Latest News
సాహిత్యం
 • వాళ్లిద్దరూ  భార్యాభర్తలు ... ప్రతిరోజు పోట్లాడుకునే వారు  చిన్న సంపాదపరుడైన తన భర్త తో మాట్లాడుతూ  పక్కనోళ్లు అది కొన్నారు, ఎదిరింటోళ్లు ఇది కొన్నారు, వెనకింటోళ్లు ఇది కొన్నారు అని భార్య ప్రతిరోజు ఏదో ఒక కోరిక  కోరుతుండేది.   భార్య ఏది అడిగిన భర్త ఎన్నోసార్లు సర్ది చెప్పాడు,"నేను ఒక సాదా  సీదా వాడిని, నువ్వు అడిగే అంతపెద్ద ఏ కోరికలు తీర్చలేను మనకున్నంతలో సర్దుకుపోదాం" అని అన్నప్పుడల్లాతనకి మాత్రమే. ఇలాంటి భర్త దొరికడు అనుకునేది భార్య. ఇలా చాలా రోజులు గడిచాక ఒకరోజు ఇద్దరు కలిసి  చుట్టాల పెళ్ళికి వెళ్లారు,  అక్కడ పెళ్ళిలో ఒక సరదాగా ఒక ఆట పెట్టారు . గెలిచినా దంపతులకి 20 వేల రూపాయలు బహుమతి ఇస్తామన్నారు. వీళ్ళను కూడా అందులో పాల్గొనమని  చుట్టాలు బతిమాలడంతో సరే అన్నారు, అప్పటికే భార్య పెళ్ళికి వచ్చేముందు పట్టుచీర కట్టుకొని పోకపోతే పరువుపోతుందని భర్తని తిట్లు తిట్టి చేసేదేమిలేక  ఇష్టం లేకపోయినా పెళ్లికొచ్చింది. ఆట మొదలయింది....ఒక కుర్చీ వేశారు ఆ తర్వాత ఒక దానిమీదొకటి వేస్తారు.. అలా ప్రతి కుర్చీమీద భార్యని ఎత్తుకొని అందులో భర్త కూర్చోపెట్టాలి మళ్ళీ కుర్చీలోంచి ఎత్తుకొని దింపాలి అదే ఆట. రెండో కుర్చీ మొదటి కుర్చీ మీద వేశారు భార్యని కూర్చోపెట్టాడు, మూడోది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,  నాలుగోది  వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,  ఐదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు, ఆరవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,  ఏడువది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు, ఎనిమిదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,  తొమ్మిదవది వేశారు కూర్చోపెట్టాడు దింపాడు,పదవది వేశారు బాగా ఎత్తుగా ఉంది అయినా సరే కొంచెం కష్టంగా ఉన్న ఎత్తుకొని కూర్చోపెట్టాడు దింపాడు,పదకొండు, పన్నెండు, పదమూడు  ఇలా కుర్చీలు పెరుగుతున్నాయి ... అయినా భర్త ఆపట్లేదు ఒక్కసారి భర్త వైపు భార్య చూసింది,  భర్త కళ్ళల్లో నీళ్లు  చూసింది, ఎంత నొప్పిని భరిస్తున్నాడో అనిపించింది ఆమెకు.  ఆ నొప్పిని భరించేది ఆయన గెలవాలని కాదు .. కనీసం ఇలా అయినా భార్య అడిగిన కోరిక  తీర్చాలని భర్త పడే కష్టం  .. ఆ భార్యకు తెలిసింది. "భర్తను అర్ధం చేసుకునే భార్యలు చాలామంది ఉంటారు, కానీ వాళ్ళల్లో తను  లేనని.   భార్యని అర్ధం చేసుకునేవాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు, అందులో నా భర్త ఉన్నాడని ఆయన కళ్ళల్లోకి చూసాకే తెలిసింది"... ఆ కళ్ళను చూసి తన కళ్ళు కూడా చెమర్చాయి . ఆట ముగిసింది..... 20వేల రూపాయలు వీళ్లకందిస్తూ,ఈ ఆటలో గెలుపు ఓటములు అంటూ ఉండవు, భార్య వుంటే ప్రతి భర్త గెలుస్తాడు,భర్త ఉంటే ప్రతి భార్య గెలుస్తుంది, ఇద్దరు గెలిస్తే వాళ్ళ మధ్యన ప్రేమ కూడా గెలుస్తుంది, అలాంటి ప్రేమను గుండెలో దాచుకొని  పైకి చూపించలేని, పైకి కనిపించకుండా దాచుకొని  ఎంతో మంది భార్యాభర్తలు తమ ప్రేమకి  అన్యాయం చేసుకుంటున్నారు, కనీసం ఇలాంటి ఆటల వల్ల అయినా  ఆ ప్రేమను  బైటికి తెప్పించే వేదిక అయినందుకు  చాలా సంతోషంగా ఉంది అని నిర్వాహకులు ప్రకటించారు. కానీ ఆ భార్య ఆ డబ్బులు తీసుకోలేదు, "ఏ డబ్బుల కోసం నా భర్తని బాధపెట్టానో, ఇప్పుడదే డబ్బు వల్ల నా భర్త విలువ తెల్సింది, ఈరోజే తెలిసింది అలాంటి భర్తను పొందడం  ఎన్ని జన్మలో వరమో అని" ఆరోజు నుండి వాళ్ళిద్దరిమధ్య చిన్న చిన్న గొడవలు తప్ప,నాకిది కావాలి, నాకు అది కావాలని భార్య అడగలేదు... అక్కడ ఒక సంసారం నిలబడింది, కుటుంబంలో ప్రేమ నిలబడింది. కుటుంబ విలువలు బతికేఉంటాయి అని చెప్పడానికే ఈ చిన్న కథ. ------  Venkata Ramana Kumar Kaza...
 • ఆ రోజు అమావాస్య.. ఆదివారం. ఉదయం నుంచి ఒకటే వర్షం. సాయంకాలం అయినా తగ్గుముఖం పట్టలేదు.  ఎటూ కదలడానికి వీల్లేక పోవడంతో కనకారావు ఇంట్లోనే ఉన్నాడు. భార్య,కూతురు పుట్టింటి కెళ్ళడం తో ఏమి తోచక మధ్యాహ్నం ఒక క్వార్టర్ లాగించి నిద్ర పోయాడు. సాయంకాలం నిద్ర లేచి టీ తాగేక టీవీ ఆన్ చేసాడు .  చంద్రముఖి సినిమా వస్తోంది. చానల్ మార్చాడు. అందులో కూడా ఏదో దెయ్యం సినిమానే వస్తోంది.. ‘అందరూ దెయ్యం సినిమాలే వేస్తున్నారేంటి’ విసుక్కుంటూ టీవీ చానల్స్ మారుస్తున్నాడు.  కనకారావు కి అలాంటి సినిమాలు ఎందుకో నచ్చవు. అలాగని భయమని ఒప్పుకోడు. ధైర్యవంతుడిలా నటిస్తాడు కానీ తాను పిరికి వాడని ససేమిరా అంగీకరించడు. అయితే మందు పడితే మటుకు ధైర్యం కట్టలు తెంచుకుని ప్రవహిస్తుంది. ఆ తర్వాత దేనికైనా రెడీ అంటాడు.కనకారావు చానల్స్ మారుస్తుండగానే సుబ్బారావు వచ్చాడు. ఇతగాడికి కి అతగాడు కాలేజీ రోజులనుంచి జిగ్రీ దోస్త్. “ఏంట్రా ఇంత లేటు ??” అడిగాడు కనకారావు  “మా పక్కింటి అమ్మాయికి దెయ్యం పట్టిందట్రా … ఆపిల్ల మొగుడు వస్తే మాట్లాడి పంపించే సరికి లేటు అయింది.” సుబ్బారావు చెప్పాడు. “ఈ దెయ్యాల గోలేంటిరా బాబూ. . ముందు మందు సంగతి చూడు.” “ఆ పని మీదే ఉన్నాలేవోయ్ .. ” అంటూ వెళ్లి గ్లాసులు కడుక్కొచ్చి టీపాయ్ మీద పెట్టాడు. కనకారావు ఫ్రిజ్ లో నుంచి మందు బోటిల్ తీసుకొచ్చి రెండు గ్లాసుల్లో పోసాడు.“చీర్స్” అంటూ మొదలెట్టారు. కాసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నారు. రెండు రౌండ్లు ముగిసేయి. “ఒరేయ్ టీవీలో ఏదైనా సినిమా పెట్టు… చూద్దాం ” అన్నాడు సుబ్బారావు “అన్నిచెత్త సినిమాలే వస్తున్నాయి కానీ కబుర్లు ఏవైనా చెప్పరా ??” అన్నాడు సిగరెట్ వెలిగించుకుంటూ. “మా పక్కింటి చంద్రకళ గురించి చెప్పానా నీకు ? “ “లేదే? బాగుంటుందా ?” “ఓ సూపర్ . ఈ మధ్యనే వచ్చారులే … మొగుడు మహా తాగుబోతు …. పైగా పెళ్ళాం పై అనుమానం …. రోజూ తాగొచ్చి చావ కొడుతుంటాడు” “అయితే ?” “మొన్న దసరాకి పుట్టింటి కెళ్ళి వచ్చినప్పటినుంచి ఆ చంద్రకళ కి చంద్రముఖి ఆవహించిందట.  అప్పటినుంచి కథ రివర్సు అయింది. ఇంట్లో ఒకటే రచ్చ. రోజు ఆ పిల్ల మొగుడ్ని కొడుతున్నదట” “ఇదేదో చిత్రంగా ఉందే ?చంద్ర ముఖి ఆవహించి కొట్టడం ఏమిట్రా”ఆసక్తిగా అడిగాడు కనకారావు  “నిజమే నోయ్. ఈ మధ్య ఇలాంటివి చాలా వింటున్నా..  దెయ్యాలు పూని ఆడోల్లు భర్తల పని పడుతున్నారట. ”  “అంటే దెయ్యాలు ఉన్నాయ్ అంటావా ?” ” ఉన్నాయ్ అంటారు. లేదు అంటారు. నా చిన్నపుడు మా అమ్మకూ దెయ్యం పట్టింది” చెప్పాడు సుబ్బారావు “మరేం చేసారు అపుడు ?” “మానాన్న ఎవరినో భూత వైద్యుడిని పిలిపించాడు…. నయం కాలేదు …తర్వాత కరెంట్ షాక్ ఇప్పించారట. కొన్నాళ్ళు తగ్గినట్టు తగ్గి మళ్ళీ మామూలే…. పదేళ్ళు ఇబ్బంది పడ్డాం.” “అవును దెయ్యాలు ఆడవాళ్లనే ఎందుకు పట్టి పీడిస్తాయి?” “కొంతమంది ఆడవాళ్ళు మానసికంగా బలహీనంగా ఉంటారు. దీనికి తోడు భర్తలు హింసించే రకమైతే ఇంకా బలహీన పడతారు. అలాంటి సందర్భాల్లోనే గాలి,ధూళి సోకుతాయంటారు.”  “అలాగంటావా?” అంటూ ఆలోచనలో పడ్డాడు కనకారావు.  “సరేరా !వర్షం తగ్గేలా లేదు… ఇంటికెళ్ళి ఆ పంచాయితీ చూడాలి … బై” అంటూ సుబ్బారావు వెళ్ళిపోయాడు.  కనకారావు టిఫిన్ చేసి పడుకున్నాడే కానీ సుబ్బారావు చెప్పిన మాటలే బుర్రలో గిర్రున తిరుగుతున్నాయి.  ………………………………………….. ………………………………………….. …………………………………..  కనకారావుకి ఉదయం ఏడుగంటలకి మెలకువ వచ్చింది. లేవడానికి ప్రయత్నించగా కాళ్ళు తాడుతో కట్టేసి వున్నాయి. చేతులు పరిస్తితి అంతే. “ఇదేంటి ?” కంగారు పడిపోయాడు. “శాంతి” అంటూ పెద్దగా కేకలేసాడు.  “ఏంటి కేక లేస్తున్నావు” అంటూ వంట గదిలో నుంచి వచ్చింది శాంతి చేతిలో కాఫీ కప్పుతో  “నా కాళ్ళు చేతులు కట్టేసింది ఎవరు ?” “నేనే ” ఎదురుగా ఉన్న కుర్చీలో స్టైల్ గా కూర్చుని పొగలు కక్కుతున్న కాఫీ సిప్ చేస్తూ అంది .  ఆమె నడకలో,చూపుల్లో, గొంతులో ఏదో తేడా ఉంది.వాయిస్ కొంచెం రఫ్ గా ఉంది.  శాంతి వాలకంలో మార్పు గమనించి కనకారావు ఆశ్చర్యపోయాడు. తన ఎదురుగా నిల్చోడానికే భయపడే శాంతి ఇంత ధైర్యంగా కూర్చుంటుందా ? ఆ ఫోజు చూసాక కనకారావు కి చర్రున కాలింది.  “నువ్వా ? ఎందుకు కట్టేసావ్ ? “ “రాత్రి తప్ప తాగొచ్చి నన్ను రేప్ చేయబోయావ్ .. అందుకే కట్టేశాను”  “ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్” అంటూ గదమాయించాడు  “పెళ్లామని ఏదో దగ్గరకొస్తే ఇలా కట్టేస్తావా ??” “ఇంకా నయం కొట్టలేదు” “అంటే కొడదామనే ….ఏదీ కొట్టు చూద్దాం” అన్నాడు రెచ్చగొడుతూ.  “ఏం కొట్ట లేనా ?” అంటూ ఆమె రయ్ మంటూ లేచొచ్చి ఆ చెంప ఈ చెంప వాయించింది.  కనకారావుకి ఆ దెబ్బలతో దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది.  “ఓమ్మో ఓ ఆయ్యో” అంటూ కేకలేసాడు. “చాలా ఇంకా కావాలా” అంటూ ఆగింది శాంతి.  ఊహించని ఆ దెబ్బలకు కనకారావు బిక్క చచ్చిపోయాడు. మళ్ళీ ఏమంటే దేంతో కొడుతుందో అని భయపడిపోయాడు.“దీనెమ్మ కడుపు కాలా ? ఇంతలా కొట్టింది… ఇంత ధైర్యం ఎలా వచ్చింది? రోజు తాగొచ్చి ఏం చేసినా కుక్కిన పేనులా పడుండేది. ఇవాళ ఏమిటి ఇలా ?" దీనికి ఏమైనా దెయ్యం పట్టిందా?దీన్ని వాలకం చూస్తుంటే అలాగే ఉంది.” కనకారావు ఆలోచనలు పరి విధాలుగా సాగేయి.  శాంతి వంట గది లోకి వెళ్ళింది. ‘ఇపుడు తప్పించుకోవడం ఎలా ? ‘ఎలాగోలా శాంతినే బతిమిలాడుకోవాలి’ అనుకుంటుండగా ఆమె కాఫీ కప్పుతో వచ్చింది.  “సారీ శాంతి… రాత్రి ఏదో పొరపాటు జరిగింది “అన్నాడు తలవంచుకుని  “శాంతి కాదు ఇంద్రముఖి… చంద్రముఖి చెల్లిని. “ “ఇంద్ర ముఖా ?? పేరేపుడు మార్చుకున్నావ్” అని అడగాలనుకున్నాడు కానీ భయమేసింది  “ఆ ఆ అదే …ఇంద్రముఖీ” అన్నాడు నంగి నంగిగా. “ఒకే …. ఇట్సాల్ ….. కాఫీ తాగుతారా “అడిగింది ఆమె.  మరి ‘కట్లు’ అన్నట్టుగా చూసాడు.  కప్పు టీ పాయ్ మీద పెట్టి కట్లు విప్పదీసింది.  ‘అమ్మయ్య బతికి పోయానురా దేవుడా’ అనుకున్నాడు కనకారావు  “కట్లు విప్పదీసాను గదా అని మళ్ళీ పిచ్చ పిచ్చ వేషాలు వేసారా? ఈ సారి దీనికి పనిచెబుతా” అంటూ బొడ్లో దాచిన రివాల్వర్ తీసి చూపింది. కనకారావు హడలి పోయాడు రివాల్వర్ చూడగానే.  శాంతి ఇచ్చిన కాఫీ ని మంచినీళ్ళ లా గడ గడ తాగేసాడు. “అయిదు నిమిషాల్లో మీ పనులన్నీ ముగించుకుని హోటల్ కెళ్ళి టిఫిన్ పట్టుకురండి” అంది.  ఇదే చాన్స్ అనుకుని బాత్ రూంలో దూరాడు. ఆరో నిమిషంలో బయటకొచ్చి చకచకా రెడీ అయ్యాడు  “పదిహీను ఇడ్లీ ,ఆరు పెసర దోశలు ,ఆరు పూరీలు నాకు కావాలి …. మీకేం కావాలో మీ ఇష్టం” అంటూ ఆర్డర్ వేసింది. “సరే “అంటూ తలూపాడు కనకారావు.  ‘రోజూ మూడు ఇడ్లీకి మించి తినదు …ఇపుడేమో … ఓహో దెయ్యపు తిండి అంటే ఇదే కాబోలు … ఓర్నాయనో’ అనుకున్నాడు మనసులో. హోటల్లో టిఫిన్ ఆర్డర్ చేసి ఆ పక్కనే ఉన్న షాప్లో మూడు పెగ్గులు వేసుకున్నాడు.  మందు పడ్డాక కొంచెం ధైర్యం వచ్చినట్టు ఫీల్ అయ్యాడు.సుబ్బారావుకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాడు.  “అవి ఖచ్చితంగా దెయ్యం లక్షణాలే…. నువ్వు భయపడకు… అలా కనిపించావంటే నిన్ను ఓ ఆట ఆడిస్తుంది! జాగ్రత్త “అంటూ అతగాడు హెచ్చరించాడు.  ఇంటికి వచ్చేటప్పటికి హాల్లో శాంతి డ్యాన్సు చేస్తోంది.  పక్కనే టేప్ రికార్డర్ లో నుంచి చంద్రముఖి సినిమాలోని “రారా చెంతకు రారా” పాట వినిపిస్తోంది.  ఆ సన్నివేశం చూడగానే కనకారావుకి సర్రున కోపమొచ్చింది. శాంతి మేకప్ చేసుకుని అచ్చం జ్యోతిక లాగా తయారైంది . పెదాలకు లిప్స్టిక్ వేసింది. బుగ్గన నల్లని చుక్క పెట్టుకుంది. కనుబొమలను దిద్ది రెప్పలకు షేడ్స్ అద్దింది. కాళ్ళకు గజ్జెలు కట్టుకుంది… లయ బద్దంగా నర్తిస్తోంది. మరో మగాడు అయితే శాంతి డాన్సు కి ముగ్దుడై ప్రశంసలు కురిపించేవాడు.  కానీ కనకారావుకి శాంతి అలా తయారవడం సుతరామూ నచ్చలేదు. ఆమెను అలా చూడగానే ఒక్కసారిగా బీపీ పెరిగి పోయింది. కోపంతో ఒళ్ళంతా కంపించింది.  “శాంతీ” అంటూ శంకర శాస్త్రి లా కేక వేసాడు.  “స్టాప్ …. వాట్ ఇస్ దిస్ న్యూసెన్సు” పెద్దగా అరిచాడు. శాంతి డ్యాన్సు ఆపి “ఏంటి” అన్నట్టు చూసింది.  “ఏంటి ఈ తైతక్కలు .. ఆ మేకప్పులు … ఇలాంటి బజారు వేషాలు నాకు నచ్చవు.” అన్నాడు.  ” ఏమన్నావ్ ? “శాంతి కూడా అదే స్థాయిలో అడిగింది.  “పొద్దున్నుంచి చూస్తున్నా! ఎంటే నీ ఓవర్ యాక్షన్?” “ఏంటి నోరు లేస్తుంది. నువ్వు రోజు తాగి తందనాలు వేస్తే తప్పు కాదు గానీ డ్యాన్సు చేయడం తప్పా ?” శాంతి ఆవేశంగా అడిగింది. ” తప్పేనే … ఇంకా మాట్లాడితే తప్పన్నర కూడా! ఆడది ఎపుడూ చెప్పుకింద తేలులా పడి ఉండాలి. అంతే!మొగుడిని అని కూడా చూడకుండా నన్నేకట్టేసి కొడతావా ?ఇపుడు చూస్కోవే” అంటూ ఆవేశంతో ఆమె మెడ పట్టుకుని గోడ కేసి కొట్టేందుకు ముందుకు దూకాడు. అంతే.. అలా మెడ పట్టుకున్నాడో లేదో కరెంట్ షాక్ కొట్టినట్టు మెలికలు తిరుగుతూ ‘ ఓ ‘అంటూ పోలి కేక పెట్టాడు. అదే అదనుగా శాంతి అతగాడిని ఒక తోపు తోసింది. కనకారావు వెళ్లి రివాల్వింగ్ చైర్ లో కూల బడ్డాడు. కుర్చీ మెల్లగా తిరగడం మొదలెట్టింది.అనూహ్యంగా జరిగిన పరిణామాలకు కనకారావు వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది.  “ఇంకెపుడూ ఆడవాళ్ళపై చేయి ఎత్తనని.. .తాగి ఇంటికొచ్చి గొడవ చేయనని చెబుతావా ?లేదా ?  నువ్వు తప్పు ఒప్పుకునేవరకు ఆ కుర్చీ అలా తిరుగుతూనే ఉంటుంది.”  ఎదురుగా నిలబడి హెచ్చరించిన శాంతి రౌద్ర రూపం చూడాలంటేనే అతనికి భయమేసింది. కుర్చీ స్పీడ్ మెల్లగా పెరుగుతోంది. మరో వైపు శాంతి మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. కుర్చీగిర్రున తిరుగుతోంది. క్రమంగా స్పీడ్ పుంజుకుంది.  “అమ్మో !నీకు దండం తల్లీ ! నువ్ చెప్పినట్టే చేస్తా”అంటూ చేతులెత్తి నమస్కారం చేసాడు.  అంతే …. ఒక్కసారిగా కుర్చీ అమాంతం గాల్లోకి లేచింది.  కనకారావు భయంతో కేకలేస్తూ డామ్మని కింద పడ్డాడు. రెండు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి చూసాడు.  బెడ్ రూమ్ లో మంచం పక్కనే కింద పడి ఉన్నాడు. ఒళ్లంతా చెమటలు పట్టేయి.  చుట్టూ కలయ చూసేడు.. ఎవరూ లేరు. అక్కడ కుర్చీ కూడా కనపడలేదు.  ఇదంతా కలా ?? గోడ గడియారం వైపు చూసాడు… టైం ఉదయం ఆరు అవుతోంది. అంతలోనే బయట నుంచి ఎవరో తలుపు కొడుతున్న శబ్దం … ఆ వెంటనే “ఏవండీ తలుపు తీయరా ” అంటూ శాంతి పిలుపు వినిపించాయి.  art by Ram seshu...
