Latest News
సమ్‌థింగ్ స్పెష‌ల్‌
 • వెనక్కి తిరిగి చూడాలంటే మనిషి పూర్తిగా వెనక్కి తిరగాల్సిందే. అలా మనిషి కాకుండా తలను మాత్రమే తిప్పి చూడాలంటే 90 డిగ్రీల వరకు తలను తిప్పి చూడ వచ్చు. అంతకుమించి తిప్పడం ఎవరికి సాధ్యపడదు. కానీ కరాచీ నగరానికి చెందిన 14 ఏళ్ల ముహమ్మద్‌ సమీర్‌ తన తలను 180 డిగ్రీలు వెనక్కి తిప్పి చూస్తాడు . వెనక్కి తిరక్కుండానే తన తలను భుజాల  మీదుగా పూర్తిగా వెనక్కి తిప్పగలడు . ఈ అరుదైన విద్యను సమీర్‌ చాలా కష్టపడే నేర్చుకున్నారు. తండ్రి జబ్బున  పడడంతో సమీర్‌ తన అరుదైన విద్యను ఆసరాగా చేసుకొని జీవనోపాధి వెతుక్కున్నారు. డ్యాన్స్‌ కూడా నేర్చుకున్న సమీర్‌ 8 మంది సభ్యులుగల ‘డేంజరస్‌ బాయ్స్‌’ డ్యాన్స్‌ బృందంలో చేరారు. డ్యాన్స్‌కు తన తల తిప్పుడును జోడించడంతో ఈ బృందంలో అతడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు .  వీడియో  చూడండి. ...
 • సరిగ్గా 70  ఏళ్ళ క్రితం మెక్సికోలోని రోస్‌వెల్‌ ప్రాంతంలో ఓ భారీ పేలుడు సంభవించింది. భారీ బెలూన్‌ వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందని అప్పట్లో అమెరికా బలగాలు చెప్పాయి. అయితే  అది ఒక ప్లైయింగ్‌ సాసర్‌ అని ... అది పేలిపోయి నేలపై పడిందని  కొందరు అన్నారు . మరో వైపు  అది ఏలియన్‌ల అంతరిక్ష నౌక  అని    అప్పట్లోనే ప్రచారం జరిగింది. అలాగే  రష్యా అణుబాంబు పరీక్ష వివరాలు తెలుసుకునేందుకు సీక్రెట్‌గా ఏర్పాటుచేసిన ప్రయోగంలో ఆ బెలూన్‌ పేలిపోయిందంటూ మరికొన్ని  కథనాలు వినిపించాయి. కాల క్రమంలో అవి తెర మరుగున పడ్డాయి. వాటి గురించి అందరూ మర్చిపోయారు.   అయితే   అదే అంశం గురించి  ఓ సంచలనాత్మక వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ పేలుడు సంభవించిన సమయంలో అక్కడికి చేరుకున్న యూఎస్‌ బలగాలు ఓ స్ట్రెచర్‌పై ఏలియన్‌ బాడీని తీసుకెళుతున్నట్లుగా  అందులో ఉంది. యూఎఫ్‌ఓ స్పేస్‌ షిప్‌ అక్కడే కూలిపోయిందని దాంతో అందులోని ఏలియన్‌ గాయపడిందని, దానిని స్ట్రెచర్‌పై స్వయంగా తరలించారని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. తాజాగా యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు. రోస్ వెల్ ఘటనపై పలు కథనాలు పుట్టుకొచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మంది  ఆరోజు ప్లైయింగ్‌ సాసర్‌ పేలిపోయిందని నమ్ముతున్నారు. ఈ వీడియో  మరెన్ని కథనాలను వెలుగులోకి తెస్తుందో చూడాలి.  మీరు కూడా వీడియో చూడండి. ...
 • ( Aravind Arya Pakide) .... తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఏకవీర  ఎల్లమ్మ దేవాలయం ఒకటి. కాకతీయుల కులదైవంగా భావించే  ఏకవీర ఎల్లమ్మకు  అప్పట్లో  నిత్యం పూజలు జరిగేవి.  చరిత్రకారుల లెక్కల ప్రకారం ఈ ఆలయాన్ని దాదాపు 1,100 ఏళ్ల కిందట నిర్మించారు. రాణీ రుద్రమ దేవి తన నివాసం నుంచి ఖిల్లా వరంగల్ సొరంగ మార్గం ద్వారా  ఈ ఆలయానికి  చేరుకునేదట. ఇక్కడ  ఎల్లమ్మకు మొగిలి పూలతో పూజలు చేసేదట. కాకతీయుల పతనం తర్వాత ఈ ఆలయం నిర్లక్ష్యానికి గురైంది. అందులోని మూలవిరాట్టును ఎవరో ఎత్తుకుపోయారు. మూల విరాట్టు లేక, పూజలు నిలిచిపోవటంతో భక్తుల రాక ఆగిపోయింది. చివరికి ఆలయం శిథిలావస్థకు చేరింది.  అద్భుత శిల్పసంపదతో కూడిన స్థంభాలు పక్కకు ఒరిగిపోయాయి.  ఇందులో మూలవిరాట్టు లేకపోవటంతో  ఈ ఆలయాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు.   ఇక ఈ ఆలయ సమీపంలోని రాళ్లలో తొలిచిన జైన గుహలు చూపరులను ఆకట్టుకుంటాయి. పెద్ద రాతి గుండ్లను తొలిచి గుహలుగా మలిచారు. అప్పట్లో ఈ ప్రాంతంలో జైనమత ప్రాబల్యం ఉండటంతో వరంగల్‌ పద్మాక్షి గుట్ట, అగ్గలయ్య గుట్ట, చుట్టుపక్కల ప్రాంతాల్లో జైనుల ఆవాసాలు ఏర్పడ్డాయి. వారి విద్యాలయాలు కొనసాగాయి. ఆ క్రమంలోనే జైన మునులు ధ్యానం చేసుకునేందుకు ఇలాంటి గుహలు ఏర్పాటు చేశారని  అంటారు.  ఏకవీర ఆలయం సమీపంలో ఇలాంటి మూడు గుహలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ ప్రాంతమంతా ప్రస్తుతం  చెట్లు, పొదల మధ్య చిక్కుకుపోయింది.  ప్రస్తుతం ఈ ఆలయానికి వెళ్లేందుకు దారి కూడా లేదు. కాగా  కాకతీయులు  ఏకవీర ఎల్లమ్మను కొలిచినట్లు పూర్వీకుల ద్వారా  తెలుస్తున్నప్పటికీ  దానికి సంబంధించి శాసనాలు, ఆధారాలేమీ లభించలేదు. ఇక మొగిలిచెర్ల ఊరు అసలు పేరు మొగిలి చెరువుల అని.. అక్కడి చెరువుల్లో విస్తృతంగా మొగిలిపూల వనం ఉండటంతో ఆ పేరొచ్చిందని చెప్పే శాసనాలు మాత్రం లభించినట్టు పురావస్తుశాఖ అధికారులు చెబుతున్నారు. వాటిల్లో ఈ దేవాలయం ప్రస్తావన కొద్దిగానే ఉందని, ఏకవీర ఎల్లమ్మ ప్రస్తావనేదీ లేదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే .. మరో కథనం ప్రకారం  ఎల్లమ్మ దేవత రేణుక దేవి ప్రతిరూపం. అందుకే ఆమెను జానపదులు రేణుక ఎల్లమ్మ అని వ్యవహరిస్తారు. కాకతీయ సామ్రాజ్య కాలం నాటి ఓరుగల్లు పట్టణంలో ఎల్లమ్మకు మౌఖిక సంప్రదాయంలో ఎక్కువ ప్రాచుర్యం ఉంది. వరంగల్‌ జిల్లాలో కొందరు  ఏకవీర దేవతను తమ కులదైవంగా కొలుస్తారు. ఎల్లమ్మ దేవాలయం ఆదిలాబాద్‌ జిల్లాలోని మాహురంలో ఉంది. అక్కడ ఈమెను మాహురమ్మ అని పిలుస్తారు. రాయలసీమలో నంగమ్మ దేవత అని, తమిళనాడులో మేమలమ్మ అని అంటారు. తెలంగాణలోని అతి పురాతన ఆలయాల్లో ఈ ఏకవీర  ఎల్లమ్మ ఆలయం  ఒకటి కావడంతో దీనిని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్‌ శివార్లలోని మొగిలిచెర్ల గ్రామంలో ఉన్న ఈ ఏకవీర ఆలయాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌ పేర్వారం రాములు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు ప్రతిపాదించగా.. సీఎం సానుకూలంగా స్పందించారు. పర్యాటకాభివృద్ధి సంస్థ, పురావస్తు శాఖల ఆధ్వర్యంలో పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో ఈ ఆలయానికి మహర్దశ పట్టనుంది....
