Latest News
రాజ‌కీయం

శశికే పార్టీ పగ్గాలు ... కోర్టుకెక్కనున్న వ్యతిరేక వర్గం!

1st Image

ఏకగ్రీవంగా పార్టీ జనరల్ సెక్రటరీ గా ఎన్నిక అయ్యానన్న ఆనందోత్సవాల లో  ఉండగానే  శశికళకు  జయ మృతిపై  హైకోర్టు అనుమానం వ్యక్తంచేసిందన్న వార్త శరాఘాతంలా సోకింది. గురువారం ఉదయం శశికళ పార్టీ కార్యదర్శి గా ఎన్నిక కావడం అదే సమయంలో హైకోర్ట్ జయ మరణంపై  సందేహం వ్యక్తం చేయడం  దాదాపుగా ఏక కాలం లో జరిగేయి.
కనీసం నామినేషన్ కూడా వేయని జయలలిత నెచ్చెలి శశికళ ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా గురువారం ఎన్నుకున్నారు. చెన్నై లో ఈ ఉదయం జరిగిన పార్టీ సమావేశం లో శశికి పార్టీ పగ్గాలు అప్పగించారు. 
జనవరి 2 వ తేదీన ఆమె పదవీ భాద్యతలు చేపడతారు. అయితే ఆమె అంతటితో ఆగుతారా? లేక ముఖ్యమంత్రి పదవినీ కైవసం చేసుకుంటారా? అన్నదిప్పుడు సస్పెన్స్ గా మారింది. శశికళ కోరిక తీరాలంటే పన్నీర్ సెల్వం పదవి నుంచి తప్పుకోవాలి . ఇందుకు పన్నీర్ కాదంటారా ? అవునంటారా ? అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది. ఆ పరిస్థితే ఎదురైతే పన్నీర్ మౌనంగా తప్పుకుంటారా ?
లేక పార్టీ చీలికకు ప్రయత్నిస్తారా ? అనేది కూడా సస్పెన్స్ అంటున్నారు. పన్నీర్ కి తెర వెనుక నుంచి మద్దతు ఇస్తోన్న బీజేపీ ఏమి చేస్తుందో కూడా చూడాలి. శశికళ కు ఇప్పటికే పరోక్షంగా సంకేతాలు వెళ్లాయని అంటున్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే తగు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరికలు వెళ్లాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీ క్యాడర్ లో అసంతృప్తి పెరుగుతోంది. ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక ఏకపక్షంగా సాగిందంటూ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శశికళ ఎంపికను చట్టపరంగానే ఎదుర్కొనేందుకు తెర వెనుక పావులు కదుపు  తున్నారు. జయలలిత హయాంలో ప్రధాన కార్యదర్శి ఎన్నికలు జరిగినపుడు ఒక్క నామినేషన్‌ మాత్రమే దాఖలయ్యేది. జయలలిత మెప్పు కోసం పార్టీలోని అధిక సంఖ్యాకులు జయలలిత పేరునే నామినేషన్‌ వేసి తమ సంఘీభావాన్ని చాటుకునేవారు. ప్రధాన కార్యదర్శి పదవికి ఇలా జయలలిత ఏడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా ఈ సారి అసలు ఎవరూ నామినేషన్ వేయలేదు . (జనరల్‌ సెక్రటరీ పదవికి సంబంధించి ఇప్పటివరకు శశికళ సహా ఏ ఒక్కరూ నామినేషన్‌ దాఖలు చేయలేదని ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి సి.పొన్నయ్యన్‌ బుధవారం మీడియాకు చెప్పారు.) టెక్నికల్ గా మరి ఈ ఎన్నిక చెల్లుబాటు అవుతుందో లేదో కోర్టు చెప్పాలి. 
 పైగా శశి అనుచరులు  ఇంకో తప్పు కూడా చేసారు .
తన భర్త ద్వారా శశి కళ పుష్ప నామినేషన్ పంపితే అతడిపై దాడి కూడా చేశారు. ఇవన్నీ రికార్డు కూడా అయ్యాయి.
ఇక పార్టీ నియమ నిబంధనల్లో 305 ప్రకారం ఒక సభ్యునిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఐదేళ్లపాటు అతను ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేదు. 2011 డిసెంబరులో శశికళ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించ బడ్డారు. క్షమాపణ లేఖ  రాయడం ద్వారా 2012 మార్చిలో తిరిగి జయలలిత తన వద్దకు చేరనిచ్చారు. అయితే శశికళకు ప్రాథమిక సభ్యత్వ కార్డును జారీ చేయలేదు. వీటిని కాదని పార్టీ నిబంధనలను సవరించి శశికళను ఎన్నుకుంటే అది చట్టవ్యతిరేకం అవుతుంది. పాత కార్డును చూపి శశికళ పోటీచేసిన పక్షంలో సభ్యత్వ నంబరును విచారణ జరపాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వ్యతిరేక వర్గం అంటోంది. మరిప్పుడు ఏమి జరుగుతుందో ? వేచి చూడాలి.
  • సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ కి ముహూర్తం ఖరారైనట్టే . జూలై లోరజనీ తన కొత్తపార్టీని అధికారికంగా ప్రకటిస్తారని  ఆయన సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ వెల్లడించారు.  ‘‘రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తాను రాజకీయాల్లోకి రావడంపై అభిప్రాయం తెలుసుకునేందుకే అభిమానులు, శ్రేయోభిలాషులతో రజనీ సమావేశమయ్యారు. ఇప్పటికే తొలిరౌండ్ పూర్తయింది. జూన్ లో మరోవిడత సమావేశాలు జరిగే అవకాశం ఉందని  గైక్వాడ్ చెప్పారు.  రజనీ తన రాజకీయ ప్రవేశంపై అధికారికంగా ప్రకటన చేయక పోయినప్పటికీ.. ఇప్పటికే తమిళరాజకీయాల్లో రజనీ పొలిటికల్ ఎంట్రీ విషయం ప్రకంపనలు సృష్టిస్తోంది. తమిళనాడులో మంచి రాజకీయ నేతలు ఉన్నప్పటికీ వ్యవస్థ మాత్రం కుళ్లిపోయిందని  రజనీ  ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వ్యవస్థను బాగుచేయాల్సిన సమయం ఆసన్నమైందనీ.. అందుకు ప్రజలంతా ‘‘యుద్ధానికి’’ సిద్ధంగా ఉండాలని ఆయన ప్రకటించి తెర వెనక్కి వెళ్లారు.  కొత్త సినిమా ‘కాలా కరికాలన్’  షూటింగ్ శరవేగం తో ముగించుకుని అయన మళ్ళీ తెర ముందుకు వస్తారు. అయితే పార్టీ పనులు మాత్రం సన్నిహితులు అత్యంత గోప్యంగా చేస్తున్నారట . 
