Latest News
ప్ర‌ముఖులు

మరో అమరశిల్పి ఈ గణపతి స్థపతి !!

1st Image

ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రముఖుని పేరు "గణపతి స్థపతి".
ఈ అమర శిల్పి గురించి ఈ తరం వారిలో చాలామందికి తెల్సి ఉండక పోవచ్చు. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై తెలుగు కళాకారుల విగ్రహాలు, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధవిగ్రహన్ని రూపొందించింది ఈయనే. కఠిన శిలలను సైతం ఆకర్షణీయమైన రూపలావణ్యంతో అద్భుత కళాఖండాలుగా తీర్చిదిద్దడంలో గణపతి స్థపతికి తిరుగులేదు. తిరుపతిలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌తో పాటు గరుడ వాహనం తదితర నిర్మాణాలు, భద్రాచలం, సింహాచలం, శ్రీశైలంలోని దేవాలయాల గోపురాలు, హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై తెలుగు ప్రముఖుల విగ్రహాలు, హుస్సేన్‌సాగర్‌లోని బుద్ధవిగ్రహం, స్కందగిరిలోని ఆంజనేయ స్వామి విగ్రహాలను గణపతి స్థపతి అద్భుతంగా తీర్చిదిద్దారు. అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవాలయంలోని దేవతామూర్తులను గణపతి స్థపతి స్వయంగా చెక్కి పంపించారు. విశాఖపట్నం లోని రామకృష్ణ మఠం, విశాఖ శ్రీ శారదాపీఠం నిర్మాణాలు గణపతి స్థపతి చేతుల మీదుగా రూపుదిద్దుకున్నాయి. కన్యాకుమారిలోని 133 అడుగుల తిరువళ్ళూరి విగ్రహాన్ని కూడా గణపతి స్థపతి తీర్చిదిద్దారు. ఐదువేలకు పైగా హిందూ సంప్రదాయ నిర్మాణాలు ఆయన పర్యవేక్షణలోనే జరిగాయి. శ్రీశైలం ప్రాజెక్ట్‌ నిర్మాణ సమయంలో సమీపంలోని 102 గ్రామాలు నీటి ముంపుకు గురికాగా ఆయా గ్రామాలలోని దేవాలయాలన్నీ చెల్లాచెదురయ్యాయి. అప్పట్లో వాటిలో మిగిలిన చిన్నపాటి శిలల ఆధారంగా మళ్ళీ దేవాలయాలు, విగ్రహాలను నిర్మించిన ఖ్యాతి  గణపతి స్థపతికే చెందుతుంది. ఆయనలోని శిల్పకళా నైపుణ్యాన్ని గుర్తించిన రాష్ట్రపతి ప్రత్యేక పురస్కారాన్ని అందించారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.1964లో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న పాటూరి చంద్రమౌళి రాష్ట్రంలోని దేవాలయాలలో శిల్పాల నిర్మాణ పర్యవేక్షణకు ప్రత్యేకంగా గణపతి స్థపతిని నియమించారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయనకు ప్రత్యేక గౌరవం లభించింది. ఎన్టీఆర్‌ నిర్మించే పౌరాణిక చిత్రాలలోని సెట్టింగ్‌లను గణపతి స్థపతి పర్యవేక్షించే వారు.సలహాలు ఇచ్చేవారు. తమిళ నాడులోని రామనాథపురం జిల్లా ఎల్విన్‌కోటయా అనే గ్రామంలో జన్మించిన గణపతి స్థపతి కంచి పీఠాధిపతి పరమాచార్య అనుగ్రహాన్ని పొందారు. సంప్రదాయ వాస్తుశిల్పి కుటుంబంలో జన్మించిన గణపతి స్థపతి తండ్రి, మేనమామల వద్ద శిల్పకళలో శిక్షణ పొందారు.
దేశ, విదేశాల్లో దాదాపు 600 హిందూ దేవాలయాల నిర్మాణ శిల్పిగా ఆయన ప్రఖ్యాతిగాంచారు. ఆధునిక భారతీయ సమాజంలో హిందూ శిల్పకళా సంపదపై 1980లొ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడమే కాక, మద్రాస్‌ యూనివర్శిటీలో డిగ్రీ కోర్సుకు అనుబంధంగా శిల్ప కళా కోర్సును ప్రవేశపెట్టాలని అప్పటి పాలకులను ఒప్పించారు. వాస్తు శాస్త్రాన్ని కూడా ఇందులోమిళితం చేశారు.
ప్రభుత్వ సేవల నుంచి వైదొలగిన తర్వాత గణపతి స్తపతి 'వాస్తు వేదిక ట్రస్ట్‌', 'వాస్తు వేదిక రీసెర్చ్‌ పౌండేషన్‌' ఏర్పాటు చేశారు. 
గణపతి స్థపతి 2011 సెప్టెంబర్ ఆరున చెన్నైలో కన్నుమూశారు. అంతకుముందు రెండేళ్ళ కిందట మద్రాసు నుంచి కాంచీపురంకు వెళ్తూ ప్రమాదానికి గురికాగా మెదడు భాగం రెండుగా చిట్లిపోయింది. అప్పటి నుంచి ఆయన వైద్యసేవలు పొందుతునే తన వారసులకు శిల్పకళకు సంబంధించిన అనేక కీలకాంశాలలో మెళకువలను నేర్పించారు. ఆయనకు ఇద్దురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కాగా కంచిపీఠంపై ఉన్న పరమభక్తితో కొడుకులిద్దరికీ జయేంద్ర, శంకరం అనే పేర్లు పెట్టుకున్నారు. అల్లుళ్ళను  కూడా శిల్పకళారంగం నుంచే  తెచ్చుకున్నారు.