 • హైపర్ లూప్ రైళ్లు  ఏపీ లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.   హైస్పీడ్‌ రైళ్లు, బుల్లెట్‌ ట్రైన్ల కంటే వేగవంతమైన, కాలుష్యరహిత, చౌక ప్రయాణం హైపర్‌ లూప్‌తో సాధ్యమవుతుంది. ఈ కారణంతోనే ఇపుడు అన్ని దేశాలు ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపుతున్నాయి.  దుబాయ్‌ ఏకంగా 100 కిలోమీటర్ల మేర హైపర్‌ లూప్‌ను ఏర్పాటు చేసుకోవటానికి హైపర్‌ లూప్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోఏపీ సర్కార్ కూడా   ఈ ప్రాజెక్టుపై ఆసక్తి చూపించటంతోపాటు ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యతను అమరావతి మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కి అప్పగించింది.ఈ ప్రాజెక్ట్ పై ఇపుడు చర్చలు జరుగుతున్నాయి. అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ కేంద్రంగా 2014 నుంచి హైపర్‌లూప్‌ సంస్థ పనిచేస్తోంది. హైపర్‌లూప్‌లు విద్యుత్‌ చోదక శక్తితో పనిచేస్తాయి. హైపర్‌ లూప్‌ కోచ్‌లు ప్రయాణించేందుకు భూగర్భంలో కానీ.. భూమిపై పిల్లర్ల మీద కానీ ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగా ఆరు మీటర్ల వెడల్పుతో కూడిన భారీ ట్యూబును హైపర్‌ లూప్  కారిడార్‌ పొడవునా నిర్మిస్తారు. ఈ ట్యూబ్‌లో హైపర్‌లూప్‌ కోచ్‌లు నడుస్తాయి. విద్యుత్‌ శక్తితోపాటు ట్యూబ్‌ లోపల ఏర్పాటు చేసే మాగ్నటిక్‌ లెవిటేషన్‌, ఏరో డైనమిక్‌ ట్రాక్‌ వ్యవస్థ వల్ల ఈ కోచ్‌ ఎటూ పడిపోకుండా గంటకు 300 కిలోమీటర్ల నుంచి 1200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఒక్కో కోచ్‌లో 50 మంది వరకు ప్రయాణించవచ్చు. పాసింజర్‌ కోచ్‌లతోపాటు సరుకు రవాణా కోచ్‌లు కూడా ఉంటాయి.   అన్ని ఒకే అయితే  విజయవాడ నుంచి అమరావతికి అక్కడి నుంచి హైదరాబాద్‌కు, అమరావతి నుంచి విజయవాడ మీదుగా విశాఖపట్నంకు, విజయవాడ నుంచి అమరావతి మీదుగా బెంగళూరుకు, విజయవాడ నుంచి అమరావతి మీదుగా చెన్నైకు నాలుగు మెగా కారిడార్లు   ఏర్పాటు కావచ్చు. అలా  ఏర్పాటు చేసే అవకాశాలపై  చర్చలు జరుగుతున్నాయి. వీటితోపాటు విజయవాడ - అమరావతి - గుంటూరు - తెనాలి నడుమ ఇంతకు ముందు ప్రతిపాదించిన హైస్పీడ్‌ ట్రైన్‌ స్థానంలో హైపర్‌లూప్‌ ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలనూ కూడా పరిశీలిస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా భారత్ లో హైపర్ లూప్ రైళ్లను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. వీడియో చూడండి. ...
 • టెక్నాలజీ ని  ఉపయోగించి  దేశాల నడుమ , ఖండాల మధ్య దూరాన్ని తగ్గించే ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాలు ఫలించి   రాకెట్ ఆధారిత  రవాణా వ్యవస్థ అందుబాటులో కొస్తే దేశాలమధ్య సరుకు రవాణాతో పాటు ...మనుష్యుల  ప్రయాణం కూడా సులభతరమవుతుంది.  పొద్దునే బ్రేక్ ఫాస్ట్ ఒక దేశంలో లంచ్ మరో ఖండం లో రాత్రి నిద్ర మరో దేశం లో చేయ వచ్చు. అలాంటి రోజులు రాబోతున్నాయి. వచ్చే ఐదేండ్లలో ఏ దేశానికైనా అరగంటలో చేరుకునే విధంగా రాకెట్ల ద్వారా ప్రయాణ సదుపాయం కల్పిస్తామని గ్రహాంతర, భవిష్యత్ రవాణాసంస్థ స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు. అడిలైడ్‌లో జరిగిన అంతర్జాతీయ అంతరిక్ష వార్షిక మహాసభల ప్రారంభసభలో తమ సంస్థ భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయన వివరించారు. గ్రహాంతర ప్రయాణాలకు అనువైన బీఎఫ్‌ఆర్‌ అనే రాకెట్ నిర్మాణాన్ని ప్రారంభించామని, ఆరు నుంచి తొమ్మిది నెలల్లో దీనిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. 2022 నాటికి తాము కనీసం రెండు అంతరిక్ష సరుకు రవాణానౌకలను అరుణ గ్రహానికి పంపిస్తామని చెప్పారు. భవిష్యత్ ప్రయోగాలకు అవసరమయ్యే విధంగా 2024 నాటికి ఆ గ్రహంపై తగిన వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని, మానవులను, వారికి అవసరమైన నీరు, పరికరాలు ఇతర సామాగ్రి తీసుకెళ్లడానికి 2024 నాటికి నాలుగు అంతరిక్షనౌకలను పంపిస్తామని వెల్తడించారు. భూగ్రహంపై ప్రజల రవాణా కోసం కూడా రాకెట్లను వినియోగిస్తామని, ప్రధాన నగరాల్లో ఉన్నవారిని ఇతర దేశాలకు అరగంటలోగానే చేరుస్తామని మస్క్ తెలిపారు. ఉదాహరణకు తమ రాకెట్ షిప్‌ల ద్వారా జపాన్‌లోని టోక్యో నుంచి ఇండియాలోని ఢిల్లీకి 30 నిమిషాల్లో వెళ్లవచ్చునన్నారు. ఎలాన్ మస్క్ చెబుతున్నట్టు రాకెట్ నిర్మాణం పూర్తి ... రవాణా వ్యవస్థ మొదలు అయితే ఇక పర్యాటక రంగానికి మహర్దశ పడుతుందని అని చెప్పుకోవచ్చు. ...
 • (Vasireddy Venugopal)  ఆది దేవత, అనాది దేవత, ప్రపంచ ప్రజల ఆరాధ్య దేవత... లజ్జ గౌరి .... ప్రపంచంలో అన్ని సమాజాల్లోనూ ప్రజల ఆరాధనలు అందుకున్న ఈ దేవత విగ్రహాన్ని మొన్నీ మధ్య కర్నాటకలోని చాళుక్య రాజధాని నగరం బాదామిలో, పురావస్తు శాఖ మ్యూజియంలో దర్శించి తరించాను. ఈ విగ్రహాన్ని బీజాపూర్ జిల్లా నాగనాథకోలా లోని నాగనాధ ఆలయం నుంచి సేకరించారు. చాళుక్యులు పరిపాలించిన మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ లోనూ ఈ విగ్రహం కనిపిస్తుంది. కర్నూలు జిల్లా కూడలి సంగమేశ్వర ఆలయం నుంచి సేకరించినది. ప్రపంచంలో ప్రతి సమాజంలోనూ ఇలాంటి దేవతా విగ్రహం వుండడం, ఇదే భంగిమలో వుండడం చాలా అరుదైన, ఆశ్చర్యం కలిగించే అంశం. క్రీస్తు పూర్వం చాలా శతాబ్దాలనుంచి కూడా లజ్జ గౌరిని ప్రజలు ఆరాధిస్తూ వచ్చారు. సంతానాన్ని ఇచ్చే దేవతగా లజ్జ గౌరిని కొలుస్తారు. హరప్పా, మొహంజదారో నాగరికతల్లో ఈ విగ్రహారాధన వుంది. అంతకు ముందూ వుంది. ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్, మొరాకో.. ఇలా అనేక చోట్ల ఇలాంటి విగ్రహాలు బయటపడ్డాయి. గుహల్లో చిత్రించిన బొమ్మల్లోనూ ఈ విగ్రహాలు వున్నాయి. భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ లజ్జ గౌరి ఆరాధన ఆచారం వుంది. భారతదేశంలో క్రీస్తు శకం ఆరునుంచి పన్నెండో శతాబ్దం వరకూ లజ్జ గౌరి ఆరాధన పతాక స్థాయిలో వున్నట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ముస్లిం దండయాత్రల తర్వాత.. విగ్రహారాధనను.. ముఖ్యంగా స్త్రీ విగ్రహారాధనను, అందునా నగ్నంగా వున్న స్త్రీ విగ్రహారాధనను నాటి పాలకులు నిరుత్సాహ పరిచారని తెలుస్తోంది. తర్వాత బ్రిటిష్ హయాంలో... నగ్న దేవతను ఆరాధించడం అనాగరిక, అశ్లీల చర్యగా పరిగణించారు. కాలక్రమంలో లజ్జ గౌరి ఆరాధన, ఆరాధకుల సంఖ్య తగ్గిపోయి వుండవచ్చు కానీ... పూర్తిగా ఏమీ మాసిపోలేదు.  లజ్జ గౌరికి సంబంధించిన ప్రస్తావన తొలుత మనకు కనిపించేది రుగ్వేదంలో... అదితి పేరిట. అదితి అంటే ఆదిశక్తి. In the first age of the gods, existence was born from non-existence. The quarters of the sky were born from Her who crouched with legs spread. The earth was born from Her who crouched with legs spread, And from the earth the quarters of the sky were born. Rig Veda, 10.72.3-4 .... .... Aditi is the sky Aditi is the air Aditi is all gods ... Aditi is the Mother, the Father, and Son Aditi is whatever shall be born. Rig Veda, I.89.10 విగ్రహ భంగిమను ప్రసవిస్తున్న స్త్రీ గా పరిగణిస్తారు. ఈ భంగిమను పలువురు చరిత్రకారులు పలు విధాలుగా నిర్వచించారు. ఎన్ని నిర్వచనాలు వున్నా... స్థూలంగా వాటి సారం ఒకటే. సంతానాన్ని, సంపదను, ధనధాన్యాదులను ప్రసాదించే శుభకర దేవత అని. ఈ దేవతను భారతదేశంలో రేణుక, మాతంగి, యల్లమ్మ అని కూడా పిలుచుకుంటారు. ఏ పేరుతో పిలుచుకున్నా... పార్వతీదేవి ప్రతిరూపంగానే కొలుచుకుంటారు. లజ్జ గౌరికి సంబంధించి మరో ఆసక్తికర కథ కూడా ప్రచారంలో వుంది. నిమ్న కులానికి చెందిన రేణుక తలను అగ్రకులస్థుడొకడు నరికివేశాడు. అయితే రేణుక చనిపోలేదు. తల స్థానంలో కమలాన్ని మొలిపించుకొని జీవించింది, దేవత అయింది. లజ్జ గౌరి విగ్రహానికి తల వుండదు. తల స్థానంలో.. పరిపూర్ణంగా వికసించిన కమలం వుంటుంది. చేతిలో కమలం/తామర తూడులు వుంటాయి. ఆభరణాలు ధరించి వుంటుంది. వికసిత కమలం శక్తికి సంకేతం. మనిషి శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలు.. సహస్రార చక్రం ఉద్దీపనకు వికసిత కమలం సంకేతం....
