Latest News
ప్ర‌ముఖులు

మానవతకు మరో పేరు ఈ అమ్మ !!

1st Image


మంచి పని ఎప్పుడూ ఒద్దికగా జరుగుతుంది. దౌర్భాగ్యపు పని బాహాటంగా ఒళ్ళు విరుచుకుంటుంది. ఒక 70 సంవత్సరాలలో మానవాళి మరిచిపోలేని దౌర్భాగ్యపు పని రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల మారణ హోమం. మూలపురుషుడు హిట్లర్.
ఆ మారణ హోమం నుంచి తనదైన ప్రయత్నంలో కొందరు యూదుల్ని రక్షించిన జర్మన్ షిండ్లర్ కథని ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ చిత్రంగా తీసి అజరామరం చేశాడు. అలాంటి మరొక అద్భుతమైన వ్యక్తి కథ ఇది. మానవాళి కృతజ్ఞతతో పులకించి చిరస్మరణీయం చేసుకోవలసిన కథ.
ఆమె పేరు ఇరీనా శాండ్లర్. పోలెండ్ దేశస్తురాలు. రెండవ ప్రపంచ యుద్దకాలంలో జర్మనీ పోలెండుని ఆక్రమించాక పోలెండులో యూదుల మారణహోమానికి తలపెట్టింది. అందుకు వార్సాలో ఒక శిబిరాన్ని ఏర్పరిచింది. దాన్ని ఘెట్టో అంటారు. ఇరీనా సాంఘిక సేవా సంస్థలలో పనిచేసేది. పాలక వ్యవస్థకి వ్యతిరేకంగా పనిచేసే జెగోటా అనే రహస్య (అండర్ గ్రౌండ్) సంస్థలో ఇరీనా సభ్యురాలు. ఈ వార్సా ఘెట్టోలో కుళాయిలు, మురుగు కాలువల మరమ్మత్తు చేసే పనికి కుదురుకుంది. అప్పటికి ఇరీనా వయస్సు 23 సంవత్సరాలు.
రోజూ చేతిలో పనిముట్లు ఉన్న పెట్టె, వీపు మీద పెద గోనె గోతాంతో పనిలోకి వచ్చేది. కేవలం నౌఖరీ చెయ్యడం ఆమె లక్ష్యం కాదు. ఆ శిబిరాల్లో ఉన్న యూదుల పసిబిడ్డల్ని తన పనిముట్ల పెట్టిలో అడుగున దాచిపెట్టి బయటకు రహస్యంగా చేరవేసేది. కాస్త శరీరం పెద్దదిగా ఉన్న పిల్లల్ని వీపు మీద గోతంలోకి ఎత్తుకునేది. ఆమెతో ఓ కుక్క కూడా వచ్చేది. ఈ పిల్లలు ఏడిచి శబ్దం చేస్తే నాజీ సైనికుల చెవినిపడకుండా వాళ్ళని చూసినప్పుడల్లా మొరగడం కుక్కకి అలవాటు చేసింది. కుక్క అరుపులకు అలవాటు పడిపోయిన సైనికులు ఆమెను పట్టించుకునేవారు కాదు. అనుమానం వస్తే నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపే నరరూపరాక్షసుల మధ్య నుంచి అలా రెండు వేల అయిదువందల మంది పిల్లల్ని బయటికి చేర్చింది.
బయటికి తెచ్చాక వారి తల్లిదండ్రుల వివరాలు, అడ్రసులు - అన్నీ స్పష్టంగా రాసి - ఆ విలువైన జాబితాలను ఓ గాజు కుప్పెలో ఉంచి - ఇంటి వెనుక పెరట్లో ఓ చెట్టు కింద పాతిపెట్టింది. ఈ పిల్లలకి కొత్త పేర్లూ, కొత్త అడ్రసులూ సృష్టించి కొన్ని కుటుంబాలలో, బాల రక్షణ కేంద్రాలలో వారిని చేర్చింది. ఇదొక అపూర్వమైన విప్లవం. తల్లిదండ్రులని కాపాడడం సాధ్యంకాకపోయినా వారి సంతానాన్ని కాపాడే మానవీయ విప్లవం.
యుద్దం ముగిశాక - అడ్రసుల్లో వివరాల ప్రకారం ఆయా పసివారిని వారి వారి తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలని ఆమె పధకం. కానీ యుద్ధం ముగిసేనాటికి చాలా మంది తల్లిదండ్రులు ఈ నాజీ శిబిరాలలో విషవాయు ప్రయోగాలలో మరణించారు. తప్పించుకుని ప్రాణాలు దక్కించుకున్న ఏ కొద్దిమందో ఆచూకీ లేనంతగా మాయమయారు.
1943లో పిల్లల్ని చేరవేస్తూ ఇరీనా నాజీ సైనికులకు దొరికిపోయింది. అప్పుడామెకు 23 సంవత్సరాలు. (ఫోటో చూడండి). ఇలాంటి సాహసాలు తలపెట్టనక్కరలేని వయస్సది. కానీ మనస్సులో మానవతా చైతన్యం వెల్లివిరిసిన అమృతమూర్తి ఇరీనా. నాజీలకు పట్టుబడ్డాక నిర్దాక్షిణ్యంగా ఆమెని చావగొట్టారు. కాళ్ళూ చేతులూ విరగ్గొట్టారు. నానా చిత్రహింసలూ పెట్టారు. చివరికి మరణ శిక్షను విధించారు. ఆమెని కాల్చి చంపడానికి తీసుకువెళుతుండగా ఆమె పనిచేసే జెగోటా సంస్థ మనుషులు - నాజీ సైనికులకు లంచాలిచ్చి ఆమెని కాల్చి చంపకుండా తప్పించారు. కానీ బయటి ప్రపంచానికి ఇరీనా చచ్చిపోయినట్టే ప్రకటన వచ్చింది.
యుద్ధం తరువాత పోలెండుని సోవియట్ యూనియన్ ఆక్రమించుకుంది. రహస్యంగా పనిచేసిన ఈ కార్యకర్తలందరిని ఆ ప్రభుత్వం రాసిరంపాన పెట్టింది. అప్పటికి ఇరీనాకి పెళ్ళయి - రెండోసారి గర్భస్రావమయింది. క్రమంగా రాజకీయ వాతావరణం మారింది. కమ్యూనిస్టు పాలన నుంచి పోలెండు విముక్తమయింది. కొత్త పోలెండు ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించింది. ఇజ్రేల్ ప్రభుత్వం యూదులకు చేసిన సేవలకుగాను ఆమెకు తమ దేశపు అత్యున్నత పురస్కారాన్నిచ్చింది. పోలెండు ప్రభుత్వం ఆమె స్వయంగా వెళ్ళి ఆదుకునేందుకు అనుమతినిచ్చింది.