Site Logo
  • ( Sheik Sadiq Ali )    .................           భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో,ప్రభుత్వంలో సాధువులు,యోగుల ప్రమేయం పెరిగిపోతోందని కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తునారు. అయితే  భారత రాజకీయాల్లో యోగుల ప్రమేయం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. 1960 వ దశకం నుంచే, ఇందిరాగాంధీ హయాం నుంచే ఈ ట్రెండ్ మొదలైంది. నిజం చెప్పాలంటే , ఇప్పటికన్నా అప్పుడే చాలా ఎక్కువగా ఉంది . దాని గురించి ఈతరం వారికి తెలియజెప్పటమే ఈ కథనం ముఖ్యోద్దేశ్యం. ఇది ఒక యోగి జీవిత కథ. రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీని, దేశ రాజకీయాలను కంటి సైగతో శాసించిన ఒక బ్రహ్మచారి కథ. తారాజువ్వలా నింగికి ఎగసి నేలరాలిన ధీరేంద్ర బ్రహ్మచారి కథ. ఇందిరా గాంధీని, సంజయ్ గాంధీ ని, మొత్తం గాంధీ పరివారాన్ని నడిపించిన ఒక రాజగురువు కథ. ఆద్యంతం మలుపులతో, సినీ ఫక్కీలో నడిచిన ఈ యోగి జీవిత కథ ఖచ్చితంగా చదివి తీరాల్సిందే. ఎవరీ బ్రహ్మచారి? మా తరం, మాకన్నా ముందు తరం వారికి తెలిసిన కథే. కానీ, భారత భవిష్యత్తును నిర్దేశించే నవతరానికి ఈ కథ తెలియాల్సిందే. 13 వ ఏటే ఇల్లు వదిలి సన్యాసుల్లో కలిసిన ఒక కుర్రాడు దేశ భవిష్యత్తును శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? కట్టుబట్టలతో బయటికి వచ్చిన వాడు వేలకోట్ల సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరా గాంధీకి రాజగురువు ఎలా అయ్యాడు? ఎవరి మాటా వినడని ప్రఖ్యాతి చెందిన సంజయ్ గాంధీని ఎలా మచ్చిక చేసుకున్నాడు? ఇప్పటికీ మిస్టరీ వీడని విమాన ప్రమాదంలో ఎలా మరణించాడు? ఇవన్నీ ఆద్యంతం ఆసక్తికరం. బీహార్ రాష్ట్రం మధుబన్ జిల్లా సాయిత్ చాన్పూర్ గ్రామంలో 1924 ఫిబ్రవరి 24 వ తేదీన పుట్టాడని కొందరు,1925 లో పుట్టాడని కొందరు  చెబుతారు . అలాగే అతని అసలు పేరు ధీరేంద్ర  చౌదరి అనీ,తండ్రి పేరు భంభోల్ చౌదరి అని కొందరు...   కాదు..కాదు అతని పేరు ధీరేంద్ర  శర్మ అని కొందరు అంటారు .  నిజమేమిటో ఇప్పటికీ తెలియదు. ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది మాత్రం 1954 లో మాత్రమే. కలకత్తాలో ప్రజలను పరిచయం చేసుకున్నపుడు ఆయన చెప్పిన వివరాలు చదివితే కొంచెం ఆశ్చర్యంగా అన్పిస్తుంది. "సన్యాసులకు సొంత ఊరూ ,పేరూ ఉండవు. కాబట్టి ఊరేదని అడగొద్దు. 13 వ ఏట భగవద్గీత ఇచ్చిన స్పూర్తితో ఇల్లు వదిలి వారణాసి వెళ్లి సన్యాసిగా మారాను. లక్నో కు సమీపంలో ఉన్న గోపాల్ ఖేరా ఆశ్రమంలో కార్తికేయ మహర్షి ఆశ్రమంలో చేరాను. ఆ మహర్షి 325 ఏళ్ళు జీవించి 1953 లో మరణించారు. వారు జీవించి ఉండగా అతిప్రాచీన భారతీయ యోగవిద్యను సాధన చేశారు. ఆ విద్య భారత్ లో అంతరించి పోయింది. కేవలం టిబెట్ లో మాత్రమే మిగిలి ఉంది దాన్ని మళ్ళీ బతికించి భారత ప్రజలకు అందించాలనేది వారి కోరిక. వారి వద్ద నేను నేర్చుకున్న విద్యను కలకత్తా ప్రజలకు నేర్పించెందుకే వచ్చాను. నా వయసు నిజానికి చాలా పెద్దది. కానీ చూడ్డానికి యువకుడిలా కన్పిస్తాను. దానికి నేను సాధన చేస్తున్న యోగ,సూక్ష్మ వ్యాయమాలే కారణం." ఇలా తొలిసారిగా ప్రజల మధ్యకు వచ్చిన ధీరేంద్ర  తనను తాను నిర్వచించుకున్నాడు. నిలువెత్తు విగ్రహం, ఆజానుబాహు,కాంతులీనే మేనిఛాయ,అయస్కాంతంలా ఆకర్షించే కళ్ళు. ఎలా తిప్పితే అలా తిరిగే దేహం ,వాటికి తోడూ అద్భుతమైన యోగ విన్యాసాలు. ప్రకృతి వైద్యం అదనపు ఆకర్షణలు. ఇవన్నీ చూసిన స్థానికులు ఆయనను ఆదరించారు. చిన్న అద్దె ఇంటిలో మొదలైన జీవితం అతికొద్ది కాలంలోనే ఖరీదైన భోగవంతమైన ఆశ్రమానికి మారింది. నగరంలోని ప్రముఖులు,ముఖ్యంగా సంపన్న కుటుంబాల మహిళలు అతని శిష్యులయ్యారు.పాపులారిటీ, సంపాదనా పెరిగాయి. అక్కడి నుంచే అతని మహర్దశ మొదలైంది. యోగాసనాలు వేయటంలో ఇప్పటి రాందేవ్ బాబాను మించిన వాడు. తాను యోగా చేస్తుండగా తీసిన ఫోటోలు, వాటి వివరాలతో 'సూక్ష్మ వ్యాయామం  అండ్ యోగాసన' అనే పుస్తకాన్ని రూపొందించాడు. అప్పుడే జయప్రకాశ్ నారాయణ కలకత్తా వచ్చారు. మిత్రుల సహకారంతో ఆయనను కలిసి తన పుస్తకానికి ముందు మాట రాయించుకున్నాడు. ఆ పుస్తకం బాగా ఆదరణ పొందింది. ఆ తర్వాత అక్కడి సైనికులకు,సైనికాధికారులకు యోగా శిక్షణ ఇచ్చాడు. క్రమంగా అతని కీర్తి  పెరగ సాగింది. దాంతో దేశ రాజధాని ఢిల్లీ మీద కన్ను పడింది. అక్కడ ఒక చిన్నపాటి బ్రాంచ్ మొదలు పెట్టాడు. ఢిల్లీ చేరిన తర్వాత అతని దశ తిరిగిపోయింది. అది 1960 వ సంవత్సరం. