Latest News
ఆరోగ్యం ఆహారం

జీడి పప్పు రుచే వేరు !!

1st Image

జీడిపప్పు పకోడీ..జీడిపప్పు ఉప్మా..జీడిపప్పు మిఠాయి..జీడిపప్పు పాకము..జీడిపప్పు మసాలా...జీడిపప్పు మిక్చరు.ఇలా రకరకాలుగా చేసుకుని జీడిపప్పు ని తినవచ్చు. చెబుతుంటేనే నోరు ఊరుతుంది కదా...జీడి పప్పు రుచే రుచి. ఈ పప్పును వేయించి కానీ పచ్చిగా కానీ తినవచ్చు. వేరు సెనగ.... బాదం పప్పు తో పోలిస్తే జీడి పప్పు ఖరీదు ఎక్కువ. భారతీయ వంటకాలలో చాలా వాటిలోజీడి పప్పు వాడతారు, పిండి వంటల్లోకూడా వినియోగిస్తారు.థాయి, చైనీస్ వంటకాలలో కూడా జీడిపప్పును ఉపయోగిస్తారు.
గోవాలో జీడి పండుని నూరి, ఆ రసాన్ని తీసి 2-3 రోజులు పులియబెడతారు. పులిసిన రసాన్ని రెండు సార్లు బట్టిలో పెడతారు. ఫలితంగా వచ్చిన పానీయాన్ని ఫెని అంటారు. టాంజానియా దక్షిణ ప్రాంతంలో జీడి పండుని ఎండబెట్టి నిల్వచేస్తారు. తరువాత నీటిలో నానబెట్టి, పులియబెట్టి... బట్టిలో కాచి ఘాటైన మద్యాన్ని తయారు చేస్తారు. దీని పేరు గంగో అంటారట.
ముఖ్యంగా వెట్ పార్టీలలో జీడిపప్పు ను ఇష్టంగా ఆరగిస్తారు. 
ప్రకాశం జిల్లా వేటపాలెం ఫైన్ క్వాలిటీ జీడిపప్పు కి ప్రసిద్ధి.విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి.
వేటపాలెం జీడిపప్పు కి దేశవిదేశాల్లో చాలా పేరుంది.
పిండిపదార్థాలు అధికంగా ఉండే ఈ జీడీ పప్పులో చక్కెర, పీచుపదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్ బి1, విటమిన్ బీ2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6, విటమిన్ సి, కాల్షియమ్, ఐరన్, మెగ్నీషియమ్, పొటాషియం, జింకు వంటి ఖనిజ లవణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 
ఈ జీడి పప్పుల్లో కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదు.  ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకల పుష్టికి ఇవి దోహదపడుతాయి. మన శరీరానికి సుమారు 300 నుంచి 750 మిల్లీగ్రాముల మెగ్నీషియం అవసరమవుతుంది కనుక కాజు తీసుకుంటే మేలు. ఇక రక్తపోటు(బీపి) ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. 
ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది. సెలీనియమ్, మరియు విటమిన్ ఇ వంటివి ఉండటంతో ఇవి కేన్సర్ ను రాకుండా అడ్డుకుంటాయి. అయితే, ఈ పప్పును ఎడాపెడా తినేయకూడదు. నియంత్రణ ఉండాలి. రోజుకు 5 నుంచి 10 వరకూ మాత్రమే జీడిపప్పులను తీసుకోవచ్చు. ఇదికూడా రెండు దఫాలుగా తింటే మంచిది.

