Latest News
ప్ర‌ముఖులు
 • ( Sheik Sadiq Ali )    .................           భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో,ప్రభుత్వంలో సాధువులు,యోగుల ప్రమేయం పెరిగిపోతోందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తునారు. అయితే  భారత రాజకీయాల్లో యోగుల ప్రమేయం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 1960 వ దశకం నుంచే, ఇందిరాగాంధీ హయాం నుంచే ఈ ట్రెండ్ మొదలైంది. నిజం చెప్పాలంటే , ఇప్పటికన్నా అప్పుడే చాలా ఎక్కువగా ఉంది . దాని గురించి ఈతరం వారికి తెలియజెప్పటమే ఈ కథనం ముఖ్యోద్దేశ్యం. ఇది ఒక యోగి జీవిత కథ. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని, దేశ రాజకీయాలను కంటి సైగతో శాసించిన ఒక బ్రహ్మచారి కథ. తారాజువ్వలా నింగికి ఎగసి నేలరాలిన ధీరేంద్ర బ్రహ్మచారి కథ. ఇందిరా గాంధీని, సంజయ్ గాంధీ ని, మొత్తం గాంధీ పరివారాన్ని నడిపించిన ఒక రాజగురువు కథ. ఆద్యంతం మలుపులతో, సినీ ఫక్కీలో నడిచిన ఈ యోగి జీవిత కథ ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఎవరీ బ్రహ్మచారి? మా తరం, మాకన్నా ముందు తరం వారికి తెలిసిన కథే. కానీ, భారత భవిష్యత్తును నిర్దేశించే నవతరానికి ఈ కథ తెలియాల్సిందే. 13 వ ఏటే ఇల్లు వదిలి సన్యాసుల్లో కలిసిన ఒక కుర్రాడు దేశ భవిష్యత్తును శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? కట్టుబట్టలతో బయటికి వచ్చిన వాడు వేలకోట్ల సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరా గాంధీకి రాజగురువు ఎలా అయ్యాడు? ఎవరి మాటా వినడని ప్రఖ్యాతి చెందిన సంజయ్ గాంధీని ఎలా మచ్చిక చేసుకున్నాడు? ఇప్పటికీ మిస్టరీ వీడని విమాన ప్రమాదంలో ఎలా మరణించాడు? ఇవన్నీ ఆద్యంతం ఆసక్తికరం. బీహార్ రాష్ట్రం మధుబన్ జిల్లా సాయిత్ చాన్పూర్ గ్రామంలో 1924 ఫిబ్రవరి 24 వ తేదీన పుట్టాడని కొందరు,1925 లో పుట్టాడని కొందరు  చెబుతారు . అలాగే అతని అసలు పేరు ధీరేంద్ర  చౌదరి అనీ,తండ్రి పేరు భంభోల్ చౌదరి అని కొందరు...   కాదు..కాదు అతని పేరు ధీరేంద్ర  శర్మ అని కొందరు అంటారు .  నిజమేమిటో ఇప్పటికీ తెలియదు. ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రం 1954 లో మాత్రమే. కలకత్తాలో ప్రజలను పరిచయం చేసుకున్నపుడు ఆయన చెప్పిన వివరాలు చదివితే కొంచెం ఆశ్చర్యంగా అన్పిస్తుంది. "సన్యాసులకు సొంత ఊరూ ,పేరూ ఉండవు. కాబట్టి ఊరేదని అడగొద్దు. 13 వ ఏట భగవద్గీత ఇచ్చిన స్పూర్తితో ఇల్లు వదిలి వారణాసి వెళ్లి సన్యాసిగా మారాను. లక్నో కు సమీపంలో ఉన్న గోపాల్ ఖేరా ఆశ్రమంలో కార్తికేయ మహర్షి ఆశ్రమంలో చేరాను. ఆ మహర్షి 325 ఏళ్ళు జీవించి 1953 లో మరణించారు. వారు జీవించి ఉండగా అతిప్రాచీన భారతీయ యోగవిద్యను సాధన చేశారు. ఆ విద్య భారత్ లో అంతరించి పోయింది. కేవలం టిబెట్ లో మాత్రమే మిగిలి ఉంది దాన్ని మళ్ళీ బతికించి భారత ప్రజలకు అందించాలనేది వారి కోరిక. వారి వద్ద నేను నేర్చుకున్న విద్యను కలకత్తా ప్రజలకు నేర్పించెందుకే వచ్చాను. నా వయసు నిజానికి చాలా పెద్దది. కానీ చూడ్డానికి యువకుడిలా కన్పిస్తాను. దానికి నేను సాధన చేస్తున్న యోగ,సూక్ష్మ వ్యాయమాలే కారణం." ఇలా తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చిన ధీరేంద్ర  తనను తాను నిర్వచించుకున్నాడు. నిలువెత్తు విగ్రహం, ఆజానుబాహు,కాంతులీనే మేనిఛాయ,అయస్కాంతంలా ఆకర్షించే కళ్ళు. ఎలా తిప్పితే అలా తిరిగే దేహం ,వాటికి తోడూ అద్భుతమైన యోగ విన్యాసాలు. ప్రకృతి వైద్యం అదనపు ఆకర్షణలు. ఇవన్నీ చూసిన స్థానికులు ఆయనను ఆదరించారు. చిన్న అద్దె ఇంటిలో మొదలైన జీవితం అతికొద్ది కాలంలోనే ఖరీదైన భోగవంతమైన ఆశ్రమానికి మారింది. నగరంలోని ప్రముఖులు,ముఖ్యంగా సంపన్న కుటుంబాల మహిళలు అతని శిష్యులయ్యారు.పాపులారిటీ, సంపాదనా పెరిగాయి. అక్కడి నుంచే అతని మహర్దశ మొదలైంది. యోగాసనాలు వేయటంలో ఇప్పటి రాందేవ్ బాబాను మించిన వాడు. తాను యోగా చేస్తుండగా తీసిన ఫోటోలు, వాటి వివరాలతో 'సూక్ష్మ వ్యాయామం  అండ్ యోగాసన' అనే పుస్తకాన్ని రూపొందించాడు. అప్పుడే జయప్రకాశ్ నారాయణ కలకత్తా వచ్చారు. మిత్రుల సహకారంతో ఆయనను కలిసి తన పుస్తకానికి ముందు మాట రాయించుకున్నాడు. ఆ పుస్తకం బాగా ఆదరణ పొందింది. ఆ తర్వాత అక్కడి సైనికులకు,సైనికాధికారులకు యోగా శిక్షణ ఇచ్చాడు. క్రమంగా అతని కీర్తి  పెరగ సాగింది. దాంతో దేశ రాజధాని ఢిల్లీ మీద కన్ను పడింది. అక్కడ ఒక చిన్నపాటి బ్రాంచ్ మొదలు పెట్టాడు. ఢిల్లీ చేరిన తర్వాత అతని దశ తిరిగిపోయింది. అది 1960 వ సంవత్సరం. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు కూతురు ఇందిరాగాంధీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు.ఆమెకు యోగా నేర్పించి స్వస్థత చేకూర్చాలని ధీరేంద్ర ను కోరారు. రోజూ ఇంటికి వచ్చి ఇందిరకు యోగా, సూక్ష్మ వ్యాయామం నేర్పించాలి. అలా నెహ్రూ ఇంట్లోకి ధీరేంద్ర ప్రవేశించాడు.అతి తక్కువ కాలంలోనే ఇందిరా.నెహ్రూలకు సన్నిహితుడయ్యాడు. నెహ్రు మరణాంతరం ఇందిరకు మరింత చేరువ అయ్యాడు.గురువు,సచివుడు ,హితుడు,సన్నిహితుడు అన్నీ తానే అయ్యాడు. అక్కడినుంచి అతని ప్రభ వెలిగిపోయింది. అత్యంత ఖరీదైన ఆశ్రమాలు, యోగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశాడు. కేంద్రమంత్రులు,బడా పారిశ్రామిక వేత్తలు,ఉన్నతాధికారులు అతని శిష్యులుగా మారిపోయారు. అతని ట్రస్ట్ కు కేంద్ర ప్రభుత్వ నిధులు భారీగా మంజూరు అయ్యేవి.మరో వైపు ఆయుధ కర్మాగారంలో భాగస్వామి అయ్యాడు. ఆయుధాల వ్యాపారిగా, రక్షణ పరికరాల సరఫరా దారుగా ఎదిగాడు.ఇందిరా ప్రధానిగా ఉన్న కాలంలో కేంద్ర మంత్రివర్గ కూర్పులో అతని ముద్ర స్పష్టంగా కన్పించేది. ఇక ఇందిరా తనయుడు సంజయ్ గాంధీకి ధీరేంద్ర ఎంతచెప్తే అంతేగా ఉండేది. ఎమర్జెన్సీ రోజుల్లో సంజయ్ చేపట్టిన కుటుంబ నియంత్రణ, గుడిసెల నిర్మూలనా కార్యక్రమాలకు ధీరేంద్ర  బహిరంగ మద్దతు ప్రకటించాడు. ఇక్కడ ఇలా ఉండగా, రష్యా ఆహ్వానం మేరకు అక్కడి వ్యోమగాములకు యోగా శిక్షణ కూడా ఇచ్చి వచ్చాడు. ధీరేంద్ర కు విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవారు. విదేశాల నుంచి ఖరీదైన కార్లు,విమానాలు, ఎలెక్ట్రానిక్ పరికరాలు కానుకలుగా అందేవి. జమ్మూలో అతిపెద్ద ఆశ్రమం,సొంత విమానాశ్రయం,సొంత విమానం ,హెలికాప్టర్లు ఉండేవి. నిరంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు సొంత విమానాల్లో తిరిగేవాడు. దాంతో ఫ్లయింగ్ స్వామి గా సుప్రసిద్దుడయ్యాడు. సంజయ్ గాంధి మరణానికి కారణమైన విమానం కూడా ధీరేంద్ర దే కావటం విశేషం. సంజయ్ మరణం తర్వాత ఇందిరాగాంధీ పరిపూర్ణంగా ధీరేంద్ర  పైనే ఆధార పడ్డారు. ఆయన సూచనలతోనే ఇందిర అనేక పుణ్యక్షేత్రాలు దర్శించారు. ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఒక వైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో ధీరేంద్ర  ప్రమేయం చాలా ఎక్కువగా ఉండేది . అప్పట్లో దూరదర్శన్ లో ప్రతీరోజు ధీరేంద్ర  యోగా కార్యక్రమాలు వచ్చేవి. భారతదేశపు ఆధ్యాత్మిక గురువుగా విరాజిల్లాడు. అదే సమయంలో ఆయనపై అనేక లైంగిక ఆరోపణలు వచ్చాయి. కలకత్తా నుంచి ఢిల్లీ వరకు అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉండేవని వార్తలు గుప్పుమనేవి.అలాగే, ఎమర్జెన్సీ కాలంలో వేలకోట్ల అక్రమ ఆస్థులు కూడబెట్టాడని ఆరోపణలు రావటం, జనతా ప్రభుత్వం నియమించిన షా కమీషన్ వాటిని నిర్ధారించటం, వాటిలో కొన్ని ఆస్థులను జప్తు చేయటం కూడా జరిగింది. ఇందిరా గాంధీ ,రాజీవ్ ల మరణం తర్వాత ధీరేంద్ర పతనం మొదలయ్యింది. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు . 1994 జూన్ 9 జమ్మూ పరిసరాల్లో ఆయన ప్రయాణిస్తున్న సొంత విమానం కూలిపోవటంతో ధీరేంద్ర  మరణించాడు. ఆ విమానం ఎలా కూలింది అనే విషయంలో మీడియా కానీ, అప్పటి ప్రభుత్వం కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన మరణం తర్వాత వారసులెవరూ లేకపోవటంతో ఆయన ఆశ్రమాలు,ఆస్థులు దోపిడీకి గురయ్యాయి.ఇప్పుడు ఆయనను గుర్తు పెట్టుకునే వారే కరువయ్యారు. యోగాసాధకుడిగా నిస్సందేహంగా ధీరేంద్ర  గొప్పవాడు. కానీ,రాజకీయ ప్రమేయాలు, ఆయుధాల వ్యాపారాలు,అక్రమాలు, మహిళలతో సంబంధాలు ఆయన లోని విద్వత్తును పూర్తిగా కనుమరుగు చేసేశాయి. యోగి భోగిగా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ధీరేంద్ర జీవితమే ఒక ఉదాహరణ. అలాగే బీజేపీ  హయాంలోనే యోగులు, సాధువుల రాజకీయ ప్రమేయం పెరిగిందని చెప్పటం కూడా అసత్యం. దశాబ్దాల తరబడి దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఒక యోగి కనుసన్నల్లో ఎలా నడిచిందో చెప్పటానికి ధీరేంద్ర బ్రహ్మచారి జీవితం ఒక చారిత్రక తార్కాణం....
