Latest News
రాజ‌కీయం
 • లగడపాటి రాజగోపాల్  పొలిటికల్  రీ ఎంట్రీ  దాదాపుగా ఖరారు  అయింది . అటు టీడీపీ ఇటు బీజేపీలలో చేరడానికి ఇష్ట పడని  లగడపాటి  వైసీపీ వైపు మొగ్గు చూపారని  తెలుస్తోంది.  కొద్దీ రోజుల క్రితం బెంగళూరులో వైసీపీ అధినేత జగన్ ను  కలసి  మాట్లాడినట్టు సమాచారం.  జగన్  కూడా  రాజగోపాల్ పార్టీలో చేరిక పట్ల  సుముఖత  చూపారట .  తెలుగు రాష్ట్రాల్లో లగడపాటి  పేరు తెలియని వారు దాదాపుగా ఉండరు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా లగడపాటి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. రాష్ట్ర పునర్విభజన బిల్లు సందర్భంగా పార్లమెంట్ హాలులోనికి పెప్పర్ స్ర్పేను తీసుకెళ్లి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అలాంటి సంచలనాలు ఆయన ఖాతాలో ఎన్నో ఉన్నాయి. అటు పారిశ్రామికరంగంలోను ఇటు రాజకీయాల్లోనూ రాజగోపాల్ తనదైన ముద్ర వేశారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచే వైదొలగారు. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయలేదు. గత కొన్నాళ్ళుగా కుటుంబానికే ఎక్కువ టైం కేటాయించారు.. నాడు పార్ల‌మెంట్ సాక్షిగా ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చిన నేత‌లు దాన్ని విస్మరించడం, తెస్తామ‌ని చెప్పిన వ్యక్తులు మాటలు మార్చడం వంటి పరిణామాల క్రమంలో రాజ‌గోపాల్ ప్రజల తరపున పోరాడాల‌ని యోచనలో పడ్డట్టు చెబుతున్నారు. లగడపాటి తో పాటు ఎంపీలు గా చేసిన వారిలో కావూరి సాంబశివరావు, పురందేశ్వరి బీజేపీ లో చేరగా రాయపాటి, దివాకరరెడ్డి టీడీపీలో చేరారు. మరికొందరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలీదు. కాంగ్రెస్ కి రాజీనామా చేసిన ఉండవల్లి అరుణ కుమార్ ఇటీవలే తెర ముందుకు వచ్చారు. ఉండవల్లి ఏపార్టీ లో చేరేది తేలకపోయినప్పటికీ రోజు మీడియా ముందుకు రావడం పలు అంశాలపై మాట్లాడటం జరుగుతోంది. అదే రీతిలో త్వరలో లగడపాటి కూడా తెర పైకి రావచ్చు అంటున్నారు. లగడపాటి రాజకీయాల్లోకి వస్తే మళ్ళీ సందడి సందడే. ...
 • శశికళను పరప్పన అగ్రహార జైలు నుంచి చెన్నై లేదా వేలూరు జైలుకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారం చేతికి చిక్కడంతో శశికళ వర్గం తొలుత ఆపనిలో పడింది . ఈమేరకు కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయబోతున్నారు. అక్రమాస్తుల కేసులో శిక్ష పడడంతో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధానకార్యదర్శి శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్‌ బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కర్ణాటక న్యాయవాదులతో చర్చించిన శశి భర్త నటరాజన్ ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వయోభారం, మధుమేహం, మోకాలినొప్పి, ప్రత్యేక వసతుల లేమి కారణాలుగా చూపి జైలును మార్చాలని హైకోర్ట్ ను అభ్యర్ధించనున్నారు.  కాగా బల నిరూపణలో విజయం సాధించిన సీఎం పళని స్వామి శశికళ ఆశీస్సులు కోసం మద్దతు దారులతో చెన్నై నుంచి అగ్రహార జైలుకు నేడో రేపో బయలు దేర నున్నారు.  చెన్నై జైలుకి శశికళ వస్తే సొంత ఇంట్లో ఉన్నట్టే లెక్క. జైలు నుంచే ఆమె రిమోట్ పాలన సాగుతుంది. పళని స్వామి అందుబాటులో ఉంటాడు. సొంత ప్రభుత్వం కాబట్టి జైలులో సకల సౌకర్యాలు అనుభవించవచ్చు. ఇదంతా పకడ్బందీగా ప్లాన్ చేసి హైకోర్టు ను ఆశ్రయిస్తున్నారు. అయితే హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.  డీఎంకే వర్గాలు కూడా ఈ విషయాన్నీ పసి గట్టి శశి జైలు మార్పిడిని ఎలా ఆపాలా అని యోచిస్తున్నట్టు సమాచారం....
 • తమిళనాడు రాజకీయ చరిత్రలో 30ఏళ్ల తర్వాత  బలపరీక్ష జరగబోతోంది.  తమిళ రాజకీయాల్లో బలపరీక్షలు, అవిశ్వాస తీర్మానాలూ కొత్తేమీ కాదు.  1952లో రాజాజీపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, 200 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అనుకూలంగా ఓటేసి తిరిగి సీఎంగా ఎన్నుకున్నారు.  ఆ తరువాత 1972 డిసెంబర్‌ 11న డీఎంకే నేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే పార్టీలో ఉన్న ఎంజీ రామచంద్రన్‌ను పార్టీ నుంచి తొలగించారు. ఆ సమయంలో సీఎం కరుణానిధిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ బలపరీక్షలో కరుణానిధికి అనుకూలంగా 172 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో ఆయనే సీఎంగా ఎన్నికయ్యారు. 1988లో ఎంజీ రామచంద్రన్‌ మరణించాక అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే (జా) జానకీ రామచంద్రన్, అన్నాడీఎంకే (జే) జయలలిత సీఎం పీఠం కోసం పోటీపడ్డారు. జనవరి 28న బలపరీక్ష నిర్వహించారు. ఆనాటి  బలపరీక్షలో జానకీ రామచంద్రన్‌ సీఎం అభ్యర్థిగా ఎన్నికయ్యారు. జానకీ రామచంద్రన్‌కు అనుకూలంగా 99 మంది, జయలలితకు అనుకూలంగా 33 మంది ఎమ్మెల్యేలు నిలిచారు. జయలలిత మరణంతో  తమిళనాడు అసెంబ్లీ  ఇపుడు మరోసారి బలపరీక్షకు సిద్ధమవుతోంది.  ఈ బలపరీక్ష ఎవరికి  అనుకూలం కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత మరణించడంతో ప్రస్తుత సభ్యుల సంఖ్య 233 మాత్రమే. ఇందులో సీఎం పళనిస్వామి వర్గంలో 123మంది ఎమ్మెల్యేలు, పన్నీర్‌సెల్వం వర్గంలో 11మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకేకు 89, కాంగ్రెస్‌కు 8, ఐయూఎంఎల్ 1 సభ్యులు ఉన్నారు. 117 మంది సభ్యులు అనుకూలంగా ఉంటే బలపరీక్షలో పాస్ అయినట్లే. అయితే  రెండు శిబిరాల్లోనూ ఉత్కంఠ రాజ్యమేలుతోంది. పళనిస్వామి వర్గానికి ఎమ్మెల్యేలు మెజార్టీ  ఉన్నప్పటికీ  అది చాలా తక్కువ.. ఏడుగురు ఎమ్మెల్యేలు చేయిజారితే పళనిస్వామి బలపరీక్షలో ఓడిపోతారు.  పళనిస్వామి వర్గంలోని  40 మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వారిలో కొందరైనా వ్యతిరేకంగా మారితే పళనీ కి ఇబ్బందే. అందుకే కాంగ్రెస్ సభ్యుల మద్దతు కోసం పళనీ ప్రయత్నిస్తున్నారు.  పన్నీర్ ఆశలు కూడా అసంతృప్త ఎమ్మెల్యేల మీదే . ఇప్పటివరకైతే పళనీ కే  మొగ్గు కనబడుతోంది. చివరిలో ఏదైనా జరిగితే  మ్యాజిక్ ఫిగర్ లో  తేడా రావచ్చు . మొత్తం మీద మరికొద్ది గంటల్లో  ఎవరు విజేతలో తెలుస్తుంది . ...
