Latest News
ప‌ర్యాట‌కం
 • కొలనుపాక చండికాంబ సహిత సోమేశ్వరాలయానికి ఘనమైన చరిత్ర ఉంది.  వీరశైవ మతాచార్యులు శ్రీశ్రీ రేణుకాచార్యుల జన్మస్థలంగా ఉన్న కొలనుపాక సోమేశ్వరాలయానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. సోమేశ్వర మహాలింగం నుంచి ఉద్భవించిన ఈ ఆచార్యులు వీరశైవమతాన్ని ప్రపంచానికి బోధించి లింగంలోనే ఐక్యం చెందాడని అంటారు.  కొలనుపాక శివారుప్రాంతాల్లో  జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ శిలాశాసనాలు, దేవతా ప్రతిమల ఆధారంగా ఇక్కడి చరిత్ర మనకు తెలుస్తోంది. దక్షిణ కాశిగా పిలువబడే ఈ గ్రామంలో కాశీలో ఉన్నట్లుగా 18 సామాజిక వర్గాలకు మఠాలు ఉన్నాయి. అలాగే చండీశ్వరీ ఆలయం, కోటిలింగేశ్వరాలయం, భైరవస్వామి  ఆలయం, రుద్రమహేశ్వరాలయం, ఏకాదశరుద్రాలయం, మల్లికార్జున స్వామి ఆలయం, క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి ఆలయాలు ఉన్నాయి.   వీరశైవ మతగురువైన రేణుకాచార్యులు చండికాంబ సహిత సోమేశ్వరాలయంలోని స్వయంభూ లింగం నుంచి ఉద్భవించి చివరకు అదే లింగంలో ఐక్యం అయినట్లు వీరశైవ కవి షడక్షరుడు రాసిన రాజశేఖర విలాసంలో ఉంది. వీరశైవ మతోద్ధరణ కోసం రేణుకాచార్యులు ఎంతోకృషి చేశారు . ఈ శైవపీఠానికి సంబంధించిన వివరాల ప్రకారం తానుకేశుడనే శైవాచార్యునికి రుద్రమునీశ్వరుడనే కుమారుడున్నాడు. తానుకేశుని అనంతరం రుద్రమునీశ్వరుని లింగాయతు మతానికి అధిపతిని చేశాడు.  ఆయన కొలనుపాక కేంద్రంగా వీరశైవ మతాన్ని స్థాపించి ప్రచారం చేశాడని చెబుతారు.  10, 11వ శతాబ్దానికి చెందిన పశ్చిమ చాళుక్యుల కాలం నాటినుంచి నేటివరకు సోమేశ్వరుడు, చండికాంబ దేవతలు నిత్యపూజలు అందుకుంటున్నారు. చాళుక్యుల కాలంలో కొలనుపాక గ్రామం రాజప్రతినిధి స్థానంగా ఉండేదని సమాచారం. సైనికపరంగా దక్షిణాపథంలో కొలనుపాక ముఖ్యకేంద్రంగా ఉండేదట. రాజులు, రాజప్రతినిధులు  ఆలయ నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి చేసినట్లు దొరికిన శాసనాల్లోరాసి ఉంది అంటారు.  యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఉన్న ఈ దేవాలయానికి దేశ, విదేశాల నుంచి భక్తులు రోజు వచ్చి పోతుంటారు. మధ్యయుగానికి ముందు నుంచే ఇక్కడ ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టమెనదిగా చెబుతారు.  ఇక్కడ స్వామి వారు లింగాకారంలో భక్తులకు దర్శనమిస్తారు.  ఈ ఆలయంలో ఉన్న సహస్ర లింగేశ్వరుని కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సోదరి మైలాంబ ప్రతిష్టించినట్లు ప్రతీతి. ప్రధానాలయంలోనే చండికాంబ అమ్మవారు ఉంటారు. కోరిన కోర్కెలు తీర్చమని అమ్మవారికి భక్తులు ముడుపులు కడతారు. కోర్కెలు తీరిన తర్వాత అమ్మవారికి ఒడిబియ్యం పోయడం ఇక్కడ ప్రత్యేకత. పక్కనే కోటొక్కలింగం అత్యంత రమణీయంగా భక్తులకు కనువిందు చేస్తుంది. దేవదేవుని ప్రతిరూపమైన లింగాకారానికి ఖర్జురపు పండ్ల ఆకారంలో చెక్కబడిన చిన్నచిన్న లింగాలన్నిటినీ కలుపుకుంటే కోటొక్కటి ఉంటాయని చెబుతారు. ఈ కోటొక్కలింగాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఆలయం ప్రాంగణంలోనే  పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ఈ కొలనుపాక ఆలయం, గ్రామ చరిత్రకు సంబంధించిన పలు విషయాలను తెలియ జేస్తుంది. కళ్యాణ చాళుక్యులు, కాకతీయ రాజుల ఏలుబడిలో గొప్ప శైవక్షేత్రంగా కొలనుపాక వెలుగొందిన విషయాలను విపులంగా వివరిస్తోంది. కొలనుపాక సోమేశ్వరాలయానికి తెలంగాణతో పాటు ప్రతి నిత్యం కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి లింగాయత్‌లు వస్తారు. తమ ఆరాధ్యదైవం సోమేశ్వరునితోపాటు జగద్గురువు రేణుకాచార్యులను దర్శనం చేసుకుని వెళ్తారు. శివరాత్రి పర్వదినం రోజు వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. దేశ విదేశాల పర్యాటకులు వచ్చిపోతుంటారు. హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది కొలనుపాక. యాదాద్రి దివ్యక్షేత్రం నుంచి 20 కిలోమీటర్ల దూరం! ఇక్కడికి  ఆర్టీసీ బస్‌లు, రైళ్లు ఉంటాయి. భక్తులు ఆలేరులో దిగిన తర్వాత ఆటోలు, ఆర్టీసీ బస్‌లలో ఐదుకిలోమీటర్ల దూరంలో ఉన్న కొలనుపాకకు వెళ్లవచ్చు. ఆలేరు– చేర్యాల మార్గంలో కొలనుపాక ఉంది....
 • భారతంలో దుర్యోధనుడికి ,శకునికి దేవాలయాలు ఉన్నట్టే కురు పితామహుడైన భీష్ముడికి అలహాబాద్‌ నగరం లో ఒక ఆలయం ఉంది. ఈ దేవాలయానికి దేశంలోని మారుమూలల నుంచి ఎందరో భక్తులు వచ్చి భీష్మపితామహుడిని సందర్శించుకుంటారు..పెద్దలను స్మరించుకోవడం కోసం ఈ దేవాలయానికి ప్రధానంగా పితృపక్షాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. భీష్మ ఏకాదశి రోజుకూడా భక్తులు వస్తుంటారు. అలహాబాద్ లోని నాగవాసుకి అత్యంత సమీపంలో ఈ భీష్మ దేవాలయం ఉంది. ఈ దేవాలయాన్ని భట్‌ అనే న్యాయవాది నిర్మింపచేశాడు. 1961 నాటికి నిర్మాణం పూర్తయ్యింది. భీష్మపితామహుడు అంపశయ్యపై పడుకున్న భంగిమలో ఇక్కడ దర్శనమిస్తాడు. గంగాభక్తురాలైన ఒక వృద్ధ స్త్రీ ప్రతిరోజూ నదిలో స్నానం చేయడానికి వచ్చేదట. ఆమె స్వయంగా భట్‌ దగ్గరకు వచ్చి గంగాపుత్రునికి ఒక దేవాలయం నిర్మించమని వేడుకుందట. ఆమె వేడుకున్న తర్వాత ఆయనలో ఆలోచనకు అంకురార్పణ జరిగిందట. అలా గంగానదీ సమీపాన ఉన్న నాగవాసుకి దేవాలయానికి సమీపంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది కురుక్షేత్రలో భీష్మకుండ్‌ హర్యానాలోని కురుక్షేత్రలో ఈ ప్రదేశాన్ని చూడవచ్చు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన చోట ఒక పెద్ద నీళ్ల ట్యాంకు ఉంది. దానిని బన్‌గంగ లేదా భీష్మకుండ్‌ అంటారు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడికి దాహం వేసి మంచినీరు కావాలని కోరడంతో, అర్జునుడు బాణంతో పాతాళగంగను బయటకు తీసుకువచ్చాడని, ఈ భీష్మకుండ్‌ అదేనని స్థానికులు చెబుతారు. ఈ రెండు ప్రదేశాలు అరుదైనవి. అంతగా ప్రాచుర్యం కూడా పొందలేదు....
