Latest News
సినిమా
 • ఇండియాలో రికార్డులు సృష్టించిన బాహుబ‌లి 2  చైనాలోకూడా స‌త్తా చాట‌బోతోంది. చైనాలోని 4 వేల థియేట‌ర్ల‌లో బాహుబలి 2 విడుదల కానుంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో సినిమా రిలీజ్ కానున్న‌ట్లు ట్రేడ్ అన‌లిస్ట్ ర‌మేష్ బాలా వెల్ల‌డించారు . బాహుబ‌లి స్టార్స్  అంతా  ప్ర‌మోష‌న్ కోసం చైనా వెళ్లనున్నారు. చైనాలో దంగ‌ల్‌ను ప్రమోట్ చేసిన డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీనే బాహుబ‌లి 2  ని ప్రమోట్ చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్ప‌టికే రూ.1500 కోట్ల‌కుపైగా వ‌సూలు చేసిన నేప‌థ్యంలో.. చైనాలోనూ అదే రేంజ్‌లో వ‌స్తే మాత్రం దంగ‌ల్‌ను వెన‌క్కి నెట్టడం ఖాయం.దంగల్ చైనాలో 1000 కోట్లు వసూలు చేసిందట.  ప్రపంచవ్యాప్తంగా విడుదలై  అత్యధిక వసూళ్లు  సాధించిన తొలిచిత్రంగా నిలిచిన బాహుబలి-2... జూన్ 15 నాటికి దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. మధ్యమధ్యలో కొన్ని పెద్ద సినిమాలు విడుదలైనా.. 1050సెంటర్లలో అర్ధశతదినోత్సవాన్ని పూర్తి చేసుకుంది.ఇది కూడా ఒక రికార్డే. 
 • "మా నాన్న క్రమశిక్షణ, టైం మేనేజ్మెంట్ లో ముందుంటారు.  షూటింగ్‌ సమయంలో ఉదయం ఐదున్నరకు లేచి ఆరున్నరకి పనులు పూర్తి చేసుకుని ఏడున్నరకి షూటింగ్‌కు వెళ్లేవారు." అని మెగాస్టార్ చిరు గురించి  ఆయన   తనయుడు  రామ్ చరణ్  చెప్పారు. "ఆ క్రమశిక్షణ ను మేము అడాప్ట్‌ చేసుకోగలిగితే గొప్పస్థాయికి ఎదుగుతామనేది నిజం. ఇక ఆయనకు కోపం చాలా తక్కువ. అందుకే ఎపుడు కూల్గా కనిపిస్తుంటారు.  ఇక అమ్మ, నేను ఫ్రెండ్లీగా ఉంటాం. అప్పుడప్పుడూ మాటా మాటా అనుకుంటాం. తిట్టుకుంటాం కూడా. కాసేపటికి మళ్లీ కలిసిపోతాం. ఈ విషయం నాన్నకు తెలీదు. ఆయనకు మహిళలంటే ఎంతో గౌరవం. ముఖ్యంగా అమ్మని ఆప్యాయంగా చూడాలని చెప్పే మహామనిషి. అందుకే తను ఎదురుగా ఉన్నప్పుడు. అమ్మను ఏమీ అననివ్వరు. ఒకసారి నాన్న, అమ్మ, నేను కూర్చుని మాట్లాడుకొంటున్నప్పుడు ‘వెళదాం పదరా ’ అంది ఆమ్మ. వెంటనే నేను ‘కూర్చో’ అన్నా. నాన్నకి కోపం వచ్చి ‘అమ్మని అలా అనకూడదు’ అని నాకు క్లాస్‌ పీకారు. నాకు తెలిసి ఆయన నన్ను కోప్పడిన సందర్భం అదే." అంటూ తన అనుభవాలను రామ్ చరణ్ వివరించారు.