  •  (Siva Racharla) ........       మనిషిలో లోతుగా కూరుకు పోయిన ధర్మం ఒక్కటే "అహం".ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి.తపించే ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే "ఆశ".ఆశ ముసిరినప్పుడు "ఆలోచన" మసక బారుతుంది.నీతి నిజాయితీలు కొలిమిలో కొవ్వొత్తుల్లా కాలిపోతాయి -- ప్రస్తానం సినిమాలో సాయికుమార్ శర్వానందుతో చెప్పే confession statement. శవాల పుట్టుమచ్చలు చూసి హతుడిని గుర్తుపెట్టొచ్చు కాని కత్తిగాటును చూసి హంతకుడిని గుర్తించలేము! 45 సంవత్సరాల క్రిందట 1972లో మొదలై 1991 వరకు జరిగిన విజయవాడ హత్యా రాజకీయల్లొ హీరోలు విలన్ల గురించి కాదు ఈపోస్టు. దేవినేని నెహ్రు మరణం తరువాత విజయవాడ రాజకీయల మీద పెద్దగా ప్రచారంలేని ముఖ్యమైన రాజకీయ శక్తుల గురించి రాయటానికే ఈ పోస్టు. ఈమధ్య రాంగోపాల్ వర్మా "వంగవీటి" సినిమా తరువాత "చలసాని వెంకటరత్నం" అనే CPI నాయకుడి గురించి ఎక్కువ మందికి తెలిసింది. విజయవాడ రాజకీయాలు 1964 వరకు ప్రశాంతంగా జరిగాయి. కమ్యునిష్ట్ పెద్దనాయకులు పుచ్చల పల్లి సుందరయ్యగారు (నెల్లూరు జిల్లా వారైనా గన్నవరం MLAగా పనిచేశారు,చనిపోయిన తరువాత అంత్యక్రియలు కూడ విజయవాడలోనే జరిగాయి) , చండ్ర రాజేశ్వర రావుగారు ఇద్దరు విజయవాడ కేంద్రంగా పనిచేసేవారు.1964లో CPI నుంచి CPM విడిపోయిన తరువాత సుందరయ్యగారు CPM జాతీయ కార్యదర్శిగా,చండ్రా రాజేశ్వర రావుగారు CPI జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పీపుల్స్ వార్ వ్యవస్థాపకులు "కొండపల్లి సీతారమయ్య"గారు కూడ కృష్ణా జిల్లా పామర్రు ప్రాంతం వారు. కమ్యునిష్ట్ పార్టీ చీలిక తరువాత విజయవాడ సిటీలో CPI,జిల్లాలో మిగిలిన ప్రాంతాలలో CPM బలపడ్డాయి. 1966లో విజయవాడ "industrial estate/ఆటోనగర్" ఏర్పడిన తరువాత కార్మిక సంఘాల నిర్మాణం,బలం పెరిగాయి. విజయవాడలొ CPI నాయకుడు చలసాని వెంకటరత్నం పట్టు ఎక్కువ వుండేది. ఆటోనగర్ అభివృద్ది చెందుతుండటంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి విజయవాడకు వలసలు జరిగాయి.ఈక్రమంలో వంగవీటి రాధ కృష్ణా రావు(పెద్ద రాధ) కుటుంబం విజయవాడకు వలస వచ్చారు. వంగవీటి సోదరులు కోటేశ్వర రావ్,నారాయణ రావ్,రాధ,శోభనా చలపతిరావు, మోహన రంగా రావు(రంగా) సోదరులు వివిధ పనులు చేసుకుంటు జీవించే క్రమంలో రాధ బస్టాండ్ సెంటర్లో నాయకుడిగా ఎదిగారు.చలసాని వెంకటరత్నంకు వంగవీటి రాధ దగ్గర కావటంతో రాధ సిటి లెవల్ నాయకుడయ్యాడు. సినిమాల్లొ చూపించినవి వాస్తవంలో జరిగిన సంఘటనల మధ్య చాలా తేడా వుంది.రాధా స్వయంగా నాయకుడిగా ఎదిగే క్రమంలో చలసాని వర్గంతొ గొడవలు మొదలయ్యాయి. 1971లొ ఈగోడవల్లొ రాధ వర్గం చలసాని వర్గానికి చెందిన "దత్తి కనకారావ్" అనే అతన్ని చంపేశారు.విజయవాడ హత్యా రాజకీయాల్లొ ఇది మొదటి హత్య,వర్మా వంగవీటి సినిమాలో ఈ సీన్ లేదు. దత్తి కనకారావ్ హత్యకు ప్రతీకారంగా చలసాని వర్గం రాధా వర్గానికి చెందిన దుర్గా రావ్,హనుమంతారావు అనే ఇద్దరిని చంపారు. చలసాని వర్గం ప్రతీకార హత్యలతో రాధా వర్గం భయపడింది. వీరి అస్తిత్వతం చిక్కుల్లో పడింది.చలసాని చంపకుంటే మేము బతకలేము అని 1972లో చలసాని వెంకటరత్నాన్ని రాధా వర్గం చంపింది.చలసాని వంటి మీద 72 కత్తి పోట్లు వున్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వుంది. చలసాని హత్యతో విజయవాడలోని కార్మిక సంఘాల మీద రాధ ఆదిపత్యం పెరిగిపోయింది. 1969లో మొదలైన "తెలంగాణ" ఉద్యమం,తరువాత మొదలైన "జై ఆంధ్రా" ఉద్యమం 1972 వరకు సాగింది.CPI & CPM జై ఆంధ్రా ఉద్యమాన్ని వ్యతిరేకించి "విశాలంద్ర" ఉద్యమాన్ని మద్దతు ఇచ్చాయి. విధ్యార్ధిగా వున్న దేవినేని నెహ్రు జై ఆంధ్రా ఉద్యమంలొ పాల్గొనేవారు. ఈక్రమంలో కమ్యునిష్ట్ విధ్యార్ధి సంఘాలకు ఇతర సంఘాలకు గొడవలు జరిగాయి,దేవినేని నెహ్రు కూడ చాలాసార్లు దాడికి గురయ్యాడు. ఈక్రమంలో నెహ్రు రాధా మద్దతు కోసం ఆయన వర్గంలో చేరి రాధాకు అనుకూలంగా విధ్యార్ధి సంఘం United Organization of Independents (UI)ని ప్రారంభించారు. చలసాని హత్యకు ప్రతీకారంగా 1974లో రాధా హత్య జరిగింది.