Latest News
ఆరోగ్యం ఆహారం
  • పులస పేరు వినగానే ఎవరికైనా నోరూరుతుంది. ఆ పులస చేపలు  ప్రపంచంల్లో ఎక్కడా లేని విధంగా గోదావరి ఆనకట్ట దిగున ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. గోదావరిలో ఎర్ర నీరు ఉన్నడు మాత్రమే లభించే ఈ పలసల్ని వేటాడేందుకు మత్స్యకారులు పడే శ్రమ అంతాఇంతా కాదు. దూర ప్రాంతాలలోను, దేశవిదేశాల్లో ఉంటున్న బంధుమిత్రులకు, ఈ పులసకూరలోని  రుచి చూపించి అనంద పడుతుంటారు.  పులస శాస్త్రీయ నామం హిల్సా.  సముద్రంలో ఉన్నప్పుడు దీనిని ఇలస (విలస) అంటారు. గోదావరి ఎర్రనీరుకు ఎదురీదుతూ వచ్చినప్పుడు పులసగా మారుతుంది. దీని జన్మస్థానం గోదావరే. ఇక్కడ పుట్టిన పులస పిల్లలు ఆహారం కోసం బంగాళాఖాతంలోకి చేరి సముద్రంలోనే జీవిస్తాయి. బంగాళాఖాతం నుంచి హిందూ మహా సముద్రంలోకి చేరిన విలస ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ టాంజినాయా వంటి ప్రాంతాల్లో నివసిస్తుంది. వర్షాల సీజన్‌లో సంతానోత్పత్తి కోసం తిరిగి బంగాళాఖాతంలోకి వస్తుంది. నదీ, సముద్ర సంగమ ప్రాంతాల్లో సంతానోత్పత్తి కోసం ఎక్కువగా సంచరిస్తాయి. గోదావరికి వరద తాకగానే ఎర్రనీరుకు పులస ఎదురీదుతుంది. అలా ఎదురీదుతూ వచ్చే విలస... పులసగా మారుతోంది.   పశ్చిమగోదావరిజిల్లా నరసాపురం నుండి విశ్లేశ్వరం వరకు సంప్రదాయ వేట బొట్లు  తెల్లవారుజాము నుండి సందడి చేస్తుంటాయి. ఆ సందడుల్లో గాలిలో విచ్చుకుంటున్న వల కళ్ళు మూసి తెరిచేలోపే నీటిలోకి సర్రున దూసుకెళ్లి.. జలపుష్పాలల్లో రాజైన పులసల్ని బంధిస్తూ..మనకు చక్కటి పులసల్ని అందిస్తాయి.…అంతేకాక పులస పై సామెతలు కూడా బాగా వాడుకలో ఉన్నాయి.. పుస్తెలైనా అమ్మి పులసకూర తినాలన్న సామెత ఒకటి బాగా  ప్రాచుర్యంలో  ఉండటాన్ని గమనిస్తే..పులస కూర పై మనకున్న ఎనలేని అభిమానమనే చెప్పాలి.  ఇతర చేపల మాదిరిగా పులసకూర వండడం అంత సులువు కాదు..దీన్ని ప్రత్యేకమైన పొయ్యిలపై… వెన్న రాసిన మట్టి  కుండలో వండటం ఓ ప్రత్యేకత..ఇలా వండటం  వల్ల పులస ముక్కలో ఉన్న ముళ్లు కరిగి పోతాయి. తద్వారా పులస ముక్కను ఇట్టే తినేయచ్చు.. అయితే ఈ పులస కూరను ఈ రోజు వండి తిన్నదాని కంటే మరుసటి రోజు తింటే..చాలా రుచిగా ఉంటుంది.  అయితే..  దీనికి ఇంత రుచి ఉండటానికి కారణం…ఇలసగా పిలవబడే ఓ రకమైన చేప సముద్రంలో పెరుగుతుంది. ఈ చేప జూన్ మాసంలో కురిసే వర్షాల వల్ల.. గోదావరిలోకి ఎర్రనీరు చేరగానే..ఈ ఇలస.. గుడ్లు పెట్టడానికి ఉప్పనీటిలోంచి గోదావరి చప్పనీటికి ఎదురు ఈదుకుంటూ వచ్చే సందర్భంలో ఇలస శరీరంలో మార్పులు చోటుచేసుకొని..పులసగా మారుతుంది.. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, చించినాడ, సిద్ధాంతం, విశ్లేశ్వరం , తూర్పుగోదావరిజిల్లాలోని అంతర్వేది, రావులపాలెం ధవళేశ్వరం ప్రాంతాలలో మాత్రమే పులసల అమ్మకాలు ఎక్కువగా సాగుతాయి. ఈ  పులసలు సైజును బట్టి ఒక్కో చేప ధర రెండు వేల నుండి ఆరు వేలరూపాయల వరకు పలుకుతుంటాయి.  అయితే సముద్ర జలాల్లో కాలుష్యం పెరుగుతున్న కారణంగా  పులస చేపలు గతం లో మాదిరిగా దొరకడం లేదు. భవిష్యత్తులో పులస మరీ అరుదుగా దొరికే చేప గా మారే ప్రమాదం ఉంది. ...
  • నీటి వినియోగం శరీరానికి చాలామంచిది . అయితే  నీరు అసలు ఏసమయం లో ఎక్కువ తాగాలి ? ఎప్పుడు తాగకూడడో తెలుసుకోవాలి.  కొన్ని అధ్యయనాల ప్రకారం  మంచినీళ్లను ఖాళీ క‌డుపుతో ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా తాగాల‌ట‌. అయితే.. ఖాళీ క‌డుపు ఎప్పుడుంటుంది? అంటే ఉదయాన్నే నిద్ర లేచినపుడు  క‌డుపు ఖాళీ గా ఉంటుంది. అప్పుడు ఎక్కువ‌గా నీళ్లు తాగ‌డం వ‌ల్ల అనేక ఫ‌లితాలు ఉంటాయట‌. క‌డుపు ఖాళీగా ఉన్న‌ప్పుడు జీర్ణాశ‌యానికి రెస్ట్ దొరుకుతుంది. ఆ స‌మ‌యంలో జీర్ణాశ‌యంలో ఎటువంటి ర‌సాలు విడుద‌ల కావు. ఆ స‌మ‌యంలో నీళ్లు ఎక్కువ మోతాదులో తాగ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం మొత్తం శుభ్ర‌మ‌వ‌డ‌మే కాకుండా... ఆ నీళ్లు పేగుల‌ను కూడా క్లీన్ చేస్తాయ‌ట‌.  శరీర మెటబాలిక్ రేటు 24 శాతం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చయ్యే రేటు పెరుగుతుంది. తద్వారా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.  శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.   జీర్ణ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం బాధించవు. ప్రధానంగా మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. విరేచనం సులభంగా అవుతుంది. ఆకలి పెరుగుతుంది. తలనొప్పి సమస్య నుంచి బయట పడవచ్చు.  ఇంకా  శరీరానికి అందే శక్తి పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు పెరిగి ఎక్కువ ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. కనుక శరీరానికి ఎక్కువగా శక్తి అందుతుంది.  చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి.  జీర్ణాశయం, పేగుల్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. మంచి బాక్టీరియా పెరుగుతుంది. అందుకే  పెద్దలు నిద్ర లేవగానే మంచి నీళ్లు తాగమంటారు.  ఇక‌... చాలా మంది అన్నం తినేట‌ప్పుడు, తినే ముందు కూడా నీళ్లు తాగుతారు. అయితే... ఏదైనా ఆహారం తీసుకోవ‌డానికి ఒక అర్ధ‌గంట‌ ముందు నీళ్లు అస్స‌లు తాగ‌కూడ‌ద‌ట‌. ఎందుకంటే ఆక‌లేసే స‌మ‌యంలో జీర్ణాశ‌యంలో జ‌ఠ‌ర‌ర‌సాలు విడుదల  అవుతాయి. అప్పుడు నీళ్లు తాగితే ఆ ర‌సాలు నీళ్ల‌తో క‌లిసి పోతాయి. దాంతో  అల్స‌ర్, గ్యాస్ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అందుకే.. అన్నం తిన‌డానికి అర్ధ‌గంట ముందు, అర్ధ‌గంట త‌ర్వాత, తినేట‌ప్పుడు కూడా నీళ్లు తాగ‌కూడ‌దంటారు పెద్ద‌లు....