 • ఇలపావులూరి మురళీ మోహన రావు...................... నక్షత్రకుడిలా నా వెంటబడి చావగొట్టకు’ ‘అబ్బో… అతని గురించి చెప్పాలంటే నక్షత్రకుడిని మించి ఇబ్బందులు పెడతాడు’ అంటుంటారు. ఇంతకూ ఎవరీ నక్షత్రకుడు ? ఏమా కథ....అతడి నుంచి మనం ఏమి తెలుసుకోవాలి ....   ఇదిగో చదవండి.    మార్కండేయ పురాణం లోని ఒక ఆసక్తిదాయకమైన పాత్ర నక్షత్రకుడు. ఇతను విశ్వామిత్ర మహర్షి శిష్యుడు. హరిశ్చంద్రుడు తాను వాగ్దానం చేసిన డబ్బు ను రాబట్టడానికి హరిశ్చంద్రునికి తోడుగా నక్షత్రకుడిని పంపిస్తాడు. అయితే.. హరిశ్చంద్రుడి చేత ఒక చిన్న అబద్దం ఆడించి వ్రతభంగం చేయించడం విశ్వామిత్రుడి లక్ష్యం. విశ్వామిత్రుడికి తాను ఇస్తానన్న సొమ్ము చాలకపోవడం తో రాజ్యం మొత్తం విశ్వామిత్రుడికి ధారపోసి భార్యాబిడ్డల తో కలిసి అరణ్యానికి వెళ్తాడు. నక్షత్రకుడు హరిశ్చంద్రుడిని క్షణక్షణం వేధిస్తూ ఉంటాడు. వారు నడుస్తున్న సమయం లో నేను నడవలేను అని కూలబడతాడు. కొడుకుని భుజాల మీద నుంచి దించి తనను ఎత్తుకోమంటాడు. హరిశ్చంద్రుడు అలసిపోయి ఒక క్షణం కూర్చుంటే తన సమయాన్ని వృధా చేస్తున్నావు అని నిందిస్తాడు. ఎక్కడా నీరు దొరకని చోట తనకు అర్జెంట్ గా మంచినీళ్లు కావాలంటాడు. మధ్య మధ్యన "ఆ డబ్బు నేను ఇవ్వలేను అని ఒక్క మాట చెప్తే వెనక్కు వెళ్ళిపోతా" అంటాడు. కానీ హరిశ్చంద్రుడు అంగీకరించడు. అప్పు తీర్చడం కోసం భార్యను అమ్మేస్తాడు హరిశ్చంద్రుడు. ఆ డబ్బుకు వడ్డీ కూడా కావాలని నక్షత్రకుడు పీడిస్తాడు. ఇక నా దగ్గర ఏమీ లేదు అని హరిశ్చంద్రుడు అనగానే "నిన్ను అమ్మి వడ్డీ కింద జమ వేసుకుంటా" అని అతనిని ఒక కాటికాపరికి అమ్మేసి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోతాడు. *** ఇక్కడ నక్షత్రకుని ఒక వ్యక్తిగా చూడకూడదు. తీర్చలేని అప్పు చెయ్యడం, వడ్డీలు కట్టడం, పెద్దగా పరిచయం లేని వారికే కాక, ఉన్నవారికి, బంధువులకు కూడా హామీగా ఉండి రుణ పత్రాల మీద హామీ సంతకాలు చెయ్యడం, ఆ తరువాత అప్పులు తీర్చలేక, ఇంట్లో ఉన్న బంగారం, ఇల్లు కూడా అమ్మేసే వారు మనకు సమాజం లో ఎందరో కనిపిస్తారు. అప్పు చేస్తే ఎలాంటి బాధలు చుట్టుముడతాయో, రుణదాతల నుంచి ఎలాంటి భయంకరమైన వేధింపులు ఉంటాయో, చివరకు భార్యాపిల్లలను కూడా పోగొట్టుకోవడమే కాక, తానూ ఆత్మహత్యకు పాల్పడవలసి వస్తుందో చెప్పడానికి నక్షత్రక పాత్ర ఒక ప్రతీక గా భావించాలి. అప్పులు చెయ్యవచ్చు. ఎలాంటివి? ఇల్లు, స్థలం, బంగారం కొనుక్కోవడానికి అప్పులు చెయ్యవచ్చు. రేపు కథ అడ్డం తిరిగినప్పుడు వాటిని అమ్మి అయినా అప్పులు తీర్చి బయటపడవచ్చు. కానీ, తాహతు లేకపోయినా, దర్జా కోసం, విలాసాల కోసం, నలుగురి తో ఘనంగా చేసాడు అనిపించుకోవడానికి అప్పులు చేసి శుభకార్యాలు చెయ్యడం లాంటివి మనిషిని పాతాళం లోకి తోసేస్తాయి. "అప్పుల బాధ భరించలేక కుటుంబం ఆత్మహత్య" అనే వార్తలు పత్రికల్లో చూస్తుంటాము. వాటి వెనుక అనవసరమైన అప్పులు చెయ్యడం కూడా ఒకటి. అప్పులు చేసేవాడు ఎప్పుడూ తప్పించుకుని తిరుగుతుంటాడు. మన శక్తి, తాహతు గ్రహించుకుని వీలైనంతవరకూ అప్పులు చెయ్యకుండా, ఇతరులతో మాట పడకుండా, గౌరవంగా జీవించేవాడే జీవితంలో సుఖపడతాడు. "అప్పులు చేయకురా నరుడా, తిప్పలు తప్పవురా" అని అప్పలాచార్య ఒక పాట కూడా రాశారు. కనుక పనికిమాలిన అప్పులు చేసేవారు ఎప్పుడూ నక్షత్రకుడి పాత్రను స్మరించుకోవాలి. అలాగే షూరిటీ సంతకాలు చేసి ఇరుక్కుపోయేవారు కూడా అనేకమంది కనిపిస్తారు. మిత్రుడు అని నమ్మి షూరిటీ సంతకం చేసిన పాపానికి తమ సంపాదన మొత్తం వేరేవారు చేసిన అప్పులు తీర్చడానికే ఖర్చు చేసిన వారు నాకు ఎంతోమంది తెలుసు. కనుక అందరూ జాగరూకతతో మెలగాలి అని నక్షత్రకుడి కథ మనకు బోధిస్తున్నది....
 • కరెంట్ పోవడంతో ఫ్యాన్ ఆగి పోయింది.  దూరంగా ఎక్కడో పిడుగు పడిన శబ్దం. ఆ శబ్దానికి మంచి నిద్రలో ఉన్న లీల ఉలిక్కి పడి లేచింది.   కిటికీ తలుపులు వేయకపోవడంతో అవి గాలికి టక టకమని కొట్టుకుంటున్నాయి. ఇల్లంతా చిమ్మ చీకటిగా ఉంది. కళ్ళు పొడుచుకున్నా ఏమి కనిపించడం లేదు. ఇప్పుడేంటో ఈ గాలి …వాన విసుక్కుంటూ లేచి కూర్చుంది లీల. చీకటంటే తనకు చచ్చేంత భయం.  చిన్నప్పటి నుంచి అంతే.  రఘు కరెంట్ పోతే తనను ఆట పట్టించే వాడు . భయపెట్టేవాడు.  తను కేకలు పెట్టేది…రఘు తను భయపడటం చూసి పగలబడి నవ్వేవాడు.  వర్షం జోరు పెరిగినట్టుంది ….మళ్ళీ ఉరుములు మెరుపులు.  అంతలో వీపును ఎవరో చేత్తో తాకిన ఫీలింగ్ ...మరో క్షణం గడిచేక వీపుమీద చేత్తో నిమురుతున్నట్టు అనిపించింది. లీలకు భయమేసింది. అలా వీపు నిమిరే అలవాటు రఘుకుంది. అదే స్పర్శ.. అదే ఫీలింగ్.  కానీ అది అసాధ్యం…రఘు చనిపోయి నెలరోజులవుతోంది.  మరెవరు ? ఇంట్లో తనొక్కతే ఉంది.  రాజు వస్తానని చెప్పి రాలేదు. ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. చీకటి కావడంతో ఏమి కనబడటం లేదు. అవును … ‘సెల్ లో టార్చ్ ఉండాలి కదా’ ఆ విషయం గుర్తుకొచ్చి తలగడ కింద వెతికేందుకు చేయి దూర్చింది.  అంతలో ఎవరో చేయి పట్టుకుని లాగినట్టు అనిపించింది.  ఆ స్పర్శ చల్లగా ఉంది. ఆ చల్లదనం తో ఆమె చేయి జిల్లుమంది. ఒక్క సారిగా గుండె జల్లుమంది.  ‘మరీ అంత భయ పడితే ఎలా ?’చెవిదగ్గర నవ్వుతూ అన్నట్టు వినిపించింది. ఆ గొంతు రఘు దే …నో డౌట్. కానీ అదెలా సాధ్యం ?? రఘు దెయ్యమై ఇలా వెంబడిస్తున్నాడా ? దెయ్యం అన్న ఊహకే లీల వెన్నులో వణుకు పుట్టింది. ఒక పక్క భయంగా ఉన్నప్పటికీ, గుండె బిగ పట్టుకుని తలగడ  కింద సెల్ కోసం వెతికింది. అది చేతికి దొరకడం తో ధైర్యం వచ్చింది.  అమ్మయ్య అనుకుని సెల్ ఆన్ చేసి క్షణంలో టార్చ్ లైట్ వేసింది.  “మంచం పై ఎవరైనా ఉన్నారా?” అని చూసింది….ఎవరూ లేరు. అయితే అంతా తన భ్రమేనా ? కొవ్వొత్తి ఎక్కడుందో?  మెల్లగా లేచి వెళ్లి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో నుంచి కొవ్వొత్తి తీసి వెలిగించింది. కొంచెం వెలుతురు వచ్చింది.  కిటికీ రెక్కలు మూద్డామని హాల్లోకి వస్తుండగా తలుపు కొట్టిన శబ్దం  “ఎవరదీ ?” అరిచింది. అటునుంచి సమాధానం లేదు. మరల ఎవరో తలుపు కొట్టిన శబ్దం.  “ఎవరక్కడ ?” పెద్దగా కేక వేసింది.  ‘వెళ్లి తలుపు తీస్తే ?అమ్మో వద్దులే’ అనుకుంటుండగా కిటికీ దగ్గర  అలికిడి అయింది. అంతలో బలంగా వీచిన గాలికి కొవ్వొత్తి ఆరిపోయింది.  చకచకా వెనక్కి వచ్చి మంచంపై కూర్చుంది. ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.  ‘ఈ రాజు ఎక్కడున్నాడో? ‘ అనుకుని ఫోన్ చేసింది. మూడు సార్లు చేస్తే అప్పుడు ఎత్తాడు  “ఎక్కడున్నావ్” విసుగ్గా అడిగింది  “వద్దామనుకున్నా …ఇంతలో వాన … అది చెబుదామని  ఫోన్ చేస్తే నీ ఫోన్ ఆఫ్ లో ఉంది.” అన్నాడు.  “అన్ని అబద్ధాలే… నా ఫోన్ ఆన్ లో ఉంది. వాన అనే వంకతో పెళ్ళాం పక్కన పడుకుని కులుకుతున్నావా ?” “మధ్యలో ఆమె సంగతి ఎందుకు ?” “నీ సంగతి నాకు తెలీదా ? నేను ఇక్కడ భయంతో చస్తున్నా… రఘు దెయ్యం లా వెంట పడుతున్నాడు.” “దెయ్యమా ?వాట్ నాన్సెన్స్” “నాన్సెన్స్ కాదు నిజమే… ఇక్కడ మంచం మీద కూర్చుంటే  వెనుకనుంచి నా వీపు నిమిరేడు.  తలగడ కింద సెల్ తీస్తుంటే చేయిపట్టుకున్నాడు.”  “అది నీ భ్రమ … ఎక్కువగా అతని గురించి ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. “ “ఎంతైనా మొగుడు కదా …. ఆలోచనలు రాకుండా ఎలా ఉంటాయి .  నాకెందుకో భయమేస్తోంది. మనం రఘుని చంపి తప్పు చేసాం అనిపిస్తోంది.”  “ఇపుడు తప్పు అనుకుంటే ఎలా ?లేక పోతే ఆస్తి ఎలా వస్తుంది?” “ఏమో నీ మోజులో పడి నువ్ చెప్పిందల్లా చేశా… ఇపుడెమో భయంగా ఉంది.” “భయపడే కొద్దీ భయమేస్తుంది.”  “సరే నువ్వు రా మరీ” అంది గోముగా  “సరేలే.” అన్నాడు  వాన కొంచెం తగ్గినట్టుంది .కరెంట్ ఎప్పుడొస్తుందో ఏమో ? మళ్ళీ కొవ్వొత్తి వెలిగిద్దామని లేవబోయింది. ఎవరో వెనుక నుంచి చీర కొంగు పట్టుకుని గట్టిగా లాగినట్టు అనిపించింది.  ఒక్క క్షణం గుండె ఆగింది.  “ఇందాక చూస్తే ఎవరూ కనిపించలేదు. ఇప్పుడు ఏంటి ఇలా ?”భయంతో వణికి పోయింది.  “ఏదో జరుగుతోంది…. ఖచ్చితంగా ఇది రఘు పనే.” అనుకుంటూ మెల్లగా వెనక్కి తిరిగి చూసింది.  మంచానికి అటు వైపు నుంచి ఒక ఆకారం తనకేసి వస్తున్నట్టు లీలగా కనిపించింది  దాని తాలూకు కళ్ళు చింత నిప్పుల్లా మెరుస్తున్నాయి. ఆ కళ్ళ ను చూడగానే లీలకు ఒళ్లంతా చెమటలు పట్టేయి. రఘు కళ్ళు కూడా అలాగే ఉంటాయి.  గుండె వేగంగా కొట్టు కోసాగింది. భయంతో పెద్దగా కేక వేయాలని ప్రయత్నించింది కానీ గొంతు పెగల్లేదు. మరో క్షణం అక్కడే నిలబడితే ఆ ఆకారం ఏమి చేస్తుందో ?ఏమో? ఆ భయంలో చీర ఊడిపోయిన విషయం కూడా ఆమె గమనించలేదు.  ఆ ఆకారం మెల్లగా వస్తున్నట్టు కనిపించింది.  అంతలో కరెంట్ వచ్చింది. “అమ్మయ్య” అనుకుంది. మంచం వైపు చూస్తే ఎవరూ లేరు.  ఆ గదంతా కలయ చూసింది. ఎవరూ కనిపించలేదు.  కొంచెం ధైర్యం వచ్చింది … అయితే ఇంత సేపు తను భ్రమ పడ్డానా ? ‘మరి ఆ కళ్ళు ?? ఏమో ?’ అనుకుని గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది.  వాన కూడా ఆగినట్టుంది.  కొంచెం ఫ్రెష్ అయితే కానీ టెన్షన్ తగ్గదు అనుకుని బాత్రూంలో కొచ్చింది.  మొహం కడుక్కుని అద్దంలోకి చూసింది.  గుండె ఆగింది… ఒక్క క్షణం.  అద్దంలో తన వెనుకనే రఘు నిలబడి నవ్వుతున్నాడు. అవే కళ్ళు… ఆ కళ్ళు చింత నిప్పుల్లా మండుతున్నాయి.  చటుక్కున వెనక్కి తిరిగింది. ఎవరూ లేరు.  మళ్ళీ అద్దంలోకి చూసింది.  ఆ కళ్ళు మరింత పెద్దగా కనిపించాయి.  అంతే.. కెవ్వున కేకేసి పడిపోయింది లీల. cover art by Ramseshu ...