 • ప్రముఖ ఆర్టిస్ట్  మోహన్ పలు పత్రికల్లో కార్టూనిస్టుగా పని చేశారు. ఆంధ్రప్రభ, ఉదయం, సాక్షి దినపత్రికల్లో కార్టూనిస్ట్ గా సేవలు అందించారు. రాజకీయ కార్టూన్లు వేయడంలో మోహన్ దిట్ట. సామాజికంగా కోణంలో కార్టూన్లు వేసేవారు.  యానిమేటర్ గా కూడా ఎంతో పేరు తెచ్చుకున్న మోహన్ ఎంతోమంది ఆర్టిస్టులకు స్ఫూర్తిగా నిలిచారు .   1951 డిసెంబర్ 24న ఏలూరు లో జన్మించిన ఆయన.. 1970లో విశాలాంధ్ర లో సబ్ ఎడిటర్ గా జర్నలిస్ట్ జీవితం ప్రారంభించారు. అనేక పత్రికల్లో కార్టూనిస్టుగా పని చేసిన మోహన్‌ తన కార్టూన్లతో ఆద్యంతమూ ప్రజలను రంజింపజేశాడు.  ఉదయం దినపత్రిలో దాసరి నారాయణ రావు రచన ఆచారి అమెరికా యాత్రకు మోహన్‌ వేసిన బొమ్మలు ఎందరి ప్రశంసలో అందుకున్నాయి.  అలాగే రన్నింగ్ కామెంట్రీ  కార్టూన్స్ కూడా  ప్రశంసలు పొందాయి .  కమ్యూనిస్టు భావజాలం కలిగిన మోహన్‌ బొమ్మల్లో బక్క చిక్కిన మనుష్యులు, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే వ్యక్తులు, సంకెళ్లను తెగగొట్టడానికి యత్నించే కార్మికులు, కర్షకులు, హక్కుల కోసం నినదించేవారూ… ఇలా అనేకం సజీవంగా అనేక పాత్రలు  దర్శనమిస్తుంటాయి. మోహన్‌ భౌతికంగా మన మధ్య లేకపోయినా  తన చిత్రాలతో చిరకాలం జీవించే ఉంటాడు అనడం లో సందేహం లేదు.   మోహన్ తో  కీ.శే.  అరుణసాగర్ ఇంటర్వ్యూ   వీడియో చూడండి ...
 • దెయ్యాలున్నాయా? ఆత్మలున్నాయా? అనే ప్రశ్నలు వేస్తే.. ఒక్కొక్కరు ఒక్కో రకంగా జవాబులు చెబుతారు. కొంతమంది దెయ్యాలను నమ్ముతారు .. కొందరు అంతా ట్రాష్ అనేస్తారు. అయితే నమ్మినా నమ్మకపోయినా కొంత మంది దెయ్యాల గురించి ఆసక్తి చూపుతూ విషయం తెలుసుకుంటారు. తాజాగా బెల్జియం సముద్ర తీరంలో ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మునిగిపోయిన ఒక సబ్‌ మెరైన్‌ను నేవీ అధికారులు కొద్దీ రోజుల క్రితం గుర్తించారు. అయితే ఈ సబ్ మెరైన్ మునిగిన ప్రాంతంలో వింత శబ్దాలు వినిపిస్తున్నాయట. అటుగా ఏవైనా నౌకలు, చేపలు పట్టే జాలర్లు వెళుతుంటే చిత్రవిచిత్రమైన శబ్దాలు.. మనుషులు బాధపడుతున్నట్లుగా ఏడుపులు వస్తుంటాయట. మొదట్లో దీనిని పెద్దగా పట్టించుకోకపోయినా తాజా సబ్‌ మెరైన్‌ బయటపడ్డంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భూమికి 98 అడుగుల లోతులో యూబీ-2 టైప్‌ సబ్‌ మెరైన్‌ ఎప్పుడో మునిగిపోయింది. ఈ ఘటనలో  అందులో ప్రయాణిస్తున్న 23 మంది మరణించారు. దీనిని నేవీ సిబ్బంది గుర్తించింది. ఇంకో విషయం ఏమిటంటే.. తమాషా ఏమిటంటే ... సబ్‌ మెరైన్‌ ఇంకా కండీషన్‌లోనే ఉందట. ఇదిలాఉంటే.. అందులోని 23 మృత దేహాలు కూడా పెద్దగా పాడవకుండా ఉన్నాయట. ఇదీ మరీ ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ 23 మందే దెయ్యాలుగా మారారని.. వాళ్లే ఇటుగా ఎవరైనా వస్తుంటే.. చిత్రవిచిత్రంగా శబ్దాలు చేస్తున్నారేమోనని  ఆ ప్రాంతానికి వెళ్లే జాలర్లు అనుకుంటున్నారు. ఆ విషయమే ఆనోటా ఈ నోటా పడి మీడియా దృష్టి కొచ్చింది. మరి ఎవరైనా ఈ అంశంలో పరిశోధన చేయడానికి వెళ్తారో లేదో ? వేచి చూడాలి. ...
 • ఆ జంట తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు . ఎవరైనా కోట్లాది రూపాయల ఆస్తులు వదులుకుని సన్యాసం స్వీకరిస్తారా ?  ఈ రోజుల్లో అయితే సన్యాసం తీసుకోవడానికి కూడా డబ్బులు అడుగుతారు.  కానీ  ఆ దంపతులు 100 కోట్ల ఆస్తిని వదిలి స్వచ్చందంగా సన్యాసులుగా మారబోతున్నారు.       జైనులకు చెందిన ఆ భార్యాభర్తలు తీసుకున్న సంచలన నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని సుమీత్ రాథోడ్(35), అనామిక(34) లకు రూ.100 కోట్లకు పైగా ఆస్తి ఉంది. వీరికి మూడేళ్ల పాప కూడా ఉంది. ఈ ఇద్దరు వందకోట్ల ఆస్తితో పాటు తమ మూడేళ్ల చిన్నారిని వదులు కుని కొన్ని రోజుల్లో సన్యాసం స్వీకరించనున్నారు. గుజరాత్ లోని సూరత్‌కు చెందిన సుధామార్గి ఆచార్య రామ్‌లాల్ మహరాజ్ కి  వీరు శిష్యులుగా మార బోతున్నారు. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.  సెప్టెంబర్ 23న ఇందుకు తాము తొలి అడుగు వేయనున్నట్లు సుమీత్ దంపతులు  ప్రకటించారు . మూడేళ్ల కూతురు ఐభ్య పరిస్థితి ఏమౌతుందో ఆలోచించుకోవాలని, ఆధ్యాత్మికత వైపునకు వెళ్లాలనుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని బంధువులతో పాటు  స్నేహితులు, తెలిసినవారు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేశారు. అయినా కూడా   లాభం లేకపోయింది.  ప్రముఖ వ్యాపారి, సిమెంట్ ఫ్యాక్టరీల అధినేత అయిన సుమీత్ తండ్రి రాజేంద్ర సింగ్ రాథోడ్ వీరి నిర్ణయానికి మద్ధతు ప్రకటిస్తారా ? లేదా అనేది తేలాల్సి ఉంది .నెల రోజుల క్రితమే  సుమీత్ తాను ఆధ్యాత్మికత దిశగా వెళ్తున్నానని చెప్పగా భార్య అనామిక  కూడా భర్త దారినే ఎంచుకున్నారు. దీంతో కుటుంబం లో అందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. నచ్చ చెప్పే యత్నాలు ఇంకా జరుగుతున్నాయి.   సుమీత్ రాథోడ్  కొన్నాళ్ళు లండన్ లో ఉండి కుటుంబ వ్యాపారాలను చూసే వారు. అనామిక కూడా ఇంజనీర్ గా ఒక మైనింగ్ కంపెనీ లో పని చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ మౌన దీక్షలో ఉన్నారు. ఈ నెల 23 న నేరుగా సూరత్ వెళ్లి సన్యాసం స్వీకరించనున్నారు. ...