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు కూతురు ఇందిరాగాంధీ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవారు.ఆమెకు యోగా నేర్పించి స్వస్థత చేకూర్చాలని ధీరేంద్ర ను కోరారు. రోజూ ఇంటికి వచ్చి ఇందిరకు యోగా, సూక్ష్మ వ్యాయామం నేర్పించాలి. అలా నెహ్రూ ఇంట్లోకి ధీరేంద్ర ప్రవేశించాడు.అతి తక్కువ కాలంలోనే ఇందిరా.నెహ్రూలకు సన్నిహితుడయ్యాడు. నెహ్రు మరణాంతరం ఇందిరకు మరింత చేరువ అయ్యాడు.గురువు,సచివుడు ,హితుడు,సన్నిహితుడు అన్నీ తానే అయ్యాడు. అక్కడినుంచి అతని ప్రభ వెలిగిపోయింది. అత్యంత ఖరీదైన ఆశ్రమాలు, యోగా రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేశాడు. కేంద్రమంత్రులు,బడా పారిశ్రామిక వేత్తలు,ఉన్నతాధికారులు అతని శిష్యులుగా మారిపోయారు. అతని ట్రస్ట్ కు కేంద్ర ప్రభుత్వ నిధులు భారీగా మంజూరు అయ్యేవి.మరో వైపు ఆయుధ కర్మాగారంలో భాగస్వామి అయ్యాడు. ఆయుధాల వ్యాపారిగా, రక్షణ పరికరాల సరఫరా దారుగా ఎదిగాడు.ఇందిరా ప్రధానిగా ఉన్న కాలంలో కేంద్ర మంత్రివర్గ కూర్పులో అతని ముద్ర స్పష్టంగా కన్పించేది. ఇక ఇందిరా తనయుడు సంజయ్ గాంధీకి ధీరేంద్ర ఎంతచెప్తే అంతేగా ఉండేది. ఎమర్జెన్సీ రోజుల్లో సంజయ్ చేపట్టిన కుటుంబ నియంత్రణ, గుడిసెల నిర్మూలనా కార్యక్రమాలకు ధీరేంద్ర  బహిరంగ మద్దతు ప్రకటించాడు. ఇక్కడ ఇలా ఉండగా, రష్యా ఆహ్వానం మేరకు అక్కడి వ్యోమగాములకు యోగా శిక్షణ కూడా ఇచ్చి వచ్చాడు. ధీరేంద్ర కు విదేశీ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవారు. విదేశాల నుంచి ఖరీదైన కార్లు,విమానాలు, ఎలెక్ట్రానిక్ పరికరాలు కానుకలుగా అందేవి. జమ్మూలో అతిపెద్ద ఆశ్రమం,సొంత విమానాశ్రయం,సొంత విమానం ,హెలికాప్టర్లు ఉండేవి. నిరంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు సొంత విమానాల్లో తిరిగేవాడు. దాంతో ఫ్లయింగ్ స్వామి గా సుప్రసిద్దుడయ్యాడు. సంజయ్ గాంధి మరణానికి కారణమైన విమానం కూడా ధీరేంద్ర దే కావటం విశేషం. సంజయ్ మరణం తర్వాత ఇందిరాగాంధీ పరిపూర్ణంగా ధీరేంద్ర  పైనే ఆధార పడ్డారు. ఆయన సూచనలతోనే ఇందిర అనేక పుణ్యక్షేత్రాలు దర్శించారు. ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఒక వైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వ కార్యకలాపాల్లో ధీరేంద్ర  ప్రమేయం చాలా ఎక్కువగా ఉండేది . అప్పట్లో దూరదర్శన్ లో ప్రతీరోజు ధీరేంద్ర  యోగా కార్యక్రమాలు వచ్చేవి. భారతదేశపు ఆధ్యాత్మిక గురువుగా విరాజిల్లాడు. అదే సమయంలో ఆయనపై అనేక లైంగిక ఆరోపణలు వచ్చాయి. కలకత్తా నుంచి ఢిల్లీ వరకు అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఉండేవని వార్తలు గుప్పుమనేవి.అలాగే, ఎమర్జెన్సీ కాలంలో వేలకోట్ల అక్రమ ఆస్థులు కూడబెట్టాడని ఆరోపణలు రావటం, జనతా ప్రభుత్వం నియమించిన షా కమీషన్ వాటిని నిర్ధారించటం, వాటిలో కొన్ని ఆస్థులను జప్తు చేయటం కూడా జరిగింది. ఇందిరా గాంధీ ,రాజీవ్ ల మరణం తర్వాత ధీరేంద్ర పతనం మొదలయ్యింది. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాడు . 1994 జూన్ 9 జమ్మూ పరిసరాల్లో ఆయన ప్రయాణిస్తున్న సొంత విమానం కూలిపోవటంతో ధీరేంద్ర  మరణించాడు. ఆ విమానం ఎలా కూలింది అనే విషయంలో మీడియా కానీ, అప్పటి ప్రభుత్వం కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఆయన మరణం తర్వాత వారసులెవరూ లేకపోవటంతో ఆయన ఆశ్రమాలు,ఆస్థులు దోపిడీకి గురయ్యాయి.ఇప్పుడు ఆయనను గుర్తు పెట్టుకునే వారే కరువయ్యారు. యోగాసాధకుడిగా నిస్సందేహంగా ధీరేంద్ర  గొప్పవాడు. కానీ,రాజకీయ ప్రమేయాలు, ఆయుధాల వ్యాపారాలు,అక్రమాలు, మహిళలతో సంబంధాలు ఆయన లోని విద్వత్తును పూర్తిగా కనుమరుగు చేసేశాయి. యోగి భోగిగా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ధీరేంద్ర జీవితమే ఒక ఉదాహరణ. అలాగే బీజేపీ  హయాంలోనే యోగులు, సాధువుల రాజకీయ ప్రమేయం పెరిగిందని చెప్పటం కూడా అసత్యం. దశాబ్దాల తరబడి దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఒక యోగి కనుసన్నల్లో ఎలా నడిచిందో చెప్పటానికి ధీరేంద్ర బ్రహ్మచారి జీవితం ఒక చారిత్రక తార్కాణం.
