Latest News
నేటి క‌బుర్లు
 • సౌత్ ఇండియా సూపర్‌స్టార్ రజనీ కాంత్ ఫ్రాడ్ మాస్టర్ అని  బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు.  రాజకీయాల్లోకి రజనీ ప్రవేశం ఖాయమని వార్తలు వస్తోన్న నేపథ్యంలో  ఆయనపై సుబ్రహ్మణ్య స్వామి మాటల దాడి పెంచారు. ఒక వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమని, రాజకీయాల్లోకి రజనీలాంటి మంచి వ్యక్తులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని  ఇటీవల స్వాగతించిన క్రమంలో  స్వామి  అలాంటి వ్యాఖ్యలు  చేశారు.   అధ్యక్షుడు ఒక రకం గా ...  నేత ఒకరకం మాట్లాడితే కార్యకర్తలు కన్ఫ్యూషన్ లో పడతారు. కానీ స్వామి సంగతి తెలుసు కాబట్టి ఎవరూ ఆయన మాటలకూ విలువ ఇవ్వరు.   రజనీకాంత్ ఓ నిరక్షరాస్యుడని, తమిళులు బాగా చదువుకున్న వారని, అందువల్ల రజనీ రాజకీయాలకు అస్సలు పనికి రారని ఇప్పటికే విమర్శలు చేసిన స్వామి తాజాగా ఆయనపై కొత్త విమర్శలు సంధించారు. రజినీకాంత్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావద్దని సూచించారు. ఒక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వామి మాట్లాడుతూ, రాజకీయాల్లోకి రావాలన్న రజనీ ఆకాంక్షలకు ఆయన పాల్పడిన ఆర్థిక అవకతవకలు అడ్డుపడతాయన్నారు. ఆ వివరాలు బయటకు వస్తే రజనీ రాజకీయాల్లోకి కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు . వివరాలు బయట పెడితే  ఆయన ఇమేజ్ పూర్తిగా కుప్పకూలిపోతుందని చెప్పారు. 'మీరు రాజకీయాల్లోకి రాకండి' అని రజనీకాంత్‌కు స్వామి హితవు పలికారు. మరి  ఈ హితవును రజనీ కేర్ చేస్తారో లేదో వేచి చూడాలి. ఒకటైతే నిజం .....  చాలామంది ప్రముఖులను కోర్టు కీడ్చిన ఖ్యాతి స్వామిది. ...
 • ఎంతో మందిని తన తీర్పుతో  జైలుకి పంపిన ఆయనే  స్వయంగా  జైలులో అడుగుపెట్టాల్సివచ్చింది. ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు . ఆయన ఎవరో కాదు  సుప్రీంకోర్టు తీర్పునే ధిక్కరించి అజ్ఞాతంలోనే రిటైరైన వివాదాస్పద కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి సి.సి.కర్ణన్. అజ్ఞాతంలో ఉన్న కర్ణన్  పోలీసులకు చిక్కి... కలకత్తా లోని ప్రెసిడెన్సీ జైలులో అడుగుపెట్టాల్సి వచ్చింది.  సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే అరెస్టు వారెంట్లు, శిక్షలు వేస్తూ తీర్పులిచ్చి, అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి గురైన ఆయన కోల్‌కతా జైలులోకి అడుగుపెట్టినప్పుడు మాత్రం తీవ్ర  భావోద్వోగానికి లోనయ్యారు.    తమాయించుకోలేక కంట తడి పెట్టారు. ఊహించని ఈ పరిణామానికి అధికారులు కూడా  కరిగిపోయారు . చివరకు వారే ఆయనకు స్వాంతన పలికారు. మెల్లగా నచ్చ చెప్పారు.   ఇదే జైలులో నాటి స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్,  అరబిందో ఉన్నారని వివరిస్తూ  అప్పట్లో వారున్న జైలు గదులు చూపించారు. ఆ మహనీయుల పోరాట స్ఫూర్తిని కథలు కథలుగా కర్ణన్‌కు వినిపించారు. ఇవన్నీ విన్నాక కర్ణన్  మళ్ళీ మామూలు మనిషి అయ్యారు. ఆ తర్వాత అధికారులు  'కర్ణన్‌ను చూడగానే వార్తల్లో తాము చూసిన వ్యక్తిలా కనిపించలేదు. ఆయన కన్నీటిపర్వంతమయ్యారు. అది చూసి మేము ఆశ్చర్యపోయాం. తాను జైలులో ఉన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అనిపించింది' అని వివరించారు.  జైలులోని కొందరు ఖైదీలు కూడా కర్ణన్‌ను చూసేందుకు పోటీపడ్డారు. 'తన తీర్పుల ద్వారా ఎందరో నేరస్థులను జైలుకు పంపించిన కర్ణన్‌ను చూసేందుకు ఖైదీలు పోటీపడ్డారు. బహుశా అదే కర్ణన్‌పై ఒత్తిడి పెంచి ఉద్వేగానికి దారితీసి ఉండొచ్చు' అని జైలు అధికారి ఒకరు అన్నారు . . దీంతో సుభాష్, అరబిందోలు ఇక్కడ గడిపిన విషయాన్ని వివరించడం ద్వారా కర్ణన్‌కు కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.  పాపం కర్ణన్ ... కొంచెం లౌక్యంగా వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి తప్పేది. ...
 • ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా  విశాఖ ధర్నాకు హాజరు కాకపోవడం పై  పలు కథనాలు ప్రచారంలో కొచ్చాయి.  జగన్  రోజాకు వార్నింగ్ ఇచ్చారని కూడా చెప్పుకుంటున్నారు . అయితే ఆరోగ్యం బాగాలేకనే  రోజా ధర్నాకు రాలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా ఇటీవల రోజా  వివాదాస్పద వ్యాఖ్యల పై పార్టీ నేతలే  జగన్ కు ఫిర్యాదులు  చేశారట. రోజా వల్ల పార్టీ కి డామేజ్ జరుగుతోందని ... ఆమెను కంట్రోల్ లో పెట్టాలని చెప్పారట . ఈ క్రమం లో జగన్ రోజాని పిలిపించి మందలించినట్లు సమాచారం. అప్పటినుంచి రోజా కూడా కొంత దూకుడు తగ్గించింది.  రోజాని జగన్ మందలించడం ఇది మొదటి సారి కాకపోయినా ఈ సారి మాత్రం తీరు మార్చుకోక పోతే వేటు తప్పదని చెప్పినట్లు సమాచారం. మీడియాలో హైలెట్ అవడానికే రోజా అలా ప్రవర్తిస్తుంది అనే ఆరోపణలు కూడా లేకపోలేదు. కాగా కొన్ని సర్వే రిపోర్టులు కూడా రోజాకు వ్యతిరేకంగా రావడంతో  జగన్ గట్టిగా  ప్రశ్నించినట్లు సమాచారం. రోజా స్పీడ్ కి బ్రేకు వేయాలన్న జగన్ ప్రయత్నం ఎంత వరకు ఫలిస్తుందో  చూడాలి…ఈ నేపథ్యంలో రోజా పార్టీ మారుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. పవన్ పార్టీ లోకి వెళ్ళవచ్చు అని కూడా అంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ...
 • రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌  గెలిచే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్డీయే కూటమికి సొంతంగా ఉన్న బలానికి తోడు.. తమ అభ్యర్థిని గెలిపించుకోడానికి ఇక కేవలం 1.7 శాతం ఓట్లు వస్తే చాలు. ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేయడానికి అనేక తటస్థ పార్టీలు ముందు  కొస్తున్నాయి. దాంతో కోవింద్‌ గెలుపు దాదాపుగా ఖాయమని చెప్పుకోవచ్చు. . ఇప్పటివరకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిలో ఉన్న పలు పార్టీలు కూడా ఎన్డీయే అభ్యర్థికి మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీయూ కీలక నేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఇప్పటికే పరోక్షంగా మద్దతు ఇస్తామన్న సంకేతాలిచ్చారు. బీజేడీ లాంటి పార్టీల నుంచి కూడా మద్దతు లభించే అవకాశం కనిపిస్తోంది. అయితే శివసేన మద్దతు ఖారారు కాలేదు.  తెలుగు రాష్ట్రాల్లో  తెలుగు దేశం , టీ ఆర్ ఎస్ , వైసీపీ  వంటి పార్టీలు కూడా  కోవింద్ కు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఆయన గెలుపు ఖాయమని  విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, మహిళల హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న 71 ఏళ్ల రామ్‌నాథ్‌ కోవింద్‌ యూపీలోని కాన్పూర్‌ దెహత జిల్లా పారౌంఖ్‌ గ్రామంలో 1945 అక్టోబర్‌ 1న జన్మించారు. యూపీలోని దళిత వర్గం, కోలి కులానికి చెందిన ఆయన తండ్రి వ్యవసాయదారుడు. కాన్పూర్‌ విశ్వ విద్యాలయం నుంచి బీకాం, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. ఆ తరువాత సివిల్స్‌ రాసి విజయం సాధించినా, దాన్ని కాదనుకుని న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. 1971 నుంచి 1975 వరకు అఖిల భారత కోలి సమాజ్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.1971లో న్యాయవాదిగా జీవితం ప్రారంభించిన ఆయన సుదీర్ఘకాలం పాటు కీలక పదవుల్లో సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా 1977 నుంచి రెండేళ్ల పాటు కొనసాగారు. 1978లోనే సుప్రీంకోర్టులో అడ్వొకేట్‌ ఆన్  రికార్డ్స్‌గా ఉన్నారు. 1977 నుంచి రెండేళ్లపాటు ప్రధాన మంత్రి మోరార్జీ దేశాయ్‌ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. తర్వాత బీజేపీలో దళితుల హక్కుల కోసం పోరాడుతూ అంచెలంచెలుగా ఎదిగారు. 1994లో కోవింద్‌ యూపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1997లో ఆయనకు బీజేపీ జాతీయ కార్యవర్గంలో స్థానం లభించింది. 1998 నుంచి నాలుగేళ్ల పాటు పార్టీ దళిత మోర్చా అధ్యక్షునిగా పనిచేశారు.ఆగస్టు 8, 2015న బిహార్‌ గవర్నర్‌గా నియమితులు కావడంతో ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇక.. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే రామ్‌నాథ్‌ కోవింద్‌కు 1974లో సవితతో వివాహమైంది. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు....
 • తమిళనాడు రైతులను అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు  సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.   చెన్నైలో ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.అయ్యకన్నుతో పాటు పదహారు మంది రైతులను రజనీ కలుసుకున్నారు.అయ్యకన్ను ఆధ్వర్యంలోనే దిల్లీలో రైతులు ఆందోళన చేపట్టారు.  రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి రజనీకాంత్‌ అడిగి తెలుసుకున్నారు. తమిళ రైతులను ఆదుకుంటానని చెబుతూ వారికి కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పారు.  దాదాపు రెండున్నర నెలలకు పైగా తమిళ రైతులు దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద నిరసన చేపట్టారు. రైతుల రుణాలను రద్దు చేయాలని, కరవు సాయం అందించాలని డిమాండ్‌ చేస్తూ వినూత్నంగా ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రైతుల ఆందోళనను ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకెళ్తానని సీఎం పళనిస్వామి హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళనను విరమించారు. కానీ సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. మళ్ళీ రైతులు ఉద్యమ బాట పట్టాలని యోచిస్తున్నారు. మహారాష్ట్ర , మధ్యప్రదేశ్, హర్యానా రైతుల  మాదిరిగా పోరాటం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ...
 • ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు పోటీ చేసేది ఇంకా ఖరారు కాలేదు. తొలుత రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తిని రాష్ట్రపతిగా  చేయాలని మోడీ  భావిస్తున్నారని ప్రచారం జరిగినప్పటికీ ... ఇపుడు పార్టీ లో వ్యక్తిని బరిలోకి దించే యత్నాలు జరుగుతున్నాయి.  2002లో వాజపేయి చేసిన ప్రయోగాన్ని మోడీ  చేయదల్చుకోలేదని  అంటున్నారు.అప్పట్లోవాజ్ పేయి  అబ్దుల్ కలాం ను తెరపైకి తెచ్చారు. కానీ ఇపుడు మోడీ అలాంటి  ప్రయోగాల పట్ల అంత సుముఖంగా లేరని చెబుతున్నారు.  బీజేపీ నేతల నుంచి ఎంపిక చేసేటట్లయితే సీనియర్‌ నాయకులు ఎల్‌కే ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, ద్రౌపది ముర్ము, మురళీ మనోహర్‌ జోషి, సుష్మా స్వరాజ్‌ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఆడ్వాణీ, జోషి బాబ్రీమసీదు కూల్చివేతలో అభియోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారిని ఎంపిక చేయకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. సుష్మా తాను రాష్ట్రపతి అభ్యర్థిని కాబోనని తేల్చి చెప్పారు. అంతకు ముందు వెంకయ్య పేరు కూడాప్రచారం లోకొచ్చింది.     ‘పార్లమెంటులో ఉన్న మెత్తం 776 మంది ఎంపీల్లో ఎన్‌డీఏ కూటమికి 400 మందికి పైగా ఎంపీలున్నారు. కొన్ని ఎన్‌డీయేతర పార్టీలు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటప్పుడు బయటి వ్యక్తిని ఎందుకు పోటీలో పెడతాం?’ అని పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు . స్పష్టమైన మెజారిటీ ఉన్నందున తమకు ఆమోదయోగ్యమైన వ్యక్తిని నిలబెట్టాలని బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నారు ?  ప్రతిపక్షాలు ఎలాగూ వారి అభ్యర్థిని పోటీలో దించే అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోంది. కాబట్టి బయటి వ్యక్తులకు  అవకాశం ఇవ్వకుండా సొంత అభ్యర్థినే బరిలోకి దించే వ్యూహంతో పావులు కదుపుతున్నారు.  ఇక ప్రతిపక్షాలు కూడా అభ్యర్థి వేటలో పడ్డాయి. ప్రతిపక్షంది నామమాత్రపు పోటీయే. ...
 • కొత్తగా బ్యాంకు ఖాతా తెరిచేందుకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆధార్‌ అనుసంధానం లేని బ్యాంకు ఖాతాలు చెల్లవని ప్రకటించింది. రూ.50 వేలకు పైగా జరిపే లావాదేవీలకు ఆధార్‌ తప్పనిసరి అని  స్పష్టం చేసింది. ఇప్పటికే ఖాతాలు కలిగిన వారు డిసెంబర్‌ 31లోగా ఆధార్‌ను లింక్‌ చేసుకోవాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. లేనిపక్షంలో ఆ ఖాతాలు చెల్లనవిగా మారతాయని హెచ్చరించింది. ఈ మేరకు ఖాతాదారులకు అవగాహన కల్పించాలని బ్యాంకులకు సూచించింది. ఈ కొత్త నిబంధన కంపెనీలతో పాటు భాగస్వామ్య సంస్థలకు కూడా వర్తిస్తుందని పేర్కొంది. కాగా ఇప్పటికే పాన్‌కార్డుకు ఆధార్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. పాన్‌ కార్డుకు, ఐటి రిటర్న్స్‌కు ఆధార్‌ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీంకోర్టు పలుసార్లు విచారించిన అనంతరం గతవారమే దీన్ని సమర్థిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఎవరైతే ఆధార్ నంబర్ ను  కలిగి ఉంటారో, వారు పాన్‌ కార్డుకు దాన్ని లింక్‌ చేసుకోవాలని పేర్కొంది. అయితే ఆధార్‌ కార్డు లేనివారి విషయంలో దీన్ని పట్టుబట్టరాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ అంశం ఒక కొలిక్కి రాకముందే కేంద్రం బ్యాంకు బ్యాంకు ఖాతాలకు అధార్‌ను తప్పనిసరి చేయడం గమనార్హం. అన్నింటికీ ఆధార్ ను  తప్పనిసరి చేస్తున్న కేంద్రప్రభుత్వ తీరుపై  పశ్చిమ బెంగాల్‌ సీఎం  మమతా బెనర్జీ మండిపడ్డారు.   బ్యాంకు అకౌంట్ తెరవడానికి ఆధార్ తప్పనిసరి చేస్తే ఇబ్బందిపడేది నిరుపేద, అట్టడుగు వర్గాలవారే అని ట్విట్టర్లో పేర్కొన్నారు. వందశాతం ప్రజలకు ఆధార్ అందుబాటులో లేనిదే, బ్యాంకు ఖాతాలకు ఆధార్  తప్పని సరి ఎలా చేస్తారని నిప్పులు చెరిగారు.  ఈ నిర్ణయంతో ప్రజల వ్యక్తిగత సమాచారం గోప్యతకు సంబంధించి  సమస్యలు ఎదురవుతాయని అన్నారు....
 • కొంత కాలంగా మౌనంగా ఉన్న జయలలిత మేనకోడలు సంచలన ఆరోపణలు చేసి మళ్ళీ వార్తల్లోకెక్కారు . మేనత్త జయలలితను శశికళ, తన సోదరుడు దీపక్‌లు కలిసి కుట్రపన్ని చంపేశారనీ  దీపా జయకుమార్ అన్నారు. దీపక్‌ను తక్షణం అరెస్టు చేసి విచారణచల్ జరపాలని దీప డిమాండ్ చేశారు.  ఆదివారం ఉదయం పోయిస్ గార్డెన్‌లోకి కెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు . వేదనిలయం పై హక్కులు తనవేనని అంటోన్న దీప, తన మద్దతుదారులతో కలసి లోపలి కెళ్లేందుకు  ప్రయత్నించారు. ఈ సందర్భంగా దీపకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఇంటిపై మరెవరికీ హక్కులు లేవని, ఇది తమకు వారసత్వంగా వచ్చిన భవంతి అని దీప వాదనకు దిగారు . కాసేపు అక్కడే నిరసన వ్యక్తం చేశారు . దీప మద్దతుదారుల హడావుడితో వేదనిలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.  తన మేనత్త నివాసమైన పోయెస్ గార్డెన్‌లోకి వెళ్లకుండా అడ్డుకుని తమను అవమానించారని మండిపడ్డారు. శశికళ కుటుంబం నుంచి అన్నాడీఎంకేను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. తనపై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపించారు. ఈ విషయంపై ప్రధాని మోదీకి పిర్యాదు చేస్తామని ఆమె అన్నారు. దీప చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో దుమారం సృష్టిస్తున్నాయి....