 • ఈ భూమండలం పై  తిరుమలకి మించిన  మరో  దివ్యక్షేత్రం లేదు...ఆ వెంకటేశ్వరునికి సమానమైన దైవం లేదని మన పురాణాలు చెబుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే  తరతరాలుగా తిరుమల క్షేత్ర వైభవం..కొంచెంకూడ తగ్గడం లేదు. రోజురోజుకి స్వామివారి ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపిస్తున్నది . అందుకే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరుడిని కనులారా దర్శించుకుని ఆ దేవదేవుని కృపకు పాత్రులయ్యేందుకు  ఎంతో శ్రమ ప్రయాసల కోర్చి తిరుమల కొండకు ప్రతి నిత్యం వేలాదిగా భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుచానూరు పద్మావతీదేవి, శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయం, కాణిపాకం గణేశుడు తదితర ఆలయాలను దర్శించుకోవడంతో పాటు హార్స్లీహిల్స్, తలకోన లాంటి అనేక  పర్యాటక  ప్రాంతాలను సందర్శించుకోవాలని అనుకుంటారు. అయితే చాలామంది భక్తులకు సమయం  సరిపోకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతుంటారు.  సరిగ్గా ఇటువంటి భక్తుల పై  ఏపీ  పర్యాటక శాఖ దృష్టి పెట్టింది. తక్కువ సమయంలో అన్ని అధ్యాత్మిక ప్రాంతాలతో పాటు టూరిజం ప్రదేశాలను సందర్శించే విధంగా ప్రణాళికలు రూపొందించింది. తిరుపతి వచ్చే యాత్రికుల కోసం హెలీ టూరిజానికి శ్రీకారం చుట్టింది. తిరుపతి నగరంలో ఉన్న శిల్పారామం నుంచి బయల్దేరి.. కాణిపాకం, శ్రీకాళహస్తి, చెన్నై నగరాలను కలుపుతూ హెలీటూరిజంలో ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించాలన్నది పర్యాటక శాఖ ప్రతిపాదన. గతంలో బ్రహ్మోత్సవాల సమయంలో పవన్‌ హాన్స్‌ ఆధ్వర్యంలో ఆరు సీట్ల హెలీకాప్టర్లను తిరుపతి నగరంలోనే రెండు ట్రిప్పులు తిప్పేలా ప్రణాళిక వేశారు. సరదాగా ఒకసారి హెలీకాప్టర్‌ ఎక్కాలనుకునే వారికి ఇది బాగానే ఉంది. దీంతో నగరవాసులు చాలామంది దీనిపై ఆసక్తి చూపారు. అది అలా విజయవంతమైంది.  ఈ  సారి రెండువేల రూపాయల టిక్కెట్  ధర పెట్టి  యాత్ర మొదలు పెట్టాలని భావిస్తున్నారు.  ...
 • గండికోట.....   రాయల సీమలో ప్రముఖ చారిత్రక ప్రదేశం ఇది . అలాగే  పర్యాటక కేంద్రం కూడా . గండికోట. జమ్మల మడుగు పట్టణానికి 14కి.మీ దూరంలో పెన్నానదికి కుడివైపున ఏర్పడిన పొడవైన గండిపై  కోటను నిర్మించారు ఈ ప్రాంతంలో పరుచుకొని ఉన్న ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చిందట. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవు దాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉండేదట. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్‌ శిలలతో ఏర్పడిన దుర్భేద్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో మదిని పులకింజేసే సుందర దృశ్యాలను గండికోట ఆవిష్కరిస్తుంది .వెయ్యేళ్ళ చరిత్ర గల ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం  ఎంతో ఉంది.  క్రీ.శ.1123 జనవరి 9వ కళ్యాణీ చాళుక్య రాజు త్రైలోక్య మల్లు సామంత రాజు కాకరాజు ఈ కోటని నిర్మించినట్టు దుర్గం కైఫియత్‌ ద్వారా చరిత్రకారులు గుర్తించారు.రాయల సీమలో అత్యంత విశిష్టమైన కట్టడంగా పేరొందిన గండికోటలో కాలక్రమంలో కోటపై జరిగిన దండయాత్రల కారణంగా అక్కడ ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి.  శిధిలమైన నిర్మాణాలు, శాసనాలు, కోట నిర్మాణ నైపుణ్యతని, నాటి రాచరిక పాలనని తెలియ జేస్తాయి.   ప్రఖ్యాత ఫ్రెంచ్‌ యాత్రికుడు, వజ్రాల వ్యాపారి టావెర్నియర్‌చే రెండవ హంపీగా అభివర్ణించబడ్డ గండికోట నిర్మాణాల్లో ఎర్రకోనేరు, రామబాణపు బురుజు, ఆయుధ కర్మాగారం, రాయలచెరువు, ఫరాబాగ్‌ జలపాతం, కందకాలు, అగడ్తులు, రహస్య మార్గాలు, మైలవరం, చంద్రగిరి మ్యూజియాల్లో పొందుపరిచిన శిల్పాలు, అక్కడి ఆలయాలు  కీలకమైనవి. చాళుక్యులు, విజయనగరరాజులు, పెమ్మసాని నాయకులు వంటి రాజుల పాలనలో వారికి జీవన శైలికి అద్దం పడుతున్న గండి కోట చారిత్రక కట్టడాలను ఒక్కసారైనా చూడాల్సిందే. ...
 • భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఈ ఆలయం  ఉంది.  పల్లవులకాలంనాటి అద్భుత శిల్పకళకు నిలువుటద్దం  భైరవకోన .    పురాతన గుహలకు నెలవు  ఈ ప్రాంతం.  సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూ పంగా అనిపిస్తుంటుంది.  కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది ప్రాచీనకాలంనుంచి ఉన్నదే. ఆంధ్రప్రదేశ్‌ లో వీటి జాబితా చాలానే ఉంది. గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ఈ  భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. వీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం. శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు.ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు.అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు  కనిపిస్తుంటాయి. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు. ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అమరనాథ్‌లో కన్పించే శశినాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుదల్రింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వ రిలింగం, భర్గేశ్వరలింగం (ఇక్కడి ప్రధానదైవం) రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామే శ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు. ఇక్కడ ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఉంటుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ. మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాలయం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోపాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కివుండడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగా ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది. అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా. ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు. ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళుక్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొనసాగి ఉంటుందని అంచనా. భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబవరం...  కొత్తపల్లి చేరుకుంటే  ఉదయం నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది. అంతకు మించి వసతులు లేవు. తప్పని సరిగా చూడాల్సిన క్షేత్రమిది. ...