  • (నందిరాజు రాధాకృష్ణ )  .........     వేములపల్లి శ్రీకృష్ణ ఎవరో తెలుసా..?  వామపక్ష రాజకీయ వాసనలున్న కొందరికైతే ఆయన కమ్యూనిస్టు గా తెలుసు. మరికొందరికి ప్రజాప్రతినిధిగా ఎరుక. బాపట్ల, మంగళగిరి నియోజక వర్గాలనుండి రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. బహుకొద్దిమందికి ఆయన ఒక పాత్రికేయునిగా గుర్తు. విశాలాంధ్ర  ఎడిటర్‌గా రాష్ట్రంలో పాతకాలం పత్రికా పాఠకులకు తెలిసుండచ్చు. ఆయన గొప్ప కవి అని చాలామందికి తెలీక పోవచ్చు. అందులోనూ ఆయన రాసిన ఒక గేయం దశాబ్దాలపాటు తెలుగునేల నాలుగు దిక్కులా పిక్కటిల్లింది. అన్ని భావాలు, అన్ని వాదాలు కలగలిపి సువిశాలాంధ్ర గళం వినిపించారు. తెలుగు పటిమను, ధైర్య సాహసాలను, పాండిత్య ప్రతిభను, తెలుగు సంస్కృతీ వెలుగు  జిలుగులను వేనోళ్ళ కొనియాడారు. ప్రస్తుత అస్తవ్యస్త వ్యవస్థ వాతావరణంలో ఈపాటకు ఎంతో విలువ ఉంది. 50 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా శ్రీకృష్ణ గేయం గుర్తుండకపోవచ్చు. గతంలో వినిపించిన దేశభక్తి పూరిత గేయాలలో ఇది ప్రముఖంగా ఉండేది. శ్రీకృష్ణ ఎలా ఉండేవారో పాత కమ్యూనిస్టు తరానికి, తలపండి, చేయి తిరిగిన పాత్రికేయ మిత్రులకు మాత్రమే స్ఫురణకు వస్తారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!! అన్న ఆయన పిలుపునకు యువత పౌరుషంతో పరుగులెత్తింది ఆ రోజుల్లో.  ఆ దేదీప్య, దివ్య గీతిక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కంచుకాగడా పెట్టివెతికినా ఎక్కడా కాగితాల్లో (పాఠ్యపుస్తకాల్లో) కలాల్లో, గళాల్లో కనిపించదు, వినిపించదు. ఒక్క సారి ఆ గీతాన్ని మననం చేసుకుందామా!! చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి కలవోడా! సాటిలేని జాతి-ఓటమెరుగని కోట  నివురుగప్పి నేడు-నిదురపోతుండాది జైకొట్టి మేల్కొలుపు తెలుగోడా! గతమెంతో ఘనకీర్తి కలవోడా!!||చెయ్యెత్తి|| వీర రక్తపుధార-వారబోసిన సీమ పలనాడు నీదెరా-వెలనాడు నీదెరా  బాలచంద్రుడు చూడ ఎవడోయి! తాండ్రపాపయ్య కూడనీవోడూ||చెయ్యెత్తి|| కాకతీయ రుద్రమ, మల్లమాంబా, మొల్ల  మగువ మాంచాల నీతోడ బుట్టినవాళ్ళే  వీరవనితల గన్న తల్లేరా! ధీరమాతల జన్మ భూమేరా! ||చెయ్యెత్తి|| నాగార్జునుడి కొండ,అమరావతీస్థూపం భావాల పుట్టలో-జీవకళ పొదిగావు అల్పుడను కావంచు తెల్పావు నీవు శిల్పినని చాటావు దేశదేశాలలో! ||చెయ్యెత్తి|| దేశమంతే వట్టి మట్టి కాదన్నాడు మనుషులన్నమాట మరువబోకన్నాడు అమరకవి గురజాడ నీవాడురా ప్రజలకవితను చాటిచూపాడురా! ||చెయ్యెత్తి|| రాయలేలిన సీమ-రతనాల సీమరా దాయగట్టె పరులు-దారి తీస్తుండారు నోరెత్తి యడగరా దానోడా వారసుడ నీవెరా తెలుగోడా! ||చెయ్యెత్తి|| కల్లోల గౌతమీ-వెల్లువల కృష్ణమ్మ తుంగభద్రాతల్లి-పొంగిపొరలిన చాలు ధాన్యరాశులే పండు దేశానా! కూడుగుడ్డకు కొదవలేదన్నా!||చెయ్యెత్తి|| ముక్కోటి బలగమోయ్-ఒక్కటిగ మనముంటే ఇరుగుపొరుగులోన -వూరు పేరుంటాది తల్లి ఒక్కతే నీకు తెలుగోడా! సవతిబిడ్డల పోరు మనకేలా! ||చెయ్యెత్తి|| పెనుగాలి వీచింది-అణగారి పోయింది నట్టనడి సంద్రాన-నావ నిలుచుండాది చుక్కాని బట్టరా తెలుగోడా!  నావ దరిచేర్చరా మొనగాడా!! !! చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా||
  • పెళ్లికాని ప్రముఖుల క్లబ్ లోమరో ఇద్దరు కొత్త గా చేరారు . ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు  చేపట్టిన యోగి ఆదిత్యనాథ్ ఒకరు  కాగా రెండో వారు ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన త్రివేంద్ర సింగ్ రావత్.  ఈ ఇద్దరూ కూడా బ్రహ్మచారులే.  44 ఏళ్ల ఆదిత్యనాథ్.. గోరఖ్‌పూర్ మఠాధిపతి. వివాహం, కుటుంబానికి దూరంగా ఉన్న యోగి.. సన్యాసం స్వీకరించారు. గోరఖ్‌ పూర్‌ నుంచి 5 సార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీ సీఎంగా ఆదివారం  ప్రమాణం చేశారు. ఇక  ఉత్తరాఖండ్ సీఎంగా ప్రమాణం చేసిన త్రివేంద్ర సింగ్ రావత్ (56). ఈయన  ఆర్ ఎస్ ఎస్ ప్రచారక్ గా చేశారు.   ఇక హరియాణ  సీఎం ఎంఎల్ ఖట్టర్ (62) , అసోం సీఎం  సర్బానంద సోనోవాల్ (54), ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ (70) , పశ్చిమ బెంగాల్‌  సీఎం మమతా బెనర్జీ (62) లు కూడా అవివాహితులే. వీరిలో నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ మినహా మిగిలిన ముఖ్యమంత్రులు బీజేపీ వారు కావడం  విశేషం .  