ఈ హత్య వెనుక CPI హస్తం వుందని ఆరోపణ.హత్య చేసింది కిరాయి హంతకులు.హత్య జరిగింది రాధా వర్గంలోని "నాగెళ్ళ శివరామప్రసాద్" షాపులో.ఆషాపు ప్రారంభోత్సవానికి వచ్చిన వంగవీటి రాధాను షట్టర్లు వేసి కత్తులతో పొడిచి చంపారు. ఊహించని పరిణామం,అందరు రాధా వర్గీయులే కావటంతో గందరగోళం మధ్య ఎవరిని ఎవరు పొడుస్తున్నారో తెలియని స్థితిలో మొత్తం ఆరుగురు మరణించారు. ఆ హత్యకు దేవినేని నెహ్రు ప్రత్యక్ష సాక్షి.నెహ్రు సాక్ష్యంతో రాధా హంతకులకు యావజ్జీవ శిక్ష పడింది.తరువాత High Courtలో కేసు కొట్టేశారు. రాధా హత్య కేసులో నిందితులు అడుసుమల్లి జయప్రకాష్ 1983లో TDP తరుపున విజయవాడ నుంచి MLAగా గెలిచారు. మొన్న సమైఖ్యాంద్ర ఉద్యమం సమయంలో సుప్రిం కోర్టులో కేసులు వేశారు.ఇదే 1983లో దేవినేని నెహ్రు కూడ MLAగా (TDP) తరుపున కంకిపాడు నుంచి గెలిచా రు. రాధా హత్య కేసులొ మరో నిందితుడు,హత్య జరిగిన షాప్ యజమాని "నాగెళ్ళ శివరామప్రసాద్" 1989లో వంగవీటి రత్నకుమారి మీద TDP తరుపున పోటిచేసి ఓడిపోయారు. రాధా హత్య కేసును నిందితుల తరుపున "నాదెండ్ల భాస్కర రావు"గారు వాదించారు.1978లో తెనాలి ప్రాంతం వారైన నాదెండ్లగారు విజయవాడ నుంచే ఇందిరా కాంగ్రేసు తరుపున గెలవటం యాదృచ్చికం కాదు.1983లో TDP తరుపున వేమూరు నుంచి పోటిచేశారు. రాధా హత్య కేసులో నిందితుడైన "వజ్జా సుబ్బారవు" TDP పుట్టక ముందు NTRతో ఒక సినిమా నిర్మించారని దేవినేని నెహ్రు ఒక ఇంటర్యూలో చెప్పారు. రాధా హత్య తరువాత రంగాగారు కొంత కాలం తరువాత విజయవాడకు దూరంగా మచిలీపట్నం,వైజాగ్లలో వున్నారు. కొన్ని నెలల తరువాత రాధా వర్గంలోని కొందరు రంగాను కలిసి చర్చించి విజయవాడకు వెనక్కి తీసుకొచ్చారు.రంగా రాకతో విజయవాడలో మళ్ళి ఘర్షణలు మొదలయ్యాయి.మరో వైపు దేవినేని నెహ్రు విధ్యార్ధి సంఘాల మద్దతుతో బలపడ్డారు. నెహ్రు బలం పెరగటం కొత్త అనుచరులు తయారు కావటం రంగా వర్గంలోని కొందరిని కొట్టటంతో రంగా నెహ్రూల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. 1978లో ప్రవేట్ బస్సుల జాతీయకరణ ఉద్యమం నెహ్రు,CPI సుబ్బరాజు (1994లో MLAగా గెలిచారు),CPM ఉమామహేశ్వర రావ్(విజయవాడ డిప్యూటి మేయర్గా పనిచేశారు) జాయింట్ కమిటీగా ఉద్యమం చేశారు. ఈ ఉద్యమం చివరి దశలో అప్పటి మంత్రి భవనం వెంకటరాం గారు రంగాను కలిసి ఉద్యమం ఆపవల్సిందిగా కోరారు.రంగా నెహ్రూను ఉద్యమం ఆపమని చెప్పటం,ఇంత కాలం పోరాడి చివరి దశలో ఉద్యమం ఆపలేమని చెప్పటంతో రంగా నెహ్రూల మధ్య స్పష్టమైన చీలిక వచ్చింది. ఈ గొడవలు చిలికి చిలికి నెహ్రు సొంతంగా కొత్త విధ్యార్ధి సంఘం United Students Organizationను 1979లో మొదలు పెట్టటంతో రంగా నెహ్రూల మధ్య ప్రత్యక్ష గొడవలు మొదలయ్యాయి. రంగా,నెహ్రూల మధ్య గొడవలు పెరిగి చివరికి 1979లొ జరిగిన ITI కాలేజి ఎన్నికల్లో దేవినేని నెహ్రు అన్న "గాంధి"ని రంగా వర్గం చంపింధి. గాంధి హత్యతో రంగా నెహ్రుల మధ్య హత్యా రాజకీయాలు మొదలయ్యాయి. గాంధి హత్యకు ప్రతీకారం కోసం నెహ్రు తమ్ముడు మురళి రగిలిపోయాడు.గాంధి హత్య కేసులో నిందితులను చాలా మంధిని మురళి చంపేశాడు. 1981లో జరిగిన విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లొ రంగా కాంగ్రేస్ టికెట్టు కోసం ప్రయత్నించినా కాంగ్రేసు "శ్రీనివాస్ రావు" అనే నాయకుడికి టికెట్టు ఇచ్చింది.రంగా ఇండిపెండెంటుగా పొటికి దిగారు.పోలింగుకు ముందు కాంగ్రేస్ తమ అభ్యర్ధిని పక్కనపెట్టి రంగాకు మద్దతు ప్రకటించింది.రంగా గెలిచారు, ఆఎన్నికల్లో రంగా గుర్తు "సైకిల్"! కౌన్సిలరుగా గెలిచిన తరువాత రంగా కాంగ్రేసులొ చేరారు. ఇంతలో తెలుగుదేశం ఏర్పడటం,విజయవాడ MLAగా వున్న నాదెండ్ల భాస్కర రావ్ దేవినేని నెహ్రూను NTRకు పరిచయం చెయ్యటం ,నెహ్రు 1983లో MLAగా గెలవటం చక చకా జరిగిపోయాయి. నెహ్రు MLAగా గెలవటంతో రంగా వర్గం మీద దాడులు పెరిగాయి. మురళి దూకుడు ఎక్కువైంది.చివరికి రంగా ఇంటికి ఫోన్ చేసి రంగా భార్యను దూషించే స్థాయికి మురళి వెళ్ళాడు. 1985లొ జరిగిన ఎన్నికల్లో రంగాకు విజయవాడ తూర్పు స్థానం నుంచి కాంగ్రేసు తరుపున తొలిసారి MLA అయ్యారు.