Latest News
ప్ర‌ముఖులు

ఆ ఇద్దరికీ డిసెంబర్ అచ్చిరాలేదా ?

1st Image

అన్నాడీఎంకే  అగ్ర నేతలకు డిసెంబర్ నెల ఆచ్చి రాలేదు.
పార్టీ వ్యవస్థాపకుడు ఏంజీఆర్  1987 డిసెంబర్ 24న కన్నుమూసారు.  1984 లో ఎంజీఆర్‌  అనారోగ్యం పాలయ్యారు. ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించేందుకు అమెరికాలోని న్యూయార్క్‌ బ్రూక్లిన్ టౌన్ స్టేట్‌ ఆస్పత్రి వైద్యులను ప్రత్యేక విమానంలో చెన్నైకి వచ్చారు.. ఈ వైద్యుల బృందం ఎంజీఆర్‌ ఆరోగ్యాన్ని పరిశీలించి, కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వెంటనే మార్పిడి చేయాలని సూచించారు . దీంతో ఎంజీఆర్‌ను నవంబరు 5న అమెరికాకు తరలించి.. ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ అనంతరం ఎంజీఆర్‌ కోలుకున్నారు. ఆయన అక్కడ చికిత్స పొందుతున్న సమయలోనే 1984 డిసెంబరు 24, 27 తేదీల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ప్రకటించారు.
అమెరికా ఆస్పత్రి నుంచే  ఆండిపట్టి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎంజీఆర్‌ తరపున నామినేషన్ దాఖలైంది. ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘనవిజయం సాధించింది. అమెరికాలో చికిత్స ముగించుకుని ఎంజీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో 1985 ఫిబ్రవరి 4న చెన్నైకు తిరిగొచ్చారు. 1985 ఫిబ్రవరి 10న సీఎంగా పదవీ ప్రమాణం చేసిన ఎంజీఆర్‌ 2 సంవత్సరాల 10 నెలల పాటు పాలించారు. ఈ కాలంలో ఆయన పలుమార్లు అమెరికా వెళ్లి చికిత్స పొందారు. 1987 డిసెంబరు 24వ తేదీ తెల్లవారుజామున 3.30కు తన నివాసంలో ఎంజీఆర్‌ కన్ను మూశారు. 
అంతకు ముందు రోజు నుంచే ఎంజీఆర్ కొంత నలత గా ఉన్నారు. వ్యక్తిగత వైద్యులు  డా. సుబ్ర్యమణియన్ చెప్పినప్పటికీ ఎంజీఆర్ హాస్పిటల్ లో జాయిన్  కాలేదు. ఆ నిర్లక్ష్యమే గుండె పోటుకి దారి తీసింది. 
ఇక ఎంజీఆర్ వారసురాలు ,సన్నిహితురాలు జయలలిత కూడా చివరి రోజుల్లో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపలేదని అంటారు. జయలలిత జ్వరంతో బాధపడుతూ 2016 సెప్టెంబరు 22వ తేదీ రాత్రి 10.30కు గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోశ, అవయవాల ఇన్ఫెక్షన్‌ నియంత్రణలో నిపుణుడిగా పేరుగాంచిన లండన్ కు చెందిన డాక్టర్‌ జాన్  రిచర్డ్‌ బీలే సెప్టెంబర్‌ 30న అపోలోకు వచ్చి జయకు చికిత్స  అందించారు. బాగా కోలుకుంది ... రేపో మాపో ఇంటికి తిరిగి వస్తుందని భావిస్తున్న తరుణంలో  కార్డియాక్ అరెస్ట్ తో డిసెంబర్ 5 న జయ కనుమూశారు , 
ఈ ఇద్దరూ కూడా  పదవిలో ఉండే చనిపోవడం  యాదృచ్చికం కావచ్చు. 