 • విష్ణు సాక్షాత్కారం పాండ్యరాజైన మత్స్యధ్వజుడు విష్ణుచిత్తుడి విజయానికి అతడిని గజారోహణం చేయించి విష్ణుచిత్తుణ్ణి ఊరేగించినాడు. విష్ణుచిత్తుడిని విబుదులు,[దేవతలు] సిద్ధులు,విద్యాధరులు, కవ్యాహారులు,[పితృదేవతలు] కిన్నరులు బహువిధాలుగా మెచ్చుకొనిరి,క్రింది పద్యంలో ఇలా చెప్పెను. అద్ధా వాగ్విబుధం, బహో వచన కవ్యాహార, మాహా వచ స్సిద్ధం,బాః కృతతాం గతః కలి రితి శ్రీసూక్తి విద్యాధరం, బిద్ధౌద్ధత్యమగా ల్లయం హి కుధియా మిత్థంవద త్కిన్నరం, బద్ధీరాగ్రణి గెల్పుటుత్సవమునం దయ్యె న్నభం బంతయున్‌. పద్యం మొత్తం సంస్కృతం భాష. చతుర్ధాశ్వాసము - 6. [ 10 వ పద్యం ] విష్ణుచిత్తుడు గెలిచినప్పుడు దేవలోకాల్లోని వారు విష్ణుచిత్తుడిని పొగిడిన పై పద్య అర్ధం. విబుధులు (దేవతలు) అద్ధా అన్నారట. కవ్యాహారులు (పితరులు) అహో అన్నారట. సిద్ధులు ఆహా అన్నారట. విద్యాధరులు కలియుగం కృత యుగమైనది కదా అనే శ్రీసూక్తి పలికిరట.కిన్నరులు బిగ్గరగా ఇతర మతాల వాళ్ళకి గర్వం అణిగింది కదా అన్నారట.విష్ణువు ఆచటి వాళ్ళందరికీ గరుడారూఢుడై దర్శనమిచ్చెను, మహామునులు కూడా వచ్చి సామగానాలు చేశారు.దేవతలు పుష్పవృష్టిని కురిపించారు.విష్ణుచిత్తుడు భక్తిపారవశ్యంతో శ్రీహరిని స్తుతించేడు.ఇక విష్ణువు విశ్వకర్మని పిలిచి విష్ణుచిత్తుడి ఇంటిని మణిమయంగా చెయ్యమని ఆజ్ఞాపించాడు విష్ణువు. ఇంక విలిబుత్తూరులో ప్రజలు చాలా అద్భుతమైన స్వాగతం చెప్పారు విష్ణుచిత్తుడికి.అంతటి నుండి విష్ణుమహిమకి పరవశించినటువంటి విష్ణుచిత్తుడు భక్తుల్ని చాలా బాగా ఆదరిస్తూ గడుపుతున్నాడతను. యమునాచార్యుని కథ : శైవులు పై దూషణ. వర్షఋతు వర్ణన. ఒకచోట మన్ననారు స్వామి తన శ్రీమతియైన లక్ష్మీదేవికి యమునాచార్యుల కథను చెప్పిరి. ఇచట శైవమత దూషణం చాలా ఎక్కువగానే కనిపించును. వర్ష ఋతువు వర్ణనలో కాపులను, రెడ్లను దూషించెను.ఉదాహరణకి క్రింది పద్యములు. వసతుల్వెల్వడి, వానకై గుడి సె మోవన్ రాక తా నానియే వసగా నిల్చినజమ్ముగూడఁ బొల మంబ ళ్ల్మోయుచుం బట్టి పె న్ముసురం దీఁగెడుకాఁపుగుబ్బెతల పెన్గుబ్బ ల్పునాస ల్వెలిం బిసికిళ్ళుం బిసికిళ్ళు హాలికుల కర్పించె న్నభస్యంబునన్ చతుర్ధాశ్వాసము - 133. [ 11 వ పద్యం ] కాపు స్త్రీలను ఆసభ్యముగా వర్ణించెను....అదే విధముగా రెడ్లని పిసనారులనెనొకచోట...విడువ ముడువ వేపరని వీ సంబుగల రెడ్డి, దుప్పటికొంగులో బీదవారు కాసు వీసం ముడి వేసుకొని అత్యవసరమైనప్పుడు కూడా దాన్ని విడువలేక విడిచి వాడుకొందురుని,పద్యంలో రెడ్లను పిసనారులుగా వర్ణన చేసినాడు కవి రాయలు. వసంతమాసం..... గోదాదేవి ప్రేమ ఉద్యానవనాలు నలువైపులా పచ్చదనంతోటి నిండిపోయినాయి ,పొదరిళ్ళు దట్టంగా చాలా పొందికతో అల్లుకొన్నాయి, ఓ ఉద్యానంలోన చెట్ల మధ్య బాటలో తెల్లతామర కొలను పక్క నడుస్తున్నాడు విష్ణుచిత్తుడు. తులసితోటకి పక్కన అక్కడో పాలరాతి తిన్నె , దాని మీదో చిన్నిపాప,మోములో చక్కనికళ,చాలాచక్కని మనోహరమైన రూపం. విష్ణుచిత్తుడికి పిల్లలు లేరు , కనుక పాపను విష్ణుప్రసాదం అనుకొని అనుకున్నాడు, సంతోషంతో పాపను ఇంటికి తీసుకుని వెళ్లి గోదాదేవిగా నామకరణం చేసి, ఆమెను అల్లారుముద్దుగా పెంచుతున్నారు. కాలచక్ర పరిభ్రమణంలో కాలనుగుణమైనట్టి మార్పులతో బాల్యం నుండి యవ్వనవతిగా గోదాదేవికి యవ్వనోదయమైనది,ఇక ఆమె సౌందర్యం వర్ణన చేయాలంటే ఒకే ఒక్కమాట చెప్పుకోవాలి ఆమె సౌందర్యం ప్రపంచంలోనే లోకాద్భుతసౌందర్యం. గోదాదేవి మదనతాపభరము. విష్ణువు ఆశీస్సులుతో తనకు గొప్ప సంపదలు కలిగినా విష్ణుచిత్తుడు మాత్రం యథాప్రకారం స్వామికి అనేక పూలమాలలు,చెంగల్వపూల మాలలు,తులసి మాలలు స్వయముగా కట్టి అర్పిస్తున్నాడు .భగవంతుడి కోసం తన తండ్రి కట్టిన మాలలను గోదాదేవి ముందుగా తను వాటిని ధరించి నీటిలో తన ప్రతిబింబం[నీడ] చూసుకొని తర్వాత వాటిని యధాస్థానంలో పెట్టేస్తోంది.ఆమె పాడే పాటలు తమిళ బాష .అందువల్లనే తమిళనాడులో చూడికొడుత్త నాచ్చియార్ పేరుతో ఈమె ప్రసిద్ధి చెందినది. ఆమె చెలికత్తెలు నాగకన్యలు.తన చెలులతో విష్ణుగాథల్ని తల్చుకుంటూ ఏఏ అవతారాల్లో అతను ఎవరిని ఎలా వరించాడో వివరించి చెప్తూ పరవశిస్తూ కాలం గడుపుతోంది.ఆమె మనస్సులోని భావాలను తెలియచేస్తుంటే జన్మాంతరాల బాంధవ్యం ఆమెలోని విరహం రేపుతోంది.గోదాదేవి మన్మథతాప హృదయ భారం వర్ణనను రాయల వారు ఎలా చేశారో చూడండి క్రింది పద్యంలో. నెలఁతఁ గుచకుంభ యుగళ ముండియు వియోగ .... జలధి నీఁదింప లే దయ్యో; సఖులు వంచు చున్న పన్నీటి వెల్లి లోఁగొన్నకతన ముంప కది లాఘవమున దేలింపఁగలదే. పంచమాశ్వాసము - 151. (12 వ పద్యం )    పద్య తాత్పర్యం ఒకసారి పరిశీలిద్దాం. కుండలను సాయముగానుంచుకుని యీది నీళ్లను దాట వచ్చును ,అటుల యీదు చున్నపుడు కుండలలోనికి నీళ్లు జొరబడెనా అవి తేలింపక ముంచివైచును.ఆమె కుచములనియెడు జంట కుండలుండియు శరీరతాపమును తగ్గించుటకై చెలికత్తెలు పోసిన పన్నీటి ఝల్లులు వాని లోనికి జొచ్చి నందున అవి నిండి ఆమెను వియోగ సముద్రములో ముంచినవే కానీ తేలించినవి కావు! ఆలా గోదాదేవి స్వామి పాటలను దివ్యగానం చేస్తోంది. నిరంతరం స్వామినే తల్చుకుంటూ పూజిస్తూ గడుపుతోంది.అదంతా కూడా తనకి తెలియని ఓ రకమైన తపస్సు అనుకున్నాడు విష్ణుచిత్తుడు. ఈ విషయం ఏమిటో తెలుసు కోవాలని ఓ రోజు ఆ స్వామికే ఆమెని గురించి వివరించి చెప్పి, స్వామి నా కూతురు నిన్ను ప్రేమించు చున్నది ,ఇది ఎట్లు కుదురును ?అని స్వామిని విష్ణుచిత్తుడు అడుగగా,స్వామి  మందహాసం చేసేడు చెప్పినదంతా విని! ముందుగా విష్ణుచిత్తుడికి మాలదాసరి కథని చెప్పుట ప్రారంభించెను. మాలదాసరి కథ   మాలదాసరి - మంగళకైశికి. భగవంతుడు ఈ ఆముక్తమాల్యద కావ్యంలో రెండు కధలు చెపుతాడు,మొదటి కధ స్వామి తన సతీమణియైన లక్ష్మీదేవికి స్వయముగా చెప్పిన యామునాచార్యల కథ.ఇక రెండవది విష్ణుచిత్తుడికి చెప్పిన ఈ కథ. ఓయీ! విష్ణుచిత్తుడా! పూర్వమొక చెప్పరాని కులమువాడు కలడు.వాడు నా భక్తుడు , నేను వామనావతారము  వహించియున్న క్షేత్రమునకు మూడామడల దూరంలో ఇతడు నివసించును.తెల్లవారక ముందు బయలుదేరి నా గుడికి వచ్చును.అతడు వచ్చి మంగళకైశికీ రాగముతో నన్ను పాడుచుండును. వాని శరీరం అశుచి, వాని హృదయం శుచి, వాడు కట్టింది మసి పాత. వాని చెవులకు ఇత్తడి శంఖచక్రలా దుద్దులు.చేతిలో చిటితాళములు.అతనికి ఇటువంటి లక్షణములు కలవు.వాడు దినదినము కూడా నా దేవాలయముకి వచ్చి ఆనంద బాష్పలతో పాడుచు తన యొడలు కూడా మరచిపోయి తాండవము చేయును, చేతిలోన కిన్నెరవీణ యుండును,దాని మీదనే మీటుచుండును. ఇట్లు చాలా సేపు ఆడి,పాడి,సాష్టాంగముచేసి స్వామికి అభిషేకం చేయగా ఆ నీరు బయట రాతి తొట్టెలో నిండి యుండును.శూద్రుని చేత ఆ జలము తన చేతిలో పోయించుకొని అట్టి నీటిని త్రాగి, ప్రోద్దెక్కి తన యూరు పోవును, ఇది అతని యొక్క దిన చర్య.క్రింది ఇచ్చిన పద్యములు చుడండి. కలఁ డొకరుండు పేరుకొనఁ గాని కులంబు మదీయభక్తుఁ, డి య్యిల మును వాఁడు వామనత నే వసియించిన పుణ్యభూమియం దుల కొకయోజనత్రయపు దూరపుటూర వసించి, బ్రహమ్మ వే ళలఁ జనుదెంచి , పాడు మము లాలస మంగళనామ కైశికిన్ షష్టాశ్వాసము - 3. [ 13 వ పద్యం ] అహరహంబు నమ్మహాత్ముండు. 3 వ పద్యం 5 వ పద్యంకి మధ్య వచ్చు[వ]. షష్టాశ్వాసము - 4. జాత్యుచితచరిత్రమమ త్రీపిత్యర్థం బూఁది తనదు హృదయము శుచి తా నిత్యంబుగఁ దత్తనుసాం గత్యము మసిపాఁత మానికంబై యొదుఁగున్ షష్టాశ్వాసము - 5. [ 14 వ పద్యం ] చమురైన తోల్కుబుసంబు టెక్కియను ని త్తళి శంఖ చక్ర కుండలము లమర. దివెదారికొమ్ముఁ దోల్తిత్తియు జోడమ్ము మెడమీఁది మొగలాకు గొడుగుఁ దనర. మత్పాదరక్షయు మావు పెన్వెఱకఁ గు ట్టిన యోటి తిపిరిదండెయును మెఱయఁ, జిటితాళముల సంక పుటిక నొక్కొకమాటు..  గతిర యంబునఁ దాఁకి కలసి మొరయ. షష్టాశ్వాసము - సీ 6. [ 15 వ పద్యం ] పలుఁద వనమాలకంటెయు మలిన తనువుఁ బట్టెతిరుమన్ను బెదురుఁగెఁపుట్టుఁ జూపుఁ బసుపుఁబొడితోలువల్వంబు నెసకమెసఁగ వచ్చుసేవింప సురియాళు వైష్ణవుండు. షష్టాశ్వాసము - 6. [ 16 వ పద్యం ] గండాభోగముల న్ముదశ్రులహరు ల్గప్ప న్ముతు ల్పాడియా దండ న్ర్వేఁగులు డించి భక్తి జనితో ద్యత్తాండవం బాడు, నా చండాలేతరశీలుఁ డుత్పలకియై చండాలిక న్నీఁటుచున్, గుండు ల్నీరుగ, నెండ గాలి పసి తాఁకుఁ జూడ, కాప్రాహ్ణమున్. షష్టాశ్వాసము - 7. [ 17 వ పద్యం ] అట్లు దడువగఁ గొల్చి సాష్టాంగ మెఱఁగి గర్భ మండపిఁ గడిగిన కలఁకజలము లోని ఱాతొట్టి నిండి కాలువగఁ జాఁగి గుడివెడలి వచ్చునది శూద్రుఁ డిడఁగఁ గ్రోలి. షష్టాశ్వాసము - 8. [ 18 వ పద్యం ] మరులు తీగ :: ఇట్లుండగా నొక్కనాడు అర్థరాత్రి వేళ దాసరి గృహం పక్కనున్న కోళ్లగుడిసెలో పిల్లి దూరగా దాంతో కోళ్ళు గాబరాపడి కూయగా నితడు [ దాసరి] తెల్లవారినదనుకొని స్వామి సేవకి బయలుదేరెను.అలా అతడు బయలుదేరి దారిలో మరులు తీగను త్రొక్కెను.క్రిందిపద్యం చూ డండి. మరులుఁ దీఁగ మెట్టి యిరు లన్ననో యని యెడు తమిస్రఁ గాడుపడి పొలంబు లెల్లఁ దిరిగి తూర్పు దెల్ల నౌతణి నొక్క శూన్యగహనవాటిఁ జొచ్చి చనుచు షష్టాశ్వాసము -12. [ 19 వ పద్యం ] మరులు తీగను మర్లు మాతంగి యని కూడా యందురు ,అదొక అలుము. సన్నని ఆకులు యుండును. దీని కాయ గురిగింజంత ఎర్రగా యుండును. రెండు విత్తులు ఒక్క దానికొకటి ఎదురుగ వేర్వేరు దిక్కుల మొగమైనుండును. ఈ తీగ త్రొక్కినవారు దారి తప్పుదురు,దాసరి ఎక్కడెక్కడో తిరిగేడు.అలా తిరిగి తిరిగి ఒక నిర్జనమైన ప్రదేశంలో ఒకచోట పడిపోయిన గోడలు,కపింద గోరింద పొదలు,విరిగిపోయిన యేతాల కఱ్ఱలు, బీడుపడ్డ పొలాలుదాటి,ఒక పాడుపడ్డ గ్రామం కనపడెను. అతని కాళ్ళకి పాపం ఒకవైపు ఉత్తరేనికాయలు గీచుకున్నా, మరోవైపు పల్లేరుగాయలు గుచ్చుకుంటున్నా ఆగలేదు ,ఆలా పోయి పోయి అర్ధ యోజనం పొడుగుగల జడలు కలిగిన మహావిస్తారమైన ఓ వటవృక్షం[ పెద్దమఱ్ఱిచెట్టు]ను చూచినాడు. [అతనికి కనిపించిన వటవృక్షం వర్ణన పద్యం.] కాంచె న్వైష్ణవుఁ డర్థ యోజన జటా ఘాటోత్థశాఖోపశా ఖాంచజ్జాటా చరన్మరుద్రయ దవీయ ప్రేషితోద్యచ్ఛదో దంచ త్కీటకృత వ్రణచ్ఛలన లిప్యాపాదితాధ్వన్య ని స్సంచారాత్త మహాఫలోపమ ఫల స్ఫాయద్వ టక్ష్మాజమున్‌ షష్టాశ్వాసము - 15. [ 20 వ పద్యం ] అప్పుడు మాలదాసరికి అక్కడున్న వటవృక్షం ప్రక్కననొక కాలి త్రోవను చూసినాడు,వెంటనే అట్నుంచి దగ్గర దారి ఏమైనా వుందేమోనని భావించి అతడు అటువైపుగా నడిచినాడు, అక్కడ ఎక్కడ చూసినా పుర్రెలు, మాంసము పళ్ళతో గీకికొని తిన్న బొమికెలు,ఇక ఈగల్తో ముసురిన మలినపదార్ధములు,పచ్చితోళ్ళు, గాలికెగురుతున్న మనుషుల శిరో కేశములు, ముక్కలై పడున్న అవయవాలు, వాటి కోసం పోరాడుతున్న మృగాలు , ముక్కులు పగిలే కుళ్ళున మాంసం కంపు,వీటన్నింటిని చూచి తనలో ఇట్లనుకొనెను,ఈ చెట్టు మీద నెెవడో నున్నాడు ,వాడు మాత్రం మానవుడు కాదు, అనే అనుమానం దాసరి మనసులో అప్పుడే ప్రవేశించిందో లేదో ,సరిగ్గా అతని అనుమానం నిజం చేస్తూ ఎదురుగా ఆ చెట్టు మీద యున్న కుంభజానుడునే రాక్షసుడు కనిపించుతాడు. (పార్ట్ 4 రేపు ) ----  మల్లారెడ్డి దేశిరెడ్డి...
 • ద్రవిడాంగనల పోఁడుములు  ::శరీరాలకి బంగారు పూత పోసినట్లుగా,తమ శరీరాలకి పసుపు పూసుకుని కొలను నందు స్నానమాచరించి, శ్రీహరి పూజకోసం బిందెల్లో నీళ్ళు నింపుకుని చేతుల్లో తామరపూలతోటి ద్రవిడస్త్రీలు తమ వయ్యారాలు ఒలకబోస్తూ, ఒక వైపు గానం చేసుకుంటూ ఉద్యానవనము దారిలో వెళ్ళుచున్నపుడు చేసిన వర్ణనను ఈ క్రింది పద్యంలో చెప్పాడు. శాయ పూజాంబుజముల్ ఘటిం దడఁబడన్, జన్ధోయి లేఁగౌనుపై దయఁ దప్పన్ బసుపాడి,పాగడపుఁ బాదంబొప్పఁ,జంగల్వడి గియ నీ రచ్యుత మజ్జనార్దము గటిం గీలించి, దివ్య ప్రబం ధయుగాస్యల్ ద్రవిడాంగనల్ నడుతు రుద్యానంపులో త్రోవలన్. ప్రథమాశ్వాసము - 56. [ 4వ పద్యం ] అరుగులమీద కూర్చుని ఉల్లాసంగా పాచికలు ఆడుతున్న ద్రవిడ స్త్రీలను వర్ణించిన తీరును ఒకసారి చూడండి ఎలా వుందో, సన్యాసికైనా గుండె జల్లు మనిపించేది సారె విసిరేటప్పుడు వాళ్ళ కంకణాల చప్పుడు విని, మన్మథుడే ఎదురుగా వచ్చినా పట్టించుకోనిది వాళ్ళ ఆట తన్మయత్వం, ఇంద్రుడినైనను సరే అక్కడికి లాక్కొచ్చేది భక్తులను చూడటం తోటే ద్రవిడ స్త్రీలు లేచి వాళ్ళు పెట్టే నమస్కారభంగిమ, పురవీధిలో జనం గుండెలను కోసేవి ఆలయం నుంచి వచ్చే శంఖనాదం వినటానికి ఆ స్త్రీలు తమ తలలను తిప్పినప్పుడు అతి వేగంగా పయనించే వాళ్ళ కళ్ల కొనచూపులు. ఇక వాళ్ళు మాంచి ఊపుగా పాచికల్ని వేస్తూంటే ఆ ఊపుకి జారిన పైటని తమ రెండో చేత్తో సర్దుకునే దృశ్యం చూడ కలిగిన వాళ్ళు ధన్యులు!అంటూ వర్ణించారు,ఈక్రింది చూపిన రెండు పద్యములలో రాయల వారు ఇలా చెప్పాడు. సవలయధ్వని గాఁగ సారె వ్రేయు నదల్పు యతినైన గుండె జల్లనఁ గలంప, సుడిపిన మొగమెత్తి చూడకుండు పరాకు కుసుమబాణుని నైనఁ గువిటుఁ జేయ, శ్రీకార్య పరులఁ గాంచిన లేచి మ్రొక్కు నం జలికి నింద్రుండు నక్కొలువుఁ గోర హరిగృహావసరశంఖాకర్ణకుఁ ద్రిప్పుఁ గడగంటి జిగి ప్రజఁ గాఁడి పాఱఁ. ప్రథమాశ్వాసము - సీ 59. [ 5వ పద్యం ] గవఱ లుంకించి వ్రేయఁ గొ ప్పవియ నవలి కరమున సమర్పఁ బైఁటలో మరుని బటువు బిల్లక్రియఁ బట్టుఁగంచెలఁ బిగువుఁ జన్ను నిక్కఁ దిన్నెలఁ బాత్రముల్ నెత్తమాడు. ప్రథమాశ్వాసము - 59. [ 6వ పద్యం ] వెలయాండ్ర విలాసములు :: వేశ్యలు సౌందర్యవతులే కాదు తమ చూపుల తోటే ఎవరి కులమైనా చెప్పే లోకజ్ఞానం వారికి సొంతం. రాజుకు రెండో అంతఃపురంలా ఉండే నివాసములు,సౌభాగ్యం,అంతేగాదు వేశ్యలు పలు భాషలలో చాలా చక్కని కవిత్వం కూడా చెప్పగలిగే పాండిత్యం కలవారు. విష్ణుచిత్తుడు కథ :: ◆◆◆◆◆◆◆◆◆విలుబుత్తూరులో వెలసిన దైవం మన్ననారు, ఆయనే సాక్షాత్తూ విష్ణుమూర్తి.స్వామిభక్తులు ఎవ్వరైనా ఆ ఊరికి వస్తే చాలు వాళ్ళకి ఎంతో భక్తిశ్రద్దలతో మంచి ఆతిథ్యం ఇస్తారు ఆ వూరి వాళ్ళు. అలాంటివారిలోనే విష్ణుచిత్తుడనే ఒక మహాభక్తుడు ఆవూరి భాగవతుల్లో అత్యంత ఉత్తముడు.శ్రీహరిని ప్రతి నిత్యం పూజిస్తాడు. ప్రతి క్షణం తన ఇష్ట దైవమైన శ్రీహరిని తన హృదయంలో ధ్యానిస్తుంటాడతను. అతను గొప్ప అన్నదాత. విష్ణుచిత్తుడి ఇంటిలోన అర్థరాత్రైనా కూడా అతిథులకి భోజనాలు పెట్టేవాడని, ఎంతటి అర్థరాత్రివేళైనా సరే అతనింట్లో మహావిష్ణువు పుణ్యకథా కీర్తనం,ద్రవిడ వేదాల పారాయణం వీటితోపాటు కూరలెక్కువగా లేవు, అన్నము చల్లారిపోయినది, పప్పు లేదు, అన్నం కూడ ససిగా లేదు,దయచేసి భోజనం చేయవలెనని మాటలు వినిపిస్తుంటాయట, అనేది ఈ క్రింది పద్యం ద్వారా అర్దమైతుంది. అనిష్టానిధి గేహసీమ నడురే యాలించిన న్ర్మోయు నెం తే నాగేంద్రశ యానుపుణ్యకథలుం దివ్యప్రబంధాను సం ధానధ్వానము, “నాస్తిశాకబహుతా, నా స్య్తుష్ణతా, నాస్తపూ పో, నాస్య్తోదనసౌష్టవంచ,కృపయాభో క్తవ్య " మన్పల్కులున్. నాస్తి దగ్గర నుండి సంస్కృతం. పరథమాశ్వాసము - 84. [ 7వ పద్యం ] ద్వితీయాశ్వాసములో కవి రాయల వారు విలుబుత్తూరును వదిలివేసి పాండ్యరాజ్యం రాజధాని మధురని తీసుకున్నాడు.అప్పటి పాండ్యరాజ్య రాజు చంద్రవంశభూషణుడైన మత్స్యధ్వజుడు.