 • కర్నూలు జిల్లా నందికొట్కూరులోని సూర్యభగవానుడి ఆలయం ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ఈ క్షేత్రంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్య కిరణాలు నేరుగా స్వామివారి పాదాల్ని తాకుతాయి. ఆలయం మధ్యలో కూర్మయంత్రం ఉండటం మరో విశిష్టత. ఆ కారణంగానే, ఇక్కడ సూర్యారాధన చేసిన వారికి ఉత్తమ ఫలితాలుంటాయని చెబుతారు అర్చకులు. పదమూడో శతాబ్దంలో చోళవంశీయుడైన సిరిసింగరాయలు ఈ ప్రాంతానికి వేటకొచ్చాడు. అలసిసొలసి ఓ చెట్టు నీడన సేదతీరుతుండగా సూర్యభగవానుడు కలలో కనిపించి...అక్కడ తనకో ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. ఆ ఆనతి ప్రకారం సిరిసింగరాయలు చక్కని సూర్యాలయాన్ని కట్టించాడని చెబుతారు.  గర్భాలయంలో మూలమూర్తి కుడి చేతిలో తెల్లని పద్మం ఉంటుంది. ఎడమ చేయి అభయముద్రలో కనిపిస్తుంది. చోళుల పాలన అంతరించిపోయాక కూడా ఎంతోమంది రాజులు స్వామివారిని కొలిచారు. కాలక్రమంలో ఈ  చారిత్రక ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. పదహారేళ్ల క్రితం కొందరు భక్తులు  తలోచేయీ వేసి జీర్ణోద్ధారణ చేశారు. ఆదివారం వచ్చే అమావాస్యను భాను అమావాస్య అంటారు. భాను సప్తమి కూడా అంతే ప్రత్యేకమైంది. ఆ రోజుల్లో భాస్కరుడిని విశేష పూజలతో కొలుస్తారు. సూర్యగ్రహ శాంతులు, హోమాలు, అభిషేకాలు, జిల్లేడు ఆకు పూజలూ నిర్వహిస్తారు. జిల్లేడు ఆకులంటే సూర్యుడికి చాలా ఇష్టం. వీటినే అర్క పత్రాలనీ అంటారు. రథ సప్తమినాడు స్వామివారి ఆలయంలో ఘనంగా కల్యాణం నిర్వహిస్తారు. పరిసర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. కర్నూలుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందికొట్కూరు పట్టణాన్ని చేరుకోవదానికి రవాణా సౌకర్యాలు బాగానే ఉన్నాయి. టూరిజం శాఖ పూనుకుని  మరిన్ని సదుపాయాలు కల్పిస్తే  ఇక్కడి దేవాలయం మరింత ప్రాచుర్యానికి నోచుకుంటుంది.  ఏపీలో అరసవిల్లి , కాకినాడ , ఆ సమీప ప్రాంతాల్లో కూడా సూర్య దేవాలయాలు ఉన్నాయి. ...
 • అరుణాచల్ ప్రదేశ్ లోని వాయవ్య ప్రాంతంలో వున్న తవాంగ్ . బౌద్ధమత ప్రాంతం. ఇక్కడ పడే మంచు హిమపాతం పర్యాటకులకు అద్భుత ఆనందాలు కలిగిస్తుంది. ఈ ప్రదేశానికి టూరిస్ట్ లు సంవత్సరం పొడవునా వస్తూనే వుంటారు.అరుణాచల్‌ ప్రదేశ్‌లో బౌద్ధులు అధికం. దీంతో ఈ ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ ఆశ్రమాలకు ఆలవాలంగా వెలుగొందుతోంది. "త" అంటే గుర్రం అని, "వాంగ్" అంటే ఎంపిక అని అర్ధం. తవాంగ్‌ హిమాలయ పర్వతాలపై దాదాపు 12వేల ఆడుగుల ఎత్తున ఉంది. తవాంగ్‌లో టిబెటన్ల సంఖ్య ఎక్కువ. టిబెటన్లు ఎప్పుడూ ఇక్కడ ప్రార్ధనలు చేస్తూ బౌద్ధమత ఆరాధనలో నిమగ్నులవుతారు. ప్రశాంతమైన నీటి సరస్సులు, నదులు, ఆకాశంలో నీలంరంగును ప్రతిబింబింప చేసే అనేక ఎత్తైన జలపాతాలు, కొన్నిసార్లు మేఘాలు భార౦గా తేలుతున్నట్లు సందర్శకులకు మంత్రముగ్ధుల్ని చేసే అనుభూతిని కలిగిస్తాయి. ప్రకృతిని ఆనందించాలి అనుకునే నిజమైన ప్రేమికులను ఈ రహస్య స్వర్గం స్వాగతిస్తుంది. ఇక్కడ 27 అడుగుల ఎత్తు కల బంగారు బుద్ధ విగ్రహం అందరిని ఆకట్టు కుంటుంది. తవాంగ్‌ బౌద్ధారామం భారతదేశంలోనే అతిపెద్ద ఆరామంగా కొనసాగుతున్నది. లాసా(టిబెట్‌)లోని పోతల ప్యాలెస్‌ ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధారామంగా ఖ్యాతిగడించింది. ఆ తర్వాతి స్థానం తవాంగ్‌దే కావడడం విశేషం. ఏటా ఇక్కడికి లక్షలమంది బౌద్ధారాధకులు వచ్చివెళుతుంటారు. సూర్యుడు మొదటసారిగా ఉదయించే ప్రాంతం ఇదే .ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి . తవాంగ్ యుద్ధ స్మారకం......... భారత-చైనాల మధ్య 1962లో జరిగిన యుద్ధంలో చైనా సైనికులను ఒంటరిగా పోరాడిన భారతీయ సైనికుడి వీరమరణం పొందిన చోట స్మారకంను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ స్మారకం సీలా పాస్‌లోని జశ్వంత్‌ఘర్‌లో ఉంది. తవాంగ్ ఆశ్రమం ........   బౌద్ధమతంలో మహాయాన వర్గం వారు ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకున్నారు. లాసా తర్వాత అతి ప్రాచీన ఆశ్రమం తవాంగ్‌లో మాత్రమే ఉంది. తవాంగ్ ఆశ్రమాన్ని మెరాగ్ లామా లోడ్రీ గిమాస్ట్సో నిర్మించారు. ఈ ఆశ్రమం 1681లో నిర్మించారని అంటుంటారు. ఆశ్రమం పక్కనే బౌద్ధ సన్యాసులు నివసించేందుకు వీలుగా వసతి గృహాలు ఏర్పాటుచేశారు. తవాంగ్ ఆశ్రమంలో ప్రాచీన గ్రంధాలయంతో పాటుగా వస్తు ప్రదర్శనశాల కూడా ఉంది. దాదాపు 500 మంది బౌద్ధ సన్యాసులకు వసతి కల్పించేది తవాంగ్ ఆశ్రమం. రాత్రిపూట తవాంగ్ ఆశ్రమాన్ని విద్యుదీప కాంతులతో చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఆశ్రమంలో లోపల 8మీటర్లు ఎత్తైన బౌద్ధ విగ్రహం ఉంది. లాసాలోని పోతలా ఆశ్రమం తర్వాత అతిపెద్దది తవాంగ్ ఆశ్రమం. ఉర్గెలింగ్ ఆశ్రమం....... ఆరవ దలైలామా ఉర్గెలింగ్ ఆశ్రమంలో పుట్టాడని బౌద్ధులు భావిస్తారు. ఈ ఆశ్రమం 14వ శతాబ్దం నుంచి ఉందని బౌద్ధులు అంటుంటారు. తవాంగ్ పట్టణం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉర్గెలింగ్ ఆశ్రమం ఉంది. తవాంగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు వసతి సదుపాయాలు ఉన్నాయి....