  • నిద్ర లేవగానే కాఫీ లేదా టీ తాగే అలవాటు ఉన్న వారికి  ఇది మంచి వార్త. పొద్దునే  పాల ప్యాకెట్ల కోసం బయటికి వెళ్లకుండా ..  పాలవాడి కోసం  ఎదురుచూడాల్సిన అవసరం ఎంతమాత్రం లేకుండా కొత్త రకం క్యాప్సూల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి.  టీ, కాఫీ డికాక్షన్లలో కరిగిపోయి  వాటి అనుభూతిని అందించే పాల క్యాప్సుల్స్ ను  శాస్త్రవేత్తలు  కనుగొన్నారు.  పంచదార గుళికలను ఏ విధంగా మనం టీ, కాఫీల్లో కలుపుతామో అలాగే ఈ పాల క్యాప్సుల్స్‌ను కూడా వాటిలో కలుపుకోవచ్చు.   ఈ క్యాప్సుల్స్‌వల్ల పాల ప్యాకెట్ల వినియోగం తగ్గిపోతుందని చాల తేలిగ్గానే క్షణాల్లో ఈ పానీయాలను అందుబాటులోకి తెచ్చుకోవచ్చని అంటున్నారు . ఈ క్యాప్సుల్స్‌లో ఘనీభవింపచేసిన పాలు ఉంటాయి.  షుగర్ క్యాప్సుల్ మాదిరిగానే ఇవి పనిచేస్తాయని అంటున్నారు. కొంచెం వేడిగా ఉండే ఏ ద్రవరూపంలోనే ఈ క్యాప్సుల్స్ కరిగిపోతాయని జర్మనీలోని మార్టిన్ లూథర్ యూనివర్శిటీకి చెందిన శాస్తవ్రేత్త మార్తవెర్నల్ అంటున్నారు . ఈ పాల క్యాప్సుల్స్‌ను తయారు చేయడం కూడా చాలా తేలికని ముందుగా పాలు దానికి అవసరమైన చక్కెర పరిమాణాన్ని నిర్ధారించుకోవాలని వాటినొక పరికరంలో ఉంచాలని చెప్పారు . ఈ వేడి చేసిన పాలు ఘనీభవించిన తరువాత, స్పటికాల రూపంలో ఏర్పడుతుందని, పంచదార, పాల ద్రావకం అందులో నిక్షిప్తమై ఉంటుందని తెలిపారు. మరి కొద్దీ రోజుల్లో ఈ క్యాప్సూల్స్ అందుబాటులోకి వస్తాయి. మరి వీటికి ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి. గతం లో పాలపొడి అందుబాటులో కొచ్చింది. చిన్నపిల్లల పాల  కోసం  ఈ పొడిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాఫీ లేదా టీ తయారీకి అంతగా ఉపయోగించరు.
  • పులస పేరు వినగానే ఎవరికైనా నోరూరుతుంది. ఆ పులస చేపలు  ప్రపంచంల్లో ఎక్కడా లేని విధంగా గోదావరి ఆనకట్ట దిగున ప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి వీటికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. గోదావరిలో ఎర్ర నీరు ఉన్నడు మాత్రమే లభించే ఈ పలసల్ని వేటాడేందుకు మత్స్యకారులు పడే శ్రమ అంతాఇంతా కాదు. దూర ప్రాంతాలలోను, దేశవిదేశాల్లో ఉంటున్న బంధుమిత్రులకు, ఈ పులసకూరలోని  రుచి చూపించి అనంద పడుతుంటారు.  పులస శాస్త్రీయ నామం హిల్సా.  