Latest News
బిజినెస్

ఈ అమ్మాయే అంబానీ వ్యాపార సామ్రాజ్య వారసురాలు!

1st Image

అచ్చం తండ్రి పోలికలో కనిపించే ఈ అమ్మాయే అంబానీ వ్యాపార సామ్రాజ్య వారసురాలు.
దేశంలో అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ.
ముకేశ్ అంబానీ తన కూతురుకి,,కుమారుడికి వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇస్తున్నారు.
ఇషా కూడా తండ్రి మాదిరిగానే సూక్ష్మగ్రాహి. అల్లుకు పోయే తత్వం గల పిల్ల. 
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంపై తనదైన ముద్ర వేసేందుకు మెల్ల మెల్లగా ఆమె సిద్ధమవుతున్నారు. 
ఇషా వయసు 24  ఏళ్లు. ఇషా అమెరికాలోని యాలె యూనివర్సిటీలో సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్ ప్రధాన సబ్జెక్టులుగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అలాగే  అమెరికాలోని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సేలో వ్యాపారంలో మెళకువలు నేర్చుకునే కోర్స్ చేశారు . వినియోగదారులతో ప్రత్య క్ష సంబంధాలుండే వ్యాపారాలన్నింటినీ ఆమెకు అప్పగించాలని ముఖేష్  ఆకాంక్ష. ఇప్పటికే  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ , రిలయన్స్ వెంచర్స్ లో ఇషా డైరెక్టర్ గా చేస్తున్నారు. ఆసియా లో పవర్ ఫుల్ బిజినెస్ అప్ కమింగ్ వుమన్ గా  ఇషా గుర్తించబడ్డారు.  ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుల కుటుంబ వారసురాలిగా ఫోర్బ్స్ అమెను గుర్తించింది. అన్నట్టు ఇషా, ఆకాశ్‌లు కవల పిల్లలు.ఆకాశ్ కూడా  జియో లో  డైరెక్టర్ గా చేస్తున్నారు . వీరి తమ్ముడు అనంత్ అమెరికాలో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నారు.
పియానో వాయించడంలో ఇషా నిష్ణాతురాలు. 16 ఏళ్ల వయసులోనే ఇషా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. 
ఇక  మరో విషయం ఏమిటంటే ..... 
ఇన్ని ప్రత్యేకతలున్న ఇషా అంబానీ వివాహ ముహూర్తం ఖరారైనట్లు  మీడియా లో కొన్ని రోజుల క్రితం వార్తలు వెల్లువెత్తాయి . నవంబర్‌లో ఇషా అంబానీ పెండ్లీ అంగరంగవైభవంగా జరగ బోతున్నట్టు  మీడియా ఊదర గొట్టింది. 
ఈ వేడుకలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్‌ఖాన్ ప్రత్యేక నృత్య ప్రదర్శన ఇవ్వనున్నట్లు కూడా  రాసేసాయి. అయితే అవన్నీ పుకార్లే అని ముఖేష్ దగ్గరి బంధువు ఒకరు ప్రకటించారు.  అయితే ముకేశ్ ఇంట పెళ్లి మాత్రం జరగబోతోంది  అది ఎవరిది అంటే ఆయన మేనకోడలది  అట.  