 • కృష్ణాజిల్లాలోని కొండపల్లి ఖిల్లాను పర్యాటకుల స్వర్గధామంలా మార్చేందుకు ఏపీ పర్యాటక శాఖ కసరత్తు చేస్తోంది. 4కోట్ల రూపాయల వ్యయం తో  ఎనిమిది ఎకరాల్లో ఖిల్లాకు కొత్త హంగులను అద్దేందుకు పనులు చేపట్టాలని నిర్ణయించింది. కోటను ప్రతిబింబించేలా విద్యుత్‌ వెలుగులతోపాటు ఆ ప్రాంతంలో ఆసియాలోనే తొలిసారిగా ఓపెన్‌ ఎయిర్‌ మ్యూజియం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. పర్యాటకులు ఆహ్లాదంగా గడపగలిగేలా కోటను అభివృద్ధి చేయాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాచరిక వైభవాలకు నిదర్శనంగా నిలిచే ఈ కోట సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులోఉంది. ఈ కోటను రెడ్డి రాజుల వంశానికి చెందిన అన వేమారెడ్డి 1324-1402 మధ్య కాలంలో నిర్మించారు. ఈ చారిత్రక సంపదను కాపాడి భవిష్యత్తు తరాలకు అందించడానికిగానూ పురావస్తుశాఖ.. ఇప్పటికే కెమికల్‌ కన్జర్వేషన్‌ ట్రీట్‌మెంట్‌ వర్క్స్‌ ప్రారంభించింది. మంచినీటి వసతితో పాటు, మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేస్తున్నారు. మైసూరు చాముండి హిల్స్‌, విశాఖపట్నంలో గాలికొండల మాదిరిగా కొండపల్లిలోనూ.. వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు.  చాలా ఎత్తుగా ఉన్న ఈ కొండను ఎక్కటానికి దేశ, విదేశీ పర్యాటకులు ఇబ్బంది పడుతుంటారు. దీంతో పర్యాటకులందరూ కోటను సందర్శించేలా... అత్యాధునికమైన రోప్‌వేను కూడా ఏర్పాటు చేయనున్నారు. కోట చరిత్రకు సంబంధించిన ఆడియో, వీడియో లైబ్రరీలతో పాటు.. అత్యాధునికమైన సౌండ్‌, లైట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. .ఇక్కడి కళాఖండాల పరిరక్షణ కోసం అత్యాధునిక మ్యూజియం రాబోతుంది . కొండపల్లిలో రాయల కాలం నాటి గజశాల, నర్తన శాల, భోజనశాల, ఆర్చ్‌లు, సమావేశ మందిరానికి సంబంధించిన గోడలకు మరమ్మతులు చేస్తున్నారు.  విజయవాడకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపల్లి ఖిల్లాకు  ఆధునికమైన బస్సులను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం కొండపల్లిలో సౌకర్యాలు మెరుగు పర్చితే.. రోజుకు 8 వేలకు పైగా పర్యాటకులు వస్తారని అంచనావేస్తున్నారు....
 • గుజరాత్‌లో 600 ఏళ్ల చరిత్ర కలిగిన అహ్మదాబాద్‌ను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. దీంతో అహ్మదాబాద్‌ పారిస్, వియన్నా, కైరా, బ్రసెల్స్, రోమ్‌ వంటి ప్రఖ్యాత నగరాల సరసన చేరింది. పోలండ్‌లోని క్రాకౌలో జరిగిన ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో ఢిల్లీ, ముంబై నగరాలను వెనక్కినెట్టి అహ్మదాబాద్‌ ఈ గౌరవాన్ని అందుకుంది. భారత దేశంలో ఈ ఘనత దక్కించుకున్న తొలి నగరంగా అహ్మదాబాద్‌ నిలిచింది. భారత్‌లోని చరిత్రాత్మక అహ్మదాబాద్‌ను ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటిస్తున్నామని ‘యునెస్కో’  ప్రకటించింది . అహ్మదాబాద్‌లోని హిందూ, ఇస్లామిక్, జైన్ మతాలకు చెందిన అద్భుతమైన కట్టడాలు, అద్భుత నిర్మాణ సౌందర్యం, అచ్చెరువొందించే చెక్క కట్టడాలు యునెస్కో కమిటీ మనసు దోచాయి.  అహ్మదాబాద్ నగరంలో పురావస్తు శాఖ సంరక్షిస్తున్న 26 కట్టడాలు, వందలాది స్థంభాలు ఉన్నాయి. మహాత్మాగాంధీ ఇక్కడ 1915 నుంచి 1930వరకూ జీవించారు.  ప్రపంచవ్యాప్తంగా మొత్తం 287 వారసత్వ నగరాలున్నాయి. శ్రీలంకలోని గాలె, నేపాల్‌లోని భక్త్ పూర్ నగరాలు వారసత్వ నగరాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి . యునెస్కో గుర్తింపుతో అహ్మదాబాద్‌‌లో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు అహ్మదాబాద్‌ను వారసత్వ నగరంగా గుర్తించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్హం వ్యక్తం చేశారు. భారత్ సంబరాల్లో మునిగి తేలాల్సిన సమయమంటూ మోదీ ట్వీట్ చేశారు. అటు గుజరాత్ సిఎం కూడా యునెస్కో గుర్తింపుపై హర్షం వ్యక్తం చేశారు....
 • ప్రకృతి సహజ సిద్ధమైన వాతావరణం, ఎత్తయిన కొండలు, చుట్టూ దట్టమైన అడవి, 50 అడుగుల ఎత్తు నుండి హొయలు పోతూ జాలువారే నీటి ప్రవాహం .  ఎటు చూసినా పచ్చని గుట్టలు , వాటి మధ్య నుంచి పారే నీళ్ళు, పై నుండి దుమికే జలపాతాన్ని చూస్తే పర్యాటకులు ఇట్టే మైమరిచిపోతారు.  బొగత జలపాతం  ఇప్పటిది కాదు ...  తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ గుట్టల మధ్యనున్న దండకారణ్యంలో సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లందేవి గుట్ట వద్ద బొగత పుట్టింది. అక్కడి నుంచి గుట్టల మీదుగా ప్రవహిస్తూ  పెనుగోలు వద్దకు రాగానే ఈ వాగు పాలవాగుగా మారింది. పెనుగోలు ఊరు దాటిన తర్వాత ఆల్బర్ట్ వాగు అయింది. వాజేడు మండల ఇన్‌చార్జి ఎంపీడీఓ ఆల్బర్ట్ పెనుగోలు వెళ్లినప్పుడు జారి పడటంతో చెయ్యి విరిగింది. అక్కడకు వచ్చిన తొలి అధికారి కూడా ఆల్బర్టే కావడంతో ఈ వాగుకు ‘ఆల్బర్ట్ వాగు’గా నామకరణం చేశారు. అక్కడి నుంచి  6 కిలోమీటర్ల దూరంలోని గుట్టలు దిగి వచ్చిన వాగు చీకుపల్లికి సుమారు అర కిలో మీటరు దూరంలో బండలపై నుంచి జాలు వారి బొగతగా మారింది. గతంలో దీనిని బంధల వాగు అనే వారు. ఏడు మంచాలకు సరిపడా నులక వేస్తే అందనంత లోతుగా ఈ జలపాతం ఉంటుందని ఇప్పటికీ చెప్పుకుంటారు. జలపాతం ఈ ప్రాంతంలోని వారికి చాలాకాలంగా తెలుసు కానీ ఎవ్వరూ అక్కడికి వెళ్లే వారు కాదు. జలపాతం లోపల దేవతామూర్తులు ఉంటారనే నమ్మకంతో దీనిని పవిత్రంగా చూసేవారు. దీనిని బండల వాగు అని కూడా పిలిచేవారు. గుట్టలపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న నీరు ‘బొబ్బో..బొబ్బో..’ అని శబ్దం చేస్తుంది.. అందుకే ఇది బొగతగా మారిందని స్థానికుల కథనం.  ఈ  ప్రకృతి అందాలను వీక్షించేందుకు కుటుంబ సమేతంగా జలపాతంలో స్నానాలు చేసేందుకు పర్యాటకులు వందల సంఖ్యలో బొగత వస్తుంటారు. అయితే పర్యాటకులకు ఇక్కడ తగు వసతులు  లేవు.  వాహనాలు నిలుపుకునేందుకు పార్కింగ్‌ లేదు. పర్యాటక శాఖా అధికారులు ఇప్పటికైనా ఈ బొగతజలపాతంపై దృష్టి సారించి పార్కింగ్‌, వంట షెడ్లు, వస్త్రాలు మార్చుకునేందుకు గదులు నిర్మిస్తే పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. ఖమ్మం నుంచైతే 240 కిలోమీటర్లు. భద్రాచలం నుంచి 120 కిలోమీటర్లు .. ఖమ్మం జిల్లా వాజేడు మండలంలోని బొగత హైదరాబాద్ నుంచి 440 కిలోమీటర్ల దూరం. వరంగల్ పట్టణానికి 140 కిలోమీటర్ల దూరంలో.. ఏటూరు నాగారం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో బొగత ఉంటుంది. ...