  • ఇంతవరకు మనం సోలార్‌ లైట్లు, సోలార్‌ పంపుసెట్లు, సోలార్‌ వాహనాల గురించే విన్నాం. ఇపుడు    కొత్తగా  సోలార్‌ చికెన్‌ వెలుగులోకి వచ్చింది. థాయిలాండ్‌ లో సోలార్ పాపులర్ ఫుడ్ ఐటెం గా మారుతోంది .   ఎవరైనా చికెన్‌ను అగ్గి మీద కాలుస్తారు లేదా స్టవ్‌ మీద రెడీ చేస్తారు కానీ థాయిలాండ్‌లోని సిలా సుతారట్‌ అనే దుకాణాదారుడు మాత్రం  ఓవెన్‌ లేదా చార్‌కోల్‌ బార్బెక్యూ వాడేందుకు బదులుగా 1000 మొబైల్‌ మిర్రర్లను ఉపయోగించి  సూర్యుని నుంచి వచ్చే బలమైన కాంతిని ఆ అద్దాలపై పడేలా చేసి తద్వారా వచ్చే వేడితో చికెన్‌ను తయారు చేస్తున్నాడు. ఒకటిన్నర కేజీ  చికెన్‌ను 10–15 నిమిషాల్లో వండేస్తున్నాడు.  ఆ వేడిని తట్టుకునేందుకు ముఖానికి వెల్డింగ్‌ మాస్క్‌ను ధరిస్తాడు. మెల్లగా మెల్లగా ఇతగాడి బిజినెస్ పుంజుకుంటోంది. ...
  • రాగులు తినండి …...వయసు తగ్గించుకోండి..రాగాలు తీయండి రుచులు మార్చుకున్నారు..డాలర్ల రేటు విపరీతంగా పెరిగింది అభిరుచులు మార్చుకున్నారు.అనారోగ్యానికి దగ్గరయ్యారు ఆఫీసులో కావచ్చు…వ్యాపార సంస్థల్లో కావచ్చు….లేదా టీవీ ముందు కావచ్చు. రోజుకు 14 గంటలపాటు కూర్చుని లేదా పడుకుని ఉంటున్నారు చాలామంది. అలాంటివారు గుండె జబ్బులు, ఇతర వ్యాధుల బారిన కూడా పడతారు. రాగులను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు. మిల్లెట్ అనే  యాంటీ ఆక్సిడెంట్లు  రాగుల్లోపుష్కలంగా ఉంటాయి. అందువల్ల యాంటీ  ఏజింగ్ కు చెక్ పెడుతుంది. వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు. రాగుల్లో అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇంకా రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలకర్ధకమైన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది.  రాగిపిండితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.  జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల బాగుంటుంది.నడి వయసు మహిళ్లో ఎముకల పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్ ను తాగడం మంచిది. సాధారణంగా రాగులతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని నేచురల్ గానే సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఆందోళన,వ్యాకులత,నిద్రలేమి పరిస్థితులను దూరంచేస్తుంది. రాగి మైగ్రేన్  సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. మధుమేహవ్యాధికి రాగులతో చేసిన ఆహారపదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది.  రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగి మాల్టును తాగడం మంచిది.  పాశం జగన్నాధం ...
  • టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి విన్నాం..కానీ టెస్ట్ ట్యూబ్ చికెన్ ఏంటీ అనుకుంటున్నారా ?  మీరు చదివింది నిజమే.త్వరలో టెస్ట్ ట్యూబ్ చికెన్ .. ఫుడ్ మెనూలోకి చేరబోతోంది. పరిశోధకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. చికెన్ రెసిపీ నుంచి కణాలు తయారుచేసి టెస్ట్ ట్యూబ్ చికెన్ తయారుచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టెల్ అవివ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అమిత్ గెఫెన్ ఇప్పటికే లాబొరేటరీలో చికెన్ కణాలతో ఈ ప్రయోగం చేస్తున్నాడు. మోడ్రన్ అగ్రికల్చర్ ద్వారా ఈ చికెన్ సెల్స్‌తో దీన్ని తయారుచేసేందు కూడా ప్లాన్ చేస్తున్నారట. రాబోయే నాలుగు సంవత్సరాలలో ఈ తరహా చికెన్ సూపర్ మార్కెట్లలోకి వస్తుంది. మొత్తం మీద లెక్కకు మించి జనాభా  పెరిగిపోతున్ననేపథ్యంలో  నాన్ వెజ్  రుచుల అవసరాలు తీర్చాలంటే ఇక  టెస్ట్ ట్యూబ్  ఫుడ్డే దిక్కు. టెస్ట్  ట్యూబ్ హాంబర్గర్స్  వరల్డ్ మార్కెట్లో ఆదరణ పొందిన క్రమంలో చికెన్ కు కూడా ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.  ఒకసారి  టెస్ట్ ట్యూబ్ చికెన్ మార్కెట్లోకి  వచ్చిందంటే పౌల్ర్టీల దగ్గర,  చికెన్ షాపుల దగ్గర వెయిట్ చేసే  అవసరం ఉండబోదు. ...
  • అసలు కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుండి మీ శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా?  మీ శరీరానికి ఎలాంటి హాని తలబెడుతుందో తెలుసా?  *కూల్ డ్రింక్ తా గిన 10 ని మిషాలకు: * కూల్ డ్రింక్ లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చెక్కర తింటే వాంతులు అవుతాయి. కాని కూల్ డ్రింక్ లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది.  *కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాలకు: * కూల్ డ్రింక్ లో ఉన్న షుగర్ ను మన లివర్ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వు గా మారి బరువు పెరుగుతారు.  *కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాలకు: * రక్తంలోకి షుగర్ ను పంపియడం కొనసాగుతుంది. కూల్డ్రింక్ లో ఉండే కెఫిన్ మెల్లమెల్లగా మీ శరీరంలో నిండుతుంది. దీనితో మీ రక్త పోటు పెరిగి, మీ కంటి పాపలు చిన్నగవుతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువ హాని చేయదు, అలా అని ఎక్కువ మోతాదులో దీనిని సేవించినా ప్రమాదమే. అందుకే చిన్న పిల్లలను కూల్ డ్రింకులకు ఎంత దూరం పెడితే అంత మంచిది.  *కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు: * ఇప్పుడు మీ శరీరం డోపమైన్ అనే ఓ కెమికల్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టే. *కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలకు: * గంట తరువాత, మీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. కూల్ డ్రింక్ లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ మీ చిన్న పేగులలో చేరడంతో, అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డు కట్ట వేస్తుంది. దీనితో తరచుగా మూత్రవిసర్జన జరడంతోపాటు, డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి. మన శరీరానికి ఇంతలా హాని తలబెట్టే కూల్ డ్రింక్ తాగడం మనకు మన పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు దీనికి దూరంగా ఉండడమే మంచిది.  whats app message ...
