Latest News
నేటి క‌బుర్లు

శశికళతో అమీతుమీకి దీప సిద్ధం !!

1st Image


తమిళనాడు  దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు  దీపాకుమార్‌  రాజకీయ ప్రవేశం ఖరారు అయింది.   త్వరలోనే  దీప సొంతంగా పార్టీ పెడుతున్నారు . ఈ పార్టీకి అమ్మ అన్నా డీఎంకే అని నామకరణం చేయవచ్చని అంటున్నారు.  అమ్మ అభిమానులు, అన్నాడీఎంకే శ్రేణుల్లో కొందరు దీప ని పార్టీ పెట్టమని ఒత్తిడి తెస్తున్నారు. 
పార్టీ పెట్టడం తో పాటు ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి దీప పోటీ చేసేందుకు కూడా రంగం సిద్ధం  చేసుకుంటున్నారు.  దివంగత నేత ఎంజీఆర్‌ వారసత్వం తనదేనని ఉద్ఘాటిస్తున్న దీప  శశికళ తో అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారని తమిళ పత్రికలు రాస్తున్నాయి. ఇప్పటికే  దీప ఇంటర్వ్యూ లతో , కథనాలతో  శశికళ వర్గంలో గుబులు పుట్టిస్తున్నాయి. 
జయలలలిత వారసురాలు దీపాకుమారేనంటూ తమిళనాడు అంతటా ఆమె మద్దతుదారులు కటౌట్లు, బ్యానర్లతో హోరెత్తిస్తున్నారు .  ఈ నెల 17న అన్నాడీఎంకే స్థాపకుడు ఎంజీఆర్‌ శతజయంతి సందర్భంగా తన మద్దతు దారులతో కలసి   ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు దీప సన్నాహాలు చేస్తున్నారు . పార్టీ విషయం ... కార్యాచరణ ప్రణాళిక ను త్వరలో ప్రకటించనున్నారు.  
ఇక ప్రతిరోజూ వందల సంఖ్యలోజయ అభిమానులు  దీప ను కలసి  మద్దతు ప్రకటిస్తున్నారు.తనను చూసేందుకు వచ్చిన వారిని జయలలిత తరహాలో రెండు ఆకుల ముద్రతో దీప పలుకరిస్తున్నారు. జయ వారసత్వం దీపకే దక్కాలంటూ ఆమె మద్దతుదారులు రాష్ట్రమంతాట కటౌట్లు, బ్యానర్లు కడుతున్నారు. దీప జయలలితకు పుష్ఫగుచ్ఛం ఇస్తున్నట్టు గ్రాఫిక్‌ ఫొటోలు సృష్టించి మరీ కటౌట్లు దర్శనమిస్తుండటం గమనార్హం. పార్టీ సంగతి అలా ఉంటే ఆర్కే నగర్ లో పోటీ చేస్తే మటుకు దీప గెలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  జయ అకాల మరణం పట్ల  ఉన్న సానుభూతి ఆమెను గెలిపిస్తుందని ఆమె మద్దతు దారులు చెబుతున్నారు.