 • యముడి పేరు తలుచుకోవటానికే భయపడతాం మనం . అలాంటి యముడికి  ఎంతో భక్తితో పూజలు చేసే  ఆలయం ఉందంటే నమ్మ బుద్ధి కాదు.  కానీ  నిజంగా యముడికో  గుడి ఉంది ... అది కూడా మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది.ఇదింకా చిత్రంగా ఉంది అనుకుంటున్నారా ?  చాలామందికి ఈ విషయం ఉంది. ఈ ఆలయం  పురాతనమైనది.  ఈ  పురాతన దేవాలయం కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ఉంది ఈ గుడి. ఎన్నో విశేష పూజలు అందుకుంటాడు యముడు అంటే ఆశ్చర్యం గా అనిపించినా ...ఆ ఆలయం విశేషాలు మాత్రం ఆసక్తి కరంగా వుంటాయి. తమ జాతకాలు బాలేవని, ఏం చేసిన కలిసి రావట్లేదని, లేదా జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని, మానసిక ప్రశాంతత కరువయిందని ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారు ఈ ఆలయంలోని యముని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం. అలాగే శని గ్రహ దోషాలు, జాతక దోషాలు వున్న వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే ఆబాధల నుంచి ఉపశమనం లభిస్తుందిట.  ఇక్కడ మండపంలో గల గండ దీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటే గండాలన్ని తొలగిపోతాయి అని కూడా భక్తుల నమ్మకం.ప్రతి నెల భరణి నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ .  దీపావళికి రెండు రోజుల తరువాత వచ్చే 'యమ ద్వితీయ' రోజున యముడు తన చెల్లి అయిన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లి,తిరిగి యమలోకం వెళ్ళే ముందు ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని ప్రతీతి. ఆ రోజున ఇక్కడ యమునికి విశేష పూజలు నిర్వహిస్తారు . యముని దర్శించే వారు ముందుగా గోదావరీ నదిలో స్నానం చేసి, యమునికి పూజలు నిర్వహిస్తారు.  యముని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించటం విశేషం గా చెప్పుకోవచ్చు. పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడికి కార్తికంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.  మార్కండేయుడికి,మహా పతివ్రత సావిత్రికే కాదు భక్తులకీ  వరాలు ఇవ్వటానికి కొలువుతీరి ఉన్నాడు ధర్మపురిలో ఉన్న యముడు....
 • ఐదు నదులు ఒకే చోట కలిసే క్షేత్రం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఉంది.   శివుడు , విష్ణువు పూజలు అందుకునే ఆ పురాతన ప్రాంతానికి  విశిష్టత ఎంతో ఉంది. ఈ  ప్రాంతానికి తగినంత ప్రాచుర్యం లభించలేదు. టూరిస్ట్ స్పాట్ గా   తీర్చిదిద్దితే పర్యాటకులు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అంటారు. శైవులు దీనిని 'మధ్య కైలాసం' అని పిలుస్తారు.  ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.  పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు. హరిహరాదుల క్షేత్రం.  శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతుంది.  పుష్పగిరి లో ఉన్న సరోవరాన్ని అమృత సరోవరం అని కూడా పిలుస్తుంటారు. ఇందులో భక్తులు మునిగి స్నానాలు చేసి, స్వామి వారిని దర్శించుకుంటారు. కొండకు వెళ్లే దారిలో శిధిలమైన చిన్న గుళ్ళు ఎన్నో కనిపిస్తాయి. ...
 • అనంతగిరి కొండలు .... మరో చక్కని పర్యాటక ప్రాంతం. పుణ్య క్షేత్రం .  ఇక్కడి ప్రకృతి సోయగం .... చల్లటి గాలులు మనసుకు హాయి గొలుపుతాయి.  పక్షుల కిలకిల రావాలు... సేలయేటి గలగలల పరవళ్లు సందర్శకులకు మధురమైన అనుభూతినిస్తాయి. . ఈకొండల్లోనే  వెలసిన అనంత పద్మనాభస్వామి ఆలయం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.  ఈ ఆలయం అతి పురాతనమైనది. 1300 ఏళ్ల చరిత్ర ఈ ఆలయానికి ఉంది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఈ ప్రాంతం పట్టణానికి ఐదుకిలో మీటర్ల దూరంలో ఉంది. అనంతగిరి కొండలకు ఈ పేరు రావడానికి కారణం ప్రకృతీ మాత ఒడిలో వెలసిన శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయమే. స్వామి పేరు మీదుగానే ఈ కొండలు అనంతగిరి కొండలుగా పేరు పొందాయి. అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రత్యేకత గురించి విష్ణు పురాణంలో కూడా చెప్పారట . ముచుకుందుడనే రాజర్షి అనేక సంవత్సరాలుగా రాక్షసులతో యుద్ధం చేసి, ఆ యుద్ధంలో రాక్షసులను ఓడించి విజయుడైనాడు. అనంతరం అలసట తీర్చుకొనుటకు దేవతలకు రాజైన దేవేంద్రుని ఆశ్రయించి తాను అలసట తీర్చుకొనుటకు ప్రశాంత స్థలము కావాలని, తన నిద్రా భంగము చేసిన వారు తన తీక్షణ చూపులకు భస్మం అయి పోవాలని కోరతాడు.  దేవేంద్రుడు అలసట తీర్చుకొనుటకు అనంతగిరి కొండలు అనుకూలంగా ఉంటాయని, ఎవరైన నిద్రా భంగము కలిగిస్తే వారు నీ తీక్షణ చూపులకు మసై పోతారని  వరమిస్తాడు. దీంతో ముచుకుందుడు అనంతగిరిలోని ఓ గుహలో నిద్రకుపక్రమిస్తాడు. ఇదిలా ఉండగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించిన శ్రీహరి ద్వారకా నగరాన్ని పాలిస్తున్నా డు. అక్కడ కాల యవ్వనుడనే రాక్షసు డు ద్వారకా నగరంపై దండెత్తి శ్రీకృష్ణ, బల రాములను వెంబడిస్తాడు. కాలయవ్వనుడికి భయపడినట్లు నటించి బలరామకృష్ణులు ముచుకుందు నిద్రపోతు న్న అనంతగిరిలోని గుహలోకి ప్రవేశిస్తా రు. శ్రీకృష్ణ బలరాముల ఒంటిపై ఉన్న వస్త్రాలను  నిద్రిస్తున్న ముచుకుందునిపై కప్పడం జరుగుతుంది. ఇది తెలియని కాలయవ్వనుడు ముచుకుందుడే బలరామ కృష్ణులని భావించి ముచుకుందునికి నిద్రాభంగము కలిగిస్తాడు. దీంతో ముచుకుందుడు ఆగ్రహానికి కాలయవ్వనుడు బలవుతాడు. తదనంతరం బలరామకృష్ణులు ముచుకుందునికి దర్శనమిస్తారు. దీంతో పరవశించిన పోయిన ముచుకుందుడు, బలరామకృష్ణుల పాదాలు కడిగి సాక్షాత్కా రం పొందుతాడు. వారి పాదాలు కడిగిన నీరే జీవనదిగా మారి కాలక్రమేణా మూసీనదిగా మారింది . కృష్ణానదికి మూసీ ఉప నది కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. పద్మనాభుని ఆలయ ప్రాంగణంలో ఉన్న కోనేటిని భవనాశిని అని అంటారు. భక్తుల పాపాలను హరించి, వారికి సత్ఫలితాలు ప్రసాదించడం తో ఈ కోనేటికి ఈ పేరు వచ్చిందని భక్తులు చెబుతుంటారు.  