Latest News
నేటి క‌బుర్లు

జగన్ , శ్రీకాంత్ లపై విరుచుకుపడ్డ జేసీ !!

1st Image

ప్రతిపక్ష నేత  జగన్ , ఎమ్మెల్యే  శ్రీకాంత్ రెడ్డిలపై  ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  విరుచుకుపడ్డారు.  బుధవారం వైస్సార్ జిల్లాలోని పైడిపాలెం ఎత్తిపోతల ప్రాజెక్టును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జేసీ ప్రసంగించారు. ప్రతిపక్ష నేత జగన్‌కు అన్ని తాత రాజారెడ్డి గుణాలు వచ్చాయని విమర్శించారు. 
వయసులో చిన్నవాడు అనే ఉద్దేశంతో తాను  ‘వాడు’ అని జగన్‌ను సంభోధించాను తప్ప పొగరుతో కాదన్నారు. తాను అలా పిలవడాన్ని నిరసిస్తూ ఆయన పార్టీ నేతలు ధర్నాలు, దిష్టిబొమ్మలను దహనం  చేశారని  జేసీ ఎద్దేవా చేశారు .  ఇకనుంచి జగన్‌ను ‘వాడు’ అని సంబోధించనని, ‘శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు’ అని సంబోధిస్తానని జేసీ వ్యంగ్యంగా అన్నారు. 
జగన్ సీమకు ఎన్నిరకాలుగా అన్యాయం జరగాలో అన్ని రకాలు ప్రయత్నాలు చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. 
బుద్ధి ఉన్నవారెవరైనా సీమకు ఉపయోగపడే పట్టిసీమను వద్దంటారా? అని జేసీ ప్రశ్నించారు. 
ఇక ఎమ్మెల్యే  శ్రీకాంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  తాను బూట్లు నాకేవాడిని అయితే ఎప్పుడూ మంత్రిగానే ఉండేవాడినని అన్నారు. ‘శ్రీకాంత్ రెడ్డి నన్ను జానీవాకర్‌ అంటావా? నాకు తాగే అలవాటు లేదు.. సారా మా ఇంట వంట లేదు... తాగే అలవాటు వాళ్లకే ఉంది. నా నాలుక చీలుస్తావా? అంత మగాడివా?’ మీ వూరు వస్తా రా ... నన్ను ముట్టుకో ... నీ కథ  తెలుస్తుంది' అని జేసీ విమర్శలు గుప్పించారు . 2019 లో పులివెందులలో  టీడీపీ అభ్యర్థి ని గెలిపించాలన్నారు. బాబు ను మళ్ళీ సీఎం చేయాలన్నారు. 
 జేసీ ఇంకా ఏమన్నారో వీడియో చూడండి.
vedeo courtesy ... abn andhrajyothi  
  • పదే పదే ఎదురు దెబ్బలతో సతమతమవుతున్నకాంగ్రెస్  పార్టీకి జవసత్వాలు చేకూర్చడంపై  ఆ పార్టీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. జనాకర్షణగల నేత కోసం అన్వేషిస్తున్నారు. గాంధీ కుటుంబ వారసురాలు ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ ఊహాగానాలుగానే  మిగిలిపోయాయి . అయితే ఇపుడున్న పరిస్థితిలో  కాపు కాసే  నేత అవసరమని సోనియా భావిస్తున్నారట . ఈ నేపథ్యంలోనే  పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రియాంకా గాంధీని నియమించే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రియాంక పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయితే రాబోయే ఎన్నికల్లో పార్టీకి జవసత్వాలు వస్తాయని, తప్పకుండా అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశముందని  పార్టీ నేతలు కూడా అంటున్నారు . ఆగస్టు  8వ తేదీన వర్కింగ్‌ కమిటీ సమావేశం లో ఇదే అంశం పై చర్చ కూడా జరిగిందని అంటున్నారు.  గత ఏడాదే పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌కి అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని సోనియా భావించారు. కానీ, రాహుల్‌ నాయకత్వంపై సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆయనకు జోడీగా ప్రియాంకను కూడా తీసుకు రావాలని సోనియా భావిస్తున్నారట.  రాహుల్‌ని అధ్యక్షుడిని చేసి, ప్రియాంకను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చేస్తే ఆమె కూడా దేశవ్యాప్తంగా ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇప్పటి వరకూ ప్రియాంక కేవలం సోనియా, రాహుల్‌ నియోజకవర్గాలైన రాయ్‌బరేలీ, అమేథీల్లోనే ప్రచారం చేశారు. తెలంగాణలో పార్టీకి పునర్వైభవం కోసం అవసరమైతే వచ్చే ఎన్నికల్లో మెదక్‌ నుంచి ప్రియాంకను రంగంలోకి దింపాలని కూడా సోనియా యోచిస్తున్నట్లు  చెబుతున్నారు . 