ప్రతి వేసవికాలంలో మధుర దగ్గరలోనున్న వృషగిరి అనే ఊరులో ప్రజలు తెప్ప తిరునాళ్ళు ఉత్సవం ఘనంగా చేస్తారు. అచటొక పురాతన వైష్ణవాలయం యున్నది. [ కొన్ని ముద్రిత పుస్తకాలలో వీటిని అళఘరి సుందరబాహుస్వామి తెప్ప తిరునాళ్ళు అని కూడా చెప్పారు.] ఒక పరదేశి బ్రాహ్మణుడు తెప్ప తిరునాళ్ళను చూచుటకు పోయి, పక్కనే యున్న రాజధాని మధురను కూడా చూసి,ఆచటి వైగై నదిలో స్నామాచరించి ఒక పురోహితుడి ఇంటిలో విడిదిచేసి అతని ఆతిథ్యంలో భోజనం చేసి, తన వూరికి ప్రయాణమయ్యేడు. రాత్రిపూట దారిలో మధురలో ఒక అరుగు మీద మిగిలిన బాటసారులతో కలిసి,విడి దుస్తుల మూటను తలగడగా తలక్రింద పెట్టుకొని పడుకుని,నిద్ర రాక, నిదుర పోవుటకు కాలక్షేపం కోసం కొన్ని సుభాషిత పద్యాలు పాడటం మొదలెట్టేడు. సరిగ్గా అదే సమయంలో మత్స్యధ్వజ రాజు తన భోగిని దగ్గరికి బయల్దేరేడు.[రాజుకి ఒక యుంపుడుకత్తె యుండెను] సరిగ్గా రాజు ఆ బ్రాహ్మణుడు నిద్రించు చోటుకి చేరినప్పుడు, ఆ బ్రాహ్మణుడు ఒక పద్యం చదువుచుండెను, ఆ రాజు విన్న పద్యంలోని తాత్పర్యమిది,అది “వానకాలములో భోజనమునకు వానలు లేనప్పుడు సంపాదించు కొనవలయును, రాత్రి భోజనమునకు పగలు సంపాదించు కొనవలయును,ముసలితనములో ఎలాగూ సంపాదించ లేము గనుక యవ్వనంలోనే సంపాదించి నిల్వ చేసుకొనవలెను,చచ్చి పోయిన తరువాత పరలోకమున్నది , అది యెట్టిదో తెలియదు,మరి దాని కోసం బ్రతికి యున్నప్పుడే కొంత పుణ్యమును కూడా ప్రోగు చేసుకొనవలెను." రాజుకి బ్రాహ్మణుడు పద్యంలోని తాత్పర్యం గునపంతో గుండె లోతులలో గ్రుచ్చినట్లుగా తగిలేసరికి రాజు తన స్థితిని తల్చుకునే సరికి దుఃఖం వచ్చింది.వెంటనే రాజు దుఃఖం నుంచి తేరుకొని గొప్పచక్రవర్తుల్నీ ,మహామహాలును కూడా ఒకఏట్లో నావలా కదిలీ కదల్నట్టు కదిలి కాలం ఎలా మోసం చేసిందో ఆలోచించుకొని, క్షణికమైన రాజభోగం, ఉంపుడు కత్తెలతోటి సంబంధాల గురించి కాక, శాశ్వతమైన సత్యం మరియు మోక్షముల యొక్క పూర్తి మూలాల గురించి తెలుసుకోవాలని నిర్ణయుంచుకొని, వెంటనే రాజు ఒక కానుకను తీసి తలారి చేత బ్రాహ్మణుడికి యిప్పించి వెనక్కి తిరిగి తన అంతఃపురం వెళ్ళేడు.రాజు ఉదయముననే కొలువు తీరి విద్వాంసులందరిని పిలిపించి, వారితో శాస్త్రాలన్నీ చూసి మోక్షం వచ్చే ఏకైక మార్గం ఏమిటో కనుక్కుని చెప్పమన్నాడు. వాదంలో గెలిచి తనకు తత్వంను చెప్పగలిగే వారికి బహుమతిగా ఇచ్చుటకు రాజుగారు బీరపువ్వుల్లాటి బంగారునాణేల్ని జాళెములో పోయించి వేలాడదీయించాడు సభలో! విష్ణుచిత్తుడు మధుర ప్రయాణం :: మధురయు మరియు మథుర రెండు వేర్వేరు. దక్షిణ భారతదేశములో పాండ్యరాజుల రాజ్య రాజధాని మధుర చతుర్ధ ధకారము.ఇకపోతే ఉత్తర భారతదేశములో శ్రీకృష్ణుని జన్మస్థలం మథుర ద్వితీయ ధకారము. ప్రదేశం ప్రస్తావన క్రింది పద్యంలో చూడండి. కపివర నియుక్త గిరిసదృ గ్గహననిలయ గాత్రగాహిత కనకముక్తాకవాట గోపురా వేదితోచ్చతాక్షోభ్యవవ్ర దనరు దక్షిణ మధుర సాంద్ర ద్రుమ ధుర. ద్వితీయాశ్వాసము-3. [ 8 వ పద్యం ] ఇక విలిబుత్తూర్లో విష్ణుచిత్తుడు ఎప్పటివలెనే తులసి మాలను మన్ననారు స్వామి వారికి సమర్పించబోయేంతలో ఆ స్వామియే అచట ప్రత్యక్షమయేడు!స్వామి చిరునవ్వుతో రాజైన మత్స్యధ్వజుడి పరిస్థితి వివరించేడు. నువ్వు వెంటనే మధురకి వెళ్ళు, అచట పాండ్యరాజ్య కొలువు నందు నీవు వాదనలు చేసి,విజయం సాధించి , రాజు వారిచ్చే బంగారు నాణెముల బహుమతిని పొందమని చెప్పి, అంతయేగాక అక్కడ రాజునకు వైరాగ్యం కలిగినది,రాజును వైష్ణవ భక్తునిగా మార్చమని చెప్పగా అంతట విష్ణుచిత్తుడు గడ గడ వణికి , నాకు చదువు రాదు, సంధ్య రాదు, శాస్త్రగ్రంథాల వంకనైనా చూడని వాడని, నేను దేవాలయపు తోటలో త్రోవ్వుగోలతో మట్టి త్రవ్వి చేతులు కాయలు కాయుంచు కొన్నవాడను,ఆ రాజ కొలువులో నేను వాదించెడిదేమిటి?నేను గెలిచెడిదేమిటి, నీకు అప్రతిష్ట స్వామి, అనినట్లుగా ఈ క్రింది పద్యములో చెప్పబడెను. "స్వామి, నన్ను , నితఃపురాపఠితశాస్త్ర గ్రంథజాత్యంధు, నా రామక్ష్మా ఖననక్రియాఖర ఖనిత్రగ్రాహితోద్కత్కిణ స్తోమాస్నిగ్ధకరు , న్భవద్భవనదాసు,న్వాదిఁ గాఁ బంపుచో భూమీభృత్సభ నోట యైన నయశంబు ల్మీకు రాకుండునే ? " ద్వితీయాశ్వాసము - 90. [ 9 వ పద్యం ] స్వామీ ఇది యిల్లూడ్చుటయా, నీళ్లను తోడి తెచ్చుటయా,నీ పల్లకిని మోయుటయా,నాకు నీ వాదమెందుకు,ఐన యింకెవరూ దొరకలేదా నీకునని ప్రాధేయపడ్డాడు.అయితేనేం చివరికి మధుర వెళ్ళుటకు ఎలాగోలా ఒప్పుకున్నాడు విష్ణుచిత్తుడు. మధుర వెళ్లి,కొలువు లోపలికి వెళ్ళేడు.అతని దివ్యతేజం చూసి రాజుగారితో సహా సభంతా జంకుతో లేచి నిలబడింది. రాజు చూపించిన బంగారు ఆసనం మీద కూర్చున్నాడు.అప్పటి వరుకు వాదం సాగిస్తోన్న సభంతా నిశ్శబ్దంగా వుండిపోయింది.విష్ణుచిత్తుడు ఆనాటి రాజు కొలువులో,నాటి కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడిలా క్రీడించినట్లు క్రీడించినాడు, ఒక విద్వాంసుడిని పిలిచి అతని వాదం అంతా ముందు తన మాటల్లో వివరించి ,దానిలో ఒక్కొక్క విశేషమును తీసుకుని సూక్ష్మంగా భేదించి ,తన సిద్ధాంతంను స్థాపించి అతనిని ఒప్పించి ఓడించినాడు. ఇలా విష్ణుచిత్తుడు అందరిని వరసగా వాదంలో ఓడించి ,వారికి బ్రహ్మసూత్రాలు,ఉపనిషత్తులని వినిపించి,ఇక వాటి ద్వారా పరమాత్మ తత్వాన్ని నిరూపించి, ఆలా నారాయణుడే పరమాత్మ తత్వమని వారికి బోధించాడు.సకల భూతాల్లోనూ ఉండే ఆత్మ మహావిష్ణువే అని వివరించాడు. ఇంక విష్ణువుని ఎందుకు ఆరాధించాలో తెలియ చేయుటకు ఖాండిక్య కేశిధ్వజుల కథని,దాని యజ్ఞఫలము గురించి పూర్తి విశ్లేషణను చేసి, పాండ్యరాజు మత్స్యధ్వజుడికి మహావిష్ణువు మహత్యం వివరించాడు విష్ణుచిత్తుడు. ఆలా చివరికి రాజుకు మూలమంత్రాన్ని ఉపదేశించి అతన్ని వైష్ణవ భక్తునిగా మార్చివేసినాడు. (పార్ట్ 3  రేపు) -----  మల్లారెడ్డి దేశిరెడ్డి ...
 • ఎపుడో 500 ఏళ్ళ క్రితం  శ్రీకృష్ణ దేవరాయలు  రచించిన  కావ్యం పై మిత్రులు మల్లారెడ్డి  సమున్నత సమీక్ష ఇది .  ఆముక్తమాల్యద  లో అసలు ఏముంది ? ఆసాంతం వడపోసి ఈ తరం పాఠకుల కోసం  ప్రత్యేకంగా  అందించిన సమీక్షా  వ్యాసం ఇది.  ఆముక్తమాల్యద అంటే ఏమిటి? ఆముక్త = అలంకరించుకోబడిన,ధరించిన..... మాల్య = పూలదండ,పూలమాల...... ద = ఇచ్చునది. ఒక భక్తురాలు పూలదండను గ్రుచ్చి, మొదట తాను అలంకరించుకొని,నీటిలో తన యొక్క ప్రతిబింబం చూసుకొని ,తరువాత ఆ దండని భగవంతుని మెడలో వేసెడిదట.ఆమెనే మరి రాయల వారి కావ్యంలో కధానాయిక. ముక్త అనగా వదిలిపెట్టబడిన,ఇక ఆ పదం చేర్చుట వలన అలంకరించుకోబడిన అని అర్ధం వచ్చిచేరినది.ఆ అన్నదానిని ఉపసర్గ అందురు.ఇక సంస్కృతంలో ధాతురూపములకి ఉపసర్గలు చేర్చినచో కొన్నిచోట్ల అర్థములు భేదించును. ఆముక్తమాల్యద కావ్యం శృంగారప్రబంధమా అవునా? కాదా! అనే ప్రశ్నకి ఒక్కో కవికి ఒక్కో రకమైన భావన ఉండవచ్చు, ఒక్కో వ్యక్తికి ఒక్కో అభిప్రాయం ఉండవచ్చు,రాయలవారి ఆముక్తమాల్యద కావ్యంలో మాత్రం వీరభక్తి, వైరాగ్యాలదే ప్రాముఖ్యత అని కనుక మీరు అనుకుంటే అది పెద్ద పొరపాటు,వాస్తవంగా మీరు కనుక ఒక్కసారి చదివినట్లయితే మీరు ఈకావ్యంలోకొన్ని ఆశ్చర్యకరమైనటువంటి వర్ణనలు చూస్తారు,వాటిలోన నగర సౌందర్య వర్ణన, ఆయా ఋతువుల పై వర్ణన, రాజ్య స్త్రీల సౌందర్య వర్ణన,వేశ్యల సౌందర్య వర్ణన, రాజుల యొక్క అంతఃపురాల వర్ణన, వేశ్యల అంతఃపురాల వర్ణన,రాజనీతి బోధన, కుల, మత, వేదాంత పరమైన ఇలా ఎన్నోవర్ణనలు. రాయల వారు సంభాషణలను రాయటంలో తను ఆనాటి సమకాలీన వ్యావహారికభాషని ఉపయోగించినట్లు అనిపిస్తుంది. శ్రీ కృష్ణదేవరాయలు క్రీ.శ 1474 ప్రాంతంలో జన్మించినట్లుగా చారిత్రిక ఆధారం .రాయలు క్రీ. శ 1509 ప్రాంతంలో రాజుగా రాజ్యపాలన చేపట్టినట్లు ,తర్వాత రాయల వారు అనేక రాజ్యములను జయించినట్లు చరిత్రకారులు మనకిచ్చిన ఆధారాలు. క్రీ.శ 1515 -1516 ప్రాంతంలో రాయలవారు నేటి విజయవాడకి వెళ్ళినట్లు ,ఆచటికి దగ్గరలోని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని సేవించినట్లు,ఆ రాత్రి వేకువ జామున ఆంధ్ర జలజాక్షుడు రాయల వారికి కలలో ప్రత్యక్షమైనట్లు రాయలు ఈ పద్యంలో తెలుపుకున్నాడు ఇలా, దమ్మికే లుండఁ బెఱకేల దండ యిచ్చు లేము లుడిపెడు లేఁజూపులేమతోడఁ దొలఁకుదయఁ దెల్పు చిఱనవ్వుతోఁ గలఁ ద దంధ్ర జలజాక్షుఁ డి ట్లని యాన తిచ్చె. ప్రథమాశ్వాసము - 12 . [ 1వ పద్యం ] అప్పుడు శ్రీకాకుళాంధ్ర విష్ణువు రాయలను ఇలా అడిగినట్లు క్రింది పద్యంలో చెప్పాడు. మఱియు రసమంజరీ ముఖ్య మధురకావ్య రచన మెప్పించికొంటి గీర్వాణ భాష, నంధ్రభాష యసాధ్యంబె, యందు నొక్క కృతి వినిర్మింపు మిఁక మాకుఁ బ్రియము గాఁగ ప్రథమాశ్వాసము - 13 [ 2వ పద్యం ] అంటూ మాకు ప్రీతిగా ఓ కృతిని నిర్మించు.నా అవతారాల్లో మా వివాహపు కథని చెప్తే అది నాకు పూర్తిగా సంతృప్తినిస్తుందని అని చెప్పి, అలాగే ఆ కృతిని ఆంధ్రభాషలోనే వ్రాసి నీకు ఇష్టదైవమైన శ్రీవెంకటేశ్వరుడికి అంకితం చేస్తే మాకేం భేదం లేదని ఆనతిచ్చాడని,రాయలు ఆంధ్ర మహావిష్ణుడు కోరినట్లుగా తన యొక్క ఆముక్తమాల్యద రచనకు శ్రీకారం చుట్టి,క్రీ. శ 1521 నాటికి కావ్యం పూర్తి చేసినట్లు ఆనాటి చరిత్రకారుల యొక్క అభిప్రాయం. నాటి ఆముక్తమాల్యదలోని శ్వాసములు :: ◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆ ప్రథమాశ్వాసము :: ◆◆◆◆◆◆◆◆◆◆ ఇష్టదేవతాస్తవము,స్తోత్రములు, రాయల స్వప్నం,ఆంధ్ర విష్ణువు ఆనతి, శ్రీవిలుబుత్తూరు పుర వర్ణనము, ద్రవిడాంగనల పోఁడుములు, విష్ణుచిత్తుని భక్తి తత్పరత మొదలగునవి. ద్వితీయాశ్వాసము :: ◆◆◆◆◆◆◆◆◆◆ మధురాపురీ వర్ణనము, వేలాయాండ్ర విలాసములు, పాండ్యరాజు మత్స్యధ్వజుని వైభవం, పాండ్యరాజు భోగిని వద్ద కేగుచు సుభాషితం వినుట,పాండ్యరాజు వైరాగ్యం, విష్ణుచిత్తుని మధుర యాత్ర మొదలగునవి.  ( రేపు పార్ట్ 2 )  --------  మల్లారెడ్డి దేశిరెడ్డి ...
 • చిత్రాంగి గురించి ఈ తరంలో చాలామందికి తెలియక పోవచ్చు.  ఇది ఒక కల్పనా పాత్ర. అయితేనేం? ఇందులో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. రాజమహేంద్రవరము ను పాలించే రాజరాజ నరేంద్రుడు వృద్ధాప్యం లో చిత్రాంగి అనే యువతి ని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే రాజు వృద్ధుడు కావడం తో ఈమె శారీరిక కోరికలు తీరడం లేదు. విరహం తో వేగిపోతుండేది. రాజుగారి చిన్న భార్య కావడం తో స్వేచ్ఛగా బయటకి వెళ్లి తిరగడానికి వీలు లేదు. ఈమెను ఒక పెద్ద భవంతిలో ఉంచి అప్పుడుడప్పుడు రాజు వచ్చి వెళ్తుండేవాడు. రాజుగారికి పెద్ద భార్య వలన సారంగధరుడు అనే కొడుకు ఉన్నాడు, అతడు అందగాడు. మంచి యవ్వనం లో ఉన్నాడు. ఒకరోజు అతను పావురాలతో ఆడుకుంటుండగా ఒక పావురం ఎగిరిపోయింది. అతడు దానిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆ పావురం చిత్రాంగి భవనం లో వాలింది. సారంగుడు భవనం లొపలకి వెళ్ళాడు. చిత్రాంగి ఇతడిని చూసింది. అంతవరకు ఆమె సారంగుడిని చూడలేదు. అందగాడు అయిన కుర్రాడిని ఆమెకు మోహం కలిగింది. అతడిని కూర్చోబెట్టి ఆతిధ్యం ఇచ్చి చివరకు తన కోరిక తీర్చమని కోరింది. సారంగుడు నివ్వెరపోయి... తాను కొడుకు లాంటివాడిని అని, కొడుకు మీద కామావేశం మహాపాతకం అని చెప్పి వెళ్ళిపోబోతుండగా ఈమె బలవంతం చేసింది. సారంగుడు కోపం తో వెళ్లిపోతుండగా ఈమె అతని ఉత్తరీయాన్ని పట్టుకుని లాగింది. దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు సారంగుడు. చిత్రాంగి తోక తొక్కిన తాచులా పరాభవాన్ని, మనసులో లావాలా పొంగుతున్న కామకోరికను తట్టుకోలేక దహించుకుని పోయింది. రాత్రికి నరేంద్రుడు రాగానే రాజకుమారుడు తన మందిరానికి వచ్చి తనను బలాత్కారం చెయ్యబోయాడని ఫిర్యాదు చేసింది. విచక్షణ మరచిన నరేంద్రుడు భటులను పిలిచి, కొడుకు అని కూడా చూడకుండా ఉరి తీయమని ఆదేశించాడు. రాజాజ్ఞ ను పాలించి భటులు వెంటనే సారంగుని ఉరి తీశారు. **** పై కథ నుంచి ఏమి నేర్చుకోవాలి? స్త్రీలు రెండు వైపులా పదునున్న కత్తి లాంటివారు. ప్రణయాన్ని కురిపిస్తారు. వికటిస్తే ప్రళయాన్ని సృష్టిస్తారు. పురుషులను ప్రేమసాగరం లో ముంచుతారు. దేవదాసులను చేస్తారు. ఏ ఇంట్లో అయినా, స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు పరాయి పురుషులు ఆ ఇంట్లో ప్రవేశించరాదు. అలాగే పురుషుడు ఒంటరిగా ఉన్నప్పుడు వేరే ఇంటి స్త్రీ ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు. తల్లీ కొడుకులు కూడా ఒకే గదిలో ఉండరాదు అంటాడు ధర్మరాజు మహాభారతం లో. అలాగే పురుషులు స్త్రీలతో అతి చనువు పెంచుకోరాదు. స్త్రీ చనువుగా మాట్లాడవచ్చు. కానీ ఆ చనువును మరో రకంగా అర్ధం చేసుకోకూడదు. అలాగే స్టీలు కూడా. పరాయి పురుషులతో ఎక్కువసేపు ముచ్చట్లు పెట్టడం ఆరోగ్యకరం కాదు. భర్త తో కాపురం చేస్తూ పరాయి మగాళ్లను ఆకర్షించాలని ప్రయత్నించేవారు, రహస్య సంబంధాలు నెరపే వారు చిత్రాంగి కోవలోకి వస్తారు. అలాగే వయసుడిగిన వారు తమ కూతురు వయసున్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే వారు ఆ భార్యా వ్యామోహం లో పడి కన్న బిడ్డలను పొట్టన పెట్టుకోడానికి కూడా వెనుకాడరు. పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుని వారి బాగోతం కొడుకు చూసాడు అని కొడుకుని హత్య చేసిన స్త్రీలను కూడా మనం చూస్తున్నాం. ప్రేమ గొప్పది కామం మహా నీచమైనది. పరాయి పురుషులతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తలను ప్రియులతో కలిసి చంపేసే మహాతల్లులను ప్రతిరోజూ వార్తల్లో చూస్తూనే ఉంటాము. కాబట్టి బహుపరాక్. అపరిచిత స్త్రీ పురుషులు తో ఫోన్ సంభాషణ, చాటింగ్ మంచిది కాదు. వ్యవహరం అడ్డం తిరిగినపుడు ఆ చాటింగ్స్ ఉరి తాళ్ళు అవుతాయి. ఇదే చిత్రాంగి కథ నుంచి మనం తెలుసుకోవలసినది. --------   ఇలపావులూరి మురళీ మోహన రావు...
 • జాతీయ గీతాన్ని అవమానిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారనే ఆరోపణపై  కేరళ రచయితపై రాజద్రోహం కేసు నమోదైంది. జాతీయగీతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు  చేశారని చెబుతున్న  ఆ మళయాళీ రచయిత  పేరు కమల్ సి చవరా.  ఆయన  థియేటర్ ఆర్టిస్ట్  కూడా .    కమల్ సీ చవరాను అరెస్టు చేసి పోలీసులు విచారిస్తున్నారు.  గతంలో ఈయన ఫేస్ బుక్ లో పెట్టిన  పోస్టులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కమల్  2015 లో పబ్లిష్ అయిన తన నవల "శ్మశానగలుడే నోటు పుస్తకం " నుంచి కొన్ని వాక్యాలను పోస్ట్ చేసాడని సమాచారం.  కేరళ రాష్ట్ర బీజేపీ యువ మోర్చాకు చెందిన యూత్ వింగ్  కమల్ పై కొల్లం  పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది . దీంతో పోలీసులు స్పందించారు.  కోజికోడ్ లో నివసిస్తున్న కమల్ ను అరెస్టు చేసి కొల్లంకు తీసుకువచ్చి విచారిస్తున్నారు. కాగా కమల్ ఫ్రెండ్స్ బెయిల్ కోసం కోర్టుకు వెళుతున్నారు.  ఆమధ్య తిరువనంతపురం లో  జరిగిన అంతర్జాతీయ కేరళ ఫిల్మ్ ఫెస్టివల్(ఐఎఫ్ఎఫ్ కే)లో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో లేచి నిలబడనందుకు 11మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  సినిమా హీరో పవన్ కళ్యాణ్ పై  ఇదే విషయంలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ...