2003లో రెండవ పోప్ పాల్ యుద్దకాలంలో ఆమె కృషిని అభినందిస్తూ ఉత్తరం రాశారు. అదే సంవత్సరం పోలెండు తమ దేశపు అత్యున్నత పురస్కారంతో ఇరీనాను సత్కరించింది. 2007లో పోలెండు సెనేట్ ఆమెను గౌరవించుకుంది. అప్పటికి ఆమె వయసు 97. లేచివెళ్ళలేని పరిస్థితి. ఆమె రక్షించిన బిడ్డలలో ఒకరయిన ఎలిజబెత్ ఫికోస్కా అనే ఆమె ఇరీనా తరపున వెళ్ళి ఆ గౌరవాన్ని అందుకుంది.
2009లో ఐక్యరాజ్యసమితి తరపున ప్రముఖ హాలీవుడ్ నటి - ఆడ్రీ హెప్ బర్న్ ( ''రోమన్ హాలీడే' హీరోయిన్) పేరిట ఏర్పరిచిన మానవతా పురస్కారాన్ని ఆమెకి అందజేశారు. 2007 లో కాన్సాస్ లో ఒక ఉపాధ్యాయుడు నోబెల్ శాంతి బహుమతికి ఆమె పేరుని ప్రతిపాదించారు. బహుమతిని ప్రకటించాక - అంగీకరించని నామినేషన్లని గత 50 సంవత్సరాలుగా బయట పెటకపోవడం ఆచారం. కానీ ఇరినా శాండ్లర్ పేరు బయటికి వచ్చింది. శాంతి బహుమతికి ఆమె కంటే ఎవరికి అర్హత ఉంటుంది? మానవత్వాన్ని అంతకంటే ఎవరు ఉన్నత స్థాయిలో నిలపగలరు? ఒక మదర్ థెరిస్సా, ఒక దలైలామా, ఒక మహాత్మాగాంధీ (ఆయన పేరుని నోబెల్ శాంతి బహుమతికి సూచించలేదు!), ఒక ఇరీనా శాండ్లర్.
కాదు బాబూ! కాదు. అర్హతలు చాలామందికి ఉన్నాయి. నోబెల్ స్థాయి రాజకీయాలూ ఉన్నాయి. పర్యావరణ కాలుష్యానికి కృషిచేసిన అమెరికా ఉపాధ్యక్షులు ఆల్ గోరేకి ఆ సంవత్సరం శాంతి బహుమతిని ఇచ్చారు.
అది 2007. ఈ విషయాన్ని తెలిసిన ఇరీనా నవ్వుకుని ఉంటుంది. 68 సంవత్సరాల ముందు వీపు మీద మోసిన మానవాళి ఔన్నత్యానికి ఇలాంటి విలువల్ని ఆశించి ఉండదు. విరిగిన కాళ్ళూ, చేతులూ, దాదాపు చావుదాకా వెళ్ళిన ప్రయాణం, తన కళ్ళముందే పెరిగి పెద్దదయిన ఎలిజబెత్ ఫికోస్కా, ఇంకా 2499 మంది పిల్లలు ఆమెకి సజీవ నోబెల్ బహుమతులు. ఈ బహుమతి కేవలం ఒక సంస్థ గుర్తింపు. ఆ కృషి మానవత్వం ఆమెకిచ్చిన కితాబు. ప్రశంస.
తన 98 వ ఏట - ఆ మధ్యనే ఇరీనాశాండ్లర్ అనే దేవతామూర్తి కన్నుమూసింది.
దేవుడిని చాలామంది నమ్మరు. 23 ఏళ్ళ ఓ అందమయిన అమ్మాయి - 2500 పసి జీవితాలకు ప్రాణం పోసిన మాతృమూర్తిలో దైవత్వాన్ని - 98 సంవత్సరాలు ఆ జీవితాన్ని జీవనయోగ్యం చేసిన వైభవాన్ని అందరూ నమ్మక తప్పదు. ఇది వాస్తవం. 98 వ ఏట ఆ దేవత ముఖంలో చిరునవ్వు ఆ జీవన సాఫల్యానికి అద్దం పడుతుంది.

(ఈ వ్యాసాన్ని ప్రముఖ రచయిత  గొల్లపూడి మారుతీరావు రాశారు ....  వేరే ఫ్రెండ్ పంపితే  పబ్లిష్ చేస్తున్నాం.  
వ్యాసం ప్రచురించిన తెలియని ఆ పత్రిక కు ,,, మారుతీ రావు గారికి ధన్య వాదాలు ) 
  • (సుశ్రీ ) ......  ఈ ఫొటోలో కనిపించే ఆమె గురించి  ఈ  తరం లో కొద్దిమందికే  తెలిసి ఉండొచ్చు అంటే ఆశ్చర్య పోనవసరం లేదు.  క్లుప్తంగా  ఆమె ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకుని తర్వాత అసలు కథలోకి వెళ్దాం. అతను సాంప్రదాయ కన్నడ భ్రాహ్మణ కుటుంబం లో జన్మించాడు. కుటుంబ ఆచారం ప్రకారం గుడిలో పూజారి గా స్థిరపడటాన్ని వ్యతిరేకించాడు.  మెజీషియన్ గా అవతరించాడు.  భుక్తి కోసం ఒక సర్కస్ కంపెనీ లో జంతువుల ట్రైనర్ గా, మెజీషియన్ గా వివిద పనులు చేసేవాడు. ఉయ్యాల నుండి గాలిలో పల్టీలు కొట్టి మరో ఉయ్యాల పట్టుకునే విన్యాసాలు చేసేవాడు. (Trapeze) 1929 నంవంబరు 4 వ తేదీ ఒక చక్కటి ఆడపిల్లకి తండ్రి అయ్యాడు.  తనతో పాటే సర్కస్ లో తిరుగుతుండే చిన్నారికి మూడేళ్ళ వయసులో ప్లేయింగ్ కార్డ్స్ తో ఒక చిన్న మాజిక్ నేర్పే టానికి ప్రయత్నించినప్పుడు తన కూతురికి అంకెలని అద్భుతంగా జ్నాపకం పెట్టుకునే శక్తి ఉందని గ్రహించాడు. అతను సర్కస్ లో పని మానేశాడు. అనేక చోట్ల కుమార్తె తో కలిసి మేజిక్ లెక్కలతో కలిపి ప్రదర్శనలు ఇచ్చేవాడు. కుమార్తె కి ఉన్న శక్తి ని పరిపూర్ణంగా ప్రోత్చహించాడు.  ఆమె తన గణన శక్తి ని యూనివర్శిటీ ఆఫ్ మైసూర్ లో ప్రదర్శించింది. అప్పటికి ఆ బుడ్డ దాని వయసు నిండా ఆరేళ్లు!!.  తన పేరు శకుంతలా దేవి. అది ప్రారంభం. 1944 లో ఆమెకి పదిహేనేళ్ళ వయసప్పుడు తండ్రి తో కలిసి లండన్ చేరింది.  ఆమె తన అర్ధమేటిక్ జ్ణానాన్ని అనేక చోట్ల ప్రదర్శనలు ఇస్తూ యూరప్, న్యూ యార్క్ లు పర్యటిస్తూ ఉండేది.  Arthur Jensen, అనే సైకాలజీ ప్రోఫ్ఫెసర్ (University of California, Berkeley ) ఆమెను అనేక సమస్యలకి సమాధానాలు రాబట్టాడు. అతని అసిస్టెంట్స్ ఆయన ఆడిగిన సమస్యని వ్రాసేలోగా ఆమె సమాదానం తో సిద్దం గా ఉండేది.  61,629,875 కి క్యూబ్ రూట్, 170,859,375 కి సెవెన్త్ రూట్ ఆయన నోట్ బుక్ లో వ్రాసేలోగా 395, 15 అని సమాదానం చెప్పింది. 1990 లో Intelligence అనే పత్రిక లో వీటిని ప్రొఫెసర్ పొందుపరిచారు.  