  • రెండు తరాలకు ముందు కొంచెం పొలం పుట్రా ఉండి, ఆర్ధిక స్థోమత మెరుగ్గా  ఉన్న వారి ఇళ్లల్లో భోషాణం పెట్టెలు ఉండేవి. విలువైన సామాన్లు,  బంగారం, వెండి వస్తువులు , నగదు అందులోనే దాచే వారు. ఇందులో అరలుంటాయి. వీటిలో రకరకాల సైజులు ఉండేవి. పెద్ద వాటిని భోషాణం అంటారు .  చాలా చిన్న వాటిని  కావిడి పెట్టి, రంగం పెట్టి, రంగూన్ పెట్టి అనేవాళ్ళు. పాత కాలంలో ఆడపిల్ల అత్తవారి ఇంటికి వెడుతూంటే ఆమె వస్తువులు బట్టలు అన్నీ ఇందులో పెట్టుకుని  పట్టుకెళ్ళేది. దీనిని కావడిలో వేసి పట్టుకెళ్ళేవారు సారితో సహా.  ఈ పెట్టెలను స్థోమతను బట్టి మామూలు టేకుతోను, రంగూన్ టేకుతోను చేయించుకునే వారు. కాలక్రమం లో భోషాణాలు పోయి బీరువాలు వచ్చాయి. ఈ తరం లో చాలామందికి భోషాణం పెట్టె గురించి అసలు తెలియదు.  ఇక అసలు కథలోకి వెళ్తే ఆంధ్రుల అభిమాన నటుడు ఎన్టీ రామారావు దగ్గర కూడా ఒక పెద్ద సైజు భోషాణం పెట్టె ఉండేది.  అది వారసత్వంగా వచ్చిందట. దాన్ని ఎన్టీఆర్ అపురూపంగా చూసుకునే వారు. ఆ భోషాణం కోసం ప్రత్యేకంగా ఒక గది కేటాయించారు. దానికెపుడూ తాళం వేసి ఉండేదట. లోపల భోషాణానికి ఒక తాళం వేసేవారట. తాళంచెవులను  పొరపాటున కూడా ఎవరికి ఇచ్చేవారు కాదట.  వాటిని  మొలతాడుకి చుట్టుకునే వారట. ఇంతకూ ఆ భోషాణంలో ఏమి ఉండేవంటే డబ్బు ,దస్కం ,నగలు ,నట్రా ఉంచేవారు. ఎన్టీ ఆర్ కి ఒక్కరికే పరిమితమైన వస్తువులన్నీ అందులో ఉంచేవారట. సినిమా తాలూకు పారితోషకం కానీ ఇతరత్రా  ఆయనకు వచ్చే నగదు కానీ అన్ని భోషాణం లోనే దాచేవారట.  వంద నోట్ల కట్టలు ఎక్కువుగా దాచేవారట.ఎన్టీఆర్ కి కొత్త నోట్లు అంటే చాలా ఇష్టమట. అందులో దాస్తే మళ్ళీ బాటకు తీసే వారు కాదట. పాత నోట్లు ఎప్పటికపుడు వాడేసే వారట. అయితే ఎన్టీఆర్ మంచాన పడి కొంచెం కోలుకున్నాక  అబిడ్స్ ఇంటి నుంచి బంజారా హిల్స్ ఇంటికి మారారు . అది చిన్న ఇల్లు కావడం తో  దగ్గరలోనే మరో  స్థలంలో బిల్డింగ్ కట్టించి అందులోకి  ఈ పెద్ద భోషాణం పెట్టెను తరలించారు. అందులోని నగ నట్రా , నగదు  ఇంట్లో ఉన్న బీరువాల్లోకి మార్చేశారు. ఎన్టీఆర్ మరణించిన రాత్రి  ఆ బీరువాల్లోని  నోట్లకట్టలే  సూటు కేసులు ద్వారా బయటకు తరలి వెళ్లాయి . అలా బయటికెళ్లిన సొమ్ములో కొంత మొత్తమే వెనక్కి వచ్చింది. ప్రస్తుతం ఎన్టీఆర్ మ్యూజియం పేరిట ఉన్న భవనంలో ఆ పాత భోషాణం పెట్టె, ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వాడిన చైతన్య రధం, ఇంకా సినిమాల్లో వాడిన కిరీటాలు, గదలు, ఇతర వస్తువులు  భద్రంగా ఉన్నాయి. అది ఎన్టీఆర్ భోషాణం పెట్టె కథ.  inputs by  Tipparaaju Ramesh Babu  
  • ఈరోజుల్లో చిన్న కార్పొరేటర్ అయితే చాలు ఎపుడు ఏ ప్రాజెక్ట్ కోసం పైరవీ చేద్దామా అని ఆలోచన చేస్తాడు . అదే ఎమ్మెల్యే అయితే  ఇక చెప్పనక్కర్లేదు. కానీ ప్రజలకోసం ఆలోచించే వాళ్ళు బహు తక్కువ. అలాంటి వారిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  ఒకరు. అయన చాలా సాధారణ వ్యక్తిగా నియోజకవర్గంలో పర్యటిస్తుంటారు. రోడ్డు పక్కనే చిన్నచిన్న టిఫిన్ సెంటర్‌లోఏదో ఒకటి తినేస్తుంటారు.అక్కడే నిలబడి ప్రజలతో మాట్లాడుతుంటారు.ప్రజలకోసం ఏ అధికారి నైనా కలుస్తారు. భేషజాలకు పోరు.  ఏదైనా అన్యాయం జరుగుతుంటే  మాత్రం  ధైర్యంగా పోరాటం చేసేందుకు ముందుకొస్తారు. ఓటుకు నోటు కేసు లో చంద్రబాబు తో పోరాటం సామాన్యమైన విషయం కాదు.  బాబు ఆడియో టేపులను ఫోరెన్సికల్ ల్యాబ్‌కు పంపి అవి నిజమైనవేనని తేల్చుకుని వాటి  ఆధారంగా ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఆ విషయం అందరికి తెల్సిందే.  ఇప్పుడు ఎమ్మెల్యే ఆర్కే మరో కొత్త యోచన  చేస్తున్నారు.  పేదలకు  తక్కువ ధరలోనే భోజనం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆర్కే హైదరాబాద్  జీహెచ్‌ఎంసీలో అమలవుతున్న ఐదు రూపాయల భోజన పథకాన్ని పరిశీలించారు. హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న భోజన కేంద్రానికి వెళ్లి క్యూలో నిలబడి అందరిలాగే భోజనం చేశారు ఆర్కే. ఈ సందర్భంగా రూ. 5 భోజనం కోసం రావడం వెనుక కారణమేమిటని ఆరా తీయగా.. ఎమ్మెల్యే ఆర్కే తన మనసులో మాట బయటపెట్టారు.  