Latest News
బిజినెస్

ఇండియా షైనింగ్ రోజులు వస్తాయేమో ?

1st Image



India Shining…
ఓ పుష్కర కాలం వెనక్కి వెళ్లి చూస్తే.. ఈ నినాదం మారుమోగిపోయిన రోజులు గుర్తుకొస్తాయి.
అవి.. వాజపేయి ప్రధానమంత్రిగా వున్న రోజులు. శ్రీనగర్ లాల్ చౌక్ లో వాజపేయి చరిత్రాత్మక, ఆవేశపూరిత ప్రసంగాన్ని ఇంకా మర్చిపోకుండా ఆయనను దేశప్రజలు అభిమానిస్తున్న రోజులు. ఏ రామమందిర నిర్మాణానికైతే ఎల్.కె.అద్వానీ భారతదేశాన్ని నిప్పుల కొలిమిలోకి నెట్టారో.. ఆ మందిర నిర్మాణ ఫైలును మడతపెట్టి చెత్తబుట్టలో పారేసిన రోజులు. ఇండియా ఒక మార్పుకోసం ఎదురుచూస్తున్న రోజులు. ఇండియన్లు నూతన అవకాశాలకోసం ఆబగా ఎదురుచూస్తున్న రోజులు. మధ్యతరగతి ఆదాయాలు అమాంతం పెరగడంతో.. ఇండియన్లు కసిగా వున్న రోజులు. ప్రభుత్వ రంగ సంస్థలను కసాయి వాళ్లలాగా కారుచౌకగా విక్రయిస్తున్న రోజులు. ఆ కసాయి పనికోసం బుద్ధిజీవిగా పేరుపడ్డ అరుణ్ శౌరీని కేబినెట్ మంత్రిగా చేసిన రోజులవి. హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థలను కూడా అయినకాడికి అమ్మడానికి బరితెగించిన రోజులవి.
ఆ రోజు.. భారతదేశాన్ని దేశభక్తులు కాపాడుకున్నారు. పార్లమెంటు కాపాడింది. సుప్రీంకోర్టు కాపాడింది.
ఎవరికన్నా బాగా గుర్తుందా? ఆ ఇండియా షైనింగ్ రోజుల్లో బ్యాంకుల గడపతొక్కిన ప్రతి మధ్యతరగతి జీవికి తప్పనిసరిగా గుర్తుండే వుంటుంది.
హౌసింగ్ లోన్లు, పర్సనల్ లోన్లు, ఫుట్ పాత్ ల మీద క్రెడిట్ కార్డు వితరణలు జోరుగా సాగుతున్న రోజులు. బ్యాంకుల దగ్గర కుప్పలు తెప్పలుగా నిధులు వున్న రోజులు. ఫ్లోటింగ్ రుణాల కాన్సెప్ట్ వచ్చిన రోజులు.
అప్పట్లో హౌసింగ్ లోన్ కోసం బ్యాంకుల గడప తొక్కిన వాళ్ల చెవిలో సిబ్బంది జోరీగలాగా ఒకటే చెప్పేవారు. ఫ్లోటింగ్ రేట్ ఎంచుకోండి అని. వద్దులెండి ఫిక్స్డ్ రేట్ వడ్డీ రుణానికే వెళతాను అని కస్టమర్లు అన్నా మేనేజర్లు ఊరుకునేవారు కాదు. పైగా అప్పట్లో ఫ్లోటింగ్ రేట్ వడ్డీకన్నా ఫిక్స్డ్ రేట్ వడ్డీ ఎక్కువ వుండేది. ఉదాహరణకు ఫ్లోటింగ్ రేట్ వడ్డీ 7శాతం వుంటే, ఫిక్స్డ్ రేట్ వడ్డీ 9శాతం వుండేది.
