Latest News
రాజ‌కీయం

గిరిజ ఇన్ .... రావు ఔట్

1st Image

తమిళనాడు నూతన ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్‌ను నియమించారు. సీఎస్‌గా ఉన్న రామ్మోహన్‌రావుపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆయనకు ఉద్వాసన పలికారు. కొత్త సీఎస్‌గా గిరిజా వైద్యనాథన్‌ను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న రామ్మోహన్‌రావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి భారీగా నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఈక్రమం లో తమిళనాడు ప్రభుత్వం ఆయనను సీఎస్ పదవి నుంచి తొలగించింది. ప్రస్తుతం గిరిజా వైద్యనాథన్‌ ల్యాండ్ సర్వే కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. 
శేఖ‌ర్‌తో స‌న్నిహిత సంబంధాల‌ నేప‌థ్యంలో రావును అరెస్టు కూడా చేయ‌వ‌చ్చ‌న్న వార్త‌లొస్తున్నాయి. రామ్మోహ‌న్ రావు మ‌న తెలుగువారే. ప్ర‌కాశం జిల్లా సింగ‌రాయ‌కొండ మండ‌లం ఆయ‌న స్వ‌స్థ‌లం.  లిక్కర్ వ్యాపారి ఆదికేశవులు నాయుడికి ఆయన దగ్గర  బంధువు కూడా . ఏపీ లో కూడా ఈయనకు ఎవరెవరితో ఆర్ధిక సంబంధాలు ఉన్నాయో ఐటీ శాఖ కూపీ లాగుతోంది. 

Site Logo
  • ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.  గురువారం ఎయిర్ ఇండియా ఉద్యోగి సుకుమార్ ను చెప్పుతో కొట్టి వార్తల్లో కెక్కారు.    ఈయన మహారాష్ట్ర లోని ఉస్మానాబాద్ కి  ఎంపీ గా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  అంతకుముందు రెండు మార్లు ఒమేర్గా  స్థానం నుంచి ఎమ్మెల్యే గా కూడా ఎన్నికైనారు.   పూణే నుంచి ఆయన ఢిల్లీకి పయనమయ్యారు.  తనది  బిజినెస్ క్లాస్ టికెట్ కాగా ఎకానమీ  క్లాస్ లో సీటు ఇచ్చారని  సహనం కోల్పోయి.. ప్రజాప్రతినిధిని అన్న జ్ఞానం కూడా లేకుండా వీరంగం  వేసాడు.  విమానం ఉదయం 11 గంటలకు ల్యాండ్  కాగానే  ఎయిరిండియా ఉద్యోగిపై  రవీంద్ర గైక్వాడ్ దాడి చేశారు.  పైగా  తన చర్యను సమర్థించుకున్నాడు. ‘అవును ఒకసారి కాదు 25సార్లు అతడిని చెప్పుతో కొట్టాను’ అని చెప్పుకొచ్చారు కూడా. ఎయిరిండియా సిబ్బందికి చాలా సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే సహనాన్ని కోల్పోయానని గైక్వాడ్ చెప్పాడు. కాగా  రవీంద్ర గైక్వాడ్ తన పట్ల దారుణంగా ప్రవర్తించడంతో పాటు చెప్పుతో కొట్టినట్లు ఎయిర్ ఇండియా ఉద్యోగి సుకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అవమానించడంతో పాటు చేయి చేసుకున్నారని, తన కళ్ళద్దాలు పగులగొట్టారని సుకుమార్  ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఎయిర్ ఇండియా కూడా ఈ ఘటనపై విడిగా ఫిర్యాదు చేసింది. ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విమానాన్ని బలవంతంగా 40 నిమిషాలపాటు నిలుపుదల చేసినట్లు ఆరోపించడంతో ఆమేరకు మరో కేసు కూడా నమోదైంది. కాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఈ ఘటనను ఖండించారు. ఎయిర్ ఇండియా సిబ్బందిపై భౌతిక దాడులను ఏ పార్టీ సమర్థించకూడదని అన్నారు. తమ ఎంపీ రవీంద్ర గైక్వాడ్ అలా ప్రవర్తించి ఉండకూడదని  శివసేన అభిప్రాయపడింది. ఆయన అంతగా ఆగ్రహం చెందడానికి దారి తీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు  ప్రకటించింది. 
  • ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఘనవిజయం నేపథ్యంలో గుజరాత్‌లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని బిజెపి యోచిస్తున్నట్టు  తెలుస్తోంది.  అయితే గుజరాత్ బిజెపి వర్గాలు అధికారికంగా ముందస్తు ఎన్నికల అంశాన్ని కొట్టి పారేస్తున్నాయి. కానీ అధికార పార్టీ, ప్రతిపక్షం లోనూ  ఈ విషయమై  అంతర్గతం గా చర్చలు జరుగుతున్నాయి.   నిర్ణీత వ్యవధి ప్రకారం చూస్తే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో జరగాల్సి ఉంది. ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌ అన్నసంగతి  తెలిసిందే . మోడీ గాలి వీస్తున్న తరుణంలోనే ఎన్నికలు నిర్వహించడం ప్రయోజనకరమనే ఆలోచన  అమిత్ షా మదిలో ఉందని అంటున్నారు .జులైలో కానీ సెప్టెంబర్‌లో కానీ ముందస్తుకు  వెళ్లే అవకాశం ఉందని  బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై  ముఖ్యమంత్రి విజయ్ రూపాని స్పంది స్తూ తమ ప్రభుత్వానికి ఐదేళ్ల ప్రజాతీర్పు ఉందని , ప్రభుత్వం పూర్తి కాలం వరకూ ఉంటుందని తెలిపారు. ముందు అనుకున్నట్లే డిసెంబర్‌లోనే ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే రెండు ఘన విజయాల ప్రభావం ఉన్న తరుణం లోనే గుజరాత్  ఎన్నిక లు జరిగితే సత్ఫలితాలు ఉంటాయని  అమిత్ యోచన గా ఉందని అంటున్నారు.  మోడీ స్వస్థ లంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కావడం, 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీకి ప్రతిష్టాత్మకం కావడంతో వీటిలో సునాయాస విజయానికి వీలు కల్పించుకోవాలని బిజెపి వర్గాలు భావిస్తున్నాయి. . ఇప్పటికే బిజెపి తమ ఎన్నికల నినాదం గా యుపిలో 325, గుజరాత్‌లో 150 నినాదాన్ని ప్రచారంలోకి తెచ్చింది. గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీలో 182 స్థానాలు ఉన్నాయి. పలు నగరాలలో మోడీ, అమిత్ షా ఫోటోలతో పోస్టర్లు వెలిశాయి. కరపత్రాల పంపిణీ జరుగుతోంది .  కాగా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గుజరాత్‌లో బిజెపికి పలు సవాళ్లు  ఎదురు కానున్నాయి.  పటేల్ వర్గం ఒబిసి కోటా ఉద్యమంతో మోడీ ప్రభుత్వంపై  ఆగ్రహంతో ఉన్నారు. ఇక గోవధ అంశంలో దళితులపై హింసాకాండ వంటి పరిణామాలు , మోడీ జాతీయ స్థాయిలోకి వెళ్లిన తరువాత బిజెపికి ఆ స్థాయిలో తగు రీతిలో రాష్ట్రంలో నాయకత్వం వహించే వ్యక్తి లేకపోవడం, అన్నింటికీ మించి అధికార పార్టీ పై వ్యతిరేకత వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి. ఈ దశలో ప్రతికూలత ప్రబలక ముందే  ఎన్నికలు జరిపి  మెరుగైన ఫలితాలు అందుకోవాలని  మోడీ  మనసులో కూడా ఉందని అంటున్నారు .  ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా ముందస్తు ఎన్నికలు ఉంటాయనే భావిస్తోంది . ఇందుకు అనుగుణంగా సన్నాహాలు  చేసుకుంటోంది . రాష్ట్రంలో పాగా వేసేందుకు  ఆమ్ ఆద్మీపార్టీ  ప్రయత్నాలు చేస్తోంది. కాగా 2002 ,2007,2012 ఎన్నికల్లో గెలిచి నరేంద్ర మోడీ సీఎంగా  చేశారు . 2014 లో ప్రధాని అయ్యారు . కాగా అంతకుముందు1995,1998 లలో కూడా బీజేపీ నేత కేశూభాయి పటేల్ అధికార పగ్గాలు చేపట్టారు. కాంగ్రెస్1980, 1985 ఎన్నికలలో గెలిచి అధికారం లో కొచ్చింది. మాధవ్ సింగ్ సోలంకీ  సీఎం గా చేసారు.