ఈ ఎన్నికల్లో TDP తరుపున లయోలా కాలేజి లెక్చరర్ యార్లగడ్డ రాజగోపాల్ గారికి సీట్ ఇచ్చారు. రంగా MLAగా గెలవటంతో విజయవాడ సిటీలో ఉదృతంగా పనిచేయటం మొదలుపెట్టారు.రంగా నాయకత్వ లక్షణాలతో ప్రజల్లొ విపరీతమైన following వచ్చింది.అధికార పార్టీలో వుండటంతో నెహ్రు ప్రజాల సమయల మీద స్పందించే పరిస్థితిలేకుండా పోయింది.ఏనాయకుడైనా ప్రతిపక్షంలోనే ఉన్నప్పుడే ప్రజా నాయకుడిగా ఎదుగుతారన్నది రంగా ,YSR విషయంలో నిజమైంది. 1987లో రంగా తన అన్న రాధా కథతో దవళ సత్యంగారి దర్శకత్వంలో "చైతన్య రధం" అనే సినిమాను తీశారు.ఈ సినిమాలో రాధా హత్య సీన్ చూసి చాలా మంది ఎమోషనలుగా స్పందించారు. దళపతి సినిమాలో మమ్మూటి మర్డర్ సీన్ వాస్తవంలో రాధ హత్య సీన్. ఈ చైతన్యరధం కథ నుంచి శివ,గాయం,దళపతి వచ్చాయి. చైతన్యరధం తమిళంలో కూడ dub చేశారు. ఈ చైతన్య రధం సినిమా నెగటీవ్ కాని ప్రింట్లు కాని ఇప్పుడు లేవంట.అప్పటి ప్రభుత్వమే ప్రింటలన్ని కొని కాల్చివేసిందని దవళ సత్యం గారు ఒక ఇంటర్యూలో చెప్పారు. దాదాపు ఇదే సమయంలో మిరియాల వెంకటరావుగారి నాయకత్వంలో "కాపునాడు" మొదలైంది. చైతన్యరధం సినిమా విజయోత్సవం యాత్ర విజయవాడ నుంచు రాజమండ్రి వరకు గోదావరి జిల్లాలో విస్త్రుతంగా జరిగింది.రంగా ప్రతి ఊర్లో ర్యాలీలు,సభలు పెట్టారు. విజయవాడలో జరిగిన సభలూ సుమారు 5 లక్షల మంది హాజరయ్యారు.అంతకు ముందు విజయవాడలో జరిగిన మహనాడు కన్నా రంగా సభా భారి విజయవంతం అయ్యింది. రంగా హవా కోస్తా దాటి తెలంగాణాకు కూడ పాకింది.ఖమ్మంలో జరిగిన సభ అంతకు ముందు అక్కడ జరిగిన పార్టీల సభల కన్నా ఎక్కువ విజయవంతం అయ్యింది. రంగా ఊపు చూస్తే 1989 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి ఖాయం అనే అభిప్రాయం వచ్చింది.రంగా మీద ప్రభుత్వం పోలీసుల ద్వార అనేక కేసులు పెట్టింది.పదుల కొద్ది కేసులు బేయిల్లతో రంగా పరిస్థితి వుండేది.అప్పటి విజయవాడ సిటి కమీషనర్ "వ్యాస్" కక్షగట్టి రంగాను వేధించారని ఆరోపణలు వున్నాయి. దళపతిలో అరవింద్ స్వామి క్యారెక్టర్ సూర్తి వ్యాసుదే! మరో వైపు దేవినేని మురళి రంగ వర్గం మీద దాడులు ఎక్కువయ్యాయి. రంగాను చంపుతారని పుకార్లు వచ్చాయి.రంగా వర్గం ముందు స్టెప్ తీసుకోని 1988 మార్చిలో నెల్లూరులొ LAW పరిక్షలు రాసి వ్యానులో విజయవాడకు వస్తున్న మురళిని NH5 మీద చిలకలూరిపేట-గుంటూరు మధ్య "యడ్లపాడు" వద్ద చంపారు.శివా సినిమాలోని శుభలేఖ సుధాకర్ హత్య వాస్త జీవితంలో దేవినేని మురళి హత్యే! మురళి హత్య జరిగినప్పుడు రంగా డిల్లీలోని రాం మనోహర్ లోహియా హాస్పటల్లొ tretment తీసుకుంటున్నారు.పోలీసులు మురళి హత్య కేసులొ రంగా మీద కేసు పెట్టారు.రంగా మరో సోదరుడు శోభాన చలపతిరావు,రంగా బావ మరిది చెన్నుపాటి శ్రీను మీద కూడ కేసు నమోదు అయ్యింది. మురళి హత్య జరిగిన తరువాత రంగా హత్య ఖాయం అని అందరిలో అభిప్రాయం వుంది.కాని ఎప్పుడు ఎలా అన్నది ప్రశ్నార్ధకం. 1988 చివరిలో గిరిపురం కాలనీలో ప్రజలకు పట్టాలు ఇవ్వాలని రంగా ఆమరణ నిరహార దీక్ష మొదలుపెట్టారు,ఈ దీక్షలోనే 26-Dec-1988 అంటే క్రిస్ మస్ తరువాత రోజు తెల్లవారు జామున బస్సుల్లొ అయ్యప్పమాలలో వచ్చిన 100 అందికి పైగా రంగాను చంపేశారు. రంగా హత్యను ఎవరు చేపించారో రాంగోపాల్ వర్మకు తెలియదని సినిమాలో చెప్పారు.కనీసం కేసులో నిందితుల పేర్లు కూడ చెప్పలేదు. రంగాకు ప్రధాన ప్రత్యర్ధి అయిన దేవినేని నెహ్రు రంగాను హత్యచేపించారని పత్రికల్లొ రాశారు.ప్రత్యర్ధి హత్యలో పోలీసులు మొదట చేసే పని హతుడి ప్రత్యర్ధి మీద FIR నమోదు చేస్తారు. రంగా హత్య కేసులో విచిత్రంగా నెహ్రు 21వ నిందితుడు,అది కూడ హత్య చేసినట్లు కాదు "కుట్రదారుడి"గా. రంగా హత్య తరువాత భారి హింస జరిగి 45 మంది చనిపోయారు ,వందల కోట్ల ఆస్తులు ద్వంసం అయ్యాయి.ఆస్తులన్ని నెహ్రు కులస్తులైన కమ్మవారివి. రంగా-నెహ్రుల గొడవ రంగా హత్య తరువాత కమ్మ-కాపు కులగొడవలుగా మారాయి.కాని రంగా హత్య నిందితుల్లో కాపులు వున్నారు.రంగా చనిపోయే వారకు ఆయనకు సలహాదారుడు "కాట్రగడ్డ రాజాగోపాల్"(CPI మాజి కార్యదర్శి).