 • పళనిస్వామి అన్నాడీఎంకే లో  సీనియర్  నాయకుడు . 'జయ' విధేయుడుగా తమిళ రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నేత .పన్నీర్‌ సెల్వం కేబినెట్‌లో రహదారులు, ఓడరేవుల శాఖ మంత్రిగా ఉన్న పళనిస్వామి సేలం జిల్లా ఎడప్పడి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వ్యవసాయం కుటుంబంలో పుట్టిన పళనిస్వామి సైన్స్ గ్రాడ్యుయెట్. 1974లో అన్నాడీఎంకే సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లో వచ్చారు.  అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్జీఆర్ మరణానంతరం అన్నా డీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలింది. ఎమ్జీఆర్ సతీమణి జానకి ఒక వర్గం కాగా, జయలలితది మరో వర్గం. అయితే పళనిస్వామి జయలలిత వర్గం పట్లే తన విధేయత  చూపారు .  ఆ తర్వాత అన్నాడీఎంకే అభ్యర్థిగా 1989, 1991, 2011, 2016లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో  లోక్‌సభ  ఎంపీగా గెలుపొందారు. 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారంలోకి రావడానికి పళనిస్వామి సామాజిక వర్గమే (గౌండర్‌) ప్రధాన కారణం.జయలలితకు వ్యతిరేకత ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో కూడా పళనిస్వామి ప్రచారం పార్టీకి ఎంతగానో ఉపయోగపడింది. పళనిస్వామి సొంత జిల్లా అయిన సేలంలో మొత్తం 11 నియోజవర్గాలుంటే అందులో 10 నియోజవర్గాల్లో అన్నాడీఎంకేనే 2016 ఎన్నికల్లో విజయం సాధించింది. తమిళనాడులో జనాభా, రాజకీయ ప్రాతినిధ్యం రీత్యా గౌండర్లు, తేవర్లు, వన్నియార్లు బలమైన సామాజిక వర్గాలు .  ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, శశికళ ఇద్దరూ తేవర్లే. 234 మంది సభ్యులున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో తేవర్‌ ఎమ్మెల్యేలే ఎక్కువ. అన్నా డీఎంకేలో మాత్రం గౌండర్లు 28 మంది , తేవర్లు 20 మంది ఎమ్మెల్యేలున్నారు.  జయలలిత తన మంత్రివర్గంలో పన్నీర్ తర్వాత పళని స్వామినే ఎక్కువగా నమ్మేవారు.జయలలిత ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఓ.పన్నీర్‌సెల్వంతో పాటు పళనిస్వామి  పేరు కూడా పరిశీలనకు వచ్చిందని  అంటారు . అప్పుడు పళనిస్వామి పట్ల శశికళ మొగ్గు  చూపినట్టు చెబుతారు. అయితే అమ్మకు అత్యంత విధేయుడు, గతంలోనూ అమ్మ పరోక్షంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అనుభవం పన్నీర్  కలిసొచ్చింది.  ఊహించని విధంగా సుప్రీంకోర్టు శశికళను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా నిర్దారించడంతో పళనిస్వామి పేరు తెర పైకి వచ్చింది . తీర్పువచ్చిన క్షణాల్లోనే సీఎల్‌పీ నేతగా  ఎన్నుకోవడంతో పళని  సీఎం  అవడానికి  రూట్ క్లియర్ అయింది. ...
 • అనేక సూట్ కేసు కంపెనీలతో,  బంధువుల సాయంతో రాష్ట్రాన్ని దోచుకున్న శశికళకు... ముప్పైమూడు ఏళ్ళు ఆదరించిన జయలలిత అనుమానాస్పద రీతి లో మరణించినపుడు కళ్ళు కనీసం చెమ్మగిల్ల లేదు. ఇపుడు ముఖ్యమంత్రి పదవి ఎక్కడ దూరం అవుతుందో అని ఆమెకు కళ్ళు కావేరీ జలాలు అవుతున్నాయి. వందలాది మంది రౌడీలను ఎమ్మెల్యేలకు కాపలాగా పెట్టి నాకే మెజారిటీ ఉన్నది అని తోడ కొడుతున్నది. శశికళ ను మన్నారు గుడి మాఫియా గా వర్ణించి ఆమెను జైల్లో తోయిoచిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి ఆమెను ముఖ్యమంత్రిని చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాడు. లేకపోతే కోర్ట్ లో కేసు వేస్తానని గవర్నర్ ను హెచ్చరిస్తున్నారు. విద్యాసాగర్రావు వ్యక్తిత్వం, నీతి నిజాయతీ ఎంత స్వచ్ఛమైనవో ముప్ఫయ్యేళ్ళ ఆయన రాజకీయ జీవితాన్ని గమనిస్తున్న అందరికి  తెలుసు.  స్వామి తాటాకు చప్పుళ్ళకు బెదిరి పోయే రకం కాదు ఆయన. రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి తన రాజీనామా లేఖను గవర్నర్ కు స్వయాన అందజేసి ఆమోదం పొందాలిట. కానీ ఇక్కడ అలా జరగలేదు. రాజీనామాను ఫాక్స్ ద్వారా పంపించారట. పన్నీర్ సెల్వం  సంతకం కూడా ఫోర్జరీ కావచ్చు అనో మరో వివాదం తెర మీదికి  వచ్చింది  ఇప్పుడు. అది పన్నీర్ సహజంగా పెట్టే సంతకం లా లేదు అంటున్నారు. తనని బలవంతాన రాజీనామా చేయించారు అనే పన్నీర్ ఫిర్యాదు కు ఇప్పుడు బలం చేకూరుతున్నది. సుబ్రమణ్య స్వామి కేసు వేస్తే మరీ మంచిది. ఆ కేసు తేలే వరకూ గవర్నర్ ఎదురు చూడవచ్చు. ఈ స్వామి వ్యవహరం చూస్తుంటే దీన్ని మరింత జాప్యం చెయ్యడానికి కేంద్రమే నాటకం ఆడిస్తున్నడెమో అన్న అనుమానం కలుగుతున్నది. ఒకప్పుడు జయ ను శశికళను అభియోగాలు మోపి జైల్లో వేయించిన స్వామి ఇపుడు శశికళ పక్షాన ఎందుకు మాట్లాడుతున్నారు ? మధ్యలో ఆయన ఇంట్రెస్ట్ ఏమిటో మిస్టరీ . ఈ మాఫియా రాణి ని ముఖ్యమంత్రి చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించడం మంచిది. .....  ఇలపావులూరి మురళీ మోహన రావు...