 • (నందిరాజు రాధాకృష్ణ )  .........     వేములపల్లి శ్రీకృష్ణ ఎవరో తెలుసా..?  వామపక్ష రాజకీయ వాసనలున్న కొందరికైతే ఆయన కమ్యూనిస్టు గా తెలుసు. మరికొందరికి ప్రజాప్రతినిధిగా ఎరుక. బాపట్ల, మంగళగిరి నియోజక వర్గాలనుండి రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. బహుకొద్దిమందికి ఆయన ఒక పాత్రికేయునిగా గుర్తు. విశాలాంధ్ర  ఎడిటర్‌గా రాష్ట్రంలో పాతకాలం పత్రికా పాఠకులకు తెలిసుండచ్చు. ఆయన గొప్ప కవి అని చాలామందికి తెలీక పోవచ్చు. అందులోనూ ఆయన రాసిన ఒక గేయం దశాబ్దాలపాటు తెలుగునేల నాలుగు దిక్కులా పిక్కటిల్లింది. అన్ని భావాలు, అన్ని వాదాలు కలగలిపి సువిశాలాంధ్ర గళం వినిపించారు. తెలుగు పటిమను, ధైర్య సాహసాలను, పాండిత్య ప్రతిభను, తెలుగు సంస్కృతీ వెలుగు  జిలుగులను వేనోళ్ళ కొనియాడారు. ప్రస్తుత అస్తవ్యస్త వ్యవస్థ వాతావరణంలో ఈపాటకు ఎంతో విలువ ఉంది. 50 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా శ్రీకృష్ణ గేయం గుర్తుండకపోవచ్చు. గతంలో వినిపించిన దేశభక్తి పూరిత గేయాలలో ఇది ప్రముఖంగా ఉండేది. శ్రీకృష్ణ ఎలా ఉండేవారో పాత కమ్యూనిస్టు తరానికి, తలపండి, చేయి తిరిగిన పాత్రికేయ మిత్రులకు మాత్రమే స్ఫురణకు వస్తారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!! అన్న ఆయన పిలుపునకు యువత పౌరుషంతో పరుగులెత్తింది ఆ రోజుల్లో.  ఆ దేదీప్య, దివ్య గీతిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కంచుకాగడా పెట్టివెతికినా ఎక్కడా కాగితాల్లో (పాఠ్యపుస్తకాల్లో) కలాల్లో, గళాల్లో కనిపించదు, వినిపించదు. ఒక్క సారి ఆ గీతాన్ని మననం చేసుకుందామా!! చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి కలవోడా! సాటిలేని జాతి-ఓటమెరుగని కోట  నివురుగప్పి నేడు-నిదురపోతుండాది జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి కలవోడా!!||చెయ్యెత్తి|| వీర రక్తపుధార-వారబోసిన సీమ పలనాడు నీదెరా-వెలనాడు నీదెరా  బాలచంద్రుడు చూడ ఎవడోయి! తాండ్రపాపయ్య కూడనీవోడూ||చెయ్యెత్తి|| కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల  మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే  వీరవనితల గన్న తల్లేరా! ధీరమాతల జన్మ భూమేరా! ||చెయ్యెత్తి|| నాగార్జునుడి కొండ,అమరావతీస్థూపం భావాల పుట్టలో-జీవకళ పొదిగావు అల్పుడను కావంచు తెల్పావు నీవు శిల్పినని చాటావు దేశదేశాలలో! ||చెయ్యెత్తి|| దేశమంతే వట్టి మట్టి కాదన్నాడు మనుషులన్నమాట మరువబోకన్నాడు అమరకవి గురజాడ నీవాడురా ప్రజలకవితను చాటిచూపాడురా! ||చెయ్యెత్తి|| రాయలేలిన సీమ-రతనాల సీమరా దాయగట్టె పరులు-దారి తీస్తుండారు నోరెత్తి యడగరా దానోడా వారసుడ నీవెరా తెలుగోడా! ||చెయ్యెత్తి|| కల్లోల గౌతమీ-వెల్లువల కృష్ణమ్మ తుంగభద్రాతల్లి-పొంగిపొరలిన చాలు ధాన్యరాశులే పండు దేశానా! కూడుగుడ్డకు కొదవలేదన్నా!||చెయ్యెత్తి|| ముక్కోటి బలగమోయ్-ఒక్కటిగ మనముంటే ఇరుగుపొరుగులోన -వూరు పేరుంటాది తల్లి ఒక్కతే నీకు తెలుగోడా! సవతిబిడ్డల పోరు మనకేలా! ||చెయ్యెత్తి|| పెనుగాలి వీచింది-అణగారి పోయింది నట్టనడి సంద్రాన-నావ నిలుచుండాది చుక్కాని బట్టరా తెలుగోడా!  నావ దరిచేర్చరా మొనగాడా!! !! చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా||...
 • పెళ్లికాని ప్రముఖుల క్లబ్ లోమరో ఇద్దరు కొత్త గా చేరారు . ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు  చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ఒకరు  కాగా రెండో వారు ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన త్రివేంద్ర సింగ్ రావత్.  ఈ ఇద్దరూ కూడా బ్రహ్మచారులే.  44 ఏళ్ల ఆదిత్యనాథ్.. గోరఖ్‌పూర్ మఠాధిపతి. వివాహం, కుటుంబానికి దూరంగా ఉన్న యోగి.. సన్యాసం స్వీకరించారు. గోరఖ్‌ పూర్‌ నుంచి 5 సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీ సీఎంగా ఆదివారం  ప్రమాణం చేశారు. ఇక  ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన త్రివేంద్ర సింగ్ రావత్ (56). ఈయన  ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ గా చేశారు.   ఇక హరియాణ  సీఎం ఎంఎల్ ఖట్టర్ (62) , అసోం సీఎం  సర్బానంద సోనోవాల్ (54), ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ (70) , పశ్చిమ బెంగాల్‌  సీఎం మమతా బెనర్జీ (62) లు కూడా అవివాహితులే. వీరిలో నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ మినహా మిగిలిన ముఖ్యమంత్రులు బీజేపీ వారు కావడం  విశేషం .  2000 సంవత్సరం నుంచి ఒడిశా సీఎంగా నవీన్ కొనసాగుతున్నారు. ఇక మమత వరుసగా రెండో పర్యాయం బెంగాల్ సీఎం అయ్యారు. వీళ్లలో చాలామంది ఎన్నికల ప్రచారంలో వారికి  పెళ్లి కాని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తాము అవివాహితులమని, తమకు కుటుంబం లేదని, కుటుంబ పాలనకు, అవినీతికి చోటు ఉండదని ప్రజలను ఆకట్టు కుంటున్నారు .  ఇండియాలో అవివాహితులైన ప్రముఖుల జాబితా పెద్దదే. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ (46)కి ఇంకా పెళ్లి కాని విషయం తెలిసిందే. మీడియా  ఈ విషయాన్ని రాహుల్ వద్ద ప్రస్తావిస్తే.. తనకు నచ్చిన అమ్మాయి దొరికినపుడు పెళ్లి చేసుకుంటానని చెబుతుంటారు .ఇక మాజీ ముఖ్యమంత్రులు మాయావతి (ఉత్తరప్రదేశ్‌-61), ఉమాభారతి (మధ్యప్రదేశ్‌-57), తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా అవివాహితులే. ఉమా భారతి ప్రస్తుతం కేంద్ర మంత్రి. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా వివాహం చేసుకోలేదు. ఆర్ ఎస్ ఎస్ ప్రముఖుల్లో  మోహన్ భగవత్ ... గోవిందా చార్య మరికొందరు కూడా వివాహానికి దూరంగా ఉన్నారు.  దేశ వ్యాప్తంగా చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు ఈ క్లబ్ లో ఉన్నారు. ఇతర పార్టీల కంటే బీజేపీలోనే బ్రహ్మచారుల సంఖ్య ఎక్కువ. కేవలం  వివిధ కీలక పదవుల్లో ఉన్నవారు కాక  ఇతర రంగాల్లో కూడా బ్రహ్మచారులు ఉన్నారు. ...
 • (జ్యోతి వలబోజు)............       సంసారంలో అప్పుడప్పుడు సరసాలు, చిటపటలు ఉంటేనే కదా మజా.. ఈ సరసాలు ఒక్కోసారి అభిప్రాయబేధాలు, అలగడాలు .. శ్రుతిమించితే పోట్లాటల వరకు వెళ్తాయి. ఈ విషయంలో కొందరు పండితులేమన్నారో చూడండి.   ఇంద్రగంటి : నాకూ, నా భార్యకూ అభిప్రాయబేధాలు రాకుండా ఉండవు, వస్తూనే ఉంటాయి. అలా అభిప్రాయబేధం వచ్చినప్పుడు నా అభిప్రాయం మాత్రం చస్తే ఆవిడతో చెప్పను. ఇక ఆవిడ ఏం చేస్తుంది? నోరు మూసుకుని ఉంటుంది. అర్ధం కాలేదా? అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నేనే నోరుమూసుకుని ఊరుకుంటాను. కాటూరి : మా ఇంట్లో ఎప్పుడూ పోట్లాడుకోలేదు. అదెలా సంభవం అంటే.. నేను చెప్పిన మాటలన్నీ ఆవిడ వింటుందని కాదు. ఆవిడ చెప్పినట్టే నేను వింటాను. ఏదైనా మాటా మాటా వచ్చి ఆవిడకు కోపం వస్తే నేను వెంటనే... "దోషముగల్గె, నా వలన దోసిలి యొగ్గితి నేలుకొమ్ము నీ దాసుడ" అని " ముట్టెద తత్పద్ద్వయిన్" అంటాను. దేవులపల్లి : నా ప్రియురాలితో పోట్లాట నేను భరించలేను. ఒకవేళ వచ్చిందో నాకు దుఃఖం వస్తుంది. ఆ దుస్సహగాఢ దుఃఖం ఆపుకోలేను ఏడుపు వస్తుంది. మృదుల కరుణా మధురం నా హృదయము. మొక్కపాటి : మాకు ఎలాంటి పోట్లాటలు లేవు. శాంతంగా జరిగిపోతుంది. ఎలాగంటే నేను మద్రాసులో ఉంటున్నాను. ఆవిడ రాజమండ్రిలో ఉంటున్నది. ఎప్పుడైనా టెలిఫోనులో మాట్లాడుకుంటాము. పైగా చాలా డబ్బు ఖర్చవుతుంది. ఇక పోట్లాడడానికి వ్యవధి ఎక్కడిది. గిడుగు : మా ఇంట్లో అస్సలు పోట్లాటలే లేవండి. పోట్లాటలే కాదు అసలు మాట్లాటలే లేవు. ఎందుకంటే నేను ఒక ప్రతిజ్ఞ చేసాను. ఇంట్లో సవర భాషలో మాత్రమే మాట్లాడతాను. బయట సవరభాషను గురించి మాత్రమే మాట్లాడతాను. అందుకని నేను ఏమంటున్నది ఆవిడకు తెలీదు. అందుకే ఏటువంటి పోట్లాటలు లేవు. వేలూరి : ఇంటావిడకు మన మాటలు వినపడనంతటి దూరంలో ఒక కుటీరం నిర్మించుకొని పొద్దస్తమానమూ అక్కడే కాలం గడపడంవల్ల చాలా వరకు భార్యాభర్తల మధ్య పోట్లాటలు ఉండవు. ధనికొండవారు : సన్నని వేప బెత్తంతో వీపు చిట్లగొడితే మళ్లీ మాట్లాడదు. ఒకటి రెండుసార్లు ఇలా జరిగిన తర్వాత మా ఆవిడకూ, నాకూ అభిప్రాయ భేదాలంటూ లేకుండా పోయినాయి. బుచ్చిబాబు: మా ఆవిడ ఎప్పుడూ " మీకేమీ తెలియదు. మీకేమాత్రమూ తెలియదండీ" అంటూ ఉంటుంది. ఇలా ప్రతిరోజూ చెవిలో నూరిపోయడం వల్ల నాకు ఏమీ తెలియదన్న నమ్మకం బాగా కుదిరింది. అన్నీ తెలిసిన విజ్ఞాన సర్వస్వం మా ఆవిడ. ఆవిడ మాట మెదలకుండా వినడమే నా పని. ఇక పోట్లాటలు ఎలా వస్తాయి? జమ్మలమడక : భార్యాభర్తల మధ్య పోట్లాటలు రాకుండా ఉండాలంటే భర్త తప్పనిసరిగా సంస్కృతం నేర్చుకోవాలి. భర్త సంస్కృతంలో ఏది మాట్లాడినా ఆవిడకు అర్ధం కాదు.దాంతో గప్ చిప్ గా ఊరుకుంటుంది. నేను అలాగే చేస్తున్నా... పాపం కదా..... ఎన్ని కష్టాలో ఈ  మొగుళ్ళకి ....