రంగా భార్య రత్నకుమారిగారు కమ్మ. విజయవాడ గొడవలు కచ్చితంగా కుల గొడవలు కాదు,ఆధిపత్య రాజకీయాలు మాత్రమే! రంగాను చివరి దశలో అంటే కాపునాడు మొదలైన తరువాతనే కాపునాయకుడు అన్న పేరు వచ్చింది.వాస్తంలో రంగాకు కాపుల కంటే దళితుల్లొ అనుచరులు ఎక్కువ.BCలైన "నగరా"ల్లొ రంగాకు ఎక్కువ ఆదరణ. రంగా హత్య జరిగిన్ డిసెంబర్ 26 కూడ streatgicalగా జరిగిందే!క్రిస్మస్ జరుపు కోవటంలో ఎక్కువ మంది అనుచరులు వుండరనే డిసెంబర్ 26ను రంగా హత్య చెయ్యటానికి ఎంచుకున్నారు. రంగా హత్య తరువాత హోం మంత్రి కోడెల శివప్రసాద్ రాజినామ చేయగా కాపు నాయకుడు కళావెంకటరావు హోం మంత్రి అయ్యారు.అప్పటి DGP P.S.రామ్మోహన్ రావు గారు రాజినామ చేసినా ప్రభుత్వం అంగీకరించలేదు.ఈ రామ్మోహన్ రావుగారు 2002-2004 మధ్య తమిలనాడు గవర్నర్గుగా పనిచేశారు. రాధా హత్యా నిందితుల్లో కొందరు MLAలు అయింట్లే,రంగా హత్య కేసుకోని నిందితులు కూడ MLAలు అయ్యారు. విశాఖపట్టణం నుంచి 2009,2014లో TDP తరుపున గెలిచిన వెలగపూడి రామకృష్ణ రంగా హత్య కేసులో నిందితుడు. మరో నిందితుడు "చలసాని పండు" 1999 లో ఉయ్యూరు నుంచి ఇండిపెండెంటుగా 1020 ఓట్లతొ ఓడిపోయాడు,2004లో కూడ TDP తరుపున ఓడిపోయరు.2009లో 150 ఓట్లతో TDP తరుపున పెనమలూరు నుంచి ఓడిపోయారు.2010లొ ఆయనకు మసాజ్ చేసే అతని చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ చలసాని పండు స్వయంగా రంగాను పొడిచారని అంటారు, "నువ్వు నన్ను చంపుతున్నావా" అని రంగా అన్నారని కూడ ప్రచారంలో వుంది."సై" సినిమాలో సీన్ గుర్తురావటం సాధారణం. రాజకీయం ముందు కులం వర్గం ఏమి వుండవని కూడ విజయవాడ చరిత్ర నిరూపించింది. NTR మరణించిన తరువాత దేవినేను నెహ్రు 1996లో కాంగ్రేసులొ చేరారు.నెహ్రు రాకను వ్యతిరేకించి రత్నకుమారిగారు TDPలో చేరారు.రంగా హత్య కేసులో నిందితుడు అయిన చలసాని పండుకు కాంగ్రేస్ రంగా సోదరుడు అయిన శొభనా చలపతిరావును కాదని ఉయ్యూరు నుంచి టికెట్ట్ ప్రకటించింది.చివరిలొ దాసరి నారాయణరావు గారు కలగచేసుకోని శొభనా చలపతిరావు గారికి టికెట్టు ఇప్పించారు. దేవినేని నెహ్రు 2016 ఆగష్టులో కాంగ్రేసును & బాబుగారితో విభేదాలు వీడి తెలుగుదేశంలో చేరారు.2000 సంవత్సరంలో kidney transplantation చేయించుకున్న నెహ్రు మొన్న 17-Apr-2017న చనిపోయారు. గత ఆగస్టులో నెహ్రు తమ్ముడు "బాజిప్రసాద్" మరణించారు. దేవినేని నలుగురు సోదరులు గాంధి,నెహ్రు,మురళి,బాజి ప్రసాద్ అకాల మరణం చెందారు. ఏపార్టీలో వున్న కమిట్మెంటుతో పనిచేసే నాయకుడిగా పేరున్న నెహ్రు కేవలం కొడుకు అవినాష్ భవిషత్తు కోసమే TDPలోకి వెళ్ళారనిపిస్తుంది.నెహ్రు బాబుగారి మీద చేసిన విమర్శలు చాలా తీవ్ర మైనవి.నెహ్రు కూతురిని రాయపాటి శ్రీనివాస్ కొడుకు పెళ్ళి చేసుకున్నాడు కాని వారి మధ విభేదాలు వచ్చి విడాకుల వరకు వెళ్ళారు,విడిపోయారో లేదో తెలియదు. రాధా,రంగా హంతకులు MLAలు అయినట్టే రంగా అనుచరులు, ఇతర కాపు యువ నాయకులు రంగ అమరనం తరువాత 1989లో కాంగ్రేస్ తరుపున MLAలు అయ్యారు,వీరిలో కన్నా లక్ష్మినారయణ, జక్కంపూడి రామ్మోహనరావ్,అంబటి రాంబాబు ముఖ్యులు.మాజి కేంద్ర మంత్రి శివశంకర్ వీరికి టికెట్లు రావటానికి ప్రధాన కారణం. శివ శంకర్ గారు కూడ మొన్న మార్చిలో చనిపోయారు. రంగా అనుచరుడు(రంగా తుపాకిని carry చేసే) మల్లది విష్ణు 2009లో కాంగ్రేసు తరుపున పోటిచేసి PRP తరుపున పోటిచేసిన రంగా కొడుకు రాధా మీద గెలిచారు. అటు మురళి హత్యకేసు ఇటు రంగా హత్య కేసులో ఎవరికి శిక్షలు పడలేదు. ఇరు కేసుల్లో సాక్షులు నిందితులను గుర్తుపట్ట లేదు.కారణం బర్మా సీతారమయ్య అనే పెద్దమనిషి నెహ్రు-రంగా వర్గాల రాజి కుదిర్చారు ఎవరికి శిక్షలు పడకుండ చేశారు. కర్నాటి రామ్మోహన్ రావు అనే లాయర్ గారు(ఇప్పుడు కూడ వున్నారు) రంగా-నెహ్రుల మధ్య గొడవలు పెరగకుండ అనేక సార్లు రాజి కుదిర్చారు కాని ఆ రాజీలు ఎక్కువ కాలం నిలబడలేదు. ఇది విజయవాడ రాజకీయాల్లొ ఒక కోణం-ముఖ్య కోణం,ఈకథను సినిమా తీస్తే ఎవరు చూస్తారు?మసాల కావాలి,జనాల్లొ పాత గాయలు రేపే ఏ చర్య అయినా సమర్ధనీయం కాదు! అవును విజయవాడ కథలో హీరోలు విలన్లు లేరు అందరు పాత్రధారులే!     అందరు బాధితులు,పీడితులే...నలిగి పోయింది విజయవాడ నగరం,ప్రజలు. 