 • శిశుపాల్ ఫేస్ బుక్ లోకి లాగిన్ అయ్యాడు. సెర్చ్ లో  ఆమె పేరు కొట్టి ప్రొఫైల్ పేజి చూసాడు. ఆ పేజి" ఇందువదన" అనే మహిళది.  ఫోటోలో ఆ మనిషి చక్కగా,హుందాగా  ఉంది.  నవ్వుతున్న ఆమె కళ్ళలో ఏదో ఆకర్షణ ఉంది. ఫోటోని బట్టి ఆమె వయసు నలభై పైనే ఉండొచ్చు. శిశు పాల్ ఇన్బాక్స్ లోకి వెళ్లి ఆమెకి ఓ మెసేజ్ పెట్టేడు.  "ఐ లవ్ యు" అంటూ...... ఒక బూతు పదం కూడా పెట్టేడు. ఇప్పటికి 99 సార్లు అలాంటి మెసేజులు పెట్టేడు. వాటిలోను బూతులు వాడాడు.  చాట్ చేయమని,కలుసుకుందామని రకరకాల మెసేజ్స్ పెట్టేడు.  ఒక్క మెసేజ్ కి కూడా  అటు నుంచి స్పందన లేదు. అలవాటు ప్రకారం రెండు నిమిషాలు వెయిట్ చేసాడు.  "ప్చ్" అనుకుంటూ శిశుపాల్ పేజీ క్లోజ్ చేయబోతుండగా ఇందువదన నుంచి "హాయ్" అంటూ స్పందన వచ్చింది. "హలో అంటీ" పలకరింపుగా  మెస్సేజ్ కొట్టేడు. "ఎరా బాడ్కోవ్.... ఏంటీ బూతులు" ఇందువదన సీరియస్ గా స్పందించింది. శిశుపాల్ బిత్తర పోయాడు. "తెలుగు కూడా రాయడం రాని చెత్త నాయాలా... నీ మొహానికి నేను కావాలా? నీ వయసు ఎంత? నా వయసు ఎంత? " అటునుంచి ఇందు వాయించేసింది. "కూల్ కూల్" అన్నాడు ఏమి జవాబు ఇవ్వాలో అర్ధం కాక శిశుపాల్.  "కూల్ ఎంటిరా కుత్తే నా కొడ ...." "ఎంటే మెత్తగా ఉంటే ఏదోదో వాగుతున్నావ్"అన్నాడు.  "ఏంట్రా ... ఫేక్ ఐడీ పెట్టుకున్న పోరంబోకు ఎదవ... నువ్వు ఎవరో ... నీ కథ ఏంటో మొత్తం తెలుసు. మర్యాదగా చెబుతున్న ఈ వెధవ పనులు మానుకో.. ఇదే ఆఖరి వార్నింగ్" ఘాటుగానే చెప్పింది ఆమె. "గాడిద గుడ్డు కాదు .. మానుకోక పోతే ఏం పీకుతావ్." అంటూ మరో బూతు మాట వాడుతూ  అతగాడు రెచ్చిపోయాడు. ఇందువదనకు  అతను వాడిన బూతు మాట చూడ గానే ఎక్కడో చురుక్కుమంది.    "అసలు నేనెవరో తెలిస్తే ప్యాంటు తడుస్తుందిరా ఎదవా ..  నీకు"అంది.   "అబ్బో అంత సీన్ ఉందా తమకు."    "అరేయి నేను చని పోయి రెండేళ్ళు అయ్యింది." "అంటే దెయ్యానివా నువ్వు .. నీలాంటి దెయ్యాలను నన్ను ఏం చేయలేవు . హహహహ్హ్ "అంటూ మెసేజ్ పెట్టాడు.   "మర్యాదగా చెబుతున్నా విను." "ఎంటే మర్యాద ...నేను వినను కాక వినను "ఆమెను రెచ్చగొడుతూ మరో  బూతు వాక్యం టైపు చేసేడు. అంతే!  మరుక్షణంలో కంప్యూటర్ మానిటర్ లో నుంచి ఒక అందమైన పొడవాటి చేయి బయటకు చొచ్చుకొచ్చింది. ఊహించని ఈ పరిణామానికి అతను భయంతో బిక్క చచ్చి పోయాడు. ఒళ్లంతా చెమటలు పట్టేయి.  ఇది కలా ?మాయా ? అనుకునే లోగానే  ఆ చేయి అతని చొక్కా కాలర్ పట్టుకుని గిరగిర తిప్పింది.  "ప్లీజ్ నన్నేమి చేయకు" అంటూ శిశుపాల్  అరిచేడు.  సరిగ్గా నిమిషం తర్వాత ఆ చేయి  అతగాడిని  విసురుగా గోడ కేసి కొట్టింది. గోడకు తగిలి అక్కడ నుంచి దభేల్ మంటూ కింద పడ్డాడు. కంప్యూటర్ పేలి పోయింది. ---------  KNMURTHY   IMAGE COURTESY ... CARTTON CLIPS.COM...
 • వాళ్ళు ఇద్దరు మొగుడు పెళ్ళాలు కాదు.. సహ జీవనం చేస్తున్నారు.  ఆ ఇద్దరికీ కొన్ని రోజులుగా మాటలు లేవు.  ఆమెను ఏరికోరి అతగాడు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాడు.  మొదట్లో బాగానే ఉన్నారు.  కొన్ని రోజులనుంచి ఆమెను అతగాడు అనుమానిస్తున్నాడు.  ఆమెకు అతనిపై అనుమానం కలుగుతోంది.  కొన్ని రోజులనుంచి ఆమె పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తోంది.  ఇద్దరి మధ్య  గొడవలైనాయి.  ఆమె ఎందుకో మాట్లాడటం మానేషింది.   మూడు రోజుల ఆమె మౌనంతో అతగాడికి పిచ్చెక్కి పోయింది. "ఇదే ఆఖరి సారి అడుగుతున్నా ... మాట్లాడవా?" అన్నాడు.. ఆమె యేమీ మాట్లాడలేదు. కళ్ళు తెరచి అతని మొహం కూడా చూడలేదు.  అతనికి తిక్కరేగింది. జేబులో నుంచి పిస్టోల్ తీసి కాల్చుకున్నాడు. ఆ శబ్దానికి ఆమె కళ్ళు తెరిచింది.  అతడు కింద పడి ఉన్నాడు. మౌనంగా అతడికేసి చూసింది. సరిగ్గా అయిదు నిమిషాల తర్వాత "సక్సెస్" అంటూ పెద్దగా కేక వేసింది ఆమె. ( ఒక ముగింపు) ........ ......... .......... ........... .............. .............. మరుక్షణమే పక్కనే ఉన్న సెల్ తీసి యెవరికో ఫోన్ చేసింది. "|మనం అనుకున్నట్టే అయింది... రివాల్వర్ తో కాల్చుకున్నాడు.  వెంటనే వచ్చేయి" అంది. ఆమె అలా ఫోన్ పెట్టేయగానే అతగాడు "యురేకా" అంటూ పెద్దగా కేకేసి లేచి కూర్చున్నాడు. ద్యేవుడా... అంటూ కూలబడిందామె.(రెండో ముగింపు) "కాదు.... దెయ్యాన్ని!" అన్నాడతడు తాపీగా..(మూడో ముగింపు by పద్మాకర్ దగ్గుమాటి)   -------  KNMURTHY...
 • అర్ధరాత్రి వేళ. వీధి కుక్కలు అదే పనిగా మొరుగు తున్నాయి.  ఆ ఇంట్లో తూర్పుదిశ గోడపై ఉన్న బల్లి చిత్రంగా అరుస్తోంది. ఎక్కడినుంచో కిర్రు కిర్రు మంటూ శబ్దం…  మాంచి నిద్రలో ఉన్న సుజాతకి మెలుకువొచ్చింది. విసుక్కుంటూ లేచింది. తలుపు కదులుతున్న శబ్దమో,కిటికీ రెక్క గాలికి కొట్టుకుంటున్న శబ్దమో అర్ధం కాలేదు.  మంచం దిగి బెడ్ రూం లో నుంచి హాల్లో కొచ్చింది. అక్కడ ఏ అలికిడి లేదు. కానీ ఆ శబ్దం మాత్రం ఇంట్లో నుంచే వస్తోంది. చెవులు రిక్కించి విన్నది. ఆ శబ్దం స్టోర్ రూం లోనుంచి వస్తోన్నట్టు గ్రహించింది. మెల్లగా వెళ్లి కిటికీ రెక్కను తీసి లోపలికి చూసింది. లోపలి దృశ్యం కంటపడ గానే ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. వెన్నులో జర జరా వణుకు మొదలైంది.  ఎవరో “పడక కుర్చీ” లో పడుకుని నింపాదిగా ఊగుతున్నారు.ఆ కుర్చీ కదలికవల్లే కిర్రు కిర్రు మన్న శబ్దం వస్తోంది.  బెడ్ లాంప్ వెలుతురులో మనిషి రూపం పూర్తిగా కనిపించలేదు. కానీ ఎవరో కుర్చీలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అంతే… ఒక్క ఉదుటున బెడ్ రూం లోకి దూరి తలుపులు బిగించింది. అప్పటికే భయంతో ఆమె వళ్ళంతా చెమటలు పట్టేయి. తను చూసింది మనిషినా ? దెయ్యాన్నా ? తలుపులు అన్ని వేసి ఉన్నాయి.. మరో మనిషి వచ్చే అవకాశమే లేదు.  దొంగలు వచ్చినా తీరిగ్గా “పడక కుర్చీ”లో కుర్చుని వూగుతారా?  చిన్నప్పటి నుంచి తను దెయ్యాలు,ఆత్మలు గురించి చాలా కథలువింది. నో డౌట్….. అది మామ గారి ఆత్మే.  ఈ రోజు నాటికి ఆయన చనిపోయి ఖచ్చితంగా ఆరునెలలు. ఉదయం నుంచి ఎందుకో ఆయనే గుర్తుకొస్తున్నాడు.  ఇప్పుడు ఇలా … ఆ “పడక కుర్చీ” అంటే మామయ్య గారికి చాలా ఇష్టమట. ఆయన బతికి ఉన్న రోజుల్లో తనొక్కరే దాన్ని వాడేవారట. సుజాత ఆలోచనలు పరి పరి విధాలుగా సాగేయి.  భర్త శేఖర్ సెల్ కి వెంటనే ఫోన్ చేసింది … అవుట్ అఫ్ కవరేజ్ ఏరియా అని కంప్యూటర్ వాయిస్ వినిపించింది .  ఇక నిద్ర పట్టలేదు … పక్కనే ఉన్న బాబుని దగ్గరకు తీసుకుని అలాగే కూర్చుంది.  ………………………………………………………………………………………………… “నీదంతా భ్రమ … దెయ్యాలు భూతాలు కథల్లోనే ఉంటాయి సుజీ.” అన్నాడు శేఖర్.  భార్య చెప్పిన విషయం అంతా విని తేలిగ్గా తీసి పడేస్తూ. సుజాతకు ఆ జవాబు నచ్చలేదు. ఆపై ఇక వాదించ లేదు.  శేఖర్ గురించి ఆమెకు బాగా తెల్సు. అతన్ని కన్విన్స్ చేయడం కష్టం. స్వయంగా ఫీల్ అయితే తప్ప దేన్నీ అంగీకరించడు . “ఒకే … బై …. ఈవెనింగ్ రెడీ గా ఉండు… మూవీకి వెళ్దాం “అంటూ ఆఫీస్ కి వెళ్లి పోయాడు.  శేఖర్ ఆఫీసుకి వచ్చాడే గానీ ఎంత వద్దనుకున్నా అతని ఆలోచనలు భార్య చెప్పిన విషయం చుట్టూనే తిరుగుతున్నాయి. అంతలోనే సెల్ ఫోన్ మోగింది. స్నేహితుడు రాజు నుంచి కాల్ అది.  “ఏంట్రా ” అన్నాడు ఆన్ చేసి .. కాసేపు పిచ్చాపాటీ కబుర్లు మాట్లాడాడు.  సుజాత చెప్పిన సంఘటన గుర్తుకొచ్చి రాజు కి చెప్పాడు నవ్వుతూ. “ఇదేదో దుశ్శకునం రా “అన్నాడు రాజు.  “నీ మొహం అదేమి లేదు”    “ఒకే మళ్ళీ చేస్తా “అన్నాడు రాజు.  ఫోన్ పక్కన పెట్టాడో లేదో సుజాత నుంచి కాల్.  “చెప్పు సుజీ. ” అన్నాడు,  “ఏవండీ. ఆ “పడక కుర్చీ”ని మీరు హాల్లో పెట్టి వెళ్ళారా ?” ఆమె గొంతులో ఏదో ఆందోళన.. భయం.  ” ఏమైందీ ?”అడిగేడు. ” అది హాల్లోకి ఎలా వచ్చిందో అర్ధం కాలేదు, స్టోర్ రూం లో ఉంది కదా.”అందామె.  “నేనే పెట్టానులే … దానికంత కంగారు ఎందుకు.. కూల్ బేబీ కూల్. ” అన్నాడు.   వెంటనే ఫోన్ కట్ చేసిందామె. నిజానికి ఆ “పడక కుర్చీ” హాల్లోకి ఎలా వచ్చిందో శేఖర్ కి తేలీదు.  సుజాత భయ పడుతుందని అబద్ధం చెప్పాడు. శేఖర్ ఆలోచనలో పడ్డాడు. ఏదో అనీజీగా ఫీల్ అయ్యాడు. లంచ్ బ్రేక్ లో క్యాంటీన్ కెళ్ళి అంతగా ఆకలి లేకపోవడంతో టిఫిన్ చేసాడు.  బయట కొచ్చి సిగరెట్ తాగుతుండగా మళ్ళీ ఫోన్ మోగింది. మళ్ళీ సుజాతే.  “నేను అమ్మ వాళ్ళింటికి వెళ్తున్నా… మీరు అక్కడికే రండి. “అని చెప్పి ఫోన్ పెట్టేసింది.  “బాగా భయపడినట్టుంది … సరే రెండు రోజులు ఉండి వస్తుందిలే” అనుకుని ఆఫీసు లోకొచ్చి పనిలో నిమగ్నమైనాడు.  ………………………………………….. ………………………………………….. ……………  సుజాత రమ్మని చెప్పినప్పటికీ శేఖర్ అదే వూళ్ళో ఉన్న అత్త గారింటికి వెళ్ళలేదు.  నేరుగా తన ఇంటికే వచ్చేసాడు. శేఖర్ ఇటీవలే అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి స్థిర పడ్డాడు.  ఆరేళ్ళ క్రితం అమెరికా వెళ్లి అక్కడ రెండు చేతులా సంపాదించాడు. ఇండియాకి రాగానే వేరే ఉద్యోగంలో చేరాడు.  విశ్వం మాస్టారుకి శేఖర్ ఒక్కడే కొడుకు. అమెరికాలో ఉన్నపుడే తండ్రి కొన్న స్థలంలోనే పెద్ద ఇల్లు కట్టించాడు.  తల్లి రెండేళ్ళ క్రితం చనిపోగా తండ్రి ఆరునెలల క్రితం గుండె జబ్బుతో మరణించారు.  ఇంటికి రాగానే ఫ్రెష్ అయ్యి ఏదైనా ప్రోగ్రాం చూద్దామని టీవీ ఆన్ చేసాడు. సరిగ్గా అపుడే “పడక కుర్చీ” విషయం గుర్తు కొచ్చి హాలంతా పరికించి చూసాడు. ఎక్కడా కనిపించలేదు.  సుజాతే లోపల పెట్టిందేమో అనుకుని ఫ్రిజ్ లో నుంచి బాటిల్ తీసేడు. ఫ్రిజ్ డోర్ కదలికల శబ్దానికి గోడ మీద ఉన్న బల్లి చక చక పాక్కుంటూ పక్కకు వెళ్ళింది. శేఖర్ మందు గ్లాస్ లో వంపుకుని వచ్చి సోఫాలో కూర్చున్నాడు.  మెల్లగా సిప్ చేస్తూ టీవీ చూస్తుండగా కరెంట్ పోయింది. “కొవ్వొత్తి ఎక్కడుందో”అనుకుంటూ లేవబోతుండగా కరెంట్ వచ్చింది. ‘అమ్మయ్య’ అనుకుంటూ కూర్చున్నాడు.  సరిగ్గా అపుడు కనిపించింది అతనికి ఎదురుగా ఇరవై అడుగుల దూరంలో “పడక కుర్చీ”  ఒక్క క్షణం గుండె జల్లు మంది శేఖర్ కి. ఇంతకుముందు చూస్తే లేదు. ఇపుడు ఎలా వచ్చింది.  ఇది భ్రమా?నిజమా? కళ్ళు నలుపుకుని మరీ చూసాడు.  ఎదురుగా “పడక కుర్చీ” మెల్లగా వెనక్కి ముందుకి కదులుతోంది. అయితే సుజాత చెప్పింది నిజమే అన్నమాట. ఏంటీ మిస్టరీ ?? గాలికి ఏమైనా వూగుతుందా ? కిటికీల వైపు చూసాడు.. హాల్లోని కిటికీలన్నీ మూసేసి ఉన్నాయి.  ఫ్యాన్ గాలికి అయి ఉండొచ్చు. లేచి సోఫా కి దగ్గరలో ఉన్న ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి “కుర్చీ” కేసి చూసాడు .  ఇంకొంచెం వేగంగా కదులుతోంది. ఆ కదలికల వల్ల కిర్ కిర్ మన్న శబ్దం కూడా వస్తోంది.  శేఖర్ కి భయంతో చెమటలు పట్టేయి. మళ్ళీ ఫ్యాన్ స్విచ్ వేసాడు. అపుడే కరెంట్ పోయింది.  స్ప్లిట్ సెకండ్ లో మళ్ళీ వచ్చింది. వెనక్కి తిరిగి చూస్తే” కుర్చీ” లేదు…. నాలుగు మూలలు చూసేడు.  ఎక్కడ కనిపించలేదు. ఎదురుగా గోడ మీద బల్లి అతన్నే గమనిస్తోంది. ఊహించని ఆ పరిణామాలకు శేఖర్ ఖంగు తిన్నాడు.' సంథింగ్ రాంగ్. ఏదో జరుగుతోంది. ఏమిటది?' శేఖర్ గుండె వేగంగా కొట్టుకోసాగింది.  తలకెక్కిన మత్తంతా దిగి పోయింది. ఫ్యాన్ తిరుగుతున్నప్పటికి ఒంట్లోంచి చెమటలు కారిపోతున్నాయి. టవల్ తో ఒళ్ళు తుడుచుకున్నాడు.ఒక్క క్షణం భారంగా శ్వాస పీల్చి రాజుకి ఫోన్ చేసాడు. రాజు ఫోన్ అదేపనిగా ఎంగేజ్. 'షిట్' అంటూ ఫోన్ పడేసి సిగరెట్ వెలిగించాడు. బుర్రంతా గజిబిజీ గా తయారైంది.  పెగ్గు మీద పెగ్గు లాగించాడు. అప్పటికే టైం ఒంటి గంట దాటింది. చిరాకు తగ్గక పోవడంతో ఫ్రెష్ అవుదామని బాత్ రూంలో కొచ్చి షవర్ బాత్ చేసాడు. తల స్నానం చేసేక హాయిగా ఉన్నట్టు అనిపించింది.  టవల్ తో మొహం తుడుచుకుంటూ అద్దంలోకి చూసేడు శేఖర్. అంతే …..కరెంట్ షాక్ కొట్టినట్టు అదిరి పడ్డాడు.  అద్దంలో తన మొహం బదులు తండ్రి మొహం ! చటుక్కున వెనక్కి తిరిగి చూసేడు ఎవరూలేరు.  మళ్ళీ అద్దం లోకి చూసేడు. తన మొహం బదులు తండ్రి మొహమే కనబడుతోంది.  అంతే… కెవ్వున కేక వేసి పడిపోయాడు. ………………………………………….. ………………………………………….. … టీ పాయ్ పై ఉన్న సెల్ ఫోన్ మోగుతోంది. శేఖర్ కి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే సోఫా లో పడి ఉన్నాడు.  బాత్రూం లో పడిపోయినట్టు గుర్తు… మరి ఇక్కడకు ఎలా ?’అనుకుంటూ లేచి ఫోన్ అందుకున్నాడు.  చైతన్య అక్కయ్య నుంచి కాల్ అది. “అక్కయ్య బాగున్నావా ?” అంటూ పలకరించేడు.  “నిద్రపోతున్నావా ?”“లేదే … ఇది సైలెంట్ లో ఉంది .. చూసుకోలేదు.”  “అవునా ? సుజీ ఫోన్ చేసింది. తనకు బాబాయి కనిపిస్తున్నాడట. నీకు చెప్పిందా ? “అడిగింది చైతన్య.  “అదా ..అదో పెద్ద కథలే.” అన్నాడు ఏమి చెప్పాలో తోచక. “నాకు తెల్సులేరా … సుజాత మొత్తం చెప్పిందిలే. ” అందామె. ఆమాటతో గతుక్కుమన్నాడు శేఖర్. చైతన్య శేఖర్ పెద నాన్న కూతురు. లండన్ లో ఉద్యోగం చేస్తోంది.  ఆమె సహాయంతోనే శేఖర్ అమెరికా వెళ్ళాడు. ఆమె అంటే భయం భక్తీ కూడా ఉన్నాయి.  ” చూడు శేఖర్. జరిగింది ఏదో జరిగి పోయింది. ఇపుడైనా తప్పు తెల్సుకొని బాబాయికి శ్రాద్ధకర్మలు చేయి.  బాబాయి చనిపోయినపుడు అమెరికా నుంచి నువ్వే వచ్చిఅంత్య క్రియలు చేసి ఉంటే అయన ప్రేతాత్మ మన చుట్టూ తిరిగే పరిస్తితి వచ్చేదా? చెప్పు.”అంటూ ప్రశ్నించింది ఆమె. తప్పు చేసిన వాడిలాశేఖర్ మౌనం గా ఉన్నాడు. .  “నువ్ ఎవరి చేతనో శ్రాద్ధ కర్మలు చేయించావ్. వాళ్ళు సరిగ్గా చేయలేదు. నువ్వు చేసిన తప్పువల్ల బాబాయి అనాధ ప్రేతంగా మిగిలిపోయాడు.కాదంటావా? “మరో ప్రశ్న. “బాబాయి రెండు సార్లు నాకు కలలోకొచ్చి దణ్ణం పెట్టి దీనంగా అర్ధించాడు తనకు విముక్తి కల్పించమంటూ.” ఆమె ఏడుస్తూ మాట్లాడుతోందని అర్ధమైంది.  శేఖర్ ఆలోచనలో పడ్డాడు. “కన్నతండ్రికి కొరివి పెట్టకుండా కోట్లు సంపాదించి ఏం ప్రయోజనం రా ?” శేఖర్ నిరుత్తరుడై కూర్చున్నాడు చైతన్య ప్రశ్నలు ఈటేల్లా గుచ్చుకుంటుంటే.  “జీవుడు భౌతికదేహం వదిలాక ప్రేతరూపంలో ఉంటాడట. కొడుకు కర్మ సక్రమంగా నెరవేర్చి ప్రేతత్వం నుండి విముక్తి కలిగించకపోతే ఇక ఎప్పటికి ప్రేతాత్మ గానే ఉండి పోతారట.  సైంటిఫిక్ గా నువ్ నమ్మనప్పటికీ పెంచి, విద్యాబుద్దులు చెప్పించి, జీవితానికి ఒక స్దిరత్వం కల్పించిన తండ్రి ఋణం శ్రాద్ధకర్మల రూపేణా తీర్చుకోవడం నీ బాధ్యత. దాన్ని నేరవేరుస్తావో లేదో ఇక నీ ఇష్టం .” అంటూ ఫోన్ పెట్టిసిందామె.  చైతన్య మాటలు అతని గుండెను బాగా మెలి పెట్టేయి. తండ్రి తన కోసం ఎంత కష్ట పడ్డాడో? శేఖర్ కి గతమంతా కళ్ళ ముందు మెదిలింది. అలాంటి మహానుభావునికి అంత్య క్రియలు చేయకుండా తానెంత దుర్మార్గంగా ప్రవర్తించాడో ? తన కంటే పెద్ద వెధవ ఎవడూ ఉండడేమో అనుకున్నాడు.  ఎందుకో గుండె లోతుల్లోనుంచి దుఃఖం తన్నుకొచ్చింది. ఒక్కసారిగా బరస్ట్ అయ్యాడు. పొగిలి పొగిలి ఏడ్చాడు. అతడిని ఓదార్చేందుకు అక్కడ ఎవరూ లేరు.  ఎదురుగా గోడ మీద ఉన్న బల్లి మాత్రం అతణ్ణి చిత్రం గా చూస్తోంది.  కాసేపటి తర్వాత శేఖర్ తేరుకున్నాడు. “నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటా నాన్నా. నన్ను క్షమించు “అనుకున్నాడు మనసులో.  గోడ మీద బల్లి జరజరా కదులుతూ అక్కడనుంచి వెళ్ళిపోయింది.   ఇమేజ్  బై Ramsheshu...