హరే కృష్ణ పౌండేషన్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న రూ. 5భోజన పథకం పనితీరు బాగుందన్నారు. తాను కూడా తన నియోజకవర్గంలోని పేదల కోసం ఇలాంటి పథకాన్నే సొంత డబ్బుతో ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. అందులో భాగంగా ఈ పథకం పనితీరును పరిశీలించేందుకు హైదరాబాద్ వచ్చినట్టు చెప్పారు. రూ. 5 కే మంగళగిరిలోని పేదలకు భోజనం అందించే కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడుతున్నట్టు చెప్పారు. తమాషా ఏమిటంటే ఏపీ సీఎం చంద్రబాబు గతంలో అన్నాక్యాంటీన్లు పెడుతామని  హామీ ఇచ్చారు కానీ మర్చి పోయారు. ఇపుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఇలాంటి పధకాన్ని ప్రారంభించాలనుకోవడం నిజంగా గొప్పే కదా !
  • ( Vasireddy Venugopal )..........  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తీసుకున్న నిర్ణయాలు.. భారతదేశానికి నిశ్చయంగా ప్రయోజనం చేకూర్చుతాయి. ఆదర్శంగా నిలుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్లలను విధిగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలి. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు విధిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జాయిన్ కావాలి.. అనేది.. దేశ ప్రజల చిరకాల ఆకాంక్ష. ఆ విధంగా నడుచుకోకపోతే.. ఇంక్రిమెంట్లలో కోత విధించడం, ఇతర ఆర్ధిక ప్రయోజనాల్లో కోత విధించడం.. యోగి తీసుకున్న సాహసోపేత నిర్ణయం. నా మటుకు నేను చాలా కాలంగా... ఇలాంటి విధానం వుండాలని ప్రతిపాదించిన వాడిని. change.org ద్వారా ఆన్ లైన్ పిటిషన్ కూడా వేసి వున్నాను. ఇలాంటి విధానం వుండాలని కోరుతూ సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ విచారణలో వున్నట్టు గుర్తు. యోగి ఆదిత్యనాధ్ తీసుకున్న నిర్ణయం సమర్ధవంతంగా అమలుకావాలని, దేశవ్యాప్తంగా ఆచరించవలసిన విధానంగా, పాలసీగా రూపొందాలని నేను ఆకాంక్షిస్తున్నాను. దీనివల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. 1. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయాలు వున్నాయి. కానీ వాటిని ఉపయోగించుకోవడం లేదు. అనేక సంవత్సరాలుగా వాళ్లు యూనియన్ల శక్తితో పోరాటం చేసి, నేరుగా కార్పొరేట్ వైద్య సదుపాయాలకు అర్హత పొందారు. 2. ప్రభుత్వ ఉద్యోగులు విధిగా ప్రభుత్వ ఆస్పత్రిలోనే చేరాలనే నిబంధన వల్ల, సామాన్య ప్రజానీకానికి ఎనలేని ప్రయోజనం చేకూరుతుంది. ఉదాహరణకు.. హైదరాబాద్ లో ఒక గాంధీ, ఒక ఉస్మానియా ఆస్పత్రిలో విధిగా చేరడం అనివార్యమైనప్పుడు.. అక్కడ మెరుగైన సౌకర్యాలకోసం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెడతాయి. ఇలాంటి ఆస్పత్రులను అత్యాధునికంగా రూపొందించడం ప్రభుత్వానికి అనివార్యం అవుతుంది. దానివల్ల 100మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనంతో పాటు, 10000 మంది సామాన్య జనం కార్పొరేట్ ఖరీదు వైద్యం బారినుంచి బయటపడతారు. 3. విద్యారంగంలోనూ ఇలాంటి ప్రయోజనాలే సామాన్యులకు అందుబాటులోకి వస్తాయి. జిల్లాకో కేంద్రీయ విద్యాలయ, మండలానికో నవోదయ.. ఇలా అనేక మెరుగైన విద్యా సదుపాయాలు ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా సామాన్యులకూ అందుబాటులోకి వస్తాయి. 4. ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యం పొందడానికి ప్రైవేటు వాళ్లకు వుండే అవకాశం, ప్రభుత్వం వాళ్లకు ఎందుకు వుండరాదు? అని ప్రభుత్వ ఉద్యోగులు అమాయకంగా ప్రశ్నించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ప్రజలు చెల్లించే పన్నులనుంచి చెల్లిస్తున్న వేతనాలు. ప్రభుత్వ ఉద్యోగులు ఆరోగ్యంగా వుండి, మెరుగైన సేవలు అందించడంకోసం మెడికల్ అలవెన్సులను కూడా సమాజం చెల్లిస్తున్నది. వారి పిల్లాపాపల విద్య, వైద్యారోగ్యాలకోసం కూడా సమాజం చెల్లిస్తున్నది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు విధిగా గుర్తుంచుకొని తీరాలి. కేవలం తమ వేతనాల పెంపుదలకోసమే కాకుండా, తమ మెరుగైన భవిష్యత్తుకోసమే కాకుండా, సమాజం ఉప్పు తింటున్నందుకు గాను ఉద్యోగ సంఘాలు సమాజంకోసం కూడా ఆలోచించాల్సి వుంటుంది. ఆ బాధ్యతనుంచి తప్పించుకోవడం ఎల్లకాలం సాధ్యం కాదు.