1977 లో Southern Methodist University, లో జరిగిన ఒక ప్రదర్శనలో 201 అంకెల సంఖ్యకి 23వ క్యూబ్ రూట్ ఆమె 50 సెకండ్ల లో చెప్పేసింది. అప్పట్లో అత్యంత వేగమయిన UNIVAC 1101 కంప్యూటర్ లో ప్రత్యేక ప్రోగ్రాం వ్రాసి , సమాదానాన్ని నిర్ధారించుకోవలసి వచ్చింది.  1980 లో Imperial College London. వారు నిర్వహించిన ఒక కార్యక్రమం లో రెండు పదమూడు అంకెల లబ్దాన్ని 28 సెకండ్ల లో చెప్పి ఆందరి ని ఆశ్చర్యపరిచింది. 1982 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఇది నమోదయ్యింది.  (7,686,369,774,870 × 2,465,099,745,779=18,947,668,177,995,426,462,773,730) ఫిగరింగ్, ది జాయ్ ఒఫ్ కౌంటింగ్ అనే ఆమె వ్రాసిన పుస్తకాలలో అనేకి కీలక విషయాలు ప్రపంచానికి తెలియపరిచింది.  1960 ప్రాంతాలలో ఇండియా తిరిగి వచ్చిన ఆవిడ ఒక ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ ని వివాహం చేసుకుని. 1979 లో 50 ఏళ్ల వయసులో విడాకులు తీసుకుంది.  తమాషా ఏమిటంటే 1977 లో ‘హోమో సెక్సువాలిటీ’ మీద ఆమె తన తొలి రచన చేసింది. దీనికి కారణం ఒక చీకటి కోణం.  1980 లో ఇండిపెండెంట్ అబ్యర్ధిగా ఇందిరా గాంధీ మీద పోటీ చేసింది. (ఇందిర నుండి మెదక్ ప్రజలని ని కాపాడటానికి అని ఇంటర్వ్యూ లలో చెప్పింది. :p  చివరి రోజుల్లో ఆమె ఆస్ట్రాలజీ లో కూడా ప్రావీణ్యం ఉందని నిరూపించుకున్నారు.  21-04-2013 న బెంగుళూరు లో కుమార్తె అనుపమ కేర్ టేకింగ్ లో శ్వాసకోశ ఇబ్బందులతో 83 ఏండ్ల గణిత మేధావి తన జ్ణాపకం గా అనేక గ్రంధాలు మిగిల్చి బౌతికంగా ‘సైపర్’ (cypher) ఆయిపోయారు.  4, నవంబర్ 2013 న గూగుల్ ఆమె 84 పుట్టిన రోజు సందర్భంగా ఒక చిత్రాన్ని ప్రదర్శించింది.  ఆమె వ్రాసిన కొన్న పుస్తకాలు: • Astrology for You (New Delhi: Orient, 2005). ISBN 978-81-222-0067-6 • Book of Numbers (New Delhi: Orient, 2006). ISBN 978-81-222-0006-5 • Figuring: The Joy of Numbers (New York: Harper & Row, 1977), ISBN 978-0-06-011069-7, OCLC 4228589 • In the Wonderland of Numbers (New Delhi: Orient, 2006). ISBN 978-81-222-0399-8 • Mathability: Awaken the Math Genius in Your Child (New Delhi: Orient, 2005). ISBN 978-81-222-0316-5 • More Puzzles to Puzzle You (New Delhi: Orient, 2006). ISBN 978-81-222-0048-5 • Perfect Murder (New Delhi: Orient, 1976), OCLC 3432320 • Puzzles to Puzzle You (New Delhi: Orient, 2005). ISBN 978-81-222-0014-0 • Super Memory: It Can Be Yours (New Delhi: Orient, 2011). ISBN 978-81-222-0507-7; (Sydney: New Holland, 2012). ISBN 978-1-74257-240-6, OCLC 781171515 • The World of Homosexuals (Vikas Publishing House, 1977), ISBN 978-0706904789[11][21]
  • ( సుశ్రీ ) .................................. నా పేరు అమృత. ఆ రోజు నాకింకా గుర్తుంది. 1919 ఏప్రిల్ 13 వ తేదీ మర్నాడు. రోజు లాగే అన్న స్కూల్ కి ఉదయాన్నే వెళ్ళాడు. అతను స్కూల్ కి వెళ్లలేదని మర్నాడు తెల్సింది.  అతడు ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. ఇంట్లో అందరూ దిగాలు పడి ఉన్నారు. అన్న ముఖం వేలాడేసుని వచ్చాడు. బోలెడు దుఖం తో అతను నిలువునా మునిగి ఉన్నాడు.  అన్న కి చిన్న చెల్లెలు ని నేను. నేనంటే అన్న ఎంతో ప్రేమగా ఉండేవాడు.  “అన్నా ఎందుకింత ఆలస్యం అయింది.? ఎక్కడికెల్లావు ?” అని నేను ఆందోళనగా అడిగాను.  “ఏమి తెచ్చానో చూడు” చేతి లో జేబులోంచి తీసిన ఎర్ర సీసాని చూపించాడు.  అందులో మట్టి ఉంది. మట్టి రంగు ఎరుపుగా ఉంది. తడిగా ఉంది. “ఏమిటిది?” నేను భయంగా అడిగాను.  “ఇందులో ఉన్నది 360 మంది భారతీయుల రక్తం తో తడిచిన మట్టి ఉంది. రోలర్ చట్టానికి శాంతియుత నిరసన తెలపటం కోసం సమావేశమయిన వేలాది ప్రజలమీద కి, నిన్న జనరల్ డయ్యర్ మరఫిరంగులతో కాల్పులు జరిపాడు. ఎందరో చనిపోయారు. ఆ వీరుల రక్తం తో తడిచిన జలియన్ వాలా బాగ్ మట్టి ఈ సీసా లో ఉంది.” అన్న దుఖం తో ఒక్కో మాట చెప్పాడు.  అక్కడ ఏమి చూశాడో, ఏమి విన్నాడో తడబడుతు చెప్పాడు.  ఈ రోజు అన్న ఆహారం ముట్టలేదు. తోటలో నుండి చాలా పూలు తెచ్చి ఆ సీసాని అలంకరించాడు. దానికి మోకరిల్లాడు. తనలో తానే ఏవేవే మాట్లాడుకున్నాడు. బహుశా మనసులోనే ఏవో స్థిరంగా నిశ్చయించుకుని ఉంటాడు.  ఆ మహావీరుల రక్తం తో ఆయనకి సన్నిహిత సంభందం ఏర్పడింది. అందుకే తను గూడా విప్లవ కారులకు నాయకుడై ఆత్మ బలిదానం చేశాడు.  మీ కింతకి మా అన్న పేరు చెప్పలేదు కదూ... ఆయన్ని మీరు ఎరుగుదురు . ఆయన పేరు భగత్ సింగ్.