 • తమిళనాట రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. పన్నీర్ సెల్వం రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసేందుకు వెళ్లాలని యోచిస్తున్నారు . అదే సమయం లో శశికళ నిరసన దీక్ష కు కూర్చోవాలని  ప్లాన్   చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో అర్ధం కాని పరిస్థితులు నెలకొంటున్నాయి. శశికళ అనుకూల వర్గంలోని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పన్నీరు వైపు వెళుతున్నారు . ఫలితంగా సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎంపీలు పన్నీరుకు మద్దతు పలికారు. ఏడుగురు ఎమ్మెల్యేలు పన్నీరు శిబిరంలో చేరారు.మరి కొందరు రావచ్చు అంటున్నారు . దీంతో శశికళ శిబిరం లో కలవరం మొదలైంది. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో శశి వెంట ఉంటే భవిష్యత్ ఉండదనే ఆందోళన వారిలో నెలకొంది. దీంతో రిసార్ట్‌లో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు పన్నీరు వైపు వెళ్లాలని అనుకుంటున్నారట . సరిగ్గా ఈ సమయం లోనే పన్నీరు ఎమ్మెల్యేలుంటున్న రిసార్ట్‌కు వెళ్లాలని భావిస్తున్నారు. స్వయంగా వెళితే మరి కొంతమంది ఎమ్మెల్యేలు తన వర్గం లోకి లాక్కోవచ్చని పన్నీర్ అంచనా వేస్తున్నారు . సెల్వం సాయంత్రం లోపు శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలను రిసార్ట్‌లోకలిసే అవకాశాలు ఉన్నాయి. ఇక శశికళ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.  నిన్న సెంగొట్టియన్  పేరు ను  సీఎం అభ్యర్థిగా ప్రతిపాదించాలని యోచన చేసిన శశి మళ్ళీ మనసు మార్చుకున్నట్టు  సమాచారం. ఇన్నాళ్లు కేంద్రంపై ఆచితూచి మాట్లాడిన శశి  మెల్లగా స్వరం పెంచుతున్నారు .   అన్నాడీఎంకేను చీల్చేందుకే.. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారాన్ని గవర్నర్‌ వ్యూహాత్మకంగా వాయిదా వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే గవర్నర్‌ విద్యాసాగర్‌రావుకు హెచ్చరికతో కూడిన లేఖను పంపిన శశికళ దీక్ష చేయవచ్చని అంటున్నారు.  ఇది చేసే ముందు గవర్నర్ ను  మరో మారు కలిసే ప్రయత్నం చేస్తున్నారు . గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగాలని శశికళ యోచిస్తున్నట్టు  చెబుతున్నారు ....
 •  సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్‌ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారంటూ  జరుగుతున్న ప్రచారం  అవాస్తం అని ఆరెస్సెస్‌ సిద్ధాంత కర్త గురుమూర్తి స్పష్టం చేశారు. ఆయన బీజేపీతో చర్చలు జరుపుతున్నారంటూ వస్తున్న ప్రచారమంతా ఓ కట్టుకథ, అభూత కల్పన అని ఆయన కొట్టి పడేశారు. ఈ మేరకు గురుమూర్తి ట్వీట్ చేశారు. రజనీ కాంత్‌ కొత్త పార్టీ పెట్టె ఏర్పాట్లలో ఉన్నారని ...  బీజేపీతో సంప్రదిస్తున్నారని గురుమూర్తి వీరి మధ్య సమన్వయకర్త గా ఉన్నారని  మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన  గురుమూర్తి.. మీడియాలో గాలి వార్తలు ఎలా ప్రసారం చేస్తారో అర్థం కావడం లేదన్నారు.  పనిగట్టుకొని ఈ అబద్ధపు  ప్రచారం చేస్తున్నారంటూ ట్వీట్‌ చేశారు. అసలు రజనీ  రాజకీయ ఆరంగేట్రం పూర్తిగా అవాస్తవం అని తేల్చి చెప్పారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులు చూసి రజనీ కాంత్‌ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, ఈ క్రమంలో కొత్త  పార్టీ పెడుతున్నారని  తొలుత సోషల్‌ మీడియాలో  ప్రచారం జరిగింది.  అదే సమయంలో గురుమూర్తి ద్వారా బీజేపీని  సంప్రదించి కొత్త పార్టీతో రంగ ప్రవేశం చేస్తారని న్యూస్ ఛానల్స్ లొ వార్తలు ప్రసారమయ్యాయి . కాగా అంతకు ముందు రజనీ కాంత్ కూడా రాజకీయాలపట్ల తనకు ఆసక్తి లేదని చెప్పారు . వారి సోదరుడు కూడా ఇదే విషయం చెప్పారు . అయినా రజనీ రాజకీయ ప్రవేశం పై వార్తలు పుట్టిస్తున్నారు....
 • ఈ ఫొటోలో కనిపించే అమ్మాయి పేరు  వందన శర్మ ...  వయసు 25 ..డిగ్రీ చదువుతోంది . ప్రస్తుతం  ఉత్తరప్రదేశ్  ఎన్నికల బరిలో  స్వతంత్ర అభ్యర్థిగా దిగి  ప్రచారంలో  దూసుకెళ్తోంది.  వందన శర్మ తనవద్ద ఎంతోకాలంగా దాచుకున్న రూ.10 వేలు డిపాజిట్‌గా సమర్పించి ఫతేపూర్ సిక్రి నియోజక వర్గం నుంచి నామినేషన్ వేసింది. తన ఆస్తులు మొత్తం రూ.32 వేలుగా అఫిడవిట్‌లో పేర్కొంది వందన ఎన్నికల్లో పోటీ చేయడం కుటుంబానికి ఇష్టం లేదు ... అయితే తన గ్రామానికి కనీస సదుపాయాలు కల్పించే లక్ష్యంతోనే  ఎన్నికల బరిలోకి దిగింది.  ‘‘తల్లిదండ్రులు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. అయితే  నేను ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. మా గ్రామానికి నా వంతుగా ఏదో ఒకటి చేయాలని ఆశిస్తున్నాను’’ అని వందన  చెబుతోంది . ఎన్నికల్లో పోటీ చేయడం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోయినప్పటికీ... తన సోదరుడి అండతో నామినేషన్ వేసింది .. జిల్లా ప్రధాన కార్యాలయానికి 40 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామం నాగ్లా బ్రాహ్మన్‌‌లో కనీస సదుపాయాలు కూడా లేవని  వందన  చెబుతోంది. ప్రాధమిక పాఠశాల  చదువు తర్వాత  హై స్కూల్ విద్య కోసం దూరం వెళ్ళి చదుకోవాలి . ఇప్పటికీ ఆడపిల్లలు బయటికెళ్లాలంటే ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిందే. కనీసం వైద్య సదుపాయాలు లేని కారణంగా పక్షవాతానికి గురైన తన సోదరుడొకరు 18 ఏళ్లుగా మాట్లాడలేని  దుస్థితి ... తనను  ఎన్నికల్లో పోటీ చేసేలా  చేసిందని వందన చెబుతోంది. అందరూ  హంగూ ఆర్భాటాలతో ప్రచారం హోరెత్తిస్తుంటే.. వందన మాత్రం  కరపత్రాలతో ఓ స్కూటర్‌పై గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేస్తోంది. తనను గెలిపిస్తే మహిళల జీవితాలను మరింత మెరుగుపరుస్తాననీ... భద్రత, విద్య, ఆరోగ్య సదుపాయాలు తీసుకొస్తానని చెబుతోంది.  గ్రామీణ ప్రాంతాలకు కనీస సదుపాయాలు  సమకూరుస్తా అని ఆమె ప్రచారం  చేస్తోంది . మహిళలు  ఆమె  మాటలు  ఓపిగ్గా వింటున్నారు. ఈ సారి  ఈ అమ్మాయికి ఓటు వేస్తాం అంటున్నారు.  ధనబలం, కండబలం, పార్టీ కేడర్లున్న బలమైన రాజకీయ నేతలతో ఎన్నికల్లో తలపడటం  మామూలు విషయం కాదు..  ఒక మంచి లక్ష్యం తో ఎన్నికల్లో పోటీ చేస్తున్న వందన  గెలవాలని కోరుకుందాం....