బ్యాంకింగ్ సిబ్బందిది ఒకటే రొదగా వుండేది.. ఇండియా షైనింగ్ అండీ.. వడ్డీ రేట్లు ఇంకా దారుణంగా, మరీ దారుణంగా పడిపోబోతున్నాయి. జపాన్ లో లాగా, అమెరికాలో లాగా మూడున్నర, నాలుగు శాతానికి తగ్గిపోయే సుదినం మరెంతో దూరంలో లేదు అని ఊదరగొట్టేవారు. నిజమే కామోసు అని కస్టమర్లు అందరూ ఫ్లోటింగ్ వడ్డీ రేట్లనే ఎంచుకున్నారు. అంతగా పడిపోయే ఆస్కారం వున్న వడ్డీ స్కీమును ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు? ఇచ్చిన అప్పుపై వడ్డీ రేటు పడిపోతే బ్యాంకులకే నష్టం కదా! నాలుగు శాతానికి పడిపోయే ఫ్లోటింగ్ వడ్డీకంటే.. 9శాతం వుండే ఫిక్స్డ్ వడ్డీ రేటువల్లనే బ్యాంకులకు, సిబ్బందికి లాభం కదా? అని పెద్దగా ఎవరూ ఆలోచించలేదు. అదొక మాయా ప్రచారం. అందరూ ఆ ఊబిలోకి బాగానే చిక్కుకుపోయారు.
నిజానికి ఆ తర్వాత వడ్డీ రేట్లు తగ్గలేదు సరికదా.. తీసుకున్నప్పటికంటే చాలా ఎక్కువ పెరిగిపోయాయి.
దాంతో మిడిల్ క్లాస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఘోరంగా దెబ్బతిన్నది. ముఖ్యంగా 2009 ఆర్థిక సంక్షోభం తర్వాత దీనాతిదీనమైంది. బ్యాంకులకంటే కాబూలీవాలాలు నయం. వీళ్లను ఎప్పటికీ విడిచిపెట్టవు. అనేక చట్టాలు తెచ్చుకున్నాయి.. వీళ్లను జీవిత పర్యంతం వేధించడానికి. అందులో సిబిల్  (credit information bureau of india ltd) ఒకటి  అన్నట్టు....
ప్రస్తుతం నడుస్తున్న తమాషా గురించి ఒక మాట. పెద్ద నోట్ల రద్దు వల్ల కొంత నల్లధనం కూడా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా చెలామణిలోకి వస్తుంది. నల్లధనం అని పేరు పెట్టలేకపోయినా.. లెక్కల్లో చూపని మరికొంత నగదు కూడా చెలామణిలోకి వస్తుంది. మొత్తం 20లక్షల కోట్లు వుందని, అందులో 15లక్షల కోట్లు చెలామణిలోకి వస్తుందని కొన్ని కాకి లెక్కలు వున్నాయి. కానీ నా అంచనా ప్రకారం 3నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి కొత్తగా చెలామణిలోకి వస్తుంది.
ఇది నిజంగా బ్యాంకులకు పండగే. అకౌంట్లను క్లీన్ చేసుకుంటాయి. లెక్కలు సరిచూసుకోవడానికి వేల సంఖ్యలో సిబ్బందిని నియామకం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తే. ఐటీ... ఆ ఐటీ కాదండీ.. ఇన్ కంటాక్స్ డిపార్ట్ మెంట్ కీ చాలా సిబ్బంది అవసరం అవుతుంది.
ఏమైనా.. కాయ్ రాజా కాయ్...
బ్యాంక్ స్టాఫ్ మళ్లీ ఫుట్ పాత్ ల మీద మనను పలకరించి... రావుగారూ.. ఓ లక్ష అప్పు ఇస్తాం తీసుకోకూడదూ అని... మనను దేబిరించి, ఫుట్ పాత్ మీదనే మన సంతకాలు తీసుకుని.....
మరీ అంత కాకపోయినా అలాంటి India Shining రోజులకు అవకాశం వుందని నా ఎడమకన్ను అదురుతూ చెబుతోంది.