  • అధిక రక్తపోటుతో బాధపడే రోగుల సంఖ్య ప్రపంచంలో నానాటికీ పెరుగుతోంది. గడచిన 40 ఏళ్లలో హైబీపీ రోగుల సంఖ్య దాదాపు రెట్టింపైందని తేలింది.  ‘ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్’ శాస్తవేత్తల  నేతృత్వంలో ఓ అధ్యయనం  ఈ విషయం వెల్లడైంది. 1975-2015 మధ్య వివిధ దేశాలలో రక్తపోటు అంశంలో మార్పులపై ఈ అధ్యయనం  జరిగింది. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడి అయ్యాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ, వివిధ దేశాలకు చెందిన వందలాదిమంది శాస్తవేత్తలు  కలసి దాదాపు 2 కోట్లమంది నుంచి రక్తపోటుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఈ పరిశోధనలో కనుగొన్న విషయాలను ప్రఖ్యాత జర్నల్ ‘ద లాన్ సెట్’లో పబ్లిష్ చేశారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా హై బీపీ తో బాధపడుతున్న వారి  సంఖ్య 113 కోట్లు. ఇక ఇండియా లో వీరి సంఖ్య 20 కోట్లు అని తేల్చారు.  ఈ స్టడీ  ప్రకారం అత్యధిక ఆదాయం ఉన్న దేశాల్లో రక్తపోటు కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. అతితక్కువ, మధ్యతరహా ఆదాయం ఉన్న దేశాల్లో అధిక రక్తపోటు కేసులు  పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల్లో వీటి నమోదు ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తేల్చింది. 2015 సంవత్సరానికి సంబంధించినంతవరకూ యునైటెడ్ కింగ్‌డమ్‌లో అతి తక్కువ హై బీపీ  రోగులున్నట్లు తేలింది.  ప్రపంచంలో అతి తక్కువ స్థాయిలో అధిక రక్తపోటు బాధితులు నమోదైన దేశాల్లో దక్షిణ కొరియా, యుఎస్‌ఎ, కెనడా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. 1975లో సంపన్నులనే అధిక రక్తపోటు ఎక్కువగా వేధించేది.  ఇప్పుడు పూర్తిగా విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన సీనియర్ ప్రొఫెసర్ మజిద్‌ఎజ్జతి అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఈ సమస్య పేదవారిలోనే ఎక్కువగా కనిపిస్తోందట.  ఈ పరిణామానికి అసలు కారణం తెలియకపోయినా పండ్లు, కూరగాయల వినియోగం పెరగడం వల్ల, అవి కొనే శక్తి సంపన్నులకు ఉండటం మూలానా అధిక రక్తపోటు ముప్పు వారికి తప్పుతోంది.  పేదలకు పౌష్టికాహారం లోపించడం వల్ల  బీపీ సమస్యగా మారింది.  అధిక రక్తపోటు రావడానికి కారణమైన ఊబకాయం సమస్యను ఎదుర్కొనే విషయంలో సంపన్న దేశాలు ముందున్నాయి.   మహిళల్లో కన్నా పురుషుల్లోనే అధిక రక్తపోటు సమస్య ఎక్కువగా అత్యధిక దేశాల్లో ఉన్నట్లు ఈ పరిశోధనల్లో తేలింది. 2015లో ప్రపంచవ్యాప్తంగా 52.9 కోట్లమంది మంది మహిళలు అధిక రక్తపోటుతో బాధపడితే , హైబీపీ బారిన పడ్డ  పురుషుల సంఖ్య 59.7 కోట్లు. హైబీపీ రోగుల్లోని పెద్దవారిలో సగానికి సగం మంది ఒక్క ఆసియాలోనే ఉన్నారని తేలింది. వీరిలో 22.6 కోట్ల మంది చైనాలోను, 20 కోట్లమంది భారత్‌లోనూ ఉన్నారు. అధిక రక్తపోటువల్ల గుండె, మెదడు, మూత్రపిండాల్లోని రక్తకణాలు, నాళాలపై ఒత్తిడి పెరుగుతుందని, గుండెపోటు, పక్షవాతం రావడానికి ప్రధాన కారణం ఇదేనని పరిశోధన తేల్చింది. ఏటా రక్తపోటు కారణంగా ఇలా చనిపోతున్న వారి సంఖ్య 75 లక్షలు. మగవారిలో అధిక రక్తపోటుతో బాధపడేవారు క్రొయేషియాలో అధికంగా (దేశ జనాభాలో 38 శాతం), మహిళల్లో నైజిరియా (36శాతం) తొలిస్థానాల్లో ఉన్నాయి. 1975 నాటి రక్తపోటు గణనకు సంబంధించిన పరికరాల్లో లోపాలు, సబ్‌సహారా, కరేబియన్ దేశాల్లో సమాచార సేకరణలో ఉన్న అవాంతరాల దృష్ట్యా ఈ అధ్యయనానికి కొన్ని పరిమితులున్నాయని శాస్తవ్రేత్తల బృందం పేర్కొంది. వెల్‌కమ్ ట్రస్ట్ నిధులతో ఈ అధ్యయనం నిర్వహించారు. కాబట్టి హై బీపీ ఉన్న వారు  వెంటనే నివారణ చర్యలు  చేపట్టడం మంచిది....
  • ☘ మునక్కాయలు నిత్యం మనం తినే ఆహారమే.  అయితే మునక్కాయలే కాకుండా ఆకులోనూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.  అసలు 4, 5వేల ఏళ్ల నుంచే మన పూర్వీకులు మునగాకును మెడిసిన్ తయారీలో వినియోగిస్తున్నారంటే ఆ ఆకు గొప్పతనం ఇట్టే అర్థమవుతుంది. ☘ ఆయుర్వేదంలో 300లకుపైగా వ్యాధులను నయం చేయడానికి ఈ మునగాకును ఉపయోగిస్తారు. అందుకే దీనిని సాంప్రదాయకైన మందుగానూ చెబుతుంటారు మన పెద్దలు. ☘ మునగాకులో ఉన్న అద్భుతమైన అద్భుతమైన ఔషద గుణాలు. ☘ మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ☘ క్యారెట్లు తింటే మాత్రమే వచ్చే విటమిన్ Aని పదిరెట్లు అధికంగా మునగాకు ద్వారా పొందొచ్చు. ☘ కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ లో మునగాకును వాడతారు. ☘ పాల నుంచి లభించే క్యాల్షియం 17రెట్లు అధికంగా మునగాకు నుంచి వస్తుంది. ☘ పెరుగు నుంచి పొందే ప్రోటీన్లను 8రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. ☘ అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు. ☘ మహిళలు రోజుకి 7గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే 13.5శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది. ☘ ఐదు రకాల క్యాన్సర్లకు అద్భుత ఔషదం మునగాకు. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని తాజా పరిశోధనల్లో  తేలింది. ☘ యాంటీ ట్యూమర్ గానూ ఆకు వ్యవహరిస్తుంది. ☘ థైరాయిడ్ ను రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునగాకు. ☘ మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుందట. ☘ అద్భుతమైన ఔషద సంజీవని మన మునగాకు ☘ ☘ మునగాకులో ఎ, సి విటమిన్లు పుష్కలంగా వున్నాయి. ☘ మనం డబ్బులిచ్చి కొనే ఏ ఆకుకూరల్లోనూ మునగాకు స్థాయిలో ఈ విటమిన్లు వుండవు. ☘ అలాగే కాల్షియం, పాస్పరస్, ఐరన్ కూడా మునగాకులో పుష్కలంగా వుంటాయి. ☘ వందగ్రాముల మునగాకులో వుండే పోషక పదార్థాలను ఒక్కసారి పరిశీలిద్దాం ☘ ☘ నీరు – 75.9 శాతం. ☘ పిండి పదార్థాలు – 13.4 గ్రాములు. ☘ ఫ్యాట్స్ – 17 గ్రాములు. ☘ మాంసకృత్తులు – 6.7 గ్రాములు ☘ కాల్షియం – 440 మిల్లీ గ్రాములు. ☘ పాస్పరస్ – 70 మిల్లీ గ్రాములు. ☘ ఐరన్ – 7 మిల్లీ గ్రాములు. ☘ ‘సి’ విటమిన్ – 200 మిల్లీ గ్రాములు. ☘ ఖనిజ లవణాలు – 2.3 శాతం. ☘ పీచు పదార్థం – 0.9 మిల్లీ గ్రాములు. ☘ ఎనర్జీ – 97 కేలరీలు. ☘ ఔషధ విలువలు అద్భుతం ☘ ☘ ప్రారంభ దశలో వున్న కీళ్ళ నొప్పులకు మునగాకు దివ్య ఔషధం. మునగాకును నూరి కట్టుకడితే తగ్గిపోతాయి. ☘ మునగాకును నూరి లేపనంగా రాయడం, కట్టు కట్టడం ద్వారా చర్మరోగాలు, వ్రణాలు నివారణ అవుతాయి. ☘ మునగాకు రసాన్ని సేవించడం ద్వారా దృష్టి మాంద్యము, రేచీకటి తొలగిపోతాయి. ☘ మునగ ఆకులలో అమినో ఆమ్లాలు వుంటాయి. అందువల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. గర్భిణులకు, బాలింతలకు మునగాకు రసం అమృతంతో సమానం. ☘ మునగాకు రసాన్ని దోసకాయ రసంతో కలిసి ప్రతిరోజూ సేవిస్తే గుండె, కాలయం, మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. ☘ మునగ రసం రక్తహీనతను నివారిస్తుంది. ☘ మునగాకుతో మరికొన్ని ఉపయోగాలు ☘ ☘ మునగాకుల రసాన్ని పాలలో కలసి పిల్లలకు అందిస్తే వారి ఎముకలు బలంగా తయారవుతాయి. గర్భిణులు, బాలింతలకు ఇస్తే వారికి అవసరం అయిన కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా వుంటారు. ☘ పాలిచ్చే తల్లులకు మునగాకును కూరగా వండి పెడితే పాలు పెరుగుతాయి. ☘ గుప్పెడు మునగాకులను వంద మిల్లీలీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్థమా, టీబీ, దగ్గు తగ్గుతాయి. ☘ మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్ళలో కలిపి, కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి. ☘ మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయి. ముఖ్యంగా కాల్షియం లోపాన్ని ఎదుర్కొనే మహిళలకు మునగాకు వరప్రదాయిని. అలాంటివారు విరివిగా మునగాకును ఏదో ఒక రూపంగా ఉపయోగిస్తూ వుంటే వారిలోని కాల్షియం పెరుగుతుంది. ----- P.V.Lakshmi ...