  • సరిగ్గా 14 ఏళ్ళ క్రిందట వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయన జీవిత గమనాన్ని మార్చివేసింది. పాదయాత్ర తర్వాత ఆయన ఇమేజ్ ఒక్కసారిగా పెరిగింది. రాజకీయంగా దశ,దిశ మారాయి. అప్పటి పరిస్థితుల్లోప్రజలకు వైఎస్ ఒక్కరే  తిరుగులేని ప్రత్యామ్నాయంగా కనిపించారు. పార్టీ లో కూడా వైఎస్ అంటే గిట్టని కొందరు సైలెంట్ అయి పోయారు.ఇక మన ఆటలు సాగవని గ్రహించేశారు. వైఎస్ తో రాజీకొచ్చేశారు. అందుకే 2004 లో టిక్కెట్ల పంపిణీ లో ఎలాంటి గందరగోళాలు లేవు.అసలు ఈ పాదయాత్ర ఆలోచన వైఎస్ కి ఎవరిచ్చారు ? అది ఆయన సొంత ఆలోచనే. ముందుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు వివరించారు.ఆమె  రిస్క్ కదా అంటే ఇదొక ఛాలెంజ్ అన్నారట. ఆమె ఒకే అనడం వెంటనే ఏర్పాట్లు జరిగిపోయాయి. కాంగ్రెస్ కు ఏపీలో బలం అంతంతమాత్రంగా ఉన్న వేళ.. వైఎస్  పాదయాత్రను  తెరవెనుక ఉండి  విజయపధంలో నడిపించింది  కేవీపీయే. ఈ పాద యాత్ర  కాంగ్రెస్ కు బలమైన పునాది ఏర్పాటు చేసి ... పదేళ్లు అధికారంలో ఉండేలా చేసిందని చెప్పుకోవాలి. పాదయాత్రలో వైఎస్ రిస్క్ ఎదుర్కొన్నారు. దాని ఫలితమే  2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  ఘనవిజయం.వైఎస్ సీఎం అయ్యారు. నాడు పాదయాత్ర యోచన వైఎస్ కి రాకపోయినట్లయితే 2004 నాటి పరిస్థితులు ఎలాఉండేవో ?? ఇక నాటి పాదయాత్రలో ఎన్నోప్రజా  సమస్యలను వైఎస్ అవగతం చేసుకున్నారు. నేతలకు ,ప్రజలకు మరింత సన్నిహితమైనారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభించి.. 11 జిల్లాల్లో 56 నియోజకవర్గాల మీదుగా 68 రోజులపాటు నిప్పుల కురిసే ఎండలో వైఎస్ నడిచారు. 1470 కిమీల మేర సాగిన ఈ ప్రజాప్రస్థాన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగిసింది. తెలుగువారి చరిత్రలో మరుపురాని ఘట్టంగా ఈ పాదయాత్ర మిగిలిపోయింది. ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఆయనకు నీరాజనం పలికారు. మొదటి రోజు నుంచి మొదలుపెడితే చివరి అడుగు వరకు లక్ష్యాన్ని చేరుకోవడంలో చెక్కుచెదరని విశ్వాసమే వైఎస్ ను ముందుకు నడిపించింది. తెలంగాణలోని రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆయన పాదయాత్ర అత్యధిక భాగం పీపుల్స్‌వార్‌తోపాటు వివిధ నక్సలైట్‌ గ్రూపులకు కంచుకోటలుగా నిలిచిన గ్రామాల గుండా సాగింది. ప్రజాప్రతినిధులు కొన్ని దశాబ్దాలుగా అడుగుపెట్టని గ్రామాలకు వెళ్లడమే కాదు.. రాత్రుళ్లు అక్కడే గుడారాలు వేసుకుని బస చేశారు. మీడియా కూడా వైఎస్ పాదయాత్ర కు మంచి ప్రచారాన్ని ఇచ్చింది. వైఎస్ ను వ్యతిరేకించే ఆంద్ర జ్యోతి  ప్రత్యేకంగా ఒక కాలం పెట్టి యాత్ర కవరేజ్ ఇచ్చింది. ఈనాడు కూడా బాగానే పాదయాత్రను కవర్ చేసింది. అలాగే వార్త కూడా. జాతీయ ఎలక్ట్రానిక్ మీడియా మధ్యలో అందుకుని మంచి కథనాలను ప్రసారం చేసాయి. ఏదైనా అప్పట్లో అదొక రికార్డు.    ..... KNMURTHY