2000 సంవత్సరం నుంచి ఒడిశా సీఎంగా నవీన్ కొనసాగుతున్నారు. ఇక మమత వరుసగా రెండో పర్యాయం బెంగాల్ సీఎం అయ్యారు. వీళ్లలో చాలామంది ఎన్నికల ప్రచారంలో వారికి  పెళ్లి కాని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. తాము అవివాహితులమని, తమకు కుటుంబం లేదని, కుటుంబ పాలనకు, అవినీతికి చోటు ఉండదని ప్రజలను ఆకట్టు కుంటున్నారు .  ఇండియాలో అవివాహితులైన ప్రముఖుల జాబితా పెద్దదే. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ (46)కి ఇంకా పెళ్లి కాని విషయం తెలిసిందే. మీడియా  ఈ విషయాన్ని రాహుల్ వద్ద ప్రస్తావిస్తే.. తనకు నచ్చిన అమ్మాయి దొరికినపుడు పెళ్లి చేసుకుంటానని చెబుతుంటారు .ఇక మాజీ ముఖ్యమంత్రులు మాయావతి (ఉత్తరప్రదేశ్‌-61), ఉమాభారతి (మధ్యప్రదేశ్‌-57), తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కూడా అవివాహితులే. ఉమా భారతి ప్రస్తుతం కేంద్ర మంత్రి. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా వివాహం చేసుకోలేదు. ఆర్ ఎస్ ఎస్ ప్రముఖుల్లో  మోహన్ భగవత్ ... గోవిందా చార్య మరికొందరు కూడా వివాహానికి దూరంగా ఉన్నారు.  దేశ వ్యాప్తంగా చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు ఈ క్లబ్ లో ఉన్నారు. ఇతర పార్టీల కంటే బీజేపీలోనే బ్రహ్మచారుల సంఖ్య ఎక్కువ. కేవలం  వివిధ కీలక పదవుల్లో ఉన్నవారు కాక  ఇతర రంగాల్లో కూడా బ్రహ్మచారులు ఉన్నారు. 
  • (జ్యోతి వలబోజు)............       సంసారంలో అప్పుడప్పుడు సరసాలు, చిటపటలు ఉంటేనే కదా మజా.. ఈ సరసాలు ఒక్కోసారి అభిప్రాయబేధాలు, అలగడాలు .. శ్రుతిమించితే పోట్లాటల వరకు వెళ్తాయి. ఈ విషయంలో కొందరు పండితులేమన్నారో చూడండి.   ఇంద్రగంటి : నాకూ, నా భార్యకూ అభిప్రాయబేధాలు రాకుండా ఉండవు, వస్తూనే ఉంటాయి. అలా అభిప్రాయబేధం వచ్చినప్పుడు నా అభిప్రాయం మాత్రం చస్తే ఆవిడతో చెప్పను. ఇక ఆవిడ ఏం చేస్తుంది? నోరు మూసుకుని ఉంటుంది. అర్ధం కాలేదా? అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నేనే నోరుమూసుకుని ఊరుకుంటాను. కాటూరి : మా ఇంట్లో ఎప్పుడూ పోట్లాడుకోలేదు. అదెలా సంభవం అంటే.. నేను చెప్పిన మాటలన్నీ ఆవిడ వింటుందని కాదు. ఆవిడ చెప్పినట్టే నేను వింటాను. ఏదైనా మాటా మాటా వచ్చి ఆవిడకు కోపం వస్తే నేను వెంటనే... "దోషముగల్గె, నా వలన దోసిలి యొగ్గితి నేలుకొమ్ము నీ దాసుడ" అని " ముట్టెద తత్పద్ద్వయిన్" అంటాను. దేవులపల్లి : నా ప్రియురాలితో పోట్లాట నేను భరించలేను. ఒకవేళ వచ్చిందో నాకు దుఃఖం వస్తుంది. ఆ దుస్సహగాఢ దుఃఖం ఆపుకోలేను ఏడుపు వస్తుంది. మృదుల కరుణా మధురం నా హృదయము. మొక్కపాటి : మాకు ఎలాంటి పోట్లాటలు లేవు. శాంతంగా జరిగిపోతుంది. ఎలాగంటే నేను మద్రాసులో ఉంటున్నాను. ఆవిడ రాజమండ్రిలో ఉంటున్నది. ఎప్పుడైనా టెలిఫోనులో మాట్లాడుకుంటాము. పైగా చాలా డబ్బు ఖర్చవుతుంది. ఇక పోట్లాడడానికి వ్యవధి ఎక్కడిది. గిడుగు : మా ఇంట్లో అస్సలు పోట్లాటలే లేవండి. పోట్లాటలే కాదు అసలు మాట్లాటలే లేవు. ఎందుకంటే నేను ఒక ప్రతిజ్ఞ చేసాను. ఇంట్లో సవర భాషలో మాత్రమే మాట్లాడతాను. బయట సవరభాషను గురించి మాత్రమే మాట్లాడతాను. అందుకని నేను ఏమంటున్నది ఆవిడకు తెలీదు. అందుకే ఏటువంటి పోట్లాటలు లేవు. వేలూరి : ఇంటావిడకు మన మాటలు వినపడనంతటి దూరంలో ఒక కుటీరం నిర్మించుకొని పొద్దస్తమానమూ అక్కడే కాలం గడపడంవల్ల చాలా వరకు భార్యాభర్తల మధ్య పోట్లాటలు ఉండవు. ధనికొండవారు : సన్నని వేప బెత్తంతో వీపు చిట్లగొడితే మళ్లీ మాట్లాడదు. ఒకటి రెండుసార్లు ఇలా జరిగిన తర్వాత మా ఆవిడకూ, నాకూ అభిప్రాయ భేదాలంటూ లేకుండా పోయినాయి. బుచ్చిబాబు: మా ఆవిడ ఎప్పుడూ " మీకేమీ తెలియదు. మీకేమాత్రమూ తెలియదండీ" అంటూ ఉంటుంది. ఇలా ప్రతిరోజూ చెవిలో నూరిపోయడం వల్ల నాకు ఏమీ తెలియదన్న నమ్మకం బాగా కుదిరింది. అన్నీ తెలిసిన విజ్ఞాన సర్వస్వం మా ఆవిడ. ఆవిడ మాట మెదలకుండా వినడమే నా పని. ఇక పోట్లాటలు ఎలా వస్తాయి? జమ్మలమడక : భార్యాభర్తల మధ్య పోట్లాటలు రాకుండా ఉండాలంటే భర్త తప్పనిసరిగా సంస్కృతం నేర్చుకోవాలి. భర్త సంస్కృతంలో ఏది మాట్లాడినా ఆవిడకు అర్ధం కాదు.దాంతో గప్ చిప్ గా ఊరుకుంటుంది. నేను అలాగే చేస్తున్నా... పాపం కదా..... ఎన్ని కష్టాలో ఈ  మొగుళ్ళకి .