  • చాలా చాలా తెల్లగా, జరజరా జారిపోయే అయొడైజ్డ్ ఉప్పు... అసలు ఉప్పే కాదు. సాధారణ ఉప్పు లేత గోధుమరంగులో వుంటుంది. కొంచెం తేమ కూడా కలిగివుంటుంది. అందులో 84 మినరల్స్ వుంటాయి. ఈ మినరల్స్ అన్నీ మన శరీరానికి చాలా అవసరం. మనం వాడుతున్న రిఫైన్డ్ ఉప్పులో రెండే మినరల్స్ వుంటాయి. సోడియం, క్లోరైడ్ లు రెండు మాత్రమే. మిగతావన్నీ మాయం అయిపోతాయి. ఆ కారణంగా అయొడైజ్డ్ ఉప్పు ఎంత తిన్నా శరీరానికి కావాల్సిన ఖనిజాలు అందవు. దాంతో శరీరం మరింత ఉప్పును కోరుకుంటుంది. మనం మరింత ఖనిజరహిత ఉప్పు తింటాం. ఆ విధంగా మనం అవసరమైనదానికంటే అధిక ఉప్పు తీసుకుంటుంటాం. ఫలితంగా కిడ్నీలలో ఫిల్టరింగ్ మెకానిజమ్ దెబ్బతింటుంది. ఉప్పు తగ్గించాలని, మానేయాలని డాక్టర్ చిట్టీ రాస్తాడు.  అదే మనం అన్ని ఖనిజాలు వున్న ఉప్పు తింటే.. ఇంకా ఇంకా ఉప్పును శరీరం కోరుకోదు. మనం తిన్న సాధారణ ఉప్పునుంచి శరీరం తనకు కావాల్సిన ఖనిజాలను, కావాల్సినంత తీసుకొని, తనకు అక్కర్లేని వాటిని బయటికి పంపిస్తుంది. సాధారణ ఉప్పులో వుండే మినరల్స్ జాబితా ఇదిగోండి. జాగ్రత్తగా గమనించండి. అందులో (గ్రూప్-3 లో) అయొడిన్ కూడా వుంది. అందులో బంగారం కూడా వుంది. సహజసిద్ధంగా వుండే అయొడిన్ ను తొలగించి, కృత్రిమంగా కలపడం ఎందుకు? Group 1 Sodium & chlorine (NaCl = Sodium Chloride) Group 2 Sulfur, magnesium, calcium & potassium Group 3 Carbon, bromine, silicon, nitrogen, ammonium, fluorine, phosphorus, iodine, boron, lithium Group 4 Argon, rubidium, copper, barium, helium, indium, molybdenum, nickel, arsenic, uranium, manganese, vanadium, aluminum, cobalt, antimony, silver, zinc, krypton, chromium, mercury, neon, cadmium, erbium, germanium, xenon, scandium, gallium, zirconium, lead, bismuth, niobium, gold, thulium, thallium, Ianthanum, neodymium, thorium, cerium, cesium, terbium, ytterbium, yttrium, dysprosium, selenium, lutetium, hafnium, gadolinium, praseodymium, tin, beryllium, samarium, holmium, tantalum, europium.      -----------  vasireddy venugopal ...
  • జీడిపప్పు పకోడీ..జీడిపప్పు ఉప్మా..జీడిపప్పు మిఠాయి..జీడిపప్పు పాకము..జీడిపప్పు మసాలా...జీడిపప్పు మిక్చరు.ఇలా రకరకాలుగా చేసుకుని జీడిపప్పు ని తినవచ్చు. చెబుతుంటేనే నోరు ఊరుతుంది కదా...జీడి పప్పు రుచే రుచి. ఈ పప్పును వేయించి కానీ పచ్చిగా కానీ తినవచ్చు. వేరు సెనగ.... బాదం పప్పు తో పోలిస్తే జీడి పప్పు ఖరీదు ఎక్కువ. భారతీయ వంటకాలలో చాలా వాటిలోజీడి పప్పు వాడతారు, పిండి వంటల్లోకూడా వినియోగిస్తారు.థాయి, చైనీస్ వంటకాలలో కూడా జీడిపప్పును ఉపయోగిస్తారు. గోవాలో జీడి పండుని నూరి, ఆ రసాన్ని తీసి 2-3 రోజులు పులియబెడతారు. పులిసిన రసాన్ని రెండు సార్లు బట్టిలో పెడతారు. ఫలితంగా వచ్చిన పానీయాన్ని ఫెని అంటారు. టాంజానియా దక్షిణ ప్రాంతంలో జీడి పండుని ఎండబెట్టి నిల్వచేస్తారు. తరువాత నీటిలో నానబెట్టి, పులియబెట్టి... బట్టిలో కాచి ఘాటైన మద్యాన్ని తయారు చేస్తారు. దీని పేరు గంగో అంటారట. ముఖ్యంగా వెట్ పార్టీలలో జీడిపప్పు ను ఇష్టంగా ఆరగిస్తారు.  ప్రకాశం జిల్లా వేటపాలెం ఫైన్ క్వాలిటీ జీడిపప్పు కి ప్రసిద్ధి.విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. వేటపాలెం జీడిపప్పు కి దేశవిదేశాల్లో చాలా పేరుంది. పిండిపదార్థాలు అధికంగా ఉండే ఈ జీడీ పప్పులో చక్కెర, పీచుపదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్ బి1, విటమిన్ బీ2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి.  ఈ జీడి పప్పుల్లో కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదు.  ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకల పుష్టికి ఇవి దోహదపడుతాయి. మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది కనుక కాజు తీసుకుంటే మేలు. ఇక రక్తపోటు(బీపి) ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు.  ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది. సెలీనియమ్, మరియు విటమిన్ ఇ వంటివి ఉండటంతో ఇవి కేన్సర్ ను రాకుండా అడ్డుకుంటాయి. అయితే, ఈ పప్పును ఎడాపెడా తినేయకూడదు. నియంత్రణ ఉండాలి. రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు. ఇదికూడా రెండు దఫాలుగా తింటే మంచిది....