 • ( సుశ్రీ )....................    మన ఆర్మీ లో అసమాన సాహసవంతులు ఎందరో పని చేశారు.  వారికి ప్రాణాలంటే లెక్క లేదు . వైకల్యం ఎదురైనా చింతించరు.  అవిక్ర పరాక్రమంతో దూసుకు పోతుంటారు.  అలాంటి వీరుల్లో కార్డోజో  ఒకరు. అనూహ్యంగా ఎదురైన వైకల్యాన్ని లెక్క చేయక  పోరాడిన సైనికుడు అతను. ఎందరికో స్ఫూర్తి  అతగాడి జీవితం .     .....  ఆ సైనికుడు మంచం మీద పడి ఉన్నాడు. కాలు నుజ్జు నుజ్జయిపోయింది. ఎముక పొడి పొడి అయిపోయింది.  రక్తం ధారాప్రవాహంగా కారిపోతోంది. సైనికుడు స్పృహలోనే ఉన్నాడు. “నాకు మత్తు మందు ఇవ్వండి.” అన్నాడతను. యుధ్దం భయంకరంగా జరుగుతోంది. మత్తు మందు స్టాక్ లేదు. “పోనీ పెథిడిన్ ఇవ్వండి.” కానీ అదీ లేదు. తన తోటి గూర్ఖా సైనికుడిని పిలిచాడు. “ఈ నుజ్జు నుజ్జయిపోయిన కాలును నరికెయ్” అని ఆజ్ఞాపించాడు. సైనికుడు తెల్లబోయాడు. తన పై అధికారి కాలు నరకడానికి అతనికి చేతులు రాలేదు. “నా దగ్గర కత్తి లేదు” అన్నాడు. అతని గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది. “నా ఖుక్రీ ఇవ్వు.” ఖుక్రీ అంటే గూర్ఖా సైనికుడి కత్తి. సైనికుడు ఆయనకు ఖుక్రీ చేతికి ఇచ్చాడు. “దీనితో ఈ కాలును నరికేయ్” “మై నహీ కర్ సక్తా సాహెబ్” అన్నాడు సైనికుడు. అతని ఒళ్లంతా కంపించిపోతోంది. “సరే” అన్నాడు ఆ అధికారి. తన ఖుక్రీతో తన కాలుపై ఒక్క వేటు వేశాడు. నుజ్జు నుజ్జయిన కాలు శరీరంనుంచి వేరైపోయింది. “దీన్ని తీసుకెళ్లు. ఖననం చేయి” అని ఆదేశించాడు ఆ అధికారి. తన కాలును తానే తెగనరుక్కున్న ఆ వీర సైనికుడి పేరు మేజర్ ఇయాన్ కార్డోజో. అది 1971 భారత పాక్ యుద్ధం. యుద్ధ భూమిలో పొరబాటున శత్రువు పెట్టిన ఒక మందుపాతరపై కాలు వేశాడు. అది పేలింది. అతని కాలు పూర్తిగా ముక్కముక్కలైపోయింది. దాని నుంచి మిగతా శరీరమంతా సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తన కాలును తానే నరుక్కున్నాడు. అయితే గాయానికి చికిత్స తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కార్డొజో ప్రాణం పోవడం ఖాయం. కార్డొజోను పెద్ద ఆస్పత్రికి తరలించడానికి హెలికాప్టర్ అందుబాటులో లేదు. మృత్యువు ముంచుకొస్తోంది. అదృష్టవశాత్తూ మన సైన్యాలకు చిక్కిన పాక్ యుద్ధ బందీల్లో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకు వచ్చాడు. కార్డొజో తన కమాండింగ్ ఆఫీసర్ తో నాకు పాకిస్తానీ చేతుల్లో చికిత్స చేయొద్దు అన్నాడు. “నువ్వు మూర్ఖుడివా?” కమాండింగ్ ఆఫీసర్ అడిగాడు. “నీ ప్రాణం పోతుంది. ను్వ్వేం మాట్లాడకు. శస్త్ర చికిత్స జరుగుతుంది.” “అయితే నావి రెండు షరతులు” దృఢంగా అన్నాడు కార్డొజో. “షటప్… నువ్వు షరతులు విధించడానికి వీల్లేదు.” “పోనీ… రెండు అభ్యర్థనలున్నాయి. మొదటిది – నాకు పాకిస్తానీ రక్తం ఎక్కించవద్దు.” “నీకు పిచ్చా వెర్రా”? “నేను చావడానికిసిద్ధం. కానీ నాకు పాకిస్తానీ రక్తం వద్దు. రెండో షరతు. నాకు సర్జరీ చేసేటప్పుడు మీరు నా పక్కన ఉండాలి.” పాకిస్తానీ సర్జన్ మేజర్ మహ్మద్ బషీర్ ఆయనకు శస్త్ర చికిత్స చేశాడు. కాలు మెరుగుపడింది. కానీ కార్డొజో కథ అయిపోలేదు. కార్డోజో తాను సైన్యంలోనే పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. కృత్రిమ కాలును అమర్చుకున్నాడు. ఆ కాలితో నడక మొదలుపెట్టాడు. క్రమేపీ అది పరుగుగా మారింది. ఆ తరువాత కొండలు ఎక్కడం నేర్చుకున్నాడు. ఎత్తుల మీద నుంచి దూకడం నేర్చుకున్నాడు. రెండు కాళ్లు ఉన్న సైనికులు చేసే ప్రతి పనినీ చేయడం మొదలుపెట్టాడు. యుద్ధంలో చేసే పనులను చేయడం ప్రారంభించాడు. కానీ పై అధికారులు ఒంటికాలు సైనికుడు యుద్ధానికి పనికిరాడని అన్నాడు. కావాలంటే పోటీ పడతానని చెప్పాడు. పై అధికారికి కోపం వచ్చింది. “ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా? శత్రువుకి దొరికిపోతే ఏం చేస్తావు?” అన్నాడు అధికారి. “నేను శత్రువుకి దొరకను.” అన్నాడు కార్డొజో. “పోటీలో పాల్గొంటే నేను నిన్ను అరెస్టు చేస్తాను జాగ్రత్త” అన్నాడు అధికారి. “సర్… మీరు నేను పాల్గొన్న తరువాతే అరెస్టు చేయగలుగుతారు. కాబట్టి ముందు నన్ను పోటీ పడనీయండి. ఆ తరువాత అరెస్ట్ చేయండి.” అన్నాడు కార్డొజో ధీమాగా. చివరికి అధికారి ఒప్పుకున్నాడు. పరుగు పందెం మొదలైంది. అందులో రెండు కాళ్లున్న ఏడుగురు ఆఫీసర్లను దాటి ముందుకు దూసుకెళ్లాడు కార్డోజో. అధికారి కార్డొజో భుజం పై ఆప్యాయంగా చెయ్యి వేశాడు. “వెల్ డన్ సర్…” అన్నాడు అమిత గౌరవంతో. ఆ తరువాత ఆ అధికారి సైన్యంలో ఉన్నతాధికారులు కార్డోజో పేరును అప్పని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ రైనాకి సిఫార్సు చేశాడు. అతని పట్టుదలను చూసిన జనరల్ ఆయనకు ఒక బెటాలియన్ కమాండర్ గా నియమించాడు. రక్షణ శాఖ అధికారులు అడ్డం పడ్డారు. “కుంటివాడు బెటాలియన్ ను కమాండ్ చేయడం ఏమిటి” అని కొర్రీలు పెట్టారు. కానీ కార్డోజో పట్టుదల ముందు అభ్యంతరాలు ఆవిరైపోయాయి. కార్డోజో యుద్ధ భూమిలో, శత్రువు స్థావరాలకు ఛాతీ ఎదురొడ్డి కశ్మీర్ లోయలో పనిచేశారు. మేజర్ జనరల్ గా రిటైరయ్యారు. భారత సైన్యంలో వైకల్యాన్ని జయించి అత్యున్నత స్థాయికెదిగిన మొట్టమొదటి మేజర్ జనరల్ ఆయనే. ఆయన తరువాత మరో ముగ్గురు యుద్ధంలో కాళ్లు పోయిన అధికారులు అత్యున్నత స్థాయికి ఎదిగారు. అందులో ఒకరికి రెండు కాళ్లూ లేవు. రిటైర్ అయిన తరువాత కార్డోజో సైన్య చరిత్ర పై పరిశోధనలు చేశారు. పుస్తకాలు వ్రాశారు. ఆయన ఎప్పుడూ నాలుగు మాటలు చెప్పేవారు. అవిః ఉన్నది ఒకటే జీవితం. పూర్తిగా జీవించు. ఉన్నది ఇరవై నాలుగు గంటలు… క్షణం తీరిక లేకుండా గడుపు. ఎప్పటికీ పట్టు సడలించకు.   (మూలం ...  రాకా సుధాకర్ )...
 • ఆమె ఒక మామూలు పేదింటి మహిళ.అయితే సమస్యలపట్ల స్పందించే గుణం ఉంది ..అదే  ఆమె ప్రత్యేకత. అదే  ఎందరో మహిళల జీవితాలను మలుపు తిప్పింది. ఎన్నో సమస్యల పరిష్కారానికి పూనుకునేలా చేసింది.  ఆమె పేరే కళావతి రావత్. ఇపుడు దేశానికి కావాల్సింది ఇలాంటి మహిళలే. ఇంతకీ ఎవరీ కళావతి రావత్.   ఉత్తరాఖాండ్‌కు చెందిన కళావతి దేవీ రావత్‌. నిరుపేద కుటుంబంలో పుట్టింది. అయినా ఆ పేదరికాన్ని ఆమె ఎప్పుడు ఆటంకంగా, సిగ్గుగా భావించలేదు. 1980 లో కళావతి  వివాహం చేసుకుని చమోలిలోని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లింది. అది ఒక కొండ ప్రాంతం. అక్కడ విద్యుత్తు లేదు. చీకటి పడిందంటే అక్కడి ప్రజలు భయపడేవారు. విద్యుత్  లేని ఆ గ్రామాన్ని చూసి 17 ఏండ్ల కళావతి  కొంత నీరస పడింది.  అక్కడ శ్రద్ధలేని ప్రభుత్వ అధికారులను చూసి ఆశ్యర్యపోయింది. ఆ ప్రాంతంలో  స్త్రీలు పురుషులు చెప్పినరీతిలోనే నడవాలి. అది పురుషాధిక్య ప్రాంతం. ఆటంకాలు ఎన్ని ఎదురైనా  గ్రామాన్ని అభివృద్ధిపథంలో నడిపించి విజయాన్ని సాధించింది. మొదట గ్రామంలో కొంతమంది మహిళలను ఒక గ్రూపును  తయారుచేసింది. అందరు కలిసి ప్రభుత్వ అధికారులను కలవడానికి జిల్లా కేంద్రానికి వెళ్లారు. వారందరూ కరెంటు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ అధికారులకు వివరించారు.  కరెంటు కావాలని డిమాండ్‌ చేశారు. కానీ వాళ్లలో ఎటువంటి స్పందనా లేదు. అది కొండ ప్రాంతం కాబట్టి  అధికారులు 25 కిమీ దూరంలో వైర్లు, పోల్స్‌ను ఉంచారు. కానీ ఆ గ్రామానికి కరెంటు కనెక్షన్లు ఇవ్వలేదు. అందుకే తనే నడుం బిగించింది. కొంతమంది మహిళలతో కలిసి పోల్స్‌, వైర్లు తమ గ్రామానికి మోసుకుని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆమె మీద కోపంతో క్రిమినల్‌ కేసు పెట్టి జైలుకి పంపించారు. గ్రామంలోని మహిళలకు ఈ విషయం తెలియడంతో ఆమె నొక్కదాన్నే ఎందుకు జైల్లో పెట్టారు. మమ్మల్ని కూడా అరెస్టు చేయాలని మహిళలలు ఆందోళన చేశారు. దాంతో అధికారులు కళావతిని విడిచిపెట్టి ... పవర్‌గ్రిడ్‌ను ఏర్పాటుచేసి కొద్ది రోజుల్లోనే ఆ గ్రామానికి కరెంటు అందించారు. దీంతో గ్రామం మొత్తం కళావతిని అభినందించింది.  కళావతి ఏ పని నైనా  మధ్యలో వదిలేది కాదు.  కళావతి మొదటినుంచి అంతే...  1970లో చిప్కో ఉద్యమం  వచ్చింది. ఇది ఉత్తరాఖాండ్‌ ప్రజల్లో ఎంతో కదలిక తెచ్చింది. అడవుల నరికివేతకు వ్యతిరేకంగా, అడవులను రక్షించుకోవడానికి చెట్లను కౌగిలించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. దీంతో ప్రభావితమయ్యే కళావతి కలప అక్రమ రవాణా చేస్తున్న ముఠాను కూడా పట్టించింది. ఒక రోజు కళావతి, ఇంకొక మహిళ కలిసి పశువులకు మేత తీసుకురావడానికి  అడవుల్లోకి వెళ్లారు. అక్కడ ఒక ముఠా  చెట్లను నరకడం గమనించారు. అది చూసి వాళ్లు చెట్లను నరకొద్దని బతిమిలాడారు.  కానీ  ఆమె మాటలు వారు పట్టించుకోలేదు.  పైగా ఆ ముఠా వాళ్లను కొట్టింది. చంపేస్తామని బెదిరించింది.  దీంతో కళావతి మరి కొందరు మహిళలు  కలిసి జిల్లా కేంద్రం లో 12 గంటల పాటు అడవుల నరికివేతకు వ్యతిరేకంగా ధర్నా చేశారు.  అపుడు  ప్రభుత్వ అధికారులు స్పందించారు.  తర్వాత అడవులను సంరక్షించుకోవడానికి మహిళలందరు  స్థానిక పంచాయత్‌ ఎన్నికలను  నిర్వహించాలనుకున్నారు. పంచాయతీ ఎన్నికలలో మహిళలకు కూడా స్థానం కల్పించాలని ఆమె కోరారు. కానీ అది పురుషాధిక్య ప్రాంతం కనుక తన భర్తతో సహా పురుషులెవరూ ఒప్పుకోలేదు. అయినా ఆమె పట్టువిడవకుండా పోటీ చేసి గెలుపొందారు. గ్రామం లో  స‌మ‌స్య‌గా  మారిన మ‌ద్య‌పానాన్ని అరిక‌ట్టేందుకు  సారా త‌యారు చేస్తున్న ప్రాంతాల‌కు తోటి మ‌హిళ‌ల‌తో క‌లిసి వెళ్లి ఆ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో  ఆమెకు కొన్ని వ‌ర్గాల నుంచి బెదిరింపులు వ‌చ్చాయి. అయినా ఆమె భ‌య‌ప‌డ‌లేదు. మెల్లగా  పురుషుల్లో కూడా మార్పు వ‌చ్చింది.  మ‌హిళ‌ల‌ను అన్ని ప‌నుల్లోనూ భాగ‌స్వాములు చేయడం ప్రారంభించారు.  క‌ళావ‌తి మ‌హిళలు సొంతంగా ఎదిగేలా వారికి త‌గిన ఉపాధి కార్య‌క్ర‌మాల‌ను క‌ల్పించ‌డం కోసం కృషి చేసింది. అడ‌విలో చెట్ల‌కు పండే పండ్లు, మొక్క‌ల నుంచి వ‌చ్చే సుగంధ ద్ర‌వ్యాల‌ను సేక‌రించి మార్కెట్‌లో అమ్ముతూ లాభం పొందేలా మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇప్పించింది. దీంతో ఆ గ్రామం ఇప్పుడు ప్ర‌గ‌తి ప‌థంలో దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలో క‌ళావ‌తి రావ‌త్‌కు 1986లో ఇందిరా ప్రియ‌ద‌ర్శిని అవార్డు కూడా వ‌చ్చింది. ఆ తర్వాత ఆమెకు అనేక అవార్డులు, రివార్డులు కూడా వ‌చ్చాయి. అయిన‌ప్పటికీ ఆమెకు ఒకింత గ‌ర్వం కూడా లేదు. చూస్తే ఓ సాధార‌ణ మ‌హిళ‌లాగే క‌నిపిస్తుంది. ఇంత‌కీ క‌ళావ‌తి రావ‌త్ ఎంత వ‌ర‌కు చ‌దువుకుందో తెలుసా..? ఆమెకు అస్స‌లు చ‌దువే రాదు. అవును... నిజ‌మే. ఇలాంటి మహిళలు గ్రామానికి ఒకళ్ళు ఉంటే చాలు .. దేశం దూసుకు పోతుంది వృద్ధిపధంలో ...