Site Logo
  • "ఎన్టీఆర్ ను నేను వెన్నుపోటు పొడిచాననడం తప్పు. ఎన్టీఆరే నన్ను వెన్నుపోటు పొడిచాడు. ఎన్టీఆర్ కు నేను వెన్నుపోటు పొడిచాననేది.. పత్రికల కల్పన" అని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఒక ఛానల్ ఇంటర్వ్యూ లో అన్నారు.  "పొలిటికల్ గా నాకు ఉన్న స్కిల్స్, ఎన్టీఆర్ చరిష్మా కారణంగానే కాంగ్రెస్ పార్టీని పడగొట్టాం.  నా మూలంగానే తెలుగుదేశం పార్టీ పుట్టింది. సినిమాల్లో హీరోగా ఆయన కనపడ్డా, నిజ జీవితంలో పెద్ద విలన్ ఆయన. టిక్కెట్ల ఎంపికలో మా ఇద్దరిలో ఎవరిదీ పైచేయి కాదు.  రెండో సారి ఎన్టీఆర్ ను వెన్నుపొడిచింది ఎవరు ? స్వయంగా ఎన్టీఆరే తన అల్లుడు చంద్రబాబును తిట్టి పోసాడు . తార్పుడు గాడు అని, రెండు వందల కోట్లు తినేశాడని ఎన్ఠీఆర్ విమర్శించారని నాదెండ్ల భాస్కరరావు చెప్పారు. ఎన్టీఆర్ బయో పిక్ లో మిమ్మల్ని విలన్ గా చూపించనున్నారటగా?' అనే ప్రశ్నకు నాదెండ్ల సమాధానమిస్తూ.. ప్రతి సినిమాలో విలన్ ఉండాలనే రూల్ ఏదీ లేదని, ఆ విధంగా చేస్తే కోర్టుకు వెళతానని, అప్పుడు ఆ సినిమా రిలీజ్ ఏ విధంగా అవుతుందని అన్నారు. ఇక తనకు, బాలకృష్ణకు మధ్య ఎటువంటి విభేదాలు లేవని చెప్పారు.  బాలకృష్ణ తీయబోయే చిత్రంలో తన తండ్రి సినిమా జీవితాన్ని మాత్రమే తీసుకుంటే ఫర్వాలేదు గానీ, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించడం గురించి తీస్తే బాలకృష్ణ చాలా చిక్కుల్లో పడతాడని అన్నారు. సినిమా తీసే ముందు బాలకృష్ణ తనను సంప్రదిస్తే, వాస్తవాలు చెబుతానని నాదెండ్ల అన్నారు.  చూడండి  వీడియో.  vedeo courtesy... tv 9 
  • తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం సొంత పార్టీ పెట్టే ఆలోచనలో పడ్డారు. బలనిరూపణలో పళనీ స్వామి ది పైచేయి కావడం ... పన్నీర్ వ్యూహం అట్టర్ ప్లాప్ అయిన విషయం తెల్సిందే . ఈ క్రమంలో కొత్త పార్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే అంశంపై తన మద్దతు దారులతో పన్నీరు చర్చిస్తున్నట్లు సమాచారం . అందరూ కూడా పార్టీ ఏర్పాటు పై మొగ్గు చూపు తున్నట్టు తెలుస్తోంది . అమ్మడీఎంకే పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు కావచ్చు  అంటున్నారు. జయ మేనకోడలు దీప కూడా ఈ పార్టీ లో చేరతారు . త్వరలో జరగ బోయే ఆర్కే నగర్ నియోజక వర్గం నుంచి దీప ను బరిలోకి దింపాలని సెల్వం ప్లాన్ చేస్తున్నారు. ఇక దీప కూడా తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో పన్నీర్ కు మద్దతు ప్రకటించిన దీపను  తమ పార్టీ తురుపు ముక్కగా ప్రయోగించాలని పన్నీర్ భావిస్తున్నట్టు  తెలుస్తోంది.   కేవలం ఆరుగురి ఎమ్మెల్యేల మెజారిటీ తో  పళనీ  స్వామి సర్కార్  ఎక్కువ రోజులు మనలేదని , రిమోట్ జైల్లో ఉన్న శశి చేతిలో ఉన్నంత కాలం  పళనికి దినదిన గండమే అంటున్నారు.  ఇక విప్ ధిక్కరించి పన్నీర్ వైపు నిలిచిన 11 మంది ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశాలున్నాయి.