 • మంటల్లో నా దేహం కాలిపోతూ ఉంది.  దూరంగా తడి బట్టలతో నా భర్త  ఏడుస్తున్నాడు.  అతని సన్నిహితులు అతడిని ఓదారుస్తున్నారు. పొగలి పొగలి అతను ఏడవటం నాకెందుకో బాధగా లేదు. ఏడేళ్ళ కాపురం. అగ్నిగుండం చుట్టూ చితికిల వేలు పట్టుకుని  ఏడడుగులు అతనితో నడిచాను. అమ్మమ్మ చెప్పిన ఆచారాలన్నీ మనసా వాచా పాటించాను. అతన్ని స్నేహించాను,సేవించాను, ప్రేమించాను, కామించాను. బార్యగా నేను చేయవలసిన విధులన్నీ ఇష్టపడి చేశాను.  మరి భరద్వాజ?? ఎంత సహజంగా ఏడుస్తున్నాడు? ఏమి ఎరగనట్టు? తన చేతులతో తానే మత్తు ఇచ్చి అవును మత్తు ఒక ఎనెస్థీషియా వైద్యుడు చంపదలుచుకుంటే, ఏ ప్రపంచానికి తెలుస్తుంది. అతను హైపర్తైటీస్ వాక్సిన్ అన్నాడు. నేను నమ్మాను. అసలు నమ్మటమనే పదమే తప్పు. భరద్వాజ నా ప్రాణం. తానొకటి నేనొకటి కాదు? మరి ఎందుకు ? ఎందుకు చేసావి పని? నన్నెందుకు చంపావు.  *** చితి మండిన పది పదిహేను రోజుల తర్వాత అనుకుంటా.. అతను హాస్పిటల్ లో ఉన్నప్పుడూ.. అతనితో పాటు నేను ఉన్నాను. ఈ విషయం చెప్పటం అనవసరం. నేను అతనితో లేనిదెప్పుడు ?? నేను అతనితోనే ఉన్నాను.  ఊహించని విషయం ...  సంజనా అతని గది లోకి వచ్చింది. సంజనా నా పి‌జి స్నేహితురాలు. ప్రాణ స్నేహితురాలు. మా ఇద్దరి పేర్లు కూడా ఒకటే.  ఎందుకు? ఎందుకు ? వచ్చి ఉంటుంది. భరద్వాజ  గురించి ఊహ మాత్రం గా కూడా తప్పుగా ఊహించలేను. అతను నా వాడు. ఎప్పటికీ అతను నావాడే. మరో విదంగా ఆలోచన చేసినా కూడా నన్ను నేను తప్పు గా అనుకున్నట్లే.. “సంజానా గారా నమస్తే కూర్చోండి” భరద్వాజ  చిరు మందహాసం తో చెప్పాడు. హమ్మయ్య .. ఆమె తటపటాయిస్తూ ఉంది...  “డాక్టర్ జీ మీరేమీ అనుకోకండి. ఇది సమయం కూడా కాదు. కానీ అవసరం అలాటిది.” “చెప్పండి . పర్లేదు “ “కొన్ని కారణాల వల్ల నాకు ఒక చేదు పరిచయం ఉండేది. “ ఆమె తల వంచుకుని నెమ్మదిగా మాట్లాడుతుంది.  “అయిదేళ్ళ తర్వాత నేను జీవితం లో స్థిరపడ్డాక  అతను మళ్ళీ తారస పడ్డాడు. ముగిసి పోయిన చరిత్ర తవ్వి తీశాడు .. నేను నచ్చ చెప్పాను. వినలేదు..”  “అతను ఉత్తరాలు వ్రాస్తుండే వాడు. వి.. వి .. రం .. గా.. తన ఉత్తరాలు అన్నిటిని తను అడిగినప్పుడు తిరిగి ఇచ్చేయాలని, ఒక్కటి మిస్ అయినా నా గతం గురించి ఇంట్లో చెప్పాల్సి వస్తుందని భయపెట్టాడు”  “నరకయాతన అనుభవించాను. మా వారితో చెప్పాను. కొంత ఘర్షణ జరిగినా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. సాక్షాలుగా ఆ ఉత్తరాలు కావాల్సి వచ్చాయి...” భరద్వాజ వినకూడని విషయం వింటున్నట్టుగా ముందుకి వంగాడు.  “వాటిని నా ప్రాణ స్నేహితురాలు మీ భార్య ‘అంజు’ వద్ద దాచాను. వైలెట్ కలర్ మఖమల్ క్లాత్ లో చుట్టి న చిన్న మూట.. తన వార్డ్ రోబ్ లో ఉంటుంది.. మీరు శ్రమ అనుకోకుండా వెతికి ...” భరద్వాజ రక్తం మొత్తం డ్రైన్ అయిన వాడిలా కుర్చీ లో నుండి లేచి ఆమె మీదకి లంఘించాడు.  “రాకాసి దానా ఎంత పని చేసావే?.. అన్యాయంగా నా భార్యని చేజెతులారా ..” లేచి ఆమె గొంతు పట్టుకున్నాడు.         ------   సుశ్రీ ...
 • మా మేనత్త గారింటికి బయలు దేరాను. అప్పటికే బాగా చీకటి పడింది. బస్సు దిగి వేగంగా నడవడం మొదలు పెట్టాను. రోడ్డు దగ్గర నుంచి 5 మైళ్ళ దూరంలో ఉంటుంది ఆ వూరు. కొంచెం స్పీడ్ పెంచాను...తొందరగా ఇంటికి చేరదామని. ఆ దారిలో దెయ్యాలు ఉంటాయి అని ఎప్పుడో మా అత్త చెప్పినట్టు గుర్తు. ఎవరో ఒకరు తోడుంటే మంచిది కదా అనుకున్నాను మనసులో  చీకటంటే నాక్కూడా భయమే. ఇంకొంచెం వేగం పెంచాను. ఇంతలో ఎవరో వెనుక నుంచి పిలిచినట్టు అనిపించింది. వెనక్కి చూస్తే ఎవరు కనపడలేదు. ఈ లోగా సన్నటి చినుకులు మొదలైనాయి. మళ్ళీ ఎవరో పిలిచారు "ఎవరది" అంటూ ..అది మగ గొంతే. వెనక్కి తిరిగాను ...మనిషి కనపడలేదు...కానీ ఆ పిలుపు మరో మారు వినబడింది. ఒక్క క్షణం ఆగాను.. సిగరెట్ వెలిగించాను.పిలిచిన ఆ మనిషి కనపడలేదు. కొంపదీసి దెయ్యం కాదు కదా...కొంచెం భయం వేసింది. పిలుపు దగ్గర నుంచే వినబడుతుంది కానీ మనిషి కనబడక పోవడం ఏమిటి? సిగరెట్ పడేసి మళ్ళీ వేగం పెంచాను.అమావాస్య రోజులు కావడం తో చీకటి చిక్కగా ఉంది. దానికి తోడు గాలి హోరు. వాన తుంపర ఆగింది కానీ గాలి ఆగడం లేదు. ఇంతలో వెనుక నుంచి సైకిల్ బెల్ వినబడి ఆగాను. క్షణంలో నా పక్కనే సైకిల్ వచ్చి ఆగింది. "ఎక్కడికి బాబు" అడిగాడు సైకిల్ పై మనిషి. చీకట్లో ఆ మనిషి మొహం సరిగ్గా కనబడలేదు. కనుగుడ్లు మాత్రం మెరుస్తున్నాయి. వీడు మనిషా ? దెయ్యమా ? ఏమో ? ఎక్కడికి వెళ్ళాలో చెప్పాను. "ఎవరింటికి ?"  మరో ప్రశ్న  కరణం గారింటికి చెప్పాను. "ఇంత చీకట్లో ఎలా వెళ్తారు" బాబు అతని గొంతు కీచుగా ఉంది. "ఏం చేద్దాం మరి" అన్నాను కళ్ళు చికిలించి అతని వైపు చూస్తూ. "కొంచెం దూరం మీరు సైకిల్ తోక్కుతానంటే....నేను వెనుక కూర్చుంటా.. ఇద్దరం దీనిపై వెళ్దాం." అన్నాడు. "సరే" అని సైకిల్ తీసుకున్నా... చీకటికి అలవాటు పడటం తో ఆ మనిషి లీలగా కనిపిస్తున్నాడు. సన్నగా ఉన్నాడు...ఇబ్బంది ఉండదులే అనుకున్నాను. గాలి కొంచెం ఆగింది ...సైకిల్ తొక్కడం మొదలు పెట్టా. "నాకు దారి తెలీదు ఎలా?"అడిగాను.  "నేరుగా వెళ్ళడమే" చెప్పాడు  "సరే ఏదో ఒకటి మాట్లాడు ..లేకపోతే పాటలో పద్యాలో పాడు"అన్నాను. ఆ మనిషి పాడటం మొదలెట్టాడు. "ఆరేసుకోబోయి పారేసుకున్నాను" అని మొదలెట్టి సడన్ గా " నిను వీడని నీడను నేనే" అంటూ పాడుతున్నాడు. "మధ్యలో ఆ దెయ్యం పాట ఎందుకు" అన్నాను.  "నేను దెయ్యాన్నే కదా" అన్నాడు  ఆ మాటతో నా గుండె ఆగినంత పనైంది. సైకిల్ ఒక్కసారి ఆగిపోయింది. "ఏంటి నువ్వన్నది" అన్నాను గుండె చిక్క బట్టుకుని.  "సరదాగాలే పోనీ అబ్బాయి" అన్నాడు అదోలా నవ్వుతూ. వాడి మాటకు తిక్క రేగింది ...నాలుగు పీకుదామని అనుకున్నా.కోపాన్ని కంట్రోల్ చేసుకున్నా.  సైకిల్ మళ్ళీ తొక్కడం మొదలెట్టా . అప్పటివరకు తేలిగ్గా ఉన్న సైకిల్ బరువు ఎక్కినట్టుంది. వెనుక వెయ్యి కిలోల మూట పెట్టిన ఫీలింగ్. ఎంత బలంగా ఫెడల్స్ ను తొక్కినా... చక్రాలు అంత స్పీడ్ గా సాగడం లేదు. మనిషి చూస్తే సన్నగా ఉన్నాడు...ఇంత బరువు ఉన్నాడు ఏమిట్రా బాబు? "వీడు దెయ్యం కాదు కదా" మరోమారు సందేహం కలిగింది. ఎందుకైనా మంచిదని ఒకసారి వెనక్కి తిరిగి చూసా. గుండె ఆగినంత పనైంది. సైకిల్ కూడా అప్రయత్నంగా ఆగింది. ఆ సన్నపాటి మనిషి బదులు మరో లావు పాటి మనిషి వెనక కూర్చుని ఉన్నాడు. ఒళ్లంతా సున్నం పూసినట్టుంది. చీకట్లో కూడా మెరుస్తున్నాడు. నేను వెనక్కి తిరగ్గానే వికృతంగా నవ్వాడు. ఒళ్ళు జలదరించింది. నోట్లో నుంచి మాట రాలేదు. భయంతో కళ్ళు మూత పడ్డాయి.  "ఏంటి అబ్బయ్య" అంటూ కీచు గొంతుతో మరోమారు నవ్వాడు. ఎరక్క పోయి ఇరుక్కుపోయా..అనుకుని  ధైర్యం తెచ్చుకుని మెల్లగా కళ్ళు తెరిచాను. ఆశ్చర్యం ...లావుపాటి మనిషి మాయమై...ఆ బక్క మనిషే కనిపించాడు. ఇదేదో మాయలా ఉంది. "ఒక్కనిమిషం ఆగుదాం" అన్నాను  ఇద్దరం సైకిల్ దిగాం.  జేబులోనుంచి సిగరెట్ తీసి వెలిగించాను. ఆ వెలుతురు లో వాడి మొహం చూసాను. కళ్ళు చిదంబరం గుర్తు కొచ్చాడు. అంత భయపడాల్సిన సీన్ లేదు. "మరి నాకేది సిగరెట్" కీచుగొంతేసుకొని అడిగాడు బక్కోడు. సిగరెట్ ఇస్తూ" ఇంకెంత దూరం వెళ్ళాలి" అడిగాను. "అదిగో ఆ దెయ్యాల దిబ్బ దాటితే వచ్చేది ఊరే " "దెయ్యాల దిబ్బా ?"వీడు నన్ను భయపెట్టే యత్నం చేస్తున్నాడు. "అవును ..అక్కడ దెయ్యాలు ఉంటాయట"  "ఓహో అలాగా..మనకేం భయం లేదులే ..కాసేపు నువ్వు తొక్కుసైకిల్ "అన్నాను వీర ఫోజు కొడుతూ. నేను వెనుక కూర్చున్నా...బక్కోడు తొక్కడం మొదలెట్టాడు. ఇపుడు వేగంగా పరుగెడుతోంది సైకిల్. దూరంగా లైట్లు కనబడుతున్నాయి.  అమ్మయ్య ...దగ్గర కొచ్చేసాం అనుకున్నా ...సైకిల్ వేగం క్రమంగా పెరిగింది. గాలి రయ్యిమంటూ వీస్తోంది.... సైకిల్ మరింత వేగంగా దూసుకుపోతోంది. బక్కోడికి ఇంత బలమెక్కడిది??సందేహం లేదు ...వీడు ఖచ్చితంగా ... ఇంతలో సైకిల్ అనూహ్యంగా గాల్లోకి లేచింది.. గాల్లోనే వంద మైళ్ళ స్పీడ్ తో పరుగెడుతోంది ....ఒక్కసారిగా గుండె ఆగింది. "బక్కోడా" అంటూ అరిచాను...భయమేసి ... వాడు జవాబుగా కీచుగొంతుతో భయంకరంగా నవ్వాడు. నక్క ఊళ పెట్టినట్టుంది వాడి నవ్వు. ఆ నవ్వు వంద మైకుల్లో నుంచి ఒకే సారి వినిపించినట్టు అనిపించింది. భరించలేక చెవులు మూసుకున్నాను. అదే సమయంలో దూరాన ఎక్కడో ఫటేలు మంటూ పిడుగు పడ్డట్టు శబ్దం వినిపించింది. అంతే... సైకిల్ గిర్రున తిరుగుతూ ధభేలుమని కింద పడింది. ఆ తర్వాత ఏమి జరిగిందో నాకు తెలీదు. తెల్లారే సరికి వూరికి దగ్గరలో దిబ్బమీద తేలాను. అక్కడ బక్కోడు గానీ సైకిల్ కానీ కనిపించలేదు. రాత్రి జరిగింది నిజమో?మాయో?అర్ధం కాలేదు.  టైం చూస్తే ఉదయం ఏడు దాటింది.చిన్నగా నడుచుకుంటూ ఇంటికి చేరాను. బావ గాడితో ఈ విషయం ప్రస్తావించాను. "ఇంకెపుడు రాత్రిళ్ళు ఒంటరిగా ఆ దారిలో రావద్దు" అన్నాడు.      --------- KNMURTHY...