 • (ఇలపావులూరి మురళీ మోహన రావు) ...........    ఈ రోజుల్లో ఒక్క అయిదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆర్ధిక స్థితిగతుల్లో ఎంత ఊహించని మార్పులను చూస్తున్నాము? మరి ఏకధాటిగా ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడి పరిస్థితి ఏ రకంగా ఉండాలి? రెండు దశాబ్దాల ఎమ్మెల్యే పదవిని అనుభవించిన తరువాత కూడా కనీసం సొంత వాహనం, ఇల్లు లేని, ముతక ఖాదీ వస్త్రాలు, స్లిప్పర్స్ మాత్రమే ధరించే ఎమ్మెల్యేలు కూడా ఉంటారు అంటే నమ్మగలమా? అవును.. నమ్మాల్సిందే.. వావిలాల గోపాలకృష్ణయ్య అంటే ఒక వ్యక్తి కాదు. అనేక ఆశయాల సముదాయం. స్వాతంత్ర సంగ్రామం నుంచి ఆంధ్రోద్యమం వరకూ, శాసనాధిక్కారం, ,గ్రంథాలయోద్యమం , శాసనసభలనుంచి అంతర్జాతీయ సమావేశాలవరకు బహుముఖంగా తన సేవలను విస్తరించి ప్రజలకోసమే జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు వావిలాల. 1930 లోనే ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని అరెస్ట్ అయిన వావిలాల ఆ తరువాత పలుమార్లు జైలు జీవితాన్ని అనుభవించారు. ఆయన తొలుత చేరింది కమ్యూనిస్ట్ పార్టీ లో. కానీ, ఈ దేశానికి, దేశప్రజల మనోభావాలకు కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు సరిపోవు అని డెబ్భై ఏళ్ళక్రితమే గ్రహించిన దార్శనికుడు ఆయన. ఆ తరువాత ఏ రాజకీయ పార్టీలో చేరకుండా, 1952 నుంచి 1972 వరకూ, అనగా ఇరవై ఏళ్లపాటు స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో నిలబడి విజయం సాధించిన యోధుడు. ఆ రెండు దశాబ్దాల పాటు ఆయన ప్రతిపక్షం లోనే గడిపారు. ఆయన మాట్లాడుతుంటే, శాసనసభ మొత్తం నిశ్శబ్దం రాజ్యమేలేది. 1967 ఆయన పోటీ చెయ్యడానికి అయిన ఖర్చు కేవలం నాలుగువేల రూపాయలు మాత్రమే అంటే ఈ తరం వాళ్ళు అస్సలు నమ్మలేరు. ఆయన రైతు కాదు. కానీ రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. కేవలం పుస్తక పఠనం ద్వారా ప్రపంచం లోని ఏ విషయం మీద అయినా సాధికారికంగా మాట్లాడే ప్రజ్ఞ సంపాదించారు. అనేక గ్రంధాలు రచించారు. అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా, రామానంద తీర్ధ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా, మద్యనిషేద కమీషన్ అధ్యక్షులుగా పని చేశారు. ఆ సమయం లో ఒక్క రూపాయి కూడా వేతనం తీసుకోలేదు. ప్రజలసొమ్మును వాడుకునే హక్కు లేదు అనేది ఆయన సిద్ధాంతం. మంత్రులు కూడా వేతనాలు తీసుకోకూడదు. అది కేవలం ప్రజాసేవ మాత్రమే అని నొక్కి చెప్పేవారు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా, అంగబలం లేకుండా కూడా దేశసేవ చెయ్యవచ్చు అని నిరూపించిన మహానుభావుడు వావిలాల. 2000 సంవత్సరం ప్రాంతం లో అనుకుంటాను. స్వాతంత్ర సమరయోధులకు హైదరాబాద్ లో సన్మానం చేసింది చంద్రబాబు ప్రభుత్వం. చంద్రబాబు ముఖ్య అతిధి, సన్మాన కర్త. చాలామందికి సన్మానం చేసారు చంద్రబాబు. వావిలాల వంతు వచ్చింది. అప్పుడు వావిలాల మైకు తీసుకుని :::: "చంద్రబాబు మద్యనిషేధానికి తూట్లు పొడిచారు. మద్యనిషేధం కోసం మేము ఎంతో కృషి చేసాము. ఇవాళ చంద్రబాబు మద్యం వ్యాపారులతో లాలూచి పడి మద్యాన్ని వరదలుగా పారిస్తున్నారు. దేశం బాగుపడాలంటే ముందు మద్యాన్ని నిషేధించాలి. చంద్రబాబు మద్యాన్ని నిషేధించేంతవరకూ నేను ఈ సన్మానం స్వీకరించను" అని వేదికమీదినుంచి విసవిసా దిగిపోయారు. చంద్రబాబు తో సహా వేదికమీద ఉన్నవారి ముఖాలు దిబ్బరొట్టెల్లా మాడిపోయాయి. అవీ వావిలాల ఔన్నత్యం, ధైర్యం, సాహసం, వ్యక్తిత్వం! ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు???...
 •   ( సుశ్రీ  ) .........  అతనికి  అపుడు  పన్నెండేళ్ళ వయసు .  అప్పుడప్పుడే బుద్ది వికసిస్తుంది. ప్రపంచాన్ని గమనించడం, గమనించి అనుకరించడం అలవాటు చేసుకుంటున్నాడు. అతడి బంధువొకడు సిగరెట్ పీల్చేవాడు. అతన్ని చూసి ఈ పిల్లవాడు కూడా సిగరెట్ తాగడం నేర్చుకున్నాడు. సిగరెట్ నచ్చలేదు. కానీ గుప్పు గుప్పున, పొగ రింగులు వదలడం మాత్రం మహా సరదాగా ఉండేది. కానీ పెద్ద చిక్కు వచ్చిపడింది. పెద్దల ముందు సిగరెట్ తాగడం అసంభవం. అలాంటప్పుడు సిగరెట్ కొనడానికి డబ్బు ఎలా అడగటం? ఎవరో అతనికి ఫలానా చెట్టు కాడ కాల్చి పొగపీలిస్తే అచ్చు సిగరెట్ తాగినట్టుంటుందని చెప్పాడు. చవకబేరం కదా అని ఆ పనీ చేశాడు. కానీ సిగరెట్ లోని మజా దొరకలేదు. దాంతో ఇంట్లోని నౌకర్ల జేబులు తడిమి హస్తలాఘవం ప్రదర్శించడం మొదలుపెట్టాడు. హఠాత్తుగా ఒక రోజు ఆ అబ్బాయిని ఎవరో కుదిపినట్టయింది. దొంగచాటుగా సిగరెట్ తాగడం ఎందుకు? దాని కోసం దొంగతనం ఎందుకు? అనుకున్నాడు. .. "ఛీ... ఇదేం బ్రతుకు" అనుకుని ఉమ్మెత్త గింజలు తిని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కొన్ని గింజల్ని తెచ్చి పొడిగా చేసి తినడానికి సిద్ధమయ్యాడు. కానీ ధైర్యం చాలలేదు. చనిపోవడం అన్న ఆలోచన అతడిని భయపెట్టింది. ఖర్మగాలి చావకపోతే ఏమవుతుందో అన్న ఆలోచన ఇంకా భయపెట్టింది. చివరికి ఆత్మహత్యా యత్నాన్ని విరమించుకున్నాడు. సిగరెట్ జబ్బు వదిలింది. దొంగతనమూ మానేశాడు... ఆ కుర్రాడికి చాపల్యం పోలేదు. చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉన్నాడు. అలా అలా అవసరాలకని ఒక బంధువు దగ్గర అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చడం కష్టమైపోయింది. అమ్మనీ, నాన్ననీ అడగడానికి ధైర్యం చాలలేదు. చివరికి ఒక ఆలోచన వచ్చింది. ముంజేతికి ఉన్న బంగారు కడియంలో ఒక ముక్క ఇచ్చి అప్పు తీర్చేస్తే పోలా... అనుకున్నాడు. అదే చేశాడు. అప్పయితే తీర్చాడు... కానీ అతనిలో అంతర్మథనం మొదలైంది. "అయ్యో... ఎంత తప్పు చేశాను... నా పాపానికి నిష్కృతి లేదు" అని వేదన చెందాడు. చివరికి తండ్రి కాళ్ల మీద పడి జరిగిందంతా చెప్పేయ్యాలని, కన్నీళ్లతో ఆయన కాళ్లు కడిగేయాలని అనుకున్నాడు. కానీ తండ్రి ఎదుటపడే ధైర్యం లేకపోయింది. అటు పశ్చాత్తాపం... ఇటు పిరికితనం.... ఈ రెండూ అతడిని దహించివేయసాగాయి. చివరికి జరిగిందంతా ఒక కాగితం మీద రాసి, తను మరెన్నడూ తప్పుచేయనని, సన్మార్గంలో నడుస్తానని వాగ్దానం చేశాడు. ఆ లేఖను తండ్రి పాదాల  దగ్గర ఉంచి తలుపు చాటున నిలుచున్నాడు. అప్పుడు తండ్రికి జ్వరం... మంచం పట్టి ఉన్నాడు. ఆయన ఆ లేఖను చూసి, నెమ్మదిగా ఎలాగోలా ఓపిక తెచ్చుకుని దాన్ని ఆసాంతం చదివాడు. ఆయన కళ్లలో నీరు ఉబికింది. అది జలజలా ఉత్తరంపై రాలింది. ఆయన కళ్లు రెండూ మూసుకున్నారు. ఆ లేఖను ముక్కముక్కలుగా చించేశారు. పిల్లవాడిని ఆయన ఒక్కమాటా అనలేదు. ఆ పిల్లవాడు అవాక్కయ్యాడు. తండ్రి ఒక్క మాటా అనకపోవడం అతడిని తీవ్రంగా బాధించింది. గుండెలోతుల్లో గునపం గుచ్చినంత వేదన కలిగింది. తండ్రి ఎంత కలత చెందారో అతను కళ్లారా చూశాడు. ఆ మౌన వేదన ఆ పిల్లాడిని మార్చేసింది. పెద్దవాడయ్యాక అతడు తన ఆత్మకథలో ఇలా వ్రాసుకున్నాడు. "తన తప్పుల్ని శుద్ధమైన అంతఃకరణంతో పెద్దల ముందు ఒప్పుకుని, ఆ తప్పులను మరెన్నడూ చేయకపోవడమే నిజమైన ప్రాయశ్చిత్తం" ఆ కుర్రాడి పూర్తి పేరు 'మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.'...