  • (Sheik Sadiq Ali)...........       రాస్తున్నది కాకతీయుల చరిత్రే అయినా .....దాని మూలాల్లోకి వెళ్ళటం అవసరం అని భావించి ఈ వ్యాసాన్నివ్యాస విరచిత మహాభారతం తో ప్రారంభిస్తున్నాను. మహాభారతంలో చర్చించిన పలు గిరిజన తెగలలో ప్రధానమైనవి రెండు . ఒకటి అపరాంతకులు....వీళ్ళు రాజస్తాన్ లోని పర్వత ప్రాంతాల్లో నివసించేవారు. వీరి ప్రస్తావన వాత్సాయన కామ సూత్రాలలోనూ ఉంది.(వీరి గురించి మరో వ్యాసం రాస్తాను) మరొకటి నిశాదులు. ఏకలవ్యుడి సంతతిగా ప్రఖ్యాతి గాంచిన వారు. వీరు ప్రస్తుత ఉత్తరాఖండ్ ప్రాంతానికి చెందిన వారు. ఈ వ్యాసం వారి గురించే కాబట్టి కాస్త విపులంగా చర్చిద్దాం. మహాభారత సంగ్రామం,కృష్ణ నిర్యాణం తదనంతర కాలంలో ఈ రెండు తెగలూ నర్మదా నదిని దాటి దండకారణ్యంలోకి ప్రవేశించాయి. అయితే ,అపరాంతకుల కన్నా చాలా ముందుగానే నిషాదులు వలస వచ్చారు. ఈ నిశాదులనే కిరాతులు కూడా అంటారు. వీరి జీవన విధానం గురించి వ్యాస మహాభారతంలో వివరించారు. వీళ్ళు ఉభయ చరులు. అంటే ,అటు అడవులలోనూ ,ఇటు వాటికి ఆనుకొని ఉన్న మైదాన ప్రాంతాల్లోనూ జీవించగలరు. విలు విద్య,బాణాలు,ఇనుము,ఉక్కుతో ఆయుధాలు,ఇతర సామాగ్రి తయారు చేయటంలో వీరు నేర్పరులు. ఉత్తరాఖండ్ లోని పలు క్షేత్రాలలో దర్శనం ఇచ్చే భారీ త్రిశూలాల తయారీలో ఈ నిషాదుల పాత్రే కీలకం . శారీరకంగా బలంగా ఉండటం, ఉక్కు మీద పట్టు ఉన్న వీరు దక్షిణ భారత దేశపు అడవుల్లోకి ప్రవేశించిన తర్వాత నుంచి అసలు కథ మొదలయ్యింది.  ప్రస్థానం..(కాకతీయులు పార్ట్ - 1) ఏకలవ్యుడు మహాభారతం లోని ఒక పాత్రే అయినప్పటికీ అతను ఒక జాతికి ప్రతీక. ఆ జాతి వీరత్వం ,ధీరత్వం,వ్యక్తిత్వం , డీ ఎన్ ఏ లకు చిరునామా. ఆ జాతి వారైన నిషాదులు దక్షిణ భారత దేశం లోకి ప్రవేశించిన తర్వాత అంచెలంచెలుగా తెలంగాణా,ఆంధ్రప్రదేశ్,కర్నాటక,తమిళనాడు,చివరిగా శ్రీలంక వరకూ చేరుకున్నారు. ఏడాదిలో కేవలం నాలుగైదు నెలలు మాత్రమే ఉపాధి అవకాశాలు ఉన్న ఉత్తరాఖండ్ నుంచి ఏడాది పొడవునా ఉపాధి లభించే దక్షిణాపధం నే తమ కర్మ భూమిగా చేసుకున్నారు. ఉక్కు తమ ప్రధాన జీవనాధారం అవటంతో ఉక్కు ఖనిజం పుష్కలంగా లభించే ప్రాంతాల చేరువలో తమ నివాసాలనుఎర్పర్చుకున్నారు. ఆ క్రమంలో తెలంగాణా లోని ఆదిలాబాద్,కరీంనగర్ వరంగల్, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ ,ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలు,కర్నాటక లోని బెల్గాం,బళ్ళారి ప్రాంతాలు,తమిళనాడులోని కొడుమనాల్, కేరళ లోని మలబార్ ,శ్రీలంకలోని సమనల వేవ,తిప్పమహారామ ,అనురాదాపురం ప్రాంతాల్లో స్థిరపడ్డారు.(వీరిలో మరో వర్గం నల్లమల అటవీ ప్రాంతపు సరిహద్దుల్లో ఉన్న మహబూబ్ నగర్,కర్నూలు,గుంటూరు,ఒంగోలు,కడప ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీటి వివరాలు మున్ముందు అధ్యాయాల్లో చర్చిద్దాం.) ఉక్కు,ఆయుధాల తయారీ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న వీరు సహజంగానే అక్కడ రాజ్యాలు ఏలుతున్న రాజులకు,రాజ వంశీయులకు సన్నిహితులు అయ్యారు.ఆయుధాల సరఫరాతో పాటు, దేహ దారుడ్యం,ఆయుధాల ప్రయోగంలో నైపుణ్యం ఉండటంతో రాజుల సైనిక బలగాల్లో వివిధ హోదాల్లో కొలువులు కూడా చేసేవారు. ఇదంతా క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దం నుంచీ జరుగుతూ వచ్చింది.అలాగే అరేబియా సముద్ర తీరం నుంచీ ,హిందూ మహాసముద్రం నుంచీ కూడా విదేశాలకు ఖడ్గాలు,సముద్రంలో ప్రయాణించే ఓడలకు అవసరమైన లంగర్లు,శుద్ధి చేసి,పోతపోసిన ఉక్కు దిమ్మెలు కూడా ఎగుమతి చేసేవారు.అరబ్బుల మధ్యవర్తిత్వంతో సిరియా,లెబనాన్,అక్కడి నుంచి ఐరోపా దేశాలకు ఎగుమతులు జరిగేవి. ఈ ఉక్కు దిమ్మెలతోనే తదనంతర కాలంలో డమాస్కస్ లో ఖడ్గాల తయారీ పరిశ్రమలు నెలకొని ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఈ నిషాదులు ఆయా రాజ వంశీకులకు చేరువైన క్రమంలో తమిళనాడులో ఆరో శతాబ్దానికి చెందిన చేర రాజ వంశీయులకు ,ఇక్కడ రాష్ట్ర కూటులకు తదనంతరం కళ్యాణీ చాళుక్యులకు సన్నిహితులు అయ్యారు.ఇక్కడి నుంచి నేరుగా మన కాకతీయుల చారిత్రిక నేపధ్యంలోకి వెళ్దాం.  (తరువాయి  రెండో భాగం లో) 