 • "మా నాన్న పెద్ద వెధవ ,.బ్రోకర్ "  ఇలా అంటున్నా అని ఆశ్చ్యర్య పోకండి .నన్ను చిన్నప్పుడే రెండు వందల రూపాయలకు అమ్మేశాడు. .మంచోళ్ళకు అమ్మితే తిట్టే దాన్ని కాదు ఒక తాగు బోతుకి , అమ్మాయిలతో వ్యాపారం చేసే వాడికి అమ్మేశాడు. ఆ వెధవ నన్ను 12 ఏళ్ళ వయసు లోనే వ్యభిచారం లోకి దించాడు.  నాపేరు అమల .మా అమ్మ పేరు మాణిక్యం నాన్న పేరు రత్నం . నాన్న ఏ పని చేసే వాడు కాదు. ఎప్పుడు తాగడమే ఆయన పని. ఉన్న ఆస్తి అంత తాగుడుకే తగలేసాడు. దీంతో అమ్మ కూలి పనులకు వెళ్ళేది. అక్కడే మరోకతని తో ఆమె కి పరిచయం ఏర్పడింది. మా ఇంటికి నాలుగిళ్ళ అవతల అతగాడి ఇల్లు. నాన్న తాగి పడుంటే తాను రాత్రిళ్ళు అతగాడింటికి వెళ్ళేది.  ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి నాన్న కు తెల్సి పోయింది. ఆరోజు నాన్న తాగొచ్చి అమ్మ పై యుద్ధాని కి దిగాడు. వాడి తో అక్రమ సంబందం పెట్టు కుంటావా అని జుట్టు పట్టు కొని కొట్టాడు .అమ్మ కూడా ఎదురు తిరిగింది. ఇద్దరు చెడ మడా తిట్టు కొని రోడ్డెక్కారు. ఆ మరుసటి రోజే అమ్మ మాయమై పోయింది. అమ్మ అతగాడితో లేచి పోయిందని పక్కింటి అవ్వ చెప్పింది. లేచి పోవడం అంటే ఏమిటో అప్పట్లో నాకు అర్ధం కాలేదు. నాన్న పై అలిగి వెళ్లిందని అనుకున్నా.నెల,రెండు నెలలు గడచి పోయినా అమ్మ రాలేదు. నాన్న ఏదైనా తెస్తే తినడం లేదంటే అవ్వ వాళ్ళింటి కెళ్ళివాళ్ళ పిల్లలతో ఆడుకుండే దాన్ని.అవ్వ తనతో పాటు గుడి దగ్గరకు తీసుకేల్లేది. భక్తులను చూపించి డబ్బులు అడగ మనేది. ఆ వచ్చిన డబ్బులతో నాకు తిండి పెట్టేది. ఒక రోజు నాన్న తో ఎవరో ఒకతను ఇంటి కొచ్చాడు. ఇద్దరు బాగా తాగి వున్నారు నన్ను చూసి "ఈపిల్ల ఎవరు రత్నం "అడిగాడు అతనునా బుగ్గలు నిమురుతూ .  "నా కూతురే "చెప్పాడు నాన్న."ఇక్కడ ఒక్కతే ఏం వుంటుంది ?? మా ఇంటికి పంపితే మీ చెల్లి కి తోడుగా వుంటుంది కదా "అన్నాడు అత గాడు "నువ్వు అడిగితే కాదంటానా?"అన్నాడు నాన్న. అప్పటికే పొద్దు పోయింది .హోటల్ నుంచి తెచ్చిన బిర్యాని నాకు పెట్టారు. తిన్నాను . మర్నాడు ఉదయమే నాన్న నన్ను అడిగాడు" మామతో వాళ్ళింటికి వెళతావా?" అని "నేను వెళ్లను"అన్నాను .ఇంతలో మామ వచ్చి నచ్చ చెప్పాడు."మా ఇంటికొస్తే బోలెడు బొమ్మలు ఇస్తా, కొత్త బట్టలు కొనిపిస్తా "అంటూ ఆశ పెట్టాడు నాక్కూడా మనసు లాగింది. ఇక్కడి పరిస్తితులు కళ్ళ ముందు మెదిలాయి. ఏమి మాట్లాడ లేకపోయాను. మామ జేబు లోంచి రెండు వంద నోట్లు నాన్న కిచ్చాడు. ఆ రోజే మామ తో వాళ్ళ వూరి కొచ్చేసాను.  మామ ది పెద్ద ఇల్లే..ఆ ఇంట్లో ముగ్గురు పెద్ద అమ్మాయిలు వున్నారు. రెండు రోజులు నాకు అంత కొత్తగ అనిపించింది. .రాత్రిళ్ళు ఎవరెవరో ఆ ఇంటి కోచ్చేవారు . అమ్మాయిలు ఎప్పుడు మేకప్ తో కన్పించేవారు. యెవరన్నా మగాళ్ళు వస్తే ఒక అమ్మాయి గదిలోకి వెళ్ళేది . రెండు రోజులు గడిచాయి. ముగ్గురు అమ్మాయిలు పరిచయ మైనారు. వారిలో ఒక అమ్మాయి పేరు రాజీ . ఇంకో అమ్మాయి పేరు రాణి . మరో అమ్మాయి పేరు రుక్సానా .ముగ్గురు కూడా 18 లోపు వయసు వారే . రాజీ అయితే మామ సొంత చెల్లెలే అట. రాణి, రుక్సానా లను వేరే వూరి నుంచి ఇక్కడ పెట్టాడు మామ.  ఒక రోజు మామ బయటకు వెళ్ళాడు. ఆ సమయం లో ఆ ముగ్గురు నాతో మాట్లాడారు  " నువ్వెక్కడ నుంచి వచ్చావే?" రాజీ అడిగింది .చెప్పాను."ఇంత చిన్న వయసులో నువ్వేం బిజినెస్ చేస్తావే??"రుక్సానా అంది,. నాకేమి అర్ధం కాలేదు వెర్రి మొహం వేసుకొని వాళ్ళ కేసి చూసాను.  "ఇక్కడనుంచి తప్పించుకొని పో,, లేక పోతే మాగతే నీకు పడుతుంది " అంది రాణి .వాళ్ళ మాటలకు నాకు భయమేసింది." మీ మాటలతో దీన్ని భయపెట్ట కండె "రాజీ నన్ను దగ్గరకు తీసుకుంటూ అంది."అవునే ,"నువ్వు పెద్దమనిషి వయ్యవా?" నవ్వుతు అడిగింది రుక్సానా " అంటే ???" అన్నాను . "నువ్వండవే , దాన్ని చూస్తుంటే తెలియటం లేదా ?" అంటూ రాజీ " చూడు అమల .ఈ ఇంట్లో ఉన్నంతవరకు చాలా జాగ్రత్త గా వుండాలి , మా అన్న తాగిన సమయం లో వాడికి కన్పించకు , రాత్రిళ్ళు మరీ జాగ్రత్త .రాత్రి అయితే వాడు మనిషి కాదు మదమెక్కిన మృగం."అని హెచ్చరించింది .ఆ రాత్రికి రాజీ దగ్గరే పడుకున్నా. 10 తర్వాత ఎవరో వచ్చారంటూ పక్క గదిలో కెళ్ళింది.ఎంత సేపటికి రాలేదు  తలుపు సందులో నుంచి చూసా.మామ బయట కుర్చీ లో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్నారు.నేను వెనకొచ్చి మంచం పై పడుకున్నాను. రాజీ వస్తుంది కదా అని తలుపు లోపల వైపు గడియ పెట్టలేదు అదే నేను చేసిన తప్పు . సగం రాత్రి వేళ ఎందుకో అకస్మాత్ గా మెలుకువ వచ్చింది. కళ్ళు తెరచి చూస్తె మామ నా వంటిని తడుముతున్నాడు. బుగ్గలపై ముద్దు పెడుతున్నాడు.పెదాలను కోరుకుతున్నాడు. ఇంకా ఏదేదో చేస్తున్నాడు. నాకు భయ మేసింది ,అరవ బోయాను ,.ఆ ముద నష్టపోడు పీక పట్టు కున్నాడు ,ఉక్కిరి బిక్కిరి అయ్యాను " అరిస్తే చంపుతా. " అన్నాడు. వంటి పై బట్టలన్నీ పీకేసాడు.ఆపైన చేయకూడని పనులన్నీ చేసాడు. ఆ రాత్రి నేను దారుణంగా అత్యాచారానికి గురయ్యాను. అది మొదలు రోజు రాత్రి అయితే నరకమే. నెల రోజులకు అలవాటు పడి పోయాను. వాడికి కావాల్సింది నా శరీరమే కదా అనుకున్నా. దాన్ని అప్పగించి పడుకుదాన్ని.రాను రాను అక్కడి వాతావరణానికి అలవాటు పడిపోయా . ఆ ఇంట్లో అమ్మాయిలతో వ్యాపారం జరుగుతుందని క్రమంగా అర్ధమైంది. మంచి రేటు పలికేతే నాతో బిజి నెస్ చేయిం చాలని మామ ఆలోచిస్తున్నాడు.ఇక్కడకొచ్చి బొమ్మలతో ఆడు కుందామని ఆశ పడ్డాను కాని నేనే బొమ్మలా మారిపోయా. నాతో ఆ దుర్మార్గుడు ఆడుకుంటున్నాడు. బడి కెళ్ళి పాఠాలు నేర్చు కుందాం అనుకున్నా అయితే ఇక్కడ జీవిత పాఠాలు నేర్చు కుంటున్నా. అక్కడ నుంచి పారి పోవాలనుంది.కాని అవకాశం దొరకటం లేదు .      ......KNMURTHY...
 • మూర్తి గారింటికి వెళ్ళి రమ్మని అమ్మ చెబితే తీరిక చేసుకుని నేను మా చిన్నమ్మాయి బయలు దేరాం. మూర్తి గారి భార్యకి ఆరోగ్యం బాలెదట పలకరించి రమ్మని రెండు రోజుల నుండి అమ్మ చెబుతూనే ఉంది.ఎప్పుడో నాన్నగారి కి సన్నిహితుడట . అడ్రెస్ కూడా సరిగా తెలీదు. రామ్ నగర్ లో ఉంటున్నట్టు చూచాయగా చెప్పింది. ఆ పూట తీరిక చేసుకుని వెళ్తుంటే సెలవులకి ఇంటికి వచ్చిన చిన్నమ్మాయి ‘నాన్నా నేను వస్తాను’ అంది. “ఎందుకు నాన్నా నాకే సరిగా అడ్రెస్ తెలీదు. కనుక్కుని వెళ్ళాలి “ అన్నాను. “పర్లేదు వస్తాను.  వస్తూ  పాని పూరి తిందాము” అంది. *** రామ్ నగర్ లో మా సన్నిహిత మిత్రుడు ఒకడున్నాడు. తన దగ్గరకి వెళ్ళి అడిగాను. మూర్తి గారి చిరునామా గురించి. “ఇలాటివి మనకేలా తెలుస్తాయి. మా ఆవిడని అడుగుదాం.” అంటూ శ్రీమతి ని కేక వేశాడు. “బాగున్నారా అన్నయ్యా?” అందామే పలకరింపుగా. “అదేనమ్మా, మూర్తి అని మా నాన్న గారి ఫ్రెండ్. ఆయన ఇక్కడెక్కడో ఉంటారు. వాళ్ళావిడ ఆరోగ్యం అంత బాగా లేదట” ఆమె అయోమయంగా మొహం ఉంచింది. నేను ట్రంప్ కార్డులు బయటకి తీశాను. “వాళ్ళ పిల్లలిద్దరూ న్యూ జెర్సీ లో ఉంటారు. ఈ ఏరియాలో నే ఇల్లు కట్టుకున్నారు. అక్కడి నుండే కారు కొని పంపారట ..” నా మాటలు ఇంకా పూర్తి కాలేదు. “ఓ కామేశ్వరమ్మ గారా? మూడో లైన్ రెండో ఇల్లు చిల్కాకుపచ్చ బిల్డింగ్, స్టీల్ రైలింగ్ డిజైన్ గ్లాస్ వర్క్ “  వాళ్ళకి థాంక్స్ చెప్పి మూడో లైన్ కి వెళ్ళాం. ఊహించని విషయం అది. ఇల్లు ఎంతో  లక్సరీ  గా ఉంది. కరెన్సీ నోట్లు  అంగుళం అంగుళం అతికించినట్లు . బిడియంగా నే కాలింగ్ బెల్ నోక్కాను. ఎవరో మెయిడ్  ఒకరు వచ్చి తలుపు తీసి ఎవరు? అంది.  “శ్రీరామమూర్తి గారి ఇల్లు ఇదేనా? “  “అవును”  మా నాన్న గారి పేరు చెప్పి “ఆయన కుమారుడిని వచ్చానని చెప్పండి” అన్నాను. మూసిన తలుపులు రెండు నిమిషాలకి తెరుచుకున్నాయి. “లోపలికి రండి” అంది ఆవిడ పాల రంగు పాలరాయి మీద మా కాళ్ళ గుర్తులు పడకుండా లౌక్యంగా అడుగులు వేసుకుంటూ హల్లో కి నడిచి సోఫాలో కూర్చున్నామ్. మూర్తి గారు వచ్చారు. వయో భారం తో ఉన్నారు. చిన్నగా వచ్చి ఒక చక్క కుర్చీ లో కూర్చున్నారు. “సోఫాలో కూర్చుంటే మళ్ళీ ఒక్కడినే లేవటం కష్టం “ అన్నాడు జనాంతికంగా. “నమస్తే .. నేను ----    “ “ ఓహ్ తెలుసు. అప్పట్లో మీ నాన్న గారి స్టూడెంట్ ని. ఈ అమ్మాయి ఎవరు? నీ కూతురా? అమ్మ బాగుందా?” నాకు చాలా సంతోషం వేసింది. అతను చక్కగా రిసీవ్ చేసుకున్నందుకు.  “ బాగుందండీ. కామేశ్వరమ్మ గారి ఆరోగ్యం బాలేదని ఒక్క సారి వెళ్ళి కనబడి రమ్మని రెండు రోజుల నుండి చెబుతుందండి. రేపటి నుండి మళ్ళీ ఎవరి గోల వారిది సెలవులు కూడా అయిపోయాయి. ఆవిడ ఎలా ఉన్నారండి ?” ఆయన లేచి లోపలికి రమ్మన్నట్టు మావైపు చూసి తల ఊపి మరో గది లోకి  నడిచాడు. అక్కడ పడక కుర్చీ లో కూర్చుని ఉన్నారావిడ. ఒక నర్సు స్పూన్ తో ఏదో తినిపిస్తూ ఉంది. ఎంత శుబ్రంగా ఉన్నప్పటికి ఆసుపత్రీ వాసన వేస్తూ ఉంది. కొద్ది నిమిషాలు ఆమెతో మాట్లాడి మళ్ళీ హల్లో కి వచ్చాం. మా పిల్లలిద్దరూ న్యూ జెర్సీ లో ఉన్నారు. అక్కడే స్వంత ఇల్లు కొనుక్కున్నారు. పెద్దోడు ఫెరారి కొన్నాడు. చిన్నోడు కి అమరావతి వద్ద 80 సెంట్లు స్థలం ఉంది. మొన్నే అక్కడి నుండి కారు పంపాడు. ఇల్లు కోటి రూపాయలు దాటింది. ఇద్దరు పనిమనుసులు, విజిటింగ్ డాక్టర్లు, ఈ గోడ మీది పెయింటింగ్ చూశావా రెండున్నర లక్ష అంత చిన్నోడు కొని పంపించాడు.” ఒకదానికి ఒకటి ఏమాత్రం సంబందం లేని విషయాలు చాలా మాట్లాడాడు. లోపలి నుండి ఇందాక తలుపు తీసిన పని పిల్ల గ్లాసు ల్లో ఏదో జ్యూస్ లాటిది తెచ్చింది. “తీసుకోండి. మా వాడు రెండు నెలల క్రితం ఇండియా వచ్చినపుడు తీసుకువచ్చాడు. ఇంస్టెంట్ జ్యూస్. నేనెప్పుడు తాగలేదు. మా ఇద్దరికీ షుగర్ ఉంది.” నేను మా అమ్మాయి గ్లాసులు తీసుకుని తాగటం మొదలెట్టాం. బస్టాండ్ లో టి తాగే అలవాటు ఉన్నవాడిని ఏదయినా తాగగలను కాబట్టి నేను మామూలుగా తాగినా..కళ్ళతోనే డ్రింక్ బాలేదని వదిలేస్తానని అది చెప్పింది. వద్దు బాగోడు ఎలాగొలా తాగేయ్యమని నేను చెప్పాను. ముఖం అనేక రకాలుగా మారుస్తూ బలవంతాన త్రాగింది.  “ఆ గ్లాసులు అక్కడి నుండి మా వాడు పంపించాడు. ఒక్కోటి మన డబ్బులో 1800 ఆట. మామూలు వస్తువులు వాడితే వాడికి నచ్చదు” మళ్ళీ ఆయనే సంబంధం  లేని విషయాలు అందుకున్నాడు.  ఆయన కళ్లలోకి చూసి “మీరు ఎలా ఉన్నారు? అంతా సంతృప్తిగా నే ఉందిగా?” అన్నాను నేను. మూర్తి గారి కళ్ళలో ఒక ముసుగు ఉంది దాని వెనుక భావం మాత్రం నాకు అందలేదు. “ఓహ్ బ్రహ్మాండం “ నవ్వడాయన. మేం సెలవు తీసుకుని లేచి బయటకి నడవబోయేటప్పుడు లోపల నుండి ఒక పెంపుడు కుక్క పరిగెత్తుకు వచ్చి మా మీద దూక బోయింది.. “ అయ్ జానకి “ అంటూ పిలిచాడు మూర్తి గారు. ఠక్కున వెనక్కి తిరిగింది. టీపాయ్ మీద పెట్టిన గ్లాసు కింద దొర్లి పగిలింది. నేను పక్కకి సర్దుకునే లోపు ఒక గాజు పెంకు నా కాలికి గుచ్చుకుంది. మా చిన్నమ్మాయి వెంటనే నన్ను కూర్చోమని నైపుణ్యంగా గాజు పెంకు తీసి, నెత్తురు కారకుండా చేతిని బిగించి పట్టుకుని తన చేతి రుమాలుని కాలుకి కట్టింది. మేము బయలుదేరుతుంటే.. గేటు వద్దకి వచ్చి మూర్తి గారు వీడ్కోలు చెప్పాడు. ఆయన కళ్ళలో ఉన్న ముసుగు తొలిగి లోపలి భావం నాకు స్పష్టంగా అర్ధమవుతుండగా.. మా అమ్మాయి “పద నాన్నా చలపతి డాక్టర్ వద్దకి వెళ్ళి ఒక  టి టి చేయించుకుందాం’  అంది. _________________సుశ్రీ ...
 • కెనడా లోని మాట్రి నగరం లో ఒక మహాత్ముడు రామాయణ కధ పద్దెనిమిది రోజుల పాటు చెబుతున్నాడు.  .. గుజరాత్ నుండి వచ్చిన ‘మురారి బాపు హర్యాని’ అనే మహాత్ముడు ఆయన. దేశ విదేశాలలో రామాయణ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. వీరి ఉపన్యాసాలకి లక్షల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ప్రేక్షల సౌకర్యార్ధం పెద్ద పెద్ద ఇంటర్ సర్క్యూట్ టి వి లు ఏర్పాటు చేశారు. ఆయన ఉపన్యాసం ఏర్పాటుకి చాలా కాలం ఎదురుచూడాల్సి ఉంటుంది అంత పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది... ..  కెనడా లో ఉన్నఎక్కువ మంది భారతీయులు హాజరయ్యారు. వారిలో ఇద్దరు బార్యా బర్తలు ఉన్నారు. 23 ఏండ్ల క్రితం ‘ఇగో’ సమస్య తో విడిపోయి ఉన్నారు. ఎవరి పాటికి వారు ఉద్యోగాలు చేసుకుంటూ విడిగా బ్రతుకుతున్నారు. ఉన్న ఒక్కగాని ఒక్క పసివాడిని ఆమె అన్నీ సర్వస్వం చేసుకుని పెంచుతూ ఉంది. .. .. 23 ఏళ్లలో చాలా మార్పులు వచ్చాయి. ఇగో లు మాయమయ్యాయి. నిజంగా బార్య/బర్త ఒకరికి మరొకరి అవసరం తెలుసున్నారు. అప్పటికే మానసికంగా కుంగి పోయి ఉన్నారు. యాదృచ్చికంగా వారిద్దరు రామాయణ గాధ వినటానికి వేర్వేరుగా క్రమం తప్పకుండా వస్తూ ఉన్నారు... .. ఆఖరి రోజు శ్రీరామపట్టాభిషేకం. ఆరోజు దంపతులయిన వారు వచ్చి సీతారాములకి హారతి ఇచ్చి దేవుని ఆశీస్సులు పొందవలసినదిగా ‘మురారి బాపు’ గారు సభలో ప్రకటించారు. .. .. ఈ సదవకాశం కోల్పోవటం ..భర్తకు ఇష్టం లేదు. మహిళల విభాగం లో కూర్చుని ఉన్న మాజీ బార్యని గత కొద్ది రోజులుగా మానిటర్ లో గమనిస్తూనే ఉన్నాడు. అతను తన ప్రయత్నం చేద్దామని అనుకున్నాడు. మనస్సులో శ్రీరాముల వారిని ప్రార్ధించుకుని మహిళా విభాగం లోకి వచ్చాడు. ఆమెను పలకరించాడు. మర్నాడు ‘సీతారాములకి’ హారతి ఇవ్వటానికి తనవెంట ఉండాల్సిందిగా బేలగా అడిగాడు. ఆమె తన పర్సు నుండి విజిటింగ్ కార్డు తీసి ఇచ్చింది. “ఇంటికి రండి అక్కడ మాట్లాడదాం” అంది. *** మర్నాడు ఉదయం అతను ఆమె ఇంటికి వెళ్ళాడు. కుమారుడు అచ్చు తనలాగే ఉన్నాడు. చేతులు జోడించి తండ్రికి నమస్కరించాడు. తడి కళ్ళతో ఆమె అతడిని లోపలికి ఆహ్వానించింది. హల్లో గోడకి తన చిన్న నాటి నిలువెత్తు ఫోటో ఉంది. పిల్లాడు పుట్టినప్పుడు తను ఆమెకి బహుకరించిన చీర కట్టుకుని ఉంది. అత్తగారు పెళ్ళికి బహుకరించిన బంగారు గాజులు వేసుకుని ఉంది. నుదుటన సింధూరం ఉంది. అతను ఆమె కళ్ల లోకి చూడలేక పోయాడు. సోఫాలో కూర్చుని చేతుల్లో ముఖం కప్పుకున్నాడు. ఏడ్వాలని పించింది. ఆమె వచ్చి పక్కన నిలబడి భుజం మీద చేయి వేసింది. కొడుకు గదిలోకి వెళ్ళాడు. ఆమె చేతుల్లో ముఖం దాచుకున్నాడు. చాలా సేపు అలానే ఉండి పోయారు.. కొడుకుతో కలిసి టిఫిన్ చేశారు. *** ఆ సాయంత్రం సీతారాముల కళ్యాణఘట్టం పూర్తయింది. భార్యా భర్తలు  ఇద్దరు కలిసి హారతి ఇచ్చారు. దూరం నుండి కుమారుడు కెమెరాలో  ఆ దృశ్యాన్ని బంధించాడు. ...