  • ( సుశ్రీ )....................    మన ఆర్మీ లో అసమాన సాహసవంతులు ఎందరో పని చేశారు.  వారికి ప్రాణాలంటే లెక్క లేదు . వైకల్యం ఎదురైనా చింతించరు.  అవిక్ర పరాక్రమంతో దూసుకు పోతుంటారు.  అలాంటి వీరుల్లో కార్డోజో  ఒకరు. అనూహ్యంగా ఎదురైన వైకల్యాన్ని లెక్క చేయక  పోరాడిన సైనికుడు అతను. ఎందరికో స్ఫూర్తి  అతగాడి జీవితం .     .....  ఆ సైనికుడు మంచం మీద పడి ఉన్నాడు. కాలు నుజ్జు నుజ్జయిపోయింది. ఎముక పొడి పొడి అయిపోయింది.  రక్తం ధారాప్రవాహంగా కారిపోతోంది. సైనికుడు స్పృహలోనే ఉన్నాడు. “నాకు మత్తు మందు ఇవ్వండి.” అన్నాడతను. యుధ్దం భయంకరంగా జరుగుతోంది. మత్తు మందు స్టాక్ లేదు. “పోనీ పెథిడిన్ ఇవ్వండి.” కానీ అదీ లేదు. తన తోటి గూర్ఖా సైనికుడిని పిలిచాడు. “ఈ నుజ్జు నుజ్జయిపోయిన కాలును నరికెయ్” అని ఆజ్ఞాపించాడు. సైనికుడు తెల్లబోయాడు. తన పై అధికారి కాలు నరకడానికి అతనికి చేతులు రాలేదు. “నా దగ్గర కత్తి లేదు” అన్నాడు. అతని గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది. “నా ఖుక్రీ ఇవ్వు.” ఖుక్రీ అంటే గూర్ఖా సైనికుడి కత్తి. సైనికుడు ఆయనకు ఖుక్రీ చేతికి ఇచ్చాడు. “దీనితో ఈ కాలును నరికేయ్” “మై నహీ కర్ సక్తా సాహెబ్” అన్నాడు సైనికుడు. అతని ఒళ్లంతా కంపించిపోతోంది. “సరే” అన్నాడు ఆ అధికారి. తన ఖుక్రీతో తన కాలుపై ఒక్క వేటు వేశాడు. నుజ్జు నుజ్జయిన కాలు శరీరంనుంచి వేరైపోయింది. “దీన్ని తీసుకెళ్లు. ఖననం చేయి” అని ఆదేశించాడు ఆ అధికారి. తన కాలును తానే తెగనరుక్కున్న ఆ వీర సైనికుడి పేరు మేజర్ ఇయాన్ కార్డోజో. అది 1971 భారత పాక్ యుద్ధం. యుద్ధ భూమిలో పొరబాటున శత్రువు పెట్టిన ఒక మందుపాతరపై కాలు వేశాడు. అది పేలింది. అతని కాలు పూర్తిగా ముక్కముక్కలైపోయింది. దాని నుంచి మిగతా శరీరమంతా సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే తన కాలును తానే నరుక్కున్నాడు. అయితే గాయానికి చికిత్స తక్షణం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కార్డొజో ప్రాణం పోవడం ఖాయం. కార్డొజోను పెద్ద ఆస్పత్రికి తరలించడానికి హెలికాప్టర్ అందుబాటులో లేదు. మృత్యువు ముంచుకొస్తోంది. అదృష్టవశాత్తూ మన సైన్యాలకు చిక్కిన పాక్ యుద్ధ బందీల్లో ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకు వచ్చాడు. కార్డొజో తన కమాండింగ్ ఆఫీసర్ తో నాకు పాకిస్తానీ చేతుల్లో చికిత్స చేయొద్దు అన్నాడు. “నువ్వు మూర్ఖుడివా?” కమాండింగ్ ఆఫీసర్ అడిగాడు. “నీ ప్రాణం పోతుంది. ను్వ్వేం మాట్లాడకు. శస్త్ర చికిత్స జరుగుతుంది.” “అయితే నావి రెండు షరతులు” దృఢంగా అన్నాడు కార్డొజో. “షటప్… నువ్వు షరతులు విధించడానికి వీల్లేదు.” “పోనీ… రెండు అభ్యర్థనలున్నాయి. మొదటిది – నాకు పాకిస్తానీ రక్తం ఎక్కించవద్దు.” “నీకు పిచ్చా వెర్రా”? “నేను చావడానికిసిద్ధం. కానీ నాకు పాకిస్తానీ రక్తం వద్దు. రెండో షరతు. నాకు సర్జరీ చేసేటప్పుడు మీరు నా పక్కన ఉండాలి.” పాకిస్తానీ సర్జన్ మేజర్ మహ్మద్ బషీర్ ఆయనకు శస్త్ర చికిత్స చేశాడు. కాలు మెరుగుపడింది. కానీ కార్డొజో కథ అయిపోలేదు. కార్డోజో తాను సైన్యంలోనే పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. కృత్రిమ కాలును అమర్చుకున్నాడు. ఆ కాలితో నడక మొదలుపెట్టాడు. క్రమేపీ అది పరుగుగా మారింది. ఆ తరువాత కొండలు ఎక్కడం నేర్చుకున్నాడు. ఎత్తుల మీద నుంచి దూకడం నేర్చుకున్నాడు. రెండు కాళ్లు ఉన్న సైనికులు చేసే ప్రతి పనినీ చేయడం మొదలుపెట్టాడు. యుద్ధంలో