 • రావణుడు భవతీ భిక్షాందేహీ అన్నాడు……  సీత అమాయకంగా గీత దాటింది…..  ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. కానీ ఆధునిక యుగంలో అక్కడెక్కడి నుంచో రావణాసురుడు వచ్చాడు. “భవతి అమ్మాయి దేహీ”అన్నాడు. ఆ అమ్మాయి గీత దాటింది. వాడి చేతుల్లోని ఏకే 47ని లాక్కుంది. వాడిని కాల్చి పారేసింది. “డామిట్ కథ అడ్డం తిరిగింది,” అనుకుంటూ కుప్పకూలిపోయాడు వాడు. ఆ రావణుడి పేరు అబూ ఒసామా. కరడు గట్టిన పాకిస్తానీ ఉగ్రవాది. ఆ అమ్మాయి పేరు రుక్సానా కౌసర్. జమ్మూ కశ్మీర్ లో నియంత్రణ రేఖకి కేవలం 30 కిమీ దూరంలో రాజౌరీ జిల్లా ఠాణా మండీలోని అప్పర్ కైసీ దగ్గర ఉన్న శాహ్ దరా షరీఫ్ ఆమె ఊరు. అది విజయదశమి రోజు. దేశం యావత్తూ రుక్సానా ను దుర్గాదేవి అని వేనోళ్ల పొగిడింది. విజయదశమి రోజు చచ్చిన అబూ ఒసామా ఓ ముష్కర మహిషాసురుడు. రుక్సానా పదోతరగతి చదువుతూ ఆపేసింది. పేదరికం ఆమెను వెన్నాడుతోంది. ఆమె గుజ్జర్ తెగకు చెందిన మహిళ. జమ్మూకశ్మీర్ లో గుజ్జర్, బకర్వాల్ ల వంటి ముస్లింలను వేర్పాటువాదం పేరిట సకల సదుపాయాలను అనుభవిస్తున్న కశ్మీరీ ముస్లింలు పట్టించుకోరు. వారి బాగోగులను చూడరు. అందుకే కటిక పేదరికం గుజ్జర్ కుటుంబాలకు తప్పనిసరి తోడులా వెంట ఉంటుంది. పాకిస్తాన్ నుంచి సరిహద్దు నియంత్రణ రేఖ దగ్గర ఉన్న ఇళ్లు కాబట్టి ఉగ్రవాదులు యథేచ్ఛగా అర్ధరాత్రి అపరాత్రి తలుపు తట్టుతారు. ఆకలేసింది అన్నం పెట్టమంటారు. అలిసొచ్చాం… ఆయిల్ పెట్టమంటారు. మూడొస్తే ముద్దులూ పెట్టమంటారు. ముస్లిం గుజ్జర్లకు ఉగ్రవాది అంటే భయం లేకపోయినా, వాడి చేతుల్లోని ఏకె 47 అంటే భయం. భయం భయంగా వారిని మెహమాన్ ముజాహిద్ (అతిథి ఉగ్రవాది) అని పిలుస్తారు.  అలా ఒక రాత్రి వచ్చాడు అబూ ఉసామా. అన్నంతిన్నాడు. అమ్మాయి కావాలన్నాడు. తండ్రి నూర్ హుస్సేన్, తల్లి రషీదా బేగమ్, అన్న ఐజాజ్, మేనమామ వకాలత్ హుసేన్, అత్త కుల్సుమ్ పరీ చూస్తూండగానే రుక్సానాను ఎత్తుకెళ్లిపోయాడు. నాలుగైదు రోజుల తరువాత ఇంటికి పంపించేశాడు. అది జరిగి రెండు నెలలు కూడా కాలేదు. అబూ ఒసామా మళ్లీ వచ్చాడు. తోడుగా ఇంకో ఉగ్రవాది. తలుపు తీయకపోతే పక్కింట్లోని వకాలత్ హుస్సేన్, కుల్సుమ్ పరీలను తుపాకీ చూపి బెదిరించి, తలుపు తట్టించి, తెరిపించారు. అది సెప్టెంబర్ 27, 2009. రుక్సానా గజగజ వణికిపోయింది. తల్లి దండ్రులు రుక్సానాను మంచం కింద దాచారు. అబూ ఒసామా ఆకలి వేరు. అది అన్నంతో తీరేదికాదు. ఆగ్రహంతో రూర్ హుస్సన్, రషీదా బేగం లను చితకబాదనారంభించాడు. వారి ఆర్తనాదాలతో గది కంపించింది. రుక్సానా ఉండబట్టలేకపోయింది. మంచం కింద గొడ్డలి కనిపించింది. దాన్ని తీసుకుని బయటకు వచ్చింది. ఏంజరిగిందో అర్థమయ్యేలోగా అబూ ఒసామాపై లంఘించి దాడి చేసింది. నివ్వెరపోయిన వాడు తేరుకునేలోగా వాడి ఏ కె 47ను లాక్కుంది. గుళ్ల వర్షం కురిపించింది. అబూ ఒసామా రక్తం ముద్దై పడి చచ్చాడు. తోడుగా వచ్చిన రెండో ఉగ్రవాది ఒళ్లు జల్లెడలా మారిపోయింది. వాడు కుప్పకూలాడు. తల్లి తండ్రి, మామ అత్త, తమ్ముడు ఐజాజ్ మిగిలిన వారిపై దాడి చేశారు. అంతే వాళ్లు కాలికి బుద్ధి చెప్పి పరుగులు తీశారు. రుక్సానా అంతకుముందు తుపాకీ ముట్టుకోలేదు. ఆ శక్తి ఎక్కడినుంచి వచ్చిందో తెలియలేదు. ఈ వార్త వానలా, వరదలా, పెను ఉప్పెనలా వ్యాపించింది. ఊరు ఊరంతా బకాసురుడు చచ్చిన తరువాతి ఏకచక్రపురంలా సంబరాలు చేసుకుంది. రుక్సానా కౌసర్ కు దేశం నీరాజనాలు పట్టింది. ఆలిండియా యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ అధినేత మణీందర్ జీత్ సింగ్ బిట్టా ఆమెకు లక్ష రూపాయల బహుమతి ఇచ్చారు. దేశంలో వివిధ స్థానాల్లో ఆమెకు సన్మానాలు జరిగాయి. కానీ అప్పటి జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఆమెకు కేవలం అయిదువేలిచ్చి చేతులు దులుపుకుంది. రుక్సానా ఇప్పుడు వివాహం చేసుకుంది. భర్త కబీర్ హుసేన్ తో కలిసి, రాజౌరీలోనే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తోంది. --------- రాకా సుధాకర్...
 • మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్  ఇవాళ్టి నుంచి నిరవధిక  నిరాహారదీక్ష చేయనున్నారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేవరకు దీక్ష చేస్తానని  ప్ర‌క‌ట‌న చేశారు. భోపాల్‌లోని దసరా మైదానంలో త‌న‌ దీక్షను ప్రారంభించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. ప్రజ‌లు త‌మ సమ‌స్య‌ల‌పై అక్కడే  త‌న‌తో చ‌ర్చించ‌వ‌చ్చ‌ని చెప్పారు.  కొద్దీ రోజుల క్రితం మంద్‌సౌర్‌లో రైతులు ఆందోళ‌న చేసిన క్రమంలో వారిపై పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. దీంతో ఆ రాష్ట్రంలో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డి మంద్‌సౌర్‌లో క‌ర్ఫ్యూ కూడా విధించాల్సి వ‌చ్చింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా వచ్చి నిరసన వ్యక్తం చేసి వెళ్లారు. రైతులు ఆందోళన విడనాడకపోవడం తో సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. వ‌చ్చే ఏడాదే ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో అక్క‌డ అధికారంలో ఉన్న బీజేపీ ఇరకాటం లో పడింది . ప్రభుత్వ వైఫల్యం  కప్పి పుచ్చడానికే   శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ దీక్ష కు దిగుతున్నారని  విపక్షాలు విమర్శిస్తున్నాయి. రైతు సమస్యలు పరిష్కరించేందుకు ... రైతులతో మాట్లాడేందుకు గట్టి ప్రయత్నాలు చేయకుండా  దీక్ష కు దిగడాన్ని తప్పుబడుతున్నాయి . ...
 • తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి.   జైలు నుంచి విడుదలైన శశికళ అక్క కొడుకు దినకరన్‌ మళ్లీ చక్రం తిప్పుతున్నారు. సీఎం ఎడపాడి పళనిస్వామి వర్గం అధికారిక అన్నాడీఎంకే నుంచి  తనను దూరం పెట్టే యత్నాలను  తిప్పికొడుతూఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుంటున్నారు .ప్రస్తుతం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు  దినకరన్‌కు మద్దతు పలుకుతూ  ఆయన సరసన చేరుతున్నారు .  మొన్నటివరకు  దినకరన్‌కు మొత్తం 24మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో పళని స్వామి  వర్గంలో ఉన్న 123 మంది ఎమ్మెల్యేల్లో 24మంది జారుకున్నట్టు అయింది. ఈ పరిణామాలతో పళని స్వామి సర్కార్  ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయని  విపక్షాలు అంచనాలు వేస్తున్నాయి.   అన్నాడీఎంకే అధికారిక గుర్తు ‘రెండాకుల’ కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్ళిన  దినకరన్‌ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం  ఆయన బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న శశికళను కలిశారు. అప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలికారు. శశికళ సూచనలతో దినకరన్ చక చకా పావులు కదుపుతున్నారు .దీంతో  24మంది ఎమ్మెల్యేలు ఆయన గూటికి చేరారు.  దీంతో స్వరం పెంచిన దినకరన్‌ ఇప్పటికే పార్టీ అధినేత్రి శశికళేనని, ఆమె గైర్హాజరీలో పార్టీ డిప్యూటీ జనరల్‌ సెక్రటరీగా తానే పార్టీని నడుపుతానని ప్రకటించారు .ఎమ్మెల్యేల ఫిరాయింపుతో  సీఎం పళని  వర్గంలో   కలవరం మొదలైంది. మరికొందరు  ఎమ్మెల్యేలు జారుకుంటే అన్నాడీఎంకే పూర్తిగా దినకరన్‌ చేతుల్లోకి వెళ్లే అవకాశముంది. మరో ఆరుగురు నేడో రేపో దినకరన్ వైపు వెళ్లొచ్చు అంటున్నారు. అదే జరిగితే పళని సర్కార్ కుప్ప కూలడం ఖాయం. ...