1980లో మెదక్‌ స్థానం నుంచి ఇందిరా గాంధీ పోటీ చేసి ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు సెంటిమెంట్‌గా అక్కడి నుంచే ప్రియాంకను పోటీకి నిలబెడితే బావుంటుందని సీనియర్లు సోనియాకు సలహా  ఇచ్చారని అంటున్నారు.  అయితే ఇవన్నీ కూడా ఊహా గానాలే అని కాంగ్రెస్ పార్టీ ఖండించింది.  ఇదిలా ఉంటే  మొన్నటి యూపీ ఎన్నికల్లో ప్రియాంక ప్రచారం చేసిన చోట కూడా పార్టీ ఓడిపోయింది.  అయితే ఆ ఫలితాలకు కారణాలు వేరే ఉన్నాయి కాబట్టి పూర్తిగా ప్రియాంక వైఫల్యం అనలేము. ఏదైనా పార్టీలోకి కొత్త నేత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రియాంక అయితే  పార్టీని గట్టెక్కించ గలరు  అనే  నమ్మకం పార్టీ నేతల్లో ఉంది.  ఆమె పార్టీ బాధ్యతలు స్వీకరిస్తారా ?   లేదా అనేది  కాలమే  నిర్ణయిస్తుంది. 
  • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ముస్లిం తీవ్రవాద సంస్థ తాలిబాన్‌ బహిరంగ లేఖ రాసింది. అఫ్ఘానిస్తాన్‌లో తిష్టవేసిన అమెరికా బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. గత పదహారేళ్లుగా అమెరికా బలగాలు అఫ్ఘానిస్తాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇంగ్లీషులో 1600 పదాలతో సుదీర్ఘంగా రాసిన ఆ లేఖను తాలిబాన్‌ నాయకత్వం  విడుదల చేసింది. గత అమెరికా అధ్యక్షులు అఫ్ఘానిస్తాన్‌ విషయంలో చేసిన పొరపాట్లను, తీసుకున్న నిర్ణయాలను  పున:సమీక్షిస్తామనడం  ద్వారా తప్పిదాలను అంగీకరించినట్లయిందని తాలిబాన్‌ అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. అఫ్ఘానిస్తాన్‌లోని బలగాల ఉపసంహరణ  విషయంలో ట్రంప్‌ ఏకపక్షంగా వ్యవహరించక పోయినప్పటికీ  బలగాల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటమో లేక ఉపసంహరించడమో చేయాలని లేఖలో కోరారు. బలగాలను వెనక్కి రప్పించుకోవటం ద్వారా అమెరికా దళాలకు జరిగే హాని నుంచి రక్షించుకోవాలని సూచించారు. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.
  • చూస్తే చిన్న దేశం...ఆర్ధికంగా అంత పటిష్టం గా లేని దేశం ... కానీ అగ్రదేశం అమెరికా తో  యుద్ధానికి సై అంటోంది. దేశం...  అసలు ఉత్తర కొరియాకున్న ధైర్యమేంటి? పలు దేశాలకు అర్ధం కాని విషయం  ఇదే . నిజంగా ఉత్తర కొరియాకు అంత సీన్ ఉందా? సత్తా ఉందా ?  రాత్రికి రాత్రే ఉత్తర కొరియాపై యుద్ధానికి దిగుతామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన  కూడా తొణకడం లేదు బెణకడం లేదు. అసలు ఏమాత్రం అమెరికా  హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అంతేకాదు తమ జోలికి వస్తే అమెరికా మటాష్ అంటూ  రివర్స్ గేర్ లో మళ్ళీ హెచ్చరిస్తోంది. సైలెంట్ గా  తనపని తాను చేసుకుపోతోంది. ప‌సిఫిక్ స‌ముద్రంలోని అమెరికా దీవి గ్వామ్ పై దాడి చేసేందుకు రెడీ అవుతోంది . కిమ్ ఓకే అంటే చాలు క్షిపణుల వర్షం కురిపిస్తామంటున్నారు ఉత్తరకొరియా సైనికాధికారులు. ఉత్తర కొరియా నుంచి గ్వామ్ దీవి 3వేల 4 వందల కిలోమీటర్ల దూరంలో ఉంది. తమ క్షిపణులను ప్రయోగిస్తే ఈ దీవిపై 14 నుంచి 18నిమిషాల్లోనే పడతాయంటోంది ఉత్తర కొరియా. ఇందుకోసం హసంగ్ 12 మిసైళ్లను సిద్ధం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జ‌రిగిన ఉత్తరకొరియా మిలిట‌రీ ప‌రేడ్‌లో వీటిని ప్రదర్శించారు. హాసంగ్ క్షిప‌ణి సుమారు 3700 కిలోమీట‌ర్ల దూరం ప్రయాణించగల సామర్ధ్యాన్ని కలిగి ఉందట.   