఉన్న పాలసీ కంటే మెరుగైన పాలసీ ని ఎంపిక చేసుకోవాలి. *కొత్త పాలసీ వల్ల ప్రయోజనాలు ఏమిటో తెల్సుకోవాలి. *కొత్త పాలసీ ప్రీమియం,వ్యవధి ,ఇతర రుసుములు గురించి తెలుసు కోవాలి. *పాలసీ తీసుకునే ముందు  ఆర్ధిక స్తోమత ను అంచనా వేసుకోవాలి,రెగ్యులర్ గా ప్రీమియం చెల్లి0చే స్థోమత  వుందో లేదో నిర్దారించుకుని   పాలసీని  తీసుకోవాలి. *ఏజెంట్లు చెప్పే మాటలను పూర్తిగా నమ్మ కూడదు , కొందరు ఏజెంట్లు మాయ మాటలు చెప్పి పాలసీ కట్టించి మళ్ళీ కనబడరు కాబట్టి పాలసీ కట్టీ ముందు ఖచ్చితమైన సమాచారాన్ని తెల్సుకొని పాలసీ తీసుకోవాలి. *ముఖ్యం గా "యులిప్స్" విషయం లో ఏజెంట్లు గోరింతను కొండంత చేసి చెబుతారు.కాబట్టి అప్రమత్తం గా వుండాలి . *ఇప్పటికే పాలసీ ని కలిగి వుంటే అది అక్కరకు ఏవిదం గా ఉపయోగ పడుతుందో సమీక్షించుకొని ఎలాంటి ప్రయోజనం లేదని భావిస్తే అపుడు ఆ పాలసీ ని రద్దు చేసుకోవాలి. కొత్త పాలసీ  కుటుంబానికి ఆర్ధిక రక్షణ  ఏమేరకు కల్పిస్తుందో తెల్సుకోవాలి. మెరుగైన ప్రయోజనం వుందంటే కొత్త పాలసీ ని తీసుకోవచ్చు. *పాలసీ  గురించి  సొంతం గా తెలుసుకునే పరిజ్ఞానం లేని పక్షం లో నిపుణుల నుంచి సూచనలు స్వీకరించవచ్చు.  *కొత్త పాలసీలు తక్కువ ప్రీమియం కే లభ్యమవుతుంటే మీ ఆరోగ్య పరిస్తితి ని దృష్టి లో వుంచుకొని పాలసీని తీసుకోవాలి.  *ఆరోగ్య పాలసీల విషయం లో ప్రీమియం కొంచెం ఎక్కువైనా పట్టించుకోకూడదు. *పాత పాలసీ ని రద్దు చేసి కొత్తది తీసు కోవాలనుకుంటే  దాని వ్యవధి ముగియకముందే తీసుకోవాలి.ఒక్క రోజు కూడా బీమా రక్షణ లేకుండా ఉండటం మంచిది కాదు. *ఒకటి కంటే ఎక్కువ పాలసీలు వున్నపుడు వాటి వ్యవధి ఎపుడు తీరుతుందో చూసుకోవాలి. *పాలసీలకు  ఎంత ప్రీమియం ఎంత చెల్లించాం? *ఒక వేళ రద్దు చేసుకుంటే ఎంత తిరిగి వస్తుంది లెక్క చూసుకోవాలి ?  *యులిప్  పధకాల ఎంపికలో జాగ్రత్త తీసుకోవాలి. అధిక ఎన్ ఏ వీ  ఆకర్షణలను చూసి మోస పోవద్దు. *యులిప్ లలో  మదుపు చేస్తే ఎక్కువ కాలం కోన సాగాలి. * మీ చిరునామా  మారినపుడు బీమా కంపెనీ కి తప్పనిసరిగా తెలియ చేయండి. *ఏ పాలసీ తీసుకునే ముందైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. *తొందర పాటు నిర్ణయాలు,మొహమాటాలు ఆర్ధిక విషయాలలో పనికిరావని గుర్తుంచుకోవాలి.  * బీమా పాలసీలను జాగ్రత్త గా దాచి ఉంచాలి.పాలసీ ఎక్కడ  దాచారో కుటుంబ సభ్యులకు తప్పనిసరిగా చెప్పాలి. *నామినీ ఎవరో ?పాలసీ పేరు ,విలువ తదితర వివరాలను ఒక చోట రాసి ఉంచాలి . * ఆన్ లైన్  పాలసీలు వుంటే ఇంట్లో వాళ్ళకు ఆ సమాచారం తప్పనిసరిగా తెలియ చేయాలి. * బీమా పాలసీలు చేయడం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. దాంతో క్లెయింల సంఖ్య కూడా పెరిగింది. దాదాపు 90 శాతం పాలసీలు తిరస్క రణకు గురవడానికి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉండటమే కారణం. విషయం ఎంత చిన్నదైనా కావచ్చు. పాలసీని తిరస్కరిం చేందుకు కారణం  అవుతుంది. ఈ కారణంతో పాలసీని తిరస్కరిస్తే ఎక్కువ సందర్భాల్లో అంబుడ్స్‌మన్‌, లేదా వినియోగదారుల ఫోరాలను ఆశ్రయించినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ముఖ్యంగా రూ.10 లక్షల కన్నా ఎక్కువ మొత్తంలో పాలసీ తీసుకున్న వ్యక్తులకు పాలసీ తీసుకున్న మూడేళ్ల లోపు మరణం సంభవిస్తే బీమా సంస్థలు దర్యాప్తు చేస్తాయి. లొసుగుల కోసం భూతద్ధంలో పెట్టి వెతుకుతాయి.ఇదివరకటి అనార్యోగం లేదా చెడు అలవాట్ల గురించి వెల్లడిస్తే పాలసీ ఇవ్వరేమోనని కొందరు అపోహపడుతుంటారు. ఇది నిజం కాదు. బీమా సంస్థలేవైనా సరే వ్యాపారం పెంచుకోవాలనే చూస్తాయి. ఇప్పటికే ఉన్న అనారోగ్యం గురించి వెల్లడించినప్పుడు ఇప్పుడు ఆ వ్యాధి లేదని నిర్ధారించుకోవడానికి అదనంగా కొన్ని పరీక్షలు చేయించుకోవాలని షరతులు పెడతాయి. వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు   చివరిగా చెప్పొచ్చేది ఏమిటంటే పాలసీ ఏదైనా దానిలో ఏదో ఒక ప్రయోజనం వుంటుంది. దాన్ని గుర్తించి అది మన అవసరాలకు ఉపయోగ పడుతుందా లేదా అనేది తెలుసు కోవడం లోనే  తెలివిని చూపాలి.అన్ని తెలుసుకున్నతర్వాతనే  పాలసీని తీసుకోవాలి. ........Theja ...
Site Logo