  • ఈ ఫొటోలో కనిపించే అరుణ్ కృష్ణన్ వయసు 67 సంవత్సరాలు . ఈ వయసులోనూ సాహాసాలు చేస్తుంటారు.  మలి వయసులోనూ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొని విజయాన్ని సొంతం చేసుకుని యువ అథ్లెట్స్‌కు సవాల్ విసిరిన ఖ్యాతి  ఆయనది.  ఇండియన్ ఓల్డెస్ట్ ఐరన్‌మ్యాన్‌గా తన పేరు నమోదు చేసుకున్న అరుణ్ కృష్ణన్ ఆ మధ్య  ఆస్ట్రేలియాలో జరిగిన ట్రియథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్‌లో విజేతగా నిలిచారు.ఈ తరం ఆటగాళ్లు అరుణ్ కృష్ణన్ ను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. బలమైన సంకల్పం ... పరిశ్రమ అరుణ్ ను ముందుకు నడిపిస్తున్నాయి. తనకు వయసు వచ్చేసిందని ఆలోచన ఆయనకేమాత్రం లేదు. దూసుకుపోవడమే కృష్ణన్ కి తెలిసింది.   చెన్నైకి చెందిన అరుణ్ కృష్ణన్‌ ఇంజనీర్. బిజినెస్ కూడా చేశారు.  కాలేజీలో చదువుకునే రోజుల్లో స్విమ్మింగ్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. పరుగు ఆయనకు ప్రాణం. 1987 నుంచి ఎన్నో మారథాన్‌లో పాల్గొన్నారు. దేశ, విదేశాలలో జరిగే మారథాన్ పోటీల్లో పాల్గొంటారు. సింగపూర్, పారిస్, చికాగో, బెర్లిన్, టోక్యో మారథాన్‌లలో పాల్గొన్నారు. ఆసియా ఫిసిఫిక్ చాంపియన్ షిప్ సాధించి  హీరోగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. వ్యాపార బాధ్యతలు వేరొకరికి అప్పగించి  ఇపుడు తన కలలను సాకారం చేసుకోవటానికి  బీచ్‌లో పరుగుపెడుతూ ప్రాక్టీస్ చేస్తూంటారు దీక్షగా.  ఆస్ట్రేలియాలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న అరుణ్  అలలు అంతెత్తున ఎగిసిపడుతున్నా ఏమాత్రం భయం లేకుండా 3.8 కిలోమీటర్లు ఈదారు. 180 కిలోమీటర్లు సైక్లింగ్ చేశారు. 42 కిలోమీటర్లు పరుగు పెట్టి యువ అథ్లెటిక్స్ సవాల్ విసిరారు. ఇవన్నీ కూడా నిర్ణీత సమయాని కంటే రెండు నిమిషాల 25 సెకెండ్ల ముందే పూర్తిచేయటం విశేషం. ఈయన  ప్రతిభ చూసి వచ్చినవారంతా చప్పట్లతో  ఆయనను హుషారెత్తించారు. కృష్ణన్ గురించి  ఆ దేశ ఛానళ్లలో కథనాలు ప్రసారమయ్యాయి. అరుణ్ కృష్ణన్ ఎన్నో మారథాన్‌లలో పాల్గొనగా.. ఈ పోటీని ఆయన సవాల్‌గా తీసుకున్నారు. ‘ఈ 67 ఏళ్ల వయసులో ఈ విజయం సాధిస్తానని నమ్మలేదు. కాని మనసు శరీరం మీద ప్రభావం చూపిస్తుందనుకుంటా. మానసిక బలంతో పాటు 24 వారాల శిక్షణ ఈ విజయానికి దోహదం చేసింది’ అని  చెప్పుకొచ్చారు.  ‘ఇండియన్ ఒల్డెస్ట్ ఐరన్ మ్యాన్‌గా జీవితాంతం ఉండాలని భావిస్తున్నాను. ప్రపంచ మారథానర్‌గా పేరొందిన ఫౌజాసింగ్, 70 ఏళ్ల వయసులో మారథాన్‌లలో పాల్గొన్న వైట్లాక్ నాకు స్ఫూర్తినిస్తారు" అంటారు అరుణ్ కృష్ణన్. 
  • (SIVA RACHARLA)  .............  ఆయన ఒక "నిర్వచనం",ఆయనొక "నిర్మాత",ఆయనొక "ఉదాహరణ",ఆయన భారత రాజకీయ వ్యవస్థకు నిలువుటద్దం... ఆయన "Marxist in practice"... అందరు ప్రధానుల ...  మన రాష్ట్ర ముఖ్యమంత్రుల పేర్లు తడుముకోకుండ ఎంత మంది చెప్పగలరు? జీవితాంతం ప్రతిపక్షంలో వున్నా "ఆ"నాయకుడి" పేరు అధికారంలో ఏపార్టి వున్నా స్మరించటానికి కారణం ఏమిటి? అసెంబ్లీల్లో అధికార...  ప్రతిపక్షాలు గొడవపడ్డ ప్రతిసారి "ఆ"నాయకుడు" ప్రాతినిధ్యం వహించిన సభలో ఇలా గొడవ జరగటం బాధాకరం అనటం వింటుంటాము. ఆమనిషి,ఆనాయకుడు "పుచ్చలపల్లి సుందరయ్య" aka కామ్రేడ్ "P.S" నిన్న మొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరిగారికి మంత్రి పదవి రాని సందర్భంలో కూడ నాకు సుందరయ్య స్పూర్తి, రాజకీయల్లో ఎప్పుడు అక్రమపద్దతులు పాటించలేదు అని చెప్పుకున్నారు. కమ్యునిస్ట్ పార్టీలతొ పరిచయం వున్న వారికి పార్టి "నిర్మాణం" అన్నమాట పరిచయం వుంటుంది. రాజకీయ పార్టీల బాషలో "నిర్మాణం" అంటే సిద్దాంతము, రాజకీయ కార్యక్రమము ఒకేలాగ వుండటం.ఇప్పటిలా అధికారం కోసం కప్పలతక్కెడలు,గోడదూకటాలు నిర్మాణాత్మక రాజకీయాలు కాదు. సుందరయ్య స్వతంత్ర భారత పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నేత. ప్రధాని నెహ్రు.. మంత్రులకు అనేక అంశాలలో సుందరయ్య ప్రసంగాలు దారిచూపాయి.