 • సాధారణంగా అమెరికా శ్వేత సౌధంలోకి అడుగుపెట్టడం అసలు సాధ్యమయ్యే పనే కాదు . అందులో అధ్యక్షుడిని కలవడం అంటే మామూలు విషయం కాదు. కానీ వాషింగ్టన్‌ సబర్బ్‌కు చెందిన పదకొండేళ్ల బాలుడు  అమెరికా అధ్యక్షుడిని కలిసి ఆయన మెప్పు పొందాడు.అయన చేత శభాష్ అనిపించుకున్నాడు.   అసలు కథ లోకి వెళ్తే .....    ఫ్రాంక్‌  జైక్సియా అనే 11ఏళ్ల బాలుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు వీరాభిమాని.  ఒక రోజు శ్వేతసౌధంలో గడ్డి కత్తించే పని చేయాలని ఉందని, అది తనకు ఎంతో గౌరవంగా ఉంటుందని ఫ్రాంక్‌  ఆగస్టులో ట్రంప్‌కు లేఖ రాశాడు. అయితే ఫ్రాంక్‌ లేఖకు స్పందించిన అధ్యక్ష భవనం పరిపాలన సెక్రటరీ షారా సండెర్‌  ఫ్రాంక్ కి ఒక అవకాశం ఇచ్చారు. దీంతో ఫ్రాంక్‌ శ్వేతసౌధంలోని రోస్‌ గార్డెన్‌ లాన్‌లో మిషన్‌తో గడ్డి కత్తిరించాడు. సాధారణంగా లాన్‌లో గడ్డి కత్తిరించినందుకు 8డాలర్లను ఇస్తారట.  కానీ వాటిని కూడా ఫ్రాంక్ తిరస్కరించాడు.  ఇక్కడ ఉచితంగా పని చేయడం గౌరవంగా భావిస్తానని బాలుడు చెప్పడంతో  ట్రంప్‌  షాక్ అయ్యాడు . అంతేకాదు  కొద్ది సేపు ఫ్రాంక్‌తో ముచ్చటించాడు ట్రంప్‌. పెద్ద అయ్యాక ఏం అవుతావని ప్రశ్నిస్తే, అమెరికా నావికా దళంలో పనిచేయాలని ఉందని ఫ్రాంక్‌ చెప్పాడు. ఆ మాటలకు  ట్రంప్‌ కూడా ఖుష్ అయ్యాడు. 'దేశ భవిష్యత్తు ఇక్కడే ఉంది, శభాష్ ... మనం చాలా అదృష్టవంతులం' అన్నాడు.  ట్రంప్  తో మాట్లాడిన తర్వాత  ఆ కుర్రోడు కూడా  మురిసిపోయాడు.  ...
 • బ్లాక్‌ అండ్‌ వైట్‌ రంగుల కలయికతో ఉండే పాండాలు చూడ ముచ్చటగా ఉంటాయి .  చైనాలో 37 ఏళ్ల పాటు జీవించిన జెయింట్‌ పాండా  ఇటీవలే  చనిపోయింది. ఎలుగు బంటి  జాతికి చెందిన ఈ పాండాలు  సాధారణంగా 20 ఏళ్ళు బతుకుతాయి. కానీ  జెయింట్ పాండా మరో 17 ఏళ్ళు అదనంగా బతికింది. ఇది దొరికిన లోయ పేరుమీదనే దీనికి ‘బాసి’ అని పేరు పెట్టారు. చైనా లో  ఇదోక చిన్నసైజు సెలెబ్రిటీ. బాసి బైక్‌ నడపగలదు, బాస్కెట్‌బాల్‌ ఆడగలదు, బరువుల కూడా మోయగలదు. దీని పుట్టిన రోజును అక్కడ ఎంతో ఘనంగా నిర్వహించే వారు. 35వ పుట్టినరోజు సందర్భంగా ఇది జీవించిన జూలో రెండు మీటర్ల రాతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 1987లో జరిగిన దక్షిణాసియా క్రీడలకు వాడిన మస్కట్‌కు దీని రూపమే స్ఫూర్తి. జెయింట్‌ పాండాలకు ప్రత్యుత్పత్తి సామర్థ్యం చాలా తక్కువ అంటారు.  చైనా జాతీయ జంతువు జెయింట్‌ పాండా. మారుతున్న పర్యావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య క్రమంగా తగ్గుతుంది. 2008 సంవత్సరంలో జరిపిన సర్వే ప్రకారం ప్రపంచంలో కేవలం 1600 పాండాలు మాత్రమే ఉన్నాయి. అడవిలో లేత వెదురు చిగుళ్లను తింటూ బతికే ఈ అందమైన, అమాయకమైన జీవి క్రమంగా అంతరించిపోతోంది. ప్రకృతి ప్రేమికుడు, ఫ్రాన్స్‌ కళాకారుడు పాలో గ్రాంజియన్‌ వీటి సంరక్షణ కోసం కృషి చేశారు.   పాలో పాండాల వివరాలన్నీ సేకరించాడు. వీటి మనుగడపై అవగాహన కల్పించేలా ప్రదర్శనలు ఇచ్చారు.  వరల్ట్‌ వైల్ట్‌ లైఫ్‌ ఫండ్‌ సహకారంతో వందలాది పాండా బొమ్మలను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాలలో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాండాల సంఖ్యకు సమానంగా పాండా బొమ్మలను తయారు చేశారు. వీటి తయారి కూడా ఎకో ఫ్రెండ్లీగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చిత్తు కాగితాల గుజ్జు, పనికిరాని వస్తువులతో పాండాలను తయారుచేశారు. ఈ ప్రాజెక్ట్‌కి పాండాస్‌ లెఫ్ట్‌ ఇన్‌ ద వైల్డ్‌ అని పేరు పెట్టారు.  తాను తయారుచేసిన పాండాలతో ఫస్ట్‌ థాయిలాండ్‌లో ప్రదర్శన ఏర్పాటుచేశారు. ఒకే మాదిరిగా ఉన్న 1600వందల పాండా బొమ్మలను చూసి ప్రజల్లో అవగాహన పెరిగింది. ఈ ప్రదర్శనకు వేలాదిగా సందర్శకులు వచ్చారు. ఆ తర్వాత ఫ్రాన్స్‌, మలేసియా, జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్‌, తైవాన్‌, హాంగ్‌కాంగ్‌ తదితర 20 దేశాలలో ప్రదర్శనలు ఏర్పాటుచేశారు.  పాలో ప్రయత్నం ఫలించింది. 2015 సంవత్సరంలో జరిగిన సర్వేలో పాండాల సంఖ్య 200 పెరిగింది. అంతే పాలో తన ప్రదర్శనలో ఉంచే పాండాల సంఖ్యను కూడా పెంచారు. దక్షిణ కొరియాలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో 1600పాండాలతో పాటు 200 చిన్నారి పాండాలను ఉంచారు. ఈ ప్రదర్శన తర్వాత వీటిని ఆసక్తి ఉన్నవారు కొనుక్కోవచ్చు. అలా వచ్చిన డబ్బును వరల్ట్‌ వైల్ట్‌ లైఫ్‌ ఫండ్‌లో జమచేస్తారు.  పాండా జాతిని కాపాడటమే తన ధ్యేయమంటూ వివిధ దేశాలలో పాండాలతో కలిసి పాలో పర్యటిస్తున్నారు. వీడియో చూడండి. ...
 • అమెరికాను  వరదలు ,తుఫాన్లు, భూకంపాలు, సునామీ హెచ్చరికలు  వణికిస్తున్నాయి.  అమెరికాలోని హ్యూస్టన్,లూసియానా  రాష్ట్రాలు ఇప్పటికే వర్షాలు వరదలతో విలవిల లాడుతుండగా .. మెక్సికో తీరంలో భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్‌ స్కేలుపై 8.1 తీవ్రత నమోదైన  ఈ భూకంపం మెక్సికో నైరుతి తీరాన్ని మొత్తాన్నిగజ గజ  వణికించింది. భూకంపం ప్రభావంతో భారీ అలలతో కూడిన సునామీ సంభవించే ప్రమాదం ఉందని అధికారులు 8 రాష్ట్రాల ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. పిజిజియాపన్ పట్టణానికి నైరుతి దిశగా 123 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 33 కిలోమీటర్ల అడుగున భూకంపం సంభవించినట్టు వెల్లడించింది. దీనికారణంగా భారీ సునామీ సంభవించే అవకాశాలున్నట్టు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. భూకంపంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటి కొచ్చి రోడ్ల పైనే ఉన్నారు.  వేలాది మందిని బలితీసుకున్న 1985 భూకంపం తర్వాత... మళ్లీ అంతటి స్థాయిలో భూకంపం రావడం ఇదే మొదటిసారి అని మెక్సికో అధికారులు చెబుతున్నారు. దాదాపు 90 సెకండ్లపాటు ప్రకంపనాలు తీవ్ర ఆందోళనకు గురిచేసినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగి  ఉండొచ్చని భావిస్తున్నారు.   ఇప్పటి వరకు 32 మంది  మృతి చెందారు.  మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు న్యూజిలాండ్ అధికారులు సైతం తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశాలున్నాయా లేదా అనే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే 12 గంటల ప్రయాణమంత దూరంలో ఉన్నందున న్యూజిలాండ్‌కు సునామీ వచ్చే అవకాశం లేదని న్యూజిలాండ్ సివిల్ డిఫెన్స్ అండ్ ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడించింది....