  • రాజకీయాల్లో అపుడపుడు  తమాషాలు జరుగుతుంటాయి. 1982 లోతెలుగు దేశం పార్టీ పెట్టి  కేవలం 9 నెలల కాలంలో పగలనక రేయి అనక అవిశ్రాంతంగా  ప్రచారం చేసి అద్భుతమైన విజయం సాధించిన దివంగత నేత నందమూరి తారకరామారావు  1989 లో కల్వకుర్తి  లో పోటీ చేసి ఓడిపోయారు. ఎవరూ ఊహించని ఓటమి అది. ఎన్టీఆర్ కూడా అక్కడ  ఓటమి ఎదురవుతుందని అనుకుని ఉండరు. ఎన్టీఆర్ కి రాజకీయాల్లో అదొక మరువలేని షాక్. అంతే కాదు అప్పటి ఎన్నికల్లో తెలుగు దేశం అధికారం కోల్పోయి 71 స్థానాలతో ప్రతి పక్షం లో కూర్చోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో  ఎన్టీఆర్ ఖిన్నుడయ్యారు. అసెంబ్లీ కంటే లోకసభ ఎన్నికల తీర్పు మరీ ఘోరంగా ఉంది. తెలుగు దేశం కేవలం రెండు స్థానాల్లో నే గెలిచింది. ఇక ఎన్టీఆర్ ను కల్వకుర్తి లో పోటీ చేయమని అప్పటి జనతాదళ్ నేత  జైపాల్ రెడ్డి సూచించారు.1969....  1983 లో జైపాల్ రెడ్డి ఇక్కడ నుంచి గెలిచారు. అయితే అక్కడి భౌగోళిక పరిస్థితులు, ఓటర్ల తీరు తెన్నులు, ప్రజల సమస్యలు , ప్రభుత్వ పధకాల అమలు తీరు...  తదితర  అంశాలపై టీడీపీ సరిగ్గా స్టడీ చేయలేదు. కొంతమంది అక్కడ పోటీ చేయ వద్దని చెప్పినా ఎన్టీఆర్ వినలేదు. హిందూ పూర్ ,కల్వకుర్తి రెండు చోట్ల పోటీకి దిగారు.కల్వకుర్తి లో  బంజారాల ఓట్లు 25 వేలకు పైగా ఉన్నాయి. వారంతా   కాంగ్రెస్ అనుకూల వైఖరితో ఉన్నారు. అధికారంలో కొచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఆ ప్రాంతంలో అసలు పర్యటించలేదు. అక్కడ ప్రచారం పెద్దగా జరగకపోవడం. ఎన్టీఆర్ కూడా ప్రచారం చివరి రోజు 3 గంటలపాటు ప్రచారానికొచ్చారు.  స్థానిక సమస్యల పట్ల ప్రభుత్వ ఉదాసీనత,టీడీపీ ప్రచారం కోసం ఎవరికి డబ్బులు ఇవ్వకపోవడం వంటి అంశాలు ఆయన ఓటమికి దారి తీశాయి. కాగా  అంతకుముందు 31మంది మంత్రులను బర్తరఫ్ చేయడం, న్యాయస్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు,  ప్రజల్లో గూడు కట్టుకున్నఅసంతృప్తి వంటి అంశాలు ఓటమి కి దోహద పడ్డాయి .వీటన్నిటితో పాటు పార్లమెంట్ ,అసెంబ్లీ కి కలిపి ఒకేసారి ఎన్నికలు జరగడం కూడా ఎన్టీఆర్ కి మైనస్ అయింది . ఎన్టీఆర్ పై పోటీ చేసిన చిత్తరంజన్ దాస్ కేవలం 3568 ఓట్ల ఆధిక్యత తో గెలుపొందారు. ఎన్టీఆర్ కి 50786 ఓట్లు రాగా చిత్తరంజన్ దాస్ కి 54354 ఓట్లు వచ్చాయి. మరో నలుగురు ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు కానీ వాళ్ళు పెద్దగా ఓట్లు చీల్చలేదు. ఫలితాలకు ముందే ఇంటెలిజెన్స్ అధికారులు ఎన్టీఆర్ గెలవడం కష్టం అని చెప్పారు.. కానీ ఎన్టీఆర్ ప్రజలపై గట్టి నమ్మకం ఉంచారు. అయితే ఆయన అంచనాలు  తారుమారు అయ్యాయి. ఇక హిందూ పూర్ లో మాత్రం గెలిచారు. ఈ చిత్తరంజనుదాస్ 85 లో కూడా కల్వకుర్తి నుంచి గెలుపొందారు.94 లో మాత్రం ఎడ్మ కృష్ణారెడ్డి ఇండిపెండెంట్గా  పోటీ చేయగా ఆయన చేతిలో ఓడిపోయాడు. అది కూడా నాలుగో స్థానం లో నిలిచాడు.  