  • తమిళనాడు అసెంబ్లీలో సీఎం పళని స్వామి బలనిరూపణ సందర్బంగా హైడ్రామా చోటు చేసుకుంది. రహస్య వోటింగ్ జరపాలని ప్రతిపక్ష డీఎంకే పట్టు పట్టింది. అందుకు స్పీకర్ అంగీకరించలేదు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .  రహస‍్య ఓటింగ్‌ అంశంపైనే  రగడ జరిగింది . సభ కంట్రోల్ తప్పింది .డీఎంకే సభ్యులు  రెచ్చిపోయి ప్రవర్తించారు .  ఈ క్రమంలో మార్షల్స్‌ రంగంలోకి దిగారు. ఒక్కొక్కర్నీ చేతులపై ఎత్తిపట్టుకునే బయటకు లాగి పడేశారు. తోపులాటలో కొంతమంది ఎమ్మెల్యే చొక్కాలు చిరిగి పోయాయి. పలువురికి గాయాలయ్యాయి.  డీఏంకు నేత స్టాలిన్‌  చొక్కా చిరిగిపోయింది.. ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు స్థాయి మరచి ప్రవర్తించారు. రెచ్చిపోయిన  ఎమ్మెల్యేలు కుర్చీలు ఎత్తేశారు.. చొక్కాలు చించేసుకున్నారు.. మైకులు విరగ్గొట్టారు.. పేపర్లు చించి పొడియంపైకి విసిరేశారు. కేకలు, ఈలలతో  గందరగోళం  నెలకొంది . ఏకంగా స్పీకర్ కుర్చీలో కూర్చుని సెల్ఫీలు తీసుకున్నారు. తాము ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులమని మరచి ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తించారు.  స్పీకర్‌ను రెక్కబట్టుకొని లాక్కొచ్చారు. అటూ, ఇటూ నెట్టేశారు.  తమిళనాడు అసెంబ్లీలో గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినా మరీ ఇంత దారుణంగా జరగలేదు.  స్పీకర్ అదేశాలతో మార్షల్స్ వారిని బలవంతంగా బయటకు పంపారు. ఈ క్రమంలో అసెంబ్లీ రెండు సార్లు వాయిదా పడింది. మూడో సారి సభ ప్రారంభమైన తరువాత  విశ్వాస పరీక్షలో పాల్గొని పళని స్వామికి అనుకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 11 మంది వ్యతిరేకంగా వేశారు. బలపరీక్షలో పళని స్వామి నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత  శాసనసభ ఆవరణలోనే ధర్నాకు దిగిన డీఎంకే సభ్యులను మార్షల్స్ బయటకు పంపేందుకు యత్నించారు.  స్టాలిన్  చిరిగిన చొక్కాతోనే  రాజ్ భవన్ కు వెళ్లి అసెంబ్లీలో చోటు చేసుకున్నపరిణామాలను  వివరించారు.  రాజ్‌భవన్ వద్ద కూడా కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజ్‌భవన్‌పైకి డీఎంకే కార్యకర్తలు రాళ్లు విసిరారు. అటు నుంచి మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి స్టాలిన్ నేతృత్వంలో నిరసన దీక్ష చేపట్టారు. వేలాది మంది కార్యకర్తలు మెరీనా బీచ్‌కు చేరుకుని స్టాలిన్‌కు మద్దతు తెలిపారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇక తమిళనాడు వ్యాప్తంగా డీఎంకే మద్దతుదారులు ఆందోళనలు చేపట్టారు. మొత్తం మీద వ్యూహాత్మకం గానే సభలో ప్రతి పక్షం  లేకుండా  బలపరీక్ష జరిగింది. 