సుందరయ్య మాట్లాడుతున్నప్పుడు నెహ్రు స్వయంగా నోట్సు రాసుకునేవారు. ప్రతిపక్ష నేతకు "మంత్రి" హోదా వుంటుంది(ఇప్పటికి కూడ). పార్లమెంటు ప్రతిపక్షనేతగా వుండి కూడ అన్ని సదుపాయాలను వదులుకోని బస్సులొ లేదా స్వయంగా సైకిల్ తొక్కుకుంటునో పార్లమెంటుకు వెళ్లేవారు. సైకిల్ మీద వెళ్ళటం గొప్పతనానికి సంబంధించిన లక్షణం కాదు, వ్యక్తిత్వం. సుందరయ్యగారి ఈవ్యక్తిత్వమే ప్రజలకు దగ్గర చేసింది. ఈవ్యక్తిత్వమే ఎదుటివారు చెప్పే విషయన్ని ఓపిగ్గా వినే లక్షణం తద్వారా వాటి పరిష్కారం కోసం పనిచేసే పద్దతి సుందరయ్య గారి సొంతం అయ్యింది. సుందరయ్య ఓకసారి MPగా, మూడుసార్లు MLAగా పనిచేశారు. అయితే సుందరయ్య చేపట్టిన ఈపదవుల కన్నా ఆయన చేసిన  ప్రతిపాదనలు,చేపట్టిన పనులవలనే చనిపోయిన 32 సంవత్సరాల తరువాత కూడ ప్రజలు స్మరించుకుంటున్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత చేపట్టవలసిన పనుల గురించి అనేక రచనలు చేశారు. ఇప్పుడు చెప్పుకుంటున్న నదుల అనుసంధానం గురించి 50వ దశకంలోనే సుందరయ్యగారు ప్రతిపాదించారు. "ఆంధ్రప్రదేశులొ సమగ్ర నీటిపారుదల" అన్న పుస్తకంతో అనేక ప్రాజెక్టులు, నదుల అనుసంధానం గురించి రాశారు. సాయుద తెలంగాణా రైతాంగ పోరాట నిర్మాత సుందరయ్య.4,5 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి  దళాలకు మార్గదర్శకత్వం చేశాడు. తెలంగాణా సాయుధపోరాటం తరువాత ఆఉద్యమ అనుభవాలను "వీర తెలంగాణ విప్లవ పోరా టం గుణపాఠాల" పేరుతో పుస్తకం  రాశారు. సుందరయ్యగారి ఎంత వాస్తవికమో ఇలాంటి పుస్తకాలు తెలియచేస్తాయి. తెలంగాణ సాయుధపోరాటంలో కాని,ఎమర్జెన్సి రోజుల్లో కాని కామ్రేడ్స్, వారి కుటుంబల పట్ల సుందరయ్య చాల జాగర్తలు తీసుకునేవారు. కొండపల్లి కోటేశ్వరమ్మగారు(సీతారామయ్యగారి భార్య) రాసిన "నిర్జన వారధి" పుస్తకంలొ సుందరయ్యది ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వమో తెలియచేసే సంఘటనలు వివరించారు. అజ్ఞాతంలో వున్న దళాలను,వారి కుటుంబ సభ్యులను సుందరయ్య గారు కలిసినప్పుడు...తను ముందుగా భోజనం చెయ్యకుండ గర్భిణిలు,పిల్లలకు భోజనం పెట్టి చివరలొ తను తినేవారు.కారణం నేను వచ్చానని ఈరోజు మంచి భోజనం వండివుంటారు,మీకు రోజు ఇలాంటి భోజనం దొరకదు కదా?ముందు మీరు తినండి అని వారికి భోజనం పెట్టేవారంట సుందరయ్యగారు.దళాలన్ని  ఒకచోట వుండటం వలన ఎదో ఒక భోజనం దొరికేది,నిత్య సంచారి అయిన సుందరయ్యలాంటి నాయకులకు గ్యారెంటి భోజనాలు తక్కువ.అది కామ్రేడ్స్ పట్ల సుందరయ్యగారి ప్రేమ,నాయకుడే త్యాగం చెయ్యాలనే  లక్షణం. 60,70 దశకాలలో  కమ్యునిస్ట్ పార్టీలలోకి డాక్టర్లు,లాయర్లు ప్రవాహంలాగ చేరారు.సుందరయ్యగారు డాక్టర్లను పార్టి full timersగా కాకుండ గ్రామాల్లో వైద్య సేవలు చెయ్యాలని ప్రోత్సహించారు. 1964లొ CPI నుంచి CPM విడిపొయినప్పుడు సుందరయ్యగారు CPM జాతీయ ప్రధానకార్యదర్శిగా ఎన్నికయ్యారు. సుందరయ్యగారి నాయకత్వంలొ CPM "Party Program" documentలొ పార్టి కార్యక్రమాన్ని వివరించారు,ఆ డాక్యుమెంట్ CPM రాజ్యాంగం. భారత దేశంలొ party programను రాసుకున్న ఏకైక పార్టి CPM.. దాన్ని ప్రారంభించి  సుందరయ్యగారు  నేతృత్వం  వహించారు.. సుందరయ్యగారి పోరాటం  ఆయన సొంత ఊరు నెల్లూరు జిల్లా "అలగానిపాడు" నుంచే మొదలయ్యాయి. సుందరయ్య గారి వ్యక్తిగత జీవితం త్యాగాల నిలయం.చిన్న వయసులోనే కులాన్ని వదులుకున్నారు.తన చెల్లెళ్లను  ,ఇతర పిల్లలను హరిజనవాడలో వున్న స్కూల్లొ చదివించారు. అలగానిపాడులొని అంటరానితనాన్ని నిర్మూలించటానికి హరిజనవాడ బావిలోని నీటిని ఊర్లోని అన్ని బావులలో కలిపాడు. ఆయన హాబిల్లొ చదవటం రాయటం ముఖ్యమైనవి. అలగానిపాడులో మొదటి గ్రంధాలయన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు వారి ఇల్లు కూడ స్మారక చిహ్నం అయ్యింది. ఆస్తి పంపకాల్లొ వచ్చిన తన వాటా మొత్తాన్ని పార్టికి ఇచ్చేసి,పార్టి ఇచ్చిన అలవెన్సుతో బతికారు.   మాజీ ఎంపీ ,ఎమ్మెల్యేలకు  ఇచ్చే పెన్షన్ కూడ పార్టికి ఇచ్చారు. తన జీవితం మొత్తం ప్రజలకోసం,పార్టీ కోసం పనిచేయా లన్న లక్ష్యంతొ పెళ్ళి చేసుకోకూడదనుకున్నారు.అయితే కామ్రేడ్. లీలాగారు పట్టుదలతో ఆమెను వివాహం చేసుకోవటానికి అంగీకరించారు. సుందరయ్యగారు & లీలాగారు మాట్లాడుకోని పిల్లలు పుట్టకుండ సుందరయ్యగారు ఆపరేషన్ చేయించు కున్నారు. సుందరయ్య & లీలమ్మ ఇద్దరు త్యాగజీవులు. సుందరయ్య ,లీల గార్లకు పిల్లలు లేకుంటే ఏమి?నాలాంటి అనేక మంది వారసులు ... సుందరయ్య త్యాగం,సుందరయ్య దార్శనికత మనకు తెలియకుండనే ఎదో ఒకరూపంలొ మన జీవితం మీద ప్రభావం చూపుతుంది. సుందరయ్యగారి తమ్ముడు డాక్టర్.రామచంద్రారెడ్డి గారు కూడ జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేశారు. డాక్టర్.రాం గారు నేతాజితో పనిచేశారు.నేతాజి డాక్టర్.