ఎన్టీఆర్ పై గెలిచినప్పుడు మాత్రం మంత్రి గా చెన్నారెడ్డి క్యాబినెట్ లోకి తీసుకున్నారు.తర్వాత నియోజకవర్గంపై పట్టు పెంచుకోలేక పోయారు. అదే సమయంలో మహబూబ్ నగర్  నుంచి లోకసభకు పోటీ చేసిన జైపాల్ రెడ్డి కూడా ఓడిపోయారు.  .... KNMURTHY
  • శివా రాచర్ల అంటే  అందరికి రాజకీయాలు,ఎన్నికలు, నీటి ప్రాజెక్టులు గుర్తొస్తాయి . శివా కు చరిత్ర , ప్రకృతి, దేవాలయాలు వంటి అంశాలపై కూడా గట్టి పట్టు ఉంది. ఎన్నో స్టోరీస్  వాటిపై రాశారు. తాజాగా శివా రాసిన ఆర్టికల్ ఇది .  కాకతీయ" సామ్రాజ్యం ఒక్క ఓటమితో రాత్రికి రాత్రే ఏలా అంతరించింది? వెరీ ఇంటరెస్టింగ్ సబ్జెక్టు ... చదవండి మరి.   (శివా రాచర్ల ) .....     దక్షిణ భారత చక్రవర్తులు మొత్తం ఆంద్రప్రదేశ్ ప్రాంతాన్ని పాలించిన ఏకైక తెలుగు వంశం "కాకతీయ" సామ్రాజ్యం ఒక్క ఓటమితో రాత్రికి రాత్రే ఏలా అంతరించింది? ఇది స్పష్టమైన సమాధానం లేని ప్రశ్న. అసలు ప్రతాపరుద్రుని మరణంతో కాకతీయ వంశం అంతరించిందా?   ఛతీస్ ఘడ్ కి  ప్రతాపరుద్రుని కుటుంబం వలస వెళ్ళిందా?ఇది కూడ పూర్తి ఆధారాలు లేని ఆలోచన,అదే సంధర్భంలో కొట్టిపారేయటానికి అవకాశంలేని అంశం కూడా ! 2014లొ "ఖ్లిల్లా మైసమ్మ" గుడి యాత్రలో పరిచయమైన సాధిక్ అన్న 2015 ఫిబ్రవరిలో వరంగల్ చుట్టుపక్కల చూడదగిన ప్రాంతాలు చెప్పమని అడగటంతో ఏటూర్ నాగారం అడవి ప్రాంతంలో గోదావరి తీరంలో వున్న "మల్లూరు" నరసింహ స్వామి గుడి గురించి చెప్పాను.ఆగుడిలో విగ్రహం మానవ శరీరంలాగ మెత్తగా వుంటుందంట,వెంట్రుకలు కూడ పెరుగుతాయని నమ్ముతారు.వీటన్నింటిని మించి మల్లూరుకు చారిత్రక ప్రాముఖ్యత వుంది.సాధిక్ అన్న గత వారం రెండవసారి మల్లూరుకు వెళ్ళారు. చరిత్ర కోణంలో అక్కడి విషయాలను పరిశీలించి నిన్న "సమాధులు పిలుస్తున్నాయి" అని పోస్టు పెట్టారు.... నా ప్రశ్న "చతీష్ ఘడ్కు ప్రతాపరుద్రుని కుటుంబం వలస వెళ్ళిందా?"కు సమాధానం "నిజం" అయితే ప్రతాపరుద్రుని కుటుంబం మల్లూరు ద్వారానే వలస వెళ్ళివుంటారనటానికి ఎక్కువ అవకాశాలు వున్నాయి. కొంచం చరిత్రలోకి వెళితే ప్రతాపరుద్రుడు 1290 సంవత్సరంలొ చక్రవర్తి అయ్యారు.1296లో రుద్రమ చనిపోయేంత వరకు ఆవిడ సహాయంతో పాలన కొనసాగించాడు.1300 సంవత్సరం నాటికి ఉత్తరభారతం మొత్తం మహ్మదీయ పాలనలోకి(ఖిల్జి వంశం) వచ్చింది.దక్షిణాదిని కూడ ఆక్రమించాలి అని మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సేనలను పంపించారు. మాలిక్ కాఫర్ మొదట "దేవగిరి"ని(ఇదే దౌలతాబాద్ పేరుతో తుగ్లక్ పాలనలో దేశ రాజధాని అయ్యింది) గెలిచి ఓరుగల్లు వైపు సైన్యాన్ని నడిపించారు.1303లో ఓరుగల్లు మీద మాలిక్ కాఫర్ నాయకత్వంలో మొదటి దండయాత్ర జరిగింది.