 • బుల్లి తెర శివగామిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ మధుబాల నటిస్తోంది. మధుబాల  తెలుగు లో  రోజా .. అల్లరిప్రియుడు  చిత్రాల్లో నటించింది.  సీరియల్ లో నటిస్తున్న విషయాన్ని మధుబాల స్వయంగా ప్రకటించింది బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రచయిత విజయేంద్ర ప్రసాద్   ఈ  బుల్లి తెర సీరియల్ కు  కథ అందిస్తున్నారు .  బాహుబలి తరహా కథా కథనాలతో రూపొందుతున్న ఈ సీరియల్ లో శివగామి , దేవసేన వంటి పాత్రలు కూడా ఉన్నాయట.  దేవసేన పాత్రలో  సౌత్ బ్యూటీ కార్తీక నటిస్తోంది.  చిత్ర దర్శకుడు గోల్డీ బెహన్, ఆయన భార్య సోనాలి తో ఉన్న స్నేహం కారణంగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ సీరియల్ లో నటించేందుకు అంగీకరించానాని చెబుతోంది  మధుబాల.గ్రాఫిక్స్ తో హిందీలో రూపొందుతున్నఈ  ఆరంభ్ సీరియల్ త్వరలో టెలికాస్ట్ కానుంది. 
 • ఎన్టీఆర్ తాను నటించిన దుర్యోధనుడు ,రావణుడు పాత్రలు  కూడా హీరో పాత్రలకు తగ్గకుండా ఉంటాయి. దుర్యోధనుడికి డ్యూయెట్ పెట్టి  అందరిని ఆశ్చర్యపరిచారు ఎన్టీఆర్. అందులో దుర్యోధనుడిగా ఎన్టీఆర్‌ నటన గురించి చెప్పనక్కర్లేదు. అందులోనే   ‘చిత్రం భళారే విచిత్రం’ పాట కూడా ఉంది . దుర్యోధనుడికి ఓ యుగళ గీతం పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన ఎన్టీఆర్‌కే వచ్చిందట. వెంటనే సినారెతో ఆ విషయాన్ని చెప్పారు. ‘ఏం కవిగారూ దుర్యోధనుడికి ఈ చిత్రంలో ఓ యుగళ గీతం పెడితే ఎలా ఉంటుంది’ అని అడిగితే బాగుంటుందని సినారె చెప్పారు. దాంతో ఆ పాట రాసే బాధ్యత కూడా సి.నారాయణరెడ్డికే అప్పగించేశారు ఎన్టీఆర్‌. సాహిత్యంలో ఇష్టమొచ్చిన పద ప్రయోగాలు చేసుకోమని కూడా చెప్పేశారట ఎన్టీఆర్‌. అలా ‘చిత్రం భళారే..’ పాటకు అంకురార్పణ జరిగింది. ఆ పాటలోని పదప్రయోగాలు ఎన్టీఆర్ కి  ఎంతగానోనచ్చాయని చాలాసార్లు చెప్పారు సినారె. పాట చిత్రీకరణ కూడా అపూర్వం. దుర్యోధనుడికి డ్యూయెట్ రాసిన ఖ్యాతి సినారెకి ఆ విధంగా దక్కింది.
 • నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పైసా వసూల్' సినిమా సెప్టెంబర్ 29న విడుదల కానుంది. ఈ విషయాన్ని బాలయ్యతో కలసి పోర్చుగల్ నుంచి చేసిన లైవ్ ఛాట్ లో పూరి జగన్నాథ్ ప్రకటించారు.  మరోవైపు మహేశ్ బాబు, మురుగదాస్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'స్పైడర్' సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. స్పైడర్ టీజర్ కి పెద్దఎత్తున ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక బాలయ్య శాతకర్ణి తర్వాత చేస్తోన్న పైసా వసూల్ పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి.   కేవలం ఒకటి రెండు రోజుల  తేడాతో ఇద్దరు అగ్ర హీరోల  సినిమాలు రిలీజ్ అవుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా సందడి చేస్తుందనే చర్చ అప్పుడే అభిమానుల్లో మొదలైంది. పోటాపోటీగా ఫిక్స్ అయినా డేట్స్ లోనే విడుదల చేస్తారా ? డేట్స్ మార్చుకుంటారా ? అనే విషయం కూడా తేలాల్సి ఉంది. 