 • బుల్లెట్  నుంచి బ్యాలెట్ మార్గం పట్టిన  ప్రజా గాయకుడు గద్దర్ రెండేళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో 'కింగ్' తానేనని అన్నారు . మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, పార్టీ నుంచి తప్పుకున్నానే తప్ప, జెండాను కిందపడవేయకుండా ఓట్ల విప్లవం వైపు పయనిస్తున్నానని చెప్పారు . ఇప్పుడు వచ్చింది  భౌగోళిక తెలంగాణ మాత్రమేనని, త్యాగాల తెలంగాణ ఎంతమాత్రమూ కాదని అభిప్రాయపడ్డారు. కేవలం పాలకులు మారారే తప్ప ప్రజల జీవితాలు మారలేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు పొత్తులు ఉంటాయని, బడుగు, బలహీన వర్గాల ప్రజలు రాజకీయ చైతన్యంతో ఆలోచించి ఓట్లు వేయాలని గద్దర్ కోరారు. తన లక్ష్యం నెరవేరేంత వరకూ పోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు. తెలంగాణలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను రద్దు చేయడం పాలకుల అసమర్థతకు నిదర్శనమని దుయ్యబట్టారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయమున్ననేపథ్యంలో  రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అధికార పక్షం  తమ పట్టు నిలుపుకునేందుకు ప్రణాళికలు రచిస్తుంటే.. ఎలాగైనా సత్తా చాటాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయి. అదే సమయంలో గద్దర్ పార్టీ  , జనసేన వంటి  పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నాయి. ...
 • పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రకృతి సహజంగా జరిగే అంశాలను కూడా సవాల్ చేసే విధంగా వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ కోవలోనే  మరణించిన వారిని మళ్ళీ బతికించే ప్రయోగాలకు  బయోక్వార్క్‌ అనే సంస్థ శ్రీకారం చుట్టింది. ఈ సంస్థ  ఫిలడెల్ఫియా కేంద్రంగా పని చేస్తున్నది. చావుకు ఎందుకు అతీతంగా ఉండాలని అనుకుందో ఏమో ఈ సంస్థ చనిపోయిన వాళ్లను మళ్లీ బతికిస్తామని ప్రక టించింది. ఇది కూడా ఎప్పుడో భవిష్యత్తులో కాదు. ఏడాది లోగానే  ఈ ప్రయోగం పూర్తవుతుందని చెబుతోంది. వైద్య శాస్త్రం ప్రకారం .. గుండె కొట్టుకోవడం మొదలుకుని మెదడు పనిచేయడం వరకూ అన్ని రకాల జీవక్రియలు ఆగిపోవడాన్ని మరణం అంటారు. కొన్ని దేశాల్లో మిగిలిన అవయవాల మాట ఎలా ఉన్నప్పటికీ మెదడు పనిచేయడం పూర్తిగా నిలిచిపోవడాన్నే చావు అని నిర్ణయిస్తారు.  ఇలా బ్రెయిన్‌డెడ్‌కు గురైన వారిని మళ్లీ బతికేంచేందుకు ఓ వినూత్న పద్ధతిని ఆవిష్కరించామని అంటోంది బయోక్వార్క్ సంస్థ.  ఒక  వ్యక్తిపై 6 నెలల్లో ఈ ప్రయోగం జరుగుతుందని బయోక్వార్క్‌ సీఈవో ఇరా పాస్టర్‌ అంటున్నారు. సాధారణ ప్రయోగాల మాదిరిగా జంతువులపై ప్రయోగాలేవీ జరపకుండా నేరుగా మానవులపైనే ఈ ప్రయోగం జరగనుండటం విశేషం. బ్రెయిన్‌ డెడ్‌కు గురైన వారిని మళ్లీ బతికేలా చేసేందుకు బయోక్వార్క్‌ చేస్తున్న ప్రయోగంలో మూలకణాలదే కీలకపాత్ర. రక్తం నుంచి సేకరించిన మూలకణాలను మరణించిన వ్యక్తి శరీరంలోకి మళ్లీ జొప్పిస్తారు . అలాగే  రెండో దశలో ఆ వ్యక్తి వెన్నెముకలోకి రకరకాల పెప్‌టైడ్లను ఎక్కిస్తారు. ఎంఆర్‌ఐ స్కాన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మీడియన్‌ నాడిని లేజర్‌ కిరణాల సాయంతో ఉత్తేజపరుస్తారు. ఇలా 15 రోజులపాటు చేస్తే  వ్యక్తి మెదడు మళ్లీ పనిచేయడం మొదలవుతుందని బయోక్వార్క్‌ అంచనా. కాగాబ్రెయిన్‌డెడ్‌ వ్యక్తులను మళ్లీ బతికిస్తామన్న బయోక్వార్క్‌ ప్రయత్నానికి హిమాన్షు బన్సల్‌ అనే భారతీయ వైద్యుడు సహకారమందిస్తున్నాడు. గత ఏడాది మేలో హిమాన్షు భారత్‌లోని ఉత్తరాఖండ్‌లోనే ఈ ప్రయోగాలు నిర్వహించాలని అనుకున్నారు. ప్రమాదాల్లో బ్రెయిన్‌డెడ్‌ అయిన 20 మందిపై ప్రయోగాలు చేస్తామని, అనుమతివ్వమని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌)కు దరఖాస్తు చేశారు కూడా. అయితే ఈ విజ్ఞప్తిని ఐసీఎంఆర్‌ నవంబర్‌లో తోసిపుచ్చింది. హిమాన్షు ప్రయోగాలకు అవసరమైన పెప్‌టైడ్లను సరఫరా చేసేందుకు అప్పట్లో బయోక్వార్క్‌ ముందుకు వచ్చింది .  ఇక ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే.. ఈ ప్రయోగం పూర్తిస్థాయిలో విజయవంతమైనప్పటికీ ఆ వ్యక్తి పూర్తిగా కోలుకోలేడు. కాకపోతే కళ్లు కదపడం.. లాంటి చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలడు.  ఈ ప్రయత్నం విజయవంతం అయితే మరి  కొన్ని ప్రయోగాలు కూడా జరగవచ్చు ఏమో ?...