కాగా, గ్వామ్ ఫసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీపం. అందులో లక్షా 60వేల జనాభా నివసిస్తోంది. ఈ దీవిలో అమెరికాకు చెందిన సబ్‌ మెరైన్ల స్క్వాడ్రన్‌, ఒక ఎయిర్‌బేస్‌, కోస్ట్‌ గార్డు గ్రూప్‌లు ఉన్నాయి. ఈ కారణంగానే దీవీపై దాడి చేస్తే అమెరికాకు గట్టి దెబ్బ తగిలినట్లవుతుందని భావించి.. అమెరికా గనుక రెచ్చిపోతే ఈ దీవిని ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ హెచ్చరించారు. అమెరికా దూకుడుగా వెళ్తే, దాడి చేయాలని చూస్తే, ఉత్తర కొరియాకు బాసటగా నిలిచేందుకు చైనా సిద్ధంగా ఉంది. గత యుద్ధాల్లోనూ చైనా అదే పనిచేసింది. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ట్రంప్‌కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఫోన్ చేశారు. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెంచే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా మాత్రమే సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వివాదంపై చర్చలకు రావాలని ఉత్తర కొరియాకు కూడా సలహానిచ్చారు. అయితే నిజంగా యుద్ధం వస్తే మాత్రం చైనా, ఉత్తర కొరియా తరపునే నిలబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు .  అదే జరిగితే.. నష్టతీవ్రత ఊహించనంత జరుగుతుంది.  అటు అమెరికాకు చెందిన గ్వామ్ దీవిపై క్షిపణులు ప్రయోగిస్తామని ఉత్తర కొరియా ప్రకటించడంతో జపాన్ కూడా క్షిపణులను సిద్ధం చేసింది. ఎందుకంటే గ్వామ్ పైకి కొరియా దాడి చేయాలంటే జపాన్‌ను అవి దాటి వెళ్లాలి. అందుకే షిమానే, కోచి, హిరోషిమాలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది. క్షిపణి విధ్వంసక వ్యవస్థను ఏర్పాటు చేసింది.  మరోవైపు అవసరమైతే దక్షిణ కొరియాపై కూడా దాడి చేస్తామంటున్న ఉత్తర కొరియా అణుసామర్థ్యంపై అనేక సందేహాలున్నాయి. నిజానికి ఉత్తర కొరియా పూర్తిగా చైనా, రష్యాల అణు, క్షిపణి సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడి తన ఆయుధ సంపత్తికి పదును పెడుతోంది. బాలిస్టిక్‌ క్షిపణికి అణువార్‌హెడ్లను అమర్చి వాషింగ్టన్‌ను కొట్టగలిగేంతటి సాంకేతిక పరిజ్ఞానం ఆ దేశానికి ఉందా..? పలు దేశాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.  మొత్తం మీద ఇరు దేశాల ప్రకటనలతో ఉద్రిక్త వాతా వరణం నెలకొంది.  అమెరికాలాంటి పాశ్చాత్యదేశాల అండదండలతో దక్షిణ కొరియా ఆర్థికంగా కొంత మేరకు  బలపడింది. సాంకేతికరంగంలో దూసుకెళ్తోంది. కమ్యూనిస్టు దేశమైన ఉత్తర కొరియాలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. నియంతలపాలనలో మగ్గుతున్న ఈ దేశంలో పేదరికం తాండవిస్తోంది. ఆంక్షలతో ఆర్థిక పురోగమనానికి సంకెళ్లు పడ్డాయి. ఇలాంటి  ఉత్తర కొరియా  తమ దగ్గర పదివేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే క్షిపణులున్నాయని చెప్పుకుంటోంది. అమెరికా అంతా తమ టార్గెట్‌లోనే ఉందని చెబుతోంది . అయితే అణువార్‌హెడ్‌ను మోసుకెళ్లగలిగే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించే సత్తా ఉత్తర కొరియా దగ్గర లేదని  అంటున్నారు.  ఇదిలా  ఉంటే  చైనా జోక్యం తర్వాత  అమెరికా ఆలోచనలో పడినట్టుంది.  కొరియా ద్వీపంలో అణు పరీక్షలు జరగకుండా అణ్వాయుధాల తయారీలేకుండా తటస్థీకరించడమే అమెరికా, చైనాల అజెండా అని, ఆ ప్రాంతంలో శాంతి పరిస్థితులు, స్థిరత్వం కొనసాగింపు తమ ఉమ్మడి బాధ్యత అని జిన్‌పింగ్‌ చెప్పినట్లు సమాచారం.  మొత్తం మీద  ట్రంప్ టెంపర్మెంట్ ను కిమ్ బాగా గ్రహించినట్టుంది. అందుకే రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా అమెరికా తో పెట్టుకుంటే నష్టపోయేది ఉత్తర కొరియానే. 