చేసే పనులను చేయడం ప్రారంభించాడు. కానీ పై అధికారులు ఒంటికాలు సైనికుడు యుద్ధానికి పనికిరాడని అన్నాడు. కావాలంటే పోటీ పడతానని చెప్పాడు. పై అధికారికి కోపం వచ్చింది. “ప్రాణాల మీదకు తెచ్చుకుంటావా? శత్రువుకి దొరికిపోతే ఏం చేస్తావు?” అన్నాడు అధికారి. “నేను శత్రువుకి దొరకను.” అన్నాడు కార్డొజో. “పోటీలో పాల్గొంటే నేను నిన్ను అరెస్టు చేస్తాను జాగ్రత్త” అన్నాడు అధికారి. “సర్… మీరు నేను పాల్గొన్న తరువాతే అరెస్టు చేయగలుగుతారు. కాబట్టి ముందు నన్ను పోటీ పడనీయండి. ఆ తరువాత అరెస్ట్ చేయండి.” అన్నాడు కార్డొజో ధీమాగా. చివరికి అధికారి ఒప్పుకున్నాడు. పరుగు పందెం మొదలైంది. అందులో రెండు కాళ్లున్న ఏడుగురు ఆఫీసర్లను దాటి ముందుకు దూసుకెళ్లాడు కార్డోజో. అధికారి కార్డొజో భుజం పై ఆప్యాయంగా చెయ్యి వేశాడు. “వెల్ డన్ సర్…” అన్నాడు అమిత గౌరవంతో. ఆ తరువాత ఆ అధికారి సైన్యంలో ఉన్నతాధికారులు కార్డోజో పేరును అప్పని సైనిక దళాల ప్రధానాధికారి జనరల్ రైనాకి సిఫార్సు చేశాడు. అతని పట్టుదలను చూసిన జనరల్ ఆయనకు ఒక బెటాలియన్ కమాండర్ గా నియమించాడు. రక్షణ శాఖ అధికారులు అడ్డం పడ్డారు. “కుంటివాడు బెటాలియన్ ను కమాండ్ చేయడం ఏమిటి” అని కొర్రీలు పెట్టారు. కానీ కార్డోజో పట్టుదల ముందు అభ్యంతరాలు ఆవిరైపోయాయి. కార్డోజో యుద్ధ భూమిలో, శత్రువు స్థావరాలకు ఛాతీ ఎదురొడ్డి కశ్మీర్ లోయలో పనిచేశారు. మేజర్ జనరల్ గా రిటైరయ్యారు. భారత సైన్యంలో వైకల్యాన్ని జయించి అత్యున్నత స్థాయికెదిగిన మొట్టమొదటి మేజర్ జనరల్ ఆయనే. ఆయన తరువాత మరో ముగ్గురు యుద్ధంలో కాళ్లు పోయిన అధికారులు అత్యున్నత స్థాయికి ఎదిగారు. అందులో ఒకరికి రెండు కాళ్లూ లేవు. రిటైర్ అయిన తరువాత కార్డోజో సైన్య చరిత్ర పై పరిశోధనలు చేశారు. పుస్తకాలు వ్రాశారు. ఆయన ఎప్పుడూ నాలుగు మాటలు చెప్పేవారు. అవిః ఉన్నది ఒకటే జీవితం. పూర్తిగా జీవించు. ఉన్నది ఇరవై నాలుగు గంటలు… క్షణం తీరిక లేకుండా గడుపు. ఎప్పటికీ పట్టు సడలించకు.   (మూలం ...  రాకా సుధాకర్ )
  • ఆమె ఒక మామూలు పేదింటి మహిళ.అయితే సమస్యలపట్ల స్పందించే గుణం ఉంది ..అదే  ఆమె ప్రత్యేకత. అదే  ఎందరో మహిళల జీవితాలను మలుపు తిప్పింది. ఎన్నో సమస్యల పరిష్కారానికి పూనుకునేలా చేసింది.  ఆమె పేరే కళావతి రావత్. ఇపుడు దేశానికి కావాల్సింది ఇలాంటి మహిళలే. ఇంతకీ ఎవరీ కళావతి రావత్.   ఉత్తరాఖాండ్‌కు చెందిన కళావతి దేవీ రావత్‌. నిరుపేద కుటుంబంలో పుట్టింది. అయినా ఆ పేదరికాన్ని ఆమె ఎప్పుడు ఆటంకంగా, సిగ్గుగా భావించలేదు. 1980 లో కళావతి  వివాహం చేసుకుని చమోలిలోని ఒక మారుమూల ప్రాంతానికి వెళ్లింది. అది ఒక కొండ ప్రాంతం. అక్కడ విద్యుత్తు లేదు. చీకటి పడిందంటే అక్కడి ప్రజలు భయపడేవారు. విద్యుత్  లేని ఆ గ్రామాన్ని చూసి 17 ఏండ్ల కళావతి  కొంత నీరస పడింది.  అక్కడ శ్రద్ధలేని ప్రభుత్వ అధికారులను చూసి ఆశ్యర్యపోయింది. ఆ ప్రాంతంలో  స్త్రీలు పురుషులు చెప్పినరీతిలోనే నడవాలి. అది పురుషాధిక్య ప్రాంతం. ఆటంకాలు ఎన్ని ఎదురైనా  గ్రామాన్ని అభివృద్ధిపథంలో నడిపించి విజయాన్ని సాధించింది. మొదట గ్రామంలో కొంతమంది మహిళలను ఒక గ్రూపును  తయారుచేసింది. అందరు కలిసి ప్రభుత్వ అధికారులను కలవడానికి జిల్లా కేంద్రానికి వెళ్లారు. వారందరూ కరెంటు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఆ అధికారులకు వివరించారు.  