 
----- VASIREDDY  VENUGOPAL 

Site Logo
  • పై ఫొటోలో కనబడే పెద్దాయన  5 వ  తరగతి  చదువుతూ మధ్యలో ఆపేశారు .  అయితేనేమి ఇపుడు  దేశంలో అత్యంత ఎక్కువ వేతనం పొందుతున్న సి.ఇ.ఓ. ఆయనే !!  నెలకు ఆయన వేతనం 21 కోట్ల రూపాయలు. అవును నిజమే .  ఆయన తీసుకునే  21 కోట్ల రూపాయలలో   90 శాతాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. ఆయన వయస్సు సుమారు ‘  తొంభై ఐదేళ్లు ’. అయినప్పటికీ ఎందులో తగ్గరు.   ఆయన నవ యువకుడి మాదిరిగా హుషారుగా పనిచేస్తారు. ఆయన పేరే  ధరమ్‌పాల్ .  తమ కంపెనీ ఉత్పత్తులలో నాణ్యతా ప్రమాణాలు ఏ మాత్రం తగ్గకుండా చూడటంతోపాటు, నిరంతరం మార్కెట్ పరిస్థితులను అధ్యయనం చేస్తూ ధరమ్‌ పాల్  డీలర్లను  కలుసుకొంటారు.  ఆయనకు ఆదివారం, సోమవారం అనే భేదం లేదు. సెలవులతో సంబంధం లేదు.  తొమ్మిది పదులు వయస్సు దాటినప్పటికీ, పనిచేయడంలో ఆయన ఎప్పుడూ ఉత్సాహంగా, ఉల్లాసంగా కనిపిస్తారు.. ప్రముఖ మసాల పొడుల తయారీ కంపెనీ మహాషియాన్ డి హట్టి (ఎం.డి.హెచ్) వారిదే .   అందరూ ఆయనను గౌరవంగా ‘దాదాజీ’, ‘మహాశయజీ’ అని పిలుస్తారు.  దేశంలో అత్యంత ఎక్కువ వేతనం పొందుతున్న సి.ఇ.ఓ.కూడా ఆయనే కావడం విశేషం.  ఐటీసీ , హిందుస్థాన్ యూనీలీవర్   మేనేజింగ్ డైరెక్టర్ల కంటే  ఎక్కువే.  నెలకు ఆయన వేతనం 21 కోట్ల రూపాయలు. ఆయన తన వేతనంలో 90 శాతాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. చేస్తున్న పని పట్ల నిబద్ధత, అకుంఠిత దీక్ష ఉంటే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చనడానికి దాదాజీని ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంతో కష్ట పడి  ధరమ్‌పాల్  ఈ స్థాయికి  ఎదిగారు.   ‘మహాషియాన్ డి హట్టి’ని ధరమ్‌పాల్ తండ్రి చునిలాల్ 1919లో పాకిస్థాన్‌లోని సియోల్ కోఠ్‌లో ప్రారంభించారు.  దేశ విభజన అనంతరం ధరమ్‌పాల్ కుటుంబం భారతదేశానికి తరలి వచ్చింది. ధరమ్‌పాల్ దిల్లీలోని కరోల్‌బాగ్‌లో వ్యాపారం ప్రారంభించారు. పట్టుదలతో కృషిచేసి ఎం.డి.హెచ్. మసాలాలకు ప్రజాదరణ లభించింది . అప్పటినుంచి ఆయన వెనుతిరిగి చూడలేదు .  ప్రస్తుతం ఎం.డి.హెచ్. కంపెనీ 60 రకాల మసాలా పౌడర్లను తయారుచేసి విస్తృతంగా మార్కెటింగ్ చేస్తున్నది. ఈ కంపెనీకి చెందిన 15 ఫ్యాక్టరీలలో ఇవి తయారవుతున్నాయి.  ఈ కంపెనీకి  దేశ వ్యాప్తంగా వెయ్యి మంది డీలర్లు ఉన్నారు. ఇప్పటికీ ప్రతిరోజూ ధరమ్‌పాల్ ఫ్యాక్టరీలను  స్వయంగా వెళ్లి  పరిశీలిస్తుంటారు . ప్రతి రోజు డీలర్లను కలుస్తుంటారు.  ప్రస్తుతం కంపెనీ వార్షిక టర్నోవర్ 15వేల కోట్ల రూపాయలు. దుబాయ్, లండన్‌లలో కంపెనీ కార్యాలయాలు ఉన్నాయి. ఎం.డి.హెచ్. ఉత్పత్తులు వంద దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. నాణ్యమైన సరుకును అందరికి అందుబాటులో ఉండే ధరకు అందించడమే తమ కంపెనీ విజయ రహస్యం అని చెబుతారు ధరమ్‌పాల్. కార్మికుల కోసం ఒక వైద్యశాల, 20 పాఠశాలలను తన కంపెనీ తరఫున ధరమ్‌పాల్  నిర్వహిస్తున్నారు.  ఈ తరం యువకులు , వ్యాపార వేత్తలు ఆయనను చూసి నేర్చుకోవాల్సింది  ఎంతో ఉంది. 