రాముకు రాసిన ఉత్తరాలు నెల్లూరు జిల్లా ఆఫీసులొ 2001లో చదివాను. CPM డాక్టర్.రాం పేరుతో "రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల"ను నెల్లూరులో నడుపుతున్నారు. సుందరయ్యగారు 19-May-1985న విజయవాడలొ చనిపోయారు. సుందరయ్యగారు మేడే రోజున అంటే 01-May-1913న పుట్టారు. సుందరయ్య "Marxist in practice"...Marxism is not a dogma but a theory to be applied in practice,a guide to action సుందరయ్యను "కమ్యునిస్ట్ గాంధి" అనటం సమంజసం కాదు,అది కొందరు అత్యుత్సాహంతో రాసిన వాడుక.సుందరయ్య,గాంధి రెండు విభిన్న మార్గాలు.ఎవరి మార్గాల్లో వారు గొప్పవారు. సుందరయ్య కమ్యునిష్ట్ కాకుంటే ఏమి అయ్యుండేవారని అడిగిన ప్రశ్నకు "ఈరోజు కాకుంటే రేపో,మరో రోజో సుందరయ్య కమ్యునిష్ట్ అయ్యి వుండేవాడు" అంతేకాని కొందరు  రాసినట్లు కాంగ్రేస్ పార్టి ప్రధానకార్యదర్శో ,మంత్రో అయ్యేవాడు కాదు అని సుందరయ్యగారు సమాధానం ఇచ్చారు. అనేక సినిమల్లో ఉదా త్త రాజకీయనాయకుడి పాత్రకు "సుందరయ్య" అని వుండటం గమనించివుంటారు.నాకు ముఠామేస్త్రిలోని సోమయాజుల పాత్ర గుర్తుంది ,ఈమధ్య కూడ ఎదో సినిమాలో కూడ సుందరయ్య పేరు వాడారు. మాఇంట్లో వుండే ఏకైక రాజకీయ నాయకుడి ఫోటో "సుందరయ్య" గారిది.నాకు తొలి పాఠాలు చెప్పిన పుల్లయ్యగారు,Dr.శాస్త్రిగారు నాకు గురువులు.అందుకే నేను మిత్రులకు చెప్తుంటాను I am from Dr.Sastry school.
  •  (Sheik Sadiq Ali )......................   అదే స్వరం ముప్ఫై ఎనిమిది ఏళ్ళుగా వెంటాడుతోంది. విరహమైనా ,విషాదమైనా, ముంచెత్తే మొహమైనా అది వెంటే ఉంటూ వస్తోంది. ఆరుబయట వెన్నెల్లో నులకమంచం మీద పడుకున్నా, ఏసీ కార్ లో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినా అదే స్వరం .ఇంతకూ ఆ స్వరం ఎవరిది? ఎవర్ గ్రీన్ ..ఆల్ టైం గ్రేట్ లెజెండ్రీ వాయిస్ కిషోర్ కుమార్ ది. దశాబ్దాలుగా దేశ ప్రజల్ని ఉర్రూత లూగిస్తున్న స్వరం. మనిషి మరణించినా అజరామరమైన స్వరం. అతని గొంతులో అంతటి శక్తి ఎలా వచ్చింది? ఎంత ప్రేమను,ఎంత విషాదాన్ని, విరహాన్ని అనుభవిస్తే ఆ శక్తి వస్తుంది? నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న కిషోర్ ప్రేమికుడా?ప్లేబాయా ?పురుష అహంకారా?మదోన్మత్తుడా?విలాస పురుషుడా? అతన్ని ఎలా చూడాలి? యావత్ దేశం మోహించి పలవరించిన అద్భుత అందగత్తె మధుబాల , కళ్ళముందు తటాలున మెరిసే విద్యుల్లత లీనా చందావర్కర్ , మత్తు కళ్ళ యోగితాబాలి, అలనాటి బెంగాలీ సుందరి రూమా ఘోష్ ఆ నలుగురూ అతని భార్యలే.వివిధ దశల్లో అతని జీవితాన్ని ప్రభావితం చేసిన వాళ్ళే. అతని స్వరంలోని విషాదానికీ,విరహానికీ,మోహానికీ కారకులు వాళ్ళే. నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్న వాడి గురించి ఇంత గొప్పగా రాయాలా సాదిక్? అని అడిగితె నా దగ్గర సమాధానం లేదు. కానీ, సౌందర్యాన్ని ఆరాధించి,అందిన అందాన్ని అర్ధం చేసుకోలేక వ్యర్ధం చేసుకున్న ఒక అద్భుత గాయకుడి జీవితపు చీకటి కోణాలను స్పృశించాలనే ప్రయత్నమే ఈ వ్యాసం. గాయకుడు,నటుడు,దర్శకుడు,నిర్మాత,రచయిత,సంగీత దర్శకుడు,హీరో,కమెడియన్ ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కిషోర్ కు అసంఖ్యాకమైన అభిమానులు ఉన్నారు.మహమ్మద్ రఫీ,ముఖేష్ ల కన్నా కిషోర్ ని అభిమానించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ.హిందీ మాత్రమె కాకుండా మరాఠి,గుజరాతి,కన్నడ ,బెంగాలి భాషల్లో అతను అసంఖ్యాక పాటలు పాడాడు.బాలీవుడ్ లో తన సమకాలీకులందరూ ఈర్ష్య పడేంత రొమాంటిక్ జీవితాన్ని అతను అనుభవించాడు. చూడ్డానికి ప్లే బాయ్ లా కన్పించినా,నిత్యం చిరునవ్వుతో ,సినిమాల్లో నవ్వుతూ ,నవ్విస్తూ ఉన్నా లోలోపల దహించి వేసే బాదే అతనితో విషాద గీతాలు పాడించింది.సౌందర్యం పట్ల ఆరాధన గొప్ప రొమాంటిక్ పాటలని పాడించింది.విషాదాన్ని దాచుకునే ప్రయత్నంలో కామెడీ పాటలు పాడాడు. కిషోర్ కుమార్ మొదటి భార్య రూమా ఘోష్. అందం,చలాకీతనం,అభినయం కలగలిసిన అమ్మాయి.విఖ్యాత దర్శకుడు సత్యజిత్ రే మేనకోడలు. నటి,గాయకురాలు. 1951 లో వాళ్లకు పెళ్ళయ్యింది. ఏడాదికే కొడుకు అమిత్ కుమార్ (సింగర్) పుట్టాడు. అతనికి ఆరేళ్ళ వయసులో దంపతులిద్దరికీ గొడవలయ్యాయి.