  • అన్నా డీఎంకే పార్టీ పగ్గాలు, రెండాకుల గుర్తు ఎవరికి  దక్కుతాయో అన్న అంశంపై  ఉత్కంఠ నెలకొంది.   బుధవారం ఎన్నికల సంఘం  ఈ అంశాలపై స్పష్టత  ఇవ్వబోతోంది.  శశికళ, పన్నీర్ వర్గాలు పార్టీపై పట్టుకోసం  గట్టి  ప్రయత్నాలే  చేస్తున్నాయి . జయ మరణం అన్నాడిఏంకె పార్టీని తీవ్రంగా దెబ్బ తీసింది.  జయ మరణించిన నాటి నుంచి పార్టీలో పన్నీర్, శశికళల  మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ముఖ్యమంత్రి పదవినే లక్ష్యంగా చేసుకుని నడిపిన శశి నడిపిన రాజకీయం చివరకు ఆమెను  జైలు కు పంపింది . క్యాంపు రాజకీయాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటికీ   చివరకు అక్రమాస్తుల కేసు లో జైలుకి వెళ్లక  తప్పలేదు .  రాష్ట్రం కాని రాష్ట్రంలో నాలుగు గోడల మధ్య బందీ గా ఉన్న చిన్నమ్మను  ఇప్పుడు  ఎవరూ పలకరించే వారే  లేరట . దీంతో  శశి ఆగ్రహంతో చిందులు తొక్కుతున్నట్లు సమాచారం.. విశ్వాస తీర్మానం గట్టెక్కే వరకూ  కనుసన్నల్లోఉన్న పార్టీ నేతలు ఈ నెల రోజుల కాలంలో  ఒక్క సారి కూడా పరామర్శకు వెళ్లలేదట.  విశ్వాస పరీక్ష నెగ్గాక సీఎం పళని స్వామి సైతం ఇప్పటి వరకూ చిన్నమ్మను కలవలేదు. ఇక వీర విధేయుడైన దినకరన్, సెంగొట్టయ్యన్ లాంటి వారు ఒకటి రెండు సార్లు వెళ్లి చిన్నమ్మను చూసి వచ్చారు. అదలావుంటే  కీలకమైన వాదనలతో పన్నీర్  ఎన్నికల సంఘాన్ని కలవడం శశికళ వర్గాన్ని ఇరకాటంలోకి నెట్టేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని.. కాబట్టి.. పార్టీ గుర్తు తమకే చెందాలంటూ పన్నీర్ సెల్వం వర్గం ఈసి ముందు వాదించింది. చిన్నమ్మ రాజ్యాంగేతర శక్తేనని పార్టీలో ఆమెకు శాశ్వత సభ్యత్వం లేదని వాదించింది.అన్నా డిఎంకెలో ఎలాంటి పదవులు చేపట్టకుండా నేరుగా ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టేందుకు పార్టీ నియమావళి అంగీకరించదని తేల్చి చెప్పింది.. కాబట్టి పార్టీ గుర్తు తమకే దక్కాలన్నది పన్నీర్ వర్గం వాదన.. ఈ వివరణతో ఈసి మళ్లీ శశికళకు  నోటీసులు జారీ చేసింది. దీనికి శశికళ అక్క కొడుకైన దినకరన్ బదులిచ్చారు. కానీ ఆ జవాబును ఈసి నిరాకరించింది. దాంతో నేరుగా చిన్నమ్మే వివరణ ఇచ్చారు. ఈ వివరణపై పన్నీర్ వర్గం మళ్లీ ఈసికి లేఖ రాసింది. ఇలా నెల్లాళ్లుగా పార్టీ పెత్తనం ఎవరికి దక్కాలన్న అంశంపై తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే  ఆర్కే నగర్ ఉపఎన్నిక జరగనుంది .అభ్యర్ధులకు ఈనెల24 లోగా బిఫామ్ ఇవ్వాల్సి ఉంది.. బీఫాం అంద చేసిన వారికి ఈసి ఎన్నికల గుర్తును కేటాయిస్తుంది.. కాబట్టి మరో రెండు రోజుల్లో ఈసి గుర్తు కేటాయింపుపై ఒక క్లారిటీ వస్తుంది. ఇంతకీ రెండాకుల గుర్తు ఎవరికి దక్కుతుంది? తమకే ఖాయంగా దక్కుతుందని పన్నీర్ వర్గం వాదిస్తోంది. అన్నాడిఎంకె పార్టీ పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న దానిపై సస్పెన్స్ రెండు రోజుల్లోనే తేలిపోతుంది. శశికళకు పదవి ఉంటుందా.. ఊడుతుందా అన్నది తేలిపోతుంది. ఒక వేళ  శశి పదవి  ఊడితే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి మళ్ళీ ఎన్నికలు జరగాల్సిఉంటుంది.   