 • వెయ్యి కోట్ల బ‌డ్జెట్‌తో మ‌ళ‌యాళ నటుడు  మోహ‌న్‌లాల్ ప్ర‌తిష్టాత్మ‌కంగా మ‌హాభార‌తం ను  తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఎంటీ వాసుదేవ‌న్ నాయ‌ర్ ర‌చించిన న‌వ‌ల  ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. భీముని దృష్టికోణంలో మ‌హాభారతం ఎలా ఉంటుంద‌న్న‌ది ఈ న‌వ‌ల సారాంశం. ఈ సినిమాపై ఇప్ప‌టికే ఫ్యాన్స్ లో క్రేజ్ ఏర్పడింది.  సాధార‌ణ అభిమానులే కాదు ఏకంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ సినిమా నిర్మాణం గురించి కొన్ని హిందూ సంస్థలు బెదిరిస్తున్న నేపథ్యంలో ప్రొడ్యూస‌ర్ బీఆర్ శెట్టికి మోదీ ఓ లేఖ కూడా పంపిన‌ట్లు వార్త లు వచ్చాయి. ఇందుకు స్పందించిన మోడీ  దేశానికి ఈ సినిమా గ‌ర్వ‌కార‌ణంగా నిల‌వాల‌ని ఆకాంక్షించిన‌ట్లు స‌మాచారం. వ‌చ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంది.  రెండు భాగాలుగా సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.  2020లో తొలి భాగం, త‌ర్వాత 90 రోజుల‌కు రెండో భాగం రిలీజ్ అవుతాయి . మ‌ళ‌యాలంతోపాటు తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ్‌, ఇంగ్లిష్ భాష‌ల్లో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. మోహ‌న్‌లాల్ ఈ సినిమాలో భీముని పాత్ర పోషించ‌నున్నాడు. జాతీయ‌, అంత‌ర్జాతీయ స్టార్ న‌టులు ఇందులో న‌టిస్తున్నారు. కాగా ఈ సినిమా టీం మోదీ ని కలిసే యత్నాల్లో ఉన్నారు. 
 • 'తప్పు తెలుసుకున్నా'  అంటున్నారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ . సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా  రామ్‌గోపాల్‌ వర్మ చేసిన విమర్శలు  అన్నీ, ఇన్నీ కావు. ఇవన్నీ చివరకు వర్మ బతికుండగానే  కీర్తిశేషుడిని కూడా చేశాయి. దానికి కూడా వర్మ స్పందించాడు. మొత్తం మీద ట్విట్టర్‌ వేదికగా ఇతరులను, ముఖ్యంగా మెగాహీరోలను వర్మ విపరీతంగా విమర్శించిన వైనం తెలిసిందే. తాజాగా ట్విట్టర్‌ నుంచి వర్మ నిష్క్రమించాడు. ఇలా నిష్క్రమించడానికి గల కారణం చెబుతూ, మెగా హీరోల విషయంలో తప్పు తనదే అని అంగీకరించాడు.  ‘నేను ట్విట్టర్‌ ద్వారా ఎవరినైతే టార్గెట్‌ చేయాలనుకున్నానో, వారు నాకు బోర్‌ కొట్టారు. అలాగే నేను వారిపై చేసే ట్వీట్లు కూడా నాకు బోర్‌ కొట్టాయి. అందుకే ట్విట్టర్‌ నుంచి బయటకు వచ్చేశా. ఇక, మెగా హీరోల విషయంలో తప్పు నాదే. ఎవరికైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ, అది అవతలి వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయకూడదు. అది ఆలస్యంగా తెలిసి బుద్ధి వచ్చింద’ని చెప్పాడు వర్మ.