ఈ యుద్దంలో డిల్లి సుల్తాన్ సేనలు పూర్తిగా పరాజయం చెంది పారిపోయాయి. ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని డిల్లి సేనలు మాలిక్ కాఫర్ నాయకత్వంలో 1309లో రెండవసారి ఓరుగల్లు మీద దాడిచేశాయి.యుద్దం నాలుగు నెలల పాటుసాగంది,గెలుపు ఓటములు తేలలేదు కాని కోటలోపల వున్న ప్రతాపరుద్రుని సైన్యానికి తగినంత తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది,ప్రజలు ఇబ్బంది పడ్డారు.దీనితో ప్రతాపరుద్రుడు మాలిక్ కాఫర్తో సంధి చేసుకోని డిల్లి సుల్తానుకు కప్పం కట్టటానికి అంగీకరించాడు.ఈ సంధర్భంలోనే కోహినూర్ వజ్రాన్ని ప్రతాపరుద్రుడు డిల్లి సుల్తానుకు బహుమతిగా ఇచ్చారంటారు. డిల్లి సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జి సేనలు మాలిక్ కాఫర్ నాయకత్వంలో దక్షిణంగా ప్రయాణినించి పాండ్యులను ఓడించారు,ఈయుద్దంలో ప్రతాపరుద్ర సేనలు డిల్లి సుల్తాన్ తరుపున యుద్దంలో పాల్గొన్నాయి. 1316లొ డిల్లి సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జిని మాలిక్ కాఫర్ కుట్రతో చంపటం,ఇది జరిగిన కొన్ని నెలలకే మాలిక్ కాఫరును సొంత సైనికులు చంపటంతో ఖిల్జి వంశం క్షీణించి చివరికి 1320లో ఘియాసుద్దీన్ నాయకత్వంలో "తుగ్లక్" వంశ పాలన మొదలైంది. ఖిల్జి చివరి సుల్తాన్ 1318లో కూడ ఓరుగల్లు మీద దాడిచేశారు.యుద్దం ఎక్కువ రోజులు జరగలేదు, ప్రతాపరుద్రుడు సంధి చేసుకున్నాడు. డిల్లి పీఠంలో వచ్చిన అధికార మార్పులతో ప్రతాపరుద్రుడు మరోసారి కప్పం కట్టటం మానేసి స్వతంత్రుడిగా ప్రకటించుకున్నాడు.దీనితో సుల్తాన్ తన కొడుకు ఉలుగ్ ఖాన్(ఇతనే వాసికెక్కిన మహమద్ బీన్ "తుగ్లక్") నాయకత్వంలో 1323లో ఓరుగల్లు మీదికి దాడికి పంపించాడు. వరుస దాడులతో ఆర్ధికంగా నష్టపోయి వుండటం,సైన్యం కూడ పూర్తిగా కోలుకోక పోవటంతో డిల్లి సేనలు సులభంగా ఓరుగల్లు కోట వరకు రాగలిగాయి. ఓరుగల్లులో ఒకదాని లొపల ఒకటి మొత్తం 7 కోటలు వుంటాయి,అంటే ప్రత్యర్ధులు ప్రతాపరుద్రుని బంధించాలంటే 7 కోటలను జయించాలి. ఆరు నెలలకు పైగా యుద్దం జరిగింది.ఒక్కో కోటను దాటటానికి కొన్ని వారాల సమయం పట్టింది.ఎంతకాలానికి కాక్తీయ సైన్యం లొగకపోవటం, యుద్దం ముగింపుకు రాకపోవటంతో డిల్లిసేనలు గ్రామాల మీద దాడి చేసి దోచుకోని గ్రామాలను తగలపెట్టాయి. చివరికి ప్రతాపరుద్రుడు లొంగక తప్పలేదు. డిల్లి సేనలు ప్రతాపరుద్రుని బంధించి డిల్లికి తీసుకు వెళుతుండగా ఆయన నర్మద నదిలో దూకి ఆత్మత్యాగం చేసుకున్నాడు. అయితే ప్రతాపరుద్రుని కుటుంబం,మిగిలిన కాకతీయ వశస్తులు ఏమయ్యారు అన్నదాని మీద స్పష్టతలేదు. ప్రతాపరుద్రుని కొడుకు "కృష్ణుడు" హరిహర & బుక్కరాయల తరుపున విజయనగర స్థాపనలొ పాలుపంచుకున్నాడని కొందరు చరిత్రకారులు రాశారు.