  • (Sheik Sadiq Ali ) .......................  మీడియాను మేనేజ్ చెయ్యడంలో,తిమ్మిని బమ్మిని చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని అందరికీ తెలిసిన విషయమే. అయితే ,ఆయనకు ఆ కళ కొత్తగా అబ్బింది ఏమీ కాదు. 30 ఏళ్ళ క్రితమే ఆయన తన కళను తెలుగు ప్రజల ముందు ప్రదర్శించారు. ఆయనకు అంతకు ముందు నుంచే ఆ కళలో ప్రవేశం ఉందనీ ఆయనను సన్నిహితంగా ఎరిగిన మిత్రులు చెప్పేవారు. అసలింతకీ ఆయన ప్రదర్శించిన కళ ఏమిటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదవండి. అది స్వర్గీయ ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా సూపర్ ఫాం లో ఉన్న కాలం. చంద్రబాబు చిన్నల్లుడిగా అప్పుడప్పుడే చక్రం తిప్పుతున్న కాలం. చిత్తూరు జిల్లా మదనపల్లె లో భారీ బహిరంగ సభ జరిగింది. జనం తండోప తండాలుగా తరలి వచ్చారు. ఎన్టీయార్ ప్రసంగాన్ని మైమరచి వింటున్నారు. అప్పుడే ఎన్టీయార్ బాంబు పేల్చారు."నా రాజకీయ వారసుడు బాలయ్య బాబే " అని నిండు సభలో ప్రకటించారు. ఒక్కసారిగా సభలో జయజయ ధ్వానాలు మిన్నంటాయి.వింటున్న మీడియా ప్రతినిధులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.బ్యానర్ ఐటెం దొరికిందని సంబర పడిపోయారు. మదన పల్లె నుంచి తిరుపతికి రావటం ఆలస్యమవుతుందని ఫోన్ లోనే తమ కార్యాలయాలకు వార్త చెప్పేశారు. ఇక్కడ ఎడిటోరియల్ డెస్క్ కూడా ఐటెం రాయించి కంపోజ్ చేయించి పేజ్ మేకప్ కూడా పూర్తి చేశారు. ఈ లోగా రిపోర్టర్లు తమ ఆఫీసులకు చేరారు. నేను నైట్ షిఫ్ట్ లో ఉన్నాను.ఒకపక్క సిటీ స్పెషల్, మెయిన్ ఎడిషన్ రెండూ చూస్తున్నాను. లే అవుట్ చేసిన పేజ్ కెమెరా సెక్షన్ కు వేల్తుందీ అనుకుంటూ ఉండగా ,ఒక్కసారి అలజడి మొదలైంది. మా బ్యూరో చీఫ్ సి.ఆర్ .నాయుడు పరుగెత్తుకు వచ్చారు.' చంద్రబాబు ఫోన్ చేశారు. బ్యానర్ లీడ్ మార్చాలి అన్నారు. ఎన్టీయార్ ఉద్దేశ్యం బాలయ్య బాబు రాజకీయ వారసుడు కాదనీ,కేవలం నట వారసుడు మాత్రమే అని అర్ధం చేసుకోవాలని చెప్పారు. కాబట్టి బాలయ్య బాబే నా నట వారసుడు అని లీడ్ మార్చి రాసి ,తగిన విధంగా హెడ్డింగ్ కూడా మార్చాలి ' అన్నారు. ఆ మేరకు ఆయనే లీడ్ మార్చి రాసిచ్చారు. తగిన విధంగా హెడ్డింగ్ కూడా మారింది.తద్వారా ఒక రాజకీయ తుఫాను ఆగిపోయింది. దటీజ్ చంద్రబాబు. ఆరోజుల్లో ఎలెక్ట్రానిక్ మీడియా లేకపోయింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమి జరిగి ఉండేదో ఊహించలేం.ఇది బాబు కళకు సంబంధించిన ఒక నమూనా మాత్రమె. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి.
  • దివంగత నేత  జయలలిత రాజకీయ వారసురాలిగా తెరపైకి వచ్చిన మేనకోడలు దీప క్రమంగా తెరమరుగవుతున్నారు. భర్తతో మనస్పర్థలు,  పేరవై నేతలు కార్యకర్తలతో ఏర్పడిన విబేధాలతో దీప ఇప్పటికే సతమతమౌతున్నారు. ఈ నేపథ్యంలోనే  పేరవై సభ్యత్వాల పేరుతో రూ.20 కోట్ల మేరకు నొక్కేశారంటూ ఆరోపణలు దీపను చుట్టుముట్టాయి. అదే సమయంలో భర్త మాధవన్  సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. జయలలిత మరణం వరకు పెద్దగా ఎవ్వరికీ తెలియని దీప ఆ తరువాత రాజకీయ అరంగేట్రం చేసి ప్రజలందరికీ పరిచయమయ్యారు. శశికళ అన్నాడీఎంకే పార్టీని, అధికారాన్ని చేజిక్కించుకోవడాన్ని వ్యతిరేకించినవారి  సహాయం తో ‘ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవై’ని స్థాపించారు.పేరవై లో  భర్త మాధవన్‌ పెత్తనం లేకుండా చేసేందుకు గాను తన  కారుడ్రైవర్‌ను ప్రధాన కార్యదర్శిగా, అతని భార్యను అధ్యక్షురాలిగా చేయడంతో ముసలం పుట్టింది. దీపపై ఆగ్రహించిన మాధవన్‌ వేరే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. కాగా దీప  పన్నీర్‌ రాజీనామా, శశికళపై తిరుగుబాటు...  అన్నాడీఎంకే రాజకీయాలు అల్లకల్లోలంగా మారిన  సమయంలో పన్నీర్‌సెల్వం పక్షాన నిలిచారు. మెజారిటీ ఎమ్మెల్యేలను  పన్నీర్‌సెల్వం తన వైపు తిప్పుకోలేకపోవడంతో దీప మనస్సు మార్చుకుని సొంతంగా రాజకీయాలు ప్రారంభించారు. ఆర్కేనగర్‌లో ఒంటరిగానే పోటీ చేశారు. ఎన్నికల నామినేషన్‌ పత్రాల్లో భర్త పేరు రాయకుండా  ఆ కాలమ్ ను   ఖాళీగా ఉంచి  మరో వివాదానికి కారణమయ్యారు. ఆనాటి నుంచి ఇరువురి మధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. ఇటీవల అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా దీప ఇంటి ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మాధవన్‌ను లోనికి అనుమతించక పోవడం గొడవలు జరిగేయి . దీప, మాధవన్‌ల అనుచరులు ఘర్షణపడి రాళ్లు, నీళ్ల బాటిళ్లతో కొట్టుకున్నారు. ఘర్షణ సమయంలో ఇంటి నుంచి బైటకు వచ్చిన దీప భర్త మాధవన్‌ను ఇంట్లోకి రావద్దని హెచ్చరించి తరిమివేసింది. అదలా ఉంటే దీప 20 కోట్ల మోసం కేసులో చిక్కుకున్నారు. ఎంజీఆర్‌ అమ్మ దీప పేరవై కింద సభ్యత్వ దరఖాస్తుల రుసుం కింద రూ.20 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ చెన్నై నగరం నెశపాక్కంకు చెందిన జానకిరామన్‌ అనే వ్యక్తి చెన్నై మాంబళం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రద్దు చేసిన దీప పేరవై పేరుతో రెండు లక్షల దరఖాస్తులను రూ.10లకు అమ్మి, సభ్యత్వ రుసుమును స్వాహా చేశారని అతను ఆరోపించాడు. దీపపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నాడు.ఈ పరిస్థితుల్లో    దీప ను పట్టించుకొనేవారెవరు లేరు . ఉప ఎన్నిక ఎపుడు జరుగుతుందో లేదో తెలీదు. పన్నీర్ .. పళని వర్గాలు ఏకమౌతున్న క్రమంలో దీప తెర మరుగు కాక తప్పదేమో. దీపకు మంచి అవకాశం వచ్చినా దూసుకుపోలేకపోయారు. 