  • మహిళలు ఇష్ట పడే  నేత, జరీ చీరలకూ జిఎస్‌టి దెబ్బ తగిలింది . జిఎస్‌టికి తోడు చైనా పట్టు, పవర్‌లూమ్‌లు కలిసి చేనేత రంగంపై ముప్పేట దాడి చేస్తున్నాయి. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ముడిసరకుపై జిఎస్‌టిని విధించడంతో చేనేత రంగం సంక్షోభంలో పడింది. పన్ను పోటు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈ రంగంపై ఆధారపడిన కుటుంబాలు కోరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో   5 లక్షల మగ్గాలు గతంలో ఉండగా, ప్రభుత్వ విధానాల కారణంగా ప్రస్తుతం వాటి సంఖ్య 3 లక్షలకు పడిపోయింది. డిమాండ్ ఉన్నప్పటికీ, చేనేత రంగం లాభసాటిగా లేకపోవడంతో మగ్గాలు చాలా వరకూ మూతపడుతున్నాయి. మంగళగిరిలో ఒకప్పుడు 11వేల మగ్గాలు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 1000కు తగ్గడం పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది.ఈ నెల 1 నుంచి  అమల్లోకి వచ్చిన జిఎస్‌టి ప్రభావం చేనేత రంగంపై తీవ్రంగా పడింది. చిలపలు పై 5 శాతం మేర పన్ను విధించారు. జరీ చీరల్లో వాడే జరీపై 12 శాతం పన్నును కొత్తగా విధించారు. చీర ఖరీదు 1000 రూపాయలకు మించితే 18 శాతం మేర పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో 1000 రూపాయల కంటే ఎక్కువ ఖరీదు ఉన్న నేత చీర ధర 23 శాతం మేర పెరిగింది. జరీ చీరకు 35 శాతం మేర ధర పెరగింది. దీంతో 1000 రూపాయలు ఉన్న నేత చీర 1230 రూపాయలకు, జరీ చీర 1350 రూపాయలకు పెరిగింది. దీంతో పెరిగిన ధరలతో చీరల కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉందని చేనేత వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.  ఇప్పటికే చేనేత రంగం లాభసాటిగా లేని నేపథ్యంలో ఈ రంగానికీ చైనా పోటీ తప్పడం లేదు. పట్టు చీరల తయారీని ప్రభుత్వం ప్రోత్సహించడంతో ధర్మవరంలో కోట్ల రూపాయల పెట్టుబడులతో కొన్ని యూనిట్లను నెలకొల్పారు. అక్కడ భారీ పెట్టుబడులతో చైనా కంపెనీలు పట్టు చీరల తయారీ పరిశ్రమలను పెట్టేందుకు వీలుగా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. దీంతో యంత్రాలపై పట్టుచీరలు తయారు చేస్తున్నారు. ఇవి మగ్గాలపై నేసిన చీరల కన్నా తక్కువ ధరకే లభిస్తాయి. 11 రకాల వస్త్రాలను కేవలం మగ్గాలపై తయారు చేసి విక్రయించాలని...  పవర్‌లూమ్‌లపై తయారు చేయటంపై నిషేధం విధించినప్పటికీ, చిన్న మార్పులతో పవర్‌లూమ్‌లపై ఆయా వస్త్రాలను తయారు చేస్తున్నారు. దీంతో మగ్గాలపై నేసిన చీరలు, ఇతర వస్త్రాల కంటే పవర్‌లూమ్‌పై చేసిన వాటి ధర తక్కువగా ఉంటోంది. ముడి నూలుతో పవర్‌లూమ్‌లపై చేసిన వస్త్రాల నాణ్యత కంటే మగ్గాలపై చేసి వస్త్రాలు మన్నిక ఎక్కువగా ఉంటుంది. అయితే మగ్గాలపై నేసిన చీరల ధర ఎక్కువగా ఉంటుంది. దీంతో మగ్గాలపై నేసిన చీరల కొనుగోళ్లు తగ్గుతున్నాయి.  కొనుగోళ్లు తగ్గుతున్న క్రమంలో  ఈ రంగంపై ఆధారపడిన వారి పరిస్థితి మరింత దిగజార నుంది. ఇప్పటికే శానిటరీ నాప్కిన్స్‌పై భారీగా పన్ను విధించి మహిళల ఆగ్రహాన్ని చవి చూస్తున్న కేంద్ర ప్రభుత్వం, చీరల ధరలను ప్రభావితం చేసేలా పన్ను విధించడం కూడా విమర్శలకు గురి అవుతున్నది. కేంద్రం దీనిపై పునరాలోచించాల్సిన అవసరం ఉంది.  పవర్‌లూమ్‌ల ద్వారా వచ్చే వస్త్రాల ధర తక్కువగా ఉండటంతో మగ్గాలపై నేసిన చీరలకు డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంది . 
  • అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ  ఎయిర్ ఇండియా పునరుజ్జీవానికి ప్రైవేటీకరణతో పాటు పలు అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనిపై కేబినెట్‌ తుది నిర్ణయం తీసుకోనున్న క్రమంలో ఎయిరిండియాను దాని మాతృసంస్థ  టాటా గ్రూప్‌ సింగపూర్  ఎయిర్‌లైన్స్‌తో కలిసి కొనుగోలు చేసేందుకు ఆసక్తి  చూపుతోంది .  ఎయిరిండియా జాతీయం కాకముందు టాటాగ్రూప్‌లోనే  ఉండేది. దేశంలో పౌర విమానయాన పరిశ్రమకు నాంది పలికింది టాటాలే. వారు నిర్వహించిన సంస్థనే ప్రభుత్వం సొంతం చేసుకుని కొన్ని దశాబ్దాలపాటు నడిపి, తప్పుడు నిర్ణయాలతో నష్టాలపాలు చేసింది. ఇప్పుడు అమ్మకానికి పెట్టింది. కాగా  ఇప్పటికే టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ దీనిపై అనధికారికంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. 2007 నుంచి ఎయిరిండియా నష్టాల బాటలోనే నడుస్తోంది. ఇక గతంలోకి వెళితే  టాటా ఎయిర్‌లైన్స్‌ 1932లో ప్రారంభమైంది. లెజండరీ పారిశ్రామికవేత్త జెఆర్‌డి టాటా తొలి విమానాన్ని తానే స్వయంగా కరాచి, ముంబై మధ్య నడిపారు. 1946లో టాటా ఎయిర్‌లైన్స్‌ను ఎయిర్‌ ఇండియా పేరుతో పబ్లిక్‌ కంపెనీగా మార్చారు. జెఆర్‌డి కలల పుత్రికగా చెప్పే ఎయిర్‌ ఇండియా.. టాటాల నిర్వహణలో ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. నిర్వహణలో ప్రతి చిన్న అంశంలోనూ, ప్రయాణికులకు అందించే ఆహార పదార్ధాల నుంచి కర్టెన్ల ఎంపిక వరకు జెఆర్‌డి కలుగజేసుకునేవారని చెబుతారు.   1953లో ప్రభుత్వం దీనిని జాతీయం చేయడంతో జెఆర్‌డి కలలు కుప్పకూలాయి. కనీసం తమతో మాట కూడా చెప్పకుండా ప్రభుత్వం ఎయిర్‌ ఇండియాను జాతీయం చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జెఆర్‌డి లేఖ కూడా రాశారు. నిర్ణయం కంటే కూడా నిర్ణయం తీసుకున్న పద్ధతి తనను బాధించిందని ఆయన నిరసన వ్యక్తం చేశారు.  సంస్థను జాతీయం చేసినా చైర్మన్‌గా మాత్రం జెఆర్‌డినే కొనసాగాలని నెహ్రూ నిర్ణయించడంతో 1977 వరకు ఆయనే చైర్మన్‌గా ఉన్నారు. 1977లో మొరార్జీ ప్రభుత్వం ఆయన్ను చైర్మన్‌ పదవి నుంచి తప్పించింది. అప్పటి  నుంచి టాటాలు ఆ సంస్థ గురించి పట్టించుకోవడం మానేశారు. ఇన్నేళ్లకి  అవకాశం రావడం తో సొంతం చేసుకునే యత్నాలకు శ్రీకారం చుట్టారు. 