 • జయ నెచ్చెలి శశికళ  పదవి కోసం  రాంగ్ స్టెప్ వేసిందా ? చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.   జయ తో అక్రమాస్తుల కేసుల్లో  భాగస్వామ్యం స్వీకరించి జైలుకెళ్ళినట్టే . జయ మరణానంతరం  అధికార పీఠం తనదే అని భావించి తొందరపడి పావులు కదిపి అభాసుపాలైందా అంటే  అవుననే చెప్పుకోవాలి.  మొదటి  నుంచి శశికళ  తప్పుడు నిర్ణయాలే తీసుకున్నారు. జయను చూసేందుకు ఎవరిని అనుమతించకపోవడం.. అంత్యక్రియలు బంధువులచే  చేయించకుండా తానే చేయడం  ఇవన్నీ  తొందర పాటు పనులే . అలాగే అర్హతలు లేకుండా  పదవి కోసం వెంపర్లాడటం కూడా తొందర పాటే. పార్టీ పదవి స్వీకరించి  అంతటితో సరిపెట్టుకుని కొన్నాళ్ళు మౌనం గా  ఉండి  ఉప ఎన్నికలో గెలిచాక  సీఎం పదవి  కోసం  ప్రయత్నిస్తే  అది ఆమె కు మర్యాదగా ఉండేది. ఎపుడెపుడు  కుర్చీ ఎక్కుదామా అన్న ఆత్రుత  చూపింది కానీ ఆలోచన చేయలేదు.  వాస్తవానికి జయలలితకు నెచ్చెలి అనే అర్హత తప్ప శశికళకు  మరెలాంటి అర్హతలూ లేవు. ఏనాడూ చట్టసభకు ఎన్నిక కాలేదు. జయ  బ్రతికి ఉన్నప్పుడు ఆమెకు ఏ విధమైన పార్టీ పదవి లేదు.  కొన్నాళ్ళు సభ్యత్వం మాత్రమే ఉంది . ఆరోపణలు వచ్చి జయ చే గెంటి వేయబడినపుడే   జయ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది . మళ్ళీ జయ పంచన చేరినపుడు సభ్యత్వాన్ని జయ ఇవ్వలేదు అంటారు.  అయినా  నెచ్చెలి గానే ఆమె చక్రం తిప్పింది. కొంత మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. కేవలం వారి అండతోనే ఇపుడు సీఎం పదవి కోసం వ్యూహాలు పన్నింది. ఇక్కడే వ్యూహం బెడిసి కొట్టింది. పన్నీర్ సెల్వం తప్పుకుంటే చాలు  కుర్చీలో కూర్చోవచ్చు అనుకుంది కానీ పన్నీర్ వెనుకాల  ఎవరున్నారో ? వారి బలాబలాలు ఏమిటో అంచనా వేయలేదు. ఇటు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతుండగానే సుప్రీం  కోర్టు వారంలో అక్రమాస్తుల కేసులో తీర్పు ప్రకటించబోతున్నట్టు వెల్లడించింది.  అపుడైనా  గమనించి  వెనక్కి తగ్గిందా ? లేదు.  మూర్ఖంగా ముందడుగు వేసింది. కేంద్రం జోక్యం తో గవర్నర్  తమిళనాడు రాలేదు. ఈ లోగానే పన్నీర్ అడ్డం తిరిగి  పార్టీ చీలికకు పావులు కదిపేడు. ఇపుడు బల నిరూపణకు సవాల్ విసురుతున్నాడు. క్రమంగా పార్టీ ఎమ్మెల్యేలు జారుకునే సూచనలు కనబడుతున్నాయి.  ఇవన్నీ శశి తొందరపాటు ఫలితాలే అని విశ్లేషకులు అంటున్నారు. పదవి కోసం ఆశ పడటం లో తప్పులేదు కానీ  తొందరపడి  పన్నీర్ సెల్వం తో రాజీనామా  చేయించి రాంగ్ స్టెప్   వేసిందనే  అభిప్రాయం వ్యక్తమౌతోంది. ...
 • 'తానేంటో తన సత్తా ఏమిటో కొన్ని గంటల్లోనే చూపిస్తా' అని  తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి  పన్నీర్ సెల్వం  సవాలు చేశారు. మీడియాతో ఈ ఉదయం  ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు తాను నోరు విప్పి చెప్పింది  కేవలం పది శాతమేనని, ఇంకా 90 శాతం మిగిలే ఉందని అన్నారు. అవన్నీ తనతో చెప్పించే ప్రయత్నం చేయొద్దని శశికళ వర్గాన్ని హెచ్చరించారు.  గవర్నర్ చెన్నై రాగానే కలుస్తానని.. రాజీనామా వెనక్కి తీసుకుంటానని స్పష్టం చేశారు. జయలలిత దేవత అని.. పార్టీ పటిష్టత కోసం అమ్మ మార్గంలోనే  తాను నడుస్తున్నట్లు  పేర్కొన్నారు.   60 మంది ఎమ్మెల్యేల మద్దతు  తనకు ఉందని.. అసెంబ్లీలో బలనిరూపణకు సిద్ధంగా ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. ఇక జయ మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని  ఆయన..సుప్రీం కోర్టు  జడ్జితో విచారణ చేయిస్తానన్నారు. పార్టీని ఏకతాటిపైకి తీసుకొస్తానని స్పష్టం చేశారు. ధైర్యం ఉంటే శశికళ వర్గం బలనిరూపణ చేసుకోవాలని సవాల్ విసిరారు .  పన్నీర్ వ్యాఖ్యలతో  శశికళ శిబిరం ఉలిక్కిపడింది.  గవర్నర్ రాగానే కలవాలని  శశి వర్గం కూడా సమాయత్తమవుతోంది .తన వెనుక బీజేపీ లేదని  పన్నీర్ చెబుతున్నప్పటికీ  తెర వెనుక నుంచి  ఆ పార్టీ నేతలే పన్నీర్ ను ఆడిస్తున్నారని శశి వర్గం భావిస్తోంది. ...
 • ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని సామెత. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కొందరి మంత్రుల పరిస్థితి అలాగే ఉంది. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సూచనప్రాయంగానే అయినా త్వరలో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రకటించారు. అదే సమయంలో చిన బాబు లోకేష్ ను మంత్రి వర్గంలోకి తీసుకుంటున్న విషయాన్నీ అధికారికంగా దృవీకరించారు. దీంతో ఇప్పుడు, ముఖ్య మంత్రి చిన బాబు లోకేష్ కు ఏ శాఖలు ఇస్తారు లేదా చిన బాబు ఏ శాఖలు తీసుకుంటారు ఫలితంగా  ఏ మంత్రుల ఉద్యోగం  ఊడుతుంది అనేది  అధికార పార్టీ వర్గాలలో చర్చనీయాంశమైంది . ఈ క్రమంలో ముందుగా ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి పేరు గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణాలో, ముఖ్య మంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఅర్ అనేక ఇతర శాఖలతో పాటుగా, ఐటీ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. పైగా చంద్రబాబుకు మొదటి నుంచి ఐటీ అంటే ప్రాణం. సో , ఐటీ శాఖ చిన బాబు ఖాతాలో చేరి పోయినట్లేనని అంటున్నారు.  మరో వంక ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కుటుంబ వత్తిళ్ళు బాగా పెరిగాయని, అందు వలన చేతనే, లోకేష్ ను మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నారని వినవస్తోంది. అదే విధంగా, శాఖల విషయంలో కూడా కేటీఅర్ కు ఏ మాత్రం తీసిపోకుండా చిన బాబుకు కీలక శాఖలు కేటాయించాలని కూడా కుటుంబం నుంచి గట్టి వత్తిళ్ళు వస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అది కూడా నిజం అయితే, ఐటీ తో పాటు కేటీఅర్ నిర్వహిస్తున్న పరిశ్రమలు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ తదితర శాఖలు కూడా చిన బాబు ఖాతాలో చేరిపోయే ‘ప్రమాదం’ లేక పోలేదని అప్పుడు మరికొందరు మంత్రులకు కూడా ఉద్వాసన అనివార్యం అవుతుందని అంటున్నారు.  అదలా ఉంటే, కొంత మంది మంత్రుల పనితీరు బాబు గారికి అంతగా సంతృప్తి ఇవ్వడం లేదని అలాంటి వారికీ కూడా పదవీ గండం తప్పక పోవచ్చని అంటున్నారు. ఈ కేటగిరీలో ప్రధానంగా రావెల కిశోర్  బాబు, పీతల సుజాత, అయ్యన్న పాత్రుడు లాంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక  మంత్రి వర్గానికి ‘యువ కళ’ తీసుకురావాలన్న డిమాండ్ కూడా చిన బాబు బృందం వినిపిస్తోంది. చిన బాబు ఈ మనోభీష్టాన్ని కూడా చంద్రబాబు తీరిస్తే, అప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి దొడ్డిదారిన మండలిలో అడుగుపెట్టిన పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వారికీ మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంటుంది. అలాగే గాలి ముద్దు కృష్ణమ నాయుడు పేరు కూడా ఎందుకనో వినిపిస్తోంది. అంటే, మంత్రి వర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జగిగితే, మాజీల సంఖ్య మరింత పెరిగుతుంది. ఈ తల నొప్పులకు తోడు అధికార దాహంతో వైసీపీ  నుంచి  టీడీపీ లోకి ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేల లలో భూమా నాగిరెడ్డి సహా మరి కొందరికి  చంద్రబాబు  మంత్రి పదవులు ఇవ్వొచ్చు.  ఇలా మొత్తంగా చూస్తే మంత్రి వర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ ఏది జరిగినా కొందరు మంత్రుల కొలువులు పోవడం మాత్రమే కాదు, అధికార పార్టీలో ఇప్పటికీ రగులుతున్న విభేదాలు మరింతగా విరుచుకు పడడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే చిన బాబు గారి పట్టాభిషేకం పెద బాబుకు  కునుకు లేకుండా చేస్తోంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న సామెత గుర్తుకు వస్తోంది. విస్తరణ విష్పోటనం సృష్టించిననా  ఆశ్చర్య పోవవసరం లేదని పిస్తోంది. ....  Balakrishna Rajanala...