 • కంప్యూటర్లు రాని కాలంలో .... కమ్యూనికేషన్లు లేని రోజుల్లో .... ఉల్లాల్ అన్నా, చౌతా అన్నా గుర్తొచ్చేది ఒకే ఒక్కరు... ఆమె పేరు అబ్బక్క...... అవును ... ఆ కాలంలో పేర్లకు ఇంకా ఫ్యాషన్ బురద అంటలేదు. అబ్బక్క... మనసు గూగుల్ మ్యాప్ లో కర్నాటక తీరంలోని రేవు పట్టణం ఉల్లాల్ కి జూమ్ అవండి. ఉల్లాల్ వెళ్లాక టెమ్ మెషీన్ లో నాలుగొందల ఎనభై ఎనిమిదేళ్లు వెనక్కి వెళ్లండి. అప్పటి తీరాలను, అప్పటి ఊళ్లను, అప్పటి రాచరికాలను, అప్పటి యుద్ధాలను కళ్లముందు బొమ్మకట్టించుకొండి... అప్పుడు సాక్షాత్కరిస్తుంది అబ్బక్క. .... తుళునాడు కి రారాజ్ఞిగా పోర్చుగీసు దోపిడీదారులను పదేపదే మట్టికరిపించిన పోరాటయోధురాలు అబ్బక్క మహాదేవి..... కత్తియుద్ధం, గుర్రపుస్వారీలతో పాటు రాజకీయ వ్యవహారాలు, దౌత్యనీతిలో దిట్టగా వెలుగొందిన ధీర అబ్బక్క మహాదేవి..... అటు కేరళ జామొరిన్ పాలకుడు, ఇటు మంగుళూరు మహరాజులు, మరోవైపు అహ్మద్ నగర్ నవాబులను కలుపుకుని ఒక స్వదేశ రక్షణ త్రికోణశక్తిని తయారుచేసి, ఆ త్రికోణానికి బిందువుగా నిలిచిన భారత భద్రతా శ్రీచక్రం.... అబ్బక్క మహాదేవి...... 1525 లో మూడబిద్రి లో పుట్టిన అబ్బక్క 'చౌతా' కుటుంబానికి చెందిన జైన మతస్తురాలు. వంశాచారం ప్రకారం మామ తిరుమల రాయని రాజ్యానికి రాణి అయింది ఆమె. జైన మతానుయాయురాలైనా రంగులు మారే రుద్ర శిలతో తీర ప్రాంతాన ఒక అద్భుత శివలింగాన్ని ఏర్పాటు చేసి, గుడి కట్టించింది ఆమె. జనరంజక పరిపాలన, దూరదృష్టి, సమర్థ నేతృత్వాలతో ఆమె రాజ్యం అలరారుతూండేది. ఉల్లాల్ మసాలాదినుసుల ఎగుమతికి పేరెన్నిక కన్న ఊరు. ఆమె భర్త లక్ష్మణప్ప మంగుళూరుకి రాజు. కానీ రుద్రమదేవిలాగానే అబ్బక్కకీ, ఆమె భర్తకీ పడిరాలేదు. ఆమె జైనమతస్తురాలు. భర్త శైవ మతావలంబి. (రుద్రమదేవి విషయంలో ఇది తిరగబడింది. ఆమెది శైవం. భర్తది జైనం) అవి భారత్ పై తెల్లయూరోప్ నల్లమేఘమై ముసురుకుంటున్న రోజులు... పోర్చుగీసు వాళ్లు పడమటి తీరాన భారత సూర్యుడిని దిగముంచేందుకు యత్నిస్తున్నారు. అప్పటికే 1510 నాటికి గోమాంతక్ భూమి వారి వశమైంది. (గోమాంతక్ అన్నది పలకలేక గోవా అన్నారు. పోర్చుగీసులు పోయినా మనం మాత్రం గోవా అనే అంటున్నాం. ). ఇక రత్నాగిరి, కొంకణ తీరాలపై పట్టు దొరికింది. ఆ తరువాత వారి కన్ను కేరళ సాగర తీర రాజు జామొరిన్ పై బడింది. జామొరిన్ ను వశపరచుకునేందుకు వెళ్తూ వెళ్తూ మంగుళూరును మట్టికరిపించారు. అది 1525. ఆ తరువాత ముందుకువెళ్లబోతే అబ్బక్క రాజ్యం తుళునాడు అడ్డం ఉంది. "ఇదెంత పని... ఆడదేం చేస్తుంది" అనుకున్నారు పోర్చుగీసువాళ్లు...ఉల్లాల్ మసాలా దినుసుల ఘాటు నసాళానికంటుతుందన్నది వారికి తెలియలేదు. అబ్బక్క దెబ్బకు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. 1555 లో అడ్మిరల్ డాం వారో డా సిల్వానియా నాయకత్వంలో మళ్లీ దాడి చేశారు. మళ్లీ మట్టికరిచారు. 1568 లో మూడో సారి పో పీక్సోరో అనే సేనాని నాయకత్వంలో మళ్లీ దాడి చేశారు. ఈ దాడిలో ఉల్లాల్ రాజభవనం వారి చేజిక్కింది. అబ్బక్క మహాదేవి ఒక మసీదులో తలదాచుకోవాల్సి వచ్చింది. కానీ అదే రాత్రి రెండు వందల మంది సైనికులతో ఆమె బుడతకీచుల (పోర్చుగీసులకు తెలుగోడు పెట్టుకున్న పేరు) పై విరుచుకుపడింది. ఈ దాడిలో జనరల్ పీక్సోటోను కత్తికో కండగా చేసింది. ఆ తరువాత మంగుళూరు కోటపై దాడి చేసి అడ్మిరల్ మాస్కరెన్హస్ ను పైలోకాలకి పంపించింది. ఏడాది పాటు ఆమె మంగుళూరు కేంద్రంగా పరిపాలించింది. కానీ భర్త లక్ష్మణప్ప పోర్చుగీసులతో కలిసి పోయాడు. పోర్చుగీసులు మళ్లీ ఆమెపై యుద్ధం జరిపారు. వారిని ఎదుర్కొనేందుకు ఆమె జామొరిన్, అహ్మద్ నగర్ రాజులతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోరాటం చేసింది. 1570లో చివరికి పోర్చుగీసులదే పైచేయి అయింది. అబ్బక్క రాణి పోర్చుగీసు చెరసాల పాలైంది. జైల్లో ఉంటూ కూడా ఆమె తలవంచలేదు. అలాగే పోరాడుతూ పోరాడుతూ ప్రాణాలు వదిలింది. అబ్బక్క కథ కన్నడిగులకు యక్షగాన గాథ అయింది. పౌరుషపు పాట అయింది. పోరాటపు బాట అయింది. తుళునాడులో గళం గళం ఆమె పాట పాడింది. అబ్బక్క ఉల్లాల్ కోట, కట్టించిన రుద్రశివ మందిరం, పూజించిన జైన బాసాడి, తలదాచుకున్న మసీదు తీర్థస్థలాలయ్యాయి. తరతరాలుగా తీరనగరిని అబ్బక్క ఆవేశించింది. ఉల్లాల్ నగరం వెళ్తే ఫిరంగి పక్కన నిలుచుని సేనలను ప్రోత్సహిస్తూనో, గుర్రం పై కత్తి చేబూని సింహిణీనాదం చేస్తూనో అబ్బక్క రణభూమిలో తిరుగాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె కాంస్యవిగ్రహం నాలుగు వందల తొంబై మూడు ఏండ్ల కాలం నాటి పోరాటగాథ చెప్పేందుకా అన్నట్టు నగరం నడిబొడ్డున నిలుచుని ఉంటుంది. కేంద్రంలో వాజ్ పేయీ ప్రభుత్వం వచ్చాక 'అబ్బక్క' పేరిట తపాలా స్టాంపు విడుదలైంది. ఈ మధ్యే తీరంలో విదేశీ తిమిరంపై సమరం చేసిన అబ్బక్క పేరిట మన తీరరక్షణ దళం (కోస్టుగార్డు) ఒక నౌకను కూడా జలప్రవేశం చేయించింది. ఈ కథ చదివాక ఉల్లాల్ అంటే స్నేహా ఉల్లాల్, చౌతా అంటే సందీప్ చౌతాలు మాత్రమే కాక, అబ్బక్క రాణి కూడా గుర్తుకు వస్తే ఈ ఆర్టికల్ ఆశయం ఫలించినట్టే. ....  susri ...
 • పట్టుదల ..పరిశ్రమ  ఉంటే దేన్నైనా సాధించవచ్చు. ఈ ఫోటో లో కనిపించే పెద్దాయన పేరు దశరథ్ మాంఝి .  భీహార్ లో గయా వద్ద ఒక చిన్న పల్లెటూరిలో1934 లో పుట్టిన దశరథ్ మాంఝి కి కోపం వచ్చింది ... ఎవరి మీద?  కొండ మీద... ఎందుకు కోపం వచ్చింది? అడ్డంగా ఉన్నందుకు... అడ్డం పడుతున్నందుకు... అవును  కొండకు అటువైపు తన గ్రామం అత్రి ఉంది. కొండకు ఇటువైపు వాజరంగ్ గ్రామంలో తన పొలం ఉంది. పొలానికి వెళ్లాలన్నా, అడవిలో కట్టెలు కొట్టాలన్నా కొండను దాటాల్సిందే... చెమటలు కక్కాల్సిందే.. దశరధ్ భార్య ఫల్గుణి దేవి  రోజూ మధ్యాహ్నం భార్య ఆహారం తేవాలన్నా ఈ కొండ ఎక్కి రావాల్సిందే. ఒక రోజు ఆమె భోజనం తెస్తూండగా ఒక బండరాయి కాలికి తగిలి ఆమె పడిపోయింది.  ఆమెకు దెబ్బలు తగిలాయి. అన్నం ముంత పగిలిపోయింది. అందుకే ... దశరథ్ కి కోపం వచ్చింది. ఎవరి మీద?  కొండ మీద.  ఎందుకు కోపం వచ్చింది? అడ్డంగా ఉన్నందుకు... అడ్డం పడుతున్నందుకు... దశరథ్ ఊళ్లోకి వచ్చి గ్రామస్తులతో ఈ కొండను తొలిచి దారిని నిర్మిద్దాం అన్నాడు. "అసాధ్యం" అన్నారు అంతా.  దశరథ్ కోపం మాత్రం చల్లారలేదు. సుత్తి తీసుకున్నాడు. కొండరాళ్లను బద్దలు గొట్టడం మొదలుపెట్టాడు. పొలం పని, ఇంటి పని పోను మిగతా పగలంతా పగలగొట్టడమే పని. రాళ్ల కింద మంట పెట్టడం.... పగుళ్లు రాగానే వాటిని బద్దలుచేయడం ...ఇదే పని.... ఆ దశరథుడు పుత్రకామేష్టి చేసినంత నిష్ఠగా ఈ బీహారీ దశరథుడు "పత్థర్" కామేష్టి చేశాడు.  బండలు బద్దలయ్యాయి...కొండలు పిండి అయ్యాయి. చివరికి ...కొండ రెండుగా చీలి .... దశరథ్ కి దారి ఇచ్చింది. కిలో మీటర్ల దూరం చెరిగిపోయింది. ఇప్పుడు అత్రి, వాజరంగ్ ల మధ్య 360 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న దారి ఏర్పడింది.  దారి పొడవునా దశరథ్ చెట్టు నాటాడు. ఆ మొక్కలు పెరిగి మహావృక్షాలయ్యాయి. 55 కిలోమీటర్ల దారి 15 కిలోమీటర్లలో సర్ధుకుంది. కొండను తవ్వి దారిని దొరకబట్టడానికి దశరథ్ కి ఒకటి కాదు ... రెండు కాదు ... ఏకంగా 22 (1960-83) ఏళ్లు పట్టింది.  ప్రజలూ, ప్రభుత్వం దశరథ్ కి బ్రహ్మరథం పట్టాయి. అవార్డులు,రివార్డులు వచ్చాయి. మౌంటెన్ మాన్ గా పేరు పొందాడు. ప్రత్యక్షంగాను పరోక్షంగాను అతని కధ తో కొన్ని సినిమాలు తీశారు.  2007 ఆగస్టు 17 గాల్ బ్లాడర్ కాన్సర్ తో AIMS, న్యూ డిల్లీ లో మరణించేటప్పటికి అతని వయసు 72 ఏళ్ళు. వాల్మీకి శోకం శ్లోకమైంది.... దశరథ్ కోపం కొండదారి అయ్యింది. .... **** అయితే దశరథ్ చనిపోయేనాటికీ కోపం వస్తుండేది.  ఎవరి మీద? అసమర్థుల మీద. ఆత్మవిశ్వాస రహితుల మీద .... ఎందుకు కోపం వస్తుంది? అసాధ్యం, అసంభవం అని చేతులు ముడుచుకున్నందుకు ..... ఆత్మశక్తిపై అపనమ్మకం ఉన్నందుకు . ....   susri ...