  • నగదు ఉపసంహరణ, చెల్లింపులపై స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా జూన్  1 నుంచి  అదనపు చార్జీలు వసూలు  చేయడం మొదలెట్టింది. బ్యాంకులో నెలకు నాలుగు లావాదేవీలు మాత్రమే ఖాతాదారులకు ఉచితం. ఆపై జరిపే ప్రతి లావాదేవీపై 50 రూపాయల సేవా పన్నును ఎస్బీఐ వసూలు చేస్తుంది . ఇక ఎస్బీఐ ఏటీఎంల్లో కార్డు ద్వారా నగదు విత్ డ్రా చేస్తే రూ.10, ఇతర బ్యాంకు ఎటీఎం నుంచి విత్ డ్రా చేస్తే రూ.20 వడ్డించనుంది. ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లపై కూడా అదనపు చార్జీలను వసూలు చేస్తుంది. ఎస్బీఐ అదనపు చార్జీల వసూలు పై ముందే ప్రకటించింది.  ఖాతాల్లో ఎక్కువ డబ్బులుండేవారికి మినహాయింపు ఉంటుంది. కనీస బ్యాలెన్స్‌ రూ. 25వేలు దాటితే ఎన్ని లావాదేవీలైనా ఫ్రీగా చేసుకోవచ్చు. అంతకన్నా తక్కువుంటే మాత్రం పరిమితులు.. భారీగా చార్జీల వడ్డన తప్పదు. ఆన్‌లైన్‌ లావాదేవీలు కూడా నెలకు 40 మాత్రమే ఉచితం. చిరిగిన నోట్లు మార్చాలన్నా డబ్బు కట్టాల్సిందే.  ఖాతాదారులనుంచి పెద్ద ఎత్తున నిరసన  వ్యక్తం  అయినప్పటికీ  బ్యాంకు దిగిరాలేదు. ఖాతాదారులు అన్నివిషయాలు తెలుసుకుని లావాదేవీలు నిర్వహించడం మంచిది.  
  • వన్నా క్రై'    దెబ్బతో బ్యాంకింగ్ రంగం అతలాకుతలం కానుంది. ముందు జాగ్రత్తగా దేశంలోని ఏటీఎం లను మూసివేయాలని రిజర్వు బ్యాంక్ నిర్ణయం తీసుకుంది.  "వన్నా క్రై"   ప్రభావం బ్యాంకింగ్  నెట్‌వర్క్‌పై పడకుండా  ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాన్నా క్రై  రాన్సమ్‌వేర్ ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సహా వివిధ రంగాల కంప్యూటర్ నెట్‌వర్క్‌లను  దెబ్బ తీసిన విషయం తెల్సిందే.  కీలకమైన డాటా మూసుకుపోయేలా చేసి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు వార్తల వస్తోన్న  నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. మనదేశంలోని దాదాపు అన్ని ఏటీఎంలు విండోస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తోనే పనిచేస్తున్నాయి. అదీగాక దేశంలోని 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం ఏటీఎంలు ఔట్‌డేటెడ్ విండోస్ ఎక్స్‌పీపైనే ఆధారపడుతున్నాయి. దీంతో ఈ నెట్‌వర్క్‌పై మాల్‌వేర్ సులభంగా దాడి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు .మాల్‌వేర్ దాడుల క్రమంలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్‌పీ కి  కూడా ప్రత్యేక అప్‌డేట్ ఇస్తామని ప్రకటించింది. దీంతో విండోస్ ప్యాచ్‌లను అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా ఆర్బీఐ తాజాగా బ్యాంకులకు సూచించింది. అంతవరకూ ఎటీఎం మెషీన్లను ఆపరేట్ చేయవద్దని సూచించింది.   అయితే, తమ డబ్బు విషయంలో కస్టమర్లు భయపడాల్సిన పని లేదని ఏటీఎం ఆపరేటర్లు అంటున్నారు. ఏటీఎం యంత్రాల్లో డాటా స్టోరేజి ఉండదని, ఏటీఎంలు 'వాన్నా క్రై' బారిన పడే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఒకవేళ ఏటీఎంలు మాల్‌వేర్ బారిన పడినా వెంటనే రీఫార్మెట్ చేసే అవకాశం ఉంటుదని ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అండ్ సర్వీసెస్ నిపుణులు అంటున్నారు. మొత్తం మీద కొద్దీ రోజులు ఈ సంక్షోభం తప్పేలా లేదు. 