  • (Mallareddy Desireddy  )..................   దేశ రాజకీయాలని శాసించే శక్తి నేటి భారతీయ దేవుళ్ళకి ఎక్కువేనేమో, అందులోనూ శ్రీరామడుకి మరీ  శక్తి ఎక్కువేమో అనిపిస్తుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌ విధాన సభ ఎన్నికలను తమ జీవన్మరణ సమస్యగా భాజపా భావించినట్లుంది, అందుకేనేమో ప్రధాని  మోడీ గత  సంవత్సరంలో కనీసం పదిసార్లు ఆయన యూపీని సందర్శించారు. ఎన్డీయే ప్రభుత్వపు ప్రథమ వార్షికోత్సవాన్ని యూపీలోని మధురలో జరుపుకొన్నారు,ఇక గత ఏడాదిలో ద్వితీయ వార్షికోత్సవాన్నిసహారన్‌పూర్‌లో నిర్వహించారు. ఆ సందర్భంగా తాము దేశాభివృద్ధికే అగ్ర ప్రాధాన్యం ఇస్తామని మోడీ విస్పష్టంగా ప్రకటించి ఉత్తర ప్రదేశ్‌ విధానసభ ఎన్నికలకు రణ భేరిని మోగించారు. అప్పుడే నరేంద్రమోడీ యూపీలోని  ముఖ్యమైన రెండు సంక్షేమకార్యక్రమాలను  ప్రారంభించారు. వాటిలో నిరుపేద మహిళలకి ఉచితంగా వంటగ్యాస్‌ సిలిండర్ల పంపిణీ ఒకటి ఓటర్లను బాగా ప్రభావితం చేయగా,రెండోది  జాతీయ అధ్యక్షుడైన అమిత్ షా,మోడీ, యూపీ రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడైన కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యల వరకు ఒకటే మాట రాముడు మా అంతరంగంలో ఉన్నాడనే నినాదం, ఇక యూపీ, బిహార్‌ల పేర్లు చెబితేనే చాలు కులాల కుంపట్లు,మతాలు మట్టి మశానాలు మతభేదాలన్నీను గుర్తుకొస్తాయి. ఇక  బిహార్‌  అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌ పార్టీ,లాలు యాదవ్‌ పార్టీ, కాంగ్రెస్‌పార్టీ కూటమి కులపరమైనటువంటి కొన్ని సమీకరణలతో  ఘనవిజయం సాధించడం చూసిన భాజపా పార్టీ తానూ సామాజిక ఇంజనీరింగ్‌ పని చేపట్టింది. ఎన్నికల వాతావరణాన్నితనకు అనుకూలంగా భాజపా పార్టీ  మార్చుకునేందుకై షెడ్యూల్డ్‌కులాలకి చెందిన 5 గురిని  షెడ్యూల్డ్‌ తెగల నుంచి 3 గురి ని వెనకబడినకులాల నుంచి ఒకఇద్దరిని ఇటీవల కాలంలో కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకొన్నారు. జాతవేతర దళితులు, యాదవేతర బీసీల్లో పట్టు పెంచుకొనేందుకుగాను  ఆయా వర్గాలను  మంత్రివర్గంలోనికి తీసుకొన్నారు.  కులాలు ,మతాలు ,  దేవుడిని బాగా ఆరాధించే   మనుష్యుల బలహీనతలని చక్కగా ఎన్నికలలో ఉపయోగించవచ్చుననే  మాట మరొకసారి ఋజువైనది.   బిజెపి  ఘన విజయం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని  రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సిద్ధాంతకర్త ఎంజి వైద్య అభివర్ణించారు. బిజెపి మేనిఫెస్టోలో అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రస్తావన ఉందని, రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు దానికి ఆమోద్రముద్రగా భావించవచ్చని తేల్చి చెప్పారు.  మొత్తం మీద  కులాల, మతాల సరసన భారతదేశ రాజకీయాలలో దేవుళ్ళు దేవతలు  కూడా చేరిపోయారు. ఇక అచ్చె దిన్ ఆయా !! రామా కనవేమిరా శ్రీ రఘు రామ కనవేమిరా....   రామా కనవేమి రా. 
  • కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ పై  భూమా కుటుంబానికే మొదటినుంచి పట్టు ఉండేది. భూమా కుటుంబం ఏ పార్టీ లో ఉన్నా విజయం వరించేది . అంటే అక్కడి ప్రజలతో  భూమా కుటుంబం అంతగా కనెక్ట్ అయిందని చెప్పుకోవాలి.  ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లోభూమా నాగిరెడ్డి పై చేయి సాధించడం  చెప్పుకోదగిన విశేషం . 1991 నుంచి ఇప్పటి వరకు  నాలుగు సార్లు ఉప ఎన్నికలు జరిగితే భూమా కుటుంబమే విజయం సాధించింది.  1991లో భూమా నాగిరెడ్డి అన్న భూమా వీరశేఖర్‌రెడ్డి మృతితో తొలి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి  మొదటిసారిగా  తెదేపా తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.  1996లో నంద్యాల లోక్‌సభ స్థానానికి  ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీవీ రంగయ్యనాయుడుపై అత్యధిక మెజార్టీతో భూమా విజయం సాధించారు.  ఆ ఆతర్వాత కూడా భూమా వరుసగా లోక సభ కు రెండు సార్లు ఎన్నికయ్యారు.  భూమా లోక్‌సభకు ఎన్నికవడంతో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి మళ్ళీ ఉప ఎన్నిక అనివార్యం అయింది.  అపుడు భూమా సతీమణి శోభా నాగిరెడ్డి తెదేపా తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా శోభానాగిరెడ్డి  విజయం సాధించారు. తర్వాత జగన్ పార్టీ లో  చేరారు. 2012లో  ఆళ్లగడ్డలో ఉప ఎన్నిక జరిగింది.   ఈ ఎన్నికల్లో శోభా నాగిరెడ్డి వైసీపీ  అభ్యర్థిగా పోటీ చేసి  విజయం సాధించారు. తర్వాత 2014లో జరిగిన సాదారణ ఎన్నికల సమయంలో నంద్యాల నుంచి ఆళ్లగడ్డ వస్తూ రోడ్డు ప్రమాదంలో శోభానాగిరెడ్డి మృతి చెందారు. తర్వాత ఆమె పేరును బ్యాలెట్‌ పేపర్లోనే ఉంచి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లోనూ శోభా నాగిరెడ్డి దాదాపు 17వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.  ఆమె మృతితో ఆళ్లగడ్డలో ఉప ఎన్నిక నిర్వహించారు . అయితే శోభా నాగిరెడ్డి పట్ల గౌరవం తో  ఆ ఉప ఎన్నికలో టీడీపీ పోటీ చేయలేదు.   దీంతో ఆమె కుమార్తె ప్రస్తుత ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఇలా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చిన ప్రతిసారీ విజయాలు   భూమా కుటుంబాన్నే వరిస్తూ వచ్చాయి. 1989,94,99,2009,2014 లలో వరుసగా భూమా కుటుంబమే  ఈ స్థానం నుంచి  ఎన్నికైంది . 2004 లో మాత్రం గంగుల ప్రతాపరెడ్డి  చేతిలో భూమా నాగిరెడ్డి ఓడి పోయారు.  భూమా ప్రస్తుతం నంద్యాల  అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  కాగా  మూడేళ్ళ క్రితం శోభా రోడ్డు ప్రమాదం లో మరణించగా , ఆదివారం  నాగిరెడ్డి  గుండె పోటుతో మృతి చెందారు.