 • బ్లూ వేల్ .....   నిజంగా  అది తిమింగలమే.  దాన్ని  తాకితే చాలు మింగేస్తుంది . ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చుంటే  ఇంకెందరో దానిపాలిట పడి బలి అయిపోవాల్సిందే. బ్లూ వేల్  ఒక సోషల్ మీడియా గేమ్. ఒక రకమైన హిప్నాటిక్ గేమ్. డౌన్‌లోడ్ చేసుకొని ఆడడం ప్రారంభిస్తే దాని ఫైనల్ టాస్క్  ఆడే వాళ్ళ జీవితాలకు  ముగింపు పలికేస్తుంది. మొదట చిన్న చిన్న సవాళ్లను విసిరే ఈ డేంజరస్ గేమ్  చివరకు  ఆత్మహత్య కు  ప్రేరేపిస్తుంది. 10 నుంచి 14 ఏండ్ల పిల్లలే లక్ష్యంగా రూపొందించిన ఈ ఆట భావోద్వేగాలతో పసి వాళ్ళను మృత్యువులా మింగేస్తుంది.రష్యాలో ఇప్పటికే  వందలాది  టీనేజర్లను పొట్టన బెట్టుకున్న గేమ్.. భారత దేశంలో పిల్లలను బాలి తీసుకుంటోంది.  ఈ డేంజరస్ గేమ్ ను  కనుగొన్న ఫిలిప్ బుడేకిన్‌ను రష్యా పోలీసులు అరెస్టుచేసినా, ఆ ఆట మాత్రం  వివిధ దేశాలకు విస్తరిస్తూనే ఉంది. ఇండియాలో బ్లూవేల్ గేమ్ మరణాల సంఖ్య  పెరుగుతోంది. స్కూల్ స్టూడెంట్స్, టీనేజర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ డేంజర్ గేమ్ ఒక్కొక్కరిని బలి తీసుకుంటోంది. బ్లూవేల్ లాంటి డేంజర్ గేమ్‌ల బారిన పిల్లలు, టీనేజర్లు పడకుండా పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. వారి ప్రవర్తనలో తేడా గమనిస్తే వెంటనే సైకాలజిస్టులను సంప్రదించడం మంచిదని చెప్తున్నారు. ఇప్పటికే ఎవరైనా బ్లూవేల్ గేమ్ బారిన పడితే వారిని గుర్తించే అంతటితో గేమ్ ఆడకుండా ఆపేయాలని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన బ్లూవేల్‌ గేమ్‌ను నిషేధించాలంటూ కేరళ ముఖ్యమంత్రి ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. అమాయక పిల్లల ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. రాజ్యసభలోనూ పలువురు సభ్యులు బ్లూవేల్‌ అంశాన్ని లేవనెత్తారు. అందులోని టాస్క్‌లను పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ముంబైలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న అంశాన్ని ఎంపీ అమర్‌ శంకర్‌ సబ్లే వివరించారు. ఆన్‌లైన్‌లో ఇలాంటి డెత్‌ గేమ్స్‌ మరిన్ని ఉన్నాయని, వాటన్నింటినీ నిషేధించాలని మరో ఎంపీ వికాశ్‌ మహాత్మా పేర్కొన్నారు. బ్లూవేల్‌ గేమ్‌ కారణంగా మహారాష్ట్రలో ఓ విద్యార్థి మరణించడం, మరో విద్యార్థి ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ఆ రాష్ట్రంలో కలకలం చెలరేగింది. దాంతో ఆ వెబ్‌సైట్‌ను వెంటనే నిలిపివేయాలంటూ మహారాష్ట్ర అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. ఆ గేమ్‌ వివరాలు పూర్తిగా సేకరిస్తామని.. దాన్ని నిలిపేసేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆ రాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ గేమ్ ప్రభావం కనబడుతున్న నేపథ్యంలో దీన్ని తక్షణమే నిషేధించాల్సిన అవసరం ఉంది. ...
 • ఒకినోషిమా జపాన్‌లోని ఒక దీవి అది.. కొన్ని వందల ఏళ్లుగా ఒకినోషిమా దీవిలోని షింటో పూజారి అక్కడి దేవతను ఆరాధించటం ఆచారంగా వస్తోంది. కేవలం పురుషులకు మాత్రమే ప్రవేశానుమతి ఉన్న దీవి అది. కొరియా ద్వీపకల్పాన్ని, చైనాను కలిపే చోట ఈ దీవి ఉంటుంది. గతంలో ఇక్కడ అధికారులు చేపట్టిన తవ్వకాల్లో ఎన్నో విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు లభించాయి. మహిళలను ఆ ఛాయలకు కూడా రానివ్వరు. ఆ పవిత్ర ప్రాంతంలో ప్రవేశించే పురుషులు  అక్కడి ఆచారాలను తుచ తప్పకుండా పాటించాల్సిందే. దీవికి వెళ్ళాలంటే ముందుగా అక్కడి సముద్రంలో నగ్నంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  ఈ దీవికి ఇటీవలే  యునెస్కో ప్రపంచ వారస్వత గుర్తింపు లభించింది. యునెస్కో గుర్తింపుతో ఈ దీవికి విపరీతమైన ప్రచారం దక్కనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి పర్యాటకులు పెద్ద ఎత్తున వెల్లువెత్తే అవకాశం ఉంది. దీంతో ఒకినోషిమా దీవి ప్రత్యేకత, పవిత్రత దెబ్బతింటాయని అక్కడి పూజారులు భావిస్తున్నారట. ఈ కారణం చేతనే భవిష్యత్తులో ఇక్కడికి పర్యాటకులను అనుమతించబోమని, కేవలం పూజారులనే రానిస్తామని చెబుతున్నారు.ఈ ఏడాది ఆ దీవిలో కేవలం రెండు గంటలపాటు జరిగే వేడుకకు గాను 200 మందిని మాత్రమే అక్కడి పూజారి అనుమతించారు.అయితే, ఆడవారికి ప్రవేశం నిరాకరించటంపై ఓ అధికారి స్పందిస్తూ.. దీనిపై తామేమీ చేయలేమని వ్యాఖ్యానించారు. మహిళలు సముద్రంలో ప్రయాణించి అక్కడికి చేరుకోవటం చాలా ప్రమాదకరమని భావిస్తారని, శతాబ్ధాలనాటి ఆనవాయితీని అక్కడి పూజారులు మార్చుకోబోరని  అన్నారు. ఇలాంటి నిషేధాన్ని  మహిళలను రక్షించటానికే పెట్టిఉంటారని అన్నారు. ఇటీవల పోలండ్‌లో సమావేశమైన యునెస్కో హెరిటేజ్‌ కమిటీ  తాజాగా ప్రకటించిన 33 ప్రదేశాల్లో ఒకినోషిమా ఒకటి. దీంతోపాటు భారత్‌లోని అహ్మదాబాద్‌ నగరంతోపాటు మానవుడు మొదటిసారిగా స్థిరనివాసం ఏర్పరుచుకున్నట్లు గుర్తించిన దక్షిణ ఫసిఫిక్‌ దీవుల్లోని టపుటపువాటీ అనే పొలినేషియన్‌ ట్రయాంగిల్‌ కూడా ఉంది. అలాగే, యూకేలో లేక్‌ డిస్ట్రిక్ట్‌, ఆఫ్రికా నుంచి నల్లజాతీయులను బానిసలుగా తీసుకొచ్చిన బ్రెజిల్‌లోని రియోడిజనీరోలోని వలొంగో వార్ఫ్‌ అనేవి కూడా ఉన్నాయి....
 • (Sheik Sadiq Ali )     ................................  వరంగల్ నగరం నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ములుగు దాటాక జంగాలపల్లి వస్తుంది.అక్కడి నుంచి కుడి వైపు సిమెంట్ రోడ్డులోకి తిరిగి 13 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే కొత్తూరు గ్రామం వస్తుంది.అక్కడి నుంచి రెండున్నర కిలోమీటర్లు అడవిలోకి ఏటవాలుగా ప్రయాణిస్తే దేవునిగుట్ట చేరుకోవచ్చు.ఈ మార్గంలో దాదాపు కిలోమీటర్ దూరం వాగులాంటి జలధార లో నుంచే ప్రయాణించాలి. ఆ గుట్ట పైకి వెళ్ళాక వందల ఎకరాల సమతల ప్రదేశం కన్పిస్తుంది.అందులో ఒకానొక చోట ప్రాచీన గుడి,దాని వెనుక కొద్ది దూరంలో ఒక పెద్ద చెరువు ఉంటుంది.(గుడి విశేషాలు మరో పోస్ట్ రాస్తాను). ఆ చెరువు మమ్మల్ని బాగా ఆకర్షించింది. విశాలమైన ఆ చెరువుకు మూడువైపులా కొండలు,ఒకవైపు కొండరాళ్ళతో కట్ట,దానిమీద మట్టి కప్పి ఉంటుంది.మేము వెళ్ళేటప్పటికి కొండల మీద కురిసిన వర్షంతో చెరువు నిండి ఉంది.గత నాలుగు రోజులుగా అక్కడ వర్షాలు కురుస్తున్నాయట. చెరువు మధ్యలో నేరేడు చెట్ల వనం వందలాది చెట్లతో నిండి ఉంది.మాకు దారి చూపించిన గ్రామ ప్రముఖుడు రవీందర్ రావు ఆ చెరువు గురించి ఒక విశేషం చెప్పారు. కొండల మధ్య అన్ని నీళ్ళతో ఉన్న చెరువు సాధారణంగా ఎండి పోదు.కానీ వర్షాలు 15 రోజులు కురవకపోతే చెరువు మొత్తం ఎండిపోతుంది.చుక్క నీళ్ళు ఉండవు అని రవీందర్ చెప్పాడు.ఆ నీళ్ళు ఎమైపోతాయో ఎలా ఇంకిపోతాయో తెలియదు అదే మాకు అర్ధం కావటం లేదు అని చెప్పాడు.అప్పుడు మాకు మేము నడిచి వచ్చిన జలధార గుర్తుకు వచ్చింది. వాస్తవానికి ఆ ధార కొండల పైనుంచి కాకుండా రెండు అతి పెద్ద బండల కింది నుంచి రావటం గమనించాం.ఆ రెండు రాళ్ళు చెరువుకు వ్యతిరేక దిశలో ,చెరువు కట్టకు 50 అడుగుల కింద ఉన్నాయి. చెరువుకు,రాళ్ళకు,ఆ నీళ్ళకు సంబంధం ఏమైనా ఉందా ?అనే అనుమానం మాకు వచ్చింది.దాంతో మా బృందంలోని నలుగురు,ఇద్దరు గ్రామస్తులు కలిసి చెరువు కట్టకు రెండువైపులా పరిశోధించాం.ఒక చోట చెరువు లోపలి వైపు చిన్న సొరంగం కన్పించింది. దాదాపు ఎనిమిది అడుగుల పొడవున్న ఒక కట్టెను ఆ సొరంగంలోకి దూర్చాం.కర్ర మొత్తం లోపలికి పోయినా అడుగు తగల లేదు. దాంతో సొరంగం పైన వున్నా కొన్ని రాళ్ళను తొలగించి చూశాం.లోతెంతో తెలియలేదు కానీ,లోపల నీళ్ళు ప్రవహిస్తున్న శబ్దం మాత్రం విన్పించింది. అక్కడి నుంచి పైకి వెళ్లి కట్టకు అవతలి వైపున చూడగా ఆ రెండు బండరాళ్ళు ,వాటి కింద నుంచి జలధార కన్పించాయి. ఆ ధార అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించి లక్నవరం చెరువులో కలిసిపోతుంది అని స్థానికులు చెప్పారు.దాంతో మాకు విషయం మొత్తం అర్ధం అయ్యింది. కొండల్లో కురిసిన నీరు ముందుగా జలాశయంలోకి చేరుతాయి. అందులోని నీరు లక్నవరం చేరటానికి వీలుగా చెరువు లోపలి భాగం నుంచి ఒక నీటి సరఫరా వ్యవస్థను రూపొందించారు. దానిమీద మళ్ళీ బండ రాళ్ళు,మట్టీ కప్పారు.వాటి మీద చెట్లు మొలిచి మళ్ళీ సహజమైన అడవిలా మారింది. ఈ లక్నవరం చెరువు గణపతి దేవుడి సోదరి అయిన లక్కమాంబ పేరుమీద 1230-1240 సంవత్సరాల మధ్యకాలంలో స్వయంగా గణపతి దేవుడు త్రవ్వించాడు అని చెప్తారు. ఈ లెక్కన ఈ నీటి సరఫరా వ్యవస్థను ఎన్ని వందల సంవత్సరాల క్రితం రూపొందించారో అర్ధం చేసుకోవచ్చు. కాకతీయుల ముందు చూపు,సాంకేతిక పరిజ్ఞానాన్ని అంచనా వెయ్యొచ్చు....