  • వెజిటేరియనిజానికి ఇపుడు అంతర్జాతీయంగా ప్రాముఖ్యత  పెరుగుతోంది. యూరోపియన్‌ యూనియన్‌లో అయితే ప్రత్యేకంగా క్యాంపెయిన్స్‌ కూడా నిర్వహిస్తున్నారు. 'మీట్‌ లెస్‌ మండే'(మాంసాహారం లేని సోమవారం) పేరిట ఇప్పుడు 36 దేశాల్లో క్యాంపెయిన్‌ జరుగుతుండటమే కాదు కోట్లాది మంది  సోమవారాలు మాంసం ముట్టమని ప్రతిజ్ఞ కూడా చేస్తున్నారు. ఈ ప్రచారాల ఫలితమో.. ఆరోగ్యం పట్ల పెరిగినజాగ్రత్తో తెలియదు కానీ ముక్క లేకపోతే ముద్ద దిగని వారూ ఇప్పుడు వెజిటేరియన్‌లుగా మారిపోతున్నారు కూరగాయలు, పళ్లు, పప్పుదినుసులు లాంటివి  తినటం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసికఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెప్తుండటం.. కొన్ని రోగాలు వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయనే సత్యాలు గ్రహించి ఎక్కువమంది వెజిటేరియన్స్‌గా మారుతున్నారు. అసలు బయలాజికల్‌గా, సైకలాజికల్‌గా, ఫిజికల్‌గా మానవ శరీరాన్ని వెజిటేరియన్‌గానే ప్రకృతి రూ పొందించిందనే సంగతిప్పుడు అందరూ గ్రహిస్తున్నారు. మీట్‌ ఈటింగ్‌ క్యాపిటల్‌  అమెరికాలో సైతం ఇటీవల శాకాహారుల సంఖ్య పెరుగుతోంది. 2012లో యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ నివేదికల ప్రకారం 12శాతం మీట్‌ అండ్‌ పౌల్ట్రీ  వినియోగం తగ్గింది. అదే సమయంలో వెజిటేరియన్‌ రిసోర్స్‌ గ్రూప్‌ అంచనా ప్రకారం 5 శాతం వెజిటేరియన్లు పెరిగారు. ఇక మన నగరాలలోను శాకాహారుల సంఖ్య పెరుగుతోందనే చెప్పాలి. ప్రత్యేకమైన సర్వేలు లేక పోయినా వీగాన్స్‌లాంటి గ్రూప్‌లలో పెరుగుతున్న సభ్యత్వం ఓ సూచికగా భావించవచ్చు. శాస్త్రం చెప్పింది.. నివేదికలు నిరూపిస్తున్నాయి.. అహింసా పరమోధర్మః మన పురాణాల్లో చెప్పిన సత్యమిది. ఈ మార్గంలోనే జాతిపిత గాంధీ వెళ్లారు. శాకాహారాన్ని మాత్రమే గాంధీభుజిస్తే, అంతర్జాతీయ  విఖ్యాత ఫిలాసఫర్‌.. ప్లేటో, రాజకీయవేత్త బెంజిమిన్‌ ఫ్రాంక్లిన్‌ నుంచి పాప్‌ ఐకాన్స్‌.. పౌల్‌ మెక్‌కార్టీనీ, బాబ్‌ మార్లే, బాలీవుడ్‌ తారలు శిల్పాశెట్టి, కరీనాకపూర్‌.. ఇలా అందరూ వెజిటేరియన్‌ డైట్‌నే అనుసరించారు, అనుసరిస్తున్నారు. ఇప్పుడు పరిశోధకులూ వెజిటేరియన్‌ ఫుడ్‌ అన్ని విధాలా మంచిదని ఆధారాలతోసహా చెబుతున్నారు. నాన్‌ వెజిటేరియన్స్‌తో పోలిస్తే వెజిటేరియన్స్‌ 10-15 సంవత్సరాలు ఎక్కువ బతకటమేకాదు.. వీరికి గుండెపోటు, కొలెస్ట్రాల్  సమస్యలు, ఎసిడిటీలు కూడా వచ్చే అవకాశాలు తక్కువని.. వెజిటేరియన్‌ డైట్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుందని, త్వరగా జీర్ణమవుతుందని.. రక్తపోటు నియంత్రణలో ఉంటుందని.. వెగాన్స్‌లో టైప్‌ 2 డయాబెటిస్‌ ప్రమాదం తక్కువని.. చెపుతున్నాయి. మాంసాహారులతో పోలిస్తే శాకాహారులలో కొన్ని క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువంటున్నాయి. దీంతోఆరోగ్యంపై అమిత శ్రద్ధ కనబరిచే వారు సహజంగానే శాకాహారులుగా మారుతున్నారు. అయితే శాకాహారం సంపూర్ణ ఆహారమేనా..? మాంసాహారులలో వచ్చే ప్రథమ సందేహమిది. మాంసం, పాలఉత్పత్తులలో ప్రొటీన్‌,ఫాట్స్‌ లభిస్తాయన్నది వీరిభావన. ఇందులో కొంత మాత్రమే నిజమని చెబుతున్నారు డాక్టర్లు. నిజానికి వెజిటేరియన్‌ ఫుడ్‌లోకూడా ప్రొటీన్స్‌ పెద్దమొత్తంలో ఉంటాయి. ఎనీమల్‌ ప్రొటీన్‌తో పోలిస్తే ప్లాంట్‌ బేస్ట్‌ ప్రొటీన్‌ సోర్స్‌ మరింత ఆరోగ్యకరమైన్నది నిపుణుల భావన. అంతేకాదు.. హెల్తీఫైబర్లు, కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్‌లు వీటిలో అధికంగా ఉంటాయని అంటున్నారు డయాబెటిస్ట్‌ ప్రమతిరెడ్డి.ప్లాంట్స్‌లో డైజెస్టివ్‌ ప్రోటీన్స్‌ ఉంటాయి. ప్రధానంగా పప్పు దినుసులు, లెంటిల్స్‌, గ్రీన్‌గ్రామ్‌స్పౌట్స్‌లో అవసరమైన అమినో ఏసిడ్స్‌ ఉంటాయని డైటీషియన్లు చెబుతున్నారు. నట్స్‌, బీన్స్‌, సీడ్స్‌లో ప్రోటీన్‌ అధికంగా లభిస్తుంది. ప్రోటీన్‌ రూపకల్పనకు కారణం అయిన 10 అమినో ఏసిడ్స్‌ను మన బాడీ తయారు చేసినప్పటికీ మరో 10 అమినో ఏసిడ్స్‌ వెజిటేరియన్‌ డైట్‌లోనే లభిస్తాయని న్యూట్రిషయనిస్ట్‌ సునీత అంటున్నారు. చేపల్లోఒమెగా ఫాటీ ఏసిడ్స్‌ ఉంటాయంటారు కానీ దీనితో పోలిస్తే వెజిటేరియన్‌ సోర్స్‌లో కాలుష్యకారకాలు అధికంగా ఉండవు. అదీగాక ఫిష్‌ ఆయిల్‌తో పోలిస్తే వెజిటేరియన్‌ ఫుడ్‌ ఎకోఫ్రెండ్లీ. శరీరంలో అన్ని టిష్యూలు సరిగా పనిచేయటానికి అవసరమైన ఒమెగా-3 గ్రౌండ్‌ ఫ్లాక్స్‌సీడ్‌, గ్రీన్‌ లీఫీ వెజిటెబుల్స్‌, బీన్స్‌, పీస్‌, సిట్రస్‌ ఫ్రూట్స్‌, మెలన్స్‌లో ఎక్కువగా లభిస్తుందని చెబుతున్నారామె. శాకాహారం వల్ల లాభాలివి.. గుండెజబ్బులు, క్యాన్సర్‌, ఆర్థరైటిస్‌ లాంటి ఎన్నో రోగాలను నియంత్రిం చుకోవచ్చు. వెజిటేరియన్‌ డైట్‌లో - శాచురేటెడ్‌ ఫాట్స్‌ తక్కువగా ఉంటాయి. ఫైబర్లుఅధికం. కాన్సర్‌రాకుండా నివారిం చే ఫైటోన్యూట్రియంట్స్‌ అధికంగా ఉంటాయి. వెజిటేరియన్‌తో పోలిస్తే నాన్‌వెజ్‌లో ఎండోటాక్సిన్స్‌ అధికం. ఈటాక్సిన్స్‌ వల్లే ఆర్థరైటిస్‌, ఫైబ్రో మయాల్జి యా వంటి రోగాలొస్తాయి. వెజ్‌డైట్‌తోనే ఆర్ధరైటిస్‌ రోగాలను పూర్తిగా నయం చేయవచ్చని కొంతమంది చెబుతున్నారు. మెంతికూర, పాలకూరలలో ఐరన్‌, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొట్లకాయ లాంటివి తినటం వల్ల బరువు నియంత్రణలో ఉంచుకోవచ్చు. వెజిటెబుల్స్‌, ఫ్రూట్స్‌లో నేచురల్‌ షుగర్‌, ఉపయో గకరమైన ఎంజైమ్స్‌ ఉంటాయి. బ్లడ్‌కొలెసా్ట్రల్‌ను తగ్గించుకోవచ్చు. ఎన్నో రోగాలు దరి చేరకుండా కాపాడుకోవచ్చు. కాల్షియం పాలలో ఎక్కువ ఉంటుంది అంటారు కానీ ఆకుకూరలైన కొత్తిమీర, మెంతికూర, రాడిష్‌, కర్రీపట్ట తో పాటు ఆవాలు, రాగి, బాదం, రజ్మా, పీస్‌, పెసర పప్పు, సోయా ఉత్పత్తులలో అధికంగాఉంటుంది. సరిగ్గాతింటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్‌ లభిస్తుంది. ప్రోటీన్‌ తక్కువగా ఉందంటే వారు సరిగా తినటం లేదనే లెక్క. ప్రోటీన్‌అధికంగా పప్పులు, సోయా ఉత్పత్తులు, నట్స్‌ వంటి వాటిలో లభిస్తుంది .   --------------------పాశం జగన్నాధం ...