  • విదేశాల్లో కౌగిలింతలు  ఇపుడు వ్యాపారం గా మారాయి . "కడ్డలిస్ట్ .కామ్ " అనే వెబ్సైట్ ఇందుకోసం ఆన్ లైన్ శిక్షణ కూడా ఇస్తోంది. చాలా మంది మహిళలు , పురుషులు  ఈ కౌగిలింతల ప్రక్రియలో శిక్షణ పొంది  అవసరమైన వారికి కౌగిలింతల సేవలు ఇస్తూ తద్వారా ఆర్ధికంగా లాభం పొందుతున్నారు.  అమెరికా  చెందిన జనెత్‌ ట్రెవీనో (37) కౌగిలింతల  వ్యాపారం  చేస్తోంది .   40 నుంచి 70 ఏళ్ల పురుషులను గంటకు 80 డాలర్లు (దాదాపు రూ.5,500) ఫీజు తీసుకొని కౌగిలించుకుంటుంది. ఇలా కౌగిలించుకుంటూ వారానికి 1600 డాలర్లు (దాదాపు 10,9000) సంపాదిస్తోంది. జెనెత్‌ భర్త కార్లోస్‌ కూడా ఇందుకు పూర్తిగా సహకరిస్తున్నాడట  ‘‘ప్రజలకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించడం అవసరం. వారిని హృదయానికి దగ్గరగా తీసుకొని వారిలో నమ్మకాన్ని పెంచేలా చేస్తే వారిలో మంచి మార్పులు వస్తాయి. అందుకే నేను కౌగిలింత సేవలను అందిస్తున్నాను. మొదట్లో పార్ట్‌ టైంగా ప్రారంభించిన ఈ కౌగిలింతల వ్యాపారానికి డిమాండ్‌ పెరగడంతో దానిని ఫుల్‌ టైంగా మార్చుకున్నాను.'  అంటోంది  జనెత్‌ ట్రెవీనో . ఇదే తరహాలో కొంతమంది మగాళ్లు కూడా ఈ వ్యాపారం చేస్తున్నారు. ఒంటరి మహిళలు వీరి సేవలను  ఉపయోగించుకుంటున్నారు .  కాగా కొందరు  ఉచితంగా కూడా ఈ సేవలు అందిస్తున్నారు.   ఇక "కడ్డలిస్ట్ .కామ్ "  ఓనర్  ఆడమ్ లిపిన్  మాట్లాడుతూ   ఈ కౌగిలింతల ప్రక్రియ లో సెక్స్ కి  తావు  లేదంటున్నారు . వారానికి రెండువందల  రిక్వెస్ట్లు  అందుతున్నాయని చెప్పుకొచ్చారు.  రెండు గంటల పాటు సాగే ఈ సెషన్  160 డాలర్లు మాత్రమే నట.  ఇప్పటి వరకు  విదేశాలకు మాత్రమే పరిమితమైన  ఈ  వ్యాపారం  ఇండియాకు  కూడా వస్తుందేమో !! చూడాలి మరి. 