  • తమిళనాట రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఏక్షణాన ఏమి జరుగుతుందో నేతలకు అర్ధం కాక అయోమయంలో పడ్డారు. ఎవరూ ఊహించని విధంగా అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కొత్త కేసులో చిక్కుకున్నారు . ఇప్పటికే ఫెరా కేసు విచారణ మళ్లీ పుంజుకున్న నేపథ్యంలో ‘రెండాకుల చిహ్నం’ కోసం ఎన్నికల అధికారులకు  రూ.60 కోట్లు  లంచమివ్వ జూపారనే ఆరోపణల్లో ఇరుక్కుపోయారు.  ఈ కేసులో ఇప్పటికే రూ.1.30 కోట్లతో పట్టుబడిన బ్రోకర్‌ సుఖేష్‌ చంద్రశేఖర్‌.. దినకరన్ కోసమే తాను ప్రయత్నించినట్టు చెప్పడంతో పోలీసులు విచారణకు రంగంలోకి దిగారు.నేడో రేపో దినకరన్ ను అరెస్ట్ చేయవచ్చు అంటున్నారు .   ఈ క్రమంలో అటు పనీర్ సెల్వం, ఇటు పళని స్వామి వర్గాలు ఏకమయ్యే సూచనలు కనబడుతున్నాయి. అలాగే  అన్నాడీఎంకే నుంచి టీటీవీ దినకరన్‌ను సాగనంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దినకరన్ ను వదిలించుకునేందుకు పళని స్వామి మంత్రులతో మంతనాలు జరుపుతున్నారు.  ఐటీ దాడుల తర్వాత  తమిళనాట పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.ఐటీ ఉచ్చులో పడ్డ మంత్రి విజయభాస్కర్‌ను తొలగించే వ్యవహరంలో ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, సీఎం పళని స్వామిల మధ్య  విభేదాలు  తలెత్తాయి. దీంతో ఆ వర్గంలో  చిచ్చు మొదలయింది. టీటీవీని పక్కన పెట్టి, అన్నాడీఎంకేను, ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకుమాజీ సీఎం సెల్వం  ప్రస్తుత సీఎం పళని ఏకం కావాలని ఇరు వర్గాలకు చెందిన సీనియర్ల మధ్య  చర్చలు సాగుతున్నాయి.  ఇదిలా ఉంటే  శశికళ సహా విద్రోహులంతా పార్టీని వీడాల్సిందేనని  పన్నీర్ సెల్వం అంటున్నారు. . శశికళ, ఆమె కుటుంబసభ్యలు పార్టీలో కొనసాగిస్తే.. అన్నాడీఎంకే అధికార (ఈపీఎస్‌) వర్గంతో విలీనం ప్రసక్తే లేదని పన్నీర్  స్పష్టం చేశారు. జయలలిత మృతిపై న్యాయవిచారణ జరగాల్సిందేనని, అదే తన మొదటి డిమాండ్‌ తేల్చిచెప్పారు కాగా రాష్ట్రంలో పాలన కుంటువడి గందరగోళ పరిస్థితులు నెలకొన్న  సమయంలో ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు. నిన్నంతా ప్రధాన కార్యదర్శి నుంచి విషయాలు తెలుసుకున్నారు. ఈ రోజు సీఎం తో మాట్లాడవచ్చు అంటున్నారు.  మొత్తం మీద  గవర్నర్‌ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికార పార్టీ, ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. విజయభాస్కర్‌కు ఉద్వాసన తప్పదని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని ఊహాగానాలు వ్యాప్తిలోకి వచ్చాయి . 
  •  ( Sheik Sadiq Ali )    .............   ఒకవైపు ప్రత్యర్ధుల అంచనాలకు అందని వ్యూహాలతో దూసుకు వెళ్తున్నకేసీయార్. మరోవైపు సమరోత్సాహంతో ఉరకలు వేస్తున్నబీజేపీ శ్రేణులు. ఇంకోవైపు పొన్నాల, జానారెడ్డి లాంటి శల్యుల తో కలిసి కర్ణుడిలా యుద్ధం చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి . వర్తమాన తెలంగాణా రాజకీయ ముఖచిత్రం ఇది. రాష్ట్ర రాజకీయాల లోగుట్టు ఏమిటి? ఎవరు ఎవరి కోసం పని చేస్తున్నారు? ఎవరి అజెండా ఏమిటి? కొంచెం లోతుగా విశ్లేషిస్తే ...దిమ్మ తిరిగే వాస్తవాలు కళ్ళముందు ప్రత్యక్షమవుతాయి. సాధారణంగా ఎక్కడైనా అధికార పార్టీని గద్దె దింపటానికి ప్రతిపక్షాలు అన్నీ ఎకమవుతాయి. లేదా లోపాయికారీగా సహకరించుకుంటాయి. కానీ, తెలంగాణా రాజకీయాలు మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయటానికి అధికార పక్షం,మరో బుల్లి ప్రతిపక్షం సింగిల్ ఎజెండాతో పని చేయటం అనే విచిత్ర పరిస్థితిని ఇక్కడ గమనించవచ్చు. 'మా సర్వేలు చెప్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లు మావే.' అని కేసీయార్ గంభీరంగా ప్రకటిస్తున్నా ,వాస్తవం అది కాదు అనే విషయం వారికి తెలుసు. అది కేవలం మైండ్ గేమ్ మాత్రమే. ఎన్ని పధకాలు ప్రకటిస్తున్నా,ఎన్ని ప్రాజెక్టులు మొదలు పెడుతున్నా ప్రభుత్వం పట్ల నెలకొని వున్నా వ్యతిరేకతను తగ్గించటం కోసం గులాబీ అధినేత కొత్త వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర,రెండేళ్ళు సమయం ఉన్నా,సమయం,సందర్భం లేకుండా సంక్షేమ పధకాలు ప్రకటిస్తున్నారు. కులాల వారీగా,మతాల వారిగా వివిధ వర్గాల ప్రజలను ఆకర్షించటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే,వాటిలో చాలా అంశాలు వాస్తవ రూపం దాల్చటం అనుమానమే. సింగరేణి వారసత్వ ఉద్యోగాలు అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.అలాగే,ముస్లిం రిజర్వేషన్లు కూడా అదే కోవలోకి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అయినప్పటికీ, కేసీయార్ దగ్గర అస్త్రాలకు కొదవలేదు.ఆయన అమ్ములపొదిలోని మరిన్ని అస్త్రాలను ప్రయోగించటానికి ఆయన సిద్ధమవుతున్నారు. పక్షానికో,నెలకో సారో ఆయన ఒక్కో అస్త్రాన్ని ప్రయోగించటం ఖాయం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులపై ప్రజలకు, ప్రభుత్వంపై స్థానిక సంస్థల ప్రతినిధులకు పెరుగుతున్న అసంతృప్తి ని తగ్గించటం పై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. అలాగే, నామినేటెడ్ పదవులపై ఆశలు సన్నగిల్లి ,నైరాశ్యంలో పడిపోతున్న క్యాడర్ ను సంతృప్తి పరిచే చర్యలకు ఉపక్రమించ వచ్చు. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే....తిరిగి అధికారంలోకి రావటం. తాము బలపడుతూనే,పక్కలో బల్లెంలా పొంచి ఉన్న కాంగ్రెస్ ను బలహీన పరచటం ఎలా అన్నది పైకి కన్పించని అసలైన రాజకీయ వ్యూహం. మరో వైపు ఉత్తరాది ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. దానికి తోడు మోడీ,అమిత్ షా లు తెలంగాణాపై దృష్టి సారించటం కూడా వారికి నూతన ఉత్తెజాన్నిచ్చింది. కొంచెం కష్టపడితే అధికారం సాధించవచ్చని వారు ఆశిస్తున్నారు.అదే ధీమాను పెంచేలా అధినాయకత్వం ప్రకటనలు ఇస్తూ వస్తుంది.అయితే, క్షేత్రస్థాయి వాస్తవాలు కేంద్ర నాయకత్వానికి తెలుసు. వాటికి సంబంధించిన నివేదికలు అన్నీ వారి దగ్గర ఉన్నాయి. వారి లక్ష్యం కూడా 2019 కాదు.2024 మీదే గురిపెట్టి పనిచేస్తుంది. గమ్యం చేరాలంటే ముందుగా మార్గాన్ని సుగమం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ టీఆరెస్ కాదు. కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేసి ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలన్నదే ప్రస్తుత లక్ష్యం. అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతోంది. కాంగ్రెస్ కు మొదటి నుంచీ అండగా ఉన్న ముస్లింలను ఆ పార్టీకి దూరం చేయటం మొదటి అడుగు. అందుకే కేసీయార్ ప్రవేశపెట్టిన ముస్లిం రిజర్వేషన్ల బిల్లును తూతూ మంత్రంగా వ్యతిరేకించిందే తప్ప ,అంత బలంగా ఎదుర్కోలేదు. తదుపరి కార్యాచరణను కూడా ప్రకటించలేదు. వాటి సంగతి కోర్టులు చూసుకుంటాయి కాబట్టి అనవసరంగా ముస్లింలలో పార్టీ పట్ల వ్యతిరేకత పెరగనివ్వకూడదు అని నిర్ణయించింది.దానికి తోడు,మోడీ కూడా ఒరిస్సాలో ఆర్ధికంగా వెనుకబడిన ముస్లింల అభివృద్ధి కోసం కృషి చేయాలంటూ ప్రకటన కూడా చేశారు. ఈ మొత్తం వ్యూహంలో ప్రధాన లబ్దిదారు టీయారేస్, అయితే అంతర్గతంగా నష్టపోయింది మాత్రం కాంగ్రెస్సే. అలాగే, కేసీయార్ పట్ల అసంతృప్తిగా ఉన్న వర్గాలు కాంగ్రెస్ వైపుకు వెళ్ళకుండా నిరోధించటం మరో అడుగు. వాళ్ళు కాంగ్రెస్ వైపు వెళ్తే నష్టపోయేది టీయారేస్ , లబ్ది పొందేది కాంగ్రెస్ ,అది జరుగ కుండా , వీరిని బీజేపీలోకి చేర్చుకోవటానికి పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది.భారీ ప్యాకేజీలు సిద్ధమవుతున్నాయి. ఈ చర్యల వల్ల బీజేపీ కొంత మేరకు బలపడుతుంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి పోవటం వల్ల టీయారేస్ గెలుపు సులభం అవుతుంది. ఇక్కడ కేసీయార్ కోరుకుంటున్నదీ అదే. అందుకే బీజేపీ బలపడుతూ ఉండటాన్ని ఆయన నిరోధించటం లేదు. కానీ, బీజేపీ అడుగులను మాత్రం నిశితంగా గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా అన్ని స్థానాలకూ ఒంటరిగానే పోటీ చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉంది. అది కూడా టీయారేస్ కు లాభించే అంశమే. గతంలో కాంగ్రెస్-ప్రజారాజ్యం కలిసి అనుసరించిన వ్యూహాన్నే ఈసారి టీయారేస్-బీజేపీ అనుసరించ వచ్చు. అది సహజంగానే కాంగ్రెస్ కు తీరని నష్టాన్ని కలిగించ వచ్చు. ఆ విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయటానికి ఈ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ వైపు నుంచి చూద్దాం. ఒకప్పుడు దేశవ్యాప్తంగా ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ కు విజయాన్ని అందించి ఊరట నిచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాగే,ఎన్టీయార్ ను ,చంద్రబాబును కూడా ఓడించ గలిగింది కాంగ్రెస్. కానీ అప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? అలనాటి చెన్నారెడ్డి,వైఎస్సార్ లాంటి నాయకత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉందా? గతంలోలా వ్యూహరచన చేయగలిగిన మేధావులు ఇప్పుడు కేంద్ర కాంగ్రెస్ లో ఉన్నారా? ఆజాద్ జాదూ,దిగ్విజయ్ విజయ మంత్రం ఇప్పుడు ఫలిస్తాయా? అంటే లేదూ అనే చెప్పొచ్చు. యుద్ధ క్షేత్రమే తప్ప ప్రజాక్షేత్రం లోని ఎత్తుగడలు తెలియని ముక్కుసూటి ఉత్తమ్ కుమార్ ఎంతవరకు నేగ్గుకోస్తారో ప్రశ్నార్ధకమే. కేసీయార్ ఎప్పుడు ఏ పధకం ప్రకటిస్తారో తెలియని అయోమయంలో ఉన్నారు. సరైన కసరత్తు చేయకుండానే నిరుద్యోగ భ్రుతి ఇస్తామని ప్రకటించటం కేవలం రాజకీయ అపరిపక్వతను మాత్రమె సూచిస్తుంది. ఆ పార్టీ యెంత కంగాళీగా ఉందొ అర్ధం అవుతుంది. దానికి తోడు అటు పొన్నాల, ఇటు జానా రెడ్డి లను పక్కన పెట్టుకొని ప్రకటించటం చూస్తే ఏమనాలో అర్ధం కాని పరిస్థితి. ఇప్పటికే వాళ్ళిద్దరూ కేసీయార్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. వాళ్ళిద్దరూ ఏదో ఒకరోజు గోడ దూకుతారని బలంగా విన్పిస్తుంది.అయితే ,ఇప్పుడిప్పుడే వాళ్ళను చేర్చుకోకుండా ,కాంగ్రెస్ లోనే ఉంచి ,తమకు అనుకూలంగా పనిచేయించుకొని ,ఎన్నికలకు పక్షం రోజుల ముందో,లేదా ఎన్నికలు అయిన తర్వాతో చేర్చుకొని సముచిత రీతిలో గౌరవించుకోవాలి అనే ఆలోచన కేసీయార్ లో ఉందని అంతరంగిక వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పదవి కోసం నలుగురు ,ఐదుగురు గట్టిగానే పోటీ పడుతున్నారు. యెంత సొమ్మైనా వెచ్చించటానికి వారు సిద్ధంగానే ఉన్నారు. కానీ,ఆ పార్టీ అధిష్తానం ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే స్థితిలో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరి కాలు ఒకరు లాగటానికి ఎత్తుగడలు వేస్తూనే ఉన్నారు. ఇవన్నీ చూస్తూ కూడా నిస్సహాయ స్థితిలో ఉత్తమ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇలాంటి రాజకీయ నేపధ్యంలో తెలంగాణా లో కాంగ్రెస్ అనేది లేకుండా చేయటానికి 'కాంగ్రెస్ ముక్త తెలంగాణా' కార్యాచరణ కొనసాగుతోంది. ఇది ఎంతవరకు సఫలం అవుతుందో కాలమే నిర్ణయించాలి.