  • చికెన్ ఫ్రై లలో రారాజు "చికెన్ 65" అంటే ఎవరూ కాదనరు.  ఎందుకంటె దాని టేస్ట్ సూపర్ కాబట్టి.  దాని పేరు వింటేనే చాలామందికి నోరూతుంది.  పోతే ఈ చికెన్ 65 పుట్టింది చెన్నైలో అని చాలామందికి తెలియదు.  అవును. ఈ వంటకాన్ని మొదట సారిగా బుహారీ అనే రెస్టారెంట్ లో తయారు చేశారు.  1965లో దీన్ని చేశారు కాబట్టి చికెన్ 65 అనే పేరు ఖరారు అయిపొయింది.  బ్రాయిలర్స్ వస్తున్న తొలి రోజుల్లో సరిగ్గా 65 రోజుల వయసు గల కోళ్ళే ఎంచుకునే వారట కోయటానికి. దానితో చేసిన వంటకమే చికెన్ 65. ఇప్పుడైతే 45 రోజులు కూడా ఆగటం లేదనుకోండి. అది వేరే విషయం.  చెన్నై లో మొదలైన ఈ వంటకం అలా అలా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపొయింది.  అయితే ఈ వంటకం చెన్నై ది కాదనే వాదన కూడా లేకపోలేదు.  ఇక బుహారీ హోటల్ లో చికెన్ 78,చికెన్ 82,చికెన్ 90 వంటకాలు కూడా లభ్యమవుతాయి.  వీటిని కూడా అదే హోటల్ లో తొలి సారిగా తయారు చేశారు. చికెన్ 65 అంత గా అవి పాపులర్ కాలేదు.  ఇపుడు ఆ వంటకాలు ఇతర రాష్ట్రాల్లో కూడా లభ్యమవుతున్నాయి.  సుప్రసిద్ధ నటుడు అమితాబ్ బచ్చన్ నిర్వహించిన కౌన్ బనేగా కరోడ్ పతి లో కూడా చికెన్ 65 గురించి చెబుతూ ఇది బుహారీ వారీ తయారీ అని చెప్పారు.  సిద్దార్ధ బసు క్విజ్ టైం లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు.  దేశ వ్యాప్తంగా చాలా హోటళ్లలో ఇది లభ్యమవుతున్నప్పటికీ చెన్నైబుహారీ లో చికెన్ 65 టేస్ట్ వేరేగా ఉంటుంది.  చెన్నై వెళ్ళినపుడు ఒక సారి తిని చూడండి.  సింపుల్ గా "చికెన్ 65" కథ అది. ........  SATYANANDA REDDY BOJJA ...
  • తొందరగా సెటిల్ అయిపోవాలి ... నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి అనే కాంక్షతో చాలా మంది ఓవర్‌టైమ్  డ్యూటీలు చేస్తుంటారు. అయితే రోజుకు 8 గంటలకు మించి పని చేస్తే ప్రమాదం అని అధ్యయనాలు చెబుతున్నాయి .  8 గంటలకు మించి పనిచేసే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 80 శాతం దాకా ఉన్నాయని లండన్ లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది.  ఇటీవల కాలంలో వేలాది మంది ఉద్యోగులు తరచు గుండె పోట్లు, హృద్రోగాల బారిన పడడానికి ఎక్కువ గంటలు పనిచేయడమే కారణమని శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ఫిన్నిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది.  చాలా మంది తమ ఉద్యోగం ఊడిపోకుండా ఉండడానికి ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని, అది వారి ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తోందని ప్రధాన పరిశోధకుడు డాక్టర్ మరియానా పేర్కొన్నారు.కాబట్టి జాగ్రత్త గా వుండటం మంచిదని చెబుతున్నారు.ఏదైనా పరిమితుల్లో ఉంటేనే బాగుంటుంది.అతిగా చేస్తే అసలుకే మోసం వస్తుంది. అందుకు మన పెద్ద వాళ్లు అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. అయితే పని ఒత్తిడి పెరిగితే ప్రతికూల ఫలితాలు వస్తాయి.ఒక మనిషి వారానికి 55 గంటలు పని చేయడం ఉత్తమం. అంతకంటే ఎక్కువ పని చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. అదనంగా పని చేయడం వల్ల అదనంగా ఆదాయం వచ్చే మాట వాస్తవమే అయినా.. తద్వారా వచ్చే అనారోగ్యానికి అయ్యే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది.అధికంగా పని చేయడం వల్ల వ్యక్తిగత ఆనందం కోసం వెచ్చించే సమయం తగ్గిపోతుంది. ఒక లిమిట్ దాటిన తరువాత పని చేస్తే పనిలో నాణ్యత కూడా పడిపోతుంది. ఇక కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో పనిచేసేవారు, అధిక సమయం కూర్చునే గడుపుతారు. వీరికి శారీరక శ్రమ చాలా తక్కువ. రోజులో సుమారుగా 8 నుండి 10 గంటల సమయం పనికే కేటాయిస్తారు. ఇలాంటి వారికి  త్వరగా ఊబకాయం,   డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది.   రోజువారీ శారీరక శ్రమలేని జీవన విధానం కూడా షుగర్ వ్యాధి పెరిగేందుకు కారణమని పరిశోధకులు ఒక నిర్ధారణకు వచ్చారు. ప్రతిరోజూ ఉదయం లేవగానే అరగంటపాటు వ్యాయామం చేసేవారు ఇకపై తమ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదని అనుకుంటుంటారుగానీ... నిజానికి రోజంతా ఒళ్లు కదల్చకుండా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్ని ఈ అరగంట వ్యాయామాలు ఏమాత్రం భర్తీ చేయలేవని కూడా  చెబుతున్నారు. గంటలతరబడీ అదేపనిగా కూర్చొని పని చేసుకుంటుండేవారు ఎక్కువసేపు కూర్చోకుండా... వీలైనప్పుడల్లా సీట్లోంచి లేచి, అటూ ఇటూ తిరగడం.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ ఆఫీసు కారిడార్లలో పచార్లు చేయడం లాంటివి చేస్తే శారీరక కండరాలకు కదలిక వచ్చి కొంత మేరకు  ప్రయోజనం చేకూరుతుందని  పరిశోధకులు చెబుతున్నారు.కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త .... మీరు బాగుంటేనే మీ  కుటుంబం  బాగుంటుంది.   ...