గృహిణిగా ఉండి ఇంటినీ, కొడుకునీ చూసుకోమంటాడు అతను. నా ప్రతిభను,సామర్ధ్యాన్ని నాలుగు గోడలకు పరిమితం చేయలేను అంటుంది ఆమె. ఫలితంగా ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఆమె ఆరూప్ గుహా ను పెళ్ళాడి రూమా గుహ అయ్యింది. ఓపిక ఉన్నంత వరకూ నటిస్తూనే ఉంది. 2006 లో విడుదలైన బాలీవుడ్ చిత్రం నేమ్ సేక్ ఆవిడ నటించిన ఆఖరి చిత్రం. రెండో భార్య మధుబాల. ఇండియన్ మార్లిన్ మన్రో గా ప్రసిద్ధి చెందిన నటి.అపురూప సౌందర్య రాశి. ఇప్పటికీ అందానికి ప్రతిరూపంగా కవులు,రచయితలూ ఆమె నే ఉదహరిస్తారు. దిలీప్ కుమార్ తో గాఢమైన ప్రేమలో మునిగి,తేలి విఫలమైన మధుబాల కిషోర్ రెండో భార్య అయ్యింది. ఒక పేద ముస్లిం కుటుంబంలో 11 మంది సంతానంలో ఒకరిగా జన్మించిన ముంతాజ్ తన అందం,అభినయంతో సూపర్ స్టార్ మధుబాల అయ్యింది. ఆమె కంటి చూపు కోసం మహామహులు వెంపర్లాడే వారు. అలాంటి అమ్మాయి దిలీప్ తో ప్రేమ విఫలమై కిషోర్ కి రెండో భార్యగా మారింది. ఆమెను పెళ్ళాడటానికి కిషోర్ అష్ట కష్టాలు పడ్డాడు. ఆఖరికి మతం మార్చుకొని కరీం అబ్దుల్ కూడా అయ్యాడు. వారి వైవాహిక జీవితం తొమ్మిది ఏళ్ళపాటు సాగింది. వారికి సంతానం కూడా కలుగ లేదు. హృదయంలో చిల్లుపడి అనారోగ్యంతో మంచం పాలై విషాదకర పరిస్థితుల్లో మధుబాల మరణించింది. ఆ తొమ్మిదేళ్ళ కాలంలో ఆమె నటించలేదు. వైద్యం కోసం లండన్ వెళ్లాలని అనుకున్న ఆమెను కిషోర్ అందుకు అనుమతించ లేదనీ ,వైద్యం అందకే ఆమె మరణించింది అనీ అతనిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. మూడో భార్య పేరు యోగితాబాలి. షమ్మి కపూర్ మొదటి భార్య,అలనాటి హీరోయిన్ గీతాబాలి మేనకోడలు ఈ అమ్మాయి. అప్పట్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. వీళ్ళ బంధం రెండేళ్ళ కన్నా ఎక్కువ కాలం కొనసాగలేదు. వివాహం తర్వాత కూడా నటన కొనసాగించిన యోగితా అప్పుడప్పుడే స్టార్ డం సంపాదించుకుంటున్న మిథున్ చక్రవర్తితో ప్రేమలో పడింది. కిషోర్ కి విడాకులు ఇచ్చి మిథున్ ను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత మిథున్ మన శ్రీదేవి తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడు కానీ ,అది కుదరలేదు. అది వేరే కథ. నాలుగో ,ఆఖరి భార్య లీనా చందావర్కర్ . మెరుపు తీగలాంటి సౌందర్యం. ఒక ఆర్మీ అధికారి కూతురు. ప్రముఖ హీరోయిన్ .అపురూపమైన అందం ఆమె సొంతం. ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన సిద్ధార్ధ అనే యువకుడు ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన కొద్దికాలానికే ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి మరణించాడు. 25 ఏళ్ళ వయసుకే ఆమెకు వైధవ్యం వచ్చింది. ఆమె సౌందర్యానికి ముగ్దుడై ఆమెతో ప్రేమలో పడ్డాడు కిషోర్. ఇద్దరి మధ్య వయసు తేడా 21 సంవత్సరాలు.ఇద్దరూ ప్రేమలో పడ్డారు.పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. దానికి లీనా తండ్రి ఒప్పుకోలేదు. ఇప్పటికె మూడు పెళ్ళిళ్ళు పెటాకులయ్యాయి. దాదాపు నీ అంత వయసు ఉన్న కొడుకు ఉన్నాడు. చచ్చినా కోశోర్ కి ఇచి పెళ్లి చేసే ప్రసక్తి లేదు అన్నాడాయన. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న కిషోర్ నానా ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి ఆమె ఇంటి ముందు ధర్నా కు దిగాడు. అప్పట్లో కిషోర్ తను పాడగా పాపులర్ అయిన 'నఫ్రత్ కరనే వాలో కె దిల్ మే ప్యార్ భర్ దూ' పాటను ఆ ఇంటి ముందు పాడుతూ కూర్చున్నాడు. చివరికి లీనా తండ్రి పెళ్ళికి అంగీకరించాడు. అదే కిషోర్ ఆఖరి పెళ్లి. 1980 లో వాళ్లకు పెళ్లి అయ్యింది. 1987 లో మరణించే వరకు కిషోర్ ఆమెతోనే కలిసి జీవించాడు.37 ఏళ్ళ వయసులో ఆమెకు మరోసారి వైధవ్యం ప్రాప్తించింది. ఆ తర్వాత ఆమె వేరేవ్వరినీ పెళ్లాడ లేదు. స్వతహాగా గాయని కూడా అయిన లీనా భర్త మరణం తర్వాత అతని సంగీతాన్ని,పాటల్ని,జ్ఞాపకాలను సజీవంగా ఉంచటానికే కృషి చేస్తోంది. ఆమెతో కిషోర్ కు సుమిత్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు,లీనా,సుమిత్,అమిత్,అతని భార్య, కిషోర్ మొదటి భార్య,అమిత్ తల్లి రూమ గుహ అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అందరికీ కిషోర్ అంటే అమితమైన ప్రేమ,భక్తీ. ఇదీ కిషోర్ వైవాహిక,ప్రేమ జీవితం. అతను తప్పో,ఒప్పో నిర్ణయించే శక్తి నాకు లేదు. కానీ, ప్రేమలో,జేవితంలో అతను ఎదుర్కొన్న అనేకానేక సంఘటనలే అతని స్వరానికి అంతటి మహత్తర శక్తిని ఇచ్చాయని విశ్వసిస్తాను.