సముద్రంలో ఉన్నప్పుడు దీనిని ఇలస (విలస) అంటారు. గోదావరి ఎర్రనీరుకు ఎదురీదుతూ వచ్చినప్పుడు పులసగా మారుతుంది. దీని జన్మస్థానం గోదావరే. ఇక్కడ పుట్టిన పులస పిల్లలు ఆహారం కోసం బంగాళాఖాతంలోకి చేరి సముద్రంలోనే జీవిస్తాయి. బంగాళాఖాతం నుంచి హిందూ మహా సముద్రంలోకి చేరిన విలస ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ టాంజినాయా వంటి ప్రాంతాల్లో నివసిస్తుంది. వర్షాల సీజన్‌లో సంతానోత్పత్తి కోసం తిరిగి బంగాళాఖాతంలోకి వస్తుంది. నదీ, సముద్ర సంగమ ప్రాంతాల్లో సంతానోత్పత్తి కోసం ఎక్కువగా సంచరిస్తాయి. గోదావరికి వరద తాకగానే ఎర్రనీరుకు పులస ఎదురీదుతుంది. అలా ఎదురీదుతూ వచ్చే విలస... పులసగా మారుతోంది.   పశ్చిమగోదావరిజిల్లా నరసాపురం నుండి విశ్లేశ్వరం వరకు సంప్రదాయ వేట బొట్లు  తెల్లవారుజాము నుండి సందడి చేస్తుంటాయి. ఆ సందడుల్లో గాలిలో విచ్చుకుంటున్న వల కళ్ళు మూసి తెరిచేలోపే నీటిలోకి సర్రున దూసుకెళ్లి.. జలపుష్పాలల్లో రాజైన పులసల్ని బంధిస్తూ..మనకు చక్కటి పులసల్ని అందిస్తాయి.…అంతేకాక పులస పై సామెతలు కూడా బాగా వాడుకలో ఉన్నాయి.. పుస్తెలైనా అమ్మి పులసకూర తినాలన్న సామెత ఒకటి బాగా  ప్రాచుర్యంలో  ఉండటాన్ని గమనిస్తే..పులస కూర పై మనకున్న ఎనలేని అభిమానమనే చెప్పాలి.  ఇతర చేపల మాదిరిగా పులసకూర వండడం అంత సులువు కాదు..దీన్ని ప్రత్యేకమైన పొయ్యిలపై… వెన్న రాసిన మట్టి  కుండలో వండటం ఓ ప్రత్యేకత..ఇలా వండటం  వల్ల పులస ముక్కలో ఉన్న ముళ్లు కరిగి పోతాయి. తద్వారా పులస ముక్కను ఇట్టే తినేయచ్చు.. అయితే ఈ పులస కూరను ఈ రోజు వండి తిన్నదాని కంటే మరుసటి రోజు తింటే..చాలా రుచిగా ఉంటుంది.  అయితే..  దీనికి ఇంత రుచి ఉండటానికి కారణం…ఇలసగా పిలవబడే ఓ రకమైన చేప సముద్రంలో పెరుగుతుంది. ఈ చేప జూన్ మాసంలో కురిసే వర్షాల వల్ల.. గోదావరిలోకి ఎర్రనీరు చేరగానే..ఈ ఇలస.. గుడ్లు పెట్టడానికి ఉప్పనీటిలోంచి గోదావరి చప్పనీటికి ఎదురు ఈదుకుంటూ వచ్చే సందర్భంలో ఇలస శరీరంలో మార్పులు చోటుచేసుకొని..పులసగా మారుతుంది.. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, చించినాడ, సిద్ధాంతం, విశ్లేశ్వరం , తూర్పుగోదావరిజిల్లాలోని అంతర్వేది, రావులపాలెం ధవళేశ్వరం ప్రాంతాలలో మాత్రమే పులసల అమ్మకాలు ఎక్కువగా సాగుతాయి. ఈ  పులసలు సైజును బట్టి ఒక్కో చేప ధర రెండు వేల నుండి ఆరు వేలరూపాయల వరకు పలుకుతుంటాయి.  అయితే సముద్ర జలాల్లో కాలుష్యం పెరుగుతున్న కారణంగా  పులస చేపలు గతం లో మాదిరిగా దొరకడం లేదు. భవిష్యత్తులో పులస మరీ అరుదుగా దొరికే చేప గా మారే ప్రమాదం ఉంది. 