 • అంగారక గ్రహం పై నీళ్లు,ఇనుము ఉందని 1500 యేళ్ళ క్రితమే  వరాహమిహిరుడు చెప్పాడు. ప్రస్తుతం మనదేశం నుండి ఇస్రో, అమెరికా నుండి నాసా అంతరిక్ష వీక్షణం చేస్తూ మన విశ్వం గురించి ఎన్నో విషయాలను కనుగొంటున్నారు. అయితే భారతదేశానికి చెందిన ఉజ్జయిని దేశస్థుడు ఖగోళ, గణిత శాస్త్రజ్ఞుడు, జ్యోతిష్కుడు అయిన వరాహమిహిర 1500 సంవత్సరాల క్రితమే విశ్వం గురించి, మన గ్రహాల గురించి తన పుస్తకంలో అంచనా వేసి రాసుకున్నాడు. ఆయన రాసిన వాటిని గురించి తెలుసుకున్న మన శాస్త్రవేత్తలు ప్రస్తుతం షాక్ కు గురవు తున్నారు. వరాహమిహిర చేసిన పరిశోధనల గురించి తెలుసుకుందాం. ఎవరీ వరహమిహిరుడు ? 499 సంవత్సరంలో కపిత అనే ప్రాంతానికి దగ్గరలో గల ఉజ్జయినిలో జన్మించాడు వరాహమిహిర. ఇతని తండ్రి ఆదిత్యదాసుడు సూర్యభగవానుడికి గొప్ప భక్తుడు. వరాహమిహిరుడు ఖగోళ మరియు గణిత శాస్త్రంలో నైపున్యుడు మరియు జ్యోతిష్కుడు. వరాహమిహిర సూర్య సిద్ధాంత’ పేరు మీదట 1515 లోతన మొదటి గ్రంథాన్ని రాశాడు. ఈ సూర్య సిద్ధాంత గ్రంధంలో నక్షత్ర మండలాలు, ఇతర సౌర గ్రహణాలు వాటి స్థానాలను గురించి వరాహమిహిర తెలిపాడు. ఇందులో , దేవతలు , రాక్షసులు, దేవుడు బ్రహ్మ సృష్టి నుండి గడచిన కాలానికి చెందిన రోజు ,రాత్రి, గ్రహాలు తూర్పు తరలించడానికి , నక్షత్ర విప్లవం సంవత్సరం పొడవు గురించి పేర్కొన్నారు. . భూమి వ్యాసం, చుట్టుకొలత, చంద్రుడి యొక్క రంగు ,చుట్టుకొలతలను ఈ పుస్తకంలో వరాహమిహిర తెలిపాడు. ఇంకా ఈ పుస్తకంలో అంగారక గ్రహం గురించి ఎంతో వివరంగా తెలిపాడు. ఆయన ఆ పుస్తకంలో అంగారక గ్రహంపై నీరు ...  ఇనుము ఉన్నట్లు అప్పుడే చెప్పారు. ఈ విషయాన్ని నాసా మరియు ఇస్రో బహిర్గతం చేశాయి. ఇంకా ఈ పుస్తకంలో సౌరవ్యవస్థలోని ప్రతి గ్రహం సూర్యునిచే సృష్టించబడింది అని వివరంగా చెప్పాడు. కొన్ని ఏళ్ళ క్రితం వరాహమిహిర రాసిన సూర్యసిద్ధాంత గ్రంధం  దొంగలించబడింది. అయితే ముందుచూపుగా కొందరు మేధావులు రికార్డ్ చేసుకోవడం వలన  పరిశోధనలకు ఉపయోగపడింది. ఇలా రికార్డ్ చేయబడిన ఆ గ్రంధంలోని విషయాలను చాలా భాషలలోకి అనువాదం చేయడం జరిగింది. నాసా అంగారక గ్రహంపై పరిశోధన చేస్తున్నప్పుడు, రిటైర్డ్ ఐపిఎస్ అయిన అరుణ్ ఉపాధ్యాయ్ వరాహమిహిర అంగారక గ్రహం గురించి రాసిన విషయాలను అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనం ఆయన అంగారక గ్రహంపై ఒక పుస్తకాన్ని రాశాడు. వరాహమిహిర జ్యోతిష్యంలోనూ తనదైన ప్రతిభను కనబరిచారు. ఆయన మొత్తం జ్యోతిష్యంలోని మూడు ముఖ్యమైన జ్యోతిష్యాలను రాశాడు. బృహత్ జాతక, లఘు జాతక, సమస సంహిత జాతక, బృహత్ యోగయాత్ర, యోగాయాత్ర, బృహత్ వివాహ పతల్,లగ్న వారాహి, కుతూహల మంజరి, దైవాంజ వల్లభ జ్యోతిష్యగ్రంధాలను ఆయన రాశాడు. వరాహమిహిర తనయుడు ప్రితుయాసస్ కూడా హిందూ జ్యోతిష్య గ్రంధాన్ని రాశాడు. ఈయన ‘హోరా సర’జ్యోతిష్యంలో జాతకం గురించి చాలా గొప్పగా రాశాడు. మధ్యయుగ బెంగాలీకి చెందిన ఖానా (లీలావతి) కవయిత్రి, జ్యోతిష్యురాలును వరాహమిహిర కోడలుగా చెబుతారు. courtesy... mana bharathdesam...
 • ఈ తరం యువతకు ఈ ఫొటోలో ఉన్న రాజు గారి  గురించి  అంతగా తెలియదు . హైదరాబాద్  అభివృద్ధి లో మహబూబ్ ఆలీఖాన్ పాత్ర  చాలానే ఉంది. హైదరాబాదు ను పరిపాలించిన అసఫ్‌జాహీ వంశపు ఆరవ నవాబు. ఈయన 1869 నుండి 1911 వరకు హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించాడు.మహబూబ్ ఆలీఖాన్ పరమత సహనము కలిగినవాడుగానూ, కళా పోషకుడుగానూ పేరుపొందినవాడు. పేదసాదల నిత్యపోషకుడిగా ప్రసిద్దుడు. అలీఖాన్ తండ్రి అఫ్జల్ ఉద్దౌలా క్రీ.శ. 1869 లో మరణించగా అతని మూడేళ్ళ వయసు గల కుమారుడు మహబూబ్ ఆలీ ఖాన్ ఆరవ అసఫ్ జాగా రాజ్యానికి వచ్చాడు. ఇతనికి సంరక్షకులుగా సాలార్ జంగ్ మరియు అమీర్ ఎ కబీర్ లను బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. పరిపాలనా దక్షుడైన సాలార్ జంగ్ తన పాలనా సంస్కరణలను కొనసాగించి క్రీ.శ. 1883 ఫిబ్రవరి 8వ తేదీన మరణించాడు. రాష్ట్ర పరిపాలన అస్తవ్యస్తమై ముల్కీ ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. అందువలన బ్రిటిష్ వారు సాలార్ జంగ్ కుమారుడైన మీర్ లాయిక్ ఆలీ ఖాన్ మరియు రాజా నరేంద్ర బహదూర్ లను సంయుక్త పాలకులుగా నియమించింది. మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ మేజర్ కావడం వలన 1884, ఫిబ్రవరి 5 వ తేదీన బ్రిటిష్ వైస్రాయ్ అయిన లార్డు రిప్పన్ స్వయంగా వచ్చి నిజాంకు అధికార లాంఛనాలు అందజేశాడు. అదే రోజు మీర్ లాయిక్ ఆలీ ఖాన్ రెండవ సాలార్ జంగ్ బిరుదుతో దివాన్ గా నియమించబడ్డాడు. రాజభాషగా పర్షియన్ భాష స్థానంలో ఉర్దూ భాషను ప్రవేశపెట్టాడు. ఇతని పాలనలోనే చంద్రపూర్ నుండి విజయవాడ వరకు, బ్రిటిష్ వారితో ఒప్పందం జరిగి, రైలు మార్గం నిర్మించబడింది. నిజాం ల కాలంలో మొదటిసారి ఒక తెలుగు వ్యక్తి దివాన్ గా నియమింప బడింది ఈయన కాలంలోనే . ఆ వ్యక్తి కృష్ణ ప్రసాద్. వరంగల్ లో టౌన్ హాలు , కలెక్టర్ బంగ్లా , డి ఐ జి బంగ్లా , అజాంజాహి మిల్లు , కాజీపేట రైల్వే స్టేషన్ , ఇరిగేషన్ ఆఫీస్ , వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్స్ , మామునురు విమానాశ్రయం వారి కాలంలో నిర్మించబడ్డవి. వారి  పరిపాలనా కాలంలో చాలా సార్లు వరంగల్ జిల్లాలోని , ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలోని పాకాల ఆటవి ప్రాంతానికి వేట కి వచ్చేవారు ... పరిపాలన 1869 – 1911 పట్టాభిషేకము ఫిబ్రవరి 5, 1884 జననం :ఆగష్టు 17, 1866 జన్మస్థలం :పురానీ హవేలీ, హైదరాబాదు మరణం : డిసెంబర్ 12, 1911 మరణస్థలం : ఫలక్‌నుమా ప్యాలెస్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1893 లో లెజిస్లేటివ్ కౌన్సిల్ (మంత్రి మండలి) ఏర్పాటు చేసాడు ఇతని కాలంలో ఈ క్రింది నిర్మాణాలు జరిగాయి 1874 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 1882 చంచలగూడ జైలు 1884 ఫలకనామ ప్యాలస్ (దీనిని వికారుద్దీన్ నిర్మించాడు) 1885 టెలిఫోన్ వ్యవస్థ 1890 నిజామియా అబ్జార్వేటరీ (సైన్స్ పరిశోధన కొరకు) ఇంకా మోండా మార్కెట్, జింఖానా గ్రౌండ్, పరేడ్ గ్రౌండ్, గోల్ఫ్ కోర్సులను నిర్మించి హైదరాబాద్ అభివృద్ధికి కృషిచేశాడు.   సరిగ్గా  ఈయన పట్టాభిషేకం జరిగి 133 ఏళ్లయింది.  .......  Aravind Arya Pakide...
 • "ఎన్టీఆర్‌ మాస్‌ లీడర్‌. చంద్రబాబు పక్కా రాజకీయ నాయకుడు. బాబుది హైటెక్‌ పాలన.  భారతదేశంలో లక్షా 20 వేల గ్రామాలున్నాయి. గ్రామ పునాదిగా ఎకానమీని తీసుకుంటే ఏ పాలకుడి పాల నైనా మంచిగా ఉంటుంది. అజ్ఞాతంలో ఉన్నప్పుడు పులివెందులకు వెళ్లి వైఎస్‌ రాజారెడ్డికి వ్యతిరేకంగా పాటలు పాడాను .  వైఎస్‌ పిలిపించుకుని చాయ్‌ ఇచ్చి మరీ బాగున్నావా అన్నారు. నన్నూ, నా పాటనూ చాలా ఇష్టపడ్డారు. తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు కొట్లాడి మరీ నాకు రక్షణ కల్పించారు.  గద్దర్‌ ప్రజల గాయకుడు. పేదల కష్టాల గురించి పాటలు రాస్తాడు. గద్దర్‌ ఒక మాన్యుమెంట్‌ లాంటి వాడు.  ఆయన్ని మనం కాపాడుకోవాలి"  అన్నారు. ఇంకా  తెలంగాణ ఉద్యమం ...  కేసీఆర్ పాలన ఎలా ఉంది ?  ... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ... గ్రామాల్లో ప్రచారం చేయడం ...  గాయకుడిగా పరిణామ క్రమం ...   తదితర అంశాలపై గద్దర్ మనసు విప్పి మాట్లాడారు  ఈ ఇంటర్వ్యూ లో ... చూడండి  వీడియో.  vedeo courtesy... sakshi ...
 • ఈ ఫొటోలో కనిపించే పెద్దాయన పేరు ...జమునా ప్రసాద్‌ బోస్‌. కనీసం సొంత ఇల్లు కూడాలేని  మాజీ ప్రజాప్రతినిధి  ....   ప్రజాసేవకు ప్రతిరూపం అని చెప్పుకోవచ్చు.  92 ఏళ్ల వయస్సులోనూ ప్రతిఫలం ఆశించకుండా తన శక్తిమేర ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. రాజకీయాల్లో నిన్న గాక మొన్న చేరిన వారు కూడా కోట్లు వెనకేసుకుంటున్న రోజులివి.  నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి...రెండు సార్లు మంత్రిగా విధులు నిర్వహించిన వ్యక్తి ఆర్థిక స్థితి ఏ స్థాయిలో ఉండాలి!  పెద్ద బంగ్లా..  కార్లు ...మందీమార్బలం  ఉంటాయని భావించటం సహజం. కానీ...ఉత్తరప్రదేశ్‌కు చెందిన జమునా ప్రసాద్‌ బోస్‌ ను  చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పదు  కాన్పూర్‌కు 125 కి.మీ. దూరంలో ఉన్న బందా పట్టణం లో  ఓ సాధారణ వ్యక్తిగా రెండు గదుల అద్దె ఇంటిలో జీవనం సాగిస్తున్నారు ఆయన.  ఆ ఇంట్లో ఓ గోడకు వేలాడుతూ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌, వినోబా భావే చిత్రపటాలు... ఇంటి మధ్యలో పట్టె మంచం ఇవే ఆయన  ఆస్తులు. వయోభారం వల్లనేమో కాస్త వినికిడి శక్తి తగ్గింది. దగ్గరకెళ్లి కాస్త పెద్దగా మాట్లాడితే కాని వినపడదు. ఈ వయస్సులోనూ ఆయన ప్రజలకు సాయం చేస్తూనే ఉంటారు.  బందా సమీపంలోని ఖిన్నినాకా గ్రామానికి చెందిన జమునా ప్రసాద్‌ చిన్నతనంలోనే సోషలిస్టు ఉద్యమంలో చురుకైన పాత్ర  పోషించారు.  సుభాష్‌ చంద్రబోస్‌ ఆయనకు స్ఫూర్తి. పేద ప్రజల హక్కుల సాధన కోసం కృషి చేసిన జమునా ప్రసాద్‌ను ప్రజలు అభిమానంగా బోస్‌ అని పిలుచుకునే వారు. చివరకు బోస్‌ అతని పేరులో భాగమైంది. 1962, 1967 లోక్‌సభ ఎన్నికల్లో, 1969లో అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూసిన బోస్‌ ఆ తర్వాత వరుసగా నాలుగు మార్లు  అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977, 1989లలో రాష్ట్ర మంత్రిగా పంచాయితీరాజ్‌-గ్రామీణాభివృద్ధి, పశు సంవర్థక-మత్స్య శాఖల బాధ్యతలను నిర్వహించారు. ఇక వారసత్వంగా వచ్చిన ఇంటిని కూడా జమునా ప్రసాద్‌.. సోదరి వివాహం కోసం విక్రయించారు. జమునా ప్రసాద్‌ భార్య చాలా ఏళ్ల క్రితమే చనిపోయారు. ముగ్గురు కుమారులు బతుకుదెరువు కోసం ఎక్కడికెక్కడికో వెళ్లి జీవిస్తున్నారు. తండ్రి బాగోగులు అంతగా పట్టించుకోరు.  ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు .  పింఛనుగా వచ్చే డబ్బు నుంచే మందులు కొనుగోలు చేయగా మిగిలినవి ఇంటి ఖర్చులకు వినియోగించుకుంటున్నారు.  ప్రస్తుత తన పరిస్థితికి ఆయన ఏమి విచారించడం లేదు. ఆనందంగానే ఉన్నారు. అంతకుముందు కుటుంబ సభ్యులు  ఆర్ధిక పరిస్థితి కోసం  ఏదైనా  చేసి ఉండాల్సింది అన్నపుడు కూడా నవ్వి ఊరుకునేవారట. ...