 • సీనియర్ పార్లమెంట్ సభ్యుడు మరణించినా  సభ వాయిదా వేయకుండా సభ నడిపి బడ్జెట్ సమర్పించేసారు. ఎన్డీయే సర్కార్ కొత్త సంప్రదాయాలకు  నాంది పలుకుతోంది.  నిబంధనల ప్రకారం సిట్టింగ్‌ ఎంపీ చనిపోయిన సందర్భాలలో ఉభయసభలలోనూ ఆయన/ఆమె కు అంజలిఘటిస్తారు. రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం సభ ఒకరోజుకు వాయిదా వేస్తారు. సాధారణంగా సమావేశాలు లేని సందర్భంలోనూ ఎంపీలు ఎవరైనా చనిపోతే, ఆ సీజన్‌లో సభ ప్రారంభమైన మొదటిరోజే మృతులకు నివాళులు అర్పించిన పిదప సభను వాయిదావేస్తారు. ఇది ఇప్పటివరకు పాటిస్తోన్న సాంప్రదాయం కూడా. కానీ మోడీ సర్కార్ దీన్ని పక్కన బెట్టి మరీ బడ్జెట్  సమర్పణ కోసం సభను  కొనసాగించింది .   ఆరుసార్లు ఎంపీ, ఐదుసార్లు ఎమ్మెల్యేగాఎన్నికై ,కేంద్రమంత్రి గా చేసిన ముస్లిం లీగ్  జాతీయ అధ్యక్షుడు అహ్మద్‌(78) బుధవారం  తెల్లవారుజామున మరణించగా కేవలం నివాళి అర్పించి సభను వాయిదా వేయకుండా కొనసాగించారు.  మంగళవారం పార్లమెంట్‌ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రసంగిస్తుండగా.. గుండెపోటు రావడంతో అహ్మద్ ను  హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. రాంమనోహర్‌ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున అహ్మద్‌ తుది  శ్వాస విడిచారు. ఒక సీనియర్ సభ్యుడిని గౌరవించే  పద్ధతి ఇదేనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.   ఇదిలా ఉంటే హాస్పిటల్ వర్గాలు కుటుంబ సభ్యులను కూడా అహ్మద్ ను  చూడటానికి  అనుమతించలేదని .. బుధవారం  ఉదయం  వరకు  అహ్మద్  మరణ వార్తను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదని ... దీని వెనుక రాజకీయం ఉందని ఢిల్లీ పత్రికలు కథనాలు రాశాయి....
 • రాజీవ్ తనయ ప్రియాంక గాంధీ రాజ‌కీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమౌతోంది . ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల్లో ప్రియాంక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తార‌ని అంటున్నారు. సోనియా గాంధీ అనారోగ్య కారణాల దృష్ట్యా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండబోతున్న నేపథ్యంలో ప్రియాంక ప్రచార బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాయ‌బ‌రేలీ నుంచి ఆమెని పోటీకి దించే ఉద్దేశంలోకూడా  కాంగ్రెస్ ఉంద‌ని  అంటున్నారు. అయితే, గ‌తంలో ఆమె ప్ర‌చారం చేసిన స్థానాల్లో మెరుగైన ఫ‌లితాలు రాలేదు . అయితే అప్పటి పరిస్థితులు వేరు . ఇందిరాగాంధీ అంటే యూపీ ప్రజలకు ఇంకా అభిమానమే .. అచ్చు ఇందిర  పోలికలతో ఉండే  ప్రియాంక  ప్రజలను ఆకట్టుకోపగలదని అంచనా వేస్తున్నారు. ఇందిర  అంత గొప్ప వక్త కాకపోయినప్పటికీ  ప్రియాంక కూడా బాగా ఆకట్టుకునేలా మాట్లాడగలరని  అంటున్నారు . కాంగ్రెస్‌ను, తన కుటుంబాన్ని, భర్త వ్యాపార లావాదేవీలను సమర్ధిస్తూ చక్కగా ప్రసంగించిన సందర్భాలున్నాయి. 1999 ఎన్నికల్లో తొలిసారి పోటీచేసిన తల్లికి మద్దతుగా ప్రియాంక అమేథీలో మొదటి సారి  ప్రచారం చేశారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో రాయ్‌బరేలీలో తల్లి సోనియా తరఫున, అమేథీలో సోదరుడు రాహుల్‌ తరఫున ప్రచార బాధ్యత భుజానవేసుకున్నారు. 2014 ఎన్నికల్లో రాహుల్‌ లక్షా ఏడు వేల ఓట్ల తేడాతోనైనా గెలవడం ప్రియాంక వల్లే సాధ్యమైందని అంటారు . రాహుల్ తో పోలిస్తే ప్రియాంక ప్రచారం మేలు అన్న భావన యూపీ నేతల్లో వ్యక్తమౌతోంది. దేశంలో మోడీ స‌ర్కారుపై వ్య‌తిరేక‌త ప్రారంభ‌మైంద‌నీ, పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం త‌రువాత మారిన పరిస్థితులు బీజేపీకి  మైన‌స్ గా మారాయని … ఈ అంశాల‌న్నింటిని   అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ వ్యూహం సిద్ధం చేస్తున్న‌ట్టు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ప్రియాంక కూడా పార్టీకి తోడైతే మ‌రింత ఊపు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని  పార్టీ సీనియ‌ర్ నేతలు  అభిప్రాయ‌ప‌డుతున్నారు.  ఎస్పీ తో పొత్తు ఇపుడు కాంగ్రెస్ కి ఒక ప్లస్ పాయింట్ .  పది స్థానాలు కూడా గెలుచుకోలేని స్థితిలో ఉన్న కాంగ్రెస్ కి 105 సీట్లు కేటాయించడం గొప్పే . ఇది కూడా ప్రియాంక  జోక్యం  వల్ల సాధ్యమైంది. ఇదిలా ఉంటె ప్రియాంకపై అపుడే విమర్శలు మొదలైనాయి. వాటి అన్నిటిని తిప్పి కొట్టేందుకు ప్రియాంక సమాయత్తమౌతున్నారు....
 • అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు మోడీ సర్కార్ బడ్జెట్ తాయిలాలు ప్రకటించే యోచన చేస్తోంది. ఉద్యోగులకు ,పెన్షనర్లకు భారీగా లబ్ధి చేకూర్చేవిధంగా ఏడో వేతన సంఘం సిఫార్సులను ఆమోదించే సూచనలు కనిపిస్తున్నాయి . అదే జరిగితే మాత్రం.. 47 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లు, వాళ్ల కుటుంబ సభ్యులలో అధిక భాగం  ఎన్డీయే వైపు మొగ్గు చూపుతారని అంచనా వేస్తున్నారు. హెచ్ఆర్‌ఏను 138.71 శాతం పెంచాలని, ఇతర అలవెన్సులను 49.79 శాతం పెంచాలని వేతన సంఘం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్‌లో ఈ అంశాన్ని ప్రకటిస్తే ఎన్నికల సంఘం ఏమైనా అభ్యంతరం చెబుతుందా అని బీజీపీ నేతలు యోచిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టిన కొద్దిరోజులకే ఓటింగ్ ప్రారంభం కానున్నందున అయిదు రాష్ట్రాల ఓటర్లు ప్రభావితం చేసే ఎలాంటి ప్రకటనలు చేయ కూడదని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆమధ్య ముందస్తు బడ్జెట్ పై ఒక ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టులో వేశారు. దీనిపై స్పందించిన సుప్రీం బడ్జెట్ ను వాయిదా వేయాల్సి అవసరం లేదని స్పఫ్టం  చేసింది. అయితే ఇప్పటికి  ప్రతిపక్షాలు బడ్జెట్ ను వాయిదా వేయమని డిమాండ్ చేస్తున్నాయి .  పెద్దనోట్ల రద్దుతో నగదు అందుబాటులో లేక తీవ్రంగా ఇబ్బంది పడిన ప్రజలు కేంద్రం పై గుర్రుగా ఉన్నారు.  ఉద్యోగులు  చాలా కాలం నుంచి జీతాలు ఎప్పుడు పెరుగుతాయా అని ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పెన్షనర్లు వేతన సంఘం సిఫార్సుల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్‌లో ఈ అంశాన్ని ప్రకటిస్తే అది ఖచ్చితంగా ఎన్డీయేకు మేలు చేకూరుస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు .కాగా  వేతన సంఘం సిఫార్సులను యథాతథంగా అమలుచేస్తే.. కేంద్ర ప్రభుత్వం మీద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ. 29,300 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. ఇందులో రూ. 17,200 కోట్లు హెచ్ఆర్ఏ, 12,100 కోట్లు ఇతర అలవెన్సుల రూపంలో పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇవాళో రేపో ఈ అంశంపై మోడీ ఒక నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ...
 •  (శివ రాచర్ల) ..................................   కొత్త సున్నాలు,కుండ భోజనాలు. కొన్ని విరులను వికసింపజేశాం..మరి కొన్ని మొగ్గలున్నాయి.. ఈతోటలో గత కాలపు ముళ్ళు ఇంకా గుచ్చుకుంటున్నాయి...2015-2016 బడ్జెట్ ప్రసంగంలో అరుణ్ జైట్లి. బల్లెం కానీ త్రిశూలం కానీ విజయాన్ని అందించలేవు.. సమధర్మంతో సాగించిన అధికారమే పాలకులకు విజయం సాధించిపెడుతుంది...2014-2015 బడ్జెట్ ప్రసంగంలో చిదంబరం ప్రస్తావించిన "తిరువళ్ళువర్" సూక్తి. ఫిబ్రవరి చివరిలో బడ్జెట్ పెట్టి మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాలలో పార్లమెంట్ ఆమోదం పొంది నిధుల వినియోగానికి అనుమతులు పొందేటప్పటికి రుతుపవనాల సీజన్ వచ్చేస్తుంది.దీని వలన ప్రీ-మాన్ సూన్ సీజన్లో ప్రభుత్వ పథకాలు నిరుపయోగమైపోతున్నాయ్! ఫిబ్రవరి 1న బడ్జెట్ పెట్టి ఏప్రేల్ 1 నుంచే పూర్తిస్థాయిలో బడ్జెట్ను అమలుచేసి రాష్ట్రాలకు తగిన ప్రయోజనాలు కల్పించటానికి అవకాశం వుంటుందని కేంద్రం భావిస్తుంది.ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం ఏప్రేల్ 1న మొదలైనా కొత్త బడ్జెట్ ఆమోదంపొంది అమల్లోకి వచ్చేసరికి మే నెల సగం గడిచిపోతుంది.జూన్లో వర్షాలతో పనులకు ఆటంకం కావటంతో పథకాల అమలు అక్టోబరులొ మొదలవుతుంది.వాటిని పూర్తిచెయ్యటానికి ఆర్నెల్ల గడువే వుంటుంది అందుకే బడ్జెట్ను నెల ముందే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టి క్రతువును ఏప్రేల్ 1లోపే పూర్తిచెయ్యాలని కేంద్రం భావిస్తుంది! చందమామ కథలు,కాశిమజిలీ కథలు గుర్తొస్తున్నాయా?బడ్జెట్ అంటే ఏమిటో,దాని అమలు తీరు ఎలావుంటుందో,వర్షాల వలన ఆటంకం కలిగే పనులు(రోడ్లు,ప్రాజెక్టులు?) ఏమిటో,ఆర్నెల్ల గడువు ఎందుకో? ...ఇలా అందరు కొత్తగా చదువుకోని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అర్ధంచేసుకోవాలి!సమర్ధించనోడు ఎలాగు "దేశద్రోహే"... మరి గతంలో BJP ప్రభుత్వం ఇలా ఎందుకు ఆలోచించలేదు అన్న అనుమానం రాకూడదు...ముందస్తు బడ్జెట్ "కల" అప్పుడు రాలేదు,కల అవసరం కూడ లేదు మరి ఉత్తరప్రదేశ్, మరి నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అప్పుడు జరగలేదు కదా? ముందస్తు బడ్జెట్ గురించి గత సెప్టంబర్లోనే మొదలైంది కాని ఉత్తరప్రదేశ్ ఎన్నికలు 15-Mar-2012 న అఖిలేష్ పూర్తి మెజారిటీతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినరోజునే 2017 ఫిబ్రవరిలో జరుగుతాయని ఖరారు అయ్యాయి! నోట్లరద్దు వ్యతిరేక ప్రభావాన్ని,ప్రజల కోపాన్ని తగ్గించటానికి ఎన్నికలకన్నా ముందే ఎదో ఒకటి చెయ్యాలి!బడ్జెట్ మంచి అవకాశం. నొట్ల రద్దు వలన కనీసం 3 లక్షల కోట్లు వెనక్కిరావు అవి ఆర్ధిక వ్యవస్థ ఆదాయం అని చేసిన ప్రచారం దాదాపు మొత్తం ధనం బ్యాంకుల్లో డిపాజిట్ కావటంతో కేంద్ర ప్రభుత్వ ఆశలుగల్లంతయ్యాయి.ఎంత మొత్తం వెనక్కి వచ్చింది అన్న లెక్క ఇప్పటికి తేలలేదని RBI జవాబు దాటేస్తుంది.పార్లమెంట్ స్ఠాండింగ్ కమిటి సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నీళ్ళు నమిలిన RBI గవర్నర్ ఊర్జిత్ పటేలును BJP నాయకుల అవహేళనకు గురైన మాజి ప్రధాని మన్మోహన్ సింగ్ "ఇబ్బందికర ప్రశ్నలకు సమాధానం చెప్పొద్దని" సహాయపడ్డారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా దేశంలో డిజిల్,పెట్రోల్ ధర్లు తగ్గించకుండ ప్రజల మీద భారాన్ని కొనసాగించారు.