చాలా మంది కాకతీయ వంశస్తులు చత్తీష్ ఘడ్కు వలస వెళ్ళారని మరికొందరు రాశారు. కాకతీయ వంశస్తులు ఓరుగల్లు నుంచి చత్తీష్ ఘడ్కు ఏలా వెళ్ళి వుంటారు అన్న ప్రశ్నకు "మల్లూరు" ద్వారా వెళ్ళి వుంటారని అనిపిస్తుంది. ఓరుగల్లు కోటలో రహస్య మార్గాలు,సొరంగాలు వుండి వుంటాయి అన్నదాంట్లొ అతిశయోక్తి లేదు.ఇలాంటి సొరంగ మార్గంలో కోట నుంచి బయటపడిన కాకతీయ వంశస్తులు అడవి మార్గం ద్వార మల్లూరు కోటకు చేరివుండవచ్చు. మల్లూరు గుట్టల మీద కోట గోడ ఇప్పటికి వుంది.ఇక్కడి నుంచి గోదావరి నదిని దాటి అటు వైపు వున్న చర్ల కోట లేక ప్రతాపరుద్రుని మరో కోటలోనో తాత్కాలిక విరామం తీసుకోని "తాలిపేరు" నది మార్గంలో చత్తీష్ ఘడ్కు వెళ్ళివుంటారని నా అభిప్రాయం. సాధిక్ అన్న మల్లూరు గుట్టల మీద వందల కొద్ది "సమాధు"లను చూశారు.ఇవి డొల్మైనలలాగ కనిపిస్తున్నాయి.మల్లూరు గుట్టల మీద కనిపించిన గుట్టల కొద్ది కంకర కలిసిన చిన్న రాళ్ళ గుట్టలు "చరిత్ర"లొ బయటపడని రహస్యానికి సాక్షంగా వున్నాయి. అప్పట్లో సున్నం,నల్ల బెల్లం,కోడి గుడ్డు సొనను కలిపి కాంక్రీట్ మిశ్రమంలాగ తయారుచేసి నిర్మాణాలకు వాడేవారు. ఇప్పుడు మల్లూరు గుట్టల మీద కఅనిపిస్తున్న చిన్న చిన్న రాళ్ళు ఇవే అయ్యుండటానికి అవకాశం వుంది. కాకతీయుల వంశం అంతరించి వుండవచ్చు కాని ప్రతాపరుద్రుడు మరణించిన 10-13 సంవత్సరాలకేే ఓరుగల్లు కాకతీయుల మాజి సామమంతులైన "ముసునూరి" నాయకుల పాలనలోకి వచ్చింది. 1323లో ప్రతాపరుద్రుడు మరణించిన తరువాత తుగ్లక్ సేనలు దక్షిణానికి వెళ్ళి కర్నాటక,తమిళనాడు ప్రాంతాలను అక్కడి నుంచి ఉత్తరానికి ఒరిస్సా వరకు మొత్తం ప్రాంతాని జయించారు.వీరు స్థిర నివాసం ఏర్పరుచుకోని పాలన చెయ్యకుండ ప్రతినిధులను ఏర్పాటు చెశారు. వీరి పాలనలో దోపిడి,పన్నులు ఎక్కువ కావటంతో కాకతీయుల మాజి సామంతులు, అప్పటి సైన్యాధక్షులు అయిన ముసునురు ప్రోలయ నాయకుడు, అద్దంకి ప్రోలయ వేమారెడ్డి,రేచర్ల సింగమ నాయకుడు లాంటి 70 మందికి పైగా ఏకమై మొదట కొస్తా ప్రాంతాన్ని డిల్లి సుల్తాన్ నుంచి విముక్తి చేశారు. చివరిగా 1336లో ఓరుగల్లును జయించి డిల్లి సుల్తాన్ పాలనను అంతమొందించారు. ఆవిధంగా ప్రతాపరుద్రుడు మరణించిన 13 సంవత్సరాలకే ఓరుగల్లు తిరిగి వారి అనుచరులకు సొంతమైంది. అయితే ఇది చివరి యుద్దం కాదు.డిల్లి సుల్తాన్ తరువాత దాడులు చేశారు కాని ఎవరి పాలన ఎక్కువ రోజులు కొనసాగలేదు. విజయనగర సామ్రాజ్యం ఏర్పడిన తరువాత మహ్మదీయులకు వారితో యుద్దాలు ఎక్కువ జరిగాయి. నేను రాసిన ఈచరిత్రకు అనేక పుస్తకాలు ఆధారం,అందులో ఏటుకూరి బలరామ మూర్తి గారు రాసిన "ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర" ముఖ్యమైనది.