  • (Vasireddy Venugopal) ............   బ్యాంకులు కొత్త బ్రాంచీ తెరవాలన్నా, కొత్త ఏటీఎం పెట్టాలన్నా రిజర్వ్ బ్యాంక్ అనుమతి అవసరం. వాటిని ఏ ప్రాంతంలో నెలకొల్పదలుచుకున్నదీ తెలియజేసి అనుమతి పొందవలసి వుంటుంది. అయితే Onsite ATM పెట్టుకోవడానికి ఆర్.బి.ఐ అనుమతి అవసరం లేదు. అంటే.. బ్యాంక్ బ్రాంచ్ ఆవరణలో పెట్టుకునే ఏటీఎంకి ఆర్.బి.ఐ అనుమతి అవసరం లేదు. ఆ ఏటీఎంను బ్రాంచిలో అంతర్భాగంగా పరిగణిస్తారు. ఆ ఏటీఎంను ఆ బ్రాంచి స్వయంగా నిర్వహించుకునే అవకాశం వుంది. ఏటీఎంలో ఎప్పుడు డబ్బులు ఖాళీ అయినా.. బ్రాంచి సిబ్బందే తమ స్ట్రాంగ్ రూమ్ నుంచి నగదు తీసుకువచ్చి ఏటీఎంలో నింపి, ఖాతాదారులకు అసౌకర్యం కలగకుండా చూసే అవకాశం వుంది. అయితే మార్చి 1 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో Offsite ATMలలోనే కాకుండా.. Onsite ATMలలో కూడా నో క్యాష్. ఇరవై రోజులనుంచి ఈ తంతు నడుస్తోంది. కారణాలు తెలియదు. బ్యాంకులకు, నగదు సప్లయిచేసే ప్రెవేటు ఏజెన్సీలకు కమిషన్ విషయంలో పేచీ వచ్చిందని, అందుకనే ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడిందని తెలుస్తున్నట్టు.. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ముక్కుచీదే వార్త ఒకటి వచ్చింది. ఇక అంతే. ఇరవై రోజులుగా ఈ సమస్య ఎందుకు కొనసాగుతోంది.. దీనికి ఏమిటి పరిష్కారం అనే తదుపరి అజాపజా వార్తలు లేవు. నాకు అర్ధమైన దాని ప్రకారం.. బ్యాంకులు.. తాము స్వయంగా నిర్వహించుకోవడానికి అవకాశం వున్న Onsite ATMలలో నగదు నింపే బాధ్యతను కూడా ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించి, చేతులు దులుపుకున్నట్టున్నాయి.  ఫలానా పరిమితిలోపు నగదు లావాదేవీలను ఏటీఎం ద్వారా నిర్వహించుకోవాలని బ్రాంచిలో బోర్డులు పెట్టిన బ్యాంకులు.. ఏటీఎంలో స్వయంగా నగదు వుంచగలిగిన బాధ్యతను దులిపేసుకుని కస్టమర్లతో చెలగాటమాడడం Financial Terrorism కిందే లెక్క.
  • ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండే 10 రూపాయల ప్లాస్టిక్ నోట్ల ను  రిజర్వ్ బ్యాంక్ ముద్రించబోతోంది .   వాటిని క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకం గా  పరీక్షించేందుకు రిజర్వు బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.  దేశంలోని  ఐదు ప్రాంతాల్లో ప్లాస్టిక్ నోట్లతో క్షేత్రస్థాయిలో ప్రయోగాలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన ఆ సమాధానంలో చెప్పారు. ప్లాస్టిక్ మిశ్రమాల సేకరణ, వాటిపై రూ. 10 నోట్ల ముద్రణ లాంటి విషయంలో అన్ని అనుమతులను రిజర్వు బ్యాంకుకు ఇచ్చినట్లు వివరించారు. ప్రస్తుతం వాడుతున్న కాగితపు నోట్ల కంటే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు రిజర్వు బ్యాంకులు కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టిక్, ఇతర పదార్థాలతో చేసిన నోట్ల గురించి చలామణి లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. 2014 నుంచి ప్లాస్టిక్ నోట్లు తెచ్చే ప్రతిపాదన పరిశీలన లో ఉంది. గత డిసెంబర్ లోనే ముద్రణకు వెళ్లాల్సి ఉండగా ఆలస్యమైంది. కొచ్చి , మైసూర్ , సిమ్లా ,భువనేశ్వర్ వంటి నగరాల్లో తొలుత ప్రయోగాత్మకంగా  ప్రవేశ పెడతారు .