ఈ కోనేటితో పాటు స్వామి వారి ఆలయ ప్రాంగణంలో 7 గుండాలు ఉన్నాయి. ఇపుడు  అవి శిథిలావస్థ లో ఉన్నాయి.  అనంత పద్మనాభస్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పతి ఏడాదిలో రెండుమార్లు నిర్వహిస్తారు. కార్తీ క మాసంలో కార్తీక శుద్ధ పౌర్ణమిన పెద్దజాతరను 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిన మూడు రోజుల పాటు చిన్నజాతరను నిర్వహిస్తారు. మహబూబ్‌నగర్,హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి, జిల్లా వాసులతో పాటు సరిహద్దు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఆదివారం పౌర్ణమి రోజు జరుగబోయే పెరుగు బసంతం మహోత్సవానికి చిన్నా పెద్దా తేడా లేకుండా ఇక్కడి ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అనంతగిరి అందాలను అస్వాదించటానికి పర్యాటకులు వస్తుంటారు.ఇక్కడ రాత్రి విడిది  చేయడానికి గాను తెలంగాణ టూరిజియం నిర్మించిన హారితా రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్‌లో 32 గదులున్నాయి. శాఖాహార, మాంసాహార భోజనం ఇక్కడ దొరుకుతుంది. స్మిమ్మింగ్‌ఫూల్, మీటింగ్ హాల్, అవుట్‌డోర్ స్టేడియం, రిసార్ట్ మధ్యలో పార్కు ఉంది. ఈ పార్కులో లో చిన్నారులు ఆడుకోవటానికి గాను క్రీడా పరికరాలు ఉన్నాయి. పర్యాటకులు కోరిన విధంగా వండి వడ్డించే టిఫిన్లు, భోజనం ఇక్కడ అందుబా టులో ఉంది. ఈ రిసార్ట్‌లో శుక్రవారం నుంచి ఆదివారం రోజుల్లో రోజు చార్జీ ఎసీ సూట్ రూ. 3985 కాగా ఎసీ గది రూ. 2250 ఉంది. సోమవారం నుంచి గురువారం రోజుల్లో రోజుకు ఎసీ సూట్ రూ. 3101 లు, కాగా ఎసీ గది రూ. 1750 లు చెల్లించాల్సి ఉంటుంది. ...
 • ముస్సోరిలో ప్రకృతి అందాలు పర్యాటకులను పరవశింప చేస్తాయి.  ప్రకృతి సోయగాలు చూసి  పులకరించాలనుకునే వారికి ఇది చక్కని టూరిస్ట్ స్పాట్‌. హనీమూన్‌  జంటలు , ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌ వెళ్లాలనుకుంటున్న వారు  ఉత్తరాఖండ్‌లో ఉన్న ముస్సోరి ని చూసి తీరాల్సిందే. స్వచ్ఛమైన గాలి, పర్వతశ్రేణుల అందాలు... ఇక్కడి వాతావరణం ... ప్రకృతి అందాలు  మనలను కొత్త లోకా లకు తీసుకెళతాయి.   లాల్‌ టిబ్బా... ముస్సోరిలో ఎత్తైన ప్రదేశం ఇది. ఆల్‌ ఇండియా రేడియో, దూరదర్శన్‌ స్టేషన్లను ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్న టవర్‌పై పురాతన టెలిస్కోప్‌ ఉంటుంది. అందులో నుంచి చూస్తే ముస్సోరి అందాలు మనలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి.  గన్‌ హిల్‌..... ముస్సోరిలో రెండో ఎత్తైన ప్రదేశం ఇది. మాల్‌కు 400 అడుగుల ఎత్తులో ఉంటుంది. రోప్‌వే ద్వారా చేరుకోవచ్చు. ట్రెకింగ్‌ చేస్తూ వెళ్లొచ్చు. గన్‌హిల్‌కు చేరుకున్నాక టెలిస్కోప్ లో చూస్తే ఆకాశాన్ని ముద్దాడుతున్నట్టుగా కనిపించే పర్వతాలు కనువిందు చేస్తాయి. 1857లో బ్రిటిష్‌ వాళ్లు ఇక్కడ పెద్ద ఫైరింగ్‌ గన్‌ను ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం ఇక్కడ గన్‌ పేలిస్తే, దాన్ని బట్టి అందరూ వాచ్‌లో సమయాన్ని మార్చుకునే వారట. అయితే 1970లో ఈ గన్‌ను తొలగించారు. క్యామెల్‌ బ్యాక్‌ రోడ్‌...... నాలుగు కిలోమీటర్ల పొడవుంటుంది. ఇక్కడి రాళ్లు ఒంటె మూపురం మాదిరిగా ఉండటం వల్ల ఆ పేరు స్థిరపడింది. ఈ రోడ్డు రెండు ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతుంది. ఇక్కడి నుంచి చుట్టుపక్కల విస్తరించి ఉన్న పర్వతాల అందాలు కనువిందు చేస్తాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలు చూసి తీరాల్సిందే. నడవలేని వారు గుర్రాల మీద వెళ్లొచ్చు. కెంప్టీ ఫాల్స్‌..... ముస్సోరిలో పాపులర్‌ టూరిస్ట్‌ స్పాట్‌ ఇది. 40 అడుగుల ఎత్తైన ఈ జలపాతం దగ్గర జలకాలాడటానికి పర్యాటకులు ఇష్టపడతారు. సముద్రమట్టానికి 1364 మీటర్ల ఎత్తులో ఈ ప్రదేశం ఉంటుంది.  మాల్‌....   ముస్సోరిలో కీలకమైన ప్రదేశం ఇది. షాపింగ్‌ చేసే పర్యాటకులతో ఎల్లప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. ఉలెన్‌ దుస్తులు, శాలువాలు ఇక్కడ ప్రత్యేకం పర్యాటకులు   డెహ్రాడూన్‌ కి చేరుకుంటే ముస్సోరి అక్కడికి 40 కి.మీ దూరంలో ఉంటుంది. క్యాబ్‌లో చేరుకోవచ్చు.బస్సులు కూడా ఉన్నాయి....
 • అమర్ నాథ్ తొలివిడత యాత్ర  ముగిసింది ..  రెండో బ్యాచ్  యాత్రలో ఉన్నారు.  తొలి యాత్రలో   మహాదేవుడికి ఇచ్చిన హారతి వీడియో చూడండి.  హిందువులు కోరుకునే యాత్రలలో అమరనాధ్ యాత్ర ఒకటి. అమరనాధుడంటే జరామరణములు లేని వాడు అని అర్ధం. ఒకనాడు పార్వతీ దేవి ఈశ్వరుడితో " నాధా నాకు మీరు కంఠంలో వేసుకునే పుర్రెలమాల గురించి వినాలని ఉంది " అని అడిగింది. ఈశ్వరుడు " పార్వతీ ! నీవు జన్మించినప్పుడంతా నేను ఈ పుర్రెల మాలలో అదనంగా ఒక పుర్రెను చేర్చి ధరిస్తుంటాను " అని బదులిచ్చాడు. పార్వతీ దేవి " నాధా ! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. నీవు మాత్రం అలగే శాశ్వతుడిగా ఉంటున్నవు ఇది ఎలా సాధ్యం " అని అడిగింది. ఈశ్వరుడు " పార్వతీ ఇది పరమ రహస్యమైనది కనుక ప్రాణి కోటి లేని ప్రదేశంలో నీకు చెప్పలి " అని చెప్పి ఎవరూ లేని నిర్జన ప్రదేశం కొరకు వెతకి చివరకు ఈశ్వరుడు  అమరనాధ్ గుహను ఎంచుకున్నాడు. పహల్ గాం వద్ద నందిని ఉండమని వదిలి పెట్టి, చందన్ వారి వద్ద చంద్రుడిని వదిలి వెళ్ళాడు, షిషాంగ్ సరోవర తీరాన తన వద్ద ఉన్న పాములను వదిలి పెట్టాడు, మహాగుణ పర్వతం వద్ద తన కుమారుడైన గణేషుడిని వదిలాడు, తరువాత పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలను వాటి స్థానాలలో వదిలి పార్వతీదేవితో అమనాధ్ గుహలోపలికి వెళ్ళాడు. తరువాత కాలాగ్నిని ప్రజ్వలింపజేసి అక్కడ ఉన్న మిగిలిన ప్రాణులను దూరంగా పంపాడు. ఇక తన అమరత్వరహస్యం చెప్పడానికి ఉపక్రమించాడు. కాని పైన ఉన్న ఒక పావురాలజంట ఈ  రహస్యం విని అవి కూడా అమరం అయ్యాయి. ఇప్పటికీ భక్తులకు ఆ పావురాల జంట దర్శనం ఇస్తాయి.  courtesy...PSLV TV Channel...