  • *కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశపెడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతం రైతులకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు  చెప్పారు . అంతేకాదు, మూలధన పన్ను లాభాల నుంచి కూడా మినహాయింపు ఇచ్చారు. కాగా, ల్యాండ్‌ పూలింగ్‌లో ఉన్నవారికి మాత్రమే పన్ను రద్దు వర్తిస్తుందని పేర్కొన్నారు.  ఈ మినహాయింపులు రాష్ట్రం ఏర్పడిన తేదీ అంటే 2014, జూన్‌ 2 తర్వాతి నుంచి చోటుచేసుకున్న క్రయవిక్రయాలన్నింటికీ వర్తిస్తుందని జైట్లీ పేర్కొన్నారు. *నిజాయతీపరులపై భారం తగ్గించేందుకు పన్ను భారాన్ని తగ్గిస్తున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య ఆదాయం గల వ్యక్తులకు ప్రస్తుతం ఉన్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఇది సామాన్యుడికి గొప్ప ఊరట అని విశ్లేషకులు చెప్తున్నారు. అత్యధిక సంపన్నులకు 15 శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇతర కేటగిరీల అసెసీలకు పన్నులో రూ.12,500 రిబేటు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో రూ.3 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయం ఉన్నవారిపై పన్ను భారం పడదు. * రాజకీయ పార్టీలు స్వీకరించే విరాళాలపై పరిమితులు విధించారు. పార్టీలు కేవలం 2000 రూపాయల వరకు మాత్రమే నగదు రూపేణా విరాళాలు స్వీకరించడానికి వీలుంటుందని జైట్లీ చెప్పారు. అంతకు మించి మొత్తాలను  ఖచ్చితంగా చెక్కులు లేదా ఆన్‌లైన్ లేదా డిజిటల్ రూపంలో మాత్రమే తీసుకోవాలని, దాతల పేర్లు కూడా వెల్లడించి తీరాలన్నారు. ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్స్‌ ఖచ్చితంగా దాఖలు చేయాలని స్పష్టం చేశారు. దీంతో రాజకీయ పార్టీలకు వచ్చే అజ్ఞాత విరాళాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎన్నికల వ్యయం కూడా తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. గతంలో ఇది రూ. 20వేల వరకు ఉండేది. ... చారిటబుల్ ట్రస్టులకు ధన రూపేణా అందించే విరాళం కూడా రూ. 2వేలకు మించరాదని అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
  • ఏటా వార్షిక  బడ్జెట్ ను ప్రవేశపెట్టడం  157 ఏళ్ళ నుంచి ఒక  సాంప్రదాయంగా  వస్తోంది .  జేమ్స్ విల్సన్ తొలిసారి భారత్ బడ్జెట్ను 1860 ఏప్రిల్లో ప్రవేశపెట్టారు. అప్పుడు విల్సన్ ఇండియన్ కౌన్సిల్కు ఆర్థికమంత్రిగా పనిచేసేవారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన కొన్నిరోజులకే ఆయన కన్నుమూశారు.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దరిమిలా  ఆర్కే షణ్ముఖం శెట్టి మొట్టమొదటి బడ్జెట్ను సభలో ప్రవేశ పెట్టారు.  1947 నవంబర్లో ఆయన  దేశ  తొలి ఆర్థికమంత్రి. 1947 ఆగస్టు 15 నుంచి 1948 మార్చి 31 వరకు సరిపడేలా బడ్జెట్ పెట్టారు . ఆ తర్వాత మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇక అత్యధికంగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఖ్యాతి మురార్జీ దేశాయి దే . ఆర్థికమంత్రి నుంచి ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మోరార్జీ దేశాయ్ ఎక్కువ సార్లు బడ్జెట్ను పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. గరిష్టంగా 10 సార్లు ఆయన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 1964, 1968 సంవత్సరాల్లో రెండుసార్లు ఆయన బర్త్డే రోజే బడ్జెట్ను తీసుకురావడం విశేషం. ఫిబ్రవరి 29న మోరార్జీ దేశాయ్ బర్త్డే అన్న సంగతి తెలిసిందే. కాగా  అసలు బడ్జెట్ ప్రసంగం చేయని ఆర్ధిక మంత్రిగా చరిత్రకెక్కిన వారు జాన్ మతాయి.. షణ్ముఖం శెట్టి  తర్వాత  1949-50లో జాన్ మతాయి ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత సాదాసీదా బడ్జెట్గా పేరుగాంచింది. బడ్జెట్ను చదవకూడదని నిర్ణయించిన ఆయన, అన్ని వివరాలను వైట్ పేపర్లలో పంపిణీ  చేయించారు. ఇక  8 రెగ్యులర్ బడ్జెట్ల ను ప్రవేశ పెట్టిన  క్రెడిట్  చిదంబరం దే అవుతుంది.  