 • జీవితంలో కలలు గనని మనిషి ఎవరూ ఉండరు. ప్రతి మనిషికీ కలలు వస్తాయి. ఆ కలల్లో కొన్ని మధురాతి మధురం కాగా మరికొన్ని పీడ కలలుగా ఉంటాయి. కలలు మన భవిష్యత్ సూచకమని ప్రాచీన కాలం నుండి నేటి వరకు ప్రపంచ ప్రజల నమ్మకం. నిద్రిస్తున్న మనిషి కనే కలలలో కొన్నిగుర్తుండవచ్చు..మరికొన్ని గుర్తుండక పోవచ్చు. అయితే అలా గుర్తున్న కలలలో మున్ముందు యథావిధిగా అలాగే జరగవచ్చు. జరిగి తీరతాయనేది ప్రాచీనుల విశ్వాసం. ప్రాచీనులే కాదు నేటి ఆధునికులు సైతం ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందుకు ఎన్నెన్నో ప్రత్యక్ష్య ఉదాహరణలు కూడా ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహా మహుల చరిత్ర అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. అవన్నీ మనకు ఆశ్చర్యం గొలిపే సంఘటనలే..నమ్మ లేని నిజాలే..అందులో మచ్చుకు కొన్ని మీ ముందుంచుతున్నా....అవేవో చూద్దాం పదండి మరి. ప్రపంచ దేశాలను ఏకధాటిన పరి పాలించిన బ్రిటిష్ సామ్రాజ్యమది. సముద్రయానం ద్వారా ఇంగ్లాండు నుండి అమెరికా లోని న్యూయార్క్‌కు భారీ ఎత్తున ప్రయాణీకులను చేరవేసే బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. అందుకోసం అతిపెద్ద ఓడను నిర్మించేందుకు సంకల్పించింది. ఈ మేరకు బెల్ఫాస్ట్ ఓడరేవులో నౌకా నిర్మాణానికి సంబంధించి యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించింది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా పొక్కి దేశమంతటా తెలిసి పోయింది. తొలిసారిగా సముద్ర యానానికి సిద్ద మవుతున్న అతి పెద్ద నౌక ఇదేననీ, అందులో సకల సదుపాయాలు ఉంటాయనీ, ఈ ఓడ పేరు ' టైటానిక్' అని చెబుతూ ఇంగ్లాండు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.  ఈమేరకు ఆసక్తి గల ప్రయాణీకుల నుండి ముందస్తు దరఖాస్తులను ఆహ్వానించింది. సంపన్నుల నుండి సామాన్యుల వరకు టికెట్లు ఎగబడి కొన్నారు. టికెట్లు కొన్న ప్రయాణీకులంతా తమ ప్రయాణ రోజు కోసం ఎదురు తెన్నులు చూస్తున్నారు. ఆ క్షణం కోసం ఉవ్విళ్ళూరు తున్నారు. సరిగ్గా అప్పుడే పిడుగు లాంటి సమాచారం. ప్రజల దృష్టి నాకర్షించింది. అదేమంటే టైటానిక్ ఓడ ఓ మంచు పర్వతాన్ని ఢీ కొట్టి మునిగి పోతుందట. అందులోని వందలాది మంది ప్రయాణీకులు జల సమాధి అవుతారట. ఈ విషయం ఓ నవలలో ప్రచురితం కావడంతో ప్రజలు ఎగబడి కొంటున్నారు. ఆనాటి ప్రముఖ నవలా రచయిత మోర్గాన్ రాబర్ట్ సన్ రాసిన పుస్తకమది. ఆ పుస్తకానికి ' ఫ్యుటిలిటి ఆర్ ద రెక్ ఆఫ్ ది టైటాన్' పేరు పెట్టి క్రీ.శ.1898 సం.. లో మార్కెట్ లో విడుదల చేసాడు.  "టైటానిక్ నిర్మాణమే ఇంకా పూర్తి కాలేదు. సముద్ర రాకపోకలే ప్రారంభం కాలేదు.అలాంటప్పుడు ఏ ఆధారంతో ఇలాంటి భయానక నవల రాశావు.ఇది సహేతుకం కాదంటూ ఒకవైపు పౌరులు, మరోవైపు ప్రభుత్వప్రతినిధులు నిరసన వ్యక్తం చేసారు. అందుకు రాబర్ట్ సన్ సమాధానమిస్తూ తనకు ఒక కల వచ్చిందని, అయితే అది ఒక సారో, రెండు సార్లో వచ్చింది కాదనీ, ప్రతిరోజూ పదే పదే వస్తుండడంతో ప్రయాణీకులను అప్రమత్తం చేసి, వారి ప్రాణాలు కాపాడేందుకే ఈ నవల రాసానని ముక్తాయించుకున్నాడు. దీంతో ప్రభుత్వం, ప్రజలు అతని మాటలను ఖాతరు చేయలేదు. పైగా కలలను నమ్మడం పిచ్చి చేష్టలంటూ కొట్టి పడేసారు. తాను రాసిన నవలలో తనకొచ్చిన కల గురించి రాబర్ట్ సన్ ఇలా వివరించాడు. టైటానిక్ ఓడ ఇంగ్లాండులోని సౌతాంప్టన్ నుండి న్యూయార్కు కు బయలు దేరుతుంది. ఆ క్రమంలో అట్లాంటిక్ మహా సముద్రంలో నాలుగు రోజుల పాటు ప్రయాణిస్తుంది.ఆ తర్వాత ఓ పెద్ద మంచు పర్వతాన్ని ఢీ కొంటుంది. కేవలం మూడు గంటల వ్యవధిలో మొత్తం నౌక మునిగి పోతుంది. అందులోని వందలాది మంది ప్రయాణీకులు జల సమాధి అవుతారు. అంటూ ఆ పుస్తకం కవరు పేజీలో మంచు పర్వతాన్ని ఢీ కొని తలక్రిందులవుతున్న టైటానిక్ చిత్రాన్ని ముద్రింప జేశాడు. ఆయన రాసిన పుస్తకాన్ని చదివాక కలల పట్ల నమ్మకమున్న వందలాది మంది ప్రయాణీకులు తాము కొనుక్కున్న టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. అయితే కలలు కల్ల లవుతాయి గానీ , వాస్తవాలవుతాయా? అంటూ ఆ రచయిత మాట నమ్మని కొందరు ప్రయాణీకులు టైటానిక్ లో తమ ప్రయాణానికే మొగ్గు చూపారు. రద్దయిన టికెట్ల స్థానంలో మరి కొందరు ప్రయాణీకులు ఉరకులు, పరుగులతో తాము టిక్కెట్టు కొన్నారు. ఈ నేపథ్యంలో అనుకున్న రోజు రానే వచ్చింది. అది 1912 వ సంవత్సరం, ఏప్రిల్ నెల 10 వ తేదీ. బెల్ఫాస్ట్ ఓడరేవులో మొట్ట మొదటి సముద్ర యానానికి సిద్దమైన టైటానిక్ ఓడ ఎంతో అందంగా, మరెంతో అపురూపంగా తీర్చిదిద్దబడింది. ఆనాటి కాలానికి టైటానిక్ ఓడనే అతి పెద్ద నౌక. దేశ నలుమూలల నుండి విచ్చేసిన. ప్రజలు, ప్రభుత్వ ప్రతినిధులు, రాజ ప్రతినిధులు, అధికారులు, అనధికార పుర ప్రముఖులు, యావత్ ప్రజల ఆనందోత్సహాల మధ్య సౌతాంప్టన్ నుండి టైటానిక్ ఓడ న్యూయార్క్ కు బయలు దేరింది.ప్రయాణీకులు,నౌకా సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది మొత్తం 1500 మందికి పైగా ఓడలో ప్రయాణిస్తున్నారు. అట్లాంటిక్ మహా సముద్రంలో నాలుగు రోజుల పాటు హాయిగా ప్రయాణం సాగింది. ఏప్రిల్ 14 న సముద్రం మధ్యలో నున్న ఓ మంచు పర్వతాన్ని ఢీ కొట్టి ఓడ తునాతునకలైంది. కేవలం రెండు గంటల నలబై నిమిషాల వ్యవధిలో ఓడ పూర్తిగా జల సమాధి అయ్యింది. అందులోని 1500 మంది ప్రయాణీకులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనను బట్టి మనకు అర్థమయ్యే దొకటే. కలలను ఎట్టి పరిస్థితులలో తీసి పారేయరాదని. కొన్ని కలలు ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజమవుతాయని గ్రహించాలి. రాబర్ట్ సన్ తనకు కల వచ్చిన ప్రకారం ఉన్నదున్నట్లు నవలలో పొందు పరిచాడు. చివరకు పుస్తక ముఖ చిత్రం కూడా కలలో వచ్చిన ప్రకారమే ముద్రింపజేసాడు. 13 ఏండ్ల తర్వాత రాబర్ట్ సన్ కల యథాతథంగా నిజం కావడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ సంఘటనతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ప్రమాదం జరిగిన తీరు తెన్నులపై విచారణ జరిపిన బ్రిటిష్ ప్రభుత్వం ఆశ్చర్య పోయింది. ప్రమాద ఫోటోలు కూడా నవలలో ఉన్న తీరుగానే ఉండడంతో అధికారులు ఖిన్నులయ్యారు. ఇప్పుడు చెప్పండి. కలలు నిజమవుతాయా?. ఇది నిజంగా నమ్మాల్సిన విషయమా? బ్రిటన్ సామ్రాజ్య రికార్డులను తప్పు పట్టగలమా? వారి రికార్డుల ప్రకారం చూస్తే ఇది నమ్మలేని నిజమా? కాదా? ముమ్మాటికి నమ్మలేని నిజమే........ VIJAYA BHASKAR RAJU...
 • టీ వీ లో "ఏవండీ..  ఆవిడ వచ్చింది " సినిమా వస్తోంది. అది చూస్తూ కూరలు తరుగుతోంది సంధ్య.   "అమ్మా ఇక్కడ బూచి ఉందే "బంటి కేకేసాడు బెడ్ రూం లోనుంచి. "అమ్మా బూచే "మళ్ళీ కేక.  "ఏమైందిరా  " అంటూ హడావుడిగా ఆ రూంలో కొచ్చింది. తల్లిని చూసి బంటి "అదిగో అక్కడ చూడు" అన్నాడు అటకను చూపిస్తూ.సంధ్య అటు కేసి చూసి " ఏమి లేదుగా" అంది. "బాగా చూడు"అన్నాడు బంటి.  సంధ్య మంచమెక్కి చూసింది. అటక పై ఒక మూలన  " టెడ్డి బేర్" కనిపించింది . ఇది మనది కాదే ..  బహుశా అంతకుముందు ఉన్నవాళ్ళు పొరపాటున వదిలేసి వెళ్ళా రేమో అనుకుంటూ దిగింది. ఇపుడు దానిగురించి చెబితే అది కావాలని గొడవ చేస్తాడు.చెప్పక పోవడమే మంచిదనుకొంటూ  "ఇక్కడ ఏమి లేదురా  .. అమ్మతోటే ఆటలా ?"వాడి బుగ్గలు చిదుముతూ నుదుటిపై ముద్దాడింది.  తల్లి ముద్దు చేయడం తో ఎనిమిదేళ్ళ బంటి మురిసి పోయాడు.  "పద.. బయట కెళ్ళి కాసేపు ఆడుకో"  అంది.  బంటి ఎగురు కుంటూ కింద కెళ్ళాడు.మళ్ళీ బెండకాయలు  తరగడం మొదలెట్టింది   టీవీ లో ఏదో దెయ్యం పాట పాడుతోంది.   ఈ చానల్ తను పెట్టలేదే ?చానల్ ఎలా మారింది.  అనుకుంటూ ఆ  చానల్ మార్చింది. "ఆ దెయ్యం సినిమా బాగుంటుంది....చూడు"   పక్కనే ఉండి ఎవరో చెవిలో అన్నట్టు వినిపించింది. ఆ మాటకు ఒక్కసారిగా సంధ్య ఉలిక్కి పడింది.  వెనక్కి తిరిగి చూసింది. ఎవరూ కనిపించలేదు.  తమాషాగా ఉందే ? అనుకుంటూ చక చకా పని ముగించింది.  .................................................. ................................................   బంటి రాగానే వాడికి స్నానం చేయించి స్నాక్స్ పెట్టింది. వాడు హాల్లో కూర్చుని చదువుకుంటున్నాడు. పక్కఫ్లాట్"రాగ"  కూడా వచ్చి కూర్చుని రాసుకుంటుంది. కిచెన్ లోకెళ్ళి  స్టవ్ వెలిగించి  రైసు కుక్కర్ పెట్టింది.   రెండో స్టవ్ వెలిగించి బాణలి పెట్టి అందులో బెండకాయ ముక్కలు వేసింది.  "కూరలో పల్లీలు కూడా వేయి..  టేస్ట్ అదిరి పోతుంది " మళ్ళీ అదే గొంతు.  ఈ సారి మాటలు మరింత స్పష్టం గా వినబడ్డాయి.సంధ్యకు  భయమేసింది.  అటు ఇటు చూస్తే ఎవరూ లేరు.   మాటలు నిజంగా వినబడుతున్నాయా? లేక తను భ్రమ పడుతోందా ? సంధ్య గందరగోళంలో పడింది. మాటలు వినబడటం నిజమే!  మరి మనుష్యులు కనబడరే?  మాటలు మాత్రమే వినబడుతున్నాయంటే?ఈ ఇంట్లో తాము కాక మరెవరైనా ఉన్నారా ? మనుష్యులు అయితే కనబడే వాళ్ళే .... కనబడటం లేదంటే ?? కొంప దీసి ఈ ఇంట్లో దెయ్యాలు కానీ లేవు కదా?బంటి కూడా ఇంతకుముందు "బూచి"అన్నాడు.  ఆ బూచే తన పక్కన నిలబడి మాట్లాడుతోందా?సంథింగ్ రాంగ్  ఆ ఆలోచనకే  సంధ్య ఒళ్ళు  జలదరించింది. ఫోన్ చేసి భర్త సుధాకర్ కి విషయమంతా చెప్పింది.  'గంటలో వస్తున్నా ... టెన్షన్  పడకు' అన్నాడు సుధాకర్.భర్తతో మాట్లాడేక కొంచెం భయం తగ్గింది.  అప్పుడు గుర్తుకొచ్చింది పొయ్యి మీద అన్నం,కూర పెట్టినట్టు. పరుగున కిచెన్ లోకి వచ్చి చూసింది. స్టవ్ ఆఫ్ చేసి ఉంది. ఇదేదో మాయలా ఉంది. తాను స్టవ్ ఆఫ్ చేయలేదు. మరి ఇదెలా సాధ్యం ? స్టవ్ వెలిగిస్తూనే ఆలోచనలో పడింది. మొత్తం మీద ఏదో తేడా ఉంది ... ఈ ఇంట్లో. భయపడుతూనే  వంట పని ముగించింది.  అప్పటికే రెండు సార్లు కరెంట్ పోయి వచ్చింది. ఇంట్లో కొవ్వొత్తులు లేవు. పక్క వాళ్ళను అడుగుదాం అని వాళ్ళింటి కొచ్చింది. అక్కడ హాల్లో కూర్చుని "రాగ " హోంవర్క్ చేస్తూ కనిపించింది. "ఇపుడు అక్కడ ఉన్నావు కదా! నా కంటే ముందు ఎలా వచ్చావ్" అంది ఆశ్చర్య బోతూ.  "నేనసలు రాలేదుగా... మీ ఇంటికి" అంది రాగ.   ఆ మాట తో బిత్తర పోయింది సంధ్య.  మరి అక్కడ కూర్చున్న "రాగ" ఎవరు?అనబోయి తమాయించుకుని. ఒకే ...అంటూ పరుగున వెనక్కి వచ్చింది.  ఇక్కడ బంటి ఒక్కడే కూర్చుని ఉన్నాడు."రాగ ఏదిరా" అడిగింది.  "నీ వెనుకనే వచ్చింది గా "అన్నాడు. సంధ్య  కన్ఫ్యూజన్లో పడి పోయింది.  మొత్తానికి సంథింగ్ రాంగ్. సోఫాలో కూల బడింది.  "బంటీ ఫ్రిజ్ లోనుంచి వాటర్ బాటిల్ తీసుకురా" అంది. చల్లటి నీళ్ళు తెచ్చి ఇచ్చాడు వాడు. గడ గడ మొత్తం తాగేసింది. అవి గొంతులో పడ్డాక హాయిగా ఉందనిపించింది. అయిదు నిమిషాలు అలాగే కూర్చుంది. అంతలో బంటి "అమ్మా ఆకలి " అంటూ వచ్చాడు. మెల్లగా లేచి కూర అన్నం కలిపి వాడికి గోరుముద్దలు పెట్టింది.   సుధాకర్  చెప్పినట్టే గంటలోగా వచ్చేసాడు. 'బంటి ముందు ఏమి మాట్లాడవద్దు' అన్నాడు స్నానానికి వెళుతూ. పిచ్చాపాటీ మాట్లాడుతూ కలసి భోం చేసారు. అంతలోనే సంధ్యకు వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసారు. వాళ్ళతో కాసేపు మాట్లాడింది.  అలా అలా టైం పది అయింది. బంటి కూర్చొనే నిద్రపోతున్నాడు.  సుధాకర్ పని వుందని చెప్పి లాప్ ట్యాప్  ముందేసుకుని కూర్చున్నాడు. సంధ్య పిల్లవాడిని తీసుకుని బెడ్ రూం లో కొచ్చి పడుకుంది. రోజు బంటి రెండో  బెడ్ రూం లో పడుకునే వాడు.  బూచి  భయంతో తన పక్కనే పడుకోబెట్టుకుంది. ఇక్కడి కొచ్చాక వాడికి ప్రత్యేక రూమ్ కేటాయించారు.  సంధ్య కైతే అలా చేయడం ఇష్టం లేదు ...కానీ సుధాకర్  ఒప్పుకోలేదు. చిన్నప్పటి నుంచే అన్నీ అలవాటు చేయాలంటే కాదనలేక పోయింది. బంటి  బెడ్రూమ్ లో పడుకున్నా మధ్యలో వెళ్లి ఒకటి రెండు సార్లు గమనించేది. మొదట్లో రెండు మూడు రోజులు సగం రాత్రపుడు వచ్చి మధ్యలో దూరే వాడు. తర్వాత మెల్లగా అలవాటు పడ్డాడు. పడుకుందే కానీ బూచి ఆలోచనలు తొలిచేస్తున్నాయి.  ఏదేదో ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకుంది సంధ్య.  .................................................. ..................................................  సగం రాత్రపుడు  ఎందుకో సంధ్యకు అకస్మాత్తుగా మెలుకువొచ్చింది.పక్కనే సుధాకర్ గురక పెట్టి నిద్ర పోతున్నాడు.  మధ్యలో ఉండాల్సిన బంటి కనపడలేదు. వీడు మళ్ళీ ఆ రూం కెళ్ళి పడుకున్నాడా?  అనుకుంటూ లేచి సంధ్య బంటి బెడ్ రూమ్ దగ్గరకొచ్చింది. లోపల నుంచి బంటి మాటలు వినబడుతున్నాయి.  "వూ ... ఆతర్వాత ...ఏం జరిగింది ? చెప్పు " అంటున్నాడు   బంటి . "ఆ దెయ్యం జోల పాట పాడి చంటిని నిద్ర పుచ్చింది. అంతే."ఎవరో సమాధానం చెప్పారు. 'ఈ కథ నాకు నచ్చలేదు.... ఇంకో కథ చెప్పు' అన్నాడు బంటి."ఇంకో కథా ?"  అది  ఆడ గొంతు. అవును అది ఆ బూచి గొంతే.తనకు బాగా గుర్తుంది. సాయంత్రం  చెవిలో కూర గురించి  చెప్పిన బూచి గొంతే.  సంధ్యకు భయమేసింది. బంటిని అదేమి చేస్తుందో అన్న ఆందోళన కలిగింది.  మెల్లగా కిటికీ దగ్గర కెళ్ళి తొంగి చూసింది. అంతే. ఆమె గుండె ఒక్క క్షణం ఆగింది.  లోపల మంచం మీద ఎవరో స్త్రీ కూర్చుని ఉంది .ఆమె తెల్ల చీర కట్టుకుని ఉంది.  అటు తిరిగి ఉండటంతో మొహం కనిపించడం లేదు.నల్లటి శిరోజాలు గాలికి కదులుతున్నాయి. ఇదేనా ఆ బూచి? ఇలా కథలు చెబుతూ  బంటి ని ఏమైనా చేస్తే ? ఆమె కళ్ళ ముందు ఏవేవో దృశ్యాలు కనిపించాయి. ఆ ఊహకే సంధ్య వణికి పోయింది.  నో ... అలా జరగడానికి వీల్లేదు. సంధ్య ఉద్వేగంతో ఊగి పోయింది.  "బంటీ ... అది బూచిరా. బయటి కొచ్చేయ్" అంటూ పెద్దగా కేకేసింది.'బయట కొచ్చేయ్ ... బయట కొచ్చేయ్' అంటూ అరిచింది. 'సంధ్యా .. సంధ్యా ఏంటా కలవరింతలు?'తట్టి లేపేడు సుధాకర్.  ఉలిక్కి పడి లేచింది సంధ్య.పక్కనే బంటీ ... సుధాకర్. అటు ఇటు చూసింది బూచి కనపడలేదు. 'హమ్మయ్య అది పీడకలేనా?' అనుకుంది.  "ముందు చల్లటి నీళ్ళతో మొహం కడుక్కో" అన్నాడు సుధాకర్.  .................................................. .................................................. ......................................  సరిగ్గా మూడు గంటలకు లేచాడు సుధాకర్.అప్పటి వరకు అతను నిద్ర పోలేదు.    సంధ్య,బంటి గాఢ నిద్రలో ఉన్నారు. చప్పుడు చేయకుండా రెండో బెడ్రూం లో కెళ్ళాడు.  గదిలో లైట్ వేసి టెడ్డీ బేర్ కోసం అటక వైపు చూసాడు.అక్కడ కనిపించలేదు అది.  అల్మారాలో గాలించేడు.అక్కడ లేదు. ఎందుకో డౌట్ వచ్చి మంచం కింద చూసాడు.  అక్కడ ఉంది అది. దాని కళ్ళు పిల్లి కళ్ళలా మెరుస్తున్నాయి.  అటక పైన ఉండాల్సింది. కిందికి ఎలా వచ్చింది? ఒక్క ఉదుటున దాన్ని పట్టుకుని బయటకు లాగేడు. ఎడం చేతితో మెడ వెనుక భాగంలో గట్టిగా పట్టుకున్నాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డోర్ లాక్ చేసి కిందకొచ్చాడు. వాచ్మేన్ రాజయ్యను పిలిచేడు.  అతగాడు రాగానే ఇద్దరు మోటార్ బైక్ మీద వూరి బయట కొచ్చారు.    అటు ఇటు చూసి ఆ బొమ్మపై కిరోసిన్ పోసి  అగ్గిపుల్ల గీసి నిప్పు అంటించాడు రాజయ్య.  పది నిమిషాల్లో అది పూర్తిగా మాడి మసై పోయింది.'ఇవాల్టి నుంచి మీకు ఏ ఇబ్బందీ ఉండదు.. సారూ 'అన్నాడు రాజయ్య."అసలు ఆమె ఎందుకు ఆత్మ హత్య చేసుకుంది" అడిగేడు సుధాకర్. "భర్త తాగుబోతు .. పిల్లలు పుట్టలేదని హింసించే వాడు.మొగుడి ఆగడాలు భరించలేక ఉరేసుకుని చనిపోయింది సార్. కానీ మామూలు గానే పోయినట్టు కథ అల్లారు." "ఒకే .... ఈ విషయం బయటికి రాకూడదు" ఇంటికి రాగానే స్నానం  చేసి బ్లాక్ టీ తాగి లాప్ ట్యాప్ ఓపెన్ చేసాడు సుధాకర్.  ఆ తర్వాత మళ్ళీ బంటికి బూచి కనపడలేదు. సంధ్యకు బూచి మాటలు వినపడలేదు. ...
Site Logo