 • (Sheik Sadiq Ali)  ........................................... 'శిలల పై శిల్పాలు చెక్కినారూ ,,,; పాట గుర్తుంది కదూ! శిల్పం అంటేనే శిలలపై చెక్కేది.అదీ కాకపొతే సైకత శిల్పం (ఇసుకతో).ఇవి రెండూ కాకుండా ,రెంటి లక్షణాలూ ఉంటే ..? మరి అది ఏ శిల్పం ?ఏ కాలానిదీ? భూపాలపల్లి జిల్లా ములుగు సమీపంలోని కొత్తూరు శివారు కొండలపై ఉన్న దేవుని గుట్ట ఆలయం పైన శిల్పాలు చూసి అదే అనుమానం నాకూ వచ్చింది.కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు భారత దేశం మొత్తం మూడుసార్లు చుట్టి వచ్చిన నాకు ఇలాంటి శిల్పాలు ఎక్కడా కనిపించ లేదు.అందుకే వాటిని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.వీటి మీద చర్చ జరగాలని కోరుకుంటున్నాను. అందుకు గాను అక్కడ ఉన్న నేపధ్యాన్ని కాస్త వివరిస్తాను.నా దృష్టికి వచ్చిన విశేషాలు అందజేస్తున్నాను. చర్చకు ఆహ్వానం. దేవునిగుట్ట మీద ఉన్న ఆలయం ఏ కాలానిదో అంచనా వేయలేక పోతున్నా. చతురస్త్రాకారంలో ఉన్న ఒకే ఒక గది 12X12 ఉంటుంది పైకి వెళ్తున్న కొద్దీ సన్నగా గోపురం ఆకృతి సంతరించు కుంటుంది. కానీ,దానికి గోపుర లక్షణాలు లేవు. దాని నిర్మాణానికి ఉపయోగించిన మెటల్ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది.రాయి కాదు,ఇటుక కాదు,కనీసం చెక్క కూడా కాదు.మరేమిటి? ఆ గుట్ట మీద రెండు రకాల రాళ్ళు ఉన్నాయి.మొదటి రకం మామూలు గుండు రాళ్ళు.ఒక్కోటి సుమారు 10 నుంచి 15 కిలోల బరువు ఉండొచ్చు.అలాంటి రాళ్ళు అన్నీ ఒకదానిమీద మరొకటి పేర్చి కోట గోడలా నిర్మించారు.ఇది శాశ్వత కట్టడం కాదు.ఒక రాయికి,ఇంకో రాయికి ఎలాంటి జాయింట్ లేదు.వేటికవి విడివిడిగానే ఉన్నాయి.ఇక రెండో రకం రాళ్ళు...వీటికే ప్రత్యేకత ఉంది.ఇవి చాలా పెద్ద సైజుల్లో భూమిలో పాతుకోనిపోయి గుట్టల్లా ఏర్పడ్డాయి.ఇసుక,గులకరాళ్ళు,ఇనుప రజను కలిపి ముద్ద చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి.మరీ ధృడంగా ఉండవు.మరో గట్టిరాయి తీసుకొని కొడితే పప్పుపప్పు అవుతాయి.అచ్చం ఇలాంటి రాళ్ళే మల్లూరు గుట్టల్లో చూసాను.అక్కడ ఆ రాళ్ళను పిండి చేసి దాన్ని గుండ్రటి ఆకారంగా మలిచి సమాధుల పైకప్పులుగా వినియోగించారు.(గతంలో మల్లూరు పర్యటన సందర్భంగా వాటి గురించి రాసాను.)ఇక్కడ దేవుని గుట్ట మీద ఈ రాళ్ళను మరో రకంగా వినియోగించారు.అదే ఈ ఆలయ విశిష్టత. ముందు ఈ రాళ్ళను పెద్దఎతున సేకరించి ,పగులకొట్టి పిండిపిండి చేశారు. ఆ పిండిని ప్రత్యెక ద్రావకంతో తడిపారు. తరువాత వాటిని అచ్చు పోశారు.ఒక్కొక్కటీ రెండు అడుగుల పొడవు,రెండు అడుగుల వెడల్పు,ఎనిమిది అంగుళాల ఎత్తూ ఉన్నాయి.(సౌలభ్యం కోసం వీటిని పలకలు అని వాడతాను)వీటితో ఆలయ ప్రహరీ గోడ కట్టారు.వీటి మీద ఎలాంటి శిల్పాలూ,బొమ్మలూ లేవు.ప్లెయిన్ గా ఉన్నాయి. రెండు అడుగులకు మించి మరింత పెద్ద సైజులో చేస్తే పటిష్టత కోల్పోయి విరిగే అవకాశాలు ఉండటం దీనికి కారణం కావచ్చు.ఇక ఆలయ గోపురం గురించి చూద్దాం. దీని గోడలు రెండు వరుసల పలకలతో కట్టారు.వీటికి ఉన్న ప్రత్యేకతే ఈ ఆలయ విశేషం.ఒక వరుస పలకల ముఖం బయటికి,మరో వరుస పలకల ముఖం లోపలి వైపుకి ఉన్నాయి.ప్రతీ పలక మీద ఏదో ఒక శిల్పం ఉంది.లోపలా,బయటా ఎటు చూసినా శిల్పాలే కనిపిస్తాయి.ఒక్క పలక కూడా ఖాళీగా లేదు.ఒక్కో శిల్పం ఎనిమిది,ఆరు,నాలుగు,రెండు అడుగుల ఎత్తు ఉంది.పలక సైజు రెండు అడుగులు,శిల్పం సైజు ఆరు,ఎనిమిది అడుగులు.మరి ఇది ఎలా సాధ్యం?ఇక్కడే ఎక్కడా లేని ప్రతిభ కనబరిచారు. ఇక్కడే వాళ్ళు ఒక టెక్నిక్ ఉపయోగించారు.ముందుగా శిల్పం సైజు యెంత ఉండాలో నిర్ణయించుకొని ఆ సైజులో పిండితో పలకల అచ్చు పోశారు. అది తడిగా ఉండగానే దానిమీద ఉలితో అవసరం లేకుండానే ,చేతులతో,ఇతర పరికరాలతో శిల్పాన్ని రూపొందించారు.(ఇప్పుడు వివిధ సముద్ర తీరాల్లో మనం చూస్తున్న సైకత శిల్పాల తరహాలో అన్న మాట.) అందుకే ఈ శిల్పాల ఫినిషింగ్ కాస్త మొరటుగా కన్పిస్తుంది.దేవాలయాల మీద నల్లరాతి శిలలతో రూపొందిన శిల్పాల సౌకుమార్యం ఇందులో కన్పించదు.ఆ అచ్చులు కొద్దిగా పచ్చిగా ఉండగానే రెండేసి అడుగుల చొప్పున మైసూర్ పాక్ లా కోసేశారు.అందుకే యెంత పెద్ద శిల్పమైనా ఒకేచోట ఒక్కోటి రెండడుగుల సైజులో మూడు,నాలుగు ముక్కలుగా తయారయ్యింది.వాటిని అదే క్రమంలో అమరుస్తూ ఆలయం నిర్మించారు.అవి విడిపోకుండా ,అలాగే కలిసి ఒకే విగ్రహంలా ఉండటానికి రెండు పలకల మధ్యలో కనపడీ కనపడకుండా మళ్ళీ అదే పిండి మిక్చర్ తో అతికించారు.అయితే ,కాలక్రమంలో ప్రకృతి కారణంగా మధ్యలో వేసిన జాయింట్లు చాలా వరకు కరిగిపోయి విగ్రహాలు ముక్కలుగా ఉండిపోయాయి. ఈలోగా గుప్త నిధుల అన్వేషకులు గుడిచుట్టూ,గర్భగుడి మధ్యలో అరాచకంగా తవ్వకాలు జరపటం వల్ల విగ్రహాలు అటూ ఇటూ జరిగి,ఒరిగిపోయాయి. అదీ ఇప్పుడు ఉన్న పరిస్థితి. స్థానికులు చెప్పిన దాని ప్రకారం 20 ఏళ్ళ క్రితం ఆ గుడిలో పెద్ద శివలింగం,పానవట్టం ఉండేవి.కానీ వాటిని సమీపంలోని గ్రామస్తులు ఎవరో తరలించుకొని పోయారు.ఐదేళ్ళ క్రితం కొత్తూరు ప్రజలు ఖాళీగా ఉన్న గర్భగుడిలో లక్ష్మీనరసింహ విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు,ఏడాదికి ఒకసారి జాతర నిర్వహిస్తున్నారు.గర్భ గుడి ఎదురుగా ఎనిమిది అడుగుల ఎత్తు,ఒక అడుగు వెడల్పు ఉన్న పాలరాతి ఆయక స్థంభం కూడా ఉండేది. దానిమీద కూడా కొన్ని విగ్రహాలు చెక్కి ఉన్నాయి.ఆ స్తంభాన్ని కూడా ముష్కరులు విరగ్గొట్టి పక్కన పడేశారు.అవి అక్కడే ఒక పక్కన పడి ఉన్నాయి.ఆ ఫోటోలు కూడా ఇక్కడ పెడుతున్నాను. అయితే ,ఈశిల్పాల గురించి హరగోపాల్ సర్ కొంత విశ్లేషణ ఇచ్చారు. ఇలా శిల్పాల అమరిక భారతదేశంలో మరెక్కడా లేదనీ,కంబోడియాలో ఇలా శిల్పాలను ముక్కలుగా అమర్చిన కొన్ని ఆలయాలు ఉన్నాయని చెప్పారు.అలాగే శిల్పాలలో బౌద్ధ,శైవ ఆనవాళ్ళు ఉన్నాయని,కొన్ని శిల్పాలు ఉత్తరాది లక్షణాలతోనూ ఉన్నాయన్నారు.వీటి మీద సమగ్ర అధ్యయనం అవసరమనీ ఆయన అభిప్రాయ పడ్డారు.శాతవాహనులకన్నా ముందా?మహాయాన బౌద్ధ కాలమా?అనేది ఇప్పుడిప్పుడే నిర్ధారించ లేము అని చెప్పారు. ...