  • కొన్ని నెలలక్రితం నన్ను కలుసుకోవడానికి బెంగుళూర్ నుంచి నా ఫేస్బుక్ ఫెండ్ ఒకరు వచ్చారు... మాటలయ్యాక భోజనంవేళ మా ఇంట్లో వాళ్ళు అతనికి గోంగూర పచ్చడి వడ్డిస్తూంటే " అదేంటని ? " అడిగాడు అతను నన్ను. మా ఇంట్లోవాళ్లకీ,, నాకూ ఏక కాలంలో ఆశ్చర్యం వేసింది " అమృతసమానమైన రుచి కలిగినదీ,, "ఆంధ్రశాకం " గా మన కవులచేత కీర్తించబడేదీ అయిన ఈ గోంగూర పచ్చడి గురించి తెలియని మనుష్యులు ఉన్నారా? అనుకున్నాను .  నా ఆశ్చర్యాన్ని కప్పిపుచ్చుకుని " దీనిని గోంగూర పచ్చడి అని అంటారు ( ఖర్మ ఖర్మ,, ఇలాంటి రోజొకటి వస్తుందనుకోలేదు నేనసలు ) అని దాని యొక్క విశిష్టతనూ, దానిని తయారుచేసే విధానమునూ పూస గుచ్చినట్లు చెప్పానతనికి. అయినా దానినతను ముట్టుకోకుండా సంశయాత్మక మనస్కుడై " తినచ్చో లేదో..?" అన్నట్లు చూస్తూ ఉంటే ఒక ఆంధ్రుడిగా నాకెంతో  బాధేసింది.   అందులోనూ మా ఊరిలో చాలా రుచికరమైన పుల్ల గోంగూర పండుతుంది  కూడానూ...అలాంటి ఆకులతో తయారైన ఆ పచ్చడి తినే అదృష్టం పట్టాలంటే ఆ మనిషికి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేగానీ దక్కదు....అలాంటిది ఇతను దానిని కనీసం  తాకను కూడా లేదు.   ఎలాగైనా ఈ కర్నాటకవాసికి దీనిపై ఉన్న అపనమ్మకాన్ని పోగొట్టి తినేట్లు చెయ్యాలని గట్టిగా నా మనస్సున సంకల్పించుకుని మా ఊరి గోంగూర కాడలను ఓసారి నా మనస్సున ధ్యానించుకుని వాతావరణాన్ని తేలికచెయ్యడానికన్నట్లు,,ఈ పచ్చడి గొప్పతనం తెలిపేట్లు  ఓ కధ చెప్పానిలా అతనికి " పూర్వం దేవతలూ - రాక్షసులూ ముసలితనమూ,,చావూ తప్పించుకోవడానికై అమృతపానం చేస్తే ఫలితం ఉంటుందని తెలుసుకుని ఆ అమృతంకోసమై పాలసముద్రాన్ని మధింప పూనుకున్నారట.ఆది కూర్మాన్ని వేడుకుని కవ్వపుకొండకు అడుగున చుట్టకుదురుగా చేసుకున్నారట.. పాతాళం తాకే మూలభాగంగల మందర గిరిని కవ్వపు కొండగా చేసుకుని నాగరాజ వంశోత్తముడైన వాసుకి ని కవ్వపు త్రాడుగా చేసుకుని ఆవహం,ప్రవాహం మొదలైన వాయుబేధాలను అడ్డత్రాళ్ళుగా అమర్చుకుని బలి నాయకత్వాన రాక్షసులు ఒకవైపూ,,దేవేంద్రుని నాయకత్వాన దేవతలందరూ మరోవైపూ నిలబడి క్షీరసాగర మధనం ప్రారంభించారట.. అప్పుడు సముద్రమధ్య నుంచి భువనగోళాన్నీ,,దిక్కులనూ కబళిస్తూ చెవులు బ్రద్దలు చేసే ఘమఘమ ధ్వని పుట్టిందట..అలా సముద్రమధనం అంతకంతకూ తీవ్రస్థాయి అందుకొంటూ ఉండగా మొదట వానకారు మబ్బు వన్నెతో హాలాహల విషం ఉద్భవించిందట..ఆ విషాగ్ని జ్వాలలకు దేవాసురులు బెంబేలెత్తిపోయి పరమేశ్వరుడిని ప్రార్ధిస్తే ఆయన వీరిని కరుణించి ఆ విషానంతటినీ చాలా అవలీలగా గుట్టుక్కున మ్రింగేశాడట. ఆపద తప్పిందని మళ్ళీ వాళ్లందరూ అమృతంకోసమై పాలకడలిని మధిస్తూంటే వరుసగా చంద్రుడూ,,కల్పవృక్షమూ,,అప్సరసలూ,కౌస్తుభమణీ,ఉచ్చైశ్రవమనే గుర్రమూ,,ఐరావతమూ,,ఇంకా సమస్త కోరికలూ తీర్చే పదార్ధాలూ,,లక్ష్మీ దేవి ఆ తర్వాత అమృతకలశహస్తుడై మహానుభావుడైన ధన్వంతరీ ఉదయించారట.. వెంటనే రాక్షసులు ధన్వంతరి చేతిలోని ఆ అమృతకలశాన్ని లాక్కొని పారిపోతూ ఉండగా నారాయణుడు మోహినీ రూపందాల్చి ఆ రాక్షసులను వంచించి ఆ అమృతకలశాన్ని గ్రహించి దేవతలందరికీ ఆ అమృతాన్ని పంచాడట.. అలా పంచేశాక మిగిలిన ఆ అమృతపు కుండని భూమి మీదకి జారవిడిచేశాడట ఆ విష్ణుమూర్తి.. అది కాస్తా మా పిఠాపురం పరిసర ప్రాంతాలలోని గోంగూర తోటల్లో పండింది... అందుకే అప్పటినుంచీ ఈ గోంగూరకి అమృత  తుల్యమైన ఈ రుచి అబ్బింది  " అని కథ చెప్పడం  ముగించా  అంతే అతగాడు లొట్టలేసుకుంటూ మరికొంచెం వేయించుకుని గోంగూరతోనే భోజనం పూర్తి చేసాడు. ఆ తర్వాత  "నిజంగానే నువ్వు చెప్పినట్లు చాలా బాగుంది కిరణ్ " అని ఇంకాస్త ఓ చిన్న డబ్బాలో వేసుకుని వాళ్ళ ఇంటికి పట్టికెళ్ళాడు కూడా వెళ్తూవెళ్తూ. అదీ గోంగూర పచ్చడి గొప్పదనమంటే !!!             - Kks Kiran...
  • ఆకుకూరల్లో తోటకూర ‘రాణి’ వంటిదని అంటారు.  దీనిలో పెరుగు తోటకూర, ఎర్ర తోటకూర, చిలక తోటకూర వంటి పలురకాలున్నాయి. ఐరన్‌తో పాటు పలు పోషక విలువలున్న తోటకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతి రోజూ కనీసం 200 గ్రాముల తోటకూర తింటే  ఒంటికి మంచిదని  ఆయుర్వేద వైద్యులు చెబుతుంటారు.  మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర.  తోట కూర తో పప్పు, పచ్చడి పులుసు కూర ఇంకా ఇతర రకాల వంటకాలు చేస్తారు. ఇవన్నీకూడా రుచికరంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మామిడికాయతో దీన్ని కలిపి వండుతారు. దీన్ని సోయాబీన్స్‌తో కలిపి వడలు, టమాటాతో కలిపి ముద్దకూర, కాడలతో పిండి-బెల్లం కూర వంటి వంటకాలు కూడా చేస్తారు. ఇదివరలో తప్పనిసరిగా తోటకూర ను పెరట్లో పెంచేవారు. ఈ తోటకూర తో  9 కి పైగా ప్రయోజనాలున్నాయి.   # రెగ్యులర్ గా తోటకూర తింటే రక్తహీనత నుంచి ఉపశమనం లభిస్తుంది.  # బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. #తోటకూర తింటే  మొలల వ్యాధి తగ్గుతుంది.    కడుపులో పురుగులు తగ్గుతాయి. # తోటకూర  తక్షణశక్తి  నివ్వడంలో తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. #అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుందీ కూర. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది. #తోటకూరలోని ‘విటమిన్‌ సి’ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది. #తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలదు. మాడు మీద చుండ్రు తగ్గుతుంది. #కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివీ సమకూరుతాయి. విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్‌ ఎ, సి, డి, ఇ, కె, విటమిన్‌ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు. ఇవన్నీ సమకూరుతాయి. #వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి.........Sri vani ...