  • పళనిస్వామికి గవర్నర్‌ బలనిరూపణకు అవకాశం ఇవ్వడంతో ఇపుడు పన్నీర్‌ సెల్వం ఏం చేయబోతున్నారు ? ఎమ్మెల్యేలు అసెంబ్లీ కొస్తే తనకు మద్దతు పలుకుతారని  సెల్వం ఇంకా ఆశతో ఉన్నారా ? ఒక వేళ పళనీ అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటే భవిష్యత్ లో సెల్వం ఏమి చేయబోతున్నారు? అనే అంశాలపై రాజకీయ వర్గాల్లోఆసక్తికరమైన  చర్చ జరుగుతోంది.  గవర్నర్ నిర్ణయంతో పన్నీర్ కొంచెం డీలా పడినప్పటికీ ఆఖరి నిమిషంవరకు వేచిచూసే ధోరణి లోనే ఉన్నారు. ఎమ్మెల్యేలను బుజ్జగించి తనవైపు తిప్పుకునే యత్నాలు కూడా తెర వెనుక జరుగుతున్నాయి . అయితే ఎమ్మెల్యేలను ఆకర్షించడం  అంత  సులభం కాదు . ఇపుడు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే కష్టం .  పార్టీలో చీలిక  మొదటి వారం లోనే జరిగి ఉండాలి . కానీ జరగలేదు. తన వ్యూహాలతో  కొంతవరకు అన్నాడీఎంకే నేతలను చీల్చగలిగిన సెల్వం శశికళపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. ఆయన ఎంత ప్రయత్నించినా  మన్నార్‌గుడి కుటుంబం గుప్పిటను దాటి ఎమ్మెల్యేలు బయటకు రాలేకపోయారు. ఇప్పటికీ  అన్నాడీఎంకేలో శశికళ కుటుంబ ఆధిపత్యం కొనసాగుతోంది . ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉండొచ్చునని భావిస్తున్నారు.   ఉత్తరాది రాష్ట్రాల పార్టీ  ప్రభావం లో పడి  పన్నీర్  అమ్మకు ద్రోహం చేశారనే సెంటిమెంట్ కూడా ఎమ్మెల్యేలలో శశికళ రగిల్చేరు.  బీజీపీ అండతోనే పన్నీర్  తిరుగుబాటు చేశారని  శశి వర్గం పూర్తిగా నమ్మింది. అందుకే ఎమ్మెల్యేలు ఆయన వైపు మొగ్గు చూపలేదు. దాంతో పాటు స్టాలిన్ మాట మార్చి ఎవరికి మద్దతు ఇవ్వబోనని ప్రకటించడం కూడా ఒక మైనస్ పాయింట్ గా మారింది. ఇక ఈ పరిస్థితుల్లో పన్నీర్ చేసేదేమి లేదు. ఆయన  ముందు రెండు... మూడు  మార్గాలున్నాయి. ఒకటి  శశికళతో రాజీ కుదుర్చుకుని  తిరిగి అన్నాడీఎంకేలో చేరడం  ఒక మార్గం.  ఇది కూడా  చెప్పుకున్నంత సులభంకాదు. తక్షణమే అసలు కాదు . శశి పగతో రగిలి పోతోన్న క్రమంలో రాజీ అనేది అసాధ్యం . పవర్ లో కొచ్చాక  పన్నీర్ పై వేధింపులు కూడా జరగవచ్చు . ఇక రెండో మార్గం ....   చీలిక వర్గంగానే కొనసాగుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వరకు పోరాడటం.  అంత ఓపిక పన్నీర్ కి ఉండాలి. బయటి కొచ్చిన ఎమ్మెల్యేలు , నాయకులూ  పన్నీర్ వైపే ఉండాలి . మరో నాలుగేళ్లు పోరాడాలి.  ఇక ఆఖరి మార్గం బీజీపీలో చేరడం. బీజీపీ లో చేరడం తప్పేమి కాదు. కేంద్రం లో అధికారం లో ఉన్నంతవరకు పన్నీర్ కు  ఒక పెద్ద పార్టీ  నీడ దొరుకుతుంది. కాలం కలసివస్తే  ఎంపీ గా ఎన్నికై  ఏదైనా పదవి పొందవచ్చు. బీజేపీ కి తమిళనాడులో నేతలు అవసరం కాబట్టి పన్నీర్ వర్గాన్ని  అక్కున  చేర్చుకోవచ్చు. ప్రజల్లో గుర్తింపు ఉన్న నేతగా బీజేపీ లో పన్నీర్ కి కొంత ప్రాధాన్యత లభించవచ్చు.  కొంత కాలం తర్వాత పన్నీర్  బీజేపీ గూటికి చేరవచ్చనే  ఊహాగానాలు కూడా లేకపోలేదు .  చూద్దాం  ఏమి జరుగుతుందో ?