  • ఉక్కుమహిళ ఇరోం షర్మిల  మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాజయం చవి చూసారు. ఈ పరిణామం తో షర్మిల రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నట్టు వార్తలు వస్తున్నాయి.  ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో ఆర్మీకి ఉన్న ప్రత్యేక హక్కుల చట్టాన్ని నిరసిస్తూ ఆమె 16 ఏళ్లుగా నిరహార దీక్ష చేశారు.  గత ఏడాది  ఆ దీక్షకు స్వస్తి చెప్పి, రాజకీయాల్లోకి వచ్చారు. ఏఎఫ్ఎస్పీఏను రద్దుచేయడమే లక్ష్యంగా  ఆమె పోటీ చేశారు. అయితే ఎన్నికలో  కేవలం 90 ఓట్లే ఆమెకు అనుకూలంగా వచ్చాయి.   రాష్ట్ర సీఎం ఓంకార్ ఇబోబీ సింగ్ కు వ్యతిరేకంగా తోబల్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. అయితే సీఎం అభ్యర్థి ఇబోబీ సింగే  విజయం సాధించారు. 18,649 ఓట్లు  ఆయనకు వచ్చాయి. ద్వితీయ స్థానంలో బీజేపీ అభ్యర్థి బసంత సింగ్ 8000 ఓట్లు సాధించారు . తృణమూల్  అభ్యర్థి సురేష్ సింగ్ కి 144 ఓట్లు మాత్రమే వచ్చాయి.  నోటాకు వేసిన 143 ఓట్లు కూడా కనీసం ఇరోం షర్మిలకు రాలేదు. ఈ ఫలితాలతో షర్మిల షాక్ తిన్నారు కాబోలు రాజకీయాలనుంచి వైదొలగాలని మరో తొందర బాటు నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఇది విచారకరమే.  షర్మిల  నిరసన దీక్షకు మద్దతిచ్చిన పలువురు మహిళా కార్యకర్తలు కూడా ఆమె రాజకీయాలలోకి  దిగడాన్ని అప్పట్లోనే తీవ్రంగా వ్యతిరేకించారు.  ఇరోం షర్మిల ఒక్కతే సైకిళ్లపై తిరుగుతూ తన  ప్రజా పార్టీ తరపున ప్రచారం చేసుకున్నారు.  ప్రజలు తనకు మద్దతు ఇవ్వలేదని  ఆమె  సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం . హక్కుల ఉద్యమ కారిణి గా  ఆమెను ప్రేమించిన ప్రజలు రాజకీయ నేతగా ఆదరించలేదు. దీనికి కారణాలు ఏమిటో సమీక్షించుకోవాల్సిన షర్మిల రాజకీయాల నుంచి నిష్క్రమించాలని అనుకోవడం తొందరపాటు అవుతుంది . అసలు ప్రజా పార్టీ నుంచి పోటీ చేసింది ముగ్గురు మాత్రమే . ముగ్గురు గెలిచినా ప్రత్యేక హక్కుల చట్టాన్ని రద్దు చేయడం సాధ్యమా ? కాక పోతే గట్టి  పోరాటం చేసే వారు.  ఇక ఉద్యమం వేరు .. రాజకేయాలు వేరు .  ఉద్యమం చేసినంత మాత్రాన  ప్రజలు రాజకీయాల్లో ఆదరించాలని లేదు. దానికి ఎన్నో ఉదాహరణలున్నాయి.  షర్మిల తన పార్టీ ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ల లేక పోయారు. ఒక పార్టీ ని నిర్మించాలంటే చాలా సమయం పడుతుంది.  రాజకీయాలన్నాక  గెలుపు ఓటములు  సహజం . అన్నిటికి సిద్ధ పడే రాజకీయాల్లోకి రావాలి.