 • దట్టమైన అడవి... పొడవైన చెట్లు... ఎత్తైన కొండలు... గలగల పారే సెలయేటి సవ్వడుల నడుమ గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలసింది ఆ తల్లి. అందుకే ఆమెను గుబ్బల మంగమ్మతల్లిగా పిలుచుకుంటూ భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండల కామవరం అడవిలోని మారుమూల ప్రాంతంలో వెలసినప్పటికీ, భక్తుల కోర్కెలు తీర్చే తల్లిగా పేరు పొందడంతో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని  మంగమ్మ ను  పూజించి తమ మొక్కులు తీర్చుకుంటారు.  కొండజాతికి చెందిన ప్రజలు 'అడవితల్లి' గా ఆరాధిస్తూ ఉంటారు. గుహ పైభాగం నుంచి నిరంతరం నీరు పడుతూ ఉంటుంది. ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరికీ తెలియదు. మోకాళ్ల లోతు నీళ్లలో నడుస్తూ వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవలసి ఉంటుంది. దగ్గరి నుంచి చూస్తే అమ్మవారు సర్ప లక్షణాలను కలిగినట్టుగా అనిపిస్తుంది. ఈ సందేహానికి తగినట్టుగానే ఒక సర్పం అమ్మవారి పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటుందని చెబుతుంటారు. అమ్మవారు స్వయంభువు కావడం వలన, ఆ తల్లి ఇక్కడ ప్రత్యక్షంగా కొలువై వుందని భక్తులు విశ్వసిస్తుంటారు. అమ్మవారిని ఆప్యాయంగా సేవిస్తే అడిగిన వరాలను ప్రసాదిస్తుందని చెబుతుంటారు. సుమారు యాభై ఏళ్ల క్రితం బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కరాటం కృష్ణమూర్తి అనే భూస్వామి ఒకరోజు మంగమ్మతల్లి కొలువై ఉన్న ప్రాంతంలో వెదురు గెడలు సేకరించుకొని  వెళ్ల బోతుండగా  ఎడ్లు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక పోయాయట.  ఏం చేయాలో తెలియక   వెదురును   దించివేసి కృష్ణమూర్తి ఇంటికి వచ్చేసారట. ఆరాత్రి కృష్ణమూర్తికి గుబ్బల మంగమ్మ తల్లి కలలో కనిపించి ‘‘నీ బండి ఆగిన ప్రాంతంలోనే   వాగు వెంబడి కొంతదూరం ప్రయాణించిన  జలపాతం పడే ప్రదేశంలో గుబ్బలు, గుబ్బలుగా ఉన్న గుహలో వెలిశాను నేను. నన్ను దర్శించుకుని వెళ్ళు .. ’ అని చెప్పడంతో కృష్ణమూర్తి నిద్రనుంచి మేల్కొని చూడగా గుబ్బల మంగమ్మ తల్లి వెలసిన ప్రదేశం కనిపించిందట. మంగమ్మను దర్శించుకున్న కృష్ణమూర్తి అమ్మవారికి పూజలు చేసి, ఏజన్సీ ప్రాంతంలోని చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు అన్నసంతర్పణ చేయించారట. సంతర్పణకు వెళ్లిన భక్తులు మంగమ్మను దర్శించుకోగా వారి కోర్కెలు నెరవేరాయట. అప్పటినుంచి మంగమ్మతల్లిని దర్శించుకుని పూజించేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. మంగమ్మ తల్లి వెలసిన సమీపంలో గానుగ చెట్టు ఒకటి ఉంది. ఈ చెట్టు సంతాన వృక్షంగా పేరొందింది. పిల్లలు పుట్టని దంపతులు అమ్మను దర్శించుకున్న అనంతరం పసుపు కుంకుమలు ఎర్రని వస్త్రంలో పెట్టి చెట్టుకొమ్మకు కడతారు. అలా చేయడం వల్ల అమ్మ అనుగ్రహంతో కడుపు పండు తుందని విశ్వాసం. ప్రతి ఆది, మంగళ, శుక్రవారాలలో ఈ చెట్టు వద్ద సంతాన పూజలు జరుగుతుంటాయి. గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి వెళ్ళే భక్తులకు అడవి మార్గ ప్రయాణం ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బుట్టాయగూడెం మండలం కామవరం దాటిన తరవాత కొంతదూరం వెళ్లేసరికి దట్టమైన అడవి... అడవిలో కొంతదూరం వెళ్లిన తరవాత గుబ్బల మంగమ్మ క్షేత్రం ...   ప్రయాణంలో పచ్చని చెట్లు,  కొండలు, ప్రకృతి రమణీయమైన దృశ్యాలు కనువిందు చేస్తాయి....
 • ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే పూరి జగన్నాధ రధయాత్రకు సర్వం సిద్ధమైంది.  ఈయాత్రకై పూరినగరం సర్వంగాసుందరంగా ముస్తాబయింది. బలబద్ర, సుబధ్ర సమేతుడైన జగన్నాధుడు పూరి పురవీదుల్లో దర్శనమిచ్చే అద్భుత క్షణాలకు సమయం ఆసన్నమయింది. జీవితంలో ఒక్కసారైనా సరే పూరీలో జరిగే ఈ రథయాత్రలో పాల్గొని తరించాలని భక్తకోటి తహతహ లాడుతుంది. ప్రతి ఏటా లక్షలమంది స్వామివారిని దర్శించుకుని ముక్తిని పొందుతున్నారు. మధ్యయుగ కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూనే వుంది. ఈ ఉత్సవాలను కనులారా వీక్షించేందుకు  లక్షలాది మంది భక్తులు పూరి చేరుకున్నారు. ప్రతి సంవత్సరం ఆషాడ మాసం శుక్ల పక్ష విదియనాడు మొదలై తొమ్మిదిరోజుల తర్వాత ఆషాడ శుక్ల దశమితో వేడుకలు ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటు వేడుకగా జరిగే ఈ ఉత్సవాల కోసం ఓడిశా ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు పూర్తి చేసింది. పూరి ఆలయం పేరు వినగానే చాలామందికి గుర్తుకొచ్చేది జగన్నాధ రధయాత్రే కాని ఆ ఉత్సవంతో పాటు అక్కడ ఎన్నో ఆసక్తికరమైన వేడుకలు జరుగుతుంటాయి. వాటన్నిటిలో ప్రత్యేకమైనది నవకళేబర. అంటే కొత్త దేహం అని అర్ధం. పూరి ఆలయంలో జగన్నాధ, బలబద్ర, సుబధ్ర విగ్రహాలు రాతి విగ్రహాల్లా శాశ్వతం కావు. కొయ్యతో తయారు చేస్తారు. . అధిక ఆషాడ మాసం వచ్చిన సంవత్సరంలో పూరి క్షేత్రంలో గర్భగుడిలోని దారు విగ్రహాలను తొలగించి వాటి స్థానే కొత్తగా వేప చెక్కతో సరికొత్త విగ్రహాలను ప్రతిష్టి స్తారు. ఈ వేడుకనే నవకళేబర గా వ్యవహరిస్తారు. ఇతర  దేవాలయాలలో మాదిరిగా స్వామి తన దేవేరులతో కొలువై ఉండక, సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రతో కొలువై ఉంటాడు. అందుకే ఈ ఆలయాన్ని సోదర ప్రేమకు ప్రతీకగా కీర్తి పొందింది.  జగన్నాథ ఆలయాన్ని 12వ శతాబ్ధంలో కళింగ పాలకుడైన అనంతవర్మ చోడ గంగాదేవ నిర్మించగా, ఆ తర్వాత కాలంలో అనంగ భీమదేవి పునర్నించాడని తెలుస్తోంది. ఆలయం మొత్తం కళింగ శైలిలో నిర్మితమైనది. పూరీ ఆలయం నాలుగు ల క్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది. సుమారు 120 ఉపాలయాలు ఉన్నాయి. అమోఘమైన శిల్ప సంపదతో భారతదేశలోని అద్భుత కట్టడాలలో ఒకటి.  దేశంలోని ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటిగా భక్తులు విశ్వసించే ఈ ఆలయం వాస్తవ సంప్రదాయానికి ప్రతీక.  జగన్నాధుని రథోత్సవాన్ని తిలకించి తరించడానికి కుల, మత వర్గ విభేధాలను మరచి దేశవిదేశాల నుంచి అశేష జనవాహిని తరలి వస్తుంది. ఇసుక వేస్తే రాలనంత జనసంద్రంతో పూరీ నగరం కిటకిటలాడుతుంది. పూరీలో రథయాత్ర సందర్భంగా అంగరంగ వై భవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమినాడు జరిగే స్నాన పౌర్ణమి లేదా అభిషేకాల పౌర్ణమితో ఉత్సవాలు మొదలవుతాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు నేత్రోత్సవం, విదియనాడు రథయాత్ర జరుగుతాయి.  ...