 • ప్రిన్స్ మ‌హేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్పైడ‌ర్ మూవీ టీజ‌ర్ రిలీజైంది. సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు కానుక‌గా స్పైడ‌ర్ టీం ఈ టీజ‌ర్ ని విడుద‌ల చేసిన కొన్ని గంట‌ల‌కే యూట్యూబ్ లో దుమారం రేపుతోంది. కంప్యూట‌ర్ ముందు కూర్చుని హ్యాక్ చేస్తున్న మ‌హేష్ మీద‌కి ఓ రోబో స్పైడ‌ర్ ఎక్కుతున్న వీడియో  చూస్తుంటే ఫ్యాన్స్ లో స్పైడ‌ర్ సినిమా అంచ‌నాల‌ను మ‌రింత పెంచేస్తున్నాయి. హ‌లీవుడ్ త‌ర‌హాలో ఉన్న ఈ టీజ‌ర్ పై సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల పాజిటీవ్ కామెంట్లు వ‌స్తున్నాయి. ఊహించందానికంటే కాస్త ఎక్కువగానే ఉన్న ఈ వీడియో సినిమాపై ఉన్న అంచనాల్ని ఇంకాస్త పై స్థాయికి తీసుకెళ్లింది. మహేష్ బాబును ఎంత స్టైలిష్ గా ప్రెజెంట్ చేశాడో ఈ గ్లింప్స్ వీడియోను కూడా అంతే స్టైలిష్ గా రూపొందించాడు మురుగదాస్. ఈ వీడియోతో సినిమా సాంకేతికంగా గొప్ప స్థాయిలో ఉంటుందని, యాక్షన్స్, థ్రిల్స్ మెండుగా ఉంటాయని ఇట్టే అర్థమవుతోంది. అలాగే సంగీత దర్శకుడు హారీశ్ జైరాజ్ కూడా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి ఆకట్టుకున్నాడు. మరోవైపు మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం బయో టెర్రరిజం నైపథ్యంలో ఉంటుందని కూడా అంటున్నారు. మరి తన ప్రతి సినిమాలోనూ ముఖ్యమైన సామాజిక అంశాన్ని చాలా బలంగా చూపించే మురుగదాస్ ఈ సినిమాతో ఏం చెప్తారో చూడాలి.
 • బుల్లితెరలో ప్రసారమవుతున్నజబర్దస్త్ , పటాస్  ప్రోగ్రామ్ నిర్మాత దర్శకులకు  హ్యూమన్ రైట్స్ కమిషన్  నోటీసులు జారీ చేసింది. జబర్దస్త్, పటాస్‌  లపై  ప్రేక్షకుల నుంచి నిరసన వెల్లువెత్తుతోంది . మగవాళ్లకి ఆడవేషాలు వేస్తూ అత్యంత జుగుస్పాకరంగా బూతులు, ద్వందార్థాలు  మాట్లాడిస్తూ  ఆడవారినికి కించపర్చేలా  చిన్న పిల్లలను కూడా అత్యంత దారుణంగా చూపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి . చిన్న, పిల్లలతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడించడం అన్నీ ద్వందార్థాల మాటలే  ఈ షో లలో వినిపిస్తాయి.  ఇప్పటికే కొంతమంది ప్రముఖులు కూడా  రామోజీ రావు ఇలాంటి చెత్త షోలు నిర్వహించడం ఏమిటని మండి  పడినా ప్రయోజనం లేదు .ఈ కార్యక్రమాలపై మహిళా సంఘాలు కూడా ధ్వజమెత్తున్నాయి. మహిళలను కించపర్చే విధంగా ఈ షోలలో చూపిస్తున్నారని వివాహేతర సంబంధాలు అత్యంత కామన్ అన్నట్టుగా ఈ షోలలో చూపిస్తూ సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు.  బుల్లితెరలో ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలపై  రసవత్తర చర్చ సాగుతోంది. ముఖ్యంగా సినీ నటుడు చలపతి రావు అమ్మాయిలు గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఇపుడు 'జబర్దస్త్', 'పటాస్' బూతు కామెడీ, ద్వంద్వార్థాలపై చర్చకు తెరలేచింది.  ఈ షోల్లో అసభ్యత పెరిగిందని హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ పోలీస్ స్టేషన్‌లో సెన్సార్ బోర్డు సభ్యుడు ఎన్ దివాకర్ ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదని, సదరు షోలపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, దివాకర్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హెచ్ఆర్సీ.. ఈ రెండు కార్యక్రమాల నిర్మాతలు, దర్శకులకు నోటీసులు జారీ చేస్తూ, ఆగస్టు 10 లోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇపుడు ఏమి జరుగుతుందో చూడాలి. 
 • సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా హిందీలో బాగా పాపులర్ అయిన రియాల్టీ షో 'బిగ్ బాస్' త్వరలో తెలుగులో కూడా ప్రసారం కాబోతోంది. తెలుగులో ఈ షోను యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్నారు . ఇటీవలే స్టార్ నెట్వర్క్‌లో విలీనం అయిన 'మా టీవీ' తెలుగు వెర్షన్ 'బిగ్ బాస్' ప్రసారం చేయబోతోంది. ఈ విషయమై మాటీవీ నుండి అధికారిక ప్రకటన వెలువడింది. ఈ షో ద్వారా తొలిసారిగా జూ ఎన్టీ బుల్లితెరపై ఎంట్రీ ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారింది .కాగా  రియాలిటీ షో కోసం అత్యధిక రెమ్యూనరేషన్ అందుకోబోతున్న హీరోగా ఎన్టీఆర్ సరికొత్త రికార్డు సృష్టంచబోతున్నాడు. గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం కోసం నాగార్జునకు, తాజాగా ఇదే షోకు చిరంజీవికి ఇచ్చిన  పారితోషకం కంటే  అత్యధిక మొత్తాన్ని ఎన్టీఆర్ కి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.  జులై లో స్టార్ మా లో బిగ్ బాస్ రియాలిటీ షో ప్రారంభం అవుతుంది. తమిళం లో ఇదే షో ను కమల్ హాసన్ హోస్ట్ చేయబోతున్నారు.  కన్నడం  లో నటుడు సుదీప్ చేస్తున్నారు.  తెలుగు తమిళ్ వెర్షన్లు జులై లో ఒకే సారి మొదలు కావచ్చని అంటున్నారు.
 • స్టార్ డైరెక్టర్ గా భాసిల్లిన దాసరి నారాయణరావు (75) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం కిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు . కొంత కాలంగా దాసరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాసరి కింది స్థాయి నుంచి కష్టపడి పైకొచ్చారు. ఎందరికో చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇచ్చారు.  తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకులకు స్టార్ ఇమేజ్ తెచ్చిన ఖ్యాతి దాసరిదే .  40 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు .  భారీ బ్లాక్‌ బస్టర్‌లను తీశారు .  ఎన్టీఆర్‌తో ఆయన చేసిన బొబ్బిలి పులి, సర్దార్‌ పాపరాయుడులాంటి సినిమాలే ఎన్టీఆర్‌ ను రాజకీయ రంగం వైపు మళ్లించాయి . అక్కినేని  హీరోగా ఆయన తీసిన మేఘసందేశం  ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించబడింది. కమర్షియల్ సినిమాలతోపాటు ఒరేయ్‌ రిక్షా, ఒసేయ్‌ రాములమ్మలాంటి సినిమాలతో సామాజిక  సమస్యలపై  సమర శంఖం పూరించారు .  మేస్త్రీ, ఎమ్మెల్యే ఏడుకొండలు లాంటి సినిమాలతో రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు  సంధించారు. తెలుగు ఇండస్ట్రీలోని అందరు స్టార్‌ హీరోలతో సినిమాలు చేసిన దాసరి.. నటుడిగానూ  పేరు తెచ్చుకున్నారు . మామగారు, మేస్త్రీలాంటి సినిమాలకు ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు అందుకొని మహానటుల సరసన నిలిచారు. తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ దాసరి సత్తా చాటారు. దాదాపు దక్షిణాది భాషలన్నింటితోపాటు హిందీలోనూ సినిమాలను తెరకెక్కించారు.  కాంగ్రెస్‌ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా తరువాత కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. తెలుగు సినీ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు. ఉదయం పత్రికను కొంత కాలం నడిపారు . బొబ్బిలిపులి , శివరంజని  పత్రికలను  కూడా తీసుకొచ్చారు. అప్పట్లో ఈ నాడు హావాను ఉదయం దెబ్బ తీసింది. ఎందరో జర్నలిస్టులను పత్రికాప్రపంచానికి అందించింది.