దీని వలన గత సంవత్సరం ప్రభుత్వం ఆదాయం అక్షరాల 3.14 లక్షల కోట్లు.ఈసంవత్సరం అది మరింత పెరిగి 4 లక్షలు కొట్లు అయ్యుంటాయి. ఇలా మిగిలిన డబ్బును,ఇతర వనరుల్లొ చేకూరిన డబ్బును "సంక్షేమ పథకాలు"గానో మరో రూపంలోనే ఈ బడ్జెట్లోప్రకటిస్తారని ఊహిస్తున్నారు.ఈడబ్బులన్ని "నోట్లరద్దు" ద్వారా కలిగిన ప్రయోజనాలే అని యధావిధిగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. ఇలా ఎన్నికల ముందు ముందస్తుగా బడ్జెట్ ప్రవేశపెట్టటం 5 రాష్ట్రాల ఎన్నికల్లో లబ్ధి కోసమే అని 16 ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతికి  ఫిర్యాదు చేశాయి.రాష్ట్రపతి "విధి నిర్వహణ" ప్రకారం విని పరిశీలిస్తామన్నారు. M.L.శర్మ అనే ఒక లాయరుగారు జనవరి 5న ముందస్తు బడ్జెట్ మీద ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) వేశారు.సుప్రిం కోర్టు తొందరే ముంది నిదానంగా విచారిద్దాం అని చెప్పి మొన్న 23న కేసు కొట్టేసింది. సుప్రింకోర్టు ధర్మాసనానికి బడ్జెట్తో ఓటర్లను ప్రభావితం చేస్తారనటానికి ఒక్క ఉదాహరణ కూడ కనిపించలేదంట.బడ్జెట్లో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు వున్నా తిరిగి కొర్టు మెట్లు ఎక్కటానికి M.L.శర్మగారికి సుప్రిం కోర్టు అవకాశం ఇవ్వలేదు.ఇంతకన్నా ఎక్కువ రాస్తే కోర్టు దిక్కారమే! ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి పథకాలు ప్రకటించొద్దని కండీషన్ పెట్టింది. బడ్జెట్లో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి చేకూర్చే పథకాలను ప్రకటించి ఆ తరువాత సారి చెప్తే ఎన్నికల సంఘం సరే అనటం తప్ప చెయ్యకలిగేది ఏముంది?ఎన్నికల్లో గెలిపిస్తే ఆయా పథకాలను అమలుచేస్తామని అభ్యర్ధులు ప్రచారం చేసుకోవచ్చు,పథకాలను అడ్డుకుంటున్నాయని ప్రతిపక్షాల మీద దాడి చెయ్యొచ్చు! ఈ బడ్జెట్లో ప్రణాళికా,ప్రణాళికేతర వ్యయాల పేర్లను "మూలధన ఖర్చు"(capital expenditure) & రెవెన్యు ఖర్చుగా మారుస్తారంట.పైకి పేరు మార్పే అనిపించవచ్చు కాని అసలు విషయమ "ప్రణాళికా వ్యయాన్ని అంటే ఏ ఏ రంగాలకు,పథకాలకు ఎంత ఖర్చు పెడతారో బడ్జట్లో చెప్పరు...అంచనాలు లేని ఖర్చు-వాడుకో,దోచుకో... ఈబడ్జెట్లో మరో మార్పు...రైల్వే బడ్జెట్ను రద్దు చేసి సాధారణ బడ్జెట్లొనే రైల్వే పద్దులను ప్రవేశపెడతారంట. రైల్వే బడ్జెట్ ఎందుకు రద్దు చేస్తున్నారంటే పార్లమెంట్ సమయం ఆదావుతుందంట.రైల్వే మంత్రులు తమ రాష్ట్రానికి ఎక్కువ ప్రాజెక్టులు ప్రకటించికుంటున్నారంట.పైగా రైల్వే బడ్జెట్ 1924లొ "బ్రిటీష్" వాళ్ళు ప్రవేశపెట్టిన సాంప్రదాయం అంట. రైల్వే బడ్జెట్ను రద్దు చేసి ప్రజలకు మంచి చెస్తామని ఈ ప్రభుత్వం నడుంకట్టింది.రైల్వే బడ్జెట్ రద్దుకు ప్రభుత్వం చెప్తున్న కారణాలను రాజకీయవిశ్వాసులు తప్ప ఇంకెవరైనా నమ్ముతారా?రైల్వే మంత్రి సొంత రాష్ట్రానికి లబ్ధి చేకూర్చుకుంటున్నారు అనటం పరోక్షంగా "ప్రధాన మంత్రి" మంత్రులను అదుపుచెయ్యటంలేదనటమే! రైల్వే బడ్జెట్ను రద్దు చేసి రైల్వే ఖర్చులకు,పథకాలకు "జవాబుదారితనాన్ని" రైల్వే మంత్రి నుంచి తప్పిస్తున్నారు.రైల్వేను నష్టాలు పట్టించటం,ప్రవేటీకరణ బాటలు వెయ్యటంకాయం. ఆర్ధిక మంత్రి మాత్రం నిస్పక్షపాతంగా ఆన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేస్తున్నారా? మార్పు తేలనప్పుడు,వ్యవస్థలో లోపాలను సరిచేయలేనప్పుడు ప్రభుత్వాలు చేసే విన్యాసాలే ముందస్తు బడ్జెట్,రైల్వే బడ్జెట్ రద్దు...ప్రభుత్వం తీరు రిపేరు చేయలెనప్పుడు కొత్త సున్నం కొట్టి,గృహప్రవేశమే లేక వ్రతమో చేసి భోజనాలు పెడుతున్నట్లుంది. అరుణ్ జైట్లి అన్నట్లు ఈతోటలో గత కాలపు ముళ్ళు ఇంకా గుచ్చుకుంటున్నాయి...వీరి పాలనలో ఇప్పుడవి తుమ్మ ముళ్ళులాగా బలిసి వ్యవస్థకు చీము పట్టిస్తున్నాయి....
 • ప్రత్యేక హోదా సాధన కోసం  'విశాఖ ఆర్కే బీచ్‌ 'లో  యువత  దీక్షకు  రంగం సిద్ధమవుతోంది!  తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలంటూ తమిళ యువత నిరసన చేపట్టిన తరహాలోనే ... హోదాపై శాంతియుత దీక్ష  చేద్దామని సోషల్‌ మీడియాలో ఆంధ్ర ప్రాంత  యువత పిలుపు నిస్తూ పోస్టులు చేస్తున్నారు. కాగా  సోషల్ మీడియా ఆధారంగా చేపట్టే కార్యక్రమాలను  అనుమతించేది లేదని ఏపీ  డీజీపీ సాంబశివరావు స్పష్టం చేశారు. ఇలాంటి  కార్యక్రమాలు జరిగేటప్పుడు వాటి నిర్వాహకులు ఎవరన్న విషయం  కీలకమని .. కానీ సోషల్ మీడియా ఆధారంగా జరిగే కార్యక్రమాలకు ఓనర్ షిప్ ఉండదని ఆయన తేల్చి చెప్పారు. ఈనెల 26వ తేదీన తలపెట్టిన ఆర్కే బీచ్ దీక్షకు అనుమతి కావాలని ఎవరూ తమను కోరలేదని  చెప్పారు.  తమకు శాంతిభద్రతలే ముఖ్యమని.. పోలీసు ఆంక్షలకు అంతా సహకరించాలని చెప్పారు. ఇదిలావుంటే  26వ తేదీ సాయంత్రం  బీచ్‌రోడ్డులో నిర్వహించే శాంతియుత నిరసన కార్యక్రమానికి పార్టీలకతీతంగా హాజరుకావాలంటూ రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనికి   వైసీపీ అధినేత  జగన్ , కాంగ్రెస్ నేతలు , జనసేన అధిపతి  పవన్‌ కల్యాణ్‌ మద్దతు  ప్రకటించారు . దీంతో పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు .  ఏపీ సర్కార్  ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు 27వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.  ఈ సదస్సు కోసం  సీఎం చంద్రబాబు 26వ తేదీనే విశాఖ నగరానికి వెళుతున్నారు . ఇక  ఈ దీక్షకు  సినీ పరిశ్రమ నుంచి  అగ్ర నటులు  ఎవరూ  మద్దతు ప్రకటించలేదు .  కొందరు  చిన్న నటులు మాత్రం దీక్షకు  సంఘీభావం ప్రకటించారు . ...