  • అన్ని సీజన్‌లలో దొరికేది  అరటి పండు. అందరికీ అందుబాటు ధరల్లోనూ ఉంటుంది. అన్నివయసుల వారికి నచ్చిన పండు ఇది . అరటిపండు సులువుగా జీర్ణమవుతుంది. అరటిపండులో చాలా రకాలున్నాయి. అరటిపండు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రపంచంలోని 5 ప్రధాన ఆహారాలలో అరటి పండు ఒకటి . అరటి పండు లేని  భోజనం  అసంతృష్ట ఆహారం. అలాంటి అరటిపండు  రాబోయే 5-10 సంవత్సరాల్లో మాయం కానుంది. పూర్తిగా అంతరించిపోతుంది అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.  "సిగటోకా కాంప్లెక్స్" అనే ఫంగల్ వ్యాధి  కారణంగా అరటి కనుమరుగవుతుందని  నిపుణులు ఓ అధ్యయనం లో పేర్కొన్నారు . ఫంగస్ తో కూడిన మూడు వ్యాధులను  ఇలా ఒకే పేరిట పిలుస్తారు . ఎల్లో సిగటోకా, బ్లాక్ సిగటోకా, టైప్ డిసీజ్ లతో బాటు అరటి చెట్టు ఆకులకు సోకే ఒక రకమైన తెగులు కూడా ఇందుకు కారణమని అంటున్నారు . ముఖ్యంగా బ్లాక్ సిగటోకా నుంచి ఈ పండుకు పెద్ద ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. అరటిలోని వ్యాధి నిరోధక వ్యవస్థను, చెట్టు లోని కణజాలాన్నినాశనం చేయగల శక్తి  ఈ సిగటోకాకు ఉందని  పరిశోధనల్లో వెల్లడయింది. . ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో ప్రతి ఏడాదీ 140 మిలియన్ టన్నుల అరటి పండ్లు ఉత్పత్తి అవుతుండగా..ఒక్క ఇండియాలోనే 25 మిలియన్ టన్నుల ఉత్పత్తి అవుతోందని అధికారుల అంచనా.  అలాంటి అరటి పండు  మాయమైపోతుందంటే  నమ్మబుద్ధి కావడం లేదు కదా. ...................................K.Sudhakar   ...
  • అదిరిపోయే రుచితో ఉంటుంది ఈ వంకాయ రొయ్యల కూర. తయారు చేసే విధానం కూడా చాలా సింపుల్.   నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగుతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు దోరగా వేయించాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టి చిన్నమంటపై మగ్గించాలి. తర్వాత రొయ్యలు కలిపి మంట కొద్దిగా పెద్దగా చేయాలి. రొయ్యలు వేగాక కొత్తిమీర చల్లి మంట తీసెయ్యాలి. 5 నిమిషాల తర్వాత సర్వ్‌ చేసుకోవచ్చు. అన్నంలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. కావలసిన పదార్థాలు:  వంకాయలు - 4,  శుభ్రం చేసిన (చిన్న ) రొయ్యలు - 1 కప్పు,  పచ్చిమిర్చి - 1,  ఉల్లిపాయ - 1,  అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను,  టమోటా - 1, ఉప్పు - తగినంత,  పసుపు - పావు టీ స్పూను,  కారం - 1 టీ స్పూను,  నూనె - 2 టేబుల్‌ స్పూన్లు,  కొత్తిమీర తరుగు - పావు కప్పు........................................................RAYUDU BKS ...
  •                                                                 "పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి" అంటారు.  అంత రుచిగా ఉంటుంది మరి పులస చేప పులుసు.  ఈ పూలస వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది. ఇది గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. ఇదే చేప సముద్రంలో దొరికితే దానిని 'వలస చేప' అంటారు. హుగ్లీ నదిలో కూడా ఈ చేప దొరుకుతుంది దీనిని వాళ్ళు 'హిల్సా' అని పిలుస్తారు. పులస చేప పులుసు ఉభయ గోదావరి జిల్లాలలో చాలా ప్రసిద్ధి చెందిన వంటకం.  పులస పుట్టుక విచిత్రంగా ఉంటుంది. 'హిల్సా ఇలీషా' అనే శాస్త్రీయ నామం గల ఆరోహక వలస జాతికి చెందిన పులసలను సముద్రంలో ఉన్నప్పుడు వలసలు అని పిలుస్తారు. సంతానోత్పత్తి కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, టాంజానియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి హిందూ మహాసముద్రం మీదుగా ప్రయాణించి అవి బంగాళాఖాతంలో ప్రవేశిస్తాయి. గోదావరి నుంచి వరద నీరు వచ్చి అంతర్వేది వద్ద సముద్రంలో కలిసే సమయంలో గుడ్లు పెట్టడం కోసం గోదావరిలోకి ఎదురీదుకుంటూ ప్రవేశిస్తాయి. నదీ ప్రవాహానికి అతివేగంగా ఎదురీదడం ఈ చేప ప్రత్యేకత. ఇదంతా జూన్ నుంచి ఆగస్టు మాసాల మధ్య జరుగుతుంది. గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలో ప్రవేశిస్తాయి. ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చి వలలో పడతాయి. వలలో పడిన వెంటనే చనిపోవడం, రెండురోజులైనా పాడవకుండా ఉండడం కూడా పులసల విశిష్టత. గోదావరి తీపి నీటిలోకి వచ్చేసరికి ఈ చేప రంగు, రుచీ మారి పులసగా మారుతోంది. అలాగని గోదావరి అంతటా ఈ పులసలుండవు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్‌ నుండి సముద్రంలో కలిసే మధ్యలోనే ఇవి దొరుకుతాయి. పులసను వేటాడడం ఆషామాషీకాదు. గేలం వేస్తేనో, వల విసిరితేనో ఇవి దొరికేయవు. ఏటిమధ్యకు వెళ్ళి వలలను మత్య్సకారులు ఏర్పాటు చేసుకుంటారు. తెల్లవారుజామున వేటకు వెళితే సాయంత్రానికి ఒకటిరెండు దొరికితే గొప్పే. కొన్ని సందర్భాల్లో అసలు దొరకనే దొరకవు. దొరికితే వారి పంట పండినట్లే. వలలో పడిన వెంటనే ఈ చేపలు మరణిస్తాయి. అందుకే ఇవి బతికుండగా జాలర్లు కూడా చూసిన దాఖలాలు ఉండవు.  ఎలా వండాలంటే ? పులసలు రెండు రకాలు. పోతుపులస, ఆడపులస. ఆడపులస నే 'శనగ పులస' అని కూడా అంటారు. గోదారిలో మిగిలిన ప్రాంతాల్లో కన్నా, రాజమండ్రి దగ్గర దొరికిన పులస ఎక్కువ రుచిగా ఉంటుంది. మరి ఇంత ఖరీదైన పులస తో రుచికరమైన పులుసు పెట్టడం అంత సులువేమీ కాదు. పులస చేపతో పులుసు చేయడానికి ముందు పులసకి ఉన్న పొలుసులు తీసేసి శుభ్రం చేయాలి. చేదుకట్ట తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ రేకలూ, అల్లం, జీలకర్రా, ధనియాలూ కలిపి ముద్దగా నూరుకుని పక్కన పెట్టుకోవాలి. గుప్పెడు పొడవాటి మిరప్పళ్ళు ముతగ్గా దంచి వేరుగా పెట్టుకోవాలి. వెడల్పుగా, లోతు తక్కువగా ఉన్న గిన్నె (వీలయితే మట్టి దాక) స్టవ్ మీద పెట్టి అందులో నువ్వుల నూనె పోయాలి. నూనె సెగ వచ్చేలా కాగాక నూరి ఉంచుకున్న ముద్దలు ఒక్కొక్కటీ వేసి దోరగా వేయించాలి. లేత కొబ్బరి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి గిన్నెలో పోయాలి. అలాగే టమాటా పళ్ళని చిదిమి గిన్నెలో వేయాలి. లేత బెండకాయ ముక్కల్ని పొడుగ్గా తరిగి పులుసులో వేశాక, ఒక్కొక్క చేప ముక్కనీ జాగ్రత్తగా పులుసులో మునిగేలా జారవిడవాలి. గిన్నెమీద జల్లిమూత (చిల్లులున్నది) పెట్టి మంట పెంచాలి. కుతకుతా ఉడుకుతూ బుళుకు బుళుకు మనే చప్పుళ్ళు చేస్తుంది పులుసు. పులుసు నుంచి కమ్మటి వాసన రావడం మొదలవ్వగానే మంట తగ్గించి సన్నని సెగ మీద ఉడకనివ్వాలి. చాలాసేపు మరిగాక పులుసు చిక్కబడుతుంది. స్టవ్ ఆపేసి వేడి పులుసు లో వెన్నముద్ద కలపాలి. పులుసు బాగా చల్లారాక మొన్న వేసవిలో పెట్టిన కొత్తావకాయ మీది తేటని పులుసులో కలపాలి. ఒకరాత్రంతా కదపకుండా గిన్నెలోనే ఉంచేసి, మర్నాడు ఉదయం అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది రుచీ అబ్బో అదిరి పోద్ది.   by  Ramjee ...