 • (Jyothi Valaboju )       ప్రతి మనిషికి ఏదో ఒక అలవాటు ఉంటుంది. అది వారికి ఇష్టమైన అలవాటైనా, మరి కొందరు అది దురలవాటు, వ్యసనమూ అని ఆక్షేపిస్తారు. కాని అలవాటు పడిన వారు మాత్రం ఆ అలవాట్లను సమర్ధిస్తారు. దానికి వ్యతిరేకంగా ఎవరేమన్నా వినరు. ఏ అలవాటుకైనా బానిసగా మారితే అది వ్యసనంగా మారుతుంది. ఈ అలవాట్లకు కవులు కూడా వశులే. కొందరు సమర్ధించారు, కొందరు వ్యతిరేకించారు. భుగభుగమని పొగలెగయగ నగణితముగ నాజ్యధార లాహుతి కాగా నిగమాది మంత్రయుతముగ పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్ !! పొగ తాగితే అది భుగభుగమని గుప్పున ఎగిసిపడేలా ఉండాలి. వేదమంత్రాలతో యజ్ఞం చేస్తున్నంత దీక్షగా, పవిత్రంగా పొగ త్రాగనివాడు దున్నపోతై పుడతాడని ఆ కవి ఉవాచ. దీనికి మరో కవి తందానా అన్నాడు చూడండి. ఖగపతి అమృతము తేగా భుగభుగమని చుక్కయొకటి భూమిని వ్రాలెన్ పొగ చెట్టయి జన్మించెను పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్ !! ఈ పద్యం భారతంలోని సౌపర్ణోపాఖ్యానం కథలో చెప్పబడింది.) ఈ వింత చూసారా? అమృతం చుక్క భూమిపై పడి పొగ (పొగాకు) చెట్టై పుట్టిందంట) అంటే పొగ త్రాగేవారందరూ అమృతపానం చేస్తున్నట్టా?? హన్నా? పొగ త్రాగని వాడేమో దున్నపోతై పుడతాడంట. ఎంత బాగా తమని, తమ అలవాటును సమర్ధించుకుంటున్నారో? అందరు కవులు ఇలా ఉండరు అని , పొగ త్రాగడం వల్ల కలిగే పదమూడు అనర్ధాలను కూడా మరో కవి ఏకరువు పెట్టాడు. పదపడి ధూమపానమున ప్రాప్తము తా పదమూడు చేటులున్ మొదలు ధనంబువోవుట, నపుంసకుడౌట, విదాహమౌటయున్ వెదకుచు జాతి హీనులను వేడుట, తిక్కట చొక్కుటల్, రుచుల్ వదలుట, కంపు కొట్టుట, కళల్ తొలగించుట, రిమ్మ పట్టుటల్ పెదవులు నల్లనై చెడుట, పెద్దకు లొంగుట, బట్టకాలుటల్ !! పైదానిలాగానే మరో ప్రముఖమైన అలవాటు కాఫీ తాగడం. మహాకవి శ్రీశ్రీగారు సుమతీ శతకంలోని "అప్పిచ్చువాడు వైద్యుడు" చందాన ఎప్పుడు పడితే అప్పుడు కప్పుడు కాఫీ నొసంగ గలిగిన సుజనుల్" అని కితాబిచ్చేసారు. నేను మాత్రం తక్కువ తిన్నానా అని ఓ కవి పొద్దున్నే ఓ అయ్యరు హోటళ్లో కూర్చుని తరుణుల మోవి పానకము త్రాగక పోయిన నేమిగాక, యా సురపతి వీటియందు సుధ జుర్రక పోయన నేమిగాక, మా కరుణ గభస్తే బింబ ముదయాచల మొక్కక మున్నె వెచ్చనై గరగరలాడు కాఫి యొక్క కప్పిడిగోనని అయ్యరిచ్చినన్ !!.. తరుణీమణి అధరసుధామృతం, అమృతం కంటే వెచ్చని కాఫీ మేలు అంటున్నాడీ కాఫీ ప్రియుడు. 70 ఏళ్ల క్రితం గౌరవఝుల సోదరకవులు ఏకంగా కాఫీ పురాణమే రాసేసారు. అందులోని ఓ కాఫీ శ్లోకం.. త్రికాల మేక కాలం వా జపే ద్విచ్చాన్ సునిశ్చలః పీత్వా పీత్వా పునః పీత్వా స్వర్గలోక మవాఫ్నుయాత్ కాఫీ తీర్ధసమంతీర్థం ప్రసాద ముపమా సమం అయ్యర్ సదృశ్య దేవేశో నభూతో న భవిష్యతి!! సంగతేంటంటే పొద్దున్నే అయ్యరిచ్చిన ఉప్మా (హతవిధీ.. ఇక్కడా, ఎక్కడ చూసినా ఉప్మానేనా) తిని, చిక్కటి కాఫీ మళ్లీ మళ్లీ తాగితే స్వర్గలొకప్రాప్తేనంట ఆ మహానుభావుడికి . బహుశా ఇంటికి దూరంగా ఉంటూ చదువులు, ఉద్యోగాలు చేసుకునే బ్రహ్మచారులందరూ ఇలాగే అనుకుంటారేమో. :) కొందరు కాఫీని చుక్క చుక్క చప్పరిస్తూ, ఆనందిస్తుంటారు. మరి కొంత మందికి కాఫీ , టీలకంటె టిఫెన్ల మీద ఎక్కువ మక్కువగా ఉంటుంది. తినేసి బయటపడతారు. అది చూసి కాఫీకి బాధ కలిగి ఇలా వాపోయింది.. పాపం... వడపై ఆవడపై పకోడి పయి హల్వా తుంటిపై బూంది యోం పొడిపై ఉప్పిడిపై ర విడ్డిలి పయి బోండా పయిం సేమియా సుడిపై పారు భగవత్కృపారసము నిచ్చోకొంత రానిమ్ము నే ఉడుకుం కాఫిని ఒక గుక్క గొనవే ఓ కుంభలంభోదరా!! పాపం ఎంత బాధలో ఉందో ఈ కాఫీ. వడ, ఆవడ, పకోడి, హల్వా, బూందీ, ఉప్పిడి, ఇడ్లీ, బోండాం, సేమియా పై ఉన్న ప్రేమను కొంచం ఈ వేడి కాఫీ పై కూడా చూపమని దీనంగా వేడుకుంటుంది.. ఆ ప్రార్ధన ఫలించు గాక. నాదో డౌటు.. సాధారణంగా పొగ త్రాగడం, మందు కొట్టడం అని వాడుతుంటారు. .. బీడీ, చుట్ట , సిగరెట్ పొగ పీలుస్తారు కాని తాగరు . మందు గ్లాసులలో పోసుకుని తాగుతారు. దానినెందుకు కొట్టడం. ఈ సంశయం ఎప్పటినుండో నాలో ఉంది. మావారిని ఎన్నోసార్లు అడిగా. ఆయనకు ఈ అలవాట్లు లేవు. నాకు తెలీదు. నువ్వే ట్రై చేసి నాకు చెప్పు అన్నారు. అలా ఉంది సంగతి. ఎవరైనా చెప్పగలరా ???...