 • రోడ్డు మీద వెళ్తున్న ఓ కారులోకి గుర్రం దూసుకెళ్లింది.  ఈ తమాషా ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఆదివారం వింత ఘటన జరిగింది.  ఎండవేడిమికి తాళలేకపోయిన గుర్రం వాహనం హారన్‌తో బెదిరిపోయింది . వేగంగా దౌడు తీసి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. అద్దం గుండా లోనికి దూసుకెళ్లింది. అంతా రెప్ప పాటు లో జరిగింది .డ్రైవర్ వెంటనే కారు ఆపివేసాడు. రోడ్డు మీద వెళ్తుతున్న జనం , పోలీసులకు తెలియజేశారు. అధికారులు చేరుకుని సహాయచర్యలు చేపట్టేవరకు  కారులో డ్రైవర్‌తోపాటు గుర్రం చిక్కుకొని ఉంది పోయారు . డ్రైవర్‌కు, గుర్రానికి స్వల్ప గాయాలయ్యాయి...
 • ప్రముఖ దర్శకుడు, మాజీ కేంద్రమంత్రి  దాసరి నారాయణ రావు మరణంపై  అయన పెద్ద కోడలు  సుశీల అనుమానాలు వ్యక్తం చేశారు.   గత కొద్దీ నెలలుగా  నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ దాసరి  తుదిశ్వాస విడిచారు. . బీపీలో హెచ్చుతగ్గులు, అన్నవాహికకు రంద్రాలు, దాని వల్ల ఇన్ఫెక్షన్  సోకడం, కిడ్నీ ఫెయిల్ తదితర కారణాల వల్ల  దాసరి కన్నుమూసినట్టు కిమ్స్ వైద్యులు ప్రకటించారు .  ఈ ఏడాది జనవరి 19న మొదటిసారి ఆసుపత్రిలో చేరి, మార్చి 29న డిశ్చార్జ్ అయిన  దాసరి  మళ్లీ ఈ నెల 17న రెండోసారి ఆసుపత్రిలో చేరారు. ఇది ఇలా ఉండగా దాసరి నారాయణ రావు పెద్ద కోడలు ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఆమె మాట్లాడుతూ లాస్ట్ టైం కూడా నేను అస్పత్రికి వచ్చాను నన్ను లోపలికి  పోనివ్వలేదు. దాని మీద కొంచెం అనుమానాలు ఉన్నాయి. మే 4న మామ గారు బాగా మాట్లాడారు. మాస్టర్ దాసరి నారాయణ రావుని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తా అన్నారు. చిన్న ఆపరేషన్ ఉంది. రెండు వా రాల తరవాత కూర్చొని మాట్లాడుదాం. మీకు అన్యాయం చేయను. ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చాను అన్నారు. ఆస్తిలో కూడా మాకు ఏ భాగం ఇవ్వలేదు. ఆయన మరణం మీద నాకు పలు అనుమానాలు ఉన్నాయి అని దాసరి పెద్ద కోడలు మీడియాకు తెలిపారు. ఇక సుశీల ..  దాసరి పెద్ద కుమారుడు తారక ప్రభులు కలసి ఉండటం లేదు . కొన్నాళ్లుగా వీరి మధ్య  కుటుంబ పరమైన గొడవలు నడుస్తున్నాయి.   వీడియో చూడండి ....
 • ఢిల్లీ అసెంబ్లీలో బుధవారంనాడు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.  ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన కపిల్ మిశ్రా మాట్లాడబోగా  ఆప్ ఎమ్మెల్యేలు  అడ్డుకున్నారు . ఈ సందర్భంగా తోపులాట జరిగింది . ఆ గందర గోళం లోనే మిశ్రా త‌న‌కు మాట్లాడే అవ‌కాశం ఇవ్వాల‌ని స్పీకర్ ను  కోరారు. కేజ్రీవాల్ అవినీతి ఆరోప‌ణ‌ల‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ఆప్ ఎమ్మెల్యేల‌కు, క‌పిల్ మిశ్రాల‌కు స‌భ‌లో వాగ్వాదం జ‌రిగింది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మార్షల్స్ మిశ్రా ను  సభ నుంచి బయటకు ఎత్తుకెళ్లారు. 'అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వమని కోరాను. అందుకు అనుమతించ లేదు. ప్రతి ఒక్కరూ ఇది చూశారు. కేజ్రీవాల్ మాత్రం సభలో నవ్వుతూనే కనిపించారు. అసెంబ్లీ సాక్షిగా నన్ను కొట్టారు.' అని అసెంబ్లీ వెలుపల మిశ్రా వాపోయారు. మనీష్ సిసోడియా (ఉప ముఖ్యమంత్రి) ఆదేశాల మేరకే తనపై దాడి జరిగినట్టు మిశ్రా ఆరోపించారు. కాగా కేజ్రీవాల్‌కు ఒకప్పుడు  మిశ్రా విశ్వసనీయుడే ... అయితే మధ్యలో ఏమి జరిగిందో ఏమో కానీ మిశ్రా అడ్డం తిరిగారు . ఆప్ నేతలపై అవినీతి ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌కు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ రూ.2 కోట్లు 'అక్రమ సొమ్ము' ఇస్తుండగా తాను చూశానని, మందుల కొనుగోలు విషయంలోనూ ఆరోగ్య శాఖ కుంభకోణానికి పాల్పడిందని మిశ్రా ఇటీవల ఆరోపించారు. మంత్రుల విదేశీ పర్యటనలపైనా నిలదీశారు. అయితే మిశ్రా చేసిన ఆరోపణలను తోసిపుచ్చిన ఆప్...ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.తర్వాత మిశ్రా నిరశన దీక్ష కూడా చేపట్టారు. ...