కరెంటు కావాలని డిమాండ్‌ చేశారు. కానీ వాళ్లలో ఎటువంటి స్పందనా లేదు. అది కొండ ప్రాంతం కాబట్టి  అధికారులు 25 కిమీ దూరంలో వైర్లు, పోల్స్‌ను ఉంచారు. కానీ ఆ గ్రామానికి కరెంటు కనెక్షన్లు ఇవ్వలేదు. అందుకే తనే నడుం బిగించింది. కొంతమంది మహిళలతో కలిసి పోల్స్‌, వైర్లు తమ గ్రామానికి మోసుకుని వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు ఆమె మీద కోపంతో క్రిమినల్‌ కేసు పెట్టి జైలుకి పంపించారు. గ్రామంలోని మహిళలకు ఈ విషయం తెలియడంతో ఆమె నొక్కదాన్నే ఎందుకు జైల్లో పెట్టారు. మమ్మల్ని కూడా అరెస్టు చేయాలని మహిళలలు ఆందోళన చేశారు. దాంతో అధికారులు కళావతిని విడిచిపెట్టి ... పవర్‌గ్రిడ్‌ను ఏర్పాటుచేసి కొద్ది రోజుల్లోనే ఆ గ్రామానికి కరెంటు అందించారు. దీంతో గ్రామం మొత్తం కళావతిని అభినందించింది.  కళావతి ఏ పని నైనా  మధ్యలో వదిలేది కాదు.  కళావతి మొదటినుంచి అంతే...  1970లో చిప్కో ఉద్యమం  వచ్చింది. ఇది ఉత్తరాఖాండ్‌ ప్రజల్లో ఎంతో కదలిక తెచ్చింది. అడవుల నరికివేతకు వ్యతిరేకంగా, అడవులను రక్షించుకోవడానికి చెట్లను కౌగిలించుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. దీంతో ప్రభావితమయ్యే కళావతి కలప అక్రమ రవాణా చేస్తున్న ముఠాను కూడా పట్టించింది. ఒక రోజు కళావతి, ఇంకొక మహిళ కలిసి పశువులకు మేత తీసుకురావడానికి  అడవుల్లోకి వెళ్లారు. అక్కడ ఒక ముఠా  చెట్లను నరకడం గమనించారు. అది చూసి వాళ్లు చెట్లను నరకొద్దని బతిమిలాడారు.  కానీ  ఆమె మాటలు వారు పట్టించుకోలేదు.  పైగా ఆ ముఠా వాళ్లను కొట్టింది. చంపేస్తామని బెదిరించింది.  దీంతో కళావతి మరి కొందరు మహిళలు  కలిసి జిల్లా కేంద్రం లో 12 గంటల పాటు అడవుల నరికివేతకు వ్యతిరేకంగా ధర్నా చేశారు.  అపుడు  ప్రభుత్వ అధికారులు స్పందించారు.  తర్వాత అడవులను సంరక్షించుకోవడానికి మహిళలందరు  స్థానిక పంచాయత్‌ ఎన్నికలను  నిర్వహించాలనుకున్నారు. పంచాయతీ ఎన్నికలలో మహిళలకు కూడా స్థానం కల్పించాలని ఆమె కోరారు. కానీ అది పురుషాధిక్య ప్రాంతం కనుక తన భర్తతో సహా పురుషులెవరూ ఒప్పుకోలేదు. అయినా ఆమె పట్టువిడవకుండా పోటీ చేసి గెలుపొందారు. గ్రామం లో  స‌మ‌స్య‌గా  మారిన మ‌ద్య‌పానాన్ని అరిక‌ట్టేందుకు  సారా త‌యారు చేస్తున్న ప్రాంతాల‌కు తోటి మ‌హిళ‌ల‌తో క‌లిసి వెళ్లి ఆ స్థావ‌రాల‌ను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో  ఆమెకు కొన్ని వ‌ర్గాల నుంచి బెదిరింపులు వ‌చ్చాయి. అయినా ఆమె భ‌య‌ప‌డ‌లేదు. మెల్లగా  పురుషుల్లో కూడా మార్పు వ‌చ్చింది.  మ‌హిళ‌ల‌ను అన్ని ప‌నుల్లోనూ భాగ‌స్వాములు చేయడం ప్రారంభించారు.  క‌ళావ‌తి మ‌హిళలు సొంతంగా ఎదిగేలా వారికి త‌గిన ఉపాధి కార్య‌క్ర‌మాల‌ను క‌ల్పించ‌డం కోసం కృషి చేసింది. అడ‌విలో చెట్ల‌కు పండే పండ్లు, మొక్క‌ల నుంచి వ‌చ్చే సుగంధ ద్ర‌వ్యాల‌ను సేక‌రించి మార్కెట్‌లో అమ్ముతూ లాభం పొందేలా మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇప్పించింది. దీంతో ఆ గ్రామం ఇప్పుడు ప్ర‌గ‌తి ప‌థంలో దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలో క‌ళావ‌తి రావ‌త్‌కు 1986లో ఇందిరా ప్రియ‌ద‌ర్శిని అవార్డు కూడా వ‌చ్చింది. ఆ తర్వాత ఆమెకు అనేక అవార్డులు, రివార్డులు కూడా వ‌చ్చాయి. అయిన‌ప్పటికీ ఆమెకు ఒకింత గ‌ర్వం కూడా లేదు. చూస్తే ఓ సాధార‌ణ మ‌హిళ‌లాగే క‌నిపిస్తుంది. ఇంత‌కీ క‌ళావ‌తి రావ‌త్ ఎంత వ‌ర‌కు చ‌దువుకుందో తెలుసా..? ఆమెకు అస్స‌లు చ‌దువే రాదు. అవును... నిజ‌మే. ఇలాంటి మహిళలు గ్రామానికి ఒకళ్ళు ఉంటే చాలు .. దేశం దూసుకు పోతుంది వృద్ధిపధంలో