 •    (Sheik Sadiq Ali)...........                                                              కాకతీయులు-మతం-రాజుల పేర్లు శివ పురాణం లిఖించ బడక ముందే, శైవం ఒక మతంగా రూపాంతరం చెందక ముందే , అనాదిగా హిమాలయ పర్వత సానువుల్లో అటు నేపాల్,ఇటు టిబెట్,ఈ వైపు ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో శివతత్వం విస్తృత ప్రచారంలో ఉండేది. ఆ మేరకు శివుని కి సంబంధించిన అనేక కథలు జానపదుల్లో ప్రచారంలో ఉండేవి. అలాంటి కథల్లో శివుడికి మహాదేవుడు,రుద్రుడు అనే పేర్లు,శివుడి గణాలకు అధిపతి ని గణపతి అనీ ప్రస్తావిస్తూ,ప్రస్తుతించేవారు. కాకతీయుల పూర్వీకులు అలాంటి ప్రాంతమైన ఉత్తరాఖండ్ కు చెందిన వారని మనం ఉపోద్ఘాతం లోనే చెప్పుకున్నాం. ఇప్పుడు కాకతీయ రాజుల వంశవృక్షంలో కొన్ని పేర్లను పరిశీలిద్దాం. 1116-1157 మధ్యకాలంలో జీవించిన రెండవ ప్రోలరాజు ఆయన భార్య ముప్పమ కు ఐదుగురు సంతానం.అందులో మొదటి నలుగురి పేర్లను గమనిద్దాం.మొదటి వాడు రుద్రుడు ఇతడే మొదటి ప్రతాప రుద్రుడు.1163 లో కాకతీయ సార్వభౌమాధికారాన్ని స్థాపించిన వాడు.రెండోవాడు మహాదేవుడు (1196-1199)ఇతని భార్య బయ్యమ .(వీరి కుమారుడే సుప్రసిద్ధ గణపతి దేవుడు.(1199-1262),కుమార్తెలు మైలాంబ,కుందాంబ).మూడోవాడు హరిహరుడు ,నాలుగో వాడు గణపతి. ఈ పేర్లన్నీ గమనిస్తే ఈ వంశం శివారాధక వంశం అనేది స్పష్టంగా అర్ధం అవుతుంది. కానీ చరిత్రకారులు మాత్రం కాకతీయులు తొలుత జైనులనీ, 1240 ప్రాంతాల్లోనే జైనం వదిలి శైవం స్వీకరించారనీ ,ఆ క్రమంలో జైనులను ఊచకోత కోసారనీ పలు చోట్ల రాసారు. ఇక్కడ కొంత వివరణ ఇవ్వాలను కుంటున్నాను.కాకతీయులు తమ జీవిత కాలంలో ఎన్నడూ శైవ ధర్మ విశ్వాసాలను వదిలి జైనాన్ని 'అవలంభించ' లేదు. కేవలం జైనాన్ని 'ఆదరించారు'. స్వతంత్ర రాజులుగా ఆవిర్భవించక ముందు వారు పనిచేసిన రాష్ట్రకూటులు,కళ్యాణీ చాళుక్యులు జైనానికి పెద్ద పీట వేసి ఉంచారు. కాకతీయ రాజ్య స్థాపన జరిగే నాటికే సమాజంలో జైనులు అత్యంత ప్రభావశీలమైన స్థానంలో ఉన్నారు. విద్యా,వైద్యం,ఆధ్యాత్మిక రంగాల్లో బలమైన పట్టు సాధించి ఉన్నారు. అలాంటి నేపధ్యంలో రాజ్యస్థాపన చేసిన కాకతీయులు జైనులను విస్మరించే పరిస్థితులు లేవు. అందుకే తెలివిగా వారిని నొప్పించకుండా,వారితో విరోధం రాకుండా సామరస్యంగా వారిని ఆదరించే క్రమాన్ని కొనసాగించారు. కాలక్రమేణా సామ్రాజ్యం విస్తరించటం,గణపతి దేవుడు సర్వశక్తి సంపన్నుడు అవ్వటం జరిగిన తర్వాత అప్పటిదాకా లో ప్రొఫైల్ లో ఉన్న శైవానికి ప్రాధాన్యతను ఇవ్వటం మొదలెట్టాడు.దాంతో జైనుల నుంచి కొంత ప్రతిఘటన ప్రారంభం అయ్యింది. మతం రాజ్యాధికారానికి బలం అవ్వాలే తప్ప ఆటంకం కారాదన్నది మొదటి నుంచీ ఉన్న రాజనీతి. అదే సూత్రం ప్రాతిపదికగా, రాజ్యానికి వ్యతిరేకంగా బోధనలు చేస్తున్న జైనులను గణపతి దేవుడు ఊచకోత కోయించాడు. 70 మంది జైన సాధువులను సజీవదహనం చేసిన గుహలు ఇప్పటికీ కాజీపేటలో ఉన్నాయి. అనంతరం కాకతీయ సామ్రాజ్యంలో వందల,వేల సంఖ్యలో శివాలయాలు వెలిసాయి. బేతరాజు నామ ఆవిర్భావం కాకతీయుల పేర్లలో ప్రముఖంగా వినిపించే పేరు మొదటి బేతరాజు,(గరుడ బేతయ) రెండవ బేతరాజు (త్రిభువన మల్లుడు )చిత్రమైన ఈ పేరు ఎక్కడా ఇమడదు.మరి అలాంటిది ఎక్కడి నుంచి వచ్చింది? దీని గురించి తెలుసుకోవాలంటే ముందు భాష గురించి తెలుసుకోవాలి. బేత అనే పదానికి మూలం పేత. నిషాదుల భాషలో ఈ పదానికి అర్ధం మనవడు. ఈ పేతకు మూలం పోత,అంటే కుమారుడి కుమారుడు అని అర్ధం. వాస్తవానికి కాకతీయులు బేత శబ్ద ప్రయోగం చేయలేదు. మనవడు అనే అర్ధంలోనే పేత అనే పదాన్నే వాడారు. శాసనాలు చదివిన చరిత్రకారులు దాన్ని కాస్తా బేతగా ,మనవడైన రాజు కాస్తా బేతరాజుగా మార్చేసారు. పేతయ (మాంగల్లు శాసనంలో మాత్రమేకన్పించే పేరు) కొడుకైన నాల్గవ గుండన కోడుకే గరుడ పేతయ (ఇతడే మొదటి బేతరాజు) ఇతడి కొడుకైన మొదటి ప్రోలరాజు కొడుకే త్రిభువన మల్లుడు( ఇతడే రెండవ బేతరాజు) కాకతీయ చరిత్రలో మరుగున పడిన మరికొన్ని అంశాలు మరో పోస్టులో......(సశేషం)   ...
 • పైన కనబడే ఫోటో  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మనసును ఆకట్టుకుంది. ఆకట్టుకోవదమే కాదు మనసు మార్చేసింది .  స్వతహాగా ట్రంప్  మహా మొండోడు. నంది అంటే కాదు పంది అనే రకం.  ఆలాంటి ట్రంప్ ఆ ఫోటో చూడగానే  మనసు ఎందుకు మార్చుకున్నాడు.  ఇంతకూ ట్రంప్  మనసు మార్చుకున్నది  తన కోసమా ? కాదు. పోనీ అమెరికా కోసమా ? అసలు కాదు.  పరాయి దేశమైన అప్ఘనిస్తాన్‌ కోసం. ఆ దేశంలో ఒకప్పుడు వెల్లివిరిసిన ఆనందాలను తిరిగి నింపడం కోసం. మరి ట్రంప్‌ మనసు ఎలా మారింది?. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మెక్‌మస్టర్‌ ట్రంప్‌ మనసును మార్చారు. అది కూడా ఓ ఫొటో చూపించి. ఆ ఫొటోకు ఓ ప్రత్యేకత ఉంది. అది కొందరు ఆడవాళ్లు తమకు నచ్చిన దుస్తులు ధరించి నడుచుకుంటూ వెళ్తున్న ఫొటో. 1970ల్లో అప్ఘనిస్తాన్‌లోని పరిస్థితులకు ఆ చిత్రం ప్రతీక. 1930-1970ల మధ్య అప్ఘనిస్తాన్‌లో మహిళలు స్వేచ్చగా సంచరించేవారట. అందుకు ఈ చిత్రమే ఉదాహరణ అని మెక్‌మస్టర్‌ అధ్యక్షుడు ట్రంప్‌తో చెప్పారు. 1990ల్లో అప్ఘనిస్తాన్‌ను తాలిబన్లు తమ చేతిలోకి తీసుకుని, మహిళల దుస్తులపై ఆంక్షలు విధించారని వివరించారు. అప్ఘనిస్తాన్‌లో తిరిగి శాంతి సామరస్యాలు నెలకొల్పాలంటే ఆ దేశం నుంచి అమెరికా దళాలను ఉపసంహరించొద్దని కోరారు. మెక్‌మస్టర్‌ మాటలను నిశితంగా విని, ఫొటోను పరిశీలించిన ట్రంప్‌.. అప్ఘనిస్తాన్‌లో యుద్ధాన్ని ఆపొద్దని చెప్పారు. దళాలను ఉపసంహరించుకోవడం లేదని ప్రకటించారు. అవసరమైతే మరిన్ని దళాలను పంపడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు. అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా మనసు మార్చుకుని  చేసిన ప్రకటన అది. ...