 • తెలుగుదేశం పార్టీ  విశాఖలో నిర్వహించిన మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు . శనివారం ప్రారంభమైన టీడీపీ మహానాడు వేదికపై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల జాడ కన్పించలేదు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి హరికృష్ణ ఈసారి మహానాడుకు దూరంగా ఉన్నారు. వేదికపై ఆహ్వానితుల జాబితా పిలిచినప్పుడు ఆయన పేరు ప్రస్తావించినప్పటికీ తొలిరోజు మహానాడుకు అయన రాలేదు.  ముఖ్యమంత్రి చంద్ర బాబు వియ్యంకుడు, ఎన్టీఆర్‌ తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం తొలిరోజు కనిపించలేదు. వీరే కాదు నందమూరి కుటుం బానికి చెందిన ఏ ఒక్కరూ మహానాడు ప్రాంగణంలో కన్పించక పోవడం చర్చనీయాంశమైంది. సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్లే బాలకృష్ణ రాలేదని తెలియడంతో మహానాడు కంటే సినిమా షూటింగ్‌లు ముఖ్యమా అని పార్టీ నేతలు అనుకుంటున్నారు. కానీ అసలు కారణమేమిటో తెలియలేదు.  హరికృష్ణ గత కొంత కాలంగా అంటి ముట్టనట్టు ఉంటున్నారు . పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరవడం లేదు . హరికృష్ణ తనయుడు, జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా చాలాకాలం నుంచి పార్టీ వేదికలపై కనిపించడం లేదు. పార్టీ ఊసే ఎత్తడం లేదు.  ఆదివారం  వీరిలో కొందరు  హైద్రాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు....
 • అవకాశం దొరికినప్పుడల్లా ఓ కునుకేయడం ఆయనకు అలవాటు ...  ఈ మీడియా వాళ్ళకేమి పనిలేదు. ఆలా దొరికినప్పుడల్లా వీడియోలు తీసేసి ప్రచారం చేస్తుంటారు. అయినా ఆయనకేం భయం లేదు. మళ్ళీమామూలే. ఎప్పటిలాగానే ఓ కునుకేసారు అది కూడా ప్రెస్ మీట్ లో ఇక మీడియా వాళ్ళు ఊరుకుంటారా ?  కేంద్రంలో ఎన్డీఏ సర్కార్  మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో బీజేపీ వైఫల్యాలను ఎండగట్టేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ వేణుగోపాల్ మీడియా సమావేంలో మాట్లాడుతున్నారు.  ఆ పక్కన కూర్చున్న సిద్ధరామయ్య మాత్రం ఇవేమీ తనకు పట్టవన్నట్లుగా హాయిగా ఒక కునుకేయడం జరిగింది . పలు ముఖ్య సందర్భాలలో ఆయన ఇలా నిద్రపోవడం ఇదేం తొలిసారి మాత్రం కాదు. సీఎం తీరుపై సొంత పార్టీ నేతలే తల పట్టుకుంటున్నారు ఈయన పద్ధతి మారదా అనుకుంటూ.  2014లో కర్ణాటక అసెంబ్లీలో ఓ బాలికపై అత్యాచార ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలోనూ సీఎం గారు చక్కగా కునుకుతీసి విమర్శలపాలయ్యారు. గతంలో మైసూరులో జరిగిన ది ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 103వ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనూ  సారు హాయిగా నిద్రలోకి జారుకున్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ శిష్యుడు అయిన సిద్దరామయ్య తన పాత గురువు లక్షణాలు అలవర్చుకున్నారనే జోకులు అపుడపుడు పేలుతుంటాయి. పలు సమావేశాలలో మాజీ ప్రధాని దేవేగౌడ నిద్రపోవడం.. సమావేశం పూర్తయిన తరువాత నిద్రలేవడం అందరికి తెలిసిందే. అయితే సీఎం సిద్ధరామయ్యకు చాలా కాలం  నుంచి అతి నిద్ర జాడ్యం ఉందని.. ఈ సమస్య నుంచి బయటపడేందుకు యోగా  ప్రాక్టీస్ చేస్తున్నారట.  అయితే ఫలితం ఏమి కనిపించినట్టులేదు. ...
 • (Gorantla Saheb peera Sai).........   ఉత్తుత్తి మాటలతో  కడుపులు నిండుతాయా. ఈ మధ్య కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు ఇలాగే వుంది..ఇద్దరూ ప్రతిపక్షం పేరు చెప్పి ప్రజలను మాయ చేయటం, ఉద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవటం వంటి వాటితో పబ్బం గడుపుకుంటున్నాయి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది మంచి పాలన కోసం అన్నది మరిచినట్లున్నారు. రైతులు అధిక శాతం గల దేశమని మరిచి ,వారి సంక్షేమం వదిలి..పారిశ్రామికీకరణ పేరుతో రైతుల భూములను లాక్కుని వారిని మరింత నిస్సహాయస్థితిలోకి నెడుతున్నారు. పూటకో పథకం,కులానికో,మతాలకో మేలు చేసే "పథకాలతో" సమాజాన్ని వర్గాలుగా చీల్చి "తమదైన" రాజ్యం కోసం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వంధిమాగదులకు తమ నేతలు ఏం చేసినా మంచిగా కనబడుతుంది.పైగా "మీడియా" మేనేజ్మెంట్ లో ఏలినవారు మహా ఘనులు.. ఇప్పటికి మూడేళ్ళయింది. ఈ దేశ రైతుల కోసం ,ఏ సంక్షేమం, ప్రోత్సాహం కలిగే చర్యలు తీసు కున్నారు .. అసలు విషయం వదిలేసి "కొసరు" పై హంగామా చేయడమంటే ఇదే. డీ మానిటైజేషన్ అని మోడీ రాజధాని అని చంద్రబాబు . ఆర్భాటపు ప్రకటనలు తప్ప వాస్తవంగా "రైతుకు " జరిగిన మేలేంటి.. ఎరువుల ధరలు తగ్గాయా మేలు జాతి విత్తనాలు తక్కువ ధరలో ఇచ్చారా ఎంత శాతం భూమిని కొత్తగా సాగులోకి తెచ్చారు. రైతుల పండించిన పంటలకు "గిట్టుబాటు" ధర లబిస్తోందా.. మరెందుకీ హంగామాలు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ "రైతుల" కోసం ఈ మూడేళ్ళలో ఏం దిద్దుబాటు చర్యలు తీసుకున్నాయని..అదే చావులు,అదే కన్నీళ్ళు..అవే వెతలు..ప్రజల దృష్టి మళ్ళించే చర్యలు కాదా  ఇవి.??...