  • హమ్మయ్య.. పెద్ద నోట్ల రద్దు తర్వాత  ఇంత కాలానికి  భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) ప్రజల నగదు కష్టాలకు పుల్‌స్టాప్ పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కరెంట్, క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాదారులకు ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలపై ఉన్న ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. సేవింగ్స్ ఖాతాలపై ఉన్న ఆంక్షలు మాత్రం మరికొన్ని రోజులు కొనసాగుతాయని ఆర్బీఐ ప్రకటించింది. తాజా నిర్ణయం బుధవారం ( ఫిబ్రవరి 1 )నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఏటీ ఏంలు , బ్యాంకుల నుండి నగదు విత్‌డ్రాయల్ పరిమితిపై ఆంక్షలను పాక్షికంగా సడలించారు.... సేవింగ్స్ ఖాతాలపై ఉన్న వారానికి 24 వేల రూపాయల పరిమితిపై ఎలాంటి మార్పు చేయకుండా ఒక రోజుకి ఇంత మాత్రమే అని ఉన్నపరిమితిని పూర్తిగా ఎత్తి వేశారు. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను ఇటీవల ఎత్తివేసిన ఆర్బీఐ ఏటీఎం నుంచి రోజుకు రూ.10 వేలు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే వారానికి మాత్రం రూ.24 వేలకు పరిమితం చేసింది. కరెంట్ అకౌంట్ వినియోగదారులు మాత్రం రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. సేవింగ్స్ ఖాతాలపై పరిమితులు కూడా పూర్తిగా ఎత్తి వేస్తె బాగుండేదని అభిప్రాయం వ్యక్తమౌతోంది.   
  • మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల‌లో డ‌బ్బులు వేసుకోమ‌ని ఎవ‌రైనా అడుగుతున్నారా? అయితే జాగ్ర‌త్త‌గా ఉండండి. క‌నీసం రెండుల‌క్ష‌లు లేని ఖాతాల‌పై ప్ర‌స్తుతం ఆదాయ ప‌న్ను శాఖ క‌న్నేసింది. ఇలాంటి ఖాతాల‌లో అధిక‌మొత్తంలో న‌గ‌దు జ‌మ‌యితే ఇబ్బందులే. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఖాతాల‌ను చాలా సునిశితంగా ప‌రిశీలిస్తోంది. ఏ ఖాతాలోనైనా ఒకేసారి ఎక్కువ మొత్తం జ‌మ‌యితే వెంట‌నే ఆ విష‌యాన్ని ఆదాయ‌ప‌న్ను శాఖ దృష్టికి తీసుకెడుతుంది. అనుమానిత లావాదేవీల కింద ప‌రిగ‌ణించి వీటిపై ద‌ర్యాప్తు చేప‌డ‌తారు. న‌ల్ల ధ‌న వ్య‌తిరేక కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వం చేప‌ట్ట‌నున్న త‌దుప‌రి చ‌ర్య ఇదే. అనుమానిత ఖాతాల‌పై స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ‌కు అందించి, బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ దుర్వినియోగం కాకుండా చూడాల‌ని ఆర్బీఐ బ్యాంకుల‌కు సూచించింది. పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం నేప‌థ్యంలో న‌ల్ల ధ‌నానికి బ్యాంకుల‌కు స్థావ‌రం కాకూడ‌ద‌ని అభిప్రాయ‌ప‌డింది. తాజా అడుగు విచార‌ణ మార్గాల‌ను త‌గ్గించింది. రెండున్న‌ర ల‌క్ష‌లు అంత‌కు మించి జ‌మ‌చేసే ఖాతాల స‌మాచారం మాత్ర‌మే ఆర్థిక నిఘా విభాగానికి అందించాల‌నేది ఇంత‌వ‌ర‌కూ ఉన్న ఆదేశాలు. ఉన్న‌ట్టుండి పెద్ద మొత్తంలో ధ‌నం జ‌మ‌యిన ఖాతాల వివ‌రాలు ఇవ్వాల‌ని ప్ర‌త్యేకంగా కొన్ని బ్యాంకు శాఖ‌ల‌కు ఇంటెలిజెన్స్ రెగ్యులేట‌ర్ లేఖ‌లు రాశారు. వినియోగంలో లేని, బినామీ ఖాతాల‌లో పెద్ద మొత్తంలో న‌గ‌దు జ‌మ‌వుతుంద‌నేది కేంద్రం అనుమానం. 15 కోట్ల 40 ల‌క్ష‌ల కోట్ల మేర ఉన్న 500, వెయ్యి రూపాయ‌ల నోట్ల‌కు ఇంత‌వ‌ర‌కూ 80శాతం అంటే 12కోట్ల 44ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే బ్యాంకుల‌లో జ‌మ‌య్యాయి.  vedeo courtesy.... nyusu digital media