  • పోలవరం బాహుబలి సినిమా లాగే ఉందన్నారు మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు. ఏపీ సీఎం చంద్రబాబు చెప్పే వాటికి ...   జరిగే పనులకు అసలు పొంతనే లేదన్నారు ఆయన . పట్టిసీమ , పోలవరం , పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్ మీడియా తో కలిసి పరిశీలించిన డాక్టర్ దగ్గుబాటి ఇదెక్కడి పనితీరు అంటూ విరుచుకు పడ్డారు. ఇతర వివరాలకోసం  వీడియో చూడండి. 
  • ఈ నెల 18న పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పోలవరం పరిశీలనకు వస్తోన్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్‌ డిమాండ్‌ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి అన్ని పరిశీలించిన పిదప ఉండవల్లి పోలవరాన్ని పూర్తి చేసే ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. వైఎస్‌ వల్లే పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలిందని ఆయన అన్నారు. పట్టిసీమ, పురుషోత్తమపట్నం ఎత్తిపోతలకు అయ్యే ఖర్చుతో పోలవరం పూర్తయ్యేదని చెప్పారు. మరికొన్ని విశేషాలకోసం వీడియో చూడండి. 
  • అన్నాడీఎంకేలో సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) వర్గం, మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం (ఓపీఎస్‌) వర్గం విలీనం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఫలితంగా  పన్నీర్ సెల్వం ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.  బీజేపీ అధినాయకత్వం అల్టిమేటంతో దిగివచ్చి. రెండు వర్గాలు ఒక్కో అడ్డంకిని తొలగించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే  పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ నియామకం చెల్లదని ఈపీఎస్‌ వర్గం ప్రకటించింది.  ఈ నేపథ్యంలో ఈపీఎస్‌, ఓపీఎస్‌ ఇద్దరూ శుక్రవారం ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో మంతనాలు జరుపనున్నారు. ఓపీఎ్‌సకు ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఎడప్పాడి కూడా సుముఖంగా ఉన్నారు. అయితే ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా పట్టుబడుతున్నట్లు సమాచారం. హస్తిన చర్చల్లో రాజీ కుదురుతుందని, 15వ తేదీలోపు విలీన ప్రక్రియ ముగిసిపోతుందని ఉభయ వర్గాల నేతలు ఆశాభావంతో ఉన్నారు. రెండు నెలలుగా సాగుతున్న చర్చలు ఇప్పటికి కొలిక్కి వచ్చాయి.  అయితే పార్టీ ఇంకా తన నియంత్రణలోనే ఉందని  శశికళ మేనల్లుడైన దినకరన్‌ అంటున్నారు.కాగా, అమ్మ పురచ్చితలైవి శిబిరానికి నిర్వాహకులుగా మరి కొందర్ని నియ మిస్తూ ఆయన ప్రకటన కూడా విడుదల  చేశారు.  పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సీఎం పళని స్వామిపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని దినకరన్‌ హెచ్చరించారు. కాగా దినకరన్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఓపీఎస్ , ఈపీఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికున్న సమాచారం మేరకు బీజేపీకి అనుకూలంగా పార్టీ నడిచే విధంగా తెర వెనుక మంతనాలు జరుగుతున్నాయి.