 • మేఘాలయా రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌కు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజీ లో ప్రకృతి అందాలు  అందరిని ఆకట్టుకుంటాయి.  ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గధామంగా... ఓ అందమైన అనుభూతిని కలిగిస్తుంది. దాదాపు ప్రతిరోజూ వర్షం కురిసే ఈ ప్రాంతం సముద్ర మట్టానికి  దాదాపు 1300 మీటర్ల ఎత్తులోఉంది.   ఈ ప్రాంతంలోనే దేశంలో అత్యధికంగా వర్షం పడే ప్రాంతంగా పేరు సంపాధించిన మాసిన్రామ్‌ ఉండడం విశేషం.  ఓ చిన్న పట్టణంగా విరాజిల్లుతున్న ఈ ప్రదేశం ప్రకృతి శోభను సొంతం చేసుకుంది.  ప్రకృతి రమణీయ దృశ్యాల అనుభూతులను మాటలతో వర్ణించలేము... ఒక్కసారైనా వెళ్లి అక్కడి సహజ సౌందర్యాన్ని స్వయంగా చూడాల్సిందే.  ఘాట్‌ రోడ్‌లో సాగే ఈ ప్రయాణంలో చుట్టూ ఉన్న  పర్వతాలు , వాటినుంచి జాలువారే జలపాతాలు  అబ్బురపరుస్తాయి.. చిరపుంజీ ప్రాంతం దాదాపుగా లైమ్‌ రాతి గుహలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఉన్న విశేషాల్లో పురాతన ప్రెస్బిటేరియన్‌ చర్చి, రామకృష్ణ మిషన్‌ లాంటి వాటిని దర్శించవచ్చు. దగ్గర్లో ఉన్న మాసిన్రామ్‌ ప్రాంతంలో ఏర్పడిన సహజ శివలింగ రూపం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఈ శివలింగాన్ని స్థానికులు మావ్‌ జింబుయిన్‌గా వ్యవహరిస్తారు. చిరపుంజిని దర్శించాలనుకునే పర్యాటకులు షిల్లాంగ్‌ నుంచి పయనించాల్సి ఉంటుంది. షిల్లాంగ్‌ చుట్టు పక్కల ఉన్న ప్రదేశాల్లో కేవలం చిరపుంజి మాత్రమే పర్యాటక ప్రదేశం కాదు. షిల్లాంగ్‌ చుట్టు పక్కల అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. దాదాపు ప్రతిరోజు టూరిస్టులతో సందడిగా ఉండే షిల్లాంగ్‌లో మ్యాజియం ఆఫ్‌ ఎంటోమాలజీ అనే సీతాకోక చిలకల పార్క్‌ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ మేఘాలయలో కన్పించే అన్ని రకాల సీతాకోక చిలకలతో పాటు అంతరించిపోతున్న కొన్ని జాతుల సీతాకోక చిలకల్ని కూడా పరిరక్షిస్తుంటారు. ...
 • గుంటూరు జిల్లా కొండవీడుకోట  సమీపంలో ఇస్కాన్‌ నిర్మిస్తున్న స్వర్ణమందిర ఆలయం నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతి నాటికి తొలిదశ పూర్తి కానుంది. కొండవీడు ఘాట్‌ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో కొండవీడు కోట, కొండపై ఉన్న ప్రకృతి అందాలను తిలకించడానికి వచ్చే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.   దక్షిణ భారత, రాజస్థానీ శైలిల సమ్మిళితంగా నిర్మిస్తున్న ఈ స్వర్ణ మందిరానికి జైపూర్‌ నుంచి తెచ్చిన ఎర్ర ఇసుక రాతితో మంటపాలు కడుతున్నారు. రాజస్థానీ నిపుణులు మంటపాల నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. ఎకరం విస్తీర్ణంలో ప్రధాన స్వర్ణహంస దేవాలయ పనులుకూడా ప్రారంభమయ్యాయి. కొండవీడు కోట, చారిత్రక వెన్నముద్ద గోపాలస్వామి ఆలయం, పురాతన ఆలయాలతో పాటు ఇస్కాన్‌ వారు నిర్మిస్తున్న ఆలయం పూర్తి అయితే  ఈ ప్రాంతం అభివృద్ధి  చెందుతుంది.  .వేద విశ్వవిద్యాలయం, ఆవులపై పరిశోధన కేంద్రం, గురుకుల పాఠశాల ఏర్పాటుతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా మారనుంది. నవ్యాంధ్ర రాజధానికి 50 కి.మీ దూరంలో చారిత్రాత్మకమైన ఈ కొండవీట కోట ఉంది. కొండపైన సుందరమైన ప్రకృతి దృశ్యాలతో పాటు మూడు చెరువులు ఉన్నాయి. ఇక్కడ  ఏడాది పొడవునా నీటి లభ్యత ఉంటోంది. కొండవీడు కోటకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా రూ.37 కోట్లతో కొండపైకి ఘాట్‌ నిర్మించారు. కొండపైకి వెళ్లడానికి ట్రెక్కింగ్‌ నిర్వహించాలన్న యోచనలో పర్యటకశాఖ ఉంది. కొండపైకి వెళ్లే దారిలో పర్యటకశాఖ ఆకర్షణీయంగా ముఖద్వారం నిర్మించింది. ఇక్కడ ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలకు పర్యటకశాఖ ప్రణాళికలు రూపొందించడంతో దేవాదాయశాఖ నుంచి భూమి సైతం ప్రభుత్వం కేటాయించింది. కొండ కింది భాగంలో పర్యటకులు బస చేయడానికి వీలుగా నిర్మాణాలు, మౌలిక వసతుల కల్పనకు నిర్మాణాలు చేపడుతున్నారు. అన్ని పూర్తి అయితే అద్భుతమైన పర్యాటక కేంద్రం గా మారడం తధ్యం. ...