  • నీటి వినియోగం శరీరానికి చాలామంచిది . అయితే  నీరు అసలు ఏసమయం లో ఎక్కువ తాగాలి ? ఎప్పుడు తాగకూడడో తెలుసుకోవాలి.  కొన్ని అధ్యయనాల ప్రకారం  మంచినీళ్లను ఖాళీ క‌డుపుతో ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా తాగాల‌ట‌. అయితే.. ఖాళీ క‌డుపు ఎప్పుడుంటుంది? అంటే ఉదయాన్నే నిద్ర లేచినపుడు  క‌డుపు ఖాళీ గా ఉంటుంది. అప్పుడు ఎక్కువ‌గా నీళ్లు తాగ‌డం వ‌ల్ల అనేక ఫ‌లితాలు ఉంటాయట‌. క‌డుపు ఖాళీగా ఉన్న‌ప్పుడు జీర్ణాశ‌యానికి రెస్ట్ దొరుకుతుంది. ఆ స‌మ‌యంలో జీర్ణాశ‌యంలో ఎటువంటి ర‌సాలు విడుద‌ల కావు. ఆ స‌మ‌యంలో నీళ్లు ఎక్కువ మోతాదులో తాగ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యం మొత్తం శుభ్ర‌మ‌వ‌డ‌మే కాకుండా... ఆ నీళ్లు పేగుల‌ను కూడా క్లీన్ చేస్తాయ‌ట‌.  శరీర మెటబాలిక్ రేటు 24 శాతం పెరుగుతుంది. దీంతో క్యాలరీలు ఖర్చయ్యే రేటు పెరుగుతుంది. తద్వారా కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు.  శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. శరీరం అంతర్గతంగా శుభ్రంగా మారుతుంది.   జీర్ణ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం బాధించవు. ప్రధానంగా మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. విరేచనం సులభంగా అవుతుంది. ఆకలి పెరుగుతుంది. తలనొప్పి సమస్య నుంచి బయట పడవచ్చు.  ఇంకా  శరీరానికి అందే శక్తి పెరుగుతుంది. ఎర్ర రక్త కణాలు పెరిగి ఎక్కువ ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. కనుక శరీరానికి ఎక్కువగా శక్తి అందుతుంది.  చర్మం కాంతివంతంగా మారుతుంది. చర్మ సమస్యలు పోతాయి.  జీర్ణాశయం, పేగుల్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. మంచి బాక్టీరియా పెరుగుతుంది. అందుకే  పెద్దలు నిద్ర లేవగానే మంచి నీళ్లు తాగమంటారు.  ఇక‌... చాలా మంది అన్నం తినేట‌ప్పుడు, తినే ముందు కూడా నీళ్లు తాగుతారు. అయితే... ఏదైనా ఆహారం తీసుకోవ‌డానికి ఒక అర్ధ‌గంట‌ ముందు నీళ్లు అస్స‌లు తాగ‌కూడ‌ద‌ట‌. ఎందుకంటే ఆక‌లేసే స‌మ‌యంలో జీర్ణాశ‌యంలో జ‌ఠ‌ర‌ర‌సాలు విడుదల  అవుతాయి. అప్పుడు నీళ్లు తాగితే ఆ ర‌సాలు నీళ్ల‌తో క‌లిసి పోతాయి. దాంతో  అల్స‌ర్, గ్యాస్ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అందుకే.. అన్నం తిన‌డానికి అర్ధ‌గంట ముందు, అర్ధ‌గంట త‌ర్వాత, తినేట‌ప్పుడు కూడా నీళ్లు తాగ‌కూడ‌దంటారు పెద్ద‌లు.
  • ఇంతవరకు మనం సోలార్‌ లైట్లు, సోలార్‌ పంపుసెట్లు, సోలార్‌ వాహనాల గురించే విన్నాం. ఇపుడు    కొత్తగా  సోలార్‌ చికెన్‌ వెలుగులోకి వచ్చింది. థాయిలాండ్‌ లో సోలార్ పాపులర్ ఫుడ్ ఐటెం గా మారుతోంది .   ఎవరైనా చికెన్‌ను అగ్గి మీద కాలుస్తారు లేదా స్టవ్‌ మీద రెడీ చేస్తారు కానీ థాయిలాండ్‌లోని సిలా సుతారట్‌ అనే దుకాణాదారుడు మాత్రం  ఓవెన్‌ లేదా చార్‌కోల్‌ బార్బెక్యూ వాడేందుకు బదులుగా 1000 మొబైల్‌ మిర్రర్లను ఉపయోగించి  సూర్యుని నుంచి వచ్చే బలమైన కాంతిని ఆ అద్దాలపై పడేలా చేసి తద్వారా వచ్చే వేడితో చికెన్‌ను తయారు చేస్తున్నాడు. ఒకటిన్నర కేజీ  చికెన్‌ను 10–15 నిమిషాల్లో వండేస్తున్నాడు.  ఆ వేడిని తట్టుకునేందుకు ముఖానికి వెల్డింగ్‌ మాస్క్‌ను ధరిస్తాడు. మెల్లగా మెల్లగా ఇతగాడి బిజినెస్ పుంజుకుంటోంది. 