 • (Balakrishna Rajanala ) ...................  ఎప్పుడో రెండున్నర సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది. అంతకు ముందు మూడు నాలుగు మాసాల క్రితం గత పార్లమెంట్ ఆఖరి సమావేశల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు ఆమోదం పొంది చట్టమైంది. ఆ చట్టం నిర్దేశించిన ప్రకారం 2014 జూన్ 2 తేదీన 29 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నిజమే. అప్పటి ప్రభుత్వం రాష్ట్ర విభజన అంశాన్ని సాగదీసి , నానబెట్టి చివరాఖరుకు ‘మమ’ అనిపించింది. రాష్ట్ర విభజన అంతటి కీలక అంశాన్ని, రాజకీయ కోణంలోనే చూసింది గానీ, రాజ్యంగ స్పూర్తి లాంటి కోణంలో అంతగా ఆలోచించలేదు. కనీసం రెండు మూడు సంవత్సరాల ముందు చేయవలసిన పనిని చివరి క్షణం వరకు లాగీ, పీకీ అయిందంటే అయ్న్దన్నట్లుగా కానిచ్చేసింది. ఈ ప్రక్రియలో, కొన్ని రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని అప్పట్లోనే అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. యుద్ద వాతావరణాన్ని తలపించే విధంగా లోక్ సభలో ప్రత్యక్ష ప్రసారాలను ఆపివేసి, తలుపులు మూసి విభజన బిల్లు ఆమోదం పొందిందని ప్రకటించారు. అలాగే, విభజన బిల్లులో అనేక అవకతవకలు జరిగిన మాట కాదనలేనిది. గత రెండున్నర సంవత్సరాలలో ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలే అందుకు నిదర్శనం. ఏది ఏమైనా, ఎవరికీ ఎన్ని అనుమాన సందేహాలున్నా, రాష్ట్రపతి ఆమోదం పొందిన చట్టం విషయంలో మళ్ళీ, అదేదో సామెతలో లాగా కథను వెనక్కి తీసుకుపోవడం అయితే అజ్ఞానం కాదంటే అవివేకం అవుతుందే గానీ, మరొకటి కాదు.  ఇప్పుడు ఈ చర్చ ఎందుకనేది అర్థమయ్యే ఉంటుంది. ఎప్పుడో రాష్ట్ర విభజనకు ముందు వెనకా అప్పటి ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆనాటి ఎంపీలు, రాయపాటి సాంబశివ రావు, ఉండవల్లి అరుణ కుమార్, రాజ మోహన్ రెడ్డి ఇంకొందరు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం చెల్లదంటూ దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం విచారణకు స్వీకరించింది. ఈ తతంగం అంటా చూస్తుంటే, అలా అనొచ్చో లేదో గానీ, ఎదో సామెత గుర్తుకొస్తోంది.  అదలా ఉంటే, ఇప్పడు ఆ తేనే తుట్టెను మళ్ళీ కదల్చడం వలన కొత్త గా జరిగే ప్రయోజనం ఏమున్నా లేకపోయినా, అనర్ధాలు జరిగే ప్రమాదం లేక పోలేదన్న ఆందోళన ఉభయ రాష్ట్రాలలో వినవస్తోంది. ముఖ్యంగా, ఇతరేతర కారణాల చేత తమ ప్రాబల్యాన్ని కోల్పోతున్న రాజకీయ శక్తులు, అధికార గణాలు ప్రజల దృష్టిని పక్క దారి పట్టించేందుకు దీన్నొక అస్త్రంగా వినియోగించుకునే ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన కూడా అక్కడక్కడా వినవస్తోంది. మరో వైపు ఇప్పుడిప్పుడే ఉభయ రాష్ట్రాలలో ఉద్యోగుల విభజన వంటి తకరారులు తొలిగి పరిపాలన, ఎంతో కొంత గాడిలో పడుతోంది. ఇలాంటి పరిస్థితులలో సర్వోన్నత న్యాయస్థానం ఈ  తేనే తుట్టను లేపడం, ఎంత వరకు సమజసం? అలోచించండి....
 • సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక  కార్యక్రమం లో టీడీపీ ఎంపీ మాగంటి బాబు స్టెప్పులేసి  వార్తల్లోకి  ఎక్కారు  క్రిష్ణా జిల్లా కైకలూరులోని ఈ కార్యక్రమం  జరిగినట్టు తెలుస్తోంది. వేదికపై లేడీస్ మధ్య కాసేపు జోష్‌గా అటు ఇటు తిరిగిన మాగంటి బాబు.. అదే ఊపులో యాంకర్‌తో చేయి చేయి కలిపి స్టెప్పేసిన తీరు మీడియా కంట పడింది.  తమ నేత జోష్ చూసిన పార్టీ కార్యకర్తలు, అనుచరులు కూడా ఒక్కసారిగా వేదికను  చుట్టిముట్టి  ఈలలు కేకలతో ఆయన్ని  ఉత్సాహపరిచారు. చూడండి వీడియో. courtesy abn andhrajyothi  ...
 • తెలంగాణ ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్‌ రావు ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం  నిర్వహించబోతున్నారు .  సంక్రాంతి తర్వాత ఈ ప్రజా దర్బార్‌  కార్యక్రమం మొదలు కావచ్చు .   సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌ వేదికగా ప్రజాదర్బార్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. దర్బార్‌ నిర్వహణకు అనుసరించాల్సిన విధానాల  గురించి   సీఎం  అధికారులతో చర్చించినట్టు సమాచారం . అన్ని కులాలు, వర్గాలతో సమావేశమయ్యేలా ప్రణాళిక ప్రకారం ప్రజా దర్బార్‌ నిర్వహించాలని ముఖ్యమంత్రి నిశ్చయించారు. దీంతోపాటు రక రకాల సమస్యలతో ఇబ్బందిపడే ప్రజలు తమ గోడు వెళ్లబోసుకునేందుకు కూడా  వీలు కల్పించాలని సూచించారు. దీంతో రెండు విధాలుగా ప్రజా దర్బార్‌ నిర్వహించే అవకాశాలు  సీఎం పరిశీలనలో ఉన్నట్లు సమఃచారం.  ప్రగతి భవన్‌ సముదాయంలోనే దాదాపు వెయ్యి మందితో సమావేశమయ్యేలా ఒక విశాలమైన  హాల్‌ ఉంది.   సీఎం దీనికి ‘జనహిత భవన్‌’ అని పేరు పెట్టారు. రైతులు, కార్మికు లు, ఉద్యోగులు, కళాకారులు తదితర వర్గాల తో ముఖ్యమంత్రి ఇక్కడ ముఖాముఖి  నిర్వహిస్తారు. ప్రభుత్వ విధానాల రూప కల్పన, కార్యక్రమాల అమలుపై వారితో సమాలోచనలు జరుపుతారు.  ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, వృత్తులు, కులాలు, సంఘా లు, యూనియన్లవారీగా ప్రతి వర్గంతో సీఎం నేరుగా మాట్లాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి సమావేశానికి వచ్చే వారికి రానుపోను రవాణా సదుపాయంతోపాటు భోజన ఏర్పాట్లు చేయా లని సీఎం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ...
Site Logo