  • కోర్టులో లొంగిపోయేందుకు బెంగళూరు బయలుదేరిన శశికళ మార్గ మధ్యంలో జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అక్కడ సమాధిపై మూడు సార్లు చేత్తో కొట్టి ఏదో ప్రతిన చేశారు. ఆ సమయంలో శశికళ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనలోని ఆవేదనను, అసహనాన్ని బాహాటంగా ప్రదర్శించారు. ఆమె ఆ సమయంలో ఏదో గొణుక్కున్నట్టుగా మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారనే విషయంపై స్పష్టత లేదు.మొత్తం మీద ఏదో శపథం చేశారని అనుచరులు అనుకుంటున్నారు .  శశికళ  ఇంతకుముందు  ఈ రకంగా ప్రవర్తించలేదు. ఆమె ప్రవర్తన చూసిన అనుచరులు నినాదాలు చేశారు. ఆమె ప్రతిన సమయంలో ముఖమంతా  ఎర్రగా మారిపోయింది. ఆమె ఎవరిపై తన కోపాన్ని వెళ్ళాగక్కారో  తెలియలేదు. పన్నీర్‌ చేతుల్లోకి పార్టీ వెళుతుందన్న బాధతో, తన కుటుంబ సభ్యుల నుంచి పార్టీ చేజారిపోతుందన్న ఆందోళనతో ఆమె ఇలా ప్రవర్తించి ఉండొచ్చని అనుకుంటున్నారు . శశికళ ప్రవర్తించిన తీరు అందరినీ నివ్వెరపోయేలా చేసింది. శశికళకు సుప్రీం కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. గడువు కావాలన్న అభ్యర్థనను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీంతో  గత్యంతరం లేక  శశికళ పోయెస్ గార్డెన్ నుంచి బెంగళూరుకు బయల్దేరారు. శశికళ కంటే ముందే ఆమె భర్త నటరాజన్, తంబిదురై ఇద్దరూ ఆ జైలు వద్దకు చేరుకుని ఫార్మాలిటీస్‌ను పూర్తి చేశారు. జైల్లో ఒక ఏసీ రూమ్, వేడినీళ్లు, ఇంటిభోజనం, ఒక సహాయకురాలు వంటి  వసతులు కల్పించాలని కోరారు. గతంలో జయలలితకు అనుమతించిన విధంగానే తనకూ ఇంటి భోజనం వసతి కల్పించడంతో పాటు అప్పట్లో జయలలితకు కేటాయించిన 7402 నంబర్ రూమ్‌నే తనకు ఇప్పుడు కేటాయించాలని   కోరినట్టు సమాచారం . అయితే శశికళను ఒక మామూలు ఖైదీలాగే ట్రీట్ చేస్తామని జైలు అధికారులు  తేల్చి చెప్పారట. 
  • శశికళను ఆహ్వానించి 24 గంటల్లోగా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా గవర్నర్ ను ఆదేశించాలని  సుప్రీంకోర్టులో పిల్ దాఖలు అయింది . శశికళకు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతున్నా, ఆమెను గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదని, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది పీఎల్‌ శర్మ సుప్రీంకోర్టులోఈ  ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా శశికళను ఆహ్వానించడం లేదని ఆయన తన పిటిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే  శశికళ దూకుడు పెంచుతున్నారు. ఆదివారం రిసార్ట్ కెళ్ళినపుడు  ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడారు.  ‘‘జయలలితతో కలిసి ఎన్నో కష్టాలు అనుభవించాను. చెన్నై జైలు కొత్తకాదు.. బెంగళూరు జైలు కొత్త కాదు. జైలు నుంచి బయటకు వచ్చాం. మళ్లీ అధికారం చేజిక్కించుకున్నాం. మహిళ అనుకుని భయపెట్టి, అణగ దొక్కాలని చూస్తే ‘అమ్మ’లాగే నేను కూడా ఢిల్లీని ఢీ కొట్టేందుకు సిద్ధం . ఢిల్లీ వరకూ చెబుతున్నా.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఎదుర్కొనే దమ్మూ ధైర్యం నాకున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’’ అని శశికళ తేల్చిచెప్పారు. ఈ మాటలను బట్టి చూస్తే శశికళ తెగింపు తోనే ఉన్నారని అనిపిస్తోంది . కాగా శశికళ శిబిరానికి సంబంధించిన వివరాలను పోలీసులు మద్రాస్‌ హైకోర్టుకు సమర్పించారు. 119 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగానే రిసార్ట్ కొచ్చినట్టు తెలిపారని వారినుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని నివేదికలోపేర్కొన్నారు.  ఈ వేళ  కూడా గవర్నర్  అపాయింట్మెంట్ ఇవ్వకపోతే   బల ప్రదర్శనకు దిగడమో లేదా దీక్ష చేపడ్డామో చేయాలనీ యోచిస్తున్నట్టు సమాచారం.  ఇప్పటికి ఎనిమిది రోజులు అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు . పన్నీర్ బలం చెప్పుకోదగిన స్థాయిలో పెరగలేదు. మొత్తం 134 మంది ఎమ్మెల్యేలలో శశికళ వద్ద 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిగిలినవారు పన్నీర్ తో ఉన్నారు.