  • రాగులు తినండి …...వయసు తగ్గించుకోండి..రాగాలు తీయండి రుచులు మార్చుకున్నారు..డాలర్ల రేటు విపరీతంగా పెరిగింది అభిరుచులు మార్చుకున్నారు.అనారోగ్యానికి దగ్గరయ్యారు ఆఫీసులో కావచ్చు…వ్యాపార సంస్థల్లో కావచ్చు….లేదా టీవీ ముందు కావచ్చు. రోజుకు 14 గంటలపాటు కూర్చుని లేదా పడుకుని ఉంటున్నారు చాలామంది. అలాంటివారు గుండె జబ్బులు, ఇతర వ్యాధుల బారిన కూడా పడతారు. రాగులను రోజువారీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు. మిల్లెట్ అనే  యాంటీ ఆక్సిడెంట్లు  రాగుల్లోపుష్కలంగా ఉంటాయి. అందువల్ల యాంటీ  ఏజింగ్ కు చెక్ పెడుతుంది. వయసు మీద పడినట్లు కనిపించనివ్వదని వారు సూచిస్తున్నారు. రాగుల్లో అమినోయాసిడ్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. అందుకే అదనపు క్యాలరీలను గ్రహించకుండా దూరంగా ఉంచుతుంది. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇంకా రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగులు బలకర్ధకమైన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. అమితపుష్టిని కలిగిస్తుంది.  రాగిపిండితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.  జుట్టు ఎత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల బాగుంటుంది.నడి వయసు మహిళ్లో ఎముకల పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్ ను తాగడం మంచిది. సాధారణంగా రాగులతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని నేచురల్ గానే సడలించడంలో సహాయపడుతుంది. ఇది ఆందోళన,వ్యాకులత,నిద్రలేమి పరిస్థితులను దూరంచేస్తుంది. రాగి మైగ్రేన్  సమస్యను నివారించడం కోసం కూడా ఉపయోగపడుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. మధుమేహవ్యాధికి రాగులతో చేసిన ఆహారపదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం చక్కని ఔషధంగా పనిచేస్తుంది. రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది.  రాగుల పానీయం దప్పికను అరికడుతుంది. మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగి మాల్టును తాగడం మంచిది.  పాశం జగన్నాధం 
  • టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి విన్నాం..కానీ టెస్ట్ ట్యూబ్ చికెన్ ఏంటీ అనుకుంటున్నారా ?  మీరు చదివింది నిజమే.త్వరలో టెస్ట్ ట్యూబ్ చికెన్ .. ఫుడ్ మెనూలోకి చేరబోతోంది. పరిశోధకులు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. చికెన్ రెసిపీ నుంచి కణాలు తయారుచేసి టెస్ట్ ట్యూబ్ చికెన్ తయారుచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టెల్ అవివ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అమిత్ గెఫెన్ ఇప్పటికే లాబొరేటరీలో చికెన్ కణాలతో ఈ ప్రయోగం చేస్తున్నాడు. మోడ్రన్ అగ్రికల్చర్ ద్వారా ఈ చికెన్ సెల్స్‌తో దీన్ని తయారుచేసేందు కూడా ప్లాన్ చేస్తున్నారట. రాబోయే నాలుగు సంవత్సరాలలో ఈ తరహా చికెన్ సూపర్ మార్కెట్లలోకి వస్తుంది. మొత్తం మీద లెక్కకు మించి జనాభా  పెరిగిపోతున్ననేపథ్యంలో  నాన్ వెజ్  రుచుల అవసరాలు తీర్చాలంటే ఇక  టెస్ట్ ట్యూబ్  ఫుడ్డే దిక్కు. టెస్ట్  ట్యూబ్ హాంబర్గర్స్  వరల్డ్ మార్కెట్లో ఆదరణ పొందిన క్రమంలో చికెన్ కు కూడా ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.  ఒకసారి  టెస్ట్ ట్యూబ్ చికెన్ మార్కెట్లోకి  వచ్చిందంటే పౌల్ర్టీల దగ్గర,  చికెన్ షాపుల దగ్గర వెయిట్ చేసే  అవసరం ఉండబోదు.