 • అశ్వద్ధామ ఇంకా బతికే ఉన్నాడా ? ఇది నిజమేనా ??  లేక కల్పితమా ? కేవలం ఆయనకున్న శాపాన్ని అనుసరించి కథలు  ప్రచారంలో కొచ్చాయా ?  అసలు కథ లోకి వెళ్లేముందు అశ్వద్ధామ ఎవరో తెలుసుకుందాం.  అశ్వద్ధామ ద్రోణాచార్యుని కుమారుడు.  అశ్వద్ధామ కు ఆ పేరు ఎలా వచ్చింది ? దీని వెనుక ఓ చిన్న కథ ఉంది.  కృపాచార్యుని చెల్లెలైన కృపిని ద్రోణాచార్యునికిచ్చి వివాహం చేశారు . వారిద్దరికీ జన్మించిన కుమారుడే అశ్వద్ధామ . అశ్వద్ధామ జన్మించినప్పుడు గుర్రం లాగా అరిచాడట . అందువల్ల ఆ బాలుడికి " అశ్వద్ధామ " అని ఆకాశవాణి పేరుపెట్టడం జరిగిందని పురాణాలలో పేర్కొన్నారు. ఇతగాడు పాండవద్వేషి. కృష్ణుడి ద్వారా శాపం  పొందటం మూలానా ఇంకా అడవుల్లో తిరుగుతున్నాడని అంటారు.  వీటిపై కూడా పలు కథనాలు ఉన్నాయి.  నమ్మడం .. నమ్మకపోవడం  పక్కన బెట్టి  జస్ట్  తెలుసుకొండి అసలు విషయం ఏమిటో ? వీడియో  చూడండి ...  vedeo courtesy... eyecon facts...
 • వేటూరి పాటలు కొందరికి నచ్చక పోవచ్చు.   కానీ ఆయన పాటలు వేలమందిని అలరించాయి. లక్షలమందిని ఉర్రూతలూపాయి. అందులో సందేహమే లేదు.  "" వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఈ ఎడారి దారులలో ఎడద నేను పరిచానని కడిమి వోలె నిలిచానని ""అంటూ ఆయన లిఖించిన" మేఘసందేశం "ఎన్నేళ్ళు గడిచినా శతాబ్దాలు దాటినా ఆ పరిమళం గుబాళిస్తూనే ఉంటుంది . ‘ఆరేసుకోబోయి పారేసు’కున్న అల్లరి పాటకు తెలుగు ప్రేక్షకులతో ఈలలు, కేరింతలు, కేకలు వేయించిన ఘనత వేటూరి సుందరరామమూర్తిది. అదే సినిమాలో ఆయన ‘కోకిలమ్మ పెళ్లికి కోనంతా పందిరి’ వేసిన వైనం ఆ స్థాయి గుర్తింపునకు నోచుకుందా అంటే సందేహమే. జనామోదం అలానే ఉంటుంది మరి. ‘నిన్న మొన్న తుళ్లి తుళ్లి తూనీగల్లే ఎగిరిన పిల్లదానికొచ్చింది కళ, పెళ్లికళ’ అంటూ సుతారంగా, సున్నితంగా సంపెంగ రెక్కలతో సరాగమాడిన గీతర్షి ఆయన. 1974లో గీత రచయితగా పరిచయమైనా, ఆయన ఘన సినీ యానం మాత్రం అలా 1977లో ప్రారంభమైంది. ఒక్కసారి వెనక్కి చూస్తే, 1978లో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’ సుందరరామమూర్తి ప్రతిభకు నిలువెత్తు అద్దమైంది. ఆ తరువాత మూడు దశాబ్దాల పాటు ఆయన పాటల తేరు ఊరేగడానికి ఆ సినిమా ఓ రహదారి అయింది. పడికట్టు పదాల దొంతరలు వదిలేసి, ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక... ఏరు దారెటు పోతుందో ఎవరినీ అడగక...’ అంటూ ఒకింత వేదాంతంతో వేటూరి తానేమిటో ఆవిష్కరించుకున్నారు. ఇక అంతే... పదేళ్ల పాటు ఎన్నెన్ని సినిమాలకు ఆయన సింగిల్‌ కార్డు గేయ రచయితగా నిలిచారో లెక్క లేదు. చక్రవర్తి, ఇళయరాజా, కీరవాణి, రాజ్‌కోటి... ఎందరో సంగీత దర్శకులు ఏరి కోరి ఆయనే కావాలని తమ బాణీలకు పాటలు రాయించుకున్నారు.  కె. విశ్వనాథ్ నుంచి కె. రాఘవేంద్రరావు, ఎ. కోదండరామిరెడ్డి, శేఖర్ కమ్ముల, గుణశేఖర్‌ల దాకా ఎందరో దర్శకులకు ఆయన హాట్‌ఫేవరెట్. మూడు దశాబ్దాలకు పైగా ఆయన కలం అందించిన పాటలు దాదాపు 5,000 పైనే ఉంటాయని ఓ అంకెల అంచనా.  1970లలో సినిమా నిర్మాణంలో పెరిగిన వేగం, వ్యాపారాత్మక పాటల కోసం నిర్మాతలు రోజులూ వారాలూ ఎదురుచూసే ధోరణికి స్వస్తి చెప్పింది. అనుకున్నది తడవుగా సన్నివేశానికి అతికే పాటలు, ఇచ్చిన ట్యూన్‌కు అనుగుణంగా చెక్కిన పద సముదాయం గుబాళించే పాటలు వెంట వెంటనే రాయాల్సి వచ్చిన సంక్లిష్ట సంధిలో తన కోసం సిద్ధమైన సింహాసనాన్ని వేటూరి సరైన సమయంలో అధిరోహించారు. ట్యూన్ వినిపిస్తే అరగంటలో ఆయన ఫోనులోనే పాట వినిపించేవారని చెప్పుకుంటారు. ‘శంకరాభరణం’ లాంటి క్లాసిక్స్‌కి, ‘వేటగాడు’, ‘జగదేకవీరుడు - అతిలోకసుందరి’ వంటి ఫక్తు ఫార్ములా సినిమాలకు సమాంతరంగా సాహితీ గౌరవం కలిగిన పాటలు రాస్తూ, ఆయన తన ప్రతిభను ప్రపంచానికి స్పష్టం చేశారు.  ‘ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము...’ అని ఒక చేత్తో రాస్తున్న కాలంలోనే ‘ఆకుచాటు పిందె తడిసె..కోక మాటు పిల్ల తడిసె’ అంటూ యువతరానికి చక్కిలిగిలి పెట్టే పాటలు మరో చేత్తో రాసి చలాయించుకున్నారు. ‘అచ్చెరువున..విచ్చిన కన్నులతో’ రసహృదయుల్ని తన్మయానికి లోను చేశారు. అలవోకగా, అతి సుందరంగా మాటలతో ప్రయోగాలు చేసి పాటలల్లిన మాంత్రికుడు ఆయన. మైనా పిట్టలు ‘జిలిబిలి పలుకులు చిలిపిగ పలికిన’ సోయగాన్ని ఆయన ‘సితార’లో అక్షరబద్ధం చేస్తే ఇళయరాజా స్వరమాలిక కూర్చి అజరామరం చేశారు. ‘కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడినీడలు పడనీకే ఈ దేవత గుడిలో’అని లేబ్రాయపు ప్రియురాలికి ఆయన చేరవేసిన ‘గీతాంజలి’ ఎన్నటికీ సుమదళ సుకుమారమే. ‘ఎన్నెల్లుతేవే ఎదమీటిపోవే’ అంటూ ‘పంతులమ్మ’కు ఆయన శ్రుతి చేసిన పున్నాగపూల సన్నాయి సినీ సంగీత ప్రియుల వీనులకు విందు చేస్తూనే ఉంటుంది. అంతర్లీనంగా ‘వీణ వేణువైన మధురిమ’లా పల్లవిస్తూనే ఉంటుంది. ఆయనకే తెలిసిన ‘ఎడారి కోయిల’లు, ‘తెల్లారని రేయి’లు కోకొల్లలు. కడలి తరంగమంత జీవన విషాదాన్ని ‘బ్రతుకంటే మృతి కంటే చేదైన ఒక తీపి పాట...’ అంటూ సంక్షిప్తీకరించడం సుందరరామమూర్తి కంటే వేరెవరికి తెలుసు? ‘వేణువై వచ్చాను భువనానికి... గాలినై పోతాను గగనానికి’ అన్న జీవన క్రోడీకరణ ఆయనకే సాధ్యం. వెరసి ఒక గంధర్వ కవిత్వపు కుంచె భువిపై దిగి, 1936 నుండి 2010 దాకా 74 ఏళ్ల పాటు ‘వేదం’లా, ‘అణువణువున నాదం’లా, ‘పంచప్రాణాల నాట్యవినోదం’లా విలసిల్లి, ‘నిర్వాణ సోపానమధిరోహించిన అక్షరాలా అమృతమూర్తి వేటూరి సుందరరామమూర్తి. ఈరోజు స్వర్గీయ వేటూరి సుందరరామమూర్తి జన్మదినం సందర్భంగా ఆ మహా కవికి హృదయపూర్వక స్మృత్యంజలి.  ------  Nageswararao Kesiraju...
 • (సుశ్రీ )...........................................   నరీందర్ కుమార్ ఆ మ్యాపు మీదకు వంగి పరిశీలనగా చూస్తున్నాడు. అమెరికన్లు తయారు చేసిన కాశ్మీర్ మ్యాప్ అది.  “పాయింట్ 9842 …. ఇదిగో ఇక్కడుండి” అనుకున్నాడు మ్యాప్ లోని ఆ పాయింట్ పై వేలుంచి…. ఆ తరువాత ఈశాన్య దిశగా దృష్టిని పోనిచ్చాడు…. ఒక చోట ఆయన చూపులు ఆగిపోయాయి….కళ్లు పెద్దవయ్యాయి…. ఆశ్చర్యం…. ఆ తరువాత కోపం … ఉప్పెనలా పొంగుకొచ్చాయి. “ ఈ మ్యాప్ తప్పు…. మన దేశానికి చెందిన భూభాగాన్ని పాకిస్తాన్ భాగంగా చూపించారు. ఈ మ్యాప్ శుద్ధ తప్పు” అని గట్టిగా అరిచాడు నరీందర్ కుమార్. అది 1978. కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో ఉన్న హై యాల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ (ఎత్తైన ప్రదేశాల్లో యుధ్దం చేయడంలో శిక్షణనిచ్చే కేంద్రం) లో నరీందర్ కుమార్ కమాండెంట్. మ్యాప్ లో దురాక్రమణే కదా అని నరీందర్ కుమార్ ఊరుకోలేదు. కాగితంపై కలం రాతల వెనుల మానసిక దురాక్రమణల దురూహలుంటాయి. ఆ తరువాత జరిగే భౌగోళిక దాడులకు అవి ముందస్తు సూచనలు. మన నేల పాకిస్తాన్ ది ఎలా అవుతుంది? ఈ ఒక్క ఆలోచన నరీందర్ కుమార్ ను నిద్రపోనీయలేదు. కొద్ది రోజుల్లోనే ఆయన పాయింట్ 9842 కి తన వెళ్లేందుకు తన పర్వతారోహకుల బృందంతో సిద్ధమయ్యాడు. మొత్తం తెల్లగా మృత్యువస్త్రంలా పరుచుకున్న మంచు… ఎక్కడ లోయ ఉందో …. ఎక్కడ అగాధం ఉందో తెలియదు…. కొద్ది గంటలు మాత్రమే సూర్యరశ్మి ఉంటుంది…..ఆ తరువాత అంతా చీకటే…ఇక ఉష్ణోగ్రత ….. మైనస్ 40 డిగ్రీలు…. అదొక హిమానీ నదం. అంటే చలికాలంలో శిలాఖండంలా ఉంటుంది. ఎండకి కరిగి నదిగా మారుతుంది. ఏప్రిల్ నెల వచ్చే సరికి ఆ మంచు ఖండాలపై నల్ల గులాబీలు మొలుస్తాయి. ఆ నల్ల గులాబీలను బాల్టీ భాషలో సియా అంటారు. నలభై యాభై మైళ్ల వైశాల్యం ఉన్న హిమఖండం అది.... పీర్ పంజాల్, జన్స్ కార్, లడాఖ్, సాల్టోరో, కారకోరం, ఆగిల్ మంచుకొండలను దాటి నాలుగున్నర నెలల ప్రయాణం తరువాత ఆ హిమానీ నదం శిఖరాగ్రాన్ని చేరుకునేసరికి అక్కడ పాకిస్తానీ సిగరెట్ ప్యాకెట్లు, తిని పారేసిన ఆహారపొట్లాలు, పర్వతారోహణ సామగ్రి పడున్నాయి. పాకిస్తానీలు అక్కడకి వచ్చారని చెప్పేందుకు ఇవే సాక్ష్యాధారాలు. వాటిని పక్కన పారేసి నరీందర్ కుమార్ తనతో తెచ్చిన త్రివర్ణ పతాకాన్ని ఎగరేశాడు. మంచుకొండలపై మన పతాకం గర్వంగా రెపరెపలాడింది. అది ఏప్రిల్ 1981 నరీందర్ కుమార్ ప్రయత్నాలతో మన మంచుకొండలపై పాక్ పడగ విప్పుతోందన్న భయంకరమైన నిజం బయటపడింది. మన సేనావాహిని ఆ హిమానీ నదానికి వెళ్లేందుకు ప్రపంచంలోనే అతి ఎత్తైన బ్రిడ్జిని నిర్మించింది. 1984 నాటికి మన సైనికులు ప్రపంచంలోనే అతి ఎత్తైన యుద్ధభూమిపై స్థావరం ఏర్పాటు చేశారు. మేఘాలు కింద, మంచుకొండలు పైన ఉండే ఆ విచిత్ర స్థలికి చేరుకునేందుకు ఆపరేషన్ మేఘదూత్ అనే ప్రత్యేక ఆపరేషన్ నే నిర్వహించాల్సి వచ్చింది. ఆ హిమానీనదం మన చేతుల్లో ఉంటే కాశ్మీర్ సురక్షితం. పాక్ కుట్రలు పనిచేయవు. చైనా ఎత్తుగడలు ఫలించవు. ఆ హిమానీ నదాన్నే సియాచిన్ గ్లేసియర్ అంటారు. సియాచిన్ అంటే నల్లగులాబీలు పెరిగే చోటు. ఇప్పటికీ సియాచిన్ ను చేజిక్కించుకునేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. కానీ సియాచిన్ మన చేతుల్లోనే ఉంది. నరీందర్ కుమార్ ప్రాణాలకు తెగించి చేసిన ఈ అత్యద్భుత సాహసానికి గుర్తుగా సియాచిన్ లో ఆర్మీ బేస్ క్యాంప్ కి కుమార్ క్యాంప్ అని పేరు పెట్టారు. అది నేలకి 4880 మీటర్ల ఎత్తున ఉంది. ఒక్క వ్యక్తి మ్యాప్ లో తప్పు చూసి ఉండకపోతే.....చూసిన తరువాత నాకెందుకులే అనుకోకుండా ముందుకు నడిచి ఉండకపోతే.... నాలుగున్నర నెలల పాటు మైనస్ 40 డిగ్రీల మంచుకొండలపై కాలినడకన ఎక్కి సియాచిన్ చేరుకుని ఉండకపోతే... కల్నల్ నరీందర్ ఈ సాహసోపేత యాత్ర చేసి ఉండకపోతే....ఏమై ఉండేదో ఒక్కసారి ఊహించుకొండి.  ఒక్క వ్యక్తి వల్ల భారతదేశపు చిత్రపటానికి కొత్త అర్థం వచ్చింది. మంచుకొండపై యుద్ధం చేసేందుకు ప్రత్యేక బ్రిగేడ్లు పుట్టుకొచ్చాయి. ఈ రోజు ప్రపంచం హై యాల్టిట్యూడ్ యుద్ధం ఎలా చేయాలో నేర్చుకునేందుకు భారతీయ మిలటరీ పాదాల దగ్గరికి వస్తోంది.  కల్నల్ నరీందర్ కుమార్ కి పర్వతారోహణ అంటే ప్రాణం. 1961 లో ఇలాగే మంచుకొండలు ఎక్కుతూంటే చలికి కాలు గడ్డకట్టుకుపోయింది. కాలికి నాలుగు వేళ్లు తెగిపోయాయి. అంటే కొండలు ఎక్కేటప్పుడు పట్టు ఉండదు. అయినా ఆయన పర్వతారోహణ ఆపలేదు. మనసు కొండలు ఎక్కిందే తప్ప ధైర్యం కొండెక్కలేదు. ఇరవై సార్లు 8000 మీటర్ల ఎత్తు ఎక్కాడు. 8000 మీటర్లంటే వాతావరణంలో ఆక్సిజన్ పూర్తిగా తగ్గిపోతుంది. ఊపిరి అందదు. అయినా పర్వతాలను ప్రేమిస్తూనే వచ్చారు కల్నల్ నరీందర్ కుమార్. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే సియాచిన్ కి మొట్టమొదటిసారి సాహసయాత్రకు బయలుదేరినప్పుడు నాన్ లయబిలిటీ అగ్రీమెంట్ అంటే పర్వతారోహణలో ప్రాణాలు పోతే నాదే బాధ్యత అని లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి వచ్చింది. అంటే నిజంగా దేశమాత కోసం ప్రాణాలు పణంగా పెట్టేందుకు కల్నల్ కుమార్ సిద్ధమయ్యారన్నమాట.  కీర్తిచక్ర, పరమవిశిష్ట సేవా మెడల్, పద్మశ్రీ, సైనిక గూఢచర్యానికి ఇచ్చే సర్వోత్తమ మెక్ గ్రెగర్ మెడల్ వంటివి కల్నల్ కుమార్ ను వరించాయి. కానీ విషాదం ఏమిటంటే మన భద్రత కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఈ సాహస వీరుడి గురించి దేశానికి పెద్దగా తెలియదు. సియాచిన్ను, తద్వారా కాశ్మీర్ ను, తద్వారా దేశాన్ని కాపాడిన కల్నల్ కుమార్ గురించి పాఠ్యపుస్తకాల్లో ఎందుకు లేదు? ఇలాంటి వారి గురించి యువతరానికి తెలియకూడదనా? తెలిస్తే దేశభక్తి పేరుగుతుందనా? యువకుల్లో కర్తవ్యభావన పెరుగుతుందనా? పెరిగితే దేశాన్ని అమ్మేసేవాళ్ల ఆటలు సాగవనా? ( original by sri Raka sukdhakara rao )...
 •  ( Rajeshwar Rao Ravichettu )  ........................................... నేతాజీ' సుభాష్ చంద్రబోస్  దేశం  గర్వించదగ్గ గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ నాయకత్వం‌ అహింసావాదం తోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని పోరాటం సాగిస్తుంటే నేతాజీ సాయుధ పోరాటంద్వారా మాత్రమే ఆంగ్లేయులను దేశం నుంచి పారదోలడం సాధ్యమని ఆచరణలో చూపిన మహనీయుడు. భారత జాతీయ కాంగ్రేసుకు బోసు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ గాంధీతో  గల  సైధ్ధాంతిక విభేదాలతో ఆ పదవికి రాజీనామా చేశాడు. అహింసావాదం స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాటయే పరిష్కారమని బోసు విశ్వసించాడు. ఈ లక్ష్యంతోనే ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. జీవితకాలం‌లో 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. శత్రువు శత్రువు మనకు మిత్రుడనే అనే సూత్రంతో రెండవ ప్రపంచ యుద్ధం (1939) ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి సువర్ణవకాశంగా భావించిన నేతాజీ యుద్ధం ప్రారంభం కాగానే ఆంగ్లేయుల కూటమిపై పొరాటానికి రష్యా కూటమిలోని మిత్రదేశాలైన జర్మనీ, జపాను దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఇతర  ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యం  ను (ఆజాద్ హింద్ ఫౌజ్) ఏర్పాటు చేశాడు. జపాను తోడ్పాటుతో సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు. బ్రిటిష్‌కూటమిపై పోరాటానికి సేకరించిన నిధులతో రూ 50లక్షల మూలధనంతో‌ రంగూన్‌లో ఆజాద్ హింద్ బ్యాంక్‌ను ఏర్పాటుచేశాడు. ప్రామిసరీనోట్ల రూపం‌లొ ఆజాద్ హింద్ కరెన్సీని ముద్రించాడు. నేతాజీ మరణానంతరం ఆడబ్బు ఏమైందీ తెలియరాలేదు. వియన్నాలో డా. మాధుర్ ద్వారా పరిచయమైన కాధలిక్ విశ్వాసి, ఆస్ట్రియాదేశస్తురాలైన ఎమిలీ షెంకీ ని బోసు 1937లో వివాహమాడారు. వారికి 1942లో అనితా బోస్ ఫాఫ్ అనే కుమార్తె జన్మించింది.  మనదేశం‌లో భాగమైన అండమాన్, నికోబార్ దీవులనుండి బ్రిటిష్‌వారిని పారదోలిన జపాన్ నేతాజీతో ఒప్పందం ప్రకారం ఆజాద్ హింద్ ఫౌజ్‌కు స్వాధీనం చేశారు. నేతాజీ ఆ ద్వీపాలకు షాహీద్, ఆజాద్‌లుగా నామకరణంచేసి డిసెంబర్ 30 1943 న భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. నేతాజీ అదృశ్యం (1945) తదుపరి ఆప్రాంతాలు తిరిగి బ్రిటిష్ ఆధీనం‌లోకి వెళ్ళాయి. బోసు రాజకీయ అభిప్రాయాలు, జర్మనీ,  జపానులతో స్నేహంపై చరిత్రకారులు కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని జీవితం లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు 18 ఆగస్టు, 1945న మరణించాడని ప్రకటించినప్పటికీ అందులొంచి బయట పడి అజ్ఞాతం వెళ్ళాడని పలువురు నమ్ముతారు. నేతాజీ మరణానికి  చెందిన పత్రాలను నాటి కాంగ్రేస్ ప్రభుత్వంకానీ, ఈనాటి  యన్ డి ఏ  ప్రభుత్వం కానీ  పూర్తిస్థాయిలో ప్రకటించలేదు. అంతర్జాతీయ  సంబంధాలు వికటిస్తాయనే మిషతో సమాచార హక్కు ద్వారా చేసిన విజ్ఞప్తులనుకానీ, కోర్టు ఆదేశాలనుగానీ అమలుచేయడం‌ లేదు .  నేతాజీ బతికే ఉన్నారా ?  ఇదే విషయమై.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత ప్రభుత్వం మూడు  కమిషన్‌లను వేసింది. కానీ ఏ ఒక్క కమిటీ సుస్ప‌ష్టంగా నివేదిక ఇవ్వ‌లేదు.1945 ఆగస్టులో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ చనిపోయినట్లు  షోనావాజ్ కమిషన్ నిర్థారించింది. 1970లో ఏర్పాటైన జీడీ కోస్లా కమిషన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.నేతాజీ కుటుంబ సభ్యులు మాత్రం ఈ అభిప్రాయాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ రెండు కమిషన్‌లు వాస్తవాలను వెల్లడించడంలేదని నేతాజీ కుటుంబ సభ్యులు వాదిస్తున్నారు. అంతేకాక ఎన్డీయే ప్రభుత్వం నెహ్రూకు సంబంధించి ఇటీవ‌ల బయటపెట్టిన నివేదిక కూడా పలు అనుమానాలకు తావిస్తోంది.నేతాజీ చనిపోయారని ప్రకటించిన తర్వాత కూడా నెహ్రూ నేతాజీ కుటుంబంపై నిఘా పెట్టారన్నది సంబంధిత నివేదిక సారాంశం. ఏదేమైనా. నేతాజీకి సంబంధించిన నిజాలు వెలుగు చూస్తే జాతికి ఎంతో మేలు. లేకుంటే స్వాతంత్ర్య సంగ్రామంలో కీల‌క పాత్ర పోషించిన నెహ్రూ లాంటి నాయ‌కుల‌పై అనుమానాలు త‌ప్ప‌వు. ఈవేళ  ఆ  మహనీయుని  జన్మదినం   (23 జనవరి 1897- 18 ఆగస్టు 1945 ?) దేశాన్ని త్రికరణ శుధ్దిగా ప్రేమించిన నేతాజీ జయంతిని ‘దేశ్ ప్రేమీ’ దివస్‌గా జరుపుకుంటూ ఆయన త్యాగాలను స్మరించుకుందాం. దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మనంకూడా త్రికరణశుధ్ధిగ కృషిచేద్దాం. ...
 • ప్రవచనకర్తగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన చాగంటి కోటేశ్వరరావు  ఇకపై  ప్రవచనాలు చెప్పడం మానివేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.  తనపై  కేసులు పెట్టడంతో చాగంటి వారు మనస్తాపం చెందారని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ప్రవచనాలు  చెప్పే కార్యక్రమాలకు  స్వస్తి పలకాలని చాగంటిపై ఒత్తిడి తెస్తున్నట్టు  సమాచారం.  నాలుగు  రోజుల క్రితం కృష్ణుడి గొప్పతనం వివరించే క్రమంలో చాగంటి చేసిన వ్యాఖ్యల పట్ల యాదవులు  ఆగ్రహం  వ్యక్తం  చేశారు. ఈ క్రమం లోనే  హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ ఇలా తెలుగు రాష్ట్రాల నలుమూలలా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అఖిల భారత యాదవ సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాగంటి పై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.  ఈ పరిణామాలతో చాగంటి  యాదవులకు  క్షమాపణలు  కూడా చెప్పారు. గత ఏడాది కూడా కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని  అసలు ప్రవచనాలే మానేస్తే ఈ బాధ ఉండదని భావిస్తున్నారట.  తనకు తానుగా చాగంటి